30. ముప్పదియవ అధ్యాయము

గరుత్మంతుడు రౌహిణశాఖను నిర్జనపర్వతముపై విడచుట.

సౌతిరువాచ
స్పృష్టమాత్రా తు పద్భ్యాం సా గరుడేన బలీయసా ।
అభజ్యత తరోః శాఖా భగ్నాం చైనామధారయత్ ॥ 1
ఉగ్రశ్రవుడు మహర్షులకు చెపుతున్నాడు. బలిష్ఠుడైన గరుత్మంతుడు ఆ రౌహిణ వృక్షంపై పాదం పెట్టగానే ఆ చెట్టు కొమ్మ ఫెళఫెళ విరిగి పోయింది. వెంటనే ఆ చెట్టు కొమ్మను కూడ పట్టుకొన్నాడు. (1)
తాం భంక్త్వా స మహాశాఖాం స్మయమానో విలోకయన్ ।
అథాత్ర లంబతోఽపశ్యద్ వాలఖిల్యానధోముఖాన్ ॥ 2
పెద్దదయిన ఆ కొమ్మను పట్టుకొని ఆశ్చర్యంతో చూశాడు. అధోముఖులై వ్రేలాడుతూ తపస్సు చేస్తున్న వాలఖిల్యులు అనే మహర్షులను చూశాడు ఖగేంద్రుడు. (2)
ఋషయో హ్యత్ర లంబంతే న హన్యామితి తానృషీన్ ।
తపోరతాన్ లంబమానాన్ బ్రహ్మర్షీనభివీక్ష్య సః ॥ 3
హన్యాదేతాన్ సంపతంతీ శాఖేత్యథ విచింత్య సః ।
నఖైర్దృఢతరం వీరః సంగృహ్య గజకచ్ఛపౌ ॥ 4
స తద్వినాశసంత్రాసాద్ అభిపత్య ఖగాధిపః ।
శాఖామాస్యేన జగ్రాహ తేషామేవాన్వవేక్షయా ॥ 5
"ఈ కొమ్మకు తాపసులు వ్రేలాడుతున్నారు. వీరిని చంపకూడదు. ఈ కొమ్మను విడిచి పెడితే వీరిని చంపినట్లే" అని ఆలోచించి, గజకచ్ఛపాలను కాలిగోళ్లతో గట్టిగా పట్టుకొన్నాడు. తాపసులు పడిపోతారేమో అనే భయంతో గరుత్మంతుడు 'చూస్తూ ఉంటాను కదా' అని ఆ కొమ్మను నోటితో పట్టుకొన్నాడు. (3-5)
అతిదైవం తు తత్ తస్య కర్మ దృష్ట్వా మహర్షయః ।
విస్మయోత్కంపహృదయాః నామ చక్రుర్మహాఖగే ॥ 6
దేవతలు కూడా చేయలేని ఈ మహత్కార్యాన్ని గరుత్మంతుడు చేస్తూంటే వాలఖిల్య మహర్షులు ఆశ్చర్యపడటమే కాకుండా దయదలచి విహగేంద్రునికి పేరు పెట్టారు. (6)
గురుం భారం సమాసాద్య ఉడ్డీన ఏష విహంగమః ।
గరుడస్తు ఖగశ్రేష్ఠః తస్మాత్ పన్నగభోజనః ॥ 7
ఈ పక్షీంద్రుడు ఆకాశంలో అధికభారాన్ని భరిస్తూ ఎగురుతున్నాడు. కాబట్టి గరుడుడు అని నామకరణం చేశారు. పన్నగాలను తినే ఆ పక్షీంద్రుడు అలా గరుడుడు అయ్యాడు. (7)
తతః శనైః పర్యపతత్ పక్షైః శైలాన్ ప్రకంపయన్ ।
ఏవం సోఽభ్యపతద్ దేశాన్ బహూన్ సగజకచ్ఛపః ॥ 8
తరువాత గరుడుడు రెక్కల్ని విప్పారజేసి పర్వతాన్ని కంపింపజేస్తూ గజకచ్ఛపాలతో, మునీంద్రులతో అనేక ప్రాంతాల్ని చూసుకొంటూ ఎగురుతున్నాడు. (8)
దయార్థే వాలఖిల్యానాం న చ స్థానమవిందత ।
స గత్వా పర్వతశ్రేష్ఠం గంధమాదనమంజసా ॥ 9
ఎక్కడా స్థానం దొరకలేదు. వాలఖిల్యాదులకు ఆపద కలుగ కూడదనే భావంతో ఆ పక్షీంద్రుడు త్వరగా గంధమాదన పర్వతాన్ని చేరాడు. (9)
దదర్శ కశ్యపం తత్ర పితరం తపసి స్థితమ్ ।
దదర్శ తం పితా చాపి దివ్యరూపవిహంగమమ్ ॥ 10
తేజోవీర్యబలోపేతం మనోమారుతరంహసమ్ ।
శైలశృంగప్రతీకాశం బ్రహ్మదండమివోద్యతమ్ ॥ 11
ఆ పర్వతం మీద తపస్సు చేసుకొంటున్న తండ్రిని చూశాడు. కశ్యపుడు కూడా దివ్య రూపంలో ఉన్న విహగేంద్రుని చూశాడు. అమితతేజోవంతుడు, బలపరాక్రమోపేతుడు, వాయువేగ మనో వేగాలతో పర్వత శిఖరం లాగా, ఎత్తిన బ్రహ్మదండం లాగా ప్రవేశించే కుమారుని కశ్యపుడు చూశాడు. (10,11)
అచింత్యమనభిధ్యేయం సర్వభూతభయంకరమ్ ।
మహావీర్యధరం రౌద్రం సాక్షాదగ్నిమివోద్యతమ్ ॥ 12
అతని రూపం ఊహింప రానిది, చెప్పలేనిది. సమస్త ప్రాణికోటికి భయంకరుడు, మహావీర్యవంతుడు, రౌద్రాకారుడు, అయి అతడు సాక్షాత్తు అగ్నిస్వరూపంలా ఎగురుతున్నాడు. (12)
అప్రధృష్యమజేయం చ దేవదానవరాక్షసైః ।
భేత్తారం గిరిశృంగాణాం సముద్రజలశోషణమ్ ॥ 13
దేవతలు, రాక్షసులు, దానవులు అతనిని చేరడానికి భయపడుతారు. అతడు అజేయుడు. పర్వత శిఖరాల్ని పగులగొట్టగలడు. సముద్రజాలాన్ని శుష్కింపజేయగలడు. (13)
లోకసంలోడనం ఘోరం కృతాంతసమదర్శనమ్ ।
తమాగతమభిప్రేక్ష్య భగవాన్ కశ్యపస్తదా ॥
విదిత్వా చాస్య సంకల్పం వచనమబ్రవీత్ ॥ 14
సమస్త లోకాల్ని భయకంపితుల్ని చేయగలడు. యమునితో సమానుడు. భగవంతుడైన కశ్యపుడు అలా వచ్చిన కుమారుని చూచి అతని మనస్సు లోని సంకల్పాన్ని గ్రహించి ఈ విధంగా అంటున్నాడు. (14)
కశ్యప ఉవాచ
పుత్ర మా సాహసం కార్షీః మా సద్యో లప్స్యసే వ్యథామ్ ।
మా త్వాం దహేయుః సంక్రుద్ధా వాలఖిల్యా మరీచిపాః ॥ 15
కశ్యపుడు గరుడునితో "కుమారా! సాహసం చేయకు. మనస్సులో బాధపడవద్దు. వాలిఖిల్యులు నీపై కోపించి దహించి వేయకుందురుగాక!" (15)
వి: సం: వాలఖిల్యులు సూర్యకిరణాలు త్రాగి తృప్తి పడుతూ ఉంటారు. ఛాందోగ్యోపనిషత్తులో 'మధువిద్య' అని ఒక విద్య ఉంది. దాని నెరిగిన వారు. (నీల)
సౌతిరువాచ
తతః ప్రసాదయామాస కశ్యపః పుత్రకారణాత్ ।
వాలఖిల్యాన్ మహాభాగాన్ తపసా హతకల్మషాన్ ॥ 16
అపుడు ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. తన కుమారుని కారణంగా మహాత్ములై, కల్మషరహితులైన వాలఖిల్యులను కశ్యపుడు అనుగ్రహింప జేశాడు. (16)
కశ్యప ఉవాచ
ప్రజాహితార్థమారంభః గరుడస్య తపోధనాః ।
చికీర్షతి మహత్కర్మ తదనుజ్ఞాతమర్హథ ॥ 17
కశ్యపుడిలా అన్నాడు. తాపసులారా! గరుడుడు ప్రజల క్షేమం కోరి గొప్ప కార్యం చేయబోతున్నాడు. దానిని మీరు అనుమతించండి. (17)
సౌతిరువాచ
ఏవముక్తా భగవతా మునయస్తే సమభ్యయుః ।
ముక్త్వా శాఖాం గిరిమ్ పుణ్యం హిమవంతం తపోఽర్థినః ॥ 18
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. కశ్యపుని ప్రార్థనను అంగీకరించి వాలఖిల్యాదులు ఆ చెట్టు కొమ్మను విడిచి హిమవత్పర్వతానికి తపస్సుకై వెళ్ళిపోయారు. (18)
తతస్తేష్వపయాతేషు పితరం వినతాసుతః ।
శాఖావ్యాక్షిప్తవదనః పర్యపృచ్ఛత కశ్యపమ్ ॥ 19
ఆ మహర్షులు వెళ్ళిపోయిన తరువాత గరుడుడు చెట్టుకొమ్మతోనే నోరు తెరచి తండ్రిని ఇలా అడిగాడు. (19)
భగవన్ క్వ విముంచామి తరోః శాఖామిమామహమ్ ।
వర్జితం మానవైర్దేశమ్ ఆఖ్యాతు భగవాన్ మమ ॥ 20
భగవంతుడా! ఈ చెట్టు కొమ్మను ఎక్కడ విడిచి పెట్టను? మానవ సంచారం లేని ప్రదేశాన్ని నాకు చెప్పండి. (20)
తతో నిఃపురుషం శైలం హిమసంరుద్ధకందరమ్ ।
అగమ్యం మనసాప్యన్యైః తస్యాచఖ్యౌ స కశ్యపః ॥ 21
"మంచుతో కప్పబడిన పర్వతం ఉన్నది. అది ఎవ్వరూ సంచరింపలేని ప్రదేశం. దాని గుహలు మంచుతో కప్పబడి ఉంటాయి. మనసుతో కూడా అక్కడికి ఎవరూ వెళ్లలేరు" అని కశ్యపుడు చెప్పాడు. (21)
తం పర్వతం మహాకుక్షిమ్ ఉద్దిశ్య స మహాఖగః ।
జవేనాభ్యపతత్ తార్ క్ష్యః సశాఖాగజకచ్ఛపః ॥ 22
వెంటనే గరుడుడు విశాల మయిన ఆ పర్వతం మీదికి గజకచ్ఛపాలతోనూ, ఆ కొమ్మతోనూ వేగంగా ఎగిరిపోయాడు. (22)
న తాం వధ్రీ పరిణహేత్ శతచర్మా మహాతనుమ్ ।
శాఖినో మహతీం శాఖాం యాం ప్రగృహ్య యయౌ ఖగః ॥ 23
గరుడుడు తీసుకొని పోతున్న ఆ కొమ్మను నూరు పశువుల చర్మపు (తోలు) త్రాడుతో కూడ కట్టలేము. (23)
వి: సం: ఒక పశువు యొక్క చర్మాన్ని సన్నని దారంగా కోస్తే ఎంత పొడుగు వస్తుందో అంత పొడుగు చర్మాన్ని "వధ్రి" అంటారు. అటువంటి నూరు చర్మాల త్రాడు కూడ దాని చుట్టూ చుట్టడానికి చాలదు. అనగా అంత లావుగా ఉందని భావం. (నీల)
స తతః శతసాహస్రం యోజనాంతరమాగతః ।
కాలేన నాతిమహతా గరుడః పతగేశ్వరః ॥ 24
గరుడుడు లక్ష యోజనాల దూరంలో నున్న ఆ పర్వతం దగ్గరకు స్వల్పకాలంలోనే చేరుకున్నాడు. (24)
స తం గత్వా క్షణేనైవ పర్వతం వచనాత్ పితుః ।
అముంచన్మహతీం శాఖాం సస్వనం తత్ర ఖేచరః ॥ 25
తన తండ్రి చెప్పిన ప్రకారం గరుత్మంతుడు పర్వతం దగ్గరకు క్షణంలో వెళ్లి ఆ చెట్టుకొమ్మను జారవిడిచాడు. అది పెద్ద ధ్వని చేస్తూ పడి పోయింది. (25)
పక్షానిలహతశ్చాస్య ప్రాకంపత స శైలరాట్ ।
ముమోచ పుష్పవర్షం చ సమాగలితపాదపః ॥ 26
అతని రెక్కల వేగానికి ఆ పర్వతం కంపించింది. అక్కడి వృక్షాలు (అతనిపై) పుష్పవర్షాన్ని కురిపించాయి. (26)
శృంగాణి చ వ్యశీర్యంత గిరేస్తస్య సమంతతః ।
మణికాంచనచిత్రాణి శోభయంతి మహాగిరిమ్ ॥ 27
మణులతో, రత్నాలతో కూడిన ఆ పర్వతశిఖరాలు బ్రద్దలై శోభించాయి. (27)
శాఖినో బహవశ్చాపి శాఖయాభిహతాస్తయా ।
కాంచనైః కుసుమైర్భాంతి విద్యుత్వంత ఇవాంబుదాః ॥ 28
అక్కడ ఈ కొమ్మపడేసరికి ఆ చెట్ల పుష్పాలు మెఱుపుతో కూడిన మేఘాల కాంతికి బంగారు పుష్పాల వలె ప్రకాశిస్తున్నాయి. (28)
తే హేమవికచా భూమౌ యుతాః పర్వతధాతుభిః ।
వ్యరాజచ్ఛాఖినస్తత్ర సూర్యాంశుప్రతిరంజితాః ॥ 29
బంగారుపుష్పాలతో ప్రకాశించే వృక్షాలు భూమిపై పడి పర్వతం మీది గైరికాది ధాతువులతోకూడటం వల్ల సూర్యకిరణాల కాంతితో కొమ్మలన్నీ ప్రకాశిస్తున్నాయి. (29)
తతస్తస్య గిరేఃశృంగమాస్థాయ స ఖగోత్తమః ।
భక్షయామాస గరుడః తావుభౌ గజకచ్ఛపౌ ॥ 30
అపుడు గరుడుడు ఆ పర్వతశిఖరం చేరి ఆ గజకచ్ఛపాలను రెండిటినీ భక్షించాడు. (30)
తావుభౌ భక్షయిత్వా తు స తార్ క్ష్యః కూర్మకుంజరౌ ।
తతః పర్వతకూటాగ్రాత్ ఉత్పపాత మహాజవః ॥ 31
ఆ రెండిటినీ తినిన తరువాత గరుడుడు పర్వతశిఖరం నుండి మహావేగంతో ఎగిరి పోయాడు. (31)
ప్రావర్తంతాథ దేవానామ్ ఉత్పాతా భయశంసినః ।
ఇంద్రస్య వజ్రం దయితం ప్రజజ్వాల భయాత్ తతః ॥ 32
ఆ విధంగా గరుడుడు ఎగిరివస్తున్నపుడు దేవతలకు భయసూచకమైన చాలా అపశకునాలు కనిపించాయి. ఇంద్రునికి ఇష్టమైన వజ్రాయుధం భయంతో ప్రజ్వరిల్లింది (32)
సధూమా న్యపతత్ సార్చిః దివోల్కా నభసశ్చ్యుతా ।
తథా వసూనాం రుద్రాణామ్ ఆదిత్యానాం చ సర్వశః ॥ 33
సాధ్యానాం మరుతాం చైవ యే చాన్యే దేవతా గణాః ।
స్వం స్వం ప్రహరణం తేషాం పరస్పరముపాద్రవత్ ॥ 34
అభూతపూర్వం సంగ్రామే తదా దేవాసురేఽపి చ ।
వవుర్వాతాః సనిర్ఘాతాః పేతురుల్కాః సహస్రశః ॥ 35
ఆ సమయంలో పగటిపూటే అగ్నితో కూడిన ఉల్క రాలిపడింది. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, సాధ్యులు, మరుద్గణాలు మొదలైన దేవతాగణాల ఆయుధాలు ఒకదానినొకటి ఢీకొంటున్నాయి. దేవాసుర యుద్ధసమయంలో కూడా ఇటువంటి ఉల్కాపాతాలు, ఉపద్రవాలు జరగలేదు. (33-35)
నిరభ్రమేవ చాకాశం ప్రజగర్జ మహాస్వనమ్ ।
దేవానామపి యో దేవః సోఽప్యవర్తత శోణితమ్ ॥ 36
మబ్బులు లేకపోయినా ఆకాశం పెద్ద పెద్ద ఉరుములతో గర్జించింది. దేవతలకు దేవుడైన పర్జన్యుడు కూడా భయపడ్డాడు. నెత్తుటి వర్షం కురిసింది. (36)
మమ్లుర్మాల్యాని దేవానాం నేశుస్తేజాంసి చైవ హి ।
ఉత్పాతమేఘా రౌద్రాశ్చ వవృషుః శోణితం బహు ॥ 37
దేవతల మెడలోని పుష్పహారాలు వాడిపోయాయి. వారి దివ్యతేజస్సు గూడా తరిగిపోయింది. మేఘాలు భయంకరంగా రక్తాన్ని వర్షించాయి. (37)
రజాంసి ముకుటాన్యేషామ్ ఉత్థితాని వ్యధర్షయన్ ।
తతస్త్రాససముద్విగ్నః సహ దేవైః శతక్రతుః ।
ఉత్పాతాన్ దారుణాన్ పశ్యన్ ఇత్యువాచ బౄహస్పతిమ్ ॥ 38
ఆ సమయంలో లేచిన దుమ్ము దేవతల కిరీటాన్ని మలినం చేసింది. ఇంద్రుడు ఆ భయంకరోత్పాతాలకు అపశకునాలకు భయపడి తమ గురువైన బృహస్పతిని దానికి కారణాన్ని అడిగాడు. (38)
ఇంద్ర ఉవాచ
కిమర్థం భగవాన్ ఘోరాః ఉత్పాతాః సహసోత్థితాః ।
న చ శత్రుం ప్రపశ్యామి యుధి యో నః ప్రధర్షయేత్ ॥ 39
ఇంద్రుడు బృహస్పతితో అన్నాడు. "ఆచార్యా! అకస్మాత్తుగా ఈ ఉత్పాతాలు, అపశకునాలు ఎందుకు కలిగాయి? యుద్ధంలో మనలను ఎదిరించగల శత్రువులు కనపడటం లేదు!"
బృహస్పతిరువాచ
తవాపరాధాత్ దేవేంద్ర ప్రమాదాచ్చ శతక్రతో ।
తపసా వాలఖిల్యానాం మహర్షీణాం మహాత్మనామ్ ॥ 40
కశ్యపస్య మునేః పుత్రః వినతాయాశ్చ ఖేచరః ।
హర్తుం సోమమభిప్రాప్తః బలవాన్ కామరూపధుక్ ॥ 41
అపుడు బృహస్పతి అంటున్నాడు. దేవేంద్రా! ఇదంతా నీ అపరాధం వల్లనే వచ్చింది. తపస్సు చేసుకొనే మహాత్ములు వాలఖిల్యాది మహర్షులకు నీవు చేసిన అవమానం వల్లనే ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి. వినతాకశ్యపుల పుత్రుడయిన ఖగేంద్రుడు కామరూపుడు. మహాబలపరాక్రమవంతుడు. అతడు మన అమృతాన్ని హరించటానికి వస్తున్నాడు. (40,41)
సమర్థో బలినాం శ్రేష్ఠః హర్తుం సోమం విహంగమః ।
సర్వం సంభావయామ్యస్మిన్ అసాధ్యమపి సాధయేత్ ॥ 42
అతడు బలవంతులలో శ్రేష్ఠుడు. అమృతాన్ని అపహరించడానికి సమర్థుడు. అతడు అన్ని పనులూ చేయగలడు. అసాధ్యం కూడా సాధ్యం చేయగలడు. (42)
సౌతి రువాచ
శ్రుత్వైతద్ వచనం శక్రః ప్రోవాచామృతరక్షిణః ।
మహావీర్యబలః పక్షీ హర్తుం సోమమిహోద్యతః ॥ 43
ఉగ్రశ్రవుడు ఈ విధంగా చెపుతున్నాడు. ఇంద్రుడు బృహస్పతియొక్క మాటల్ని విని అమృత రక్షకులతో ఇలా అన్నాడు. "బల వీర్య సంపన్నుడయిన పక్షి ఇపుడు అమృతం హరించడానికి ప్రయత్నిస్తున్నాడు. (43)
యుష్మాన్ సంభోధయామ్యేషః యథా న స హరేత్ బలాత్ ।
అతులం హి బలం తస్య బృహస్పతిరువాచ హ ॥ 44
అతడు అమృతం హరించకుండా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. వానికి సాటిలేని బలం ఉందని బృహస్పతి చెప్పారు." (44)
తచ్ఛ్రుత్వా విబుధా వాక్యం విస్మితా యత్నమాస్థితాః ।
పరివార్యామృతం తస్థుః వజ్రీ చేంద్రః ప్రతాపవాన్ ॥ 45
ఆ మాటలు విన్న దేవతలు ఆశ్చర్యపడి అమృతం చుట్టూ నాల్గుదిక్కులా రక్షణ కల్పించారు. ఇంద్రుడు కూడా వజ్రాయుధంతో నిలిచాడు. (45)
ధారయంతో విచిత్రాణి కాంచనాని మనస్వినః ।
కవచాని మహార్హాణి వైదూర్యవికృతాని చ ॥ 46
దేవతలు వైడూర్యాలు పొదిగిన బంగారు కవచాలను ధరించారు. అవి ఎంతో విలువైనవి. విచిత్రమైనవి కూడా. (46)
చర్మాణ్యపి చ గాత్రేషు భానుమంతి దృఢాని చ ।
వివిధాని చ శస్త్రాణి ఘోరరూపాణ్యనేకశః ॥ 47
శితతీక్ష్ణాగ్రధారాణి సముద్యమ్య సురోత్తమాః।
సువిస్ఫులింగజ్వాలాని సధూమాని చ సర్వశః ॥ 48
చక్రాణి పరిఘాంశ్చైవ త్రిశూలాని పరశ్వధాన్ ।
శక్తీశ్చ వివిధాస్తీక్ష్ణాః కరవాలాంశ్చ నిర్మలాన్ ।
స్వదేహరూపాణ్యాదాయ గదాశ్చోగ్రప్రదర్శనాః ॥ 49
దేవతలు శరీరాలకు ప్రకాశమిచ్చే, దృఢమైన కవచాలు, డాలులు ధరించారు. వారి చేతుల్లో రకరకాలైన భయంకర శస్త్రాలు మెరిసిపోతున్నాయి. చక్రాలు, పరిఘలు, త్రిశూలాలు, పరశ్వధాలు, శక్తులు, కత్తులు, గదలు మొదలైన ఆయుధాలు, పదునైన అంచులతో, నిప్పులు క్రక్కుతూ ఉన్నాయి. వారు తమతమ శరీరాలకు తగిన ఆయుధాలు గ్రహించి ఎత్తి పట్టుకొని నిలిచారు. (47-49)
తైః శస్రైర్భానుమద్భిస్తే దివ్యాభరణభూషితాః ।
భానుమంతః సురగణాః తస్థుర్విగతకల్మషాః ॥ 50
శస్త్రాలతో వారి ఆభరణాలు ధగ ధగా మెరిసిపోతున్నాయి. దేవతలు కల్మషం లేకుండా ధైర్యంతో కాపలా కాస్తున్నారు. (50)
అనుపమ బలవీర్యతేజసః
ధృతమనసః పరిరక్షణేఽమృతస్య ।
అసురపుర విదారణాః సురాః
జ్వలనసమిద్ధవపుఃప్రకాశినః ॥ 51
సాటిలేని బలపరాక్రమాలతో అమృతాన్ని రక్షించుకొనటానికి నిశ్చయించుకొని రాక్షసనగరాలను ధ్వంసం చేసే దేవతలు అగ్నిహోత్రాల వలె ప్రకాశిస్తున్నారు. (51)
ఇతి సమరవరం సురాః స్థితాస్తే
పరిఘసహస్రశతైః సమాకులమ్ ।
విగలితమివ చాంబరాంతరం
తపనమరీచివికాశితం బభాసే ॥ 52
ఇలా దేవతలు యుద్ధానికి సిద్ధమయ్యారు. రణభూమిలో పరిఘాది - ఆయుధాలు లక్షలకొద్దీ ఉన్నాయి. పదునైన ఆ ఆయుధాలపై సూర్య కిరణాలు పడి 'ఆకాశం క్రిందికి పడిందా' అన్నట్లు ప్రకాశిస్తున్నాయి. (52)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే త్రింశోఽధ్యాయః ॥ 30 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానమను ముప్పదియవ అధ్యాయము (30)