176. నూటడెబ్బది ఆరవ అధ్యాయము

హోత్రవాహన అకృతవ్రణులతో అంబ సంభాషించుట.

భీష్మ ఉవాచ
తతస్తే తాపసాః సర్వే కార్యవంతోఽభవంస్తదా।
తాం కన్యాం చింతయంతస్తే కిం కార్యమితి ధర్మిణః॥ 1
భీష్ముడు చెప్తున్నాడు. రాజా! తరువాత ధర్మాత్ములైన ఆ మునులందరూ కార్యోన్ముఖులై ఇప్పుడు ఈ అంబ విషయమై 'ఏమి చేయాలా' అని ఆలోచించసాగారు. ఆమె విషయంలో ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించు కొన్నారు. (1)
కేచిదాహుః పితుర్వేశ్మ నీయతామితి తాపసాః।
కేచిదస్మదుపాలంభే మతిం చక్రుర్హి తాపసాః॥ 2
కొందరు మునులు ఆమెను తండ్రి ఇంటికి పంపేయా లని అన్నారు. ఇంకొందరు కన్యను అపహరించిన నన్ను నిందించాలని భావించారు. (2)
కేచిచ్ఛాల్వపతిం గత్వా నియోజ్యమితి మేనిరే।
నేతి కేచిద్ వ్యవస్యంతి ప్రత్యాఖ్యాతా హి తేన సా॥ 3
కొంతమంది సాల్వుని దగ్గరకు వెళ్లి ఈమెను స్వీకరించేలా నియోగించాలని తలచారు. ఇంతకుముందే సాళ్వుడు ఆమెను నిందించి తిరస్కరించాడు కనుక ఈ ఆలోచనను కొందరు కాదన్నారు. (3)
ఏవం గతే తు కిం శక్యం భద్రే కర్తుం మనీషిభిః।
పునరూచుశ్చ తాం సర్వే తాపసాః సంశితవ్రతాః॥ 4
"అమ్మాయీ! ఈలాంటి స్థితిలో మావంటి మునీశ్వరులు ఏం చేయగలరు?" అంటూనే వ్రతనిష్ఠగల ఆ తాపసులందరూ తిరిగి ఆమెతో ఇలా అన్నారు. (4)
అలం ప్రవ్రజితేనేహ భద్రే శృణు హితం వచః।
ఇతో గచ్ఛస్వ భద్రం తే పితురేవ నివేశనమ్॥ 5
ప్రతిపత్స్యతి రాజా స పితా తే యదనంతరమ్।
తత్ర వత్స్యసి కల్యాణి సుఖం సర్వగుణాన్వితా॥ 6
శుభాంగీ! సన్యాసం స్వీకరించవద్దు. మా హిత వచనాలు విను. నీకు మేలు కలుగుతుంది. నీవు ఇక్కడ నుండి నీతండ్రి ఇంటికే వెళ్లు. తరువాత ఏమి చేయాలో నీతండ్రి అయిన కాశీరాజే ఆలోచిస్తాడు. అక్కడ నీవు సర్వగుణసంపన్నురాలవై సుఖంగా జీవించ గలుగ్టుతావు. (5-6)
న చ తేఽన్యా గతిర్న్యాయ్యా భవేద్ భద్రే యథా పితా।
పతిర్వాపి గతిర్నార్యాః పితా వా వరవర్ణిని॥ 7
భద్రే! తండ్రి యొక్క ఆశ్రయంలాగా నీకు మరి ఏ ఇతర ఆశ్రయమూ న్యాయం కాదు. వరవర్ణినీ! స్త్రీలకు భర్తగాని, తండ్రి కాని గతి. (ఆశ్రయం). (7)
గతిః పతిః సమస్థాయా విషమే చ పితా గతిః।
ప్రవ్రజ్యా హి సుదుఃఖేయం సుకుమార్యా విశేషతః॥ 8
సుఖాలు అనుభవించే కాలంలో భర్త ఆశ్రయం, కష్టకాలంలో తండ్రి యొక్క ఆశ్రయం పొందడం స్త్రీలకు ఉచితం. విశేషించి సుకుమారివైన నీకు ఈ సన్యాసం మిక్కిలి కష్టాన్ని కల్గిస్తుంది. (8)
రాజపుత్ర్యాః ప్రకృత్యా చ కుమార్యాస్తవ భామిని।
భద్రే దోషా హి విద్యంతే బహవో వరవర్ణిని॥ 9
ఆశ్రమే వై వసంత్యాస్తే న భవేయుః పితుర్గృహే।
భామిని! నీవు రాజకుమారివి. పైగా స్వభావం చేత సుకుమారివి. సుందరీ! ఆశ్రమంలో ఉంటే అనేక దోషాలు కలుగుతాయి. అదే నీ తండ్రి ఇంట్లో ఉంటే ఆ దోషాలు కలగవు. (9)
వి.సం. అందగత్తెవు. వయసులో ఉన్నదానవు. అయిన నీవు ఆశ్రమంలో ఉంటే మునులకే మోహం కలుగవచ్చు లేదా నీవే తాపస ధర్మం నుండి దిగజారవచ్చు. ఆశ్రమంలో ఈ దోషాలకు అవకాశం ఉంది. నీ తండ్రి ఇంట్లో ఆ అవకాశం లేదు. (నీల)
తతస్త్వన్యేఽబ్రువన్ వాక్యం తాపసాస్తాం తపస్వినీమ్॥ 10
త్వామిహైకాకినీం దృష్ట్వా నిర్జనే గహవే వనే।
ప్రార్థయిష్యంతి రాజానః తస్మాన్మైవం మనః కృథాః॥ 11
మరికొందరు తాపసులు ఆ తపస్వినితో ఇలా అన్నారు. నీవిక్కడ ఒంటరిగా నిర్జనమైన దట్టమైన అడవిలో ఉండడం చూసి ఏ రాజులయినా నిన్ను కోరవచ్చు. కాబట్టి వనవాసం చేయాలనే ఆలోచన మాఉకో (10-11)
అంబోవాచ
న శక్యం కాశినగరం పునర్గంతుం పితుర్గృహాన్।
అవజ్ఞాతా భవిష్యామి బాంధవానాం న సంశయః॥ 12
అపుడు అంబ ఇలా సమాధానం చెప్పింది. మహాత్ములారా! తిరిగి నేను నా తండ్రి ఇంటికి కాశీనగరానికి వెళ్లలేను. ఎందుకంటే బంధువులందరిలో అవమానం పాలవుతాను. ఇందుకు సందేహం లేదు. (12)
ఉషితాస్మి తథా బాల్యే పితుర్వేశ్మని తాపసాః।
నాహం గమిష్యే భద్రం వః తత్ర యత్ర పితా మమ।
తపస్తప్తమభీప్సామి తాపసైః పరిరక్షితా॥ 13
తాపసులారా! అప్పుడలా బాల్యంలో తండ్రి ఇంట్లో ఉన్నానే కాని ఇప్పుడక్కడికి నా తండ్రి ఉన్నచోటికి వెళ్లను మీకు పుణ్యం ఉంటుంది. మీ తాపసులందరి రక్షణలో తపస్సు చేయడానికే నేను కోరుకుంటున్నాను. (13)
వి.సం. పెళ్లికాక ముందు బాల్యంలో తండ్రి ఇంట్లో ఉన్నానని ఇప్పుడు ఉండలేనని అర్థం. (లక్షా)
యథా పరేఽపి మే లోకే న స్యాదేవం మహాత్యయః।
దౌర్భాగ్యం తాపసశ్రేష్ఠాః తస్మాత్ తప్స్యామ్యహం తపః॥14
మునివర్యులారా! ఇలాంటి గొప్ప కష్టం, దౌర్భాగ్యం నాకు పరలోకంలో నైనా కలగకూడదనే నేను ఇప్పుడు తపస్సు చేస్తా నంటున్నాను. (14)
వి.సం. మహాత్యయం (మహా+అత్యయము) అంటే గొప్పహాని(లక్షా); మహాసుఖనాశం, (నీల); గొప్ప దుఃఖం(అర్జు) - అని చెప్పుకోవచ్చు. పరలోకం అంటే పై జన్మ (సర్వ) అని అర్థం.
భీష్మ ఉవాచ
ఇత్యేవం తేషు విప్రేషు చింతయత్సు యథాతథమ్।
రాజర్షిస్తద్ వనం ప్రాప్తః తపస్వీ హోత్రవాహనః॥ 15
భీష్ముడు కొనసాగిస్తున్నాడు. రాజా! ఈ రీతిగా ఆ విప్రులందరూ చింతామగ్నులై ఉన్న సమయంలోనే రాజర్షి, మునిపుంగవుడు అయిన హోత్రవాహనుడు ఆ వనానికి వచ్చాడు. (15)
తతస్తే తాపసాః సర్వే పూజయంతి స్మ తం నృపమ్।
పూజాభిః స్వాగతాద్యాభిః ఆసనేనోదకేన చ॥ 16
అప్పుడు ఆ మునులందరూ ఆ రాజును స్వాగతం పలకడం, ఆసనం సమర్పించడం, నీళ్లివ్వడం - మొదలైన ఉపచారాల ద్వారా ఆదరంతో పూజించారు. (16)
తస్యోపవిష్టస్య సతః విశ్రాంతస్యోపశృణ్వతః।
పునరేవ కథాం చక్రుః కన్యాం ప్రతి వనౌకసః॥ 17
అతడు కూర్చుని విశ్రాంతి తీసుకొంటున్నాడు. అతడు వింటూండగానే ఆ వనవాసులందరూ తిరిగి అంబను గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. (17)
అంబాయాస్తాం కథాం శ్రుత్వా కాశిరాజ్ఞశ్చ భారత।
రాజర్షిః స మహాతేజాః బభూవోద్విగ్నమానసః॥ 18
రాజా! అంబ యొక్క, కాశీరాజు యొక్క ఆ కథ విని రాజర్షి, మహాతేజస్వి అయిన ఆ హోత్రవాహనుడు విచారగ్రస్తుడు అయ్యాడు. (18)
తాం తథావాదినీం శ్రుత్వా దృష్ట్వా చ స మహాతపాః।
రాజర్షిః కృపయాఽఽవిష్టః మహాత్మా హోత్రవాహనః॥ 19
ఆ విధంగా దైన్యంతో తన గురించి చెప్పుకొన్న ఆమెను చూసి, ఆమె కథ విని మహాత్ముడు మహాతపస్వి, రాజర్షి అయిన హోత్రవాహనుడు జాలితో కరిగిపోయాడు. (19)
స వేపమాన ఉత్థాయ మాతుస్తస్యాః పితా తదా।
తాం కన్యామంకమారోప్య పర్యశ్వాసయత ప్రభో॥ 20
రాజా! అంబ యొక్క తల్లికి తండ్రి అయిన అతడు (తాతగారు - మాతామహుడు) చలించిపోతూ లేచి ఆమెను తన ఒళ్లో కూర్చోబెట్టుకొని ఓదార్చసాగాడు. (20)
స తామపృచ్ఛత్ కార్త్స్న్యేన వ్యసనోత్పత్తిమాదితః।
సా చ తస్మై యథావృత్తం విస్తరేణ న్యవేదయత్॥ 21
అతడు ఆమెకు ఇంతటి కష్టం కలగడానికి గల కారణాన్ని మొదటినుండి పూర్తిగా చెప్పమని అడిగాడు. ఆమె కూడా జరిగినది జరిగినట్లుగా ఆ వృత్తాంతమంతా అతనికి సవిస్తరంగా చెప్పింది. (21)
తతః స రాజర్షిరభూద్ దుఃఖశోకసమన్వితః।
కార్యం చ ప్రతిపేదే తత్ మనసా సుమహాతపాః॥ 22
అంతట ఆ రాజర్షి దుఃఖంతో, శోకంతో కర్తవ్యం మనసులోనే నిశ్చయించుకొన్నాడు. (22)
అబ్రవీద్ వేపమానశ్చ కన్యామార్తాం సుదుఃఖితః।
మా గాః పితుర్గృహం భద్రే మాతుస్తే జనకోహ్యహమ్॥ 23
దుఃఖంతో చలించిపోయిన అతడు ఆర్తురాలైన ఆ కన్యతో "అమ్మాయీ! నీవు(వెళ్లదలచుకోకపోతే) నీ తండ్రి ఇంటికి వెళ్లవద్దు. లే. నేను నీతల్లికి తండ్రిని. (23)
దుఃఖం ఛింద్యామహం తే వై మయి వర్తస్వ పుత్రికే।
పర్యాప్తం తే మనో వత్సే యదేవం పరిశుష్యసి॥ 24
అమ్మాయీ! నీ దుఃఖాన్ని నేను తీరుస్తాను. నీవు నా దగ్గర ఉండు. నీ మనసులోని దుఃఖం నిన్ను శుష్కింపచేసేదిగా ఉంది. (24)
గచ్ఛ మద్వచనాద్ రామం జామదగ్న్యం తపస్వినమ్।
రామస్తే సుమహద్ దుఃఖం శోకం చైవాపనేష్యతి॥ 25
నామాటను పాటించి తపస్సు చేసుకుంటున్న జమదగ్ని కుమారుడైన పరశురాముని దగ్గరకు వెళ్లు. ఆ రాముడు నీ తీవ్రమైన దుఃఖాన్ని, శోకాన్ని కూడా కూడా పోగొడతాడు. (25)
హనిష్యతి రణే భీష్మం న కరిష్యతి చేద్ వచః।
తం గచ్ఛ భార్గవశ్రేష్ఠం కాలాగ్నిసమతేజసమ్॥ 26
తాను చెప్పినట్లు చేయకపోతే ఆ భీష్ముడిని అతడు యుద్ధంలో సంహరిస్తాడు. కాలాగ్నివంటి తేజస్సు గల ఆ భృగువంశశ్రేష్ఠుడిని శరణు పొందు. (26)
ప్రతిష్ఠాపయితా స త్వాం సమే పథి మహాతపాః।
తతస్తు సుస్వరం బాష్పమ్ ఉత్సృజంతీ పునః పునః॥ 27
అబ్రవీత్ పితరం మాతుః సా తదా హోత్రవాహనమ్।
అభివాదయిత్వా శిరసా గమిష్యే తవ శాసనాత్॥ 28
మహాతపశ్శక్తి కల అతడు నిన్ను చక్కని మార్గంలో నిలుపుతాడు.(మంచి దారి చూపగలడు)' - అని చెప్పగానే ఆమె మరింతగా కన్నీరు కారుస్తూ, చక్కని కంఠంతో తన తల్లికి తండ్రి అయిన ఆ హోత్రవాహనునికి తలవంచి నమస్కరిస్తూ ఇలా అంది. "నీ మాట పాటించి వెళ్తాను.(27-28)
అపి నామాద్య పశ్యేయమ్ ఆర్యం తం లోకవిశ్రుతమ్।
కథం చ తీవ్రం దుఃఖం మే నాశయిష్యతి భార్గవః।
ఏతదిచ్ఛామ్యహం జ్ఞాతుం యథా యాస్యామి తత్ర వై॥ 29
ఇప్పుడు నేను లోకవిఖ్యాతుడైన ఆ పూజ్యుడిని ఎలా దర్శించగలను? ఆ భార్గవుడు నా ఈ తీవ్రమైన దుఃఖాన్ని ఎలా పోగొట్టగలడు? అక్కడికి నేను ఎలా వెళ్లగలను. ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకొంటున్నాను". (29)
హోత్రవాహన ఉవాచ
రామం ద్రక్ష్యసి భద్రే త్వం జామదగ్న్యం మహావనే।
ఉగ్రే తపసి వర్తంతం సత్యసంధం మహాబలమ్॥ 30
హోత్రవాహనుడు చెప్పాడు. అతడు మహారణ్యంలో ఉగ్రమైన తపస్సు చేసుకొంటున్నాడు. అతడు సత్యప్రతిజ్ఞ గలవాడు, మహాబలవంతుడు, జమదగ్ని కుమారుడు, ఆ రాముడిని నీవు దర్శించగలవు. (30)
మహేంద్రం వై గిరిశ్రేష్ఠం రామో నిత్యముపాస్తి హ।
ఋషయో వేదవిద్వాంసః గంధర్వాప్సరసస్తథా॥ 31
అ పరశురాముడు పర్వతశ్రేష్ఠమయిన మహేంద్రగిరిమీద ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటాడు. అక్కడే వేదవేత్తలయిన ఋషులు, గంధర్వులు, అప్సరసలు కూడా ఉంటారు. (31)
తత్ర గచ్ఛస్వ భద్రం తే బ్రూయాశ్పైనం వచో మమ।
అభివాద్య చ తం మూర్థ్నా తపోవృద్ధం దృఢవ్రతమ్॥ 32
అమ్మాయీ! అక్కడకు వెళ్లు. నీకు మేలు కలుగుతుంది దృఢదీక్ష కలిగిన ఆ తపోవృద్ధునికి శిరసు వంచి నమస్కరించి నాగురించి, నా మాటల గురించి అతనికి చెప్పు. (32)
బ్రూయాశ్పైనం పునర్భద్రే యత్ తే కార్యం మనీషితమ్।
మయి సంకీర్తితే రామః సర్వం తత్ తే కరిష్యతి॥ 33
భద్రే! తరువాత నీవు ఏది కోరుకుంటున్నావో అది చెప్పు, నా గురించి చెప్పగానే రాముడు నీకు అన్నిపనులు చేసిపెడతాడు. (33)
మమ రామ సఖా వత్సే ప్రీతియుక్తః సుహృచ్చ మే।
జమదగ్నిసుతో వీరః సర్వశస్త్రభృతాం వరః॥ 34
ఆయుధం పట్టినవారందరిలో శ్రేష్ఠుడు, వీరుడు అయిన ఆ జమదగ్నిసుతుడు నాకు స్నేహితుడు, నా యందు ప్రీతీ, సద్భావమూ కలవాడు. (34)
ఏవం బ్రువతి కన్యాం తు పార్థివే హోత్రవాహనే।
అకృతవ్రణః ప్రాదురాసీద్ రామస్యానుచరః ప్రియః॥ 35
రాజైన హోత్రవాహనుడు అంబను ఉద్దేశించి ఇలా చెప్తూ ఉండగానే ఆ పరశురామునికి ఇష్టుడు, అనుచరుడు అయిన అకృతవ్రణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. (35)
తతస్తే మునయః సర్వే సముత్తస్థుః సహస్రశః।
స చ రాజా వయోవృద్ధః సృంజయో హోత్రవాహనః॥ 36
అంతట వేల సంఖ్యలో అక్కడ ఉన్న మునులు సృంజయవంశానికి చెందిన వయోవృద్ధుడైన హోత్రవాహనుడు అందరూ లేచి నిలబడ్డారు. (36)
తతో దృష్ట్వా కృతాతిథ్యమ్ అన్యోన్యం తే వనౌకసః।
సహితా భరతశ్రేష్ఠ నిషేదుః పరివార్య తమ్॥ 37
భరతశ్రేష్ఠుడా! ఆ వనవాసులైన మునులందరూ అతనికి ఆతిథ్యమిచ్చి సత్కరించిన అనంతరం, పరస్పరం చూసుకొంటూ అతని చుట్టూ చేరి కలిసి ఒక్కటిగా కూర్చున్నారు. (37)
తతస్తే కథయామాసుః కథాస్తాస్తా మనోరమాః।
ధన్యా దివ్యాశ్చ రాజేంద్ర ప్రీతిహర్షముదా యుతాః॥ 38
రాజేంద్రా! అనంతరం వాళ్లందరూ మనసుకు నచ్చిన, ధన్యమైన, దివ్యమైన, హర్షాన్ని, ఆనందాన్ని, ప్రీతినీ కలిగించే కథలను (విషయాలను) చెప్పుకోసాగారు. (38)
తతః కథాంతే రాజర్షిః మహాత్మా హోత్రవాహనః।
రామం శ్రేష్ఠం మహర్షీణామ్ అపృచ్ఛదకృతవ్రణమ్॥ 39
అలా ఆ సంభాషణలు ముగిసిన తరువాత రాజర్షి, మహాత్ముడు అయిన హోత్రవాహనుడు మహర్షులలో శ్రేష్ఠుడయిన పరశురాముని గూర్చి అకృతవ్రణుని అడిగాడు. (39)
క్వ సంప్రతి మహాబాహో జామదగ్న్యః ప్రతాపవాన్।
అకృతవ్రణ శక్యో వై ద్రష్టుం వేదవిదాం వరః॥ 40
మహాబాహూ! అకృతవ్రణా! వేదవేత్తలలో శ్రేష్ఠుడు పరాక్రమశాలి అయిన ఆజమదగ్నిసుతుని ఇప్పుడు ఎక్కడ చూడడానికి వీలవుతుంది.? (40)
అకృతవ్రణ ఉవాచ
భవంతమేవ సతతం రామః కీర్తయతి ప్రభో।
సృంజయో మే ప్రియసఖః రాజర్షిరితి పార్థివ॥ 41
అకృతవ్రణుడు చెప్తున్నాడు - రాజా! ఆ రాముడు నిన్నే ఎల్లప్పుడూ ప్రశంసిస్తూ ఉంటాడు. సృంజయవంశానికి చెందిన రాజర్షి నాకు ప్రియసఖుడు" అని చెప్తూఉంటాడు. (41)
ఇహ రామః ప్రభాతే శ్వః భవితేతి మతిర్మమ।
ద్రష్టస్యేనమిహాయాంతం తవ దర్శనకాంక్షయా॥ 42
రేపు తెల్లవారేసరికి రాముడు ఇక్కడ ఉంటాడని నేను అనుకొంటున్నాను. నిన్ను చూడాలనే కోరికతో వస్తున్నాడు. అతనిని నీవు ఇక్కడే చూడవచ్చు. (42)
ఇయం చ కన్యా రాజర్షే కమర్థం వనమాగతా।
కస్య చేయం తవ చ కా భవతీచ్ఛామి వేదితుమ్॥ 43
రాజర్షీ! ఈ కన్య అడవికి ఎందుకు వచ్చింది. ఈమె ఎవరి కూతురు? నీకేమవుతుంది? తెలుసుకోవాలనుకొంటున్నాను. (43)
హోత్రవాహన ఉవాచ
దౌహిత్రీయం మమ విభో కాశిరాజసుతా ప్రియా।
జ్యేష్ఠా స్వయంవరే తస్థౌ భగినీభ్యాం సహానఘ॥ 44
ఇయమంబేతి విఖ్యాతా జ్యేష్ఠా కాశిపతేః సుతా।
అంబికాంబాలికే కన్యే కనీయస్యౌ తపోధన॥ 45
హోత్రవాహనుడంటున్నాడు - అయ్యా! ఈమె నా దౌహిత్రి, (కూతురు కూతురు - మనుమరాలు)కాశీరాజు కూతురు. అతనికి ఇష్టురాలు. పెద్దది అయిన ఈమె తన చెల్లెళ్లతో కలసి స్వయంవరంలో పాల్గొంది. తపోధనా! కాశీరాజు పెద్ద కూతురయిన ఈమె అంబ అనే పేరుతో విఖ్యాతి చెందింది. అంబిక, అంబాలికలు - ఇద్దరూ చిన్నవాళ్లు. (44-45)
సమేతం పార్థివం క్షత్రం కాశిపుర్యాం తతోఽభవత్।
కన్యానిమిత్తం విప్రర్షే తత్రాసీదుత్సవో మహాన్॥ 46
బ్రహ్మర్షీ! ఈ కన్యల నిమిత్తంగా భూమండలంలోని సకలక్షత్రియులు కలిసి కాశీపట్టణానికి విచ్చేశారు. అప్పుడు అక్కడ గొప్ప స్వయంవరోత్సవం జరిగింది. (46)
తతః కిల మహావీర్యః భీష్మః శాంతనవో నృపాన్।
అధిక్షిప్య మహాతేజాః తిస్రః కన్యా జహార తాః॥ 47
అప్పుడు మహావీరుడు మహాతేజస్వి, శంతను పుత్రుడు అయిన భీష్ముడు రాజులందరినీ తృణీకరించి ఆ ముగ్గురు కన్యలను ఎత్తుకొని వెళ్లాడట. (47)
నిర్జిత్య పృథివీపాలాన్ అథ భీష్మో గజాహ్వయమ్।
ఆజగామ విశుద్ధాత్మా కన్యాభిః సహ భారతః॥ 48
నిర్మలమనస్కుడైన ఆ భరతవంశీయుడు భీష్ముడు రాజులందరినీ జయించి కన్యలతో సహితంగా (హస్తినాపురానికి) వచ్చాడు. (48)
సత్యవత్యై నివేద్యాథ వివాహం సమనంతరమ్।
భ్రాతుర్విచిత్రవీర్యస్య సమాజ్ఞాపయత ప్రభుః॥ 49
శక్తిశాలియైన భీష్ముడు సత్యవతికి ఆ కన్యలను అప్పగించిన అనంతరం తన తమ్ముడైన విచిత్రవీర్యునితో వారి వివాహానికి ఆజ్ఞాపించాడు. (49)
తం తు వైవాహికం దృష్ట్వా కన్యేయం సముపార్జితమ్।
అబ్రవీత్ తత్ర గాంగేయం మంత్రిమధ్యే ద్విజర్షభ॥ 50
ద్విజశ్రేష్ఠా! పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండడం చూసి, ఈ కన్య మంత్రులందరిమధ్య ఉన్న భీష్మునితో ఇలా అంది. (50)
మయా సాల్వపతిర్వీరః మనసాభివృతః పతిః।
న మామర్హసి ధర్మజ్ఞ దాతుం భ్రాత్రేఽన్య మానసామ్॥ 51
ధర్మమునెరిగినవాడా! వీరుడైన సాల్వపతిని నేను మనసారా పతిగా వరించాను. ఇతరునియందు మనసు కలిగిన నన్ను నీ తమ్మునికి ఇవ్వడం ఉచితం కాదు. (51)
తచ్ఛ్రుత్వా వచనం భీష్మః సంమంత్ర్య సహమంత్రిభిః।
నిశ్చిత్య విససర్జేమాం సత్యవత్యా మతే స్థితః॥ 52
ఆ మాట విని భీష్ముడు మంత్రులతో సంప్రదించి, సత్యవతితో కలిసి ఆలోచించి, మనసులో ఒక నిశ్చయానికి వచ్చి, ఈమెను వదిలాడు. (52)
అనుజ్ఞాతా తు భీష్మేణ సాల్వం సౌభపతిం తతః।
కన్యేయం ముదితా తత్ర కాలే వచనమబ్రవీత్॥ 53
భీష్ముని అనుమతి పొందిన ఈమె సంతోషించి సౌభమనే విమానానికి అధిపతి అయిన సాల్వుని దగ్గరకు వెళ్లి ఆ సమయంలో అతనితో ఇలా అంది. (53)
విసర్జితాస్మి భీష్మేణ ధర్మం మాం ప్రతిపాదయ।
మనసాభివృతః పూర్వం మయా త్వం పార్థివర్షభ॥ 54
రాజేంద్రా! భీష్ముడు నన్ను విడిచాడు. (ఎందుకంటే) ఇంతకు ముందే నిన్ను నేను మనసారా వలచి ఉన్నాను. కాబట్టి నాపట్ల ధర్మాన్ని ఆచరించు. (నాకు న్యాయం చెయ్యి.) (54)
ప్రత్యాచఖ్యౌ చ సాల్వోఽస్యాః చారిత్రస్యాభిశంకితః।
సేయం తపోవనం ప్రాప్తా తాపస్యేభిరతా భృశమ్॥ 55
ఈమె శీలాన్ని శంకించిన సాల్వుడు ఈమెను తిరస్కరించాడు. అందుకని ఈమె తపస్సు చేయాలనే గట్టి కోరికతో తపోవనానికి వచ్చింది. (55)
మయా చ ప్రత్యభిజ్ఞాతా వంశస్య పరికీర్తనాత్।
అస్య దుఃఖస్య చోత్పత్తిం భీష్మమేవేహ మన్యతే॥ 56
ఈమె వంశం గురించి ప్రస్తావించడంతో నేను ఈమెను గుర్తుపట్టాను. ఈ దుఃఖానికంతటికీ మూల కారణం భీష్ముడే అని ఇప్రుడీమె అనుకొంటొంది. (56)
అంబోవాచ
భగవన్నేవమేవేహ యథాఽఽహ పృథివీపతిః।
శరీరకర్తా మాతుర్మే సృంజయో హోత్రవాహనః॥ 57
అప్పుడు అంబ అన్నది - భగవాన్! నా తల్లికి తండ్రి అయిన, సృంజయ వంశానికి చెందిన రాజు హోత్రవాహనుడు చెప్పినట్లుగానే అంతా జరిగింది. (57)
న హ్యుత్సహే స్వనగరం ప్రతియాతుం తపోధన।
అపమానభయాచ్పైవ వ్రీడయా చ మహామునే॥ 58
మహామునీ! తపోధనా! అవమాన భయం చేతను, సిగ్గుచేతను మా నగరానికి వెళ్లడానికి నాకు ఉత్సాహంగా లేదు. (58)
యత్ తు మాం భగవాన్ రామః వక్ష్యతి ద్విజసత్తమ।
తన్మే కార్యతమం కార్యమ్ ఇతి మే భగవన్ మతిః॥ 59
విప్రశ్రేష్ఠుడా! భగవానుడైన పరశురాముడు నన్ను ఏది చేయమని ఆదేశిస్తాడో అదే అత్యుత్తమ కార్యమని నా ఉద్దేశ్యం. (59)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి హోత్రవాహనాంబాసంవాదే షట్సప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 176
ఇది శ్రీ మాహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున హోత్రవాహన - అంబాసంవాదము అనే నూటడెబ్బదియారవ అధ్యాయము. (176)