12. పండ్రెండవ అధ్యాయము

సర్పయాగమును గురించి రురుడు తండ్రిని అడిగి తెలిసికొనుట.

రురు రువాచ
కథం హింసితవాన్ సర్పాన్ స రాజా జనమేజయః ।
సర్పా వా హింసితాస్తత్ర కిమర్థం ద్విజసత్తమ ॥ 1
రురువు అడిగాడు - "ద్విజోత్తమా! ఆ జనమేజయమహారాజు సర్పాలను ఎలా హింసించాడు? అయినా సర్పాలను యజ్ఞంలో ఎందుకు చంపించాడు? (1)
కిమిర్థం మోక్షితాశ్చైవ పన్నగాస్తేన ధీమతా ।
ఆస్తీకేన ద్విజశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యశేషతః ॥ 2
విప్రోత్తమా! బుద్ధిమంతుడైన ఆ ఆస్తీకుడు ఎందుకు సర్పాలను రక్షించాడు? అంతా సవిస్తరంగా వినాలని ఉంది."
ఋషి రువాచ
శ్రోష్యసి త్వం రురో సర్వమ్ ఆస్తీకచరితం మహత్ ।
బ్రాహ్మణానాం కథయతాం ఇత్యుక్త్వాంతరధీయత ॥
ఋషి అన్నాడు - "రురూ! గొప్పదైన ఆస్తీకచరితం అంతా బ్రాహ్మణులు చెపుతూంటే నీవు విందువుగాని" అని చెప్పి అతడు అంతర్ధానమయ్యాడు. (3)
సౌతిరువాచ
రురుశ్చాపి వనం సర్వం పర్యధావత్ సమంతతః ।
తమృషిం నష్టమన్విచ్ఛన్ సంశ్రాంతో న్యపతద్ భువి ॥
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు - రురువు అదృశ్యమైన ఆ మునిని వెదకుతూ ఆ అడవి అంతా అన్నివైపుల పరుగెత్తి గాలించాడు. చివరికి అలసిపోయి నేలపై పడిపోయాడు. (4)
స మోహం పరమం గత్వా నష్టసంజ్ఞ ఇవాభవత్ ।
తదృషేర్వచనం తథ్యం చింతయానః పునః పునః ॥ 5
లబ్దసంజ్ఞో రురుశ్చాయాత్ తదాచఖ్యౌ పితుస్తతః ।
పితా చాస్య తదాఖ్యానం పృష్టః సర్వం న్యవేదయత్ ॥ 6
అతనికి మూర్ఛవచ్చి స్మృతి తప్పిన వానిలా అయిపోయాడు. ఆ ఋషి యొక్క మాటలలో నిజమెంతయా అని మాటిమాటికి ఆలోచిస్తూ తెలివి వచ్చాక ఇంటికి వచ్చాడు. తండ్రికి అదంతా చెప్పాడు. అతడు అడిగిన వెంటనే తండ్రి యావద్వృత్తాంతాన్ని అతనికి వినిపించాడు. (5,6)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి సర్పసత్రప్రస్తావనాయాం ద్వాదశోఽధ్యాయః ॥ 12 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున పౌలోమపర్వమను ఉపపర్వమున సర్పసత్రప్రస్తావనమను పండ్రెండవ అధ్యాయము. (12)