19. పందొమ్మిదవ అధ్యాయము
దేవదానవ యుద్ధము.
సౌతిరువాచ
అథావరణముఖ్యాని నానాప్రహరణాని చ ।
ప్రగృహ్యాభ్యద్రవన్ దేవాన్ సహితా దైత్యదానవాః ॥ 1
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు - దైత్యదానవులు అందరూ ఏకమై కవచాది - అస్త్రశస్త్రాలతో దేవతలపై ఉరికారు. (1)
తతస్తదమృతం దేవః విష్ణురాదాయ వీర్యవాన్ ।
జహార దానవేంద్రేభ్యః నరేణ సహితః ప్రభుః ॥ 2
తతో దేవగణాః సర్వే పపుస్తదమృతం తదా ।
విష్ణోః సకాశాత్ సంప్రాప్య సంభ్రమే తుములే సతి ॥ 3
అపుడు నరునితో కూడిన మహావిష్ణువు దానవేంద్రుల నుండి అమృతభాండాన్ని తీసుకొని దేవతలకు పంచుతున్నాడు. దేవతలందరూ అమృతపానం చేస్తున్నారు. (2,3)
తతః పిబత్సు తత్కాలం దేవేష్వమృత మీప్సితమ్ ।
రాహుర్విబుధరూపేణ దానవః ప్రాపిబత్ తదా ॥ 4
దేవతలు అమృతపానం చేస్తూండగా రాహువు అనే రాక్షసుడు దేవతారూపంలో వారి మధ్య కూర్చుండి అమృతపానం చేశాడు. (4)
తస్య కంఠమనుప్రాప్తే దానవస్యామృతే తదా ।
ఆఖ్యాతం చంద్రసూర్యాభ్యాం సురాణాం హితకామ్యయా ॥ 5
రాహువు కంఠంలో అమృతం పడిందో లేదో ఈ విషయాన్ని గమనించిన సూర్యచంద్రులు దేవతల మేలు కోరి నారాయణమూర్తికి చెప్పారు. (5)
తతో భగవతా తస్య శిరశ్ఛిన్నమలంకృతమ్ ।
చక్రాయుధేన చక్రేణ పిబతోఽమృతమోజసా ॥ 6
అపుడు వెంటనే తన చక్రాయుధంతో నారాయణుడు రాహుకంఠాన్ని తెగగొట్టాడు. అమృతం కంఠం క్రిందికి దిగకముందే చక్రం ప్రయోగించడంతో దేహం క్రిందపడింది. కంఠం మాత్రం సజీవంగా ఉంది. (6)
తచ్ఛైలశృంగప్రతిమం దానవస్య శిరో మహత్ ।
చక్రచ్ఛిన్నం సముత్పత్య ననాదాతిభయంకరమ్ ॥ 7
పర్వతశిఖరంలా ఉన్న ఆ రాక్షసుని శిరస్సు చక్రం చేత ఛేదింపబడి అతిభయంకరంగా ధ్వనించింది. (7)
తత్ కబంధం పపాతాస్య విస్ఫురద్ ధరణీతలే ।
సపర్వతవనద్వీపాం దైత్యస్యాకంపయన్ మహీమ్ ॥ 8
రాహువు యొక్క మొండెం భూమి మీద పడింది. పడినపుడు పర్వతాలు, అడవులు, భూమి కంపించాయి. (8)
తతో వైరవినిర్బంధః కృతో రాహుముఖేన వై ।
శాశ్వతశ్చంద్రసూర్యాభ్యాం గ్రసత్యద్యాపి చైవ తౌ ॥ 9
ఆ నాటి నుండి రాహువు సూర్యచంద్రులపై విరోధంతో వారిని మ్రింగుతూనే ఉన్నాడు. (9)
విహాయ భగవాంశ్చాపి స్త్రీరూపమతులం హరిః ।
నానాప్రహరణైర్భీమైః దానవాన్ సమకంపయత్ ॥ 10
దేవతలు అమృతాన్ని తాగిన పిదప విష్ణువు మోహినీ రూపాన్ని విడిచి భయంకరమైన అస్త్రశస్త్రాలతో రాక్షసుల్ని భయకంపితుల్ని చేశాడు. (10)
తతః ప్రవృత్తః సంగ్రామః సమీపే లవణాంభసః ।
సురాణా మసురాణాం చ సర్వఘోరతరో మహాన్ ॥ 11
లవణ సముద్రం దగ్గర యుద్ధం ప్రారంభమయింది. దేవదానవుల యుద్ధం భయంకరంగా జరిగింది. (11)
ప్రాసాశ్చ విపులాస్తీక్ణాః న్యపతంత సహస్రశః ।
తోమరాశ్చ సుతీక్ష్ణాగ్రాః శస్త్రాణి వివిధాని చ ॥ 12
ప్రాసం, కుంతం, తోమరం మొదలగు ఆయుధాల్ని, అనేక శస్త్రాల్ని ప్రయోగిస్తూ యుద్ధం చేశారు. (12)
తతోఽసురాశ్చక్రభిన్నాః వమంతో రుధిరం బహు ।
అసి శక్తి గదా రుగ్ణాః నిపేతుర్ధరణీతలే ॥ 13
భిన్నాని పట్టిశైశ్చెవ శిరాంసి యుధి దారుణైః ।
తప్తకాంచనమాలీని నిపేతురనిశం తదా ॥ 14
నారాయణుని చక్రప్రహారంతో రాక్షసులు నెత్తురు కక్కుకొన్నారు. ఖడ్గం, శక్తి, గద మొదలయిన ఆయుధాల దెబ్బలతో వారు నేలకూలారు. బంగారు కాంతులతో ప్రకాశించే పట్టిశం అనే ఆయుధంతో ఎందరో రాక్షసులు మరణించారు. (13,14)
రుధిరేణామలిప్తాంగాః నిహతాశ్చ మహాసురాః ।
అద్రీణామివ కూటాని ధాతురక్తాని శేరతే ॥ 15
శరీరం అంతా రక్తంతో తడిసి రాక్షసులు అందరూ గైరికాది ధాతువులతో కూడిన పర్వతాల లాగ నేలకూలారు. (15)
హాహాకారః సమభవత్ తత్ర తత్ర సహస్రశః ।
అన్యోన్యం ఛిందతాం శస్త్రైః ఆదిత్యే లోహితాయతి ॥ 16
అనేకులు వేలకొద్దీ హాహాకారాలు చేశారు. సూర్యాస్తమయ సమయానికి వారందరూ హతులయ్యారు. (16)
పరిఘైరాయసైస్తీక్ష్ణైః సంనికర్షే చ ముష్టిభిః ।
నిఘ్నతాం సమరేఽన్యోన్యం శబ్దో దివమివాస్పృశత్ ॥ 17
తీక్ష్ణమైన పరిఘ అనే ఆయుధంతో కొంతసేపు యుద్ధం చేశారు. దగ్గరై పిడికిలి పోటులతో అన్యోన్యం దెబ్బలాడుకున్నారు. పిడికిళ్ల శబ్దం ఆకాశం అంటింది. (17)
ఛింది భిన్ది ప్రధావ త్వం పాతయాభిసరేతి చ ।
వ్యశ్రూయంత మహోఘోరాః శబ్దాస్తత్ర సమంతతః ॥ 18
కొట్టు, చంపు, పొడు, క్రిందపడేయి మొదలైన శబ్దాలతో యుద్ధభూమి అంతటా ధ్వనించింది. (18)
ఏవం సుతుమలే యుద్ధే వర్తమానే మహాభయే ।
నర నారాయణౌ దేవౌ సమాజగ్మతురాహవమ్ ॥ 19
ఈ విధంగా భయంకర యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధభూమిలో నరనారాయణులు ప్రవేశించారు. (19)
తత్ర దివ్యం ధనుర్దృష్ట్వా నరస్య భగవానపి ।
చింతయామాస తచ్చక్రం విష్ణుర్దానవసూదనమ్ ॥ 20
భగవానుడు నరునిచేతిలోని దివ్యమైన ధనుస్సును చూచి తాను కూడా దానవసంహారానికి చక్రాన్ని ధరించాలని అనుకొన్నాడు. (20)
తతోఽంబరాచ్చింతిత మాత్ర మాగతం
మహాప్రభం చక్రమమిత్రతాపనమ్ ।
విభావసో స్తుల్య మకుంఠమండలం సుదర్శనం సంయతి భీమదర్శనమ్ ॥ 21
ఆ నారాయణమూర్తి సంకల్పించినంత మాత్రం చేతనే కాంతులను విరజిమ్ముతూ సూర్యతేజస్సుతో ఆకాశం నుండి చక్రం అతనిని చేరింది. అది సుదర్శన చక్రం. శత్రుభయంకరమైనది. అది అకుంఠితం. దానికి తిరుగులేదు. (21)
తథాగతం జ్వలితహుతాశన ప్రభం
భయంకరం కరికరబాహురచ్యుతః ।
ముమోచ వై ప్రబలవదుగ్రవేగవాన్
మహాప్రభం పరనగరావదారణమ్ ॥ 22
వచ్చిన చక్రాయుధం జ్వలిస్తున్న అగ్నిలాగా భయంకరంగా ఉంది. శత్రు నగరాలను ధ్వంసం చేసే శక్తి కలిగింది. అటువంటి చక్రాన్ని నారాయణుడు రాక్షసులపై ప్రయోగించాడు. (22)
తదంతకజ్వలన సమాన వర్చసం
పునః పునర్న్యపతత వేగవత్తదా ।
విదారయద్దితిదనుజాన్ సహస్రశః
కరేరితం పురుషవరేణ సంయుగే ॥ 23
నారాయణునిచే విడువబడిన చక్రం ప్రళయకాలాగ్నిలాగ వేగంగా ఎన్నోసార్లు వెళ్లి పడి వేలాది రాక్షసుల్ని సంహరించింది. (23)
దహత్ క్వచిజ్జ్వలన ఇవావలేలిహత్
ప్రసహ్య తానసురగణాన్ న్యకృంతత ।
ప్రవేరితం వియతి ముహుః క్షితౌ తథా
పపౌ రణే రుధిరమథో పిశాచవత్ ॥ 24
నారాయణుని చేతి నుండి వెడలిన చక్రం ఒకసారి అగ్నిలా అసుర గణాలను నాకివేస్తూ నరికివేసింది. భూమ్యాకాశాలు ఆక్రమించి పిశాచంలా రక్తం త్రాగింది. (24)
తథాసురా గిరిభిరదీనచేతసః
ముహుర్ముహుః సురగణ మార్దయంస్తదా ।
మహాబలా విగలిత మేఘవర్చసః
సహస్రశో గగనమభిప్రపద్య హ ॥ 25
ఆ సమయంలో దానవులు కూడా ఉత్సాహంతో మహాబలంతో దేవతలపై పర్వతాల్ని పడవేసి నీరులేని మేఘాలవలె ఆకాశమంతా ఆక్రమించి వేలకొలదీ దేవతలను పీడించారు. (25)
అథాంబరాద్ భయజననాః ప్రపేదిరే
సపాదపా బహువిధమేఘరూపిణః ।
మహాద్రయః పరిగలితాగ్రసానవః
పరస్పరం ద్రుతమభిహత్య సస్వనాః ॥ 26
అనేకాలయిన రంగులతో కూడిన మేఘాల వలె చెట్లు భయంకరంగా ఆకాశం నుండి పడుతున్నాయి. కొండ శిఖరాలు ఒకదానినొకటి కొట్టుకొంటూ పెద్దశబ్దంతో వేగంగా క్రిందికి పడుతున్నాయి. (26)
తతో మహీ ప్రవిచలితా సకాననా
మహాద్రిపాతాభిహతా సమంతతః ।
పరస్పరం భృశమభిగర్జతాం ముహుః
రణాజిరే భృశమభిసంప్రవర్తతే ॥ 27
పడిన కొండ శిఖరాలతోనూ, అడవులతోనూ కూడిన భూమి అంతటా కంపించి పోతోంది. యుద్ధంలో దేవదానవులు పరస్పరం గర్జనలు చేస్తూ కొట్టుకొంటున్నారు. (27)
నరస్తతో వరకనకాగ్రభూషణైః
మహేషుభిర్గగనపథం సమావృణోత్ ।
విదారయన్ గిరిశిఖరాణి పత్రిభిః
మహాభయేఽసురగణ విగ్రహే తదా ॥ 28
భయంకరమయిన ఆ దేవ దానవ సంగ్రామంలో నరుడు సువర్ణమయమయిన బాణాలతో గిరిశిఖరాలను చీల్చివేస్తున్నాడు. (28)
తతో మహీం లవణజలం చ సాగరం
మహాసురాః ప్రవివిశురర్దితా సురైః ।
వియద్గతం జ్వలితహుతాశనప్రభం
సుదర్శనం పరికుపితం నిశమ్య తే ॥ 29
ఇంతలో అగ్నిహోత్రునిలా మంటలు గ్రక్కుతూ ఆకాశమంతా వ్యాపించి సుదర్శన చక్రం వస్తోందని విని దానవులంతా భూమిలోనికీ, సముద్రంలోనికీ దూరారు. (29)
తతః సురై ర్విజయమవాప్య మందరః
స్వమేవ దేశం గమితః సుపూజితః ।
వినాద్య ఖం దివమపి చైవ సర్వశః
తతో గతాః సలిలధరా యథాగతమ్ ॥ 30
తరువాత దేవతలు విజయం పొంది మందర పర్వతాన్ని పూజించి పూర్వస్థానానికి పంపారు. దేవతలు ఆకాశమూ, స్వర్గమూ అంతటా వినిపించేటట్లు సింహనాదం చేస్తూ తమ స్థానాలకు వెళ్లి పోయారు. (30)
తతోఽమృతం సునిహితమేవ చక్రిరే
సురాః పరాం ముదమభిగమ్య పుష్కలమ్ ।
దదౌ చ తం నిధిమమృతస్య రక్షితుం
కిరీటినే బలభిదథామరైః సహ ॥ 31
ఈ విజయంతో దేవతలు చాలా సంతోషించారు. దేవేంద్రాది దేవతలు ఆ అమృతనిధిని రక్షించటానికి నరునికిచ్చి చక్కని రక్షణ వ్యవస్థ కల్పించారు. (31)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి అమృతమంథనసమాప్తిర్నామ ఏకోనవింశోఽధ్యాయః ॥ 19 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున అమృతమథన సమాప్తి అను పందొమ్మిదవ అధ్యాయము. (19)