184. నూట యెనుబదినాల్గవ అధ్యాయము

భీష్మపరశురాముల అస్త్రప్రయోగములు.

భీష్మ ఉవాచ
తతో రాత్రౌ వ్యతీతాయాం ప్రతిబుద్ధోఽస్మి భారత।
తతః సంచింత్య వై స్వప్నమ్ అవాపం హర్షముత్తమమ్॥ 1
భీష్ముడు చెప్తున్నాడు. అంతట రాత్ర్గడవగానే మేలుకున్నాను. నాకు వచ్చిన స్వప్నం గురించి ఆలోచించి మిక్కిలి సంతోషించాను. (1)
తతః సమభవద్ యుద్ధం మమ తస్య చ భారత।
తుములం సర్వభూతానాం లోమహర్షణమద్భుతమ్॥ 2
భారతా! నాకు, అతనికి తుములయుద్ధం ఆరంభమయింది. ఆ అద్భుతయుద్ధం చూచి సమస్త ప్రాణులకు శరీరం గగుర్పొడిచింది. (2)
తతో బాణమయం వర్షం వవర్ష మయి భార్గవః।
న్యవారయమహం తచ్చ శరజాలేన భారత॥ 3
అప్పుడు భార్గవరాముడు నామీద బాణమయమైన వర్షం కురిపించాడు. దానిని నేను బాణ సమూహంతో వారించాను. (3)
తతః పరమసంక్రుద్ధః పునరేవ మహాతపాః।
హ్యస్తనేన చ కోపేన శక్తిం వై ప్రాహిణోన్మయి॥ 4
దానితో మహాతపస్వి అయిన రాముడు మిక్కిలి కుపితుడై, నిన్నటినుండి ఉన్న కోపంతో కూడా నా మీద శక్తిని ప్రయోగించాడు. (4)
ఇంద్రాశనిసమస్పర్శాం యమదండసమప్రభామ్।
జ్వలంతీమగ్నివత్ సంఖ్యే లేలిహానాం సమంతతః॥ 5
ఆ శక్త్యాయుధం స్పర్శలో ఇంద్రుని వజ్రాయుధంలా, కాంతిలో యముని దండంలా అనిపిస్తూ మండుతున్న అగ్నిలా యుద్ధ భూమిలో అంతటా నాలుకలు చాస్తూ నాకుతున్నట్లు ఉంది. (5)
తతో భారతశార్దూల ధిష్ణ్యమాకాశగం యథా।
స మామభ్యవధీత్ తూర్ణం జత్రుదేశే కురూద్వహ॥ 6
కురుకులరత్నా! ఆకాశంలో ఉండే నక్షత్రంలాగ ఆశక్తి వేగంగా వచ్చి నా వక్షఃస్థలాన్ని తాకి గాయ పరిచింది. (6)
అథాస్రమస్రవద్ ఘోరం గిరేర్గైరికధాతువత్।
రామేణ సుమహాబాహో క్షతస్య క్షతజేక్షణ॥ 7
ఎఱ్ఱనికన్నులుకల మహాబాహూ దుర్యోధనా! ఆ రాముడు వేసిన శక్తివల్ల కలిగిన గాయం నుండి కొండనుండి స్రవించే గైరికధాతుజలంలా రక్తం ప్రవహించసాగింది. (7)
తతోఽహం జామదగ్న్యాయ భృశం క్రోధసమన్వితః।
చిక్షేప మృత్యుసంకాశం బాణం సర్పవిషోపమమ్॥ 8
నాకు బాగా కోపం వచ్చి మృత్యుసమానమై పాము విషంలో సమానమైన ఒక బాణాన్ని జమదగ్నిసుతునిపై వేశాను. (8)
స తేనాభిహతో వీరో లలాటే ద్విజసత్తమః।
అశోభత మహారాజ సశృంగ ఇవ పర్వతః॥ 9
మహారాజా! బ్రాహ్మణోత్తముడైన ఆ వీరునికి ఆ బాణం నుదుటియందు గుచ్చుకుంది. అప్పుడతడు శిఖరంతో కూడిన పర్వతంలా ప్రకాశించాడు. (9)
స సంరబ్ధః సమావృత్య శరం కాలాంతకోపమమ్।
సందధే బలవత్ కృష్య ఘోరం శత్రునిబర్హణమ్॥ 10
కుపితుడైన అతడు ప్రళయకాల యమునితో సమానమైన, శత్రుసంహారకమైన ఒక భయంకర బాణాన్ని తీసుకుని బలంకొద్దీ లాగి ప్రయోగించాడు. (10)
స వక్షసి పపాతోగ్రః శరో వ్యాల ఇవ శ్వసన్।
మహీం రాజంస్తతశ్చాహమ్ ఆగమం రుధిరావిలః॥ 11
ఆ ఉగ్రమైన బాణం బుసకొట్టే సర్పంలాగ వచ్చి నా వక్షః స్థలం మీద నాటుకుంది. రాజా! అప్పుడు నేను రక్తసిక్తమై నేల వ్రాలాను. (11)
సంప్రాప్య తు పునః సంజ్ఞాం జామదగ్న్యాయ ధీమతే।
ప్రాహిణ్వం విమలాం శక్తిం జ్వలంతీమశనీమివ॥ 12
వెంటనే తెలివి తెచ్చుకుని ఆ ధీమంతుడైన జమదగ్నిసుతుని మీద మండుతున్న వజ్రాయుధం లాంటి తీక్ష్ణమైన శక్తిని ప్రయోగించాడు. (12)
సా తస్య ద్విజముఖ్యస్య నిపపాత భుజాంతరే।
విహ్వలశ్చాభవద్ రాజన్ వేపథుశ్పైనమావిశత్॥ 13
రాజా! అది ఆ బ్రాహ్మణోత్తముని భుజాలమధ్య తగిలింది. అతడు విహ్వలుడైపోయాడు. అతని శరీరం కంపించిపోయింది. (13)
తత ఏవం పరిష్వజ్య సఖా విప్రో మహాతపాః।
అకృతవ్రణః శుభైర్వాక్యైః ఆశ్వాసయదనేకధా॥ 14
సఖుడు, విప్రుడు, మహాతపోధనుడు అయిన అకృతవ్రణుడు అప్పుడతనిని కౌగిలించుకొని మంచి మాటలతో అనేక విధాల ఊరడించాడు. (14)
సమాశ్వస్తస్తతో రామః క్రోధామర్షసమన్వితః।
ప్రాదుశ్చక్రే తదా బ్రాహ్మ్యం పరమాస్త్రం మహావ్రతః॥ 15
క్రోధమాత్సర్యాలతో నిండిన పరశురాముడు, తేరుకొని మిక్కిలి గొప్పదైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. (15)
తతస్తత్ప్రతిఘాతార్థం బ్రాహ్మమేవాస్త్రముత్తమమ్।
మయా ప్రయుక్తం జజ్వాల యుగాంతమివ దర్శయత్॥ 16
దానిని ప్రతిఘటించడానికి ఉత్తమమైన బ్రహ్మాస్త్రాన్నే నేనూ ప్రయోగించాను. అది ప్రళయకాలం అనిపించేలా మంటలు ఎగచిమ్మింది. (16)
తయోర్బ్రహ్మాస్త్రయోరాసీత్ అంతరా వై సమాగమః।
అసంప్రాప్యైవ రామం చ మాం చ భారతసత్తమ॥ 17
భారతశ్రేష్ఠుడా! ఆ రెండు బ్రహ్మాస్త్రాలు నన్ను గాని, రామునిగాని చేరకుండా మధ్యలోనే డీకొన్నాయి. (17)
తతో వ్యోమ్ని ప్రాదురభూత్ తేజ ఏవ హి కేవలమ్।
భూతాని చైవ సర్వాణి జగ్మురార్తిం విశాంపతే॥ 18
అప్పుడు ఆకాశంలో కేవలం తేజస్సు మాత్రమే కనిపించసాగింది. సమస్తప్రాణులు ఆర్తి చెందాయి. (18)
ఋషయశ్చ సగంధర్వా దేవతాశ్పైవ భారత।
సంతాపం పరమం జగ్ముః అస్త్రతేజోఽభిపీడితాః॥ 19
ఋషులు, గంధర్వులు, దేవతలు కూడా అస్త్ర తేజస్సు చేత పీడింపబడి మిక్కిలి సంతాపాన్ని పొందారు. (19)
తతశ్చచాల పృథివీ సపర్వతవనద్రుమా।
సంతప్తాని చ భూతాని విషాదం జగ్మురుత్తమమ్॥ 20
అప్పుడు పర్వతాలు, వనాలు, వృక్షాలతో సహితంగా భూమి కంపించిపోయింది. తాపానికి గురైన ప్రాణులు మిక్కిలి విషాదాన్ని పొందాయి. (20)
ప్రజజ్వాల నభో రాజన్ ధూమాయంతే దిశో దశ।
న స్థాతుమంతరిక్షే చ శేకురాకాశగాస్తదా॥ 21
అప్పుడు ఆకాశమంతా మంటలు రేగాయి. దశదిశల పొగలు కమ్మాయి. ఆకాశ చారులు అంతరిక్షంలో నిలవలేకపోయారు. (21)
తతో హాహాకృతే లోకే సదేవాసురరాక్షసే।
ఇదమంతరమిత్యేవం మోక్తుకామోఽస్మి భారత॥ 22
ప్రస్వాపమస్త్రం త్వరితో వచనాద్ బ్రహ్మవాదినామ్।
విచిత్రం చ తదస్త్రం మే మనసి ప్రత్యభాత్ తదా॥ 23
భారతా! దేవతలు, అసురులు, రాక్షసులతో సహితంగా లోకమంతా హాహాకారాలతో నిండిపోయింది. ఇదే తగిన సమయం అని ప్రస్వాపనాస్త్రాన్ని వేద్దామనుకున్నాను. బ్రహ్మవాదులైన వసువుల మాట ప్రకారం విచిత్రంగా ఆ అస్త్రం వెంటనే నా మనసులో స్ఫురించింది. (22,23)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి పరస్పర బ్రహ్మాస్త్రప్రయోగే చతురశీత్యధికశతతమోఽధ్యాయః॥ 184
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉప పర్వమున భీష్మపరశురాములు బ్రహ్మాస్త్రము ప్రయోగించుకొనుట అను నూట ఎనుబది నాలుగవ అధ్యాయము. (184)