3. మూడవ అధ్యాయము
పౌష్యపర్వము
సరమకథ - అయోదధౌమ్యుని శిష్యులు - ఉత్తంకచరిత్రము.
సౌతి రువాచ
జనమేజయః పారీక్షితః సహ భ్రాతృభిః కురుక్షేత్రే దీర్ఘసత్రముపాస్తే
తస్య భ్రాతరస్త్రయః శ్రుతసేన ఉగ్రసేనో భీమసేన ఇతి
తేషు తత్సత్రముపాసీనేష్వాగచ్ఛత్ సారమేయః ॥ 1
ఉగ్రశ్రవుడు (సూతుని కొడుకు) చెపుతున్నాడు. పరీక్షితుని కొడుకైన జనమేజయుడు తన తమ్ముళ్లతో కలిసి కురుక్షేత్రలో దీర్ఘసత్రయాగం ఆరంభించాడు. శ్రుతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అనే ముగ్గురు తమ్ముళ్లు అక్కడ ఉండగా దేవశుని సరమ యొక్క కొడుకు సారమేయం అక్కడికి వచ్చింది. (1)
స జనమేజయస్య భ్రాతృభిరభిహతః ।
రోరూయమాణో మాతుః సమీపముపాగచ్ఛత్ ॥ 2
జనమేజయుని తమ్ముళ్లు ఆ కుక్కను కొట్టారు. అది ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్లింది. (2)
తం మాతా రోరూయమాణమువాచ ।
కిం రోదషి కేనాస్యభిహత ఇతి ॥ 3
వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకును చూచి తల్లి "ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నిన్ను కొట్టారు" అని అడిగింది. (3)
స ఏవముక్తో మాతరం ప్రత్యువాచ ।
జనమేజయస్య భ్రాతృభిరభిహతోఽస్మీతి ॥ 4
అలా అడిగిన తల్లికి "జనమేజయుని తమ్ముళ్ళు నన్ను కొట్టారు" అని చెప్పింది ఆ సారమేయం. (4)
తం మాతా ప్రత్యువాచ వ్యక్తం త్వయా ।
తత్రాపరాద్ధం యేనాస్యభిహత ఇతి ॥ 5
దానికి తల్లి ఇలా అంది. "నాయనా! నీవు వారిపట్ల ఏదో అపరాధం చేసి ఉంటావు. అందుకే వారు నిన్ను కొట్టారు." (5)
స తాం పునరువాచ నాపరాధ్యామి ।
కంచిన్నావేక్షే హవీంషి నావలిహ ఇతి ॥ 6
అది మళ్లీ తల్లితో "నేనేమీ తప్పు చేయలేదు. అక్కడి హవిస్సును చూడనూ లేదు, నాకనూ లేదు" అంది. (6)
తచ్ఛ్రుత్వా తస్య మాతా సరమా పుత్రదుఃఖార్తా
తత్ సత్రముపాగచ్ఛద్ యత్ర స జనమేజయః
సహ భ్రాతృభిః దీర్ఘసత్రముపాస్తే ॥ 7
అది విని దాని తల్లి సరమ పుత్రదుఃఖంతో ఆర్తి చెంది జనమేజయుడు దీర్ఘసత్ర యాగం చేసే చోటికి వచ్చింది. (7)
స తయా క్రుద్ధయా తత్రోక్తోఽయం మే
పుత్రో న కించిదపరాధ్యతి నావేక్షత హవీంషి
నావలేఢి కిమర్థమభిహత ఇతి ॥ 8
కోపంతో సరమ అతనితో "నా కొడుకు ఏ తప్పూ చేయలేదు. హవిస్సును చూడలేదు. నాకలేదు. ఎందుకు కొట్టారు?" అని అడిగింది. (8)
న కించిదుక్తవంతస్తే సా తానువాచ యస్మాత్
అయమభిహతోఽనపకారీ తస్మాదదృష్టం
త్వాం భయమాగమిష్యతీతి ॥ 9
వారు ఏమీ బదులు చెప్పలేదు. ఆమె వారితో "ఏ తప్పు చేయని నా కొడుకును కొట్టారు. కాబట్టి మీకు అనుకోని భయం కలుగుతుంది." అంది. (9)
జనమేజయ ఏవముక్తో దేవశున్యా పరమయా ।
భృశం సంభ్రాంతో విషణ్ణశ్చాసీత్ ॥ 10
దేవశుని సరమ ఇలా అనగానే జనమేజయుడు భయభ్రాంతుడై చింతాక్రాంతుడయ్యాడు. (10)
స తస్మిన్ సత్రే సమాప్తే హాస్తినపురం ప్రత్యేత్య
పురోహితం అనురూపమన్విచ్ఛమానః పరం
యత్నమకరోద్ యో మే పాపకృత్యాం శమయేదితి ॥ 11
ఆ దీర్ఘసత్రయాగం సమాప్తం అయ్యాక హస్తినపురానికి వచ్చి జనమేజయుడు తన పాపకృత్యాన్ని శమింపచేయగల పురోహితుని కోసం తీవ్రమైన ప్రయత్నం చేశాడు. (11)
స కదాచిత్ మృగయాం గతః పారీక్షితః ।
జనమేజయః కస్మింశ్చిత్ స్వవిషయ ఆశ్రమమపశ్యత్ ॥ 12
ఆ జనమేజయుడు ఒకసారి వేటకు వెళ్లి, తన దేశంలోని ఒకానొక ఆశ్రమాన్ని చూచాడు. (12)
తత్ర కశ్చిదృషిరాసాంచక్రే శ్రుతశ్రవా నామ ।
తస్య తపస్యభిరతః పుత్ర ఆస్తే సోమశ్రవా నామ ॥ 13
అక్కడ శ్రుతశ్రవసుడనే ముని నివసిస్తున్నాడు. అతని కొడుకు సోమశ్రవసుడు. అతడు ఎల్లప్పుడూ తపస్సు చేసుకొంటూ ఉంటాడు. (13)
తస్య తం పుత్రమభిగమ్య జనమేజయః
పారీక్షితః పౌరోహిత్యాయ వవ్రే ॥ 14
జనమేజయుడు ఆ శ్రుతశ్రవసుని వద్దకు వెళ్లి అతని కొడుకును పురోహితునిగా వరించాడు. (14)
స నమస్కృత్య తమృషిమువాచ భగవన్ ।
అయం తవ పుత్రో మమ పురోహితోఽస్త్వితి ॥ 15
రాజు అతనికి నమస్కరించి "మహాత్మా! ఈ నీ పుత్రుడు నాకు పురోహితుడు అగుగాక" అని పలికాడు. (15)
స ఏవముక్తః ప్రత్యువాచ జనమేజయం
భో జనమేజయ! పుత్రోఽయం స్వాధ్యాయసంపన్నో
మత్తపోవీర్యసంభృతో మచ్ఛుక్రం
పీతవత్యాస్తస్యాః కుక్షౌ జాతః ॥ 16
అలా అడిగిన జనమేజయునకు శ్రుతశ్రవసుడు "జనమేజయా! ఈ నా పుత్రుడు సర్పగర్భం నుండి పుట్టాడు. మహాతపస్వి. స్వాధ్యాయసంపన్నుడు. నా తపోబలంచేత పోషింపబడ్డాడు. నా వీర్యాన్ని తాగిన ఒక సర్పిణి యొక్క కుక్షి నుండి ఉద్భవించాడు. (16)
సమర్థోఽయం భవతః సర్వాః పాపకృత్వాః ।
శమయితుమంతరేణ మహాదేవకృత్యామ్ ॥ 17
పరమేశ్వరుడు చేసినది తప్పించి నీ యొక్క సమస్త పాపకృత్యాలను (శాపం వలన కలిగిన ఉపద్రవాలను) శాంతింపచేయడానికి ఇతడు సమర్థుడు. (17)
అస్య త్వేకముపాంసువ్రతం యదేవం కశ్చిత్
బ్రాహ్మణః కంచిదర్థమభియాచేత్ తం తస్మై
దద్యాదయం యద్యేతదుత్సహసే తతో నయస్వైనమితి ॥ 18
ఇతనికి ఒక గుప్తవ్రతం ఉంది. ఏ బ్రాహ్మణుడయినా ఇతనిని ఏదైనా అర్థాన్ని యాచించినట్లయితే దానిని అతనికి ఇచ్చివేస్తాడు. దీనిని నీవు సహించగలిగితే అతని ఇష్టాన్ని తీర్చడానికి నీవు ఉత్సాహపడితే అతనిని తీసుకుని వెళ్లు" అన్నాడు. (18)
తేనైవముక్తో జనమేజయస్తం ప్రత్యువాచ
భగవన్ తత్ తథా భవిష్యతీతి ॥ 19
ఇలా అన్న ఆ శ్రుతశ్రవసునితో "మహాత్మా! అలాగే జరుగుతుంది" అన్నాడు జనమేజయుడు. (19)
స తం పురోహితముపాదాయోపావృత్తఃభ్రాతౄనువాచ
మయాయం వృత ఉపాధ్యాయః యదయం బ్రూయాత్ తత్
కార్యమవిచారయద్భిః భవద్భిరితి తేనైవముక్తా భ్రాతరస్తస్య
తథా చక్రుః స తథా భ్రాతౄన్ సందిశ్య తక్షశిలాం
ప్రత్యభిప్రతస్థే తం చ దేశం వశే స్థాపయామాస ॥ 20
జనమేజయుడు ఆ మునికుమారుని సోమశ్రవసుని పురోహితునిగా పొంది తిరిగివచ్చి తన తమ్ములతో "ఇతనిని నేను పురోహితునిగా ఎన్నుకొన్నాను. ఇతడు ఏమి చెప్పినా మీరు ఇంకేమీ ఆలోచించకుండా దానిని చేయండి" అని చెప్పాడు. వారు అలాగే చేశారు. అతడు అలా తమ్ముళ్లకు చెప్పి తక్షశిలపైకి దండెత్తి వెళ్లాడు. దానిని స్వాధీనం చేసుకొన్నాడు. (20)
ఏతస్మిన్నంతరే కశ్చిదృషిః ధౌమ్యో నామాయోదః
తస్య శిష్యాస్త్రయో బభూవు రుపమన్యురారుణీర్వేదశ్చేతి ॥ 21
ఈ రోజులలోనే ఆయోదధౌమ్యుడనే ఒక ఋషి ఉండేవాడు. అతనికి ఉపమన్యువు. ఆరుణి, వేదుడు అనే ముగ్గురు శిష్యులు ఉండేవారు. (21)
స ఏకం శిష్యమారుణిం పాంచాల్యం ప్రేషయామాస
గచ్ఛ కేదరఖండం బధానేతి ॥ 22
గురువు ఒకసారి పాంచాల దేశీయుడైన తన శిష్యుడు ఆరుణిని పొలానికి కంత కట్టమని పంపాడు. (22)
స ఉపాధ్యాయేన సందిష్ట ఆరుణిః
పాంచాల్యస్తత్ర గత్వా తత్ కేదారఖండం
బద్ధుం నాశకత్ సక్లిశ్యమానః అపశ్యదుపాయం భవత్వేవం కరిష్యామి ॥ 23
ఉపాధ్యాయుని ఆజ్ఞతో పాంచాలుడైన ఆరుణి అక్కడికి వెళ్లి పొలానికి కంత కట్టడానికి ప్రయత్నించాడు గాని కట్టలేకపోయాడు. అలా ప్రయత్నిస్తున్న అతనికి ఒక ఉపాయం స్ఫురించి "సరే ఇలా చేస్తాను" అనుకున్నాడు. (23)
స తత్ర సంవివేశ కేదారఖండే శయానే చ తథా
తస్మిన్ తదుదకం తస్థౌ ॥ 24
అతడక్కడ పొలంలో కంతకు అడ్డంగా పడుకున్నాడు. అప్పుడు నీరు నిలిచిపోయింది. (24)
తతః కదాచ్దుపాధ్యాయ ఆయోదో ధౌమ్యః
శిష్యానపృచ్ఛత్ క్వ ఆరుణిః పాంచాల్యో గత ఇతి ॥ 25
ఇలా కొంతసమయం గడిచాక గురువైన ఆయోద ధౌమ్యుడు శిష్యులను "పాంచాలనివాసి యైన ఆరుణి ఎక్కడకు వెళ్లాడు?" అని అడిగాడు. (25)
తే తం ప్రత్యూచుః భగవన్ త్వయైవ ప్రేషితో
గచ్ఛ కేదారఖండం బధానేతి స ఏవముక్తః
తాన్ శిష్యాన్ ప్రత్యువాచ తస్మాత్ తత్ర
సర్వే గచ్ఛామో యత్ర స గత ఇతి ॥ 26
శిష్యులు "మహాత్మా! మీరేకదా పొలానికి కంత కట్టమని పంపారు" అని బదులిచ్చారు. అయితే మనమందరం అతడు వెళ్లిన చోటికే వెడదాం" అన్నారు గురువుగారు శిష్యులతో. (26)
స తత్ర గత్వా తస్యాహ్వానాయ శబ్దం చకార
భో ఆరుణే పాంచాల్య క్వాసి వత్సైహీతి ॥ 27
గురువు అక్కడికి వెళ్లి "పాంచాలా ఆరుణీ! ఎక్కడున్నావు బిడ్డా! రా!' అని అతనిని ఎలుగెత్తి పిలిచాడు. (27)
స తచ్ఛ్రుత్వా ఆరుణిరుపాధ్యాయవాక్యం తస్మాత్
కేదారఖండాత్ సహసోత్థాయ తముపాధ్యాయముపతస్థే ॥ 28
ఆ ఆరుణి ఉపాధ్యాయుని మాట విని వెంటనే పొలంలో నుండి లేచి గురువు వద్దకు వచ్చి నిలిచాడు. (28)
ప్రోవాచ చైనమయమస్మ్యత్ర కేదారఖండే
నిఃసరమాణం ఉదకమవారణీయం సంరోద్ధుం
సంవిష్టో భగవన్ శబ్దం శ్రుత్వైవ సహసా
విదార్య కేదారఖండం భవంతముపస్థితః ॥ 29
"అయ్యా! నేనిక్కడున్నాను" పొలంనుండి ప్రవహించిపోతూ అడ్డుకట్టవేయడానికి వీలులేని ఆ నీటిప్రవాహాన్ని ఆపడానికి దానికి అడ్డంగా పడుకున్నాను. మీ పిలుపు విని వెంటనే ఆ మట్టినంతా తొలగించుకుని ఇటు మీవద్దకు వచ్చాను" (29)
తదభివాదయే భగవంతమాజ్ఞాపయతు
భవాన్ కమర్థః కరవాణీతి ॥ 30
మీ పాదాలకు ప్రణమిల్లుతున్నాను. నేను ఏమి పని చేయాలి. ఆజ్ఞాపించండి" అని వినయంగా అన్నాడు. (30)
స ఏవముక్తః ఉపాధ్యాయః ప్రత్యువాచ యస్మాత్
భవాన్ కేదారఖండం విదార్యోత్థితః తస్మాత్
ఉద్దాలక ఏవ నామ్నా భవాన్ భవిష్యతీ
త్యుపాధ్యాయేనామగృహీతః ॥ 31
ఆరుణి ఇలా అనగానే గురువు "నీవు మట్టిని పెకలించుకొని పైకి లేచావు కాబట్టి ఉద్దాలకుడనే పేరుతోనే నీవు ప్రసిద్ధికెక్కుతావు". అని అనుగ్రహించాడు. (31)
యస్మాచ్చ త్వయా మద్వచవమనుష్ఠితం
తస్మాత్ శ్రేయాఽవాప్స్యసి సర్వే చ తే వేదాః
ప్రతిభాస్యంతి సర్వాణి చ ధర్మశాస్త్రాణీతి ॥ 32
"నీవు నా మాట పాటించావు. కాబట్టి శ్రేయస్సు పొందుతావు. సమస్తవేదాలు, సర్వధర్మశాస్త్రాలు స్వయంగా నీకు స్ఫురిస్తాయి". అని కూడా ఆశీర్వదించాడు. (32)
స ఏవముక్తః ఉపాధ్యాయేనేష్టం దేశం జగామ
అథాపరఃశిష్యస్తస్తైవాయోదస్య
ధౌమ్యస్యోపమన్యుర్నామ ॥ 33
గురువుగారు ఇలా ఆశీర్వదించి పంపగా అతడు తనకు నచ్చిన చోటుకు వెళ్లాడు. ఇక ఆ ఆయోదధౌమ్యుని యొక్క రెండవ శిష్యుడు ఉపమన్యువు అనే వాడున్నాడు. (33)
తం చోపాధ్యాయః ప్రేషయామాస
వత్పోపమన్యో గా రక్షస్వేతి ॥ 34
ఉపాధ్యాయుడు అతనిని "వత్సా! ఉపమన్యూ! గోవులు కాస్తూ ఉండు" అని పంపాడు. (34)
స ఉపాధ్యాయవచనాదరక్షత్ గాః స చాహని
గా రక్షిత్వా దివసక్షయే గురుగృహ
మాగమ్యోపాధ్యాయస్యాగ్రతః స్థిత్వా నమశ్చక్రే ॥ 35
ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా అతడు గోవులను కాస్తున్నాడు. పగలంతా ఆవులను కాసి, సాయంకాలం కాగానే ఇంటికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. (35)
తముపాధ్యాయః పీవానమపశ్యదువాచ్
చైవం వత్సోపమన్యో కేన వృత్తిం
కల్పయసి పీవానసి దృఢమితి ॥ 36
లావుగా బొద్దుగా ఉన్న ఉపమన్యువును చూచి గురువు "వత్సా! ఉపమన్యూ! దేనిని తిని జీవిస్తున్నావు? ఇంత బలంగా, దృఢంగా ఉన్నావు" అని అడిగాడు. (36)
స ఉపాధ్యాయం ప్రత్యువాచ భో భైక్ష్యేణ వృత్తిం
కల్పయామీతి ॥ 37
అతడు ఉపాధ్యాయునికి "అయ్యా! భిక్షావృత్తితో జీవిస్తున్నాను" అని సమాధానమిచ్చాడు. (37)
తముపాధ్యాయః ప్రత్యువాచ మయ్యనివేద్య
భైక్ష్యం నోసయోక్తవ్యమితి। స త థేత్యుక్త్వా భైక్ష్యం
చరిత్వా ఉపాధ్యాయాయ న్యవేదయత్ ॥ 38
దానికి గురువు " నాకు నివేదించకుండా భిక్షాన్నం ఉపయోగించకూడదు" అని చెప్పాడు. 'సరే' అని చెప్పి ఉపమన్యువు భిక్ష తెచ్చి గురువునకు నివేదించాడు. (38)
స తస్మాదుపాధ్యాయః సర్వమేవ భైక్ష్యమగృహ్ణాత్
స తథేత్యుక్త్వా పునరరక్షద్ గాః అహని రక్షిత్వా నిశాముఖే
గురుకులమాగమ్య గురోరగ్రతః స్థిత్వా నమశ్చక్రే ॥ 39
అతడు తెచ్చిన భిక్షనంతా గురువే తీసేసుకోసాగాడు. 'సరే' అని చెప్పి అతడు తిరిగి గోవులను కాయసాగాడు. పగలంతా రక్షించి సాయంకాలం కాగానే గురుకులానికి వచ్చి గురువు ఎదుట నిలబడి నమస్కరించాడు. (39)
తముపాధ్యాయస్తథాసి సీవానమేవ దృష్ట్యోవాచ
వత్సోపమన్యో సర్వమశేషతస్తే భైక్ష్యం గృహ్ణామి
కేనేదానీం వృత్తిం కల్పయసీతి ॥ 40
అయినా అతడు పుష్టిగా, లావుగా ఉండడం చూచిన గురువు "వత్సా! నీ భిక్షాన్నం మొత్తం నేనే తీసేసుకొంటున్నాను కదా! నీవు దేనితో బ్రతుకుతున్నావు?" అని అడిగాడు. (40)
స ఏవముక్త ఉపాధ్యాయం ప్రత్యువాచ భగవతే నివేద్య
పూర్వమపరం చరామి తేన వృత్తిం కల్పయామీతి ॥ 41
అలా అడిగిన గురువుకు ఉపమన్యుడు "మొదట తెచ్చిన భిక్షను తమరికి అర్పించి మళ్లీ రెండవసారి భిక్ష కోసం వెళ్తున్నాను. దానితో జీవితం కొనసాగిస్తున్నాను" అని సమాధానం చెప్పాడు. (41)
తముపాధ్యాయః ప్రత్యువాచ నైషా న్యాయ్యా
గురువృత్తిః అన్యేషామపి భైక్ష్యోపజీవినాం వృత్త్యుప
రోధం కరోషి ఇత్యేవం వర్తమానో లుబ్ధోఽసీతి ॥ 42
అది విన్న గురువు "ఇలా చేయడం న్యాయమైనది, శ్రేష్ఠమైనది కాదు. ఎందుకంటే భిక్షావృత్తి మీదనే జీవించే ఇతరుల వృత్తికి అవరోధం కలిగించిన వాడవు అవుతున్నావు. కనుక ఇలా చేస్తున్న నీవు లుబ్ధుడవు కూడా అవుతావు." (రెండవసారి భిక్షమెత్తడం తగదని భావం) అని చెప్పాడు. (42)
స తథేత్యుక్త్వా గా అరక్షత్ రక్షిత్వా చ పునః ఉపాధ్యాయ
గృహమాగమ్య ఉపాధ్యాయస్యాగ్రతః స్థిత్వా నమశ్చక్రే ॥ 43
అతడు సరే అని గోవులను మేపసాగాడు. అలా వాటిని రక్షించి తిరిగి గురుకులానికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. (43)
తముపాధ్యాయస్తథాపి పీవానమేవ ద్ఱ్రుష్ట్వా పునరువాచ
వత్పోపమన్యో అహం తే సర్వం భైక్షం గృహ్ణామి న చ
అన్యచ్చరసి పీవానసి భృశం కేన వృత్తిం కల్పయసీతి ॥ 44
అయినా అతడు లావుగానే ఉండడం చూసి గురువు మళ్లీ "వత్సా ఉపమన్యూ! నేను నీ భిక్షాన్నం అంతా తీసుకొంటున్నాను. నీవు రెండవసారి ఎక్కడా తిరగడం లేదు. (భిక్షమెత్తడం లేదు) అయినా లావుగానే ఉన్నావు. ఏ విధంగా మనుగడ సాగిస్తున్నావు?" అని అడిగాడు. (44)
స ఏవముక్తస్తముపాధ్యాయం ప్రత్యువాచ భో
ఏతాసాం గవాం పయసా వృత్తిం కల్పయామీతి
తమువాచోపాధ్యాయః నైతన్న్యాయం పయ
ఉపయోక్తుం భవతో మయా నాభ్యనుజ్ఞాతమితి ॥ 45
అలా అడిగిన గురువుగారికి "అయ్యా! ఈ ఆవులపాలు తాగి బ్రతుకుతున్నాను" అని సమాధానమిచ్చాడు ఉపమన్యువు. దానికి గురువు "ఇది న్యాయం కాదు. పాలు ఉపయోగించడానికి నీకు నా అనుమతి లేదు". అన్నాడు. (45)
స తథేతి ప్రతిజ్ఞాయ గా రక్షిత్వా పునరుపాధ్యాయ
గృహమేత్య గురో రగ్రతః స్థిత్వా నమశ్చక్రే ॥ 46
'అలాగే' అని చెప్పి ఉపమన్యువు గోవులను రక్షించి తిరిగి ఉపాధ్యాయుని ఇంటికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. (46)
తముపాధ్యాయః పీవానమేవ దృష్ట్వోవాచ వత్సోపమన్యో
భైక్ష్యం నాశ్నాసి, న చాన్యచ్చరసి, పయో న పిబసి
పీవానసి భృశం, కేనేదానీం వృత్తిం కల్పయసీతి ॥ 47
ఇంకా అతడు బలంగానే ఉండడం చూసిన గురువు "వత్సా! ఉపమన్యు! భిక్షాన్నం తినడం లేదు. రెండవసారి భిక్షకు పోవడంలేదు. పాలు త్రాగడం లేదు. అయినా బలంగానే ఉన్నావు. ఇప్పుడిక ఏమి తిని జీవిస్తున్నావు" అని అడిగాడు. (47)
స ఏవముక్త ఉపాధ్యాయం ప్రత్యువాచ భోః
ఫేనం పిబామి యమిమే వత్సా మాతౄణాం
స్తనాత్ పిబంత ఉద్గిరంతి ॥ 48
ఇలా అడిగిన గురువుకు "అయ్యా! ఈ దూడలు తమ తల్లుల పొదుగుల నుండి పాలు త్రాగేటపుడు పై కెగిసిన నురుగును త్రాగుతున్నాను." అని చెప్పాడు. (48)
తముపాధ్యాయః ప్రత్యువాచ ఏతే త్వదనుకంపయా
గుణవంతో వత్సానాం వృత్త్యుపరోధం
కరోష్యేవం వర్తమానః ఫేనమపి భవాన్ న పాతు
మర్హతీతి స తథేతి ప్రతిశ్రుత్య పునరరక్షద్ గాః ॥ 49
అది విన్న గురువు "ఈ దూడలు చాలా మంచివి. నీ మీద జాలితో ఎక్కువగా నురగను ఎగజిమ్ముతూ ఉండవచ్చు. అలా చేస్తున్న నీవు ఈ దూడల జీవనవృత్తికి ఆటంకం కలిగిస్తున్నావు. కాబట్టి నురుగును కూడా నీవు త్రాగడానికి వీలు లేదు" అన్నాడు. 'అలాగే' అని చెప్పి అతడు మామూలుగా గోవులను కాయడానికి వెళ్లిపోయాడు. (49)
తథా ప్రతిషిద్ధో భైక్ష్యం నాశ్నాతి న చావ్యచ్చరతి
వయో న పిబతి ఫేవం నోపయుంక్తే స కదాచిదరణ్యే ॥ 50
అలా గురువు వద్దంటే ఉపమన్యుడు భిక్షాన్నం తినలేదు. రెండవసారి భిక్షకు పోలేదు. పాలు త్రాగలేదు. పాలనురుగు ఉపయోగించలేదు. ఒకనాడు అడవిలో తిరుగుతూ ఆకలి బాధకు తట్టుకోలేక జిల్లేడు ఆకులను తిన్నాడు. (50)
స తైరర్కపత్రైర్భక్షితైః క్షారతిక్తకటురూక్షైః
తీక్ష్ణవిపాకైః చక్షుష్యుపహతోఽంధో బభూవ తతః
సోఽంధోఽపి చంక్రమ్యమాణః కూపే పపాత ॥ 51
ఆ ఆకులు కారంగా, చేదుగా, వగరుగా, గరుకుగా ఉండి కడుపులో మంట కలిగిస్తాయి. అలాంటి ఆకులను తినడం చేత అతని కళ్లు దెబ్బ తిని అంధుడయి పోయాడు. గ్రుడ్డివాడై తిరుగుతున్న అతడు ఒక కూపంలో పడిపోయాడు. (51)
అథ తస్మిన్ననాగచ్ఛతి సూర్యే చాస్తాచలావలంబిని
ఉపాధ్యాయః శిష్యానవోచత్ - నాయాత్యుపమన్యుః
త ఊచుర్వనం గతో గా రక్షితుమితి ॥ 52
అనంతరం సూర్యుడు అస్తాద్రికి ఏగినా అతడు రాకపోవడంచేత ఉపాధ్యాయుడు ఉపమన్యువు రాలేదేమని శిష్యులను అడిగాడు. వారు గోవులను కాయడానికి వనానికి వెళ్లాడని చెప్పారు. (52)
తానాహ ఉపాధ్యాయో మయోపమన్యుః సర్వతః
ప్రతిషిద్ధః స నియతం కుపితస్తతో నాగచ్ఛతి
చిరం తతోఽన్వేష్య ఇత్యేవముక్త్వా శిష్యెః సార్ధ
మరణ్యం గత్వా తస్యాహ్వానాయ శబ్దం చకార
భో ఉపమన్యో క్వాసి వత్సైహీతి ॥ 53
వారితో గురువు "నేను ఉపమన్యుని అన్నివిధాలా అడ్డుకొన్నాను. అతనికి తప్పకుండా కోపం వచ్చి ఉంటుంది. ఇంతవరకు రాలేదు. చాలాసేపయింది. కాబట్టి వెదకాలి." అని చెప్పి శిష్యులతో సహితంగా అడవికి వెళ్లి అతనిని పిలవడానికి "ఓ ఉపమన్యూ! ఎక్కడున్నావు నీవు? రా నాయనా!" అని ఎలుగెత్తి అరిచాడు. (53)
స ఉపాధ్యాయవచనం శ్రుత్వా ప్రత్యువాచోచ్చైః
అయమస్మిన్ కూపే పతితోఽహమితి -తముపాధ్యాయః
ప్రత్యువాచ కథం త్వస్మిన్ కూపే పతిత ఇతి ॥ 54
అతడు గురువుగారి మాటలు విని "నేనిక్కడ కూపంలో పడిపోయాను" అని గట్టిగా బదులిచ్చాడు. గురువు అతనిని "కూపంలో ఎలా పడ్డావు?" అని అడిగాడు. (54)
స ఉపాధ్యాయం ప్రత్యువాచ - అర్కపత్రాణి భక్షయిత్వా
అంధీభూతోఽస్మ్యతః కూపే పతిత ఇతి ॥ 54
"జిల్లేడు ఆకులను తిని గ్రుడ్డివాడినయ్యాను. అందువల్ల కూపంలో పడ్డాన"ని అతడు గురువుకు సమాధానం ఇచ్చాడు. (55)
తముపాధ్యాయః ప్రత్యువాచ - ఆశ్వినౌ స్తుహి
దేవభిషజౌ త్వాం చక్షుష్మంతం కర్తారావితి - స
ఏవముక్త ఉపాధ్యాయేన ఉపమన్యురశ్వినౌ స్తోతు
ముపచక్రయే దేవావశ్వినౌ వాగ్భిరృగ్భిః ॥ 56
గురువు "అశ్వినీదేవతలను స్తుతించు. వారు దేవవైద్యులు. నీకు చూపు కలిగిస్తారు" అని అతనికి చెప్పాడు. ఇలా చెప్పగానే ఉపమన్యువు ఆ ఇద్దరు అశ్వినీదేవతలను ఋగ్వేదమంత్రాలతో స్తోత్రం చేయసాగాడు. (56)
ప్రపూర్వంగౌ పూర్వజౌ చిత్రభానూ
గిరా వాఽఽశంసామి తపసా హ్యనంతౌ ।
దివ్యౌ సువర్ణౌ విరజౌ విమానౌ
అధిక్షిపంతౌ భువనాని విశ్వా ॥ 57
"అశ్వినీ కుమారులారా! మీరిద్దరూ సృష్టికి పూర్వమే ఉన్నారు. పూర్వజులు, చిత్రభానులు మీరే, తపశ్శక్తి, వాగ్వైభవంతో మిమ్ములను స్తోత్రం చేస్తున్నాను. మీరు అనంతులు. దివ్యులు. మంచిరెక్కలు గల పక్షుల వంటివారు. రజోగుణం, కోపం లేనివారు, విశ్వమంతటా ఆరోగ్యాన్ని విస్తరింప చేస్తారు. (57)
హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ
నాసత్యదస్రౌ సునసౌ వైజయంతౌ ।
శుక్లం వయంతౌ తరసా సువేమౌ
అధివ్యయంతావసితం వివస్వతః ॥ 58
బంగారు రెక్కలుగల అందమైన రెండు పక్షులవలె మీ ఇద్దరు చాలా అందగాళ్లు. పారలౌకికమైన ఉన్నతిని పొందే సాధనాలు కలవారు. నాసత్య దస్రులనే పేళ్లు కలవారు. అందమైన నాసికలు కలవారు. మీరు నిశ్చయంగా విజయాన్ని సాధించగలరు. సూర్యపుత్రులైన మీరు స్వయంగా సూర్యుని రూపం ధరించి రాత్రింబగళ్లు అనే కాలం యొక్క దారాలతో సంవత్సరం అనే వస్త్రాన్ని నేస్తున్నారు. ఆ వస్త్రం ద్వారా వేగంగా దేవయాన పితృయానాలు అనే మార్గాలను పొందిస్తున్నారు. (58)
గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికామ్
అముంచతామశ్వినౌ సౌభగాయ ।
తావత్ సువృత్తావనమంత మాయయా
వసత్తమా గా అరుణా ఉదావహన్ ॥ 59
పరమాత్మ యొక్క కాలశక్తి జీవరూపమైన పక్షిని తనకు ఆహారంగా చేసుకుంది. అశ్వినీకుమారులనే పేరుతో జీవన్ముక్తులై మహాపురుషులైన మీ ఇద్దరు జ్ఞానాన్ని ప్రసాదించి కైవల్యరూపమైన మహాసౌభాగ్యం లభింపచేయడానికి జీవులను కాలమనే బంధాల నుండి విముక్తులను చేస్తున్నారు. మాయతో సహవాసం చేసే అజ్ఞానులైన జీవులు రాగాదివిషయాలతో నిండి ఉన్నంతవరకు తమ ఇంద్రియాలకు లొంగిపోయి తమను తాము శరీరాలకు బద్ధులుగా భావిస్తూ ఉంటారు. (59)
షష్టిశ్చ గావస్త్రిశతాశ్చ ధేనవః
ఏకం వత్సం సువతే తం దుహంతి ।
నానాగోష్ఠా విహితా ఏకదోహనాః
తావశ్వినౌ దుహతో ఘర్మముక్థ్యమ్ ॥ 60
రాత్రింబగళ్లు - కోరికలీడెర్చే మూడువందల అరవై పాలిచ్చే గోవులు. అవి అన్నీ కలిసి సంవత్సరం అనే ఒక దూడను కని దానిని పెంచి పోషిస్తున్నాయి. ఆ దూడ అన్నిటినీ సృష్టిస్తుంది. సంహరిస్తుంది. జిజ్ఞాసువులు పైన చెప్పిన దూడను నిమిత్తమాత్రంగా చేసుకొని ఆ గోవులనుండి విభిన్న ఫలాలనిచ్చే శాస్త్రవిహితమైన కర్మలను పిదుకుతూ ఉంటారు. ఆ కర్మలన్నిటిలో (తత్త్వజ్ఞానేచ్ఛ) ఒక్కటే పిదుకతగినది. పైన చెప్పిన ఆ గోవులను మీ అశ్వినీకుమారులు ఇద్దరే పిదుకుతున్నారు. (60)
ఏకాం నాభిం సప్తశతా అరాః శ్రితాః
ప్రధిష్వన్యా వింశతిరర్పితా అరాః ।
అనేమి చక్రం పరివర్తతేఽజరం
మాయాశ్వినౌ సమనక్తి చర్షణీ ॥ 61
అశ్వినీదేవతలారా! ఈ కాలచక్రానికి సంవత్సరం అనేది ఒక్కటే నాభి. దానిమీద రాత్రిపగలు కలిసి ఏడువందల ఇరవై ఆకులు ఏర్పడి ఉన్నాయి. అవన్నీ పన్నెండు మాసాలనే చుట్టుచక్రంతో కలపబడి ఉన్నాయి. ఈ శాశ్వతమైన మాయామయమైన కాలచక్రం నేమి లేకుండానే అనియత గమనంతో తిరుగుతూ ఇహ పరలోకాలలోని ప్రజలను నశింపచేస్తూ ఉంటుంది. (61)
ఏకం చక్రం వర్తతె ద్వాదశారం
షణ్ణాభిమేకాక్షమృతస్య ధారణమ్ ।
యస్మిన్ దేవా అధివిశ్వే విషక్తాః
తావశ్వినౌ ముంచతం మా విషీదతమ్ ॥ 62
మేషాది పన్నెండు రాసులు ఆకులుగా, ఆరు ఋతువులు ఆరు నాభులుగా, సంవత్సరం ఇరుసుగా ఉన్న ఈ ఒకే ఒక కాలచక్రం అన్నివైపులకు తిరుగుతూ ఉంటుంది. కర్మఫలాన్ని ధరించడానికి ఇదే ఆధారం. ఇందులోనే సంపూర్ణమైన కాలాన్ని అభిమానించే దేవతలందరూ ఉంటారు. నేను పుట్టుక మొదలైన దుఃఖాలతో మిక్కిలి బాధపడుతున్నాను. కనుక మీరిద్దరూ నన్ను ఈ కాలచక్రం బారినుండి విముక్తుని చేయండి. (62)
అశ్వినా విందుమమృతం వృత్తభూయౌ
తిరోధత్తామశ్వినౌ దాసపత్నీ ।
హిత్వా గిరిమశ్వినౌ గా ముదా చరంతౌ
తద్వృష్టి మహ్నా ప్రస్థితౌ బలస్య ॥ 63
మీరిద్దరూ సదాచార సంపన్నులు. మీరు మీ కీర్తితో చంద్రుని, అమృతాన్ని, జలప్రకాశాన్ని కూడా తిరస్కరిస్తున్నారు. ఈ సమయంలో ఆనందంగా విహరిస్తున్నారు. ఆనంద బలాలను వర్షంగా కురిపించడానికే మీ సోదరులిద్దరూ దినమంతా ప్రయాణిస్తూ ఉంటారు. (63)
యువాం దిశో జనయథో దశాగ్రే
సమానం మూర్ధ్ని రథయానం వియంతి ।
తాసాం యాతమృషయోఽనుప్రయాంతి
దేవా మనుష్యాః క్షితిమాచరంతి ॥ 64
అశ్వినీకుమారులారా! మీరిద్దరూ సృష్టి ప్రారంభకాలంలో తూర్పు మొదలైన దశదిశలను వెల్లడి చేస్తూ వాటి గురించిన జ్ఞానాన్ని కలిగించారు. ఆ దిక్కుల శిరసుపై ఉండే అంతరిక్షలోకంలో రథం మీద తిరుగుతూ అన్నిటికీ సమానంగా ప్రకాశాన్ని అందించే సూర్యదేవుని గురించి, ఆకాశాది పంచభూతాలను గురించి కూడా మీరే జ్ఞానాన్ని కలిగించారు. ఆయా దిక్కులలో సూర్యగమనాన్ని చూచి ఋషులు కూడా దానిని అనుసరిస్తున్నారు. దేవతలు, మనుష్యులు (తమ అధికారానుసారం) స్వర్గమర్త్యలోకాల యొక్క భూమికను ఉపయోగిస్తున్నారు. (64)
యునాం వర్ణాన్ వికురుథో విశ్వరూపాన్
తేఽధిక్షియంతే భువనాని విశ్వా ।
తే భానవోఽప్యనుసృతాశ్చరంతి
దేవా మనుష్యాః క్షితి మాచరంతి ॥ 65
అశ్వినీదేవతలారా! మీరు ఈ సమస్తవిశ్వాన్ని పోషించడం కోసం ఎన్నోరంగుల వస్తువులను మిళితం చేసి అన్నిరకాల ఔషధాలను తయారుచేస్తున్నారు. ఆ మెరిసే ఓషధులన్నీ ఎల్లప్పుడూ మిమ్మల్నే అనుసరిస్తూ మీతో పాటు తిరుగుతూ ఉంటాయి. దేవతలు మనుష్యులు తమ తమ అర్హతలను బట్టి స్వర్గమర్త్యలోకాలలో ఉంటూ ఆ ఓషధులను సేవిస్తూ ఉంటారు. (65)
తౌ నాసత్యావశ్వినౌ వాం మహేఽహం
స్రజం చ యాం బిభృథః పుషరస్య ।
తౌ నాసత్యావమృతావృతావృధా -
వృతే దేవాస్తత్ప్రపదే న సూతే ॥ 66
మీ ఇద్దరూ 'నాసత్య' నామంతో ప్రసిద్ధులు. నేను మిమ్మల్నీ, మీరు ధరించిన కమలహారాన్నీ పూజిస్తున్నాను. మీరు అమరులై సత్యాన్ని పోషిస్తూ విస్తరింపచేస్తున్నారు. మీ సహాయం లేనిదే దేవతలు కూడా ఆ సనాతన సత్యాన్ని పొందజాలరు. (66)
ముఖేన గర్భం లభేతాం యువానౌ
గతాసురేతత్ ప్రపదేవ సూతే ।
సద్యో జాతో మాతరమత్తి గర్భః
తావశ్వినౌ ముంచథో జీవసే గాః ॥ 67
యౌవనంలో ఉన్న తల్లిదండ్రులు సంతానోత్పత్తికోసం ముందుగా నోటితో అన్నరూపమైన గర్భాన్ని ధరిస్తున్నారు. తరువాత అన్నమే పురుషులలో వీర్యరూపంగా, స్త్రీలలో రజోరూపంగా మార్పుచెంది జడశరీరం తయారవుతోంది. అనంతరం జన్మించబోయే గర్భస్థ శిశువు పుడుతూనే తల్లి స్తన్యాన్ని తాగుతున్నాడు. పై చెప్పిన రీతిగా సంసారబంధాలలో చిక్కుకుపోయిన జీవులను తాము తత్త్వజ్ఞానం ఉపదేశించి ముక్తులను చేస్తున్నారు. నా బ్రతుకుతెరువు కోసం నా నేత్రేంద్రియాన్ని కూడా రోగముక్తం కావించండి. (67)
స్తోత్తుం న శక్నోమి గుణైర్భవంతౌ
చక్షుర్విహీనః పథి సంప్రమోహః ।
దుర్గేఽహమస్మిన్ పతితోఽస్మి కూపే
యువాం శరణ్యౌ శరణం ప్రపద్యే ॥ 68
నేను మీ గుణాలను కొనియాడుతూ మీ ఇద్దరినీ స్తుతించలేను. నేనిప్పుడు గ్రుడ్డివాడిని. దారిని కూడా సరిగా గుర్తించలేక ప్రమాదపడ్డాను. కనుకనే దుర్గమమైన కూపంలో పడిపోయాను. మీరు శరణాగతవత్సలులు. కాబట్టి మిమ్ము శరణు వేడుకొంటున్నాను." (68)
ఇత్యేనం తేనాభిష్టుతావశ్వినావాజగ్మతురాహతు
శ్పైనం ప్రీతౌ స్వ ఏష తేఽపూసోఽశానైన మితి ॥ 69
అని ఈ రీతిగా ఉపమన్యువు స్తోత్రం చేయగానే అశ్వినీకుమారులిద్దరూ వచ్చి "ఉపమన్యూ! మేము ప్రీతులమైనాము. ఇదిగో నీవు ఈ అప్పం తీసుకో. దీనిని తిను." అన్నారు. (69)
స ఏవముక్తః ప్రత్యువాచ నానృతమూచతు
ర్భగవంతౌ న త్వహమేతమపూసముపయోక్తు
ముత్సహే గురవే అనివేద్యేతి ॥ 70
వారు ఇలా అనగానే ఉపమన్యువు "మీ దేవతలు ఎన్నడూ అసత్యమాడరు. కాని నేను గురువుకు నివేదించకుండా ఈ అప్పాన్ని ఉపయోగించడానికి ఇష్టపడను." అన్నాడు. (70)
తతస్తమశ్వినావూచతుః - ఆవాభ్యాం పురస్తాద్ భవత
ఉపాధ్యాయేనైవమేవాభిష్టుతాభ్యామపూపో దత్తః
ఉపయుక్తః స తేనానివేద్య గురవే త్వమపి తథైవ
కురుష్వ యథా కృతముపాధ్యాయేనేతి ॥ 71
అప్పుడు ఆ ఆశ్వినులిద్దరూ "నాయనా! ఇంతకు ముందు మీ గురువు కూడా ఇలాగే మమ్మల్ని స్తోత్రం చేశాడు. అప్పుడు మేము ఇచ్చిన అప్పాన్ని అతడు తన గురువుకు నివేదించకుండానే ఉపయోగించాడు. మీ గురువు చేసినట్లే నీవు కూడా చేయి" అన్నారు. (71)
స ఏవముక్తః ప్రత్యువాచ! ఏతత్ ప్రత్యనునయే
భవంతా వశ్వినాఉ నోత్సహే ఽహమనివేద్య
గురవేఽపూసముపయోక్తుమితి ॥ 72
వారు ఇలా అనగా ఉపమన్యువు "ఈ విషయమై నేను మీ అశ్వినులిద్దరినీ అనునయించి అర్థిస్తున్నాను. గురువుకు నివేదించకుండా నేను ఈ అప్పాన్ని వినియోగించను" అన్నాడు. (72)
తమశ్వినావాహతుః ప్రీతౌ స్వస్తవానయా
గురుభక్త్యా ఉపాధ్యాయస్య తే కార్ణాయసా దంతా
బవతోఽపి హిరణ్మయా భవిష్యంతి చక్షుష్మాంసచ
భవిష్యసీతి శ్రేయశ్చావాప్స్యసీతి ॥ 73
బదులుగా అశ్వినులు - "నీ ఈ గురుభక్తికి చాలా సంతోషించాం. నీ గురువు దంతాలు నల్లగా ఇనుములా ఉన్నాయి. నీ దంతాలు మాత్రం బంగారంలా ఉంటాయి. నీకు కన్నులు బాగవుతాయి. శ్రేయస్సు కూడా పొందుతావు" అని అన్నారు. (73)
స ఏవముక్తోఽశ్విభ్యాం లబ్ధచక్షురుపాధ్యాయ
సకాశం ఆగమ్యాభ్యవాదయత్ ॥ 74
అశ్వినీకుమారులు ఇలా అనగానే ఉపమన్యువుకు కన్నులు రెండూ కనపడసాగాయి. అతడు గురువు దగ్గరకు వచ్చి నమస్కరించాడు. (74)
ఆచచక్షే చ స చాస్య ప్రీతిమాన్ బభువ ॥ 75
గురువుగారికి విషయమంతా చెప్పాడు. అతడు కూడా చాలా సంతోషించాడు. (75)
ఆహ చైవం యతాశ్వినావాహతుస్తథా
త్వం శ్రేయోఽవాప్స్యసి ॥ 76
ఉపమన్యువుతో ఇలా అన్నాడు. "అశ్వినీకుమారులు చెప్పినట్లుగా నీకు సకలశుభాలూ కలుగుతాయి" (76)
సర్వే చ తే వేదాః ప్రతిభాస్యంతి సర్వాణి చ ధర్మ
శాస్త్రాణీతి ఏషా తస్యాపి పరీక్షోపమన్యోః ॥ 77
నీకు సర్వవేదాలు, సమస్త ధర్మశాస్త్రాలు స్వయంగా స్ఫురిస్తాయి." ఇది ఉపమన్యువును పరీక్షించుట. (77)
అథాపరః శిష్యస్తస్యైవాయోదస్య ధౌమ్యస్య వేదో
నామ తముపాధ్యాయం సమాదిదేశ వత్స వేద
ఇహాస్యతాం తావత్ మమ గృహే కంచిత్ కాలం
శుశ్రూషుణా చ భవితవ్యం శ్రేయస్తే భవిష్యతీతి ॥ 78
ఆ ఆయోదధౌమ్యునికి ఇంకొక శిష్యుడు వేదుడనేవాడు. గురువు అతనిని "వత్సా! వేదుడా! నీవు కొంతకాలం నా ఇంట్లో ఉండు. సేవ చేస్తూ ఉండు. నీకు మేలు కలుగుతుంది." అని ఆదేశించాడు. (78)
స తథేత్యుక్త్యా గురుకులే దీర్ఘకాలం గురుశుశ్రూషణ
పరోఽవసద్ గౌరివ గురుణా ధూర్షు నియోజ్యమానః
శీతోష్ణక్షుత్తృష్ణా దుఃకసహః సర్వత్రాప్రతికూలస్తస్య
మహతా కాలేన గురుః పరితోషం జగామ ॥ 79
అతడు అలాగే అని గురుకులంలో చాలా కాలంపాటు గురుశుశ్రూషను చాలా శ్రద్ధగా చేస్తూ ఉన్నాడు. గురువు అతనిని ఎద్దువలె మిక్కిలి బరువులను మోయడానికి నియోగించేవాడు. వేదుడు శీతోష్ణాలను, ఆకలి దప్పులను సహిస్తూ, అన్ని వేళలా గురువుకు అనుకూలుడై గడుపుతూ ఉన్నాడు. ఇలా చాలా కాలం గడిచాక గురువు సంతోషించాడు. (79)
తత్పరితోషాచ్చ శ్రేయః సర్వజ్ఞతాం చావాస ఏషా
తస్యాపి పరీక్షా వేదస్య ॥ 80
గురువుగారిని సంతోషపెట్టడంవలన వేదునికి శ్రేయస్సు, సర్వజ్ఞత్వం కలిగాయి. ఇది వేదునికి పరీక్ష (80)
స ఉపాధ్యాయేనామజ్ఞాతః సమావృతస్తస్మాద్
గురుకులవాసాద్ గృహాశ్రమం ప్రత్యపద్యత -
తస్యాపి స్వగృహే వసతస్త్రయః శిష్యాః బభూవుః
స శిష్యాన్ న కించిదువాచ కర్మ వా క్రియతాం
గురుశుశ్రూషా చేతి దుఃఖాభిజ్ఞో హి గురుకుల
వాసస్య శిష్యాన్ పరిక్లేశేన యోజయితుం నేయేష ॥ 81
అతడు గురువు అనుమతితో సమావర్తన సంస్కారం పొంది స్నాతకుడై గురుకుల వాసాన్నుండి గృహస్థాశ్రమం ప్రవేశించాడు. అతనికి తన ఇంటిలో ముగ్గురు శిష్యులున్నారు. వారికి గురుశుశ్రూష చేయమని కాని, ఏ పని గాని చెప్పేవాడు కాదు. గురుకులవాసంలోని దుఃఖం తెలిసిన వాడు కాబట్టి శిష్యులకు ఆ కష్టం కలిగించదలచుకోలేదు. (81)
అథ కస్మింశ్చిత్ కాలే వేదం బ్రాహ్మణం
జనమేజయః పౌష్యశ్చ క్షత్రియా వుపేత్య
వరయిత్వా ఉపాధ్యాయం చక్రుతుః ॥ 82
స కదాచిత్ యాజ్యకార్యేణాభిప్రస్థిత
ఉత్తంకనామానం శిష్యం నియోజయామాస ॥ 83
భో! యత్కించి దస్మద్గృహే పరిహీయతే
తదిచ్ఛామ్యహమపరిహీయమానం భవితా
క్రియమాణ మితి స ఏవం ప్రతిసందిశ్య
ఉత్తంకం వేదః ప్రవాసం జగామ ॥ 84
ఇలా ఉండగా కొంతకాలానికి జనమేజయుడు, పౌష్యుడు అనే రాజులిద్దరు వచ్చి బ్రహ్మవేత్త అయిన వేదుని తమ పురోహితునిగా వరించారు. వేదుడు ఒకనాడు యజమానకార్యం గురించి వెడుతూ ఉత్తంకుడనే శిష్యుని అగ్నికార్యం చేయమని నియోగించాడు. "నాయనా! ఉత్తంకా! నా ఇంటిలో ఏ లోటు కలిగినా నీవు దానిని పూరించు" అని ఉత్తంకుని ఆజ్ఞాపించి, వేదుడు ఇతరప్రాంతానికి వెళ్లాడు. (82-84)
అథోత్తుకః శుశ్రూషుర్గురునియోగమనుతిష్ఠమానో
గురుకులే వసతిస్మ స తత్ర వసమాన
ఉపాధ్యాయస్త్రీభిః సహితాభిః ఆహూయోక్తః ॥ 85
పిమ్మట ఉత్తంకుడు శుశ్రూష చేస్తూ గురువుగారి ఆజ్ఞను పాటిస్తూ గురుకులంలో ఉంటున్నాడు. అలా ఉన్న అతనిని ఉపాధ్యాయుని ఇంటిలోని స్త్రీలందరూ కలిసి పిలిచి ఇలా చెప్పారు. (85)
ఉపాధ్యాయానీ తే ఋతుమతీ, ఉపాధ్యాయ
శ్చోషితోఽ స్యా యతాయమృతుర్వంధ్యో న
భవతి తథా క్రియతామేషా విషీదతీతి ॥ 86
"మీ గురుపత్ని ఋతుమతి అయింది. గురువు పరదేశంలో ఉన్నాడు. ఈమె ఋతుకాలం వ్యర్థం కాకుండా ఉండేలా చేయి. ఈ విషయమై గురుపత్ని చాలా విచారిస్తోంది". (86)
ఏవముక్తస్తాః స్త్రియః ప్రత్యువాచ న మయా
స్త్రీణాం వచనాత్ ఇదమకార్యం కరణీయమ్
న హ్యహముపాధ్యాయేన సందిష్టః
అకార్యమపి త్వయా కార్యమితి ॥ 87
ఇలా చెప్పిన ఆ స్త్రీలకు ఉత్తంకుడు "ఆడువారి మాటలు పట్టుకొని ఈ అకార్యాన్ని నేను చేయలేను. అకార్యం చేయాలని నా గురువు నాకు చెప్పలేదు." అని బదులిచ్చాడు. (87)
తస్య పునరుపాధ్యాయః కాలాంతరేణ
గృహమాజగామ తస్మాత్ । ప్రవాసాత్ స తు
తద్వృత్తం తస్యాశేషముపలభ్య ప్రీతిమానభూత్ ॥ 88
కొంతకాలం గడిచాక అతని గురువు పరదేశం నుండి ఇంటికి తిరిగివచ్చాడు. అతడు శిష్యుని యొక్క వృత్తాంతాన్ని అంతటిని తెలుసుకొని సంతోషించాడు. (88)
ఉవాచ చైవం వత్సోత్తంక కిం తే ప్రియం కరవాణీతి
ధర్మతో హి శుశ్రూషితోఽస్మి భవతా తేన ప్రీతిః
పరస్పరేణ నౌ సంవృద్ధా తదనుజానే భవంతం
సర్వానేవ కామానవాప్స్యసి గమ్యతామితి ॥ 89
అతనితో "నాయనా! ఉత్తంకా! నీకు ఏ ఇష్టం చేయగలను? నీవు ధర్మబద్ధంగా సేవించావు నన్ను. అందువలన మన మధ్య పరస్పరం ప్రేమ పెరిగింది. నీకు ఇంటికి వెళ్లడనికి అనుమతిని ఇస్తున్నాను. నీ కోరికలన్నీ తీరుతాయి. వెళ్లు" అన్నాడు గురువు. (89)
స ఏవముక్తః ప్రత్యువాచ కిం తే
ప్రియం కరవాణీతి, ఏవమాహుః ॥ 90
ఇలా అన్న గురువుతో శిష్యుడు "మీకేమి ప్రియం చేయగలను? పెద్దలు చెపుతూ ఉంటారు.--- (90)
యశ్చాధర్మేణ వై బ్రూయాద్ యశ్చాధర్మేణ పృచ్ఛతి ।
తయోరన్యతరః ప్రైతి విద్వేషం చాధిగచ్ఛతి ॥ 91
అధర్మ పూర్వకంగా చెప్పినవాడు, అధర్మపూర్వకంగా అడిగినవాడు వీరిరువురిలో ఒకడు (గురువు లేదా శిష్యుడు) మరణం పొందుతాడు, విద్వేషాన్ని కూడా పొందుతాడు. (91)
సోఽహమనుజ్ఞాతో భవతేచ్ఛామీష్టం గుర్వర్థ
ముపహర్తుమితి తేనైవముక్త ఉపాధ్యాయః
ప్రత్యువాచ వత్సోత్తంక ఉష్యతాం తావదితి ॥ 92
కాబట్టి మీరు అనుమతిస్తే నేను మీ అభీష్టాన్ని గురుదక్షిణరూపంలో కానుకగా ఇవ్వాలనుకొంటున్నాను" - అన్నాడు. అంతట గురువు "వత్సా! ఉత్తంక! అయితే కొన్ని రోజులు ఉండు" అన్నాడు. (92)
స కదాచిదుపాధ్యాయమాహోత్తంక ఆజ్ఞాపయతు భవాన్ ।
కిం తే ప్రియముపాహరామి గుర్వర్థమితి ॥ 93
ఒక రోజున ఉత్తంకుడు ఉపాధ్యాయుని "అయ్యా! మీకు ఇష్టమైన దేనిని గురుదక్షిణ రూపంలో కానుకగా ఇవ్వగలను?" అని మళ్లీ అడిగాడు. (93)
తముపాధ్యాయః ప్రత్యువాచ వత్సోత్తంక
బహుశో మాం చోదయసి గుర్వర్థముపా
హరామీతి తత్ గచ్ఫైనాం ప్రవిశ్యోపాధ్యాయానీం
పృచ్ఛ కిముపాహరామీతి ।
ఏషా యద్ బ్రవీతి తదుపాహరస్వేతి ॥ 94
అప్పుడు గురువు "నాయనా! ఉత్తంకా! నీవు మాటిమాటికి గురుదక్షిణగా కానుకను తెచ్చి ఇస్తానంటున్నావు. అయితే ఇంట్లోకి వెళ్లి మీ గురుపత్నిని "ఏమి కానుక ఇమ్మంటా"రని అడుగు. (94)
ఆమె ఏమి చెపుతుందో అది తెచ్చి ఇమ్ము" అన్నాడు.
స ఏవముక్త ఉపాధ్యాయేనోపాధ్యాయానీ
మపృచ్ఛత్ భగవతి ఉపాధ్యాయేనాస్మ్యను
జ్ఞాతో గృహం గంతుమిచ్ఛామీష్టం తే
గుర్వర్థ ముపహృత్యానృణో గంతుమితి ।
తదాజ్ఞాపయతు భవతీ కిముపాహరామి గుర్వర్థమితి ॥ 95
అతడు ఇలా అనగానే ఉత్తంకుడు గురుపత్ని వద్దకు వచ్చి "పూజ్యులారా! గురువుగారు నన్ను ఇంటికి వెళ్లమని అనుమతించారు. మీకు ఇష్టమైనది గురుదక్షిణగా సమర్పించి ఋణవిముక్తుడనై ఇంటికి వెళ్లాలనుకొంటున్నాను. కాబట్టి గురుదక్షిణగా మీకు ఏ కానుకను తేవాలీ ఆజ్ఞాపించండి" అని అడిగాడు. (95)
సైవముక్తోపాధ్యాయానీ తముత్తంకం ప్రత్యువాచ
గచ్ఛ పౌష్యం ప్రతి రాజానం కుండలే భిక్షితుం
తస్య క్షత్రియయా పినద్ధే ॥ 96
ఉత్తంకుడు ఇలా అడిగిన వెంటనే గురుపత్ని అతనితో "పౌష్యమహారాజు వద్దకు వెళ్లి, అతని భార్య ధరించే కుండలాలను అడుగు. (96)
తే ఆనయస్వ చతుర్థేఽహని పుణ్యకం భవితా
తాభ్యా మా బ్రద్ధాభ్యాం శోభమానా బ్రాహ్మణాన్
పరివేష్టు మిచ్ఛామి తత్ సంపాదయస్వ, ఏవం
హి కుర్వతః శ్రేయో భవితాన్యథా కుతః శ్రేయ ఇతి ॥ 97
వాటిని తీసుకురా. ఈ రోజుకి నాలుగోరోజున పుణ్యక వ్రతం జరుగుతుంది. వాటిని ధరించి అలంకరించుకొని బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలనుకొంటున్నాను. కాబట్టి వాటిని సంపాదించు. అలా చేస్తే నీకు మేలు జరుగుతుంది. లేకుంటే మేలెక్కడిది?" అన్నది. (97)
స ఏవముక్తస్తయా ప్రాతిష్ఠతోత్తంకః స పథి
గచ్ఛన్ అపశ్యద్దృషభమతిప్రమాణం
తమధిరూఢం చ పురుషం అతిప్రమాణమేవ
స పురుష ఉత్తం కమభ్యభాషత ॥ 98
గురుపత్ని ఇలా చెప్పగా ఉత్తంకుడు బయలుదేరాడు. అతడు మార్గమధ్యంలో పెద్ద ఆకారం గల ఎద్దును, దానిని ఎక్కిన మహాకాయుడైన పురుషునీ చూశాడు. ఆ పురుషుడు ఉత్తంకునితో ఇలా అన్నాడు. (98)
భో ఉత్తంకైతత్ పురీషమస్య ఋషభస్య
భక్షియస్వేతి స ఏవముక్తో నైచ్ఛత్ ॥ 99
"ఉత్తంకా! ఈ వృషభ గోమయాన్ని భక్షించు" అని. అతడు చెప్పినదానికి ఉత్తంకుడు ఇష్టపడలేదు. (99)
తమాహ పురుషో భూయో భక్షయస్వోత్తంక
మావిచారయ ఉపాధ్యాయేనాపి తే భక్షితం పూర్వమితి ॥ 100
ఆ పురుషుడు మళ్లీ ఉత్తంకునితో "ఉత్తంకా! తిను ఏమీ ఆలోచించకు, పూర్వం మీ గురువు కూడా తిన్నాడు" అన్నాడు. (100)
స ఏవముక్తో బాధమిత్యుక్త్వా తదా తద్ వృషభస్య ।
మూత్రం పురీషం చ భక్షయిత్వా ఉత్తంకః
సంభ్రమాదుత్థిత ఏవాస ఉపస్పృశ్య ప్రతస్థే ॥ 101
అతడు చెప్పగానే 'మంచిది' అని ఉత్తంకుడు అపుడు ఆ వృషభం యొక్క మూత్రపురీషాలను భక్షించి, తొందరలో ఉండడంచేత నిలుచునే ఆచమనం చేసి బయలుదేరాడు. (101)
యత్ర స క్షత్రియ పౌష్యస్తముపేత్య ఆసీనమపశ్యదుత్తంకః ।
స ఉత్తంకస్తముపేత్య ఆశీర్భిరభినంద్యోవాచ ॥ 102
ఉత్తంకుడు పౌష్యమహారాజు ఉండే చోటికి వెళ్లి ఆసీనుడై ఉన్న అతనిని సమీపించి ఆశీఃపూర్వకంగా అభినందించి ఇలా అన్నాడు. (102)
అర్థీ భవంతముపాగతోఽస్మీతి స ఏనమభివాద్యోవాచ ।
భగవన్ పౌష్యః ఖల్వహం కిం కరవాణీతి ॥ 103
"యాచకుడినై మీ వద్దకు వచ్చాను." అని. అంతట అతడు ఉత్తంకునికి నమస్కరించి "పూజ్యుడా! నేను పౌష్యుడిని. మీకు ఏమి చేయగలను?" అని అడిగాడు. (103)
తమువాచ గుర్వర్థం కుండలయోరర్థేనా
భ్యాగతోఽస్మీతి యే నై తే క్షత్రియయా
పినద్ధే కుండలే తే భవాన్ దాతు మర్హతీతి ॥ 104
ఉత్తంకుడు పౌష్యునితో "గురుదక్షిణ కోసం కుండలాలను కోరి ఇక్కడికి వచ్చాను. మీ భార్య ధరించిన ఆ రెండు కుండలాలను ఇవ్వడానికి నీవు తగుదువు" అన్నాడు. (104)
తం ప్రత్యువాచ పౌష్యః ప్రవిశ్యాంతఃపురం
క్షత్రియా యాచ్యతాం ఇతి స తేనైవముక్తః
ప్రవిశ్యాంతఃపురం క్షత్రియాం నాపశ్యత్ ॥ 105
దానికి సమాధానంగా పౌష్యుడు "అంతఃపురానికి వెళ్లి రాణిని అడుగు" అన్నాడు. అతడు చెప్పినరీతిగా ఉత్తంకుడు అంతఃపురంలో ప్రవేశించాడు. కాని రాణి కనపడలేదు. (105)
స పౌష్యం పునరువాచ న యుక్తం భవతాహ
మనృతే నోపచరితుం న హి తేఽంతః పురే
క్షత్రియా సన్నిహితా నైనాం, పశ్యామి ॥ 106
అతడు మళ్లీ రాజు వద్దకు వచ్చి "నీవు నాతో అబద్ధమాడడం యుక్తంగా లేదు. నీ అంతఃపురంలో రాణి లేదు. నాకు ఆమె కనపడలేదు" అన్నాడు. (106)
స ఏవముక్తః పౌష్యః క్షణమాత్రం విమృశ్యోత్తంకం
ప్రత్యువాచ నియతం భవానుచ్ఛిష్టః స్మర తావన్నహి
సా క్షత్రియా ఉచ్ఛిష్టేన అశుచినా శక్యాద్రష్టుం
పతివ్రతాత్వాత్ సైషా నాశుచేర్దర్శనం ఉపైతీతి ॥ 107
ఉత్తంకుడిలా అనగానే పుష్యుడు క్షణకాలం ఆలోచించి అతనితో "నీవు తప్పకుండా ఎంగిలిముఖంతో ఉండి ఉంటావు. గుర్తు తెచ్చుకో, ఆమె పతివ్రత కాబట్టి ఉచ్ఛిష్టంతో (ఎంగిలితో) అపవిత్రులైన వారు ఆమెను చూడలేరు. అపవిత్రులకు ఆమె కనబడదు" అన్నాడు. (107)
అథైవముక్త ఉత్తంకః స్మృత్వోవాచాస్తే ఖలు
మయోత్థితేన ఉపస్పృష్టం గచ్ఛతా చేతి తం పౌష్యః
ప్రత్యువాచ - ఏష తే వ్యతిక్రమో నోత్థితేనోపస్పృష్టం
భవతీతి శీఘ్రం గచ్ఛతా చేతి ॥ 108
రాజు ఇలా అనగానే ఉత్తంకుడు జ్ఞాపకం తెచ్చుకొని "అవును నేను నిలబడి నడుస్తూ ఆచమనం చేశాను" అన్నాడు. అప్పుడు పౌష్యుడు "ఇదే నీవు చేసిన శాస్త్రవిరుద్ధమైన పని. నిలబడి తొందరతొందరగా నడుస్తూ చేసిన ఆచమనం చేయనట్లే". అన్నాడు. (108)
అథోత్తంకస్తం తథేత్యుక్త్వా ప్రాఙ్ముఖ ఉపవిశ్య
సు ప్రక్షాళితపాణిపాదవదనో నిఃశబ్దాభిరఫేనాభి
రమష్ణాభిః హృద్గతాభిరద్భిః పీత్వా ద్విః పరిమృజ్య
స్వాన్యద్భిరుపస్పృశ్య చాంతఃపురం ప్రవివేశ ॥ 109
అపుడు ఉత్తంకుడు సరే అని కాళ్లు చేతులు ముఖం బాగా కడుగుకొని తూర్పువైపు తిరిగి కూర్చుని శబ్దం చేయని, నురుగు లేని, చల్లని, హృదయం వరకు చేరడానికి యోగ్యమైన నీటిని మూడు మార్లు ఆచమనం చేసి, రెండుమార్లు వ్రేళ్లకొనలతో ముఖాన్ని తుడుచుకొని, నీటిలో ముంచిన వేళ్లతో కన్నులు, ముక్కు మొదలైన ఇంద్రియాలను స్పృశించి, అంతఃపురానికి వెళ్లాడు. (109)
తతస్తాం క్షత్రియామపశ్యత్, సా చ దృష్ట్వై
వో త్తంకం ప్రతి ఉత్థాయాభివాద్యోవాచ స్వాగతం
తే భగవన్నాజ్ఞాపయ కిం కరవాణీతి ॥ 110
అప్పుడతనికి రాణి కనపడింది. ఆమె ఉత్తంకుని చూచి ఎదురువచ్చి నమస్కరించి "పూజ్యా! మీకు స్వాగతం. మీకు నేనేమి చేయగలను? ఆజ్ఞాపించండి" అని పలికింది. (110)
సా తామువాచైతే కుండలే గుర్వర్థం మే భిక్షితే
దాతుం అర్హసీతి సా ప్రీతా తేన తస్య సద్భావేన
పాత్రమయం అనతిక్రమణీయశ్చేతి మత్వా తే
కుండలేఽనముచ్యాస్మై ప్రాయచ్ఛదాహ తక్షకో నాగరాజః
సుభృశం ప్రార్థయతి అప్రమత్తో నేతు మర్హసీతి ॥ 111
ఉత్తంకుడు ఆమెతో "తల్లీ! గురుదక్షిణ కోసం నీ కుండలాలను అడుగుతున్నాను. ఇవ్వగలవు." అన్నాడు. అతని సద్బావానికి ()గురుభక్తికి) ఆమె సంతుష్టురాలయింది. "ఇతడు అర్హుడైన బ్రాహ్మణుడు. ఇవ్వకుండా ఉండకూడదు" అని తలచింది. ఆ కుండలాలను తీసి అతనికి ఇచ్చి "నాగరాజు తక్షకుడు వీటికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అప్రమత్తుడవై తీసికొని వెళ్లు" అని చెప్పింది. (111)
స ఏవ ముక్తస్తాం క్షత్రియాం ప్రత్యువాచ
భగవతి సునిర్వృతా భవ న మాం శక్తస్తక్షకో
నాగరాజో ధర్షయితు మితి ॥ 112
ఈ విధంగా చెప్పిన రాణితో ఉత్తంకుడు "అమ్మా! నీవు నిశ్చింతగా ఉండు. నన్ను తక్షకుడు గెలవలేడు" అన్నాడు. (112)
స ఏవముక్త్వా తాం క్షట్ర్హియామామంత్ర్య
పౌష్యసకాశమాగచ్ఛత్ ఆహ చైవం భోః పౌష్య
ప్రీతోఽస్మీతి తముత్తంకం పౌష్యః ప్రత్యువాచ ॥ 113
అని చెప్పి అతడు రాణిని వీడ్కొని పౌష్యుని వద్దకు వచ్చాడు. "పౌష్యమహారాజా! చాలా సంతోషించాను" అని చెప్పాడు. అతనితో పౌష్యుడు ఇలా అన్నాడు. (113)
బగవంశ్చిరేణ పాత్టమాపాద్యతే భవాంశ్చ గుణవానతిథిః
తదిచ్ఛే శ్రాద్ధం కర్తుం క్రియతాం క్షణ ఇతి ॥ 114
"పూజ్యుడా! చాలాకాలానికి యోగ్యుడు దొరికాడు. మీరు గుణవంతులైన అతిథులు. కాబట్టి శ్రాద్ధకర్మ చేయాలనుకొంటున్నాను. ఆహ్వానాన్ని మీరు అంగీకరించండి." (114)
తముత్తంకః ప్రత్యువాచ కృతక్షణ
ఏవాస్మి శీఘ్రమిచ్ఛామి యథోపపన్నమన్న
ముపస్కృతం భవతేతి స తథేత్వుక్త్వా
యథోపపన్నే నాన్నేనైనం భోజయామాస ॥ 115
ఉత్తంకుడు "నేను ఆహ్వానాన్ని అంగీకరించాను. కాని శీఘ్రంగా జరగాలని కోరుకుంటున్నాను. మీవద్ద సిద్ధంగా ఉన్న సుసంస్కృతమైన పరిశుద్ధమైన అన్నాన్ని వడ్డించండి." అన్నాడు. రాజు అలాగే అని సిద్ధంగా ఉన్న అన్నంతోనే అతనికి భోజనం వడ్డించాడు. (115)
అథోత్తంకః సకేశం శీతమన్నం దృష్ట్వా అశుచ్యేతదితి
మత్వా తం పౌష్యమువాచ యస్మాన్మే
ఽశుచ్యన్నం దదాసి తస్మాదంభో భవిష్యసీతి ॥ 116
ఉత్తంకుడు అన్నం కేశదుష్టమై చల్లగా ఉండడం చూసి అపరిశుద్ధమని తలచి ఆ పౌష్యుని ఉద్దేశించి "నాకు అశుచి అయిన అన్నం పెట్టావు కనుక అంధుడివి అవుతావు" అన్నాడు. (116)
తం పౌష్యః ప్రత్యువాచ యస్మాత్త్వమప్యదుష్ట
మన్నం దూషయసి త్స్మాత్త్వమనపత్యో
భవిష్యసీతి తముత్తంకః ప్రత్యువాచ ॥ 117
దానికి బదులుగా పౌష్యుడు కూడా "నీవు శుద్ధమయిన అన్నాన్ని కూడా దూషిస్తున్నావు. కనుక అనపత్యుడవవుతావు" అని శపించాడు. అప్పుడు ఉత్తంకుడు రాజుతో ఇలా అన్నాడు. (117)
న యుక్తం భవతాన్నమశుచి దత్వా ప్రతిశాపం
దాతుం తస్మాదన్నమేవ ప్రత్యక్షీకురు తతః పౌష్యస్తదన్న
మశుచి దృష్ట్వా తస్యాశుచిభావ మపరోక్షయామాస ॥ 118
"మీరు అపవిత్రమైన అన్నంపెట్టి పైగా ప్రతిశాపం ఇవ్వడం ఉచితంగా లేదు. అందుచేత ముందు అన్నాన్ని పరీక్షించండి" అన్నాడు. వెంటనే పౌష్యుడు ఆ అన్నం చూచి అది అపవిత్రమైనదిగా తెలుసుకొని దానికి కారణాన్ని ఆరా తీశాడు. (118)
అథ తదన్నం ముక్తకేశ్యా స్త్రియా యత్ కృత
మనుష్ణం సకేశం చాశుచ్యేతదితి మత్వా
తమృషిముత్తంకం ప్రసాదయామాస ॥ 119
ఆ అన్నాన్ని జుట్టు విరబోసుకున్న స్త్రీ తయారుచేసిందని, అప్పటికే చాలాసేపు కావడం వలన చల్లారిపోయిందనీ తెలుసుకొన్నాడు. అందుకని అది తలవెంట్రుకతో కూడి అశుచి అయిందని తలచి ఆ ఉత్తంకమహర్షిని ఇలా ప్రార్థించాడు. (119)
భగవన్నేత దజ్ఞానాదన్నం సకేశముపాహృతం
శీతం తత్ క్షామయే భవంతం న భవేయ
మంధ ఇతి తం ఉత్తంకః ప్రత్యువాచ ॥ 120
"మహాత్మా! కేశదుష్టమయిన చల్లనైన అన్నం తెలియకుండానే మీకు వడ్డించాను. తమరు క్షమించండి, నేను గ్రుడ్డివాడిని కాలేను." అన్నాడు. అతనికి ఉత్తంకుడు ఇలా ప్రతి సమాధానమిచ్చాడు. (120)
న మృషా బ్రవీమి భూత్వా త్వమంధో న చిరాదనంధో
భవిష్యసీతి మమాపి శాసో భవతా దత్తో న భవేదితి ॥ 121
"రాజా! నేను అసత్యమాడను. నీవు అంధుడవై అచిరకాలంలోనే శాపవిముక్తుడవు అవుతావు. నీవు నాకు ఇచ్చిన శాపం కూడా అలాగే జరుగకుండేటట్లు చెయ్యి" అన్నాడు. (121)
తం పౌష్యః ప్రత్యువాచ న చాహం శక్తః శాపం
ప్రత్యాదాతుం న హి మే మన్యురద్యాప్యుపశమం
గచ్ఛతి కిం చైతద్ భవతా న జ్ఞాయతే యథా ॥ 122
అతనికి పౌష్యుడు ఇలా సమాధానమిచ్చాడు - "శాపం మరల్చడానికి నేను అశక్తుడను. నా కోపం ఇంకా చల్లారలేదు. అయినా మీకు ఈ విషయం తెలియనిదా? (122)
నవనీతం హృదయం బ్రాహ్మణస్య
వాచి క్షురో నిహితస్తీక్ష్ణధారః
తదుభయమేతద్ విపరీతం క్షత్రియస్య
వాఙ్మవనీతం హృదయం తీక్ష్ణధారమ్ ఇతి ॥ 123
బ్రాహ్మణుని మనసు వెన్న (వెంటనే కరిగిపోతుంది) వాక్కు మాత్రం పదునైన అంచుగల కత్తి. కాని ఈ రెండూ క్షత్రియుని యందు వ్యతిరేకం. వాక్కు నవనీతం. హృదయం పదును. (123)
తదేవం గతే న శక్తోఽహం తీక్ష్ణహృదయత్వాత్ తం
శాపమన్యథాకర్తుం గమ్యతామితి తముత్తంకః
ప్రత్యువాచ భవితాహమన్నస్యాశుచిభావమాలక్ష్య
ప్రత్యనునీతః ప్రాక్ చ తేఽభిహితమ్ ॥ 124
యస్మాద్దుష్టనున్నం దూషయసి తస్మాదనపత్యో
భవిష్యసీతి దుష్టే చాన్నే నైష మమ శాపో భవిష్యతీతి ॥ 125
ఇలాంటి స్థితిలో తీక్ష్ణహృదయం కలిగి ఉండడం వలన ఆ శాపాన్ని మరొకలా మార్చడానికి నేను అశక్తుడను. వెళ్లిరా" ఇలా అనగానే ఉత్తంకుడు "అన్నం అశుచిగా ఉందని చూచిన నీవు నన్ను బ్రతిమాలావు. కాని అంతకుముందే నీవు అన్నావు. "దుష్టం కాని అన్నాన్ని దూషించావు కాబట్టి అనపత్యుడవు అవుతావు" అని, అన్నం దుష్టమే కాబట్టి ఈ శాపం నాకు తగులదు. (124,125)
సాధయామస్తావదిత్యుక్త్వా ప్రాథిష్ఠతోత్తంకస్తే
కుండలే గృహీత్వా సోఽపశ్యదథ పథి నగ్నం
క్షపణకమాగచ్ఛంతం ముహుర్ముహు
ర్దృశ్యమానమదృశ్యమానం చ ॥ 126
ఇక మేము వెళ్తున్నాం అని చెప్పి ఉత్తంకుడు ఆ రెండు కుండలాలను తీసుకుని బయలుదేరాడు. దారిలో ఒక నగ్నక్షపణకుడు (దిగంబరుడైన భిక్షువు) ఒకసారి కనపడుతూ ఒకసారి కనపడకుండా మాటిమాటికి తన్ను వెన్నంటి రావడం ఉత్తంకుడు గమనించాడు. (126)
అథోత్తంకస్తే కుండలే సంన్యస్య భూమావుదకార్థం
ప్రచక్రమే ఏతస్మిన్నంతరే స క్షపణకస్త్వరమాణ
ఉపనృత్య తే కుండలే గృహీత్వా ప్రాద్రవత్ ॥ 127
ఇలా కొంత దూరం వెళ్లాక ఉత్తంకుడు ఉదకకృత్యాలు (స్నానసంధ్యావందనాదులు) నిర్విర్తించడానికి ఆ కుండలాలను నేలపై పెట్టి వెళ్లి వాటిని చేసుకోసాగాడు. ఈ లోగా ఆ క్షపణకుడు త్వరగా సమీపించి ఆ కుండలాలను తీసుకొని పారిపోయాడు. (127)
త ముత్తంకోఽభిసృత్య కృతోదకకార్యః
శుచిః ప్రయతో నమో దేవేభ్యో గురుభ్యశ్చ
కృత్వా మహతా జవేన తమన్వయాత్ ॥ 128
ఉత్తంకుడు నీటిని సమీపించి అర్ఘ్య ప్రదానం నిర్వర్తించి శుచియై, నియతితో దేవతలకు, గురువులకు నమస్సులు అర్పించి మిక్కిలి వేగంతో అతనిని వెంబడించాడు. (128)
తస్య తక్షకో దృఢమాసన్నః స తం జగ్రాహ
గృహీత మాత్ర స తద్రూపం విహాయ తక్షక
స్వరూపం కృత్వా సహసా ధరణ్యాం
వివృతం మహాబిలం ప్రవివేశ ॥ 129
వెంబడించిన అతనికి తక్షకుడు అతిసమీపానికి వచ్చాడు. అతడు అతనిని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే అతడు ఆ రూపాన్ని విడిచి తక్షకరూపాన్ని ధరించి వెంటనే నేల మీద కనిపిస్తున్న ఒక పెద్ద కన్నంలో దూరిపోయాడు. (129)
ప్రవిశ్య చ నాగలోకం స్వభవన
మాగచ్ఛత్ అథోత్తంకస్తస్యాః క్షత్రియాయా
వచః స్మృత్వా తం తక్షకం అస్వగచ్ఛత్ ॥ 130
తక్షకుడు నాగలోకానికి చేరుకొని తన మందిరానికి వెళ్లిపోయాడు. అంతట ఉత్తంకుడు ఆ రాణి మాటలు గుర్తుకుతెచ్చుకుని ఆ తక్షకుని అనుసరించాడు. (130)
స తద్ బిలం దండకాష్ఠేన చఖాన న చాశకత్ తం
క్లిశ్యమాన మింద్రోఽపశ్యత్ స వజ్రం ప్రేషయామాస ॥ 131
అతడు ఆ బిలాన్ని ఒక కట్టెతో తవ్వాడు గాని ఫలితం లేకపోయింది. అలా కష్టపడుతున్న అతనిని ఇంద్రుడు చూచాడు. తన వజ్రాయుధాన్ని పంపించాడు. (131)
గచ్ఛాస్య బ్రాహ్మణస్య పాహాయ్యం కురుష్వేది అథ
వజ్రం దండకాష్ఠమనుప్రవిశ్య తద్ బిలమదారయత్ ॥ 132
ఇంద్రుడు వజ్రాయుధంతో "వెళ్లు. ఆ బ్రాహ్మణునికి సహాయం చేయి" అన్నాడు. వజ్రం కట్టెలో ప్రవేశించి ఆ బిలాన్ని తవ్వేసింది. (132)
తముత్తంకోఽమవివేశ తేనైన బిలేన ప్రవిశ్య
చ తం నాగలోకమపర్యంత మనేక విధ ప్రాసాద
హర్మ్యవలభీనిర్యూహ శత సంకుల
ముచ్చావచక్రీడాశ్చర్య స్థానావకీర్ణమపశ్యత్ ॥ 133
ఆ బిలంలోనికి ఉత్తంకుడు ప్రవేశించాడు. అలా బిలం ద్వారా లోనికి ప్రవేశించిన అతడు నాగలోకాన్ని చూశాడు. అది ఎల్లలు లేనిది. అనేక రకాలైన ప్రాసాదాలతో భవనాలతో, ముంజూరులు కల పెద్ద పెద్ద మండపాలతో, వందలకొద్దీ ద్వారబంధాలతో సంకులమై ఉన్నది. ఆశ్చర్యకరమైన చిన్న, పెద్ద క్రీడాస్థానాలతో వ్యాపించి ఉన్నది. (133)
స తత్ర నాగాంస్తా వస్తువదేభిః శ్లోకైః
య ఐరావతరాజానః సర్పాః సమితిశోభనాః ।
క్షరంత ఇవ జీమూతాః సవిద్యుత్పవనేరితాః ॥ 134
అతడక్కడ ఆ నాగులందరినీ ఈ శ్లోకాలతో స్తోత్రం చేశాడు. ఐరావతం మొదలైనవి రాజులుగా ఉన్నవి, యుద్ధాలతో రాణించేవి, మెరుపుచేత వాయువుచేత ప్రేరేపించబడి వర్షించే నల్లని మేఘాలవలె సంచరించేవి అయిన సర్పాలు (క్రింది శ్లోకంతో అన్వయం) (134)
సురూపా బహురూపాశ్చ తథా కల్మాషకుండలాః ।
ఆదిత్యవన్నాకపృష్ఠే రేజురైరావతోద్భవాః ॥ 135
అందమైన ఆకృతులు కలవి. అనేక రూపాలు ధరింపగలిగినవి. చిత్రవర్ణాలకుండలాలు కలిగినవి. ఆ ఐరావతం నుండి ఉద్భవించిన నాగులు ఆకాశంలో ఆదిత్యునివలె ప్రకాశిస్తున్నాయి. (135)
బహూని నాగవేశ్మాని గంగాయాస్తీర ఉత్తరే ।
తత్రస్థానపి సంస్తౌమి మహతః పన్నగానహమ్ ॥ 136
గంగాతీరానికి ఉత్తరంగా అనేకమైన నాగనివాసాలు ఉన్నాయి. అక్కడ నివసించే గొప్ప గొప్ప నాగులను కూడా నేను స్తోత్రం చేస్తున్నాను. (136)
ఇచ్ఛేత్ కోఽర్కాంశుసేనాయాం చర్తుమైరావతం వినా ।
శతాన్యశీతిరక్షా చ సహస్రాణి చ వింశతిః ॥ 137
సర్పాణాం ప్రగ్రహా యాంతి ధృతరాష్ట్రో యదైజతి ।
యే చైన ముపసర్పంతి యే చ దూరపథం గతాః ॥ 138
అహమైరావత జ్యేష్ఠభ్రాతృభ్యోఽకరవం నమః ।
యస్య వాసః కురుక్షేత్రే ఖాండవే చాభవత్ పురా ॥ 139
తం నాగరాజమస్తౌషం కుండలార్థాయ తక్షకమ్ ।
తక్షకశ్చాశ్వసేనశ్చ నిత్యం సహచరావుభౌ ॥ 140
కురుక్షేత్రం చ వసతాం నదీమిక్షుమతీమను ।
జఘన్యజస్తక్షకస్య శ్రుతసేనేతి యః శ్రుతః ॥ 141
అవసద్ యో మహద్యుమ్ని ప్రార్థయన్ నాగముఖ్యతామ్ ।
కరవాణి సదా చాహం నమస్తస్మై మహాత్మనే ॥ 142
ఐరావతం తప్ప సూర్యుని కిరణసైన్యంలో విహరించాలని కోరుకొనేవారు వేరెవరు? ఐరావతనాగుని సోదరుడు ధృతరాష్ట్రుడు సూర్యునితో కలిసి వెళ్లేటపుడు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది సర్పాలు సూర్యుని గుర్రాలకు కళ్లెములుగా అమరి ఉంటాయి. వారితో కలిసి, దూరమార్గాలకు వెళ్లే ఐరావతం యొక్క సోదరులకు నేను నమస్కరిస్తున్నాను. పూర్వం కురుక్షేత్రంలోను, ఖాండవంలోను ఉండే నాగరాజు తక్షకుని కుండలాల కొఱకు స్తుతిస్తున్నాను. తక్షకుడు, అశ్వసేనుడు నిత్యం సహచరులు. ఈ ఇద్దరూ కురుక్షేత్రంలో ఇక్షుమతీనదీ తీరంలో నివసిస్తూ ఉండేవారు. తక్షకుని చిన్న తమ్ముడు శ్రుతసేనుడనే వాడు పాతాళలోకంలో నాగరాజు పదవి పొందేందుకు సూర్యదేవుని ఉపాసిస్తూ కురుక్షేత్రంలో నివసిస్తూ ఉన్నాడు. ఆ మహాత్ములు అందరికీ నేను సదా నమస్కరిస్తున్నాను. (137-142)
ఏవం స్తుత్వా స విప్రర్షిః ఉత్తంకో భుజగోత్తమాన్ ।
నైవ తే కుండలే లేభే తతశ్చింతా ముపాగమత్ ॥ 143
ఈ రీతిగా నాగముఖ్యులను స్తుతించి కూడా బ్రహ్మర్షి అయిన ఉత్తంకుడు కుండలాలను పొందలేకపోయాడు. అతనికి మిక్కిలి చింత కలిగింది. (143)
ఏవం స్తువన్నపి నాగాన్ యదా తే కుండలే నాలభత
తదాపశ్యత్ స్త్రియౌ తంత్రే అధిరోప్య సువేమే పటం
వయంత్యౌ తస్మింస్తంత్రే క్ఱ్రుష్ణాః సితాశ్చ తంతవశ్చక్రం
చాపశ్యత్ ద్వాదశారం షడ్భిః కుమారైః పరివర్త్యమానం
పురుషం చాపశ్యదశ్వం చ దర్శనీయమ్ ॥ 144
స తాన్ సర్వాంస్తుష్టావ ఏభిర్మంత్రవదేవ శ్లోకైః ॥ 145
నాగులను ఈ రీతిగా స్తోత్రం చేస్తున్నప్పటికీ ఆ రెండు కుండలాలను పొందలేక పోయిన సమయంలో ఉత్తంకుడు మగ్గంమీద పడుగునూలు ఎక్కించి బట్టనేస్తున్న ఇద్దరు స్త్రీలను చూచాడు. ఆ పడుగునూలులో తెలుపు నలుపు పోగులున్నాయి. పన్నెండాకులు గల ఒక చక్రాన్ని కూడా చూశాడు. ఆ చక్రాన్ని ఆరుగురు కుమారులు తిప్పుతున్నారు. ఒక మహాపురుషుని, అందమైన ఒక గుఱ్ఱాన్ని కూడా చూశాడు. అతడు వారందరినీ మంత్రాలవంటి ఈ శ్లోకాలతో స్తుతించారు. (144,145)
త్రీణ్యర్పివ్యత్ర శతాని మధ్యే
షష్టిశ్చ నిత్యం చరతి ధ్రువేఽస్మిన్
చక్రే చతుర్వింశతి పర్వయోగే
షడ్ వై కుమారాః పరివర్తయంతి ॥ 146
శాశ్వతమై నిత్యమూ తిరుగుతూ ఉండే ఈ కాలచక్రంలో మూడువందల అరవై ఆకులు, ఇరవైనాలుగు పర్వాలు ఉన్నాయి. దీనిని ఆరుగురు కుమారులు తిప్పుతున్నారు. (146)
తంత్రం చేదం విశ్వరూపే యువత్యౌ
వయతస్తంతూన్ సతతం వర్తయంత్యౌ ।
కృష్ణాన్ సితంశ్చైవ వివర్తయంత్యౌ
భుతాన్యజస్రం భువనాని చైవ ॥ 147
సంపూర్ణవిశ్వం యొక్క స్వరూపమైన స్త్రీలు నల్లని తెల్లని పోగులను అటు ఇటు మార్చి కదుపుతూ (ఈ వాసనాబంధరూపమైన) వస్త్రాన్ని నేస్తున్నారు. అనగా సమస్త భువనాలను, సర్వప్రాణులను వీరే చలింపచేస్తున్నారని భావం. (147)
వజ్రస్య భర్తా భువనస్య గోప్తా
వ్ఱ్రుత్రస్య హంతా నముచేర్నిహంతా ।
కృష్ణే వసానో వసనే మహాత్మా
సత్యానృతే యో వివినక్తి లోకే ॥ 148
యో వాజినం గర్భమపాం పురాణం
వైశ్వానరం వాహనమభ్యుపైతి ।
నమోఽస్తు తస్మై జగదీశ్వరాయ
లోకత్రయేశాయ పురందరాయ ॥ 149
వజ్రాయుధాన్ని ధరించి, త్రిలోకాలను రక్షించే ఇంద్రునకు నమస్కారం. వృత్రాసురుని నముచిదానవుని సంహరించి నల్లని రెండు వస్త్రాలను ధరించి లోకంలో సత్యాసత్యాలను వివేచింపగలిగిన ఇంద్రునకు నమస్కారం. పూర్వం జలగర్భం నుండి ఉద్భవించిన వైశ్వానరరూపమైన గుర్రాన్ని వాహనంగా పొందిన, లోకత్రయాధిపతి, జగదీశ్వరుడయిన పురందరునికి నమస్కారం. (148-149)
తతః స ఏవం పురుషః ప్రాహ ప్రీతోఽస్మి తేహమనేన
స్తోత్రేణ కిం తే ప్రియం కరవాణితి స తమువాచ ॥ 150
అపుడు ఆ పురుషుడు ఉత్తంకునితో "నీ ఈ స్తోత్రం చేత మిక్కిలి ప్రీతుడనైనాను. నీకేమి ప్రియం చేయగలను?" అని అడిగాడు. అతడు ఆ పురుషునితో ఇలా అన్నాడు. (150)
నాగా మే శమీయురితి స చైవం పురుషః పునరువాచ-
ఏతమశ్వమపానే ధమస్వేతి ॥ 151
"నాగులందరూ నాకు వశమగుదురుగాక". ఇది విన్న ఆ పురుషుడు తిరిగి ఉత్తంకునితో "ఈ గుఱ్ఱం యొక్క అపానప్రదేశంలో గట్టిగా ఊదు" అన్నాడు. (151)
తతోఽశ్వస్యాపాన మధమత్ తతోఽశ్వాద్ధమ్యమానాత్
సర్వస్రోతోభ్యః పావకార్చిషః సధూమా నిష్పేతుః ॥ 152
ఉత్తంకుడలాగే అశ్వం యొక్క అపానంలో ఊదాడు. అలా ఊదగానే అశ్వం యొక్క శరీరంలోని అన్ని రంధ్రాలనుండి పొగతో కూడిన అగ్ని జ్వాలలు వెలువడ్డాయి. (152)
తాభిర్నాగలోక ఉపధూపితే ఽథ సంభ్రాంత
స్తక్షకోఽగ్నే స్తేజోభయాద్ విషణ్ణః కుండలే గృహీత్వా
సహసా భవనాన్నిష్క్రమ్య ఉత్తంకమువాచ ॥ 153
ఆ ధూమాగ్ని జ్వాలల చేత నాగలోకమంతా పొగ కమ్మేసింది. తొట్రుపడిన తక్షకుడు అగ్నితేజస్సునకు భయపడి విషణ్ణుడై కుండలాలను తీసుకుని వెంటనే భవనం నుండి వెలుపలికి వచ్చి ఉత్తంకునితో ఇలా అన్నాడు. (153)
ఇమే కుండలే గృహ్ణాతు భవానితి స తే ప్రతిజగ్రాహ
ఉత్తంకః ప్రతిహ్ఱ్రుహ్య చ కుండలే అచింతయత్ ॥ 154
"కుండలాలు ఇవిగో. తీసుకోండి మీరు" అన్నాడు. ఆ ఉత్తంకుడు వానిని తీసుకొన్నాడు. తీసుకొని ఆలోచించాడు. (154)
అద్య తత్ పుణ్యకముపాధ్యాయాన్యా
దూరం చాహమభ్యాగతః స కథం సంభావయేయమిట్జి
తత ఏవం చింతయానమేవ స పురుష ఉవాచ ॥ 155
"నేడే గురుపత్ని యొక్క పుణ్యకవ్రతం. నేను చాలా దూరం వచ్చాను. ఆమెను ఎలా సత్కరించగలను?" ఇలా అనుకొంటున్న అతనితో ఆ పురుషుడు ఇలా అన్నాడు. (155)
ఉత్తంక ఏనమేవ్శ్వమధిరోహ త్వాం క్షణేనైవ
ఉపాధ్యాయకులం ప్రాపయిష్యతీతి ॥ 156
ఉత్తంకా! ఈ గుర్రాన్నే ఎక్కు, నిన్ను క్షణకాలంలో గురుకులాన్ని చేర్చుతుంది." అని. (156)
స తథేత్యుక్త్వా తమశ్వమధిరుహ్య ప్రత్యాజగామ
ఉపాధ్యాయకులమ్ ఉపాధ్యాయానీ చ స్నాతా కేశా
నావాసయంతీ ఉపవిష్టా ఉత్తంకో
నాగచ్ఛతీతి శాపాయాస్య మనో దధౌ ॥ 157
అతడు అలాగే అని చెప్పి ఆ గుఱ్ఱాన్ని ఎక్కి గురుకులానికి వచ్చి చేరాడు. గురుపత్ని స్నానం చేసి కురులు ఆరబెట్టుకొంటూ కూర్చుని ఉత్తంకుడింకా రాలేదని అతనికి శాపమివ్వాలని మనసులో అనుకుంటోంది. (157)
అథ తస్మిన్నంతరే స ఉత్తంకః ప్రవిశ్య ఉపాధ్యాయకులమ్
ఉపాధ్యాయానీమభ్యవాదయత్ తే చాస్యై కుండలే
ప్రాయచ్ఛత్ సా చైవం ప్రత్యువాచ ॥ 158
ఈ లోగానే ఉత్తంకుడు గురుకులాన్ని ప్రవేశించి గురుపత్నికి నమస్కరించాడు. ఆ కుండలాలను ఆమెకిచ్చాడు. ఆమె అతనితో ఇలా అన్నది. (158)
ఉత్తంక దేశే కాలేఽభ్యాగతః స్వాగతం తే
వత్స! త్వమనాగసి మయా న శప్తః
శ్రేయస్తవోపస్థితం సిద్ధి మాప్నుహీతి ॥ 159
"ఉత్తంకా! నీవు సరియైన సమయంలో సరియైన చోటుకి వచ్చావు. వత్సా! నీకు స్వాగతం. నీవు అపరాధం చేయలేదు కనుక నేను శపించలేదు. నీకు శుభాలు కలుగుతాయి. సిద్ధిని పొందుతావు." (159)
అథోత్తంక ఉపాధ్యాయ మభ్యవాదయత్ । తముపాధ్యాయః ప్రత్యు
వాచ వత్సోత్తంక స్వాగతంతే కించిరం కృతమితి ॥ 160
తరువాత ఉత్తంకుడు గురువుకు నమస్కరించాడు. గురువు వెంటనే "ఉత్తంకా! నీకు స్వాగతం - ఇంతవరకు ఏంచేశావు? (160)
తముత్తంక ఉపాధ్యాయం ప్రత్యువాచ
భోస్తక్షకేణ మే నాగరాజేన విఘ్నః
కృతోఽస్మిన్ కర్మణి తేనాస్మి నాగలోకం గతః ॥ 161
అపుడు ఉత్తంకుడు ఉపాధ్యాయునికి ఇలా బదులిచ్చాడు- "అయ్యా! నాగరాజైన తక్షకునివలన నాకు విఘ్నం కలిగింది. ఈ పనిలో అతనివలన నేను నాగలోకం వెళ్లాను. (161)
తత్ర చ మయా దృష్టే స్త్రియౌ తంత్రేఽధిరోప్య
పటం వయంత్యౌ తస్మింశ్చ కృష్ణాః
సితాశ్చ తంతవః కిం తత్ ॥ 162
అక్కడ నేను ఇద్దరు స్త్రీలను చూశాను. వారు మగ్గం మీద పడుగుతో బట్ట నేస్తున్నారు. అందులో నలుపు, తెలుపు పోగులున్నాయి. అదంతా ఏమిటి? (162)
తత్ర చ మయా చక్రం దృష్టం ద్వాదశారం
షట్ చైవం కుమారాః పరివర్తయంతి తదపి
కిమ్ పురుషశ్చాపి మయా దృష్టః స చాపి కః
అశ్వశ్చాతిప్రమాణో దృష్టం స చాపి కః ॥ 163
అక్కడే నేను పన్నెండు ఆకులు గల చక్రాన్ని చూశాను. అరుగురు కుమారులు దానిని తిప్పుతున్నారు. అది ఏమిటి? నేను చూసిన పురుషుడు ఎవడు? పెద్దదయిన గుఱ్ఱం ఒకటి కనపడింది. అదెవరు? (163)
పథి గచ్ఛతా చ మయా ఋషభో దృష్ట స్తం
చ పురుషో ఽధిరూఢస్తేనాస్మి
సోపచారముక్త ఉత్తంకాస్య ఱ్రుషభస్య
పురీషం భక్షయ ఉపాధ్యాయేనాపి తే భక్షితమితి ॥ 164
నేను వెళ్లేటపుడు మార్గమధ్యంలో ఒక ఎద్దును చూశాను. దానిని ఎక్కిన పురుషుడు గట్టిగా "ఉత్తంకా! ఈ ఋషభం యొక్క పేడను తిను. నీ ఉపాధ్యాయుడు కూడా తిన్నాడు." అన్నాడు. (164)
తతస్తస్య వచనాన్మయా తదృషభస్య పురీషముప
యుక్తం । స చాపి కః? తదేతద్ భవతోపదిష్ట
మిచ్ఛేయం శ్రోతుం కిం తదితి స తే నైవ
ముక్త ఉపాధ్యాయః ప్రత్యువాచ ॥ 165
అప్పుడు ఆ పురుషుడు చెప్పడం వలన నేను ఆ ఎద్దు యొక్క పేడను తిన్నాను. ఆ పురుషుడెవరు? ఆ ఎద్దు సంగతేమిటి? "ఇదంతా ఏమిటి? నేను మీరు చెప్పగా వినాలనుకొంటున్నాను." ఉత్తంకుడలా అడగగానే ఉపాధ్యాయుడిలా చెప్పాడు. (165)
యేతే స్త్రియౌ ధాతా విధాతా చ యే చ
తే కృష్ణాః సితాః తంతవస్తే రాత్ర్యహాని
యదపి యచ్చక్రం ద్వాదశారం షడ్ వై
కుమారాః పరివర్తయంతి తేఽపి షడ్ ఋతవః ।
ద్వాదశారా ద్వాదశ మాసాః సంవత్సర శ్చక్రమ్ ॥ 166
ఆ ఇద్దరు స్త్రీలు ధాత విధాత. ఆ నల్లని తెల్లని పోగులు రాత్రింబవళ్లు. ఆరుగురు కుమారులు తిప్పుతున్న ద్వాదశారచక్రంలో ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. పన్నెండు ఆకులు పన్నెండు మాసాలు. చక్రం సంవత్సరం. (166)
యః పురుషః స పర్జన్యో యో ఽశ్వః సోఽగ్ని ర్య ఋషభః
త్వయా పథి గచ్ఛతా దృష్టః స ఐరావతో నాగరాట్ ॥ 167
ఆ పురుషుడు పర్జన్యుడు. ఆ అశ్వం అగ్ని, నీవు దారిలో వెడుతూండగా చూచిన ఋషభం గజరాజు ఐరావతం. (167)
యశ్పైవ మధిరూఢః పురుషః స చేంద్రో
యదపి తే భక్షితం తస్య ఋషభస్య
పురీషం తదమ్ఱ్రుతం తేన ఖల్వసి తస్మిన్
నాగభవనే న వ్యాపన్నస్త్వమ్ ॥ 168
ఇక దానిని ఎక్కిన పురుషుడు ఇంద్రుడు. నీవు తిన్న ఆ ఎద్దు పేడ అమృతం. దానివలననే ఆ నాగలోకంలో నీవు మరణించలేదు. (168)
స హి భగవానింద్రో మమ సఖా త్వదనుక్రోశాదిమ
మమగ్రహం కృతవాన్ తస్మాత్
కుండలే గృహీత్వా పునరాగతోఽసి ॥ 169
ఆ ఇంద్రభగవానుడు నా స్నేహితుడు. నీ మీది దయతో నిన్ను ఇలా అనుగ్రహించాడు. ఆ కారణంగానే నీవు కుండలాలను తీసుకొని తిరిగి వచ్చావు. (169)
తత్ సౌమ్య గమ్యతామనుజానే భవంతం
శ్రేయో ఽవాప్స్య సీతి । స ఉపాధ్యేయేనా
మజ్ఞాతో భగవానుత్తంకః క్రుద్ధస్తక్షకం
ప్రతిచికీర్షమాణొ హాస్తినపురం ప్రతస్థే ॥ 170
కనుక సౌమ్యుడా! ఇక వెళ్లవచ్చును. అనుమతిస్తున్నాను. నీకు శుభాలు కలుగుతాయి అన్నాడు. ఉపాధ్యాయుడు అనుమతించాక మహాత్ముడైన ఉత్తంకుడు కోపంతో తక్షకునిపై బదులు తీర్చుకోవడానికి హస్తినాపురానికి బయలుదేరాడు. (170)
స హాస్తినపురం ప్రాప్య న చిరాద్ విప్రసత్తమః ।
సమాగచ్ఛత రాజానమ్ ఉత్తంకో జనమేజయమ్ ॥ 171
ఆ విప్రోత్తముడు ఉత్తంకుడు శీఘ్రంగా హస్తినాపురం చేరి జనమేజయమహారాజును కలుసుకొన్నాడు. (171)
పురా తక్షశిలా సంస్థం నివృత్తమపరాజితమ్ ।
సమ్యగ్విజయినం దృష్ట్వా సమంతా న్మంత్రిభిర్వృతమ్ ॥ 172
తస్మై జయాశిషః పూర్వం యథాన్యాయం ప్రయుజ్య సః ।
ఉవాచైవం వచః కాలే శబ్దసంపన్నయా గిరా ॥ 173
అంతకుముందే అతడు తక్షశిలకు వెళ్లి సంపూర్ణ విజయుడై తిరిగివచ్చాడు. మంత్రులు చుట్టూ కూర్చుని ఉన్న విజయుడైన ఆ రాజును చూచి ఉత్తంకుడు యథాన్యాయంగా ముందు అతనికి జయాశీస్సులు ప్రకటించి, సమయం చూసుకొని చక్కని మాటలతో ఇలా అన్నాడు. (172,173)
ఉత్తంక ఉవాచ
అన్యస్మిన్ కరణీయే తు కార్యే పార్థివసత్తమ ।
బాల్యాదివాన్యదేవ త్వం కురుషే నృపసత్తమ ॥ 171
ఉత్తంకుడు అన్నాడు - "రాజోత్తమా! ఒక పని చేయవలసి ఉండగా నీవు అజ్ఞానంతో వేరొకపనిని చేస్తున్నావు. (174)
సౌతి ఉవాచ
ఏవముక్తస్తు విప్రేణ స రాజా జనమేజయమ్ ।
అర్చయిత్వా యథాన్యాయం ప్రత్యువాచ ద్విజోత్తమమ్ ॥ 175
ఉగ్రశ్రవసుడు చెప్పాడు - విప్రుడు ఇలా అనగానే జనమేజయమహారాజు అతనిని తగిన రీతిగా పూజించి అతనితో ఇలా అన్నాడు. (175)
జనమేజయ ఉవాచ
ఆసాం ప్రజానాం పరిపాలనేన
స్వం క్షత్రధర్మం పరిపాలయామి ।
ప్రబ్రూహి మే కిం కరణీయమద్య
యేనాసి కార్యేణ సమాగతస్త్వమ్ ॥ 176
జనమేజయుడు అంటున్నాడు - ఈ ప్రజలను పరిపాలించడం ద్వారా నేను నా క్షత్రధర్మాన్ని పాటిస్తున్నాను. నేను చేయవలసినది ఏమున్నది? మీరు ఏ పనిమీద ఇక్కడికి వచ్చారు? (176)
సౌతి రువాచ
స ఏవముక్తస్తు నృపోత్తమేన
ద్విజోత్తమః పుణ్యకృతాం వరిష్ఠః ।
ఉవాచ రాజాన మదీనసత్త్వం
స్వమేవ కార్యం నృపతే కురుష్వ ॥ 177
ఉగ్రశ్రవుడు అన్నాడు - నృపోత్తముడు ఇలా అడుగగానే పుణ్యాత్ములలో గరిష్ఠుడైన విప్రోత్తముడు ఉదారహృదయుడైన ఆ రాజుతో "అది నీ పనే (నాది కాదు). దానిని చేయాలి." అన్నాడు. (177)
ఉత్తంక ఉవాచ
తక్షకేణ మహీంద్రేంద్ర యేన తే హింసితః పితా ।
తస్మై ప్రతికురుష్వ త్వం పన్నగాయ దురాత్మనే ॥ 178
ఇంకా ఉత్తంకుడిలా చెప్పసాగాడు - మహీపాలోత్తమా! తక్షకుడు నీ తండ్రిని చంపాడు. ఆ దుర్మార్గుడయిన నాగునిపై నీవు ప్రతీకారం తీర్చుకో. (178)
కార్యకాలం హి మన్యేఽహం విధిదృష్టస్య కర్మణః ।
తద్గచ్ఛాపచితిం రాజన్ పితుస్తస్య మహాత్మనః ॥ 179
శాస్త్రదృష్టితో చేసే కర్మకు (సర్పయజ్ఞరూపమైన కర్మ) ఇది తగిన సమయమని నేను భావిస్తున్నాను. కాబట్టి రాజా! మహాత్ముడైన నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి బయల్దేరు. (179)
తేన హ్యనపరాధీః సః దష్టో దుష్టాంతరాత్మనా ।
పంచత్వమగమద్ రాజా వజ్రాహత ఇవ ద్రుమః ॥ 180
ఏ అపరాధం చేయని నీ తండ్రిని ఆ దుష్టాత్ముడు కాటు వేశాడు. దానితో వజ్రాయుధం చేత కొట్టబడిన చెట్టువలె అతడు నేలగూలాడు. (180)
బలదర్పసముత్పిక్తః తక్షకః పన్నగాధమః ।
అకార్యం కృతవాన్ పాపః యోఽదశత్ పితరం తవ ॥ 181
పన్నగాధముడయిన తక్షకుడు బలగర్వం చేత మిడిసిపడ్డాడు. ఆ పాపాత్ముడు నీ తండ్రిని కాటువేసి అకృత్యం చేశాడు. (181)
రాజర్షివంశగోప్తారమ్ అమరప్రతిమం నృపమ్ ।
యియాసుం కాశ్యపం చైవ వ్యవర్తయత పాపకృత్ ॥ 182
నీ తండ్రి రాజర్షివంశాలను రక్షించే దైవతుల్యుడు. అట్టి రాజును రక్షించాలని వస్తున్న కాశ్యపుడనే బ్రాహ్మణుని పాపకృత్యాలను చేసే తక్షకుడు వెనక్కి తింపి పంపాడు. (182)
హోతుమర్హసి తం పాపం జ్వలితే హవ్యవాహనే ।
సర్వసత్రే మహారాజ త్వరితం తద్ విధీయతామ్ ॥ 183
మహారాజా! ఆ పాపిని మండుతున్న అగ్నిలో హోమం చేయి. అందుకు త్వరగా సర్పయాగం చేయి. (183)
ఏవం పితుశ్చాపచితిం కృతవాంస్త్వం భవిష్యపి ।
మమ ప్రియం చ సుమహత్ కృతం రాజన్ భవిష్యతి ॥ 184
కర్మణః పృథివీపాల మమ యేన దురాత్మనా ।
విఘ్నః కృతో మహారాజ గుర్వర్థం చరతోఽనఘ ॥ 185
రాజా! ఇలా చేస్తే నీ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకొన్నవాడివి అవుతావు. నాకు కూడా మిక్కిలి ప్రీతి కలుగుతుంది. మహారాజా! గురుకార్యార్థమై వెళ్తున్న నాకు ఈ దుర్మార్గుడు కార్యవిఘ్నం చేశాడు. (184,185)
సౌతిరువాచ
ఏతచ్ఛ్రుత్వా హి నృపతిః తక్షకాయ చుకోప హ ।
ఉత్తంకవాక్యహవిషా దీప్తోఽగ్నిర్హవిషా యథా ॥ 186
ఇది విని రాజు తక్షకునిపై కోపించాడు. హవిస్సుచేత అగ్ని ప్రజ్వరిల్లినట్లుగా ఉత్తంకుని మాటలనే హవిస్సు చేత అతని కోపాగ్ని జ్వలించింది. (186)
అపృచ్ఛత్ స తదా రాజా మంత్రిణస్తాన్ సుదుఃఖితః ।
ఉత్తంకస్త్యెవ సాంనిధ్యే పితుః స్వర్గగతిం ప్రతి ॥ 187
అప్పుడు ఆ రాజు మిక్కిలి దుఃఖంతో ఉత్తంకుని సన్నిధిలోనే తన తండ్రి స్వర్గప్రాప్తి గురించి ఆ మంత్రులను అడిగాడు. (187)
తదైవ హి స రాజేంద్రః దుఃఖశోకాప్లుతోఽభవత్ ।
యదైవ వృత్తం పితరమ్ ఉత్తంకాదశ్రుణోత్ తదా ॥ 188
తన తండ్రి మరణవృత్తాంతాన్ని ఉత్తంకుని వలన విన్నప్పుడే ఆ రాజేంద్రుడు దుఃఖశోకాలలో మునిగిపోయాడు. (188)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌష్యపర్వణి తృతీయోఽధ్యాయః ॥ 3 ॥
ఇది శ్రీ మహాభారతమున ఆదిపర్వమున పౌష్యపర్వమను ఉపపర్వమున మూడవ అధ్యాయము. (3)