31. ముప్పది యొకటవ అధ్యాయము
ఇంద్రుడు వాలఖిల్య మహర్షులను అవమానించుట - అరుణుడు, గరుత్మంతుడు పట్టుట.
శౌనక ఉవాచ
కోఽపరాధో మహేంద్రస్య కః ప్రమాదశ్చ సూతజ ।
తపసా వాలఖిల్యానాం సంభూతో గరుడః కథమ్ ॥ 1
శౌనకుడు ప్రశ్నిస్తున్నాడు. "సూతనందనా! మహేంద్రుడు ఏ అపరాధం చేశాడు? ఏమి ప్రమాదం వచ్చింది? వాలఖిల్యాదుల తపః ప్రభావంతో గరుడుడు ఎలా జన్మించాడు? (1)
కశ్యపస్య ద్విజాతేశ్చ కథం వై పక్షిరాట్ సుతః ।
అధృష్యః సర్వభూతానాం అవధ్యశ్చాభవత్ కథమ్ ॥ 2
కశ్యపుడు బ్రాహ్మణుడు కదా! అతనికి పక్షిరాజు జన్మించడమేమిటి? అతడు సర్వప్రాణికోటిని ఎదిరింప శక్యం కానివాడు, అవధ్యుడు ఎలా అయ్యాడు? (2)
కథం చ కామాచారీ స కామవీర్యశ్చ ఖేచరః ।
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పురాణే యది పఠ్యతే ॥ 3
అతడు తన ఇష్టానుసారంగా చరించడానికి ఇష్టానుసారం పరాక్రమించడానికి కారణం ఏమిటి? పురాణాల్లో ఏమైనా చెప్పబడిందా? అయితే ఈ విషయాన్ని గురించి గరుడుని కథ చెప్పండి." (3)
సౌతిరువాచ
విషయోఽయం పురాణస్య యన్మాం త్వం పరిపృచ్ఛసి ।
శృణు మే వదతః సర్వమ్ ఏతత్ సంక్షేపతో ద్విజ ॥ 4
ఉగ్రశ్రవుడు చెప్పుతున్నాడు. నీవడిగిన ఈ గరుడుని కథ పురాతనమైనది. దీనినంతటిని సంగ్రహంగా చెపుతాను. వినవలసినది. (4)
యజతః పుత్రకామస్య కశ్యపస్య ప్రజాపతేః ।
సాహాయ్యమృషయో దేవాః గంధర్వాశ్చ దదుః కిల ॥
కశ్యపప్రజాపతి పుత్రకామేష్టి చేస్తున్నపుడు అతనికి అనేక ఋషులు, దేవతలు, గంధర్వులు సహాయపడుతున్నారు. (5)
తత్రేధ్మానయనే శక్రః నియుక్తః కశ్యపేన హ ।
మునయో వాలఖిల్యాశ్చ యే చాన్యే దేవతాగణాః ॥ 6
ఆ యజ్ఞానికి కావలసిన సమిధలు తీసుకొని రావటానికి కశ్యపుడు ఇంద్రుని, వాలఖిల్యాది మహర్షులను, మరికొందరు దేవతల్ని నియమించాడు. (6)
శక్రస్తు వీర్యసదృశమ్ ఇధ్మభారం గిరిప్రభమ్ ।
సముద్రమ్యానయామాస నాతికృచ్ఛ్రాదివ ప్రభుః ॥ 7
ఇంద్రుడు బలశాలిగదా! తనబలానికి తగినట్లుగా పర్వతం లాంటి పెద్ద కట్టెల మోపును ఎత్తికొని సునాయాసంగా తీసుకొని వస్తున్నాడు. (7)
అథాపశ్యదృషీన్ హ్రస్వాన్ అంగుష్ఠోదరవర్ష్మణః ।
పలాశవర్తికామేకాం వహతః సంహతాన్ పథి ॥ 8
అపుడు అంగుష్ఠమాత్రశరీరం కలిగి పొట్టిగా ఉన్న వాలఖిల్యాది మహర్షులు ఒక్కొక్క రావి సమిధను పట్టుకొని యజ్ఞశాలకు వస్తూండగా వాళ్లను ఇంద్రుడు చూశాడు. (8)
ప్రలీనాన్ స్వేష్వివాంగేషు నిరాహారాంస్తపోధనాన్ ।
క్లిశ్వమానాన్ మందబలాన్ గోష్పదే సంప్లుతోదకే ॥ 9
వారు తమ అవయవాల్లో మునిగిపోయినంత బక్కగా ఉన్నారు. నిరాహారులైన అపోధనులు, కృశాంగులు కాబట్టి బలహీనులు. గోవు పాదముద్రలో ఉన్న నీటిలో కూడా మునిగి పోతారు. (9)
తాన్ సర్వాన్ విస్మయావిష్టః వీర్యోన్మత్తః పురందరః ।
అవహాస్యాభ్యగాచ్ఛీఘ్రం లంఘయిత్వావమన్య చ ॥ 10
వారందరినీ బలగర్వితుడైన ఇంద్రుడు ఆశ్చర్యకరంగా చూస్తూ అపహసించి వారికంటె ముందుగా వెళుతూ అవమానించాడు. (10)
తేఽథ రోషసమావిష్టాః సుభృశం జాథమన్యవః ।
ఆరేభిరే మహత్కర్మ తదా శక్రభయంకరమ్ ॥ 11
మహర్షులు మిక్కిలిగా కోపించి దీనులై ఇంద్రునికి భయం కలిగించే ఒక మహాకార్యాన్ని తలపెట్టారు. (11)
జుహువుస్తే సుతపసః విధివజ్జాతవేదసమ్ ।
మంత్రైరుచ్చావ చైర్విప్రాః యేన కామేన తచ్ఛృణు ॥ 12
ఆ తాపసోత్తములు ఉదాత్తానుదాత్త స్వరాలతో శాస్త్రోక్తంగా అగ్నిహోత్రునికి ఏ కోరికతో ఆహుతులను ఇచ్చారో చెపుతా విను. (12)
కామవీర్యః కామగమః దేవరాజభయప్రదః ।
ఇంద్రోఽన్యః సర్వదేవానాం భవేదితి యతవ్రతాః ॥ 13
పాకశాసనుని కంటె బలవంతుడు, కామవీర్యుడు, కామగమనుడు, సర్వ దేవతలకు మరొక ఇంద్రుడగు కుమారుడు జన్మించుగాక! అతడు ఇంద్రునకు భయప్రదుడగుగాక. (13)
ఇంద్రాచ్ఛతగుణః శౌర్యే వీర్యేచైవ మనోజవః ।
తపసో నః ఫలేనాద్య దారుణః సంభవత్వితి ॥ 14
ఆ జన్మించేవాడు ఇంద్రునికంటె నూరురెట్లు శౌర్యంలో, అధికుడుగా ఉండుగాక, మనోవేగం కలవాడగుగాక. మా తపస్సునకు ఫలంగా ఈ దారుణం సంభవించుగాక! (14)
తద్ బుద్ధ్వా భృశసంతప్తః దేవరాజః శతక్రతుః ।
జగామ శరణం తత్ర కశ్యపం సంశితవ్రతమ్ ॥ 15
ఇంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకొని భయపడి బాధపడుతూ కఠోరనియమం కల కశ్యపమహర్షిని శరణు వేడడానికి వెళ్లాడు. (15)
తచ్ఛ్రుత్వా దేవరాజస్య కశ్యపోఽథ ప్రజాపతిః ।
వాలఖిల్యానుపాగమ్య కర్మసిద్ధిమపృచ్ఛతీ ॥ 16
దేవరాజైన ఇంద్రుని ద్వారా వాలఖిల్యాదుల సంకల్పాన్ని కశ్యపుడు విని వారి దగ్గరకు వెళ్ళి వారి కార్య సిద్ధిని గురించి ప్రశ్నించాడు. (16)
ఏవ మస్త్వితి తం చాపి ప్రత్యూచుః సత్యవాదినః ।
తాన్ కశ్యప ఉవాచేదం సాంత్వపూర్వం ప్రజాపతిః ॥ 17
సత్యవాదులైన ఆ మహర్షులు కశ్యపునితో "మేము అనుకొనినట్లే శతక్రతుభయంకరుడైన ఇంద్రుడు జన్మించుగాక" అని చెప్పారు. అపుడు కశ్యపుడు వారిని శాంతింప జేస్తూ ఇలా అన్నాడు. (17)
అయమింద్ర స్త్రిభువనే నియోగాద్ బ్రహ్మణః కృతః ।
ఇంద్రార్థే చ భవంతోఽపి యత్నవంతస్తపోధనాః ॥ 18
తపోధనులారా! బ్రహ్మయొక్క ఆజ్ఞ వలన ఈ పురందరుడు ముల్లోకాలకూ ఇంద్రుడిగా నియమింపబడ్డాడు. మరి మీరు మరొక ఇంద్రుడి కోసం ప్రయత్నించారు. (18)
న మిథ్యా బ్రహ్మణో వాక్యం కర్తుమర్హథ సత్తమాః ।
భవతాం హి న మిథ్యాయం సంకల్పో వై చికీర్షితః ॥ 19
పరమేష్ఠి వాక్యం వ్యర్థం కాకూడదు కదా! మహాత్ములారా! మీ మాట కూడా వ్యర్థం కారాదు కదా! (19)
భవత్వేష పతత్రీణామ్ ఇంద్రోఽతిబలసత్త్వవాన్ ।
ప్రసాదః క్రియతామస్య దేవరాజస్య యాచతః ॥ 20
"మీ సంకల్పం ప్రకారం అత్యంత బలసంపన్నుడైన ఇంద్రుడు జన్మించు గాక! కాని అతడు పక్షీంద్రుడగుగాక! ఇంద్రుడిని మీరు మన్నించండి." (20)
ఏవముక్తాః కశ్యపేన వాలఖిల్యా స్తపోధనాః ।
ప్రత్యూచురభిసంపూజ్య మునిశ్రేష్ఠం ప్రజాపతిమ్ ॥ 21
ఈ విధంగా కశ్యపుడు చెపితే ఆ తపోధనులు శాంతించి ఆ మహర్షి పై గల గౌరవంతో ఇలా అన్నారు. (21)
వాలఖిల్యాః ఊచుః
ఇంద్రార్థోఽయం సమారంభః సర్వేషాం నః ప్రజాపతే ।
అపత్యార్థం సమారంభః భవతశ్చాయ మీప్సితః ॥ 22
తదిదం సఫలం కర్మ త్వయైవ ప్రతిగృహ్యతామ్ ।
తథా చైవం విధత్స్వాత్ర యథా శ్రేయోఽనుపశ్యసి ॥ 23
వాలఖిల్యులు ఇలా అన్నారు - "మా అందరి ప్రయత్నమూ ఇంద్రుని కోసం. మీ ప్రయత్నం కుమారుడు పుట్టాలని. ఇపుడీ పని ఇలా సఫలమయింది - దానిని మీరే గ్రహించండి. ఇపుడు శ్రేయస్సు కలిగేటట్లు జరిపించండి." (22, 23)
సౌతిరువాచ
ఏతస్మిన్నేవ కాలే తు దేవీ దాక్షాయణీ శుభా।
వినతా నామ కల్యాణీ పుత్రకామా యశస్వినీ ॥ 24
తపస్తప్త్వా వ్రతపరా స్నాతా పుంసవనే శుచిః ।
ఉపచక్రామ భర్తారం తామువాచాథ కశ్యపః ॥ 25
ఉగ్రశ్రవుడు ఇలా అంటున్నాడు. ఈ సమయంలోనే శుభలక్షణ సంపన్నురాలూ, దక్షపుత్రిక అయిన వినత పుత్రసంతానాన్ని పొందాలనే కోరికతో తపస్సుతో వ్రతాన్ని పాటిస్తున్నది. ఋతుకాలం రాగానే స్నానం చేసి భర్తను సేవించడానికి కశ్యపుని దగ్గరకు వచ్చింది. అపుడు కశ్యపుడు ఆమెతో ఇలా అన్నాడు. (24, 25)
ఆరంభః సఫలో దేవి భవితా యస్త్వయేప్సితః ।
జనయిష్యసి పుత్రౌ ద్వౌ వీరౌ త్రిభువనేశ్వరౌ ॥ 26
దేవీ! నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీకు ఇద్దరు కుమారులు జన్మిస్తారు. వారు మహాపరాక్రమవంతులు. ముల్లోకాల్నీ శాసించే శక్తిమంతులుగా, వీరులుగా జన్మిస్తారు. (26)
తపసా వాలఖిల్యానాం మమ సంకల్పజౌ తథా ।
భవిష్యతో మహాభాగౌ పుత్రౌ త్రైలోక్యపూజితౌ ॥ 27
వాలిఖిల్యాది మహర్షుల తపః సంకల్పం, నా సంకల్పం కూడా అదే. ఆ మహర్షుల ఆశీర్వాదం వల్ల ముల్లోకాలచే గౌరవింపబడే పుత్రులిద్దరు నీకు జన్మిస్తారు. (27)
ఉవాచ చైనాం భగవాన్ కశ్యపః పునరేవ హ ।
ధార్యతామప్రమాదేన గర్భోఽయం సుమహోదయః ॥ 28
ఇదంతా చెప్పిన తరువాత మరల వినతతో ఇలా అన్నాడు. దేవీ! ఈ గర్భం అభ్యుదయకరం. జాగ్రత్తగా కాపాడుకో. (28)
ఏతౌ సర్వపతత్రీణామ్ ఇంద్రత్వం కారయిష్యతః ।
లోకసంభావితౌ వీరౌ కామరూపౌ విహంగమౌ ॥ 29
నీకు జన్మించే ఆ ఇద్దరు కుమారులు పక్షులన్నిటికీ ఇంద్రులుగా గౌరవింపబడతారు. పక్షిరూపంలో ఉన్నప్పటికీ తమ ఇష్టానుసారంగా ఏరూపం కావాలన్నా ధరించగలరు. లోకం మెచ్చుకొనే వీరులుగాకూడా ప్రసిద్ధి కెక్కుతారు. (29)
శతక్రతుమథోవాచ ప్రీయమాణః ప్రజాపతిః ।
త్వత్సహాయౌ మహావీర్యౌ భ్రాతరౌ తే భవిష్యతః ॥ 30
నైతాభ్యాం భవితా దోషః సకాశాత్ తే పురందర ।
వ్యేతు తే శక్ర సంతాపః త్వమేవేంద్రో భవిష్యసి ॥ 31
తరువాత కశ్యపుడు ఇంద్రునికి ప్రీతిగా ఇలా అంటున్నాడు. "పురందర! ఈ పరాక్రమవంతులు ఇద్దరు నీకు సహాయకులుగానే ఉంటారు. నీకు వారి వల్ల ఎటువంటి హాని కలుగదు. నీవు ఏమాత్రం విచారపడవద్దు. నీవే దేవతలందరికీ ఇంద్రుడవు. నిర్భయంగా ఉండు. (30,31)
న చాప్యేవం త్వయా భూయః క్షేప్తవ్యా బ్రహ్మవాదినః ।
న చావమాన్యా దర్పాత్ తే వాగ్వజ్రా భృశకోపనాః ॥ 32
ఇంద్రా! ఇక ఎప్పుడూ బ్రహ్మవాదులను అవమానించకు. గర్వం పనికిరాదు. వాళ్ళ దగ్గర వాక్కు అనే వజ్రం ఉంది. అది నీ వజ్రాయుధం కంటే గొప్పది సుమా!" (32)
ఏవముక్తో జగామేంద్రః నిర్విశంకస్త్రివిష్టపమ్ ।
వినతా చాపి సిద్ధార్థా బభూవ ముదితా తథా ॥ 33
ఈ మాటలు విన్న ఇంద్రుడు తన సందేహాన్ని పోగొట్టుకొని సంతోషంగా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వినత కూడా తన కోరిక నెరవేరినందుకు చాల సంతోషించింది. (33)
జనయామాస పుత్రౌ ద్వౌ అరుణం గరుడం తథా ।
వికలాంగోఽరుణస్తత్ర భాస్కరస్య పురఃసరః ॥ 34
వినతకు అరుణుడు, గరుడుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో అరుణుడు వికలాంగుడు. అతడు సూర్య భగవానునికి ముందు ఉన్నాడు. (34)
పతత్రీణాం చ గరుడమ్ ఇంద్రత్వేనాభ్యషించత ।
తస్యైతత్ కర్మ సుమహత్ శ్రూయతాం భృగునందన ॥ 35
భృగుకుమారా! రెండవ కుమారుడైన గరుడుడు పక్షీంద్రుడుగా అభిషేకింప బడ్డాడు. ఇపుడు మీరు అతని పరాక్రమాన్ని గురించి వినండి. (35)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే ఏకత్రింశోఽధ్యాయః ॥ 31 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వము అను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానము అను ముప్పది ఒకటవ అధ్యాయము. (31)