5. అయిదవ అధ్యాయము

భృగుని ఆశ్రమమునకు పులోముడను రాక్షసుడు వచ్చుట.

శౌనక ఉవాచ
పురాణమఖిలం తాత పితా తేఽధీతవాన్ పురా ।
కచ్చిత్ త్వమపి తత్సర్వమ్ అధీషే లౌమహర్షణే ॥ 1
శౌనకుడన్నాడు - తండ్రీ! లోమహర్షణకుమారా! పూర్వం నీ తండ్రి పురాణాలన్నీ అధ్యయనం చేశాడు. నీవు కూడా అవన్నీ అధ్యయనం చేశావా? (1)
పురాణే హి కథా దివ్యాః ఆదివంశాశ్చ ధీమతామ్ ।
కథ్యంతే యే పురాస్మాభిః శ్రుతపూర్వాః పితుస్తవ ॥ 2
పురాణంలో దివ్యమైన కథలు, ధీమంతులయిన రాజర్షి బ్రహ్మర్షుల యొక్క మూలవంశాలు వర్ణింపబడి ఉంటాయి. మేమి మీ తండ్రివలన పూర్వం ఇవన్నీ విని ఉన్నాము. (2)
తత్ర వంశమహం పూర్వం శ్రోతుమిచ్ఛామి భార్గవమ్ ।
కథయస్వ కథామేతాం కల్యాః స్మ శ్రవణే తవ ॥ 3
వానిలో మొదటగా భృగువంశమును గూర్చి వినగోరుతున్నాను. కనుక ఈ కథనే చెప్పు. మేమంతా నీ కథ వినడానికి తగినట్లు సిద్ధంగా ఉన్నాము. (3)
సౌతిరువాచ
యదధీతం పురా సమ్యగ్ ద్విజశ్రేష్ఠైర్మహాత్మభిః ।
వైశంపాయన విప్రాగ్ర్యైః తైశ్చాపి కథితం యథా ॥ 4
సూతపుత్రుడు చెపుతున్నాడు - "భృగునందనా! వైశంపాయనాది విప్రవరులు, మహాత్ములయిన ద్విజశ్రేష్ఠులు పూర్వం చక్కగా అధ్యయనం చేసి చెప్పిన పురాణం నాకు బాగా తెలుసు. (4)
యదధీతం చ్ అపిత్రా మే సమ్యక్ చైవ తతో మయా ।
తావచ్ఛ్రుణుష్వ యో దేవైః సేంద్రైః సర్షిమరుద్గణైః ॥ 5
పూజితః ప్రవరో వంశో భార్గవో భృగునందన ।
ఇమం వంశమహం పూర్వం భార్గవం తే మహామునే ॥ 6
నిగదామి యథాయుక్తం పురాణాశ్రయ సంయుతమ్ ।
భృగుర్మహర్షిర్బగవాన్ బ్రహ్మణా వై స్వయంభువా ॥ 7
వరుణస్య క్రతౌ జాతః పావకాదితి నః శ్రుతమ్ ।
భృగోః సుదయితః పుత్రః చ్యవనో నామ భార్గవః ॥ 8
నాతండ్రి నాచేత చక్కగా అధ్యయనం చేయించాడు. నేను కూడా చక్కగా అధ్యయనం చేశాను. భృగునందనా! భార్గవవంశం ఇంద్రాది దేవతలచేత, ఋషులచేత, మరుద్గణం చేత కొనియాడబడిన శ్రేష్ఠమైన వంశం. మహామునీ! పురాణాలను ఆశ్రయించుకొని అందులో ఇమిడి ఉన్న ఈ భార్గవవంశం గురించి ముందుగా నీకు యథాయుక్తంగా చెపుతాను. విను. స్వయంభువు అయిన బ్రహ్మ వరుణుని యజ్ఞంలో అగ్ని నుండి పూజ్యుడు మహర్షి అయిన భృగువును పుట్టించాడని విని ఉన్నాను. అతనికి మిక్కిలి ప్రీతిపాత్రుడయిన పుత్రుడు చ్యవనుడు. (5-8)
వి: సం: ఆశ్రయము = ఉపోద్ఘాతం (నీల)
చ్యవనస్య చ దాయాదః ప్రమతిర్నామ ధార్మికః ।
ప్రమతేరప్యభూత్ పుత్రః ఘృతాచ్యాం రురురిత్యుత ॥ 9
చ్యవనుని కొడుకు ప్రమతి అనేవాడు పరమ ధార్మికుడు. అతనికి ఘృతాచి అనే అప్సరసయందు రురుడు పుట్టాడు. (9)
రురోరపి సుతో జజ్ఞే శునకో వేదపారగః ।
ప్రమద్వరాయాం ధర్మాత్మా తవ పూర్వపితామహః ॥ 10
రురునకు ప్రమద్వరయందు శునకుడనే కొడుకు ఉదయించాడు. అతడు వేదాలలో పారంగతుడు. ధర్మాత్ముడు. నీకు ప్రపితామహుడు. (10)
తపస్వీ చ యశస్వీ చ శ్రుతవాన్ బ్రహ్మవిత్తమః ।
ధార్మికః సత్యవాదీ చ నియతో నియతాశనః ॥ 11
అతడు తపస్వి, యశస్వి, శాస్త్రవేత్త, బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడు, ధార్మికుడు, సత్యవాది, ఇంద్రియ నిగ్రహం కలవాడు, నియతంగా ఆహారం తీసుకొనేవాడు. (11)
శౌనక ఉవాచ
సూతపుత్ర యథా తస్య భార్గవస్య మహాత్మనః ।
చ్యవనత్వం పరిఖ్యాతం తన్మమాచక్ష్వ పృచ్ఛతః ॥ 12
శౌనకుడు అన్నాడు - "సూతపుత్రా! మహాత్ముడైన భార్గవునికి చ్యవనుడనే పేరు ఎందుకు ప్రసిద్ధమయిందో అది నాకు చెప్పు". (12)
సౌతిరువాచ
భృగోః సుదయితా భార్యా పులోమేత్యభివిశ్రుతా ।
తస్యాం సమభవద్గర్భః భృవీర్యసముద్భవః ॥ 13
సూతసుతుడు చెప్పసాగాడు - "భృగువు భార్య పులోమ అని వినుతికెక్కింది. ఆమె భర్తకు అత్యంత ప్రీతి పాత్రమైనది. భృగువు వీర్యం వలన కలిగిన గర్భం ఆమెలో పెరగసాగింది. (13)
తస్మిన్ గర్భేఽథ సంభూతే పులోమాయాం భృగూద్వహ ।
సమయే సమశీలిన్యాం ధర్మపత్న్యాం యశస్వినః ॥ 14
అభిషేకాయ నిష్క్రాంతే భృగే ధర్మభృతాం వరే ।
ఆశ్రమం తస్య రక్షోఽథ పులోమాభ్యాజగామ హ ॥ 15
భృగువంశోత్తమా! యశస్వి అయిన భృగువునకు అనుకూలమైన స్వభావం కల ధర్మపత్ని పులోమ. ఆమె గర్భం తాల్చిన సమయంలో ఒకసారి (ధర్మపరులలో శ్రేష్ఠుడయిన) భృగువు స్నానానికి బయటకు వెళ్లాడు. అప్పుడు పులోముడనే రాక్షసుడు అతని ఆశ్రమానికి వచ్చాడు. (14,15)
తం ప్రవిశ్యాశ్రమం దృష్ట్వా భృగోర్భార్యామనిందితామ్ ।
హృచ్ఛయేన సమావిష్టః విచేతాః సమపద్యత ॥ 16
అతడు ఆశ్రమంలోకి రాగానే పతివ్రత అయిన భృగువు భార్యను చూచి కామావిష్టుడై మోహాన్ని పొందాడు. (16)
అభ్యాగతం తు తద్రక్షః పులోమా చారుదర్శనా ।
స్యమంత్రయత వన్యేన ఫలమూలాదినా తదా ॥ 17
సుందరి అయిన పులోమ అభ్యాగతుడైన ఆ రాక్షసుని అడవిలో దొరికే ఫలమూలాదులు సమర్పించి ఆహ్వానించింది. (17)
తాం తు రక్షస్తదా బ్రహ్మాన్ హృచ్ఛయేనాభిపీడితమ్ ।
దృష్ట్యా హృష్టనుభూద్ రాజన్ జిహార్షుస్తామనిందితామ్ ॥ 18
బ్రహ్మమూర్తీ! ఆ సమయంలో రాక్షసుడు కామపీడితుడై ఉన్నాడు. రాజా! అనిందితురాలయిన ఆమెను ఎత్తుకొని పోదలచి, ఆమె ఒంటరిగా ఉండడం చూచి ఆనందించాడు. (18)
జాతమిత్యబ్రవీత్ కార్యం జిహీర్షుర్ముదితః శుభమ్ ।
సా హి పూర్వం వృతా తేన పులోమ్నా తు శుచిస్మితా ॥ 19
ఆ శుభాంగిని ఎత్తుకుపోదలచిన అతడు పట్టరాని సంతోషంతో "నాకార్యం జరిగినట్లే" అని మనసులోనే అనుకొన్నాడు. ఆ సుందరాంగి పులోమను పూర్వం పులోముడనే ఆ రాక్షసుడు వరించాడు. (19)
1. బాల్యంలో పులోమ ఏడుస్తూ ఉన్నప్పుడు, ఆమె ఏడుపును మానిపించడం కోసం తండ్రి "ఓరేయ్ రాక్షసా! వచ్చి ఈమెను పట్టుకు పో" అంటూ భయపెట్టేవాడు. అంతకు ముందే ఆ ఇంట్లో దూరి దాగి ఉన్న పులోముడనే రాక్షసుడు అది విని మనసులోనే "ఈమె నా భార్య" అనుకునేవాడు. అంటే ఇందులో ఉద్దేశం ఏమంటే - నవ్వులాటకైనా, బెదిరించడానికైనా పిల్లలతో ఇలాంటి మాటలు అనకూడదు. రాక్షసుని పేరు కూడా పెట్టకూడదు.
తాం తు ప్రాదాత్ పితా పశ్చాద్ భృగవే శాస్త్రవత్తదా ।
తస్య తత్ కిల్బిషం నిత్యం హృది వర్తతి భార్గవ ॥ 20
కాని అనంతరకాలంలో తండ్రి ఆమెను శాస్త్రోకంగా భృగువునకు ఇచ్చి వివాహం చేశాడు. భృగునందనా! తండ్రి చేసిన ఆ అపరాధం నిత్యమూ అతని మన్సులో గుచ్చుకొంటూనే ఉంది. (20)
ఇదమంతరమిత్యేనం హర్తుం చక్రే మనస్తదా ।
అథాగ్నిశరణెఽపశ్యత్ జ్వలంతం జాతవేదసమ్ ॥ 21
ఇదే తగిన సమయం అనుకొని ఆమెను అపహరించడానికి మనసులోనే నిశ్చయించుకొన్నాడు. ఇంతలోనే అగ్నిగృహంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండడం చూశాడు. (21)
తమపృచ్ఛత్ తతో రక్షః పావకం జ్వలితం తదా ।
శంస మే కస్య భార్యేయం అగ్నే పృచ్ఛే ఋతేన వై ॥ 22
అప్పుడు ఆ జ్వలిస్తున్న అగ్నిదేవుని పులోముడు - "అగ్నిదేవా! నేను నిజంగా అడుగుతున్నాను. చెప్పు. ఈమె ఎవరి భార్య?" అని అడిగాడు. (22)
ముఖం త్వమసి దేవానాం వద పావక పృచ్ఛతే ।
మయా హీయం వృతా పూర్వం భార్యార్థే వరవర్ణినీ ॥ 23
పావకుడా! నీవు దేవతలకు ముఖస్థానీయుడవు. అడుగుతున్న నాకు సమాధానం చెప్పు. ఈ సుందరాంగిని పూర్వం నేను భార్యగా వరించాను. (23)
పశ్చాదిమాం పితా ప్రాదాత్ భృగనేఽనృతకారకః ।
సేయం యది వరారోహా భృగోర్భార్యా రహోగతా ॥ 24
తథా సత్యం సమాఖ్యాహి జిహీర్షామ్యాశ్రమాదిమామ్ ।
స మన్యుస్తత్ర హృదయం ప్రదహన్నిన తిష్టతి ।
మత్పూర్వ భార్యాం యదిమాం భృగురాప సుమధ్యమామ్ ॥ 25
కాని అనంతరం ఆమె తండ్రి అసత్యవ్యవహారంతో ఈమెను భృగువునకిచ్చి వివాహం చేశాడు. ఒంటరిగా చిక్కిన ఈ సుందరి భృగువు భార్యయేనా? అయితే నిజం చెప్పు. ఈ ఆశ్రమం నుండి ఆమెను ఎత్తుకుపోతాను. ఆ నాటి ఆ కోపం ఇప్పటికీ నా హృదయాన్ని మండిస్తూనే ఉన్నది. నా పూర్వపు భార్య అయిన ఈమెను భృగువు పొందాడు. (24,25)
సౌతిరువాచ
ఏవం రక్షస్తమామంత్ర్య జ్వలితం జాతవేదసమ్ ।
శంకమానం భృగోర్భార్యాం పునః పునరపృచ్ఛత ॥ 26
సూతసుతుడు చెపుతున్నాడు. ఈ రీతిగా భృగువుయొక్క భార్యను - ఈమె తనకు చెందుతుందా, భృగువుకు చెందుతుందా అనే సంశయం కల్పిస్తూ రాక్షసుడు జ్వలిస్తున్న అగ్నిని పిలిచి పదే పదే అడుగ సాగాడు. (26)
త్వమగ్నే సర్వభూతానామ్ అంతశ్చరపి నిత్యదా ।
సాక్షివత్ పుణ్యపాపేషు సత్యం బ్రూహి కవే వచః ॥ 27
అగ్నీ! నీవు సమస్తప్రాణుల లోపల నిత్యం సంచరిస్తూ ఉంటావు. సర్వజ్ఞుడా! పుణ్యపాపముల యందు సాక్షివలె ఉంటావు. కాబట్టి నిజం చెప్పు. (27)
మత్పూర్వాపహృతా భార్యా భృగుణానృతకారిణా ।
సేయం యది తథా మే త్వం సత్యమాఖ్యాతుమర్హసి ॥ 28
అసత్యవర్తనుడైన భృగువు నాకు మొదట భార్యగా నిశ్చయింపబడిన దానిని అపహరించాడు. ఆమె ఈమెయే అయితే నీవు నిశ్చయంగా ఆ విషయం నిజం చెప్పు. (28)
శ్రుత్వా త్వత్తో భృగోర్భార్యాం హరిష్యామ్యాశ్రమాదిమామ్ ।
జాతవేదః పశ్యతస్తే వద వద సత్యాం గిరం మమ ॥ 29
అగ్నీ! నీవలన విషయమంతా విని భృగువు భార్యను నీవు చూస్తూ ఉండగానే ఈ ఆశ్రమం నుండి హరించి తీసుకొని వెడతాను. కాబట్టి నీవు నిజమేదో చెప్పు. (29)
సౌతిరువాచ
తస్యైతద్ వచనం శ్రుత్వా సప్తార్చిర్దుఃఖితోఽభవత్ ।
భితోఽనృతాచ్చ శాపాచ్చ భృగోరిత్యబ్రవీచ్ఛనైః ॥ 30
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు - రాక్షసుని యొక్క ఈ మాటలను విని అగ్ని దుఃఖించాడు. ఒకవైపు అసత్యానికి, ఇంకొకవైపు భృగువు యొక్క శాపానికి అతడు భయపడ్డాడు. మెల్లమెల్లగా ఇలా అన్నాడు. (30)
అగ్నిరువాచ
త్వయా వృతా పులోమేయం పూర్వం దానవవందన ।
కిం త్వియం విధినా పూర్వం మంత్రవన్నవ్ఱ్రుతా త్వయా ॥ 31
అగ్నిదేవుడు చెప్పాడు - దానవనందనా! నీ చేతపూర్వం వరింపబడిన పులోమయే ఈమె. కాని ఈమెను నీవు విధి పూర్వకంగా మంత్ర సహితంగా వివాహమాడలేదు. (31)
పిత్రా తు భృగవే దత్తా పులోమేయం యశస్వినీ ।
దదాతి న పితా తుభ్యం వరలోభాన్మహాయశాః ॥ 32
ఈ యశస్విని పులోమను తండ్రి భృగువుకిచ్చి వివాహం చేశాడు. ఆ కీర్తిమంతుడు శ్రేష్ఠమైన వరుడు కావాలనే కోరికతో నీకు ఇవ్వలేదు. (32)
అథేమాం వేద దృష్టేన కర్మణా విధిపూర్వకమ్ ।
భార్యామృషిర్భృగుః ప్రాప మాం పురస్కృత్య దానవ ॥ 33
దానవా! తదనంతరం ఈమెను వేదోక్తమైన క్రియాకలాపంతో శాస్త్రపూర్వకంగా, నన్ను ముందుంచుకొని భృగువు భార్యగా పొందాడు. (33)
సేయమిత్యవగచ్ఛామి నానృతం వక్తుముత్సహే ।
నానృతం హి సదా లోకే పూజ్యతే దానవోత్తమ ॥ 34
ఆమెయే ఈమె అని నాకు తెలుసు. అబద్ధం చెప్పడానికి ఆసక్తి లేదు. దానవోత్తమా! లోకంలో అనృతం ఎప్పుడూ పూజింపబడదు. (34)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌలోమ పర్వణి పులోమాగ్నిసంవాదే పంచమోఽధ్యాయః ॥ 5 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున పౌలోమపర్వమను ఉపపర్వమున పులోమాగ్ని సంవాదమను అయిదవ అధ్యాయము. (5)