4. నాలుగవ పర్వము
(పౌలమ పర్వము)
కథా ప్రారంభము.
లోమహర్షణపుత్ర ఉగ్రశ్రవాః సౌతిః పౌరణికో నైమిషారణ్యే
శౌనకన్య కులపతేర్ద్వాదశవార్షికే సత్రే ఋషీనభ్యాగతాన్ ఉపతస్థే ॥ 1
నైమిషారణ్యంలో కులపతి శౌనకుడు చేస్తున్న ద్వాదశ వత్సరసత్రయాగానికి వచ్చిన ఋషులవద్దకు లోమహర్షణుని కొడుకు సూతనందనుడు పౌరాణికుడు అయిన ఉగ్రశ్రవసుడు వచ్చాడు. (1)
పౌరాణికః పురాణే కృతశ్రమః స కృతాంజలిస్తామవాచ
కిం భవంతః శ్రోతుమిచ్ఛంతి కిమహం బ్రవాణీతి ॥ 2
పురాణాలలో మిక్కిలి పరిశ్రమ చేసి పౌరాణికుడైన అతడు చేతులు జోడించి ఆ ఋషులను "పూజ్యులారా! మీరేమి వినాలనుకొంటున్నారు? నేను ఏమి చెప్పను?" అని అడిగాడు. (2)
తమృషయ ఊచుః పరమం రౌమహర్షణే వక్ష్యామస్త్వాం నః
ప్రతివక్ష్యసి వచః శుశ్రూషతాం కథాయోగం నః కథాయోగే ॥ 3
ఆ ఋషులు ఇలా అన్నారు. "లోమహర్షణపుత్రా! నీకు మేము ఉత్తమమైన దానిని చెపుతాం. కథా ప్రసంగాలను వినడానికి కుతూహలంగా ఉన్న మాకు నీవు అనేక కథలను వినిపించవచ్చును. (3)
తత్రభవాన్ కులపతిస్తు శౌనకోఽగ్నిశరణమధ్యాస్తే ॥ 4
ఇప్పుడు పూజ్యులైన కులపతులు అగ్నిగృహంలో ఉన్నారు. (అగ్నిని ఉపాసిస్తున్నారు.) (4)
యోఽసౌ దివ్యాః కథా వేద దేవతాసురసంశ్రితాః ।
మనుష్యోరగ గంధర్వ కథా వేద చ సర్వశః ॥ 5
దేవాసురులకు సంబంధించిన దివ్యమైన కథలను వారు ఎరుగుదురు. ఇంకా మనుష్యుల, పాముల, గంధర్వుల కథలను అన్నింటినీ సంపూర్ణంగా తెలిసినవారు. (5)
స చాస్మిన్ మఖే సౌతే విద్వాన్ కులపతిర్ద్విజః ।
దక్షో ధృతవ్రతో ధీమాన్ శాస్త్రే చారణ్యకే గురుః ॥ 6
సూతనందనా! కులపతి, విప్రవరుడు, విద్వాంసుడు అయిన ఆ శౌనకముని యజ్ఞదీక్షయందున్నాడు. అతడు సమర్థుడు. వ్రతదీక్ష కలవాడు. బుద్ధిమంతుడు. శ్రుతి స్మృతిపురాణేతిహాసాలలోను, బృహదారణ్యకాదులయిన బ్రహ్మశాస్త్రాదులయందును అతడు ఆచార్యుడు. (6)
సత్యవాదీ శమపరః తపస్వీ నియతవ్రతః ।
సర్వేషామేవ నో మాన్యః స తావత్ ప్రతిపాల్యతామ్ ॥ 7
అతడు సత్యవాది. ఇంద్రియనిగ్రహతత్పరుడు. తపస్వి. నియమపూర్వకంగా వ్రతాచరణం చేసేవాడు. మాకు అందరికీ మాన్యుడు. అతడు వచ్చేవరకు ప్రతీక్షించండి. (7)
తస్మిన్నధ్యాసతి గురౌ ఆసనం పరమార్చితమ్ ।
తతో వక్ష్యసి యత్వాం స ప్రక్ష్యతి ద్విజసత్తమః ॥ 8
ఆ గురువు విప్రవరుడు ఉత్తమమైన ఆసనాన్ని అలంకరించి మిమ్మల్ని ఏది అడుగుతారో దానిని మీరు చెప్పుదురుగాని". (8)
సౌతిరువాచ
ఏవమస్తు గురౌ తస్మిన్ ఉపవిష్టే మహాత్మని ।
తేన పృష్టః కథాః పుణ్యాః వక్ష్యామి వివిధాశ్రయాః ॥ 9
ఉగ్రశ్రవసుడు అన్నాడు - "అలాగే కానివ్వండి. ఆ మహాత్ముడు గురువు వచ్చి కూర్చున్నాక వారు అడిగినవే నానావిధాలయిన పుణ్యకథలను చెప్తాను". (9)
సోఽథ విప్రర్షభః సర్వం కృత్వా కార్యం యథావిధి ।
దేవాన్ వాగ్భిః పితౄవద్భిః తర్పయిత్వా ఽజగామ హ ॥ 10
యత్ర బ్రహ్మర్షయః సిద్ధాః సుఖాసీనా ధృతవ్రతాః ।
యజ్ఞాయతనమాశ్రిత్య సూతపుత్రపురఃసరాః ॥ 11
అనంతరం ఆ విప్రశ్రేష్ఠుడు శౌనకమహర్షి యథావిధిగా అన్ని కార్యాలు చక్కబెట్టుకుని, దేవతలను వైదిక స్తుతులతోను, పితరులను నీటితోను తృప్తిపరచి (తర్పణాలు చేసి) వచ్చాడు. అక్కడ ఉత్తమవ్రతులైన సిద్ధులు బ్రహ్మర్షులు యజ్ఞమండపంలో సూతపుత్రుని ఎదుట సుఖాసీనులై ఉన్నారు. (10,11)
ఋత్విక్ష్వథ సదస్యేషు స విఅ గృహపతిస్తదా ।
ఉపవిష్టేఘాపవిష్టః శౌనకోఽథాబ్రవీదిదమ్ ॥ 12
ఋత్విజులు, సదస్యులు అందరూ కూర్చుని ఉండగా కులపతి అయిన శౌనకుడు కూడా కూర్చుని ఇలా అన్నాడు. (12)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి కథాప్రవేశో నామ చతుర్థోఽధ్యాయః ॥ 4 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున పౌలోమపర్వమను ఉపపర్వమున కథాప్రవేశమను నాలుగవ అధ్యాయము. (4)