13. పదుమూడవ అధ్యాయము

(ఆస్తీక పర్వము)

జరత్కారుడు పితరుల ఆజ్ఞతో వివాహమునకు అంగీకరించుట.

శౌనక ఉవాచ
కిమర్థం రాజశార్దూలః స రాజా జనమేజయః ।
సర్పసత్రేణ సర్పాణాం గతోఽంతం తద్ వదస్వ మే ॥ 1
నిఖిలేన యథాతత్త్వం సౌతే సర్వమశేషతః ।
ఆస్తీకశ్చ ద్విజశ్రేష్ఠః కిమర్థం జపతాం వరః ॥ 2
మోక్షయామాస భుజగాన్ ప్రదీప్తాత్ వసురేతసః ।
కస్య పుత్రః స రాజాసీత్ సర్పసత్రం య ఆహరత్ ॥ 3
స చ ద్విజాతిప్రవరః కస్య పుత్రోఽభిధత్స్వ మే ।
సౌనకమహర్షి సూతపుత్రుని అడుగుతున్నాడు. ఉగ్రశ్రవసా! ఉత్తముడైన జనమేజయుడు ఎందుకు సర్పయాగం చేశాడు? సర్పాలను ఎందుకు నశింపజేశాడు? ఈ విషయాన్ని నాకు వివరంగా చెప్పవలసినదిగా కోరుతున్నాను. బ్రాహ్మణోత్తముడైన ఆస్తీకుడు యాగాగ్నిలో ధ్వంసం అవుతున్న సర్పాలను ఎట్లా రక్షించాడు? సర్పయాగం చేసిన జనమేజయుడు ఎవరి కుమారుడు? ఆ ఆస్తీకుడు ఎవరి పుత్రుడు? ఈ విషయాలను నాకు వివరించి చెప్పవలసినది. (1-3 1/2)
సౌతి రువాచ
మహదాఖ్యాన మాస్తీకం యథైతత్ ప్రోచ్యతే ద్విజ ॥ 4
సర్వమేతదశేషేణ శృణు మే వదతాం వర ।
శౌనకమహర్షికి ఉగ్రశ్రవసుడు ఈ విధంగా చెప్తున్నాడు. బ్రాహ్మణోత్తమా! ఆస్తీకుని గురించిన కథ చాలాపెద్దది. నీ కోరిక ప్రకారం పూర్తిగా ఆస్తీకుని కథను చెప్తాను. విను. (4 1/2)
శౌనక ఉవాచ
శ్రోతుమిచ్ఛామ్యశేషేణ కథామేతాం మనోరమామ్ ॥
ఆస్తీకస్య పురాణర్షేః బ్రాహ్మణస్య యశస్వినః ।
శౌనకుడు ఇలా అన్నాడు. ఋషిపుంగవుడు, బ్రాహ్మణోత్తముడూ అయిన ఆస్తీకుని వృత్తాంతం సుందరమయినది గదా! ఆ కథను పూర్తిగా వినాలని కుతూహలపడుతున్నాను. (5 1/2)
సౌతిరువాచ
ఇతిహాసమిమం విప్రాః పురాణం పరిచక్షతే ॥ 6
కృష్ణద్వైపాయనప్రోక్తం నైమిషారణ్యవాసిషు ।
పూర్వం ప్రచోదితః సూతః పితా మే లోమహర్షణః ॥ 7
శిష్యో వ్యాసస్య మేధావీ బ్రాహ్మణేష్విదముక్తవాన్ ।
తస్మాదహముపశ్రుత్య ప్రవక్ష్యామి యథాతథమ్ ॥ 8
సౌతి శౌనకునకు చెపుతున్నాడు. తాపసోత్తమా! విజ్ఞానులందరూ ఈ కథ చాల పురాతనమైనదని చెపుతున్నారు. కృష్ణద్వైపాయనుడు (వ్యాసభగవానుడు) కథను చెప్పాడు. పూర్వం నా తండ్రి లోమహర్షణుడు వ్యాసుని శిష్యునిగా ప్రఖ్యాతి కెక్కాడు. అతడు మా తండ్రి నైమిశారణ్యవాసులకు భారత కథను చెప్పాడు. మా తండ్రి వలన ఈ కథను విని నేను నీకు ఉన్నదున్నట్లు చెపుతున్నాను. (6-8)
వి: లోమహర్షణుడు రోమహర్షణుడు ఇద్దరూ ఒకడే.
ఇదమాస్తీకమాఖ్యానం తుభ్యం శౌనక పృచ్ఛతే ।
కథయిష్యామ్యశేషేణ సర్వపాపప్రణాశనమ్ ॥ 9
ఈ ఆస్తీకుని వృత్తాంతం వింటే సర్వపాపాలు నశిస్తాయి. అటువంటి ఆఖ్యానాన్ని నీవు అడిగావు. కాబట్టి పూర్తిగా ఈ వృత్తాంతాన్ని నీకు చెప్తాను. (9)
ఆస్తీకస్య పితా హ్యాసీత్ ప్రజాపతిసమః ప్రభుః ।
బ్రహ్మచారీ యతాహారః తపస్యుగ్రే రతః సదా ॥ 10
ఆస్తీకుని తండ్రి బ్రహ్మతో సమానుడు. అతడు బ్రహ్మచారిగా ఉంటూ ఆహారనియమాలను పాటిస్తూ, ఉగ్రమైన తపస్సు చేసుకొంటూ, ఉండేవాడు. (10)
జరత్కారురితి ఖ్యాతః ఊర్ధ్వరేతా మహాతపాః ।
యాయావరాణాం ప్రవరః ధర్మజ్ఞః సంశితవ్రతః ॥ 11
స కదాచిన్మహాభాగః తపోబలసమన్వితః ।
చచార పృథివీం సర్వాం యత్ర సాయంగృహో మునిః ॥ 12
అలా శరీరాన్ని కృశింపజేసుకొంటున్న కారణంగా ఆ బ్రాహ్మణునికి జరత్కారువు అనే పేరు సార్థకమయింది. అతడు మహాతపస్సంపన్నుడు. బ్రహ్మచారిగా సంయమనంతో జీవయాత్ర సాగిస్తున్నాడు. యాయావరవంశంలో ప్రఖ్యాతిని పొందిన ధర్మజ్ఞుడు. కఠినమైన వ్రతాల్ని చేస్తున్నాడు. తీర్థయాత్రలు చేస్తూ సూర్యాస్తమయ సమయానికి ఉన్న గ్రామంలోనే ఆ మహానుభావుడు ఆ రాత్రి గడిపేవాడు. (11,12)
తీర్థేషు చ సమాప్లావం కుర్వన్నటతి సర్వశః ।
చరన్ దీక్షాం మహాతేజాః దుశ్చరామకృతాత్మభిః ॥ 13
అతడు అన్ని తీర్థాల్లోను స్నానం చేస్తూ దేశం అంతా తిరుగుతున్నాడు. మహాతేజోవంతుడయిన ఆ జరత్కారువు మోక్షాన్ని కోరి ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటూ జీవయాత్రను సాగిస్తున్నాడు. (13)
వాయుభక్షో నిరాహారః శుష్యన్ననిమిషో మునిః ।
ఇతస్తతః పరిచరన్ దీప్తపావకసప్రభః ॥ 14
అటమానః కదాచిత్ స్వాన్ స దదర్శ పితామహాన్ ।
లంబమానాన్ మహాగర్తే పాదైరూర్ధ్వైరవాఙ్ముఖాన్ ॥ 15
ఆ తాపసోత్తముడు ఆహారం మానేసి గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నాడు. నిద్రను కూడా జయించాడు. ప్రకాశిస్తున్న అగ్నిలా వెలిగిపోతూ దేశాటనం చేస్తున్నాడు. ఆ విధంగా తిరుగుతూ ఉన్న అతడు ఒక పెద్దగుంటలో తలక్రిందులుగ వ్రేలాడుతున్న తన తాతలను చూశాడు. (14,15)
వి: సం: ఆహారం = విషయభోగాసక్తి (నీల)
తానబ్రవీత్ స దృష్ట్వైవ జరత్కారుః పితామహాన్ ।
కే భవంతోఽవలంబంతే గర్తే హ్యస్మిన్నధోముఖాః ॥ 16
వారిని చూసి జరత్కారువు ఈ విధంగా ప్రశ్నించాడు. "మీరు ఎవరు? ఒకే ఒక వేరుతో ఉన్న ఈ చెట్టుకొమ్మకు ఎందుకు తలక్రిందులుగా వేళ్లాడుతున్నారు? (16)
వీరణస్తంబకే లగ్నాః సర్వతః పరిభక్షితే ।
మూషికేన నిగూఢేన గర్థేఽస్మిన్ నిత్యవాసినా ॥ 17
ఈ గుంటలో రహస్యంగా ఉంటున్న ఎలుక ఈ వట్టి వేళ్ల నన్నిటినీ కొరికి వేసింది గదా! మిగిలింది ఒక వేరే కదా!" (17)
పితర ఊచుః
యాయావరా నామ వయమ్ ఋషయః సంశితవ్రతాః ।
సంతానప్రక్షయాద్ బ్రహ్మన్ అధోగచ్ఛామ మేదినీమ్ ॥
అతని పితరులు ఇట్లా చెపుతున్నారు. బ్రాహ్మణా! మేము ఒక్కొక్క గ్రామంలో ఒక్కరోజు మాత్రమే ఉండి మరునాడు మరొక గ్రామానికి వెడుతూ ఉంటాము. అందుచేత మా వంశానికి యాయావరవంశమని పేరు వచ్చింది. మేము కఠినమైన వ్రతాలు చేసుకొంటూ సంచరిస్తున్నాము. మా సంతానం నశిస్తూండటం వలన మేము అధోలోకానికి పోతున్నాము. (18)
అస్మాకం సంతతిస్త్వేకః జరత్కారురితి స్మృతః ।
మందభాగ్యోఽల్పభాగ్యానాం తప ఏవ సమాస్థితః ॥ 19
మా సంతతిలో జరత్కారువు అనే ఒక అభాగ్యుడు ఉన్నాడు. అతడు దురదృష్టవశాత్తు మా వంశంలో పుట్టి కఠిన తపస్సుతో మోక్షం పొందాలని జీవయాత్ర సాగిస్తున్నాడు. (19)
న స పుత్రాన్ జనయితం దారాన్ మూఢశ్చికీర్షతి ।
తేన లంబామహే గర్తే సంతానస్య క్షయాదిహ ॥ 20
అనాథాస్తేన నాథేన యథా దుష్కృతినస్తథా ।
కస్త్వం బంధురివాస్మాకమ్ అనుశోచసి సత్తమ ॥ 21
జ్ఞాతుమిచ్ఛామహే బ్రహ్మన్ కో భవానిహ నః స్థితః ।
కిమర్థం చైవ నః శోచ్యాన్ అనుశోచసి సత్తమ ॥ 22
సంతానం మీద కోరిక లేకపోవడం చేత ఆ మూర్ఖుడు వివాహం చేసుకోవడం లేదు. కాబట్టి మా వంశం నశిస్తున్న కారణంగా ఈ గుంటలో వ్రేలాడుతున్నాము. జరత్కారువు సంతానం పొందకపోతే మేమందరం నరకానికి పోవలసిందే సుమా! పాపకర్ములమైన మేము అనాథులము. మహానుభావా! నీవెవ్వరవు? మా బంధువువలె దుఃఖంతో ఉన్న మమ్ము చూచి దయ చూపుతున్నావు గదా! నాయనా! నీవు ఎవ్వరివో తెలుసుకొనగోరుతున్నాము. మా దుఃస్థితిని చూచి నీవు ఎందుకు విచారపడుతున్నావు? (20-22)
వి: సం: భూలోకం వీరణస్తంబం. వంశం వృక్షం. మూషికం యముడు. (నీల)
జరత్కారురువాచ
మమ పూర్వే భవంతో వై పితరః సపితామహాః ।
బ్రూత కిం కరవాణ్యద్య జరత్కారురహం స్వయమ్ ॥ 23
ఆ మాటలను విన్న జరత్కారువు "మహత్ములారా! మీరందరు నా పితామహులనీ, పితృగణంలోని వారనీ తెలుసుకొని ఆనందిస్తున్నాను. నన్ను జరత్కారువు అంటారు. నేను ఇపుడేమి చేయవలెనో నాకు తెలియజేయగోరుతున్నాను." (23)
యతస్వ యత్నవాంస్తాత సంతానాయ కులస్య నః ।
ఆత్మనోఽర్థేఽస్మదర్థే చ ధర్మ ఇత్వేవ వా విభో ॥ 24
నాయనా! మన వంశాన్ని నిలపడానికి సంతానం పొందే ప్రయత్నం చెయ్యి. నీ ఊర్ధ్వగతికి, మా ఉద్ధరణకు మాత్రమే కాకుండా ధర్మోద్ధరణకు కూడా సంతానాన్ని పొందాలి. (24)
న హి ధర్మ ఫలైస్తాత న తపోభిః సుసంచితైః ।
తాం గతిం ప్రాప్నువంతీహ పుత్రిణో యాం వ్రజంతి వై ॥ 25
పుత్రులు కలవారు పొందే లోకాలను ఇతరులు ఎంత గొప్ప తపస్సు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా పొందలేరు. (25)
తద్ దారగ్రహణే యత్నం సంతత్యాం చ మనః కురు ।
పుత్రకాస్మాన్నియోగాత్ త్వమ్ ఏతన్నః పరమం హితమ్ ॥ 26
కుమారా! ఆ కారణం చేత వివాహం చేసుకో. సంతానాన్ని పొందు. మమ్మల్ని ఊర్ధ్వలోకాలకు పంపించు. ఇదే మాకు చాలా ఇష్టం. (26)
జరత్కారు రువాచ
న దారాన్ వై కరిష్యేఽహం న ధనం జీవితార్థతః ।
భవితాం తు హితార్థాయ కరిష్యే దారసంగ్రహమ్ ॥ 27
అపుడు జరత్కారువు వారితో ఇట్లా అన్నాడు. పితామహులారా! నేను జీవితంలో సుఖభోగాలకోసం ఆశపడటం లేదు. మీ మేలుకోరి మాత్రమే ఇపుడు నేను వివాహం చేసుకోవాలనుకొంటున్నాను. (27)
వి: సం: ఇది ఈ అధ్యాయం యొక్క తాత్పర్యం - భోగాల కోసం కాని ధనం కోసం కాని, భార్యను స్వీకరింపరాదు - ధనం యజ్ఞాలకోసం, భార్యను పుత్రులకోసం, స్వీకరించాలని తాత్పర్యం. (నీల)
సమయేన చ కర్తాహమ్ అనేన విధిపూర్వకమ్ ।
తథా యదుపలప్స్యామి కరిష్యే నాన్యథా హ్యహమ్ ॥ 28
అయితే ఒక నిబంధనకు లోబడి మాత్రమే శాస్త్రోక్తంగా వివాహం చేసుకొంటాను. (28)
సనామ్నీ యా భవిత్రీ మే దిత్సితా చైవ బంధుభిః ।
భైక్ష్యవత్తామహం కన్యామ్ ఉపయంస్యే విధానతః ॥ 29
ఆ కన్యక నాపేరుగలదై ఉండాలి. ఇదే నా నిబంధన. నా పేరుగల కన్యను బంధువులిస్తే భిక్ష వలె స్వీకరిస్తాను. ఆమెను ధర్మయుక్తంగా వివాహం చేసుకొంటాను. (29)
దరిద్రాయ హి మే భార్యాం కో దాస్యతి విశేషతః ।
ప్రతిగ్రహీషే భిక్షాం ను యది కశ్చిత్ ప్రదాస్యతి ॥ 30
దరిద్రుడనైన నాకు ఎవరు అట్టి కన్యను భార్యగా ఇస్తారు? ఎవరయినా అనుగ్రహించి దానం చేస్తే ఆ కన్యను తప్పక వివాహం చేసుకొంటాను. (30)
ఏవం దారక్రియాహేతోః ప్రయతిష్యే పితామహాః ।
అనేన విధినా శశ్వత్ న కరిష్యేఽహమన్యథా ॥ 31
పితామహులారా! నేను ఈ విధంగా వివాహం చేసుకోడానికి తప్పక ప్రయత్నం చేస్తాను. లేదా విరమిస్తాను. (31)
తత్ర చోత్పత్స్యతే జంతుః భవితాం తారణాయ వై ।
శాస్వతం స్థాన మాసాద్య మోదంతాం పితరో మమ ॥ 32
ఆ విధంగా నాకు లభించిన భార్యయందు జన్మించే కుమారుడు మిమ్మల్ని తప్పకుండా ఉద్ధరిస్తాడు. కాబట్టి మీరు మీ శాశ్వత స్థానాలకు వెళ్లి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి. (32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి జరత్కారు తత్ పితృసంవాదే త్రయోదశోఽధ్యాయః ॥ 13 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున జరత్కారునకు పితరులకు జరిగిన సంవాదము అను పదుమూడవ అధ్యాయము. (13)