8. ఎనిమిదవ అధ్యాయము

రురు ప్రమద్వరల వృత్తాంతము - ప్రమద్వర మరణించుట.

సౌతి రువాచ
స చాపి చ్యవనో బ్రహ్మన్ భార్గవోఽజనయత్ సుతమ్ ।
సుకన్యాయాం మహాత్మానం ప్రమతిం దీప్తతేజసమ్ ॥ 1
ప్రమతిస్తు రురుం నామ ఘృతాచ్యాం సమజీజనత్ ।
రురుః ప్రమద్వరాయాం తు శునకం సమజీజనత్ ॥ 2
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు - బ్రహ్మజ్ఞా! భృగుపుత్రుడైన చ్యవనుడు సుకన్య వలన తేజస్సుతో దీపించే మహాత్ముడైన ప్రమతి అనే కొడుకును కన్నాడు. ప్రమతికి ఘృతాచి అనే అప్సరస యందు రురువు అనే కొడుకు కలిగాడు. రురువుకు ప్రమద్వర యందు శునకుడనేవాడు కలిగాడు. (1,2)
(శౌనకస్తు మహాభాగ శునకస్య సుతో భవాన్ ।)
శునకస్తు మహాసత్త్వః సర్వభార్గవనందనః ।
జాతస్తపసి తీవ్రే చ స్థితః స్థిరయశాస్తతః ॥ 3
(మహాభాగా! శునకసుతుడవయిన నీవు శౌనకుడవు.) శునకుడు మహాసత్త్వుడై సమస్త భృగుకులానికి ఆనందదాయకుడయ్యాడు. అతడు తీవ్రమైన తపస్సు చేసి స్థిరకీర్తిని పొందాడు. (3)
తస్య బ్రహ్మన్ రురోః సర్వం చరితం భూరితేజసః ।
విస్తరేణ ప్రవక్ష్యామి తచ్ఛృణు త్వమశేషతః ॥ 4
బ్రహ్మజ్ఞా! ఆ గొప్ప తేజస్వంతుడైన రురువు యొక్క చరిత్ర యావత్తు సవిస్తరంగా చెపుతాను. దానిని పూర్తిగా విను. (4)
ఋషి రాసీన్మహాన్ పూర్వం తపోవిద్యాసమన్వితః ।
స్థూలకేశ ఇతి ఖ్యాతః సర్వభూతహితే రతః ॥ 5
పూర్వం తపస్సు, విద్య కలిగి, సమస్త ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన స్థూలకేశుడనే గొప్ప ఋషి ఉండేవాడు. (5)
ఏతస్మిన్నేవ కాలే తు మేనకాయాం ప్రజజ్ఞివాన్ ।
గంధర్వరాజో విప్రర్షే విశ్వావసురితి స్మృతః ॥ 6
ఆ కాలంలోనే విశ్వావసువు అనే గంధర్వుడు మేనక యందు కొడుకును కన్నాడు. (6)
అప్సరా మేనకా తస్య తం గర్భం భృగునందన ।
ఉత్ససర్జ యథాకాలం స్థూలకేశాశ్రమం ప్రతి ॥ 7
భృగునందనా! ఆ అప్సరస మేనక నెలలు నిండిన తరువాత స్థూలకేశుని ఆశ్రమ సమీపంలో ప్రసవించింది. (7)
ఉత్సృజ్వ చైవ తం గర్భం నద్యాస్తీరే జగామ సా ।
అప్సరా మేనకా బ్రహ్మన్ నిర్దయా నిరపత్రపా ॥ 8
నిర్దయురాలు, లజ్జాహీనురాలు అయిన మేనక (అనే ఆ అప్సరస) నదీతీరంలో ఆ బిడ్డను విడిచి వెళ్లిపోయింది. (8)
కన్యామమరగర్భాభాం జ్వలంతీమివ చ శ్రియా ।
తాం దదర్శ సముత్సృష్టాం నదీతీరే మహానృషిః ॥ 9
స్థూలకేశః స తేజస్వీ విజనే బంధువర్జితామ్ ।
స తాం దృష్ట్వా తదా కన్యాం స్థూలకేశో మహాద్విజః ॥ 10
జగ్రాహ చ మునిశ్రేష్ఠః కృపావిష్టః పుపోష చ ।
వవృథే సా వరారోహా తస్యాశ్రమపదే శుభే ॥ 11
మునిశ్రేష్ఠుడు, తేజస్వి అయిన స్థూలకేశ మహర్షి దేవతా-శిశువువలె దివ్య తేజస్సుతో అలరారుతున్న ఆ బాలికను చూచాడు. నదీతీరంలో ఒంటరిగా బంధువులందరి చేత విడువబడిన ఆ బాలికను చూచి అతడు దయాపూర్ణుడై తెచ్చి పెంచసాగాడు. ఆ సుందరి అతని ఆశ్రమంలో దినదిన ప్రవర్ధమానం అవుతోంది. (9-11)
జాతకాద్యాః క్రియాశ్చాస్యాః విధిపూర్వం యథాక్రమమ్ ।
స్థూలకేశో మహాభాగః చకార సుమహానృషిః ॥ 12
మహానుభావుడైన ఆ మహర్షి స్థూలకేశుడు ఆ బాలికకు జాతకర్మాది క్రియలన్నీ విధిపూర్వకంగా యథాక్రమంగా జరిపించాడు. (12)
ప్రమదాభ్యో వరా సా తు సత్త్వరూపగుణాన్వితా ।
తతః ప్రమద్వరేత్యస్యాః నామ చక్రే మహానృషిః ॥ 13
బుద్ధి, రూప, గుణాలతో ప్రమదలందరిలో శ్రేష్ఠురాలు కాబట్టి ఆమెకు ప్రమద్వర అని మహర్షి నామకరణం చేశాడు. (13)
తామాశ్రమపదే తస్య రురుర్దృష్ట్వా ప్రమద్వరామ్ ।
బభూవ కిల ధర్మాత్మా మదనోపహతస్తదా ॥ 14
స్థూలకేశమహర్షి ఆశ్రమంలో ప్రమద్వరను చూచి ధర్మాత్ముడయిన రురువు మదన పీడితుడైనాడు. (14)
పితరం సఖిభిః సోఽథ శ్రావయామాస భార్గవమ్ ।
ప్రమతిశ్చాభ్యయాచత్ తాం స్థూలకేశం యశస్వినమ్ ॥ 15
అతడు తన మిత్రుల ద్వారా తండ్రికి తన అవస్థను తెలియచేశాడు. ప్రమతి కూడా వాసికెక్కిన రురువుకు ఆమెను ఇమ్మని ఆ స్థూలకేశుని యాచించాడు. (15)
తతః ప్రాదాత్ పితా కన్యాం రురవే తాం ప్రమద్వరామ్ ।
వివాహం స్థాపయిత్వాగ్రే నక్షత్రే భగదైవతే ॥ 16
అంతట తండ్రి తన కుమార్తె ప్రమద్వరను రురువుకు ఇవ్వడానికి వాగ్దానం చేశాడు. ముందు రాబోయే ఉత్తరఫల్గునీ నక్షత్రంలో వివాహం చేయాలని నిశ్చయించాడు. (16)
తతః కతిపయాహస్య వివాహే సముపస్థితే ।
సఖీభిః క్రీడతీ సార్ధం సా కన్యా వరవర్ణినీ ॥ 17
వివాహం ఇక కొద్దిరోజులలో ఉందనగా ఆ సుందరి అయిన ప్రమద్వర చెలులతో కలిసి క్రీడిస్తూ ఉండగా (అడవిలో తిరుగుతోంది)....... (17)
నాపశ్యత్ సంప్రసుప్తం వై భుజంగం తిర్యగాయతమ్ ।
పదా చైనం సమాక్రమన్ ముమూర్షుః కాలచోదితా ॥ 18
దారిలో అడ్డంగా ఒక పెద్ద సర్పం పరచుకుని నిద్రపోవడం ప్రమద్వర చూడలేదు. ఆమె కాల ప్రేరితురాలై కాలితో తొక్కింది. (18)
స తస్యాః సంప్రమత్తాయాః చోదితః కాలధర్మణా ।
విషోపలిప్తాన్ దశనాన్ భృశమంగే న్యపాతయత్ ॥ 19
కాలధర్మానుసారంగా ఆ సర్పం బుస్సున లేచి అజాగ్రత్తగా ఉన్న ఆమె యొక్క శరీరం మీద విషయుక్తమైన కోరలతో కాటువేసింది. (19)
సా దష్టా తేన సర్పేణ పపాత సహసా భువి ।
వివర్ణా విగతశ్రీకా భ్రష్టాభరణచేతనా ॥ 20
నిరానందకరీ తేషాం బంధూనాం ముక్తమూర్ధజా ।
వ్యసుర ప్రేక్షణీయా సా ప్రేక్షణీయతమా భవత్ ॥ 21
ఆ పాము కరవగానే ఆమె నేలమీద వాలి పోయింది. శరీరం రంగు మారిపోయింది. సౌందర్యం నశించింది. ఆభరణాలు చెదరిపోయాయి. స్పృహ పోయింది. జుట్టు ముడి వీడి పోయింది. అది బంధువులకు శోకాన్ని కలిగించింది. అంతకు ముందు వరకు చూడచక్కగా ఉన్న ఆమె విగతజీవయై చూడ శక్యం కాకపోయింది. (20,21)
ప్రసుప్తే వాభవచ్చాపి భువి సర్పవిషార్దితా ।
భూయో మనోహరతరా బభూవ తనుమధ్యమా ॥ 22
ఆ తనుమధ్య సర్పవిషం చేత బాధపడుతూ నేల మీద పడినప్పటికీ నిద్రపోతున్నదానిలా మరింత మనోహరంగా కనిపించింది. (22)
దదర్శ తాం పితా చైవ యే చైవాన్యే తపస్వినః ।
విచేష్టమానాం పతితాం భూతలే పద్మవర్చసమ్ ॥ 23
కదలక మెదలక నేలమీద పడి తామరకాంతితో ఉన్న ఆమెను తండ్రియైన స్థూలకేశుడు, ఇతర తాపసులూ చూశారు. (23)
తతః సర్వే ద్విజవరాః సమాజగ్ముః కృపాన్వితాః ।
స్వస్త్యాత్రేయో మహాజానుః కుశికః శంఖమేఖలః ॥ 24
ఉద్దాలకః కఠశ్చైవ శ్వేతశ్చైవ మహాయశాః ।
భరద్వాజః కౌణకుత్స్యః ఆర్ష్టిషేణోఽథ గౌతమః ॥ 25
ప్రమతిః సహపుత్రేణ తథాన్యే వనవాసినః ।
అనంతరం స్వస్త్యాత్రేయుడు, మహాజానువు, కుశికుడు, శంఖమేఖలుడు, ఉద్దాలకుడు, కఠుడు, మహాకీర్తిశాలి శ్వేతుడు, భరద్వాజుడు, కౌణకుత్స్యుడు, ఆర్ష్టిషేణుడు, ఇంకా గౌతముడు, పుత్రునితో సహా ప్రమతి, ఇతర వనవాసులైన బ్రాహ్మణశ్రేష్ఠులు కృపావిష్టులై అక్కడికి చేరారు. (24-25 1/2)
తాం తే కన్యాం వ్యసుం దృష్ట్యా భుజంగస్య విషార్దితామ్ ॥ 26
రురుదుః కృపయా విష్టాః రురుస్త్వార్తో బహిర్యయౌ ।
తే చ సర్వే ద్విజశ్రేష్టాః తత్రైవోపావిశంస్తదా ॥ 27
పాము కాటు చేత ప్రాణాలు కోల్పోయిన ఆ కన్యను చూచి కృపతో వారందరూ రోదించారు. రురువు మిక్కిలి ఆర్తితో బయటకు వెళ్లిపోయాడు. మిగిలిన బ్రాహ్మణోత్తములందరూ అక్కడే కూర్చున్నారు. (26,27)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి ప్రమద్వరాసర్పదంశేఽష్టమోఽధ్యాయః ॥ 8 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున పౌలోమ పర్వమను ఉపపర్వమున ప్రమద్వర సర్పదష్ట యగుట అను ఎనిమిదవ అధ్యాయము. (8)
(దాక్షిణాత్య అధికపాఠము 1/2 శ్లోకము కలిపి 27 1/2 శ్లోకాలు)