20. ఇరువదియవ అధ్యాయము
కద్రూ వినతల పందెము, కద్రువ తన పుత్రులను శపించుట.
సౌతిరువాచ
ఏతత్ తే కథితం సర్వమ్ అమృతం మథితం యథా ।
యత్ర సోఽశ్వః సముత్పన్నః శ్రీమానతులవిక్రమః ॥ 1
యం నిశమ్య తదా కద్రూః వినతామిదమబ్రవీత్ ।
ఉచ్చైఃశ్రవా హి కిం వర్ణః భద్రే ప్రబ్రూహి మా చిరమ్ ॥ 2
ఉగ్రశ్రవుడు ఇలా చెపుతున్నాడు. అమృతం ఉద్భవించిన తీరు అంతా నీకు చెప్పాను. ఆ అమృతం పుట్టిన సమయంలోనే ఉచ్చైఃశ్రవం అనే గుఱ్ఱం కూడా ఉద్భవించింది. ఒకనాడు కద్రూవినతలు ఆ అశ్వాన్ని చూశారు. అపుడు కద్రువ వినతతో "ఆ గుఱ్ఱం ఏ రంగులో ఉంది? త్వరగా చెప్పు" అంది. (1,2)
వినతోవాచ
శ్వేత ఏవాశ్వరాజోఽయం కిం వా త్వం మన్యసే శుభే ।
బ్రూహి వర్ణం త్వమప్యస్య తతోఽత్ర విపణావహే ॥ 3
వినత అన్నది. ఆ గుఱ్ఱం తెల్లగానే ఉంది. నీవు ఏమి అనుకొంటున్నావు? నీవు గూడా దాని రంగు ఏదో చెప్పు. పందెం వేసుకొందాం" అంది. (3)
కద్రూరువాచ
కృష్ణవాలమహం మన్యే హయమేనం శుచిస్మితే ।
ఏహి సార్ధం మయా దీవ్య దాసీభావాయ భామిని ॥ 4
కద్రువ ఇలా అంది. "దాని తోక నల్లగా ఉందను కొంటున్నాను. నీకు చేతనయితే "దాస్యం" పందెం పెట్టుకో నాతో" అంది. (4)
సౌతిరువాచ
ఏవం తే సమయం కృత్వా దాసీభావాయ వై మిథః ।
జగ్మతుః స్వగృహానేవ శ్వో ద్రక్ష్యావ ఇతి స్మ హ ॥ 5
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. ఈ విధంగా ఇద్దరూ పందెం వేసుకొని, "ఈ విషయాన్ని రేపు వచ్చిచూద్దాం." అనుకొని ఇద్దరూ ఇళ్లకు వెళ్లిపోయారు. (5)
తతః పుత్రసహస్రం తు కద్రూర్జిహ్మం చికీర్షతీ ।
ఆజ్ఞాపయామాస తదా వాలా భూత్వాంజనప్రభాః ॥ 6
ఆవిశధ్వమియం క్షిప్రం దాసీ న స్యామహం యథా ।
నావపద్యంత యే వాక్యం తాన్ శశాప భుజంగమాన్ ॥ 7
సర్పసత్రే వర్తమానే పావకో వః ప్రధక్ష్యతి ।
జనమేజయస్య రాజర్షేః పాండవేయస్య ధీమతః ॥ 8
అపుడు కద్రువ వినతను మోసం చెయ్యాలని తన వేయిమంది సంతానాన్ని పిలిచి నల్లత్రాచులను ఆ ఉచ్చైః శ్రవం తోకకు వ్రేళ్లాడమని ఆజ్ఞాపించింది. "వెంటనే ఆ పని చేయండి. అపుడు నేను దాసీత్వం పొందనక్కరలేదు" అంది. వారు అంగీకరించలేదు. వెంటనే ఆ సర్పాలను కద్రువ "జనమేజయుడు చేసే సర్పయాగంలో మీరు భస్మం కండి" అని శపించింది. (6-8)
శాపమేనం తు శుశ్రావ స్వయమేవ పితామహః ।
అతిక్రూరం సముత్సృష్టం కద్వ్రా దైవాదతీవ హి ॥ 9
ఈ శాపాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు విన్నాడు. ఇది దైవలిఖితం, కద్రువ అతి కఠోరమైన శాపం ఇచ్చింది కదా అనుకొన్నాడు. (9)
పార్ధం దేవగణైః సర్వైః వాచం తామన్వమోదత ।
బహుత్వం ప్రేక్ష్య సర్పాణాం ప్రజానాం హితకామ్యయా ॥ 10
తిగ్మవీర్యవిషా హ్యేతే దందశూకా మహాబలాః ।
తేషాం తీక్ష్ణవిషత్వాద్ధి ప్రజానాం చ హితాయ చ ॥ 11
యుక్తం మాత్రా కృతం తేషాం పరపీడోపసర్పిణామ్ ।
అన్యేషామపి సత్త్వానాం నిత్యం దోషపరాస్తు యే ॥ 12
తేషాం ప్రాణాంతకో దండః దైవేన వినిపాత్యతే ।
ఏవం సంభావ్య దేవస్తు పూజ్య కద్రూం చ తాం తదా ॥ 13
ఆహూయ కశ్యపం దేవః ఇదం వచనమబ్రవీత్ ।
యదేతే దందశూకాశ్చ సర్పా జాతాస్త్వయానఘ ॥ 14
విషోల్బణా మహాభోగాః మాత్రా శప్తాః పరంతప ।
తత్ర మన్యుస్త్వయా తాత న కర్తవ్యః కథంచన ॥ 15
దృష్టం పురాతనం హ్యేతద్ యజ్ఞే సర్పవినాశనమ్ ।
ఇత్యుక్త్వా సృష్టికృద్ దేవః తం ప్రసాద్య ప్రజాపతిమ్ ।
ప్రాదాద్ విషహరీం విద్యాం కశ్యపాయ మహాత్మనే ॥ 16
ఈ సర్పాలు విషపూరితాలు. ఇతరులకందరికీ బాధాకరాలు. అందుచే ప్రాణికోటికి మేలు జరగాలనే దృష్టితో దైవవశాత్తు కద్రువ తన పిల్లలకు శాపం ఇచ్చి మేలు చేసింది. కేవలం మానవులకే కాదు. దోషపరులైన ఇతర ప్రాణులకు కూడా ఇటువంటి ప్రాణాంతకమైన శిక్ష దైవమే విధిస్తుంది. బ్రహ్మదేవుడు కద్రువను అభినందించి కశ్యపుని పిలిచి ఇలా చెప్పాడు. "మహత్మా! నీ ద్వారా సర్పాలు ఉద్భవించాయి. పెద్ద పెద్ద పడగలతో వాటి శరీరమే కాకుండా వాటి విషం కూడా భయంకరంగా ఉంది. అందుచేత కద్రువ సర్పాలకు శాపం ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు ఆమెపై క్రోధాన్ని చూపకండి. యజ్ఞంలో సర్పనాశనం జరుగుతుంది. "ఈ విధంగా బ్రహ్మ కశ్యపుడికి చెప్పి ఆయనను శాంతపరచాడు. విషాన్ని హరించే విద్యను కూడా బ్రహ్మ కశ్యపునికి చెప్పాడు. (11-16)
(ఏవం శప్తేషు నాగేషు కడ్రువా ద్విజసత్తమ ।
ఉద్విగ్నః శాపతస్తస్యాః కద్రూం కర్కోటకోఽబ్రవీత్ ॥
మాతరం పరమప్రీతః తదా భుజగసత్తమః ।
ఆవిశ్య వాజినం ముఖ్యం వాలో భూత్వాంజనప్రభః ॥
దర్శయిష్యామి తత్రాహమ్ ఆత్మానం కామమాశ్వస ।
ఏవమస్త్వితి తం పుత్రం ప్రత్యువాచ యశస్వినీ ॥)
కద్రువ ఇలా శపిస్తే ఆ శాపానికి భయపడి కర్కోటకుడు ఆ గుర్రం యొక్క తోకను తన నల్లని శరీరంతో మింగి వెస్తానన్నాడు - "మంచి"దని కొడుకుతో కద్రువ అంది.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే వింశోఽధ్యాయః ॥ 20 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానమను ఇరువదియవ అధ్యాయము. (20)
(దాక్షిణాత్య అధిక పాఠము 3 శ్లోకాళు కలుపుకొని మొత్తం 19 శ్లోకాలు)