55. ఏబది అయిదవ అధ్యాయము

అర్జునాభిమన్యుల పరాక్రమము.

సంజయ ఉవాచ
గతపూర్వాహ్ణభూయిష్ఠే తస్మిన్నహవి భారత ।
రతనాగాశ్వపత్తీనాం సాదినాం చ మహాక్షయే ॥ 1
ద్రోణపుత్రేణ శల్యేన కృపేణ చ మహాత్మనా ।
సమసజ్జత పాంచాల్యః త్రిభిరేతైర్మహారథైః ॥ 2
సంజయుడిలా చెప్తున్నాడు.
'భారతా! ఆ రెండవరోజు పూర్వాహ్ణం దాదాపు ముగుస్తోంది. రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైనికులు, రథసారథులు ఎందరో నశించారు. ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ, శల్యుడు, మహాత్ముడైన కృపుడు ఈ ముగ్గురు మహారథులతో యుద్ధ మారంభించాడు. (1,2)
స లోకవిదితానశ్వాన్ నిజఘాన మహాబలః ।
ద్రౌణేః పాంచాలదాయాదః శితైర్దశభిరాశుగైః ॥ 3
మహాబలుడైన ధృష్టద్యుమ్నుడు పదిపదునైన బాణాలతో లోకప్రసిద్ధికెక్కిన అశ్వత్థామ గుర్రాలను చంపివేశాడు. (3)
తతః శల్యరథం తూర్ణమ్ ఆస్థాయ హతవాహనః ।
ద్రౌణిః పాంచాలదాయాదమ్ అభ్యవర్షదథేషుభిః ॥ 4
ఆ పై రథాన్ని కోల్పోయిన అశ్వత్థామ వెంటనే శల్యుని రథమెక్కి, ధృష్టద్యుమ్నునిపై బాణవృష్టి కురిపించాడు. (4)
ధృష్టద్యుమ్నం తు సంయుక్తం ద్రౌణినా వీక్ష్య భారత ।
సౌభద్రోఽభ్యపతత్ తూర్ణం వికిరన్ నిశితాన్ శరాన్ ॥ 5
భారతా! అశ్వత్థామతో ధృష్టద్యుమ్నుడు తలపడటం చూసి, అభిమన్యుడు నిశితశరాలను కురిపిస్తూ, వేగంగా అక్కడకు వచ్చాడు. (5)
స శల్యం పంచవింశత్యా కృపం చ నవభిః శరైః ।
అశ్వత్థామానమష్టాభిః వివ్యాధ పురుషర్షభః ॥ 6
ఆ పురుషోత్తముడు ఇరవై అయిదు బాణాలతో శల్యుని, తొమ్మిది బాణాలతో కృపుని, ఎనిమిది బాణాలతో అశ్వత్థామను గాయపరిచాడు. (6)
ఆర్జునిం తు తతస్తూర్ణం ద్రౌణిర్వివ్యాధ పత్రిణా ।
శల్యోఽథ దశభిశ్చైవ కృపశ్చ నిశితైస్త్రిభిః ॥ 7
వెంటనే అశ్వత్థామ ఒక బాణంతో అభిమన్యుని గాయపరిచాడు. శల్యుడు పది భాణాలతో, కృపుడు మూడు పదునైన బాణాలతో అభిమన్యుని గాయపరిచారు. (7)
లక్ష్మణస్తవ పౌత్రస్తు సౌభద్రం సమవస్థితమ్ ।
అభ్యవర్తత సంహృష్టః తతో యుద్ధమవర్తత ॥ 8
ఆ తరువాత నీ మనుమడైన లక్ష్మణుడు తన ఎదుట అభిమన్యుడు నిలిచి ఉండటం చూసి, ఆనందంతో అతనిని ఆక్రమించాడు. వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. (8)
దౌర్యోధనిః సుసంక్రుద్ధః సౌభద్రం పరవీరహా ।
వివ్యాధ సమరే రాజన్ తదద్భుతమివాభవత్ ॥ 9
రాజా! పరవీరహంత అయిన లక్ష్మణుడు మహాకోపంతో యుద్ధంలో అభిమన్యుని గాయపరిచాడు. అది అద్భుతమనిపించింది. (9)
అభిమన్యుః సుసంక్రుద్ధః భ్రాతరం భరతర్షభ ।
శరైః పంచాశతా రాజన్ క్షిప్రహస్తోఽభ్యవిధ్యత ॥ 10
రాజా! భరతర్షభా! వేగంగా బాణాలు వేయగల అభిమన్యుడు తీవ్రకోపంతో తన సోదరునిపై ఏభై బాణాలు వేసి, గాయపరిచాడు. (10)
లక్ష్మణోఽపి పునస్తస్య ధనుశ్చిచ్ఛేద పత్రిణా ।
ముష్టిదేశే మహారాజ తతస్తే చుక్రుశుర్జనాః ॥ 11
మహారాజా! లక్ష్మణుడు కూడా ఒక బాణంతో అభిమన్యుని వింటిని మధ్యకు విరిచాడు. అప్పుడు నీసేనలు ఆనందంతో అరిచారు. (11)
తద్ విహాయ ధనుశ్చిన్నం సౌభద్రః పరవీరహా ।
అన్యదాదత్తవాంశ్చిత్రం కార్ముకం వేగవత్తరమ్ ॥ 12
పరవీరహంత అయిన అభిమన్యుడు విరిగిన ఆ ధనుస్సును వదలి, అంతకన్న వేగంగా పని చేయగల మరొక చిత్రకార్ముకాన్ని స్వీకరించాడు. (12)
తౌ తత్ర సమరే యుక్తౌ కృతప్రతికృతైషిణౌ ।
అన్యోన్యం విశిఖైస్తీక్ ష్ణైః జఘ్నతుః పురుషర్షభౌ ॥ 13
పురుషశ్రేష్ఠులైన ఆ ఇద్దరూ ఒకరి చర్యకు మరొకరు ప్రతిచర్యను చేయగోరుతూ యుద్ధాసక్తులై, తీక్ష్ణ బాణాలతో ఒకరినొకరు బాధించసాగారు. (13)
తతో దుర్యోధనో రాజా దృష్ట్వా పుత్రం మహారథమ్ ।
పీడితం తవ పౌత్రేణ ప్రాయాత్ తత్ర ప్రజేశ్వరః ॥ 14
ఆ తరువాత ప్రజాపాలకుడైన దుర్యోధన మహారాజు నీ మనుమని చేత పీడింపబడిన తనకుమారుని చూసి, దగ్గరకు వెళ్ళాడు. (14)
సన్నివృత్తే తవ సుతే సర్వ ఏవ జనాధిపాః ।
ఆర్జునిం రథవంశేన సమంతాత్ పర్యవారయన్ ॥ 15
నీ కొడుకు అటు వెళ్ళగానే ఇతరరాజు లందరూ మహారథసేనతో అభిమన్యుని చుట్టుముట్టి నిలిచారు. (15)
స తైః పరివృతః శూరైః శూరో యుధి సుదుర్జయైః ।
న స్మ ప్రవ్యథతే రాజన్ కృష్ణతుల్యపరాక్రమః ॥ 16
రాజా! కృష్ణునివలె, పరాక్రమశాలి, శూరుడు అయిన అభిమన్యుడు దుర్జయులైన శూరులు ఎంతమంది చుట్టు ముట్టినా ఏమీ వ్యథ చెందలేదు. (16)
సౌభద్రమథ సంసక్తం దృష్ట్వా తత్ర ధనంజయః ।
అభిదుద్రావ వేగేన త్రాతుకామః స్వమాత్మజమ్ ॥ 17
అప్పుడు అభిమన్యుడు యుద్ధమగ్నుడై ఉండటం గమనించి, ధనంజయుడు తన కుమారుని రక్షించుకొనగోరి, వెంటనే పరుగెత్తాడు. (17)
తతః సరథనాగాశ్వాః భీష్మద్రోణపురోగమాః ।
అభ్యవర్తంత రాజానః సహితాః సవ్యపాచినమ్ ॥ 18
అటుతర్వాత భీష్మద్రోణాదులతో కౌరవరాజులందరూ రథాలపై, ఏనుగులపై, గుర్రాల పైకెక్కి ఒక్కుమ్మడిగా అర్జునుని ఆక్రమించాడు. (18)
ఉద్భూతం సహసా భౌమం నాగాశ్వరథపత్తిభిః ।
దివాకరరథం ప్రాప్య రజస్తీవ్రమదృశ్యత ॥ 19
ఏనుగులు, గుర్రాలు, రథాలు, సైనికులచే రేగగొట్టబడిన దుమ్ము సూర్యరథం దాకా వెళ్ళి, తీవ్రంగా కనిపించింది. (19)
తాని నాగసహస్రాణి భూమిపాలశతాని చ ।
తస్య బాణపథం ప్రాప్య నాభ్యవర్తంత సర్వశః ॥ 20
ప్రణేదుః సర్వభూతాని బభూవుస్తిమిరా దిశః ।
వేలకొలదిగా ఉన్న ఆ ఏనుగులు, వందలకొలది రాజులు అర్జునుని బాణానికి గురియై ఎటూ కదలలేకపోతున్నారు. సర్వభూతాలు ఆర్తనాదాలు చేశాయి. దిక్కులన్నీ చీకటితో నిండాయి. (20 1/2)
కురూణాం చానయస్తీవ్రః సమదృశ్యత దారుణః ॥ 21
నాప్యంతరిక్షం న దిశః న భూమిర్న చ భాస్కరః ।
ప్రజజ్ఞే భరతశ్రేష్ఠ శస్త్రసంఘైః కిరీటినః ॥ 22
గతంలోని కౌరవుల నీతిరహితవర్తన ఇప్పుడు దారుణ ఫలితంగా కనిపించింది. భరతశ్రేష్ఠా! అర్జునుని అస్త్రాల ధాటికి భూమి, ఆకాశం, దిక్కులు, సూర్యుడు ఏవీ కనిపించటం లేదు. (21,22)
సాదితా రథనాగాశ్చ హతాశ్వా రథినో రణే ।
విప్రద్రుతరథాః కేచిద్ దృశ్యంతే రథయూథపాః ॥ 23
విరిగిపోయిన రథాలు, చనిపోయిన ఏనుగులు యుద్ధంలో గుర్రాలు మరణించిన రథికులు, కొందరు రథయూథపతుల రథాలు పారిపోతూ కనిపిస్తున్నాయి. (23)
విరథా రథినశ్చాన్యే ధావమానాః సమంతతః ।
తత్ర తత్రైవ దృశ్యంతే సాయుధాః సాంగదైర్భుజైః ॥ 24
మరికొందరు రథికులు విరథులై, అంగదాలు ధరించిన భుజాలతో ఆయుధాలు ధరించి, అటు-ఇటూ నలుదిక్కులా పారిపోతూ కనిపించారు. (24)
హయారోహా హయాంస్త్యక్త్వా గజారోహాశ్చ దంతినః ।
అర్జునస్య భయాద్ రాజన్ సమంతాద్ విప్రదుద్రువుః ॥ 25
రాజా! గుర్రాల నెక్కేవారు గుర్రాలను, ఏనుగుల నెక్కే వారు ఏనుగులను వదిలి, అర్జునుని భయంతో అన్ని వైపులా పరుగెత్తుతున్నారు. (25)
రథేభ్యశ్చ గజేభ్యశ్చ హయేభ్యశ్చ నరాధిపాః ।
పతితాః పాత్యమానాశ్చ దృశ్యంతేఽర్జునసాయకైః ॥ 26
అర్జునుని బాణాలు తగిలి రథాల నుండి, ఏనుగుల మీద నుండి, గుర్రాల మీద నుండి పడిపోయిన, పడిపోతున్న రాజులు కనిపిస్తున్నారు. (26)
సగదానుద్యతాన్ బాహూన్ సఖడ్గాంశ్చ విశాంపతే ।
సప్రాసాంశ్చ సతూణీరాన్ సశరాన్ సశరాసనాన్ ॥ 27
సాంకుశాన్ సపతాకాంశ్చ తత్ర తత్రార్జునో నృణామ్ ।
నిచకర్త శరైరుగ్రైః రౌద్రం వపురధారయత్ ॥ 28
రాజా! ఆ రణరంగంలో అర్జునుడు గదలు కత్తులు, ప్రాసాలు, తూణీరాలు, శరాలు, ధనుస్సులు, అంకుశాలు, పతాకాలు ఎత్తిపట్టిన రాజుల చేతులను ఆ స్థితిలోనే ఉగ్రబాణాలతో నరికివేశాడు. రౌద్ర రూపాన్ని ధరించాడు. (27,28)
పరిఘాణాం ప్రదీప్తానాం ముద్గరాణాం చ మారిష ।
ప్రాసానాం భిందిపాలానాం నిస్త్రింశానాం చ సంయుగే ॥ 29
పరశ్వధానాం తీక్ష్ణానాం తోమరాణాం చ భారత ।
వర్మణాం చాపవిద్ధానాం కాంచనానాం చ భూమిప ॥ 30
ధ్వజానాం చర్మణాం చైవ వ్యజనానాం చ సర్వశః ।
ఛత్రాణాం హేమదండానాం తోమరాణాం చ భారత ॥ 31
ప్రతోదానాం చ యోక్త్రాణాం కశానాం చైవ మారిష ।
రాశయః స్మాత్ర దృశ్యంతే వినికీర్ణా రణక్షితౌ ॥ 32
ఆర్యా! భారతా! రాజా! ఆ రణభూమిలో మెరిసే పరిఘలు, ముద్గరాలు, ప్రాసాలు, భిందిపాలాలు, కత్తులు, గొడ్డళ్ళు, తీక్ష్ణమైన తోమరాలు స్వర్ణమయ కవచాలు, ధ్వజాలు, కాళ్ళు, వింజామరలు, బంగారు కర్రలు గల గొడుగులు, చిత్రాలు, పలుపులు, కొరడాలు రాసులు రాసులుగా చెల్లాచెదరుగా పడి కన్పిస్తున్నాయి. (29-32)
నాసీత్ తత్ర పుమాన్ కశ్చిత్ తవ సైనస్య భారత ।
యోర్జునం సమరే శూరం ప్రత్యుద్యాయాత్ కథంచన ॥ 33
భారతా! శూరుడైన అర్జునుని ఏదో ఒకరీతిగా ఎదిరించగల మగవాడు నీ సేనలో ఒక్కడు కూడా లేడు. (33)
యో యో హి సమరే పార్థం ప్రత్యుద్యాతి విశాంపతే ।
స సంఖ్యే విశిఖైస్తీక్ ష్ణైః పరలోకాయ నీయతే ॥ 34
రాజా! రణభూమిలో అర్జునుని ఎదిరించటానికి ఉద్యమించిన వారంతా పదునైన బాణాలతో పరలోకానికి పంపబడుతున్నారు. (34)
తేషు విద్రవమాణేషు తవ యోధేషు సర్వశః ।
అర్జునో వాసుదేవశ్చ దధ్మతుర్వారిజోత్తమౌ ॥ 35
నీ యోధులు అన్ని దిక్కులకు పరుగెత్తుతుంటే అర్జునుడు, వాసుదేవుడు గొప్ప శంఖాలను పూరించారు. (35)
తత్ ప్రభగ్నం బలం దృష్ట్వా పితా దేవవ్రతస్తవ ।
అబ్రవీత్ సమరే శూరం భారద్వాజం స్మయన్నివ ॥ 36
నీసేన అంతా భంగపడటాన్ని గమనించి, నీ తండ్రి దేవవ్రతుడు నవ్వుతూ, రణశూరుడైన ద్రోణునితో ఇలా అన్నాడు. (36)
ఏష పాండుసుతో వీరః కృష్ణేన సహితో బలీ ।
తథా కరోతి సైన్యాని యథా కుర్యాద్ ధనంజయః ॥ 37
వీరుడు, పాండుకుమారుడు, బలసంపన్నుడు, ఐన ఈ అర్జునుడు వాసుదేవునితో కలిసి సేనలకు తగిన దశను కలిగిస్తున్నాడు. (37)
న హ్యేష సమరే శక్యః విజేతుం హి కథంచన ।
యథాస్య దృశ్యతే రూపం కాలాంతకయమోపమమ్ ॥ 38
ఏ రీతిగానూ యుద్ధంలో ఇతనిని జయించలేము. కాలాంతకుడైన యమునిలా కనిపిస్తోంది రూపం. (38)
న నివర్తయితుం చాపి శక్యేయం మహతీ చమూః ।
అన్యోన్యప్రేక్షయా ప్రశ్య ద్రవతీయం వరూథినీ ॥ 39
ఈ విశాలసేనను ఇప్పుడు మరలించటం కూడా సాధ్యం కాదు. ఒకరినొకరు చూసుకొంటూ ఈ సైనికులు ఎలా పరుగిడుతున్నారో చూడు. (39)
ఏష చాస్తం గిరిశ్రేష్ఠం భానుమాన్ ప్రతిపద్యతే ।
చక్షూంషి సర్వలోకస్య సంహరన్నివ సర్వథా ॥ 40
ఇదిగో సూర్యుడు కూడా సమస్తలోకాల దృష్టిని పూర్తిగా సంహరిస్తున్నట్లు, మేటికొండ అయిన అస్తాద్రిని చేరుతున్నాడు. (40)
తత్రావహారం సంప్రాప్తం మన్యేఽహం పురుషర్షభ ।
శ్రాంతా భీతాశ్చ నో యోధాః న యోత్స్యంతి కథంచన ॥ 41
పురుషర్షభా! ఇప్పుడు సేనలను వెనక్కు మరలించటమే మంచిదనుకొంటున్నాను. మన యోధులంతా అలసిపోయారు. భయపడుతున్నారు. ఏ రీతిగానూ యుద్ధం చేయలేరు. (41)
ఏవముక్త్వా తతో భీష్మః ద్రోణమాచార్యసత్తమమ్ ।
అవహారమథో చక్రే తావకానాం మహారథః ॥ 42
ఆచార్యశ్రేష్ఠుడైన ద్రోణునితో అలా పలికి, మహారథుడైన భీష్ముడు నీ సేనలను వెనుకకు మరలింపచేశాడు. (42)
(తతః సరథనాగాశ్వాః జయం ప్రాప్య ససోమకాః ।
పంచాలాః పాండావాశ్చైవ ప్రనేదుశ్చ పునః పునః ॥
ప్రయయుః శిబిరాయైవ ధనంజయపురస్కృతాః ।
వాదిత్రఘోషైః సంహృష్టాః ప్రనృత్యంతో మహారథాః) ॥
ఆ తరువాత సోమకులు, పాంచాలురు, పాండవులు రథనాగాశ్వాలతో పాటు జయాన్ని పొంది మాటిమాటికి సింహనాదాలు చేశారు. ఆ మహారథులందరూ ఆనందించి వాద్యఘోషలతో పాటు నృత్యం చేస్తూ అర్జునుని ఉపసంహరించుకొని శిబిరానికి వెళ్ళిపోయారు.
తతోఽవహారః సైన్యానాం తవ తేషాం చ భారత ।
అస్తం గచ్ఛతి సూర్యేఽభూత్ సంధ్యాకాలే చ వర్తతి ॥ 43
భారతా! ఆ తరువాత సూర్యుడు అస్తమించి, సంధ్యాకాలం ప్రవర్తిల్లగా నీ వారు, పాండవులు కూడా సేనలను ఉపసంహరించారు. (43)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి ద్వితీయయుద్ధదివసావహారే పంచపంచాశత్తమోఽధ్యాయః ॥ 55 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున ద్వితీయయుద్ధదివసావహారమను ఏబది అయిదవ అధ్యాయము. (55)
(దాక్షిణాత్య అథికపాఠం 2 శ్లోకాలతో కలిపి 45 శ్లోకాలు)