9. తొమ్మిదవ అధ్యాయము

రురు ప్రమద్వరల వివాహము.

సౌతి రువాచ
తేషు తత్రోపవిష్టేషు బ్రాహ్మణేషు మహాత్మసు ।
రురుశ్చుక్రోశ గహనం వనం గత్వాతిదుఖితః ॥ 1
శోకేనాభిహితః సోఽథ విలపన్ కరుణం బహు ।
అబ్రవీద్ వచనం శోచన్ ప్రియాం స్మృత్వా ప్రమద్వరామ్ ॥ 2
శేతే సా భువి తన్వంగీ మమ శోకవివర్ధినీ ।
బాంధవానాం చ సర్వేషాం కిం ను దుఃఖమతఃపరమ్ ॥ 3
ఉగ్రశ్రవసుడు కొనసాగించాడు - "మహాత్ములైన ఆ బ్రాహ్మణులందరూ అక్కడ కూర్చుని ఉండగా రురువు మాత్రం అతిదుఃఖితుడై దట్టమైన అరణ్యంలోకి వెళ్లి శోకించసాగాడు. దుఃఖంతో నలిగిపోయి అతికరుణంగా విలపించాడు. ప్రియురాలు అయిన ప్రమద్వరను తలచుకొని ఏడుస్తూ ఇలా అన్నాడు. "ఆ సుందరి నా శోకాన్ని మరింత పెంచుతూ భూమి మీద పడి ఉన్నది. బంధువులు అందరికీ కూడా శోకం కల్గిస్తోంది. ఇంతకంటె దుఃఖకరమైన విషయం మరొకటి ఏమున్నది? (1-3)
యది దత్తం తపస్తప్తం గురవో వా మయా యది ।
సమ్యగారాధితాస్తేన సంజీవతు మమ ప్రియా ॥ 4
నేను దానం చేసినట్లయితే, తపస్సు చేసినట్లయితే లేదా గురుజనులను చక్కగా ఆరాధించినట్లయితే ఆ పుణ్యం వలన నా ప్రియిరాలు జీవించుగాక. (4)
యథా చ జన్మప్రభృతి యతాత్మాహం ధృతవ్రతః ।
ప్రమద్వరా తథా హ్యేషా సముత్తిష్ఠతు భామినీ ॥ 5
నేను జన్మించినది మొదలు ఇంతవరకు ఇంద్రియ మనోనిగ్రహాలు కల వాడిని, బ్రహ్మచర్యాది వ్రతాలు దృఢంగా ఆచరించే వాడిని అయితే ఈ ప్రమద్వర బ్రతికి లేచుగాక! (5)
(కృష్ణే విష్ణౌ హృషీకేశే లోకేశే ఽసురవిద్విషి ।
యది మే నిశ్చలా భక్తిః మమ జీవితు సా ప్రియా ॥)
అసురాంతకుడు, జగదీశ్వరుడు, ఇంద్రియాధిపతి, సర్వవ్యాపకుడు అయిన శ్రీకృష్ణ భగవానుని యందు నాకు నిశ్చలభక్తి ఉన్నట్లయితే ఈ నా ప్రియురాలు జీవించుగాక!
ఏవం లాలప్యతస్తస్య భార్యార్థే దుఃఖితస్య చ ।
దేవదూతస్తదాభ్యేత్య వాక్యమాహ రురుం వనే ॥ 6
అడవిలో భార్య కోసం దుఃఖంతో విలపిస్తున్న అతని వద్దకు దేవదూత వచ్చి రురుని ఉద్దేశించి ఇలా అన్నాడు. (6)
దేవదూత ఉవాచ
అభిధత్సే హ యద్ వాచా రురో దుఃఖేన తన్మృషా ।
యతో మర్త్యస్య ధర్మాత్మన్ నాయురస్తి గతాయుషః ॥ 7
గతాయురేషా కృపణా గంధర్వాప్సరసోః సుతా ।
తస్మాచ్ఛోక్ మనస్తాత మా కృథాస్త్వం కథంచన ॥ 8
దేవదూత చెపుతున్నాడు - ధర్మాత్మా! రురూ! దుఃఖంతో నీవు ఇంతవరకు మాటలాడినవన్నీ అసత్యాలే. ఆయువు తీరిన మానవునకు ప్రాణం ఉండదు. గంధర్వ - అప్సరసలకు పుట్టిన ఈ దీనురాలికి ఆయువు తీరింది. కాబట్టి తండ్రీ! దుఃఖంలో మనసులో కోపగించుకోకు. (7,8)
ఉపాయశ్చాత్ర విహితః పూర్వం దేవైర్మహాత్మభిః ।
తం యదీచ్ఛసి కర్తుం త్వం ప్రాప్స్యసీహ ప్రమద్వరామ్ ॥ 9
ఈ విషయంలో మహాత్ములైన దేవతలు పూర్వం ఒక ఉపాయాన్ని నిశ్చయించారు. నీవు దానిని చేయడానికి ఇష్టపడితే ఇప్పుడు ప్రమద్వరను పొందగలవు. (9)
రురురువాచ
క ఉపాయః కృతో దేవైః బ్రూహి తత్త్వేన ఖేచర ।
కరిష్యేఽహం తథా శ్రుత్వా త్రాతుమర్హతి మాం భవాన్ ॥ 10
ఆకాశచారి అయిన దేవదూతా! దేవతలు చేసిన ఆ ఉపాయమేదో స్పష్టంగా చెప్పు. అది విని నేను తప్పకుండా చేస్తాను. నీవే నన్ను రక్షించదగినవాడవు. (10)
దేవదూత ఉవాచ
ఆయుషోఽర్ధం ప్రయచ్ఛ త్వం కన్యాయై భృగునందన ।
ఏవముత్థాస్యతి రురో తవ భార్యా ప్రమద్వరా ॥ 11
దేవదూత చెప్పాడు - "భృగునందనా! రురూ! ఆ కన్యకు నీ ఆయుర్దాయంలో సగం ఇవ్వు. ఇలా చేస్తే నీ భార్య ప్రమద్వర బ్రతికి లేవగలదు." (11)
రురు రువాచ
ఆయుషోఽర్ధం ప్రయచ్ఛామి కన్యాయై ఖేచరోత్తమ ।
శృంగారరూపాభరణా సముత్తిష్ఠతు మే ప్రియా ॥ 12
రురువు అన్నాడు - "దేవోత్తమా! నేను ఆ కన్యకు నా ఆయువులో సగం ఇస్తున్నాను. శృంగారం, సౌందర్యం కలబోసుకుని ఆభరణాలు ధరించిన నా ప్రియురాలు బ్రతికి లేచుగాక". (12)
సౌతిరువాచ
తతో గంధర్వరాజశ్చ దేవదూతశ్చ సత్తమౌ ।
ధర్మరాజముపేత్యేదం వచనం ప్రత్యభాషతామ్ ॥ 13
ఉగ్రశ్రవసుడు అన్నాడు - "వెంటనే గంధర్వరాజు అయిన విశ్వావసువు, దేవదూత - ఆ ఇద్దరు సత్పరుషులు కలిసి యమధర్మరాజు దగ్గరకు వెళ్లి ఇలా చెప్పారు. (13)
ధర్మరాజాయుషోఽర్ధేన రురోర్భార్యా ప్రమద్వరా ।
సముత్తిష్ఠతు కల్యాణీ మృతైవం యది మన్యసే ॥ 14
యమధర్మరాజా! రురువు భార్య, కల్యాణి అయిన ప్రమద్వర చనిపోయింది. నీవు అంగీకరిస్తే అతని సగం ఆయర్దాయంతో ఆమె బ్రతుకుతుంది" (14)
ధర్మరాజ ఉవాచ
ప్రమద్వరాం రురోర్భార్యాం దేవదూత యదీచ్ఛసి ।
ఉత్తిష్ఠత్వాయుషోఽర్ధేన రురోరేవ సమన్వితా ॥ 15
ధర్మరాజు చెప్పాడు - "దేవదూతా! రురువు భార్య ప్రమద్వరను నీవు బ్రతికింపదలచుకొంటే, రురువు యొక్క ఆయుస్సులో సగం పొంది ఆమె లేచుగాక" (15)
సౌతిరువాచ
ఏవముక్తే తతః కన్యా సోదతిష్ఠత్ ప్రమద్వరా ।
రురోస్తస్యాయుషోఽర్ధేన సుప్తేవ వరవర్ణినీ ॥ 16
ఉగ్రశ్రవసుడు అన్నాడు - ధర్మరాజు ఇలా అన్న వెంటనే ఆ సుందరి, కన్య అయిన ప్రమద్వర రురువు యొక్క అర్ధాయుస్సును పొంది నిద్రలేచిన దాని వలె లేచి కూర్చుంది. (16)
ఏతద్ దృష్టం భవిష్యే హి రురోరుత్తమతేజసమ్ ।
ఆయుషోఽతిప్రవృద్ధస్య భార్యార్థేఽర్ధమలుప్యత ॥ 17
తత ఇష్టేఽహని తయోః పితరౌ చక్రతుర్ముదా ।
వివాహం తౌ చ రేమాతే పరస్పరహితైషిణౌ ॥ 18
చక్కని తేజస్సు కల రురువు యొక్క అతి దీర్ఘమైన ఆయువులో సగం భార్య కోసం తగ్గింది. ఇది అతని యొక్క అదృష్టంగా భావించబడింది. అనంతరం వారి తల్లిదండ్రులు అనుకున్న రోజున వారి వివాహాన్ని సంతోషంగా జరిపించారు. వారిద్దరూ పరస్పర శ్రేయోభిలాషులై ఆనందంగా కాలం గడుపసాగారు. (17,18)
స లబ్ధ్వా దుర్లభాం భార్యాం పద్మకింజల్కసుప్రభామ్ ।
వ్రతం చక్రే వినాశాయ జిహ్మగానాం ధృతవ్రతః ॥ 19
పద్మ కేసరముల కాంతివంటి కాంతితో వెలుగొందే దుర్లభమైన ప్రమద్వరను భార్యగా పొంది వ్రతధారి అయిన రురువు పాములను నాశనం చేయాలని దీక్ష పూనాడు. (19)
స దృష్ట్వా జిహ్మగాన్ సర్వాన్ తీవ్రకోపసమన్వితః ।
అభిహంతి యథా సత్త్వం గృహ్య ప్రహరణం సదా ॥ 20
అతడు పాములను చూడగానే తీవ్రమైన కోపం కలిగినవాడై ఎప్పుడూ చేతిలో కర్ర పుచ్చుకొని బలంకొద్దీ కొట్టి వాటిని చంపసాగాడు. (20)
స కదాచిద్ వనం విప్రః రురురభ్యాగమన్మహత్ ।
శయానం తత్ర చాపశ్యద్ డుండుభం వయసాన్వితమ్ ॥ 21
విప్రుడైన ఆ రురువు ఒకసారి పెద్ద అడవిలోకి వెళ్లాడు. అక్కడ డుండుభ జాతికి చెందిన ఒక ముసలిపాము పడుకొని ఉండడం చూశాడు. (21)
తత ఉద్యమ్య దండం సః కాలదండోపమం తదా ।
జిఘాంసుః కుపితో విప్రః తమువాచాథ డుండుభః ॥ 22
వెంటనే కోపంతో దానిని చంపదలచి యమదండం లాంటి కర్రను పైకెత్తాడు. అంతలోనే ఆ డుండుభం అతనితో ఇలా అన్నది. (22)
నాపరాధ్యామి తే కంచిత్ అహమద్య తపోధన ।
సంరంభాచ్చ కిమర్థం మామ్ అభిహంసి రుషాన్వితః ॥ 23
"తపోధనా! నేనిప్పుడు నీకు ఏమీ అపకారం చేయలేదుగదా! కోపించి ఆవేశంతో ఎందుకు నన్ను చంపుతున్నావు?" (23)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి ప్రమద్వరాజీవనే నవమోఽధ్యాయః ॥ 9 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున పౌలోమపర్వమను ఉపపర్వమున ప్రమద్వర జీవించుట అను తొమ్మిదవ అధ్యాయము. (9)
(దాక్షిణాత్య అధికపాఠం ఒక శ్లోకం కలిపి మొత్తం 24 శ్లోకాలు)