174. నూటడెబ్బదినాలుగవ అధ్యాయము
అంబ సాళ్వుని కడకు ఏగుటకు భీష్ముని అనుమతి కోరుట.
భీష్మ ఉవాచ
తతోఽహం భరతశ్రేష్ఠ మాతరం వీరమాతరమ్।
అభిగమ్యోపసంగృహ్య దాశేయీమిదమబ్రువమ్॥ 1
భీష్ముడు చెప్తున్నాడు. భరతకుమారా! అనంతరం నేను వీరమాత, అయిన తల్లి దగ్గరకు వెళ్లి ఆమె పాదాలకు మ్రొక్కి ఇలా చెప్పాను. (1)
ఇమాః కాశిపతేః కన్యాః మయా న్జి।త్య ప్థా।వాన్ ।
విచిత్రవీర్యస్య కృతే వీర్యశుల్కా హృతా ఇతి॥ 2
అమ్మా! వీళ్లు కాశిరాజు కూతుళ్లు. పరాక్రమమే వీరికి శుల్కం. కనుక నేను సమస్తరాజులను జయించి విచిత్రవీర్యుడి కోసం వీళ్లను తెచ్చాను. (2)
తతో మూర్ధన్యుపాఘ్రాయ పర్యశ్రునయనా నృప।
ఆహ సత్యవతీ హృష్టా దిష్ట్యా పుత్ర జితం త్వయా॥ 3
రాజా! ఆ మాటలు విన్న సత్యవతికి ఆనందంతో కళ్లు చెమర్చాయి. నా శిరసు మూర్కొని హర్షంతో "నాయనా! నా అదృష్టవశాత్తు నీవు విజయుడవై వచ్చావు" అన్నది. (3)
సత్యవత్యాస్త్వనుమతే వివాహే సముపస్థితే।
ఉవాచ వాక్యం సవ్రీడా జ్యేష్ఠా కాశిపతేః సుతా॥ 4
సత్యవతి యొక్క అనుమతితో వివాహం జరుగ బోతూ ఉండగా, కాశిరాజు పెద్దకూతురు అంబ సిగ్గుతో నాతో ఇలా అంది. (4)
భీష్మ త్వమసి ధర్మజ్ఞః సర్వశాస్త్రవిశారదః।
శ్రుత్వా చ వచనం ధర్మ్యం మహ్యం కర్తుమిహార్హసి॥ 5
భీష్ముడా! నీవు ధర్మజ్ఞుడవు. సర్వశాస్త్ర విశారదుడవు. నేను చెప్పబోయే మాట విని నాకు ధర్మం చేస్తావని ఆశిస్తున్నాను. (5)
మయా సాల్వపతిః పూర్వం మనసాభివృతో వరః।
తేన చాస్మి వృతా పూర్వమ్ రహస్యవిదితే పితుః॥ 6
నేను సాల్వపతిని ఇంతకుముందే మనసారా భార్తగా వరించాను. అతడు కూడా నన్ను రహస్యంగా వరించాడు. ఇది నా తండ్రికి తెలియదు. (6)
కథం మామన్యకామాం త్వం రాజధర్మమతీత్య వై।
వాసయేథా గృహే భీష్మ కౌరవః సన్ విశేషతః॥ 7
భీష్ముడా! నేను ఇతరుని కోరుకొన్నదానిని. విశేషించి కురువంశంలో పుట్టిన నీవు రాజధర్మాన్ని ఉల్లంఘించి నన్ను ఇంట్లో ఎలా నిలుపుకొంటావు? (7)
ఏతద్ బుద్ఢ్యా వినిశ్చిత్య మనసా భరతర్షభ।
యత్ క్షమం తే మహాబాహో తదిహారబ్ధుమర్హసి॥ 8
మహాబాహూ! భరతశ్రేష్ఠా! బుద్ధితో, మనసుతో ఈ విషయమై బాగా ఆలోచించి, నీవు ఉచితమయిన దానిని చెయ్యి. (8)
స మాం ప్రతీక్షతే వ్యక్తం సాల్వరాజో విశాంపతే।
తస్మాన్మాం త్వం కురుశ్రేష్ఠ సమనుజ్ఞాతుమర్హసి॥ 9
జననాథా! సాల్వరాజు నా కోసం తప్పక ఎదురుచూస్తూ ఉంటాడు. కాబట్టి కురుశ్రేష్ఠా! అతనిదగ్గరకు వెళ్లడానికి నన్ను అనుమతించు. (9)
కృపాం కురు మహాబాహో మయి ధర్మభృతాం వర।
త్వం హి సత్యవ్రతో వీర పృథివ్యామితి నః శ్రుతమ్॥ 10
ధర్మాత్ములలో ఉత్తముడా! మహాబాహూ! వీరా! నామీద దయచూపు. ఈ భూమిమీద నీవు సత్యవ్రతుడవని విని ఉన్నాను. (10)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ అంబోపాఖ్యానపర్వణి అంబావాక్యే చతుఃసప్తధికశతతమోఓఽధ్యాయః ॥ 174 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున అంబావాక్యములను నూటడెబ్బది నాల్గవ ఆధ్యాయము. (174)