60. అరువదియవ అధ్యాయము

నాలుగవరోజు ఉభయసేనలు వ్యూహాలు నిర్మించుట - భీష్మార్జునుల ముఖాముఖి.

సంజయ ఉవాచ
వ్యుష్టాం నిశాం భారత భారతానామ్
అనీకినీనాం ప్రముఖే మహాత్మా ।
యయౌ సపత్నాన్ ప్రతి జాతకోపః
వృతః సమగ్రేణ బలేన భీష్మః ॥ 1
సంజయుడిలా చెప్తున్నాడు.
"భారతా! ఆ రాత్రి గడిపి భరతవంశీయుల సేనలలో అగ్రభాగాన నిలిచిన భీష్ముడు సమగ్ర సేనాపరివృతుడై, కోపంతో శత్రువుల మీదకు బయలుదేరాడు. (1)
తం ద్రోణదుర్యోధనబాహ్లికాశ్చ
తథైవ దుర్మర్షణచిత్రసేనౌ ।
జయద్రథశ్చాతిబలో బలౌఘాః
నృపాస్తథాన్యే ప్రయయుః సమంతాత్ ॥ 2
ద్రోణుడు, దుర్యోధనుడు, బాహ్లికుడు, దుర్మర్షణుడు, చిత్రసేనుడు, బలసంపన్నుడైన జయద్రథుడు, ఇతర రాజులు బలసమూహాలతో అన్నివైపులకు బయలుదేరారు. (2)
స తైర్మహద్భిశ్చ మహారథైశ్చ
తేజస్విభిర్వీర్యవద్భిశ్చ రాజన్ ।
రరాజ రాజా స తు రాజముఖ్యైః
వృతః అ దేవైరివ వజ్రపాణిః ॥ 3
రాజా! మహాత్ములు, మహారథులు, తేజస్వులు, పరాక్రమవంతులు అయిన ప్రముఖరాజులందరూ పరివేష్టించి యుండగా ఆ బీష్మరాజు దేవతా పరివృతుడైన ఇంద్రునివలె విరాజిల్లాడు. (3)
తస్మిన్ననీకప్రముఖే విషక్తాః
దోధూయమానాశ్చ మహాపతాకాః ।
సురక్తపీతాసితపాండురాభాః
మహాగజస్కంధగతా విరేజుః ॥ 4
ఆ సేనకు అగ్రభాగంలో పెద్దపెద్ద ఏనుగుల స్కంధాలపై కట్టబడి, ఎరుపు పసుపు నలుపు తెలుపు రంగులతో రెపరెపలాడుతున్న మహాధ్వజాలు ప్రకాశించాయి. (4)
సా వాహినీ శాంతనవేన గుప్తా
మహారథైర్వారణవాజిభిశ్చ ।
బభౌ సవిద్యుత్ స్తనయిత్నుకల్పా
జలాగమే ద్యౌరివ జాతమేఘా ॥ 5
భీష్మ రక్షితమైన ఆ సేన మహారథాలతో, ఏనుగులతో, గుర్రాలతో కూడి వర్షాకాలంలో మేఘాలచే కప్పబడిన ఆకాశం మెరుపులతో కూడిన మేఘంలా ప్రకాశించినట్టు భాసించింది. (5)
తతో రణాయాభిముఖీ ప్రయాతా
ప్రత్యర్జునం శాంతనవాభిగుప్తా ।
సేనా మహోగ్రా సహసా కురూణాం
వేగో యథా భీమ ఇవాపగాయాః ॥ 6
ఆ తరువాత ఆ మహాకౌరవసేన భీష్మాభిరక్షితమై, భీకర నదీవేగంలా యుద్ధం చేయటానికి అర్జునునకు ఎదురువెళ్ళింది. (6)
తం వ్యాలనానావిధగూఢసారం
గజాశ్వపాదాతరథౌఘపక్షమ్ ।
వ్యూహం మహామేఘసమం మహాత్మా
దదర్శ దూరాత్ కపిరాజకేతుః ॥ 7
మహాత్ముడైన అర్జునుడు దూరం నుండే ఆ కౌరవసేనను చూశాడు. అది నాగవ్యూహంలో ఉంది. వివిధ రీతులలో శక్తిని లోన ఇముడ్చుకొని ఉంది. అది ఏనుగులతో, గుర్రాలతో, కాల్బలంతో, రథాలతో నిండి మహామేఘంలా కనిపిస్తోంది. (7)
వినిర్యయౌ కేతుమతా రథేన
నరర్షభః శ్వేతహయేన వీరః ।
వరూథినా సైన్యముఖే మహాత్మా
వధే ధృతః సర్వసపత్నయూనామ్ ॥ 8
అప్పుడు నరశేష్ఠుడు, మహాత్ముడు, వీరుడు అయిన అర్జునుడు సర్వ శత్రుయువకుల వధను సంకల్పించి, తెల్లగుర్రాలు, ధ్వజం, రక్షణ కవచం గల రథాన్ని ఎక్కి, శత్రుసేనల మీదకు పోయాడు. (8)
సూపస్కరం సోత్తరబంధురేషం
యత్తం యదూనామృషభేణ సంఖ్యే ।
కపిధ్వజం ప్రేక్ష్య విషేదురాజౌ
సహైవ పుత్రైస్తవ కౌరవేయాః ॥ 9
మంచి సామాగ్రి కలిగి, అందంగా అలంకరించిన నొగలు గలిగి, రణభూమిలో యదుశ్రేష్ఠుడైన శ్రీ కృష్ణునిచే సమాయత్తం చేయబడిన కపిధ్వజాన్ని చూసి, నీ కొడుకులతో పాటు కౌరవ యోధులంతా విషాదానికి లోనయ్యారు. (9)
ప్రకర్షతా గుప్తముదాయుధేన
కిరీటినా లోకమహారథేన ।
తం వ్యూహరాజం దదృశుస్త్వదీయాః
చతుశ్చతుర్వ్యాలసహస్రకర్ణమ్ ॥ 10
లోకప్రసిద్ధి కెక్కిన మహారథుడైన అర్జునుడు ఆయుధాల నెత్తి, రక్షిస్తూ, నడిపిస్తున్న గొప్ప వ్యూహాన్ని నీ వారు చూశారు. దానికి నాలుగు వైపులా నాలుగు నాలుగువేల ఏనుగులు నిలిచి ఉన్నాయి. (10)
యథా హి పూర్వేఽహని ధర్మరాజ్ఞా
వ్యూహః కృతః కౌరవసత్తమేవ ।
తథా న భూతో భువి మానుషేషు
న దృష్టపూర్వో న చ సంశ్రుతశ్చ ॥ 11
కౌరవశ్రేష్ఠుడైన ధర్మరాజు ముందురోజు పన్నివ వ్యూహం వలె ఇది కూడా ఉంది. లోకంలోని మనుష్యలెవ్వరూ కూడా గతంలో అటువంటి వ్యూహాన్ని చూడలేదు. వినలేదు కూడా. (11)
తతో యథాదేశముపేత్య తస్థుః
పాంచాలముఖ్యాః సహ చేదిముఖ్యైః ।
తతః సమాదేశసమాహతాని
భేరీసహస్రాణి వినేదురాజౌ ॥ 12
ఆ తరువాత సేనాపతి ఆదేశాన్ని అనుసరించి పాంచాల, చేది దేశాలకు సంబంధించిన ప్రముఖ వీరులు తమతమ స్థానాలలో నిలిచారు. ఆపై రణభూమిలో సేనాపతి ఆదేశం మేరకు వేలకొలది భేరులు మ్రోగాయి. (12)
శంఖస్వనాస్తూర్యరథస్వనాశ్చ
సర్వేష్వనీకేషు ససింహనాదాః ।
తతః సబాణాని మహాస్వనాని
విస్ఫార్యమాణాని ధనూంషి వీరైః ॥ 13
ఆ పై సేనలన్నింటిలో శంఖనాదాలు, తూర్యధ్వనులు, వీరుల సింహనాదాలతో కలిసి రథనేమి శబ్దాలు ప్రారంభమయ్యాయి. వీరులు ఆకర్షిస్తున్న బాణధ్వనులతో సహా ధనుష్టంకారాలు వినిపించసాగాయి. (13)
క్షణేన భేరీపణవప్రణాదాన్
అంతర్దధుః శంఖమహాస్వనాశ్చ ।
తచ్ఛంఖశబ్దావృతమంతరిక్షమ్
ఉద్ధూతభీమాద్భుతరేణుజాలమ్ ॥ 14
క్షణకాలంలో శంఖాల మహానాదాలు భేరీ పణవనాదాలను వినిపించకుండా చేశాయి. ఆకాశమంతా ఆ శంఖ నాదాలతో, పైకి రేగుతున్న దుమ్ముతో అద్భుతంగా భయంకరంగా తయారయింది. (14)
మహానుభావాశ్చ తతః ప్రకాశమ్
ఆలోక్య వీరాః సహసాభిపేతుః ।
రథీ రథేనాభిహతః ససూతః
పపాత సాశ్వః సరథః సకేతుః ॥ 15
ఆ తరువాత మహానుభావులైన వీరులు సూర్యకాంతిని చూసి వెంటనే శత్రువులపై పడ్డారు. రథికులు రథికుల దెబ్బకు సూతునితో, గుర్రాలతో, రథాలతో, పతాకలతో సహా పడిపోతున్నారు. (15)
గజో గజేనాభిహతః పపాత
పదాతినా చాభిహతః పదాతిః ।
ఆవర్తమానాన్యభివర్తమానైః
ఘోరీకృతాన్యద్భుతదర్శనాని ।
ప్రాసైశ్చ ఖడ్గైశ్చ సమాహతాని
సదశ్వవృందాని సదశ్వవృందైః ॥ 16
సువర్ణతారాగణభూషితాని
సూర్యప్రభాభాని శరావరాణి ।
విదార్యమాణాని పరశ్వధైశ్చ
ప్రాసైశ్చ ఖడ్గైశ్చ నిపేతురుర్వ్యామ్ ॥ 17
ఏనుగు ఏనుగు దెబ్బకు పడిపోయింది. కాల్బలం కాల్బలం దెబ్బకు పడిపోతోంది. అశ్వబృందాలు అశ్వబృందాలపై ఆక్రమణ - ప్రత్యాక్రమణలు చేస్తున్నాయి. ఆశ్వికులు ప్రాసాలతో, ఖడ్గాలతో కొట్టగా గాయపడి అవి అద్భుతంగా, ఘోరంగా కనిపిస్తున్నాయి. బంగారు నక్షత్రాలు పొదగబడి సూర్యకాంతితో మెరుస్తున్న కవచాలు గొడ్డళ్ళతో, ప్రాసాలతో, ఖడ్గాలతో చీల్చబడి నేలపై పడుతున్నాయి. (16,17)
గజైర్విషాణైర్వరహస్తరుగ్ణాః
కేచిత్ ససూతా రథినః ప్రపేతుః ।
గజర్షభాశ్చాపి రథర్షభేణ
నిపాతితా బాణహతాః పృథివ్యామ్ ॥ 18
కొందరు రథికులు ఏనుగులదంతాలు, తొండాల దెబ్బలతో గాయపడి సారథితో సహా పడిపోయారు. రథికశ్రేష్ఠులు కొందరు మదపుటేనుగులను బాణాలతో కొట్టి, నేల గూలుస్తున్నారు. (18)
గజౌఘవేగోద్ధతసాదితానాం
శ్రుత్వా విషేదుః సహసా మనుష్యాః ।
ఆర్తస్వనం సాదిపదాతియూనాం
విషాణగాత్రావరతాడితానామ్ ॥ 19
గజబృందాల వేగంతో, రాపిడితో జారిపడి ఎందరో ఆశ్వికులు, పదాతియువకులు మరణిస్తున్నారు. వాటిదంతాలతో, శరీరంతో దెబ్బతిని వారు చనిపోతున్నారు. వారి ఆర్తనాదాలు విని, మనుష్యులు వెంటనే విషాదానికి లోనవుతున్నారు. (19)
సంభ్రాంతనాగాశ్వరథే ముహూర్తే
మహాక్షయే సాహిపదాతియూనామ్ ।
మహారథైః సంపరివార్యమాణః
దదర్శ భీష్మః కపిరాజకేతుమ్ ॥ 20
ఆశ్వికులు, పదాతియువకులు బాగా నశించి పోతున్న ఆ సమయంలో, ఏనుగులు, గుర్రాలు, రథాలు భ్రాంతికి లోను కాగా మహారథులచే పరివేష్టించబడియున్న భీష్ముడు అర్జునుని చూశాడు. (20)
తం పంచతాలోచ్ఛ్రితతాలకేతుః
తదశ్వవేగాద్భుతవీర్యయానః
మహాస్త్రబాణాశనిదీప్తిమంతం
కిరీటినం శాంతనవోఽభ్యధావత్ ॥ 21
భీష్ముని ధ్వజం అయిదు తాటిచెట్లు గుర్తు కలిగి ఉన్నతమైనది. ఆయన రథం దాని గుర్రాల వేగంతో అద్భుతశక్తిమంతంగా కనిపిస్తోంది. ఆ రథంపై నిలిచి భీష్ముడు బాణం, అశని మొదలైన దివ్యాస్త్రాలతో వెలుగొందుతున్న అర్జునునిపై దాడి చేశాడు. (21)
తథైవ శక్రపతిమప్రభావమ్
ఇంద్రాత్మజం ద్రోణముఖా విసస్రుః ।
కృపశ్చ శల్యశ్చ వివింశతిశ్చ
దుర్యోధనః సౌమదత్తిశ్చ రాజన్ ॥ 22
రాజా! అలాగే ద్రోణుడు, కృపుడు, శల్యుడు, వివింశతి, దుర్యోధనుడు, సౌమదత్తి - వీరంతా ఇంద్రుని వంటి ప్రభావం గల ఇంద్రకుమారుని - అర్జునుని ఆక్రమించారు. (22)
తతో రథానాం ప్రముఖాదుపేత్య
సర్వాస్త్రవిత్ కాంచనచిత్రవర్మా ।
జవేన శూరోఽభిససార సర్వాన్
తానర్జునస్యాత్మసుతోఽభిమన్యుః ॥ 23
ఆ పై సర్వాస్త్రవేత్తయై, శూరుడై, సువర్ణ చిత్రకవచాన్ని ధరించిన అర్జునపుత్రుడు - అభిమన్యుడు ఒక గొప్పరథాన్ని ఎక్కి, వేగంగా వారి నందరినీ ఎదిరించాడు. (23)
తేషాం మహాస్త్రాణి మహారథానామ్
అసహ్యకర్మా వినిహత్య కార్ ష్ణిః ।
బభౌ మహామంత్రహుతార్చిమాలీ
సదోగతః సన్ భగవానివాగ్నిః ॥ 24
పరులు భరింపరాని, పరాక్రమం గల అర్జునుడు కౌరవ సేనలోని మహారథులు ప్రయోగించిన మహాస్త్రాలను నాశనం చేసి, యజ్ఞవేదిపై మహామంత్రాలతో ఆహుతుల నందుకొని జ్వాలలతో ప్రజ్వరిల్లే అగ్నిహోత్రునివలె ప్రకాశించాడు. (24)
తతః స తూర్ణం రుధిరోదఫేనాం
కృత్వా నదీమాశు రణే రిపూణామ్ ।
జగామ సౌభద్రమతీత్య భీష్మః
మహారథం పార్థమదీనసత్త్వః ॥ 25
ఆ తరువాత అదీనసత్త్వుడైన భీష్ముడు రణభూమిలో శత్రువుల నెత్తుటితో నురగలతో నిండిన నదిని దాటి, సుభద్రకొడుకైన అభిమన్యుని దాటి, మహారథుడైన అర్జునుని ఆక్రమించాడు. (25)
తతః ప్రహస్యాద్భుతవిక్రమేణ
గాండీవముక్తేన శిలాశితేన ।
విపాఠజాలేన మహాస్త్రజాలం
వినాశయామాస కిరీటమాలీ ॥ 26
ఆ పై అర్జునుడు నవ్వి, అద్భుతపరాక్రమాన్ని ప్రదర్శిస్తూ రాతిపై సానబెట్టి పదును చేయబడిన విపాఠబాణాలను గాండీవం నుండి ప్రయోగించి, భీష్ముని అస్త్రసమూహాన్ని నశింపజేశాడు. (26)
తముత్తమం సర్వధనుర్ధరాణామ్
అసక్తకర్మా కపిరాజకేతుః ।
భీష్మం మహాత్మాభివవర్ష తూర్ణం
శరౌఘజాలైర్విమలైశ్చ భల్లైః ॥ 27
ఆ పిమ్మట తిరుగులేని పరాక్రమం గల మహాత్ముడు, కపిధ్వజుడు అయిన అర్జునుడు విలుకాండ్రు అందరిలో మేటి అయిన భీష్మునిపై వెంటనే బాణసమూహంతో, నిర్మలభల్లాలతో వృష్టిని కురిపించాడు. (27)
తథైవ భీష్మాహతమంతరిక్షే
మహాస్త్రజాలం కపిరాజకేతోః ।
విశీర్యమాణం దదృశుస్త్వదీయా
దివాకరేణేవ తమోఽభిభూతమ్ ॥ 28
అదే రీతిగా భీష్మునిచే కొట్టబడి, కపిధ్వజుని (అర్జునుని) అస్త్రసమూహమంతా ఆకాశంలోనే శిథిల మయిపోయింది. నీవారంతా దాన్ని చూశారు. అది సూర్యుడు తన కెదురు నిలిచిన చీకటిని చిదిమివేసినట్లుంది. (28)
ఏవంవిధం కార్ముకభీమనాదమ్
అదీనవత్ సత్పురుషోత్తమాభ్యామ్ ।
దదర్శ లోకః కురుసృంజయాశ్చ
తద్ ద్వైరథం భీష్మధనంజయాభ్యామ్ ॥ 29
పురుషోత్తములైన భీష్మార్జునుల మధ్య భీకర ధనుష్టంకారాలతో దైన్యరహితంగా ముఖాముఖి యుద్ధం జరిగింది. కౌరవుల, సృంజయులు ఇతర వీరులు దానిని తిలకించారు." (29)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి భీష్మార్జునద్వైరథే షష్టితమోఽధ్యాయః ॥ 60 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున భీష్మార్జున ద్వైరథమను అరువదియవ అధ్యాయము. (60)