39. ముప్పది తొమ్మిదవ అధ్యాయము

జరత్కారునికై వాసుకి అన్వేషణము.

సౌతిరువాచ
ఏలాపత్రవచః శ్రుత్వా తే నాగా ద్విజసత్తమ ।
సర్వే ప్రహృష్టమనసః సాధుసాధ్విత్యథాబ్రువన్ ॥ 1
తతః ప్రభృతి తాం కన్యాం వాసుకిః పర్యరక్షత ।
జరత్కారుం స్వసారం వై పరం హర్షమవాస చ ॥ 2
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. బ్రాహ్మణోత్తమా! ఏలాపత్రుని ఆ మాటలను విని సర్పాలన్నీ సంతోషించాయి. చాలా బాగున్నదని ప్రశంసించాయి. ఆనందాన్ని పొందాయి. ఆనాటి నుండి వాసుకి తన సోదరి జరత్కారువును చాలా జాగ్రత్తగా చూసుకొంటూ, ఎంతో ఆనందంగా ఉన్నాడు. (1,2)
తతో నాతిమహాన్ కాలః సమతీత ఇవాభవత్ ।
అథ దేవాసురాః సర్వే మమంథుర్వరుణాలయమ్ ॥ 3
తత్ర నేత్రమభూన్నాగః వాసుకిర్బలినాం వరః ।
సమాప్యైవ చ తత్ కర్మ పితామహముపాగమన్ ॥ 4
దేవా వాసుకినా సార్ధం పితామహమథాబ్రువన్ ।
భగవచ్ఛాపభీతోఽహం వాసుకిస్తప్యతే భృశమ్ ॥ 5
కొంతకాలం గడచింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథించారు. అపుడు మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకొని, బలాఢ్యుడయిన వాసుకిని త్రాడుగా ఉపయోగించుకొన్నారు. అమృతం కోసం తలపెట్టిన మంథనకార్యం పూర్తి అయ్యాక దేవతలు వాసుకిని వెంటబెట్టుకొని బ్రహ్మదగ్గఱకు వెళ్లి ఆయనతో ఈ విధంగా అన్నారు. "భగవాన్! ఈ వాసుకి తల్లి ఇచ్చిన శాపం వల్ల మిక్కిలి భయపడుతున్నాడు. చాలా పరితపిస్తున్నాడు. (3-5)
అస్యైతన్మానసం శల్యం సముద్ధర్తుం త్వమర్హసి ।
జనన్యాః శాపజం దేవ జ్ఞాతీనాం హితమిచ్ఛతః ॥ 6
ఈ వాసుకి హృదయంలో ఉన్న ఈ బాధని మీరే తొలగించాలి. ఇతడు సోదరులకు, బంధువులకు హితం కోరేవాడు. మాతృశాపానికి చాలా వేదన చెందుతున్నాడు. (6)
హితో హ్యయం సదాస్మాకం ప్రియకారీ చ నాగరాట్ ।
ప్రసాదం కురు దేవేశ శమయాస్య మనోజ్వరమ్ ॥ 7
ఈ నాగరాజు మన అందరికీ సహాయపడుతూ మనకు మేలుచేసేవాడు. మీరు అనుగ్రహించి ఈతని మనస్తాపాన్ని పోగొట్టవలసినదిగా కోరుతున్నాం." (7)
బ్రహ్మోవాచ
మయైవ తద్ వితీర్ణం వై వచనం మనసామరాః ।
ఏలాపత్రేణ నాగేన యదాస్యాభిహితం పురా ॥ 8
బ్రహ్మ చెప్తున్నాడు. దేవతలారా! ఏలాపత్రుడు వాసుకి సమక్షంలో పూర్వం ఏమిచెప్పాడో అది సత్యం. నా ప్రేరణ వల్లనే ఏలాపత్రుడు ఆ మాటలు చెప్పాడు. కాబట్టి ఏలాపత్రుడు వాసుకి మొదలగు వారితో కద్రూశాప ప్రతీకారం గురించి పూర్వం చెప్పినట్లే జరుగుతుంది. (8)
తత్ కరోత్యేష నాగేంద్రః ప్రాస్తకాలం వచః స్వయమ్ ।
వినశిష్యంతి యే పాపాః న తు యే ధర్మచారిణాః ॥ 9
ఈ నాగరాజు సమయం వచ్చినపుడు తానే స్వయంగా దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. పాపాత్ములు మాత్రమే జనమేజయుని సర్పయాగంలో మరణిస్తారు. ధర్మాత్ములంతా సురక్షితంగానే ఉంటారు. (9)
ఉత్పన్నః స జరత్కారుః తపస్యుగ్రే రతో ద్విజః ।
తస్యైష భగినీం కాలే జరత్కారుం ప్రయచ్ఛతు ॥ 10
జరత్కారుడు అనే బ్రాహ్మణుడు జన్మించి, అతడు ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. వాసుకి సమయానుకూలంగా తన సోదరి జరత్కారువును అతనికి సమర్పించాలి. (10)
ఏలాపత్రేన యత్ ప్రోక్తం వచనం భుజగేన హ ।
పన్నగానాం హితం దేవాః తత్ తథా న తదన్యథా ॥ 11
దేవతలారా! ఏలాపత్రుడు చెప్పిన మాటలన్నీ సర్పాలకు హితకరాలే. అతని మాటప్రకారం జరిగి తీరుతుంది. దానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు. (11)
సౌతిరువాచ
ఏతచ్ఛ్రుత్వా తు నాగేంద్రః పితామహవచస్తదా ।
సందిశ్య పన్నగాన్ సర్వాన్ వాసుకిః శాపమోహితః ॥ 12
స్వసారముద్యమ్య తదా జరత్కారుమృషిం ప్రతి ।
సర్పాన్ బహూన్ జరత్కారౌ నిత్యయుక్తాన్ సమాదధత్ ॥ 13
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. బ్రహ్మదేవుని ఆ మాటల్ని వాసుకి విని ఆనందంగా తన సోదరులందరికీ చెప్పాడు. సోదరి జరత్కారువును జరత్కారుమహర్షికి ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ జరత్కారుని కనుగొనటానికి సర్పాలను ఆదేశించాడు. (12,13)
జరత్కారుర్యదా భార్యామ్ ఇచ్ఛేద్ వరయితం ప్రభుః ।
శీఘ్రమేత్య తదాఖ్యేయం తన్నః శ్రేయో భవిష్యతి ॥ 14
జరత్కారుమహర్షి ఎప్పుడు వివాహం చేసుకొనదలచాడో అపుడు ఆ విషయాన్ని వెంటనే నాకు తెలియజేయవలసినదనీ, అపుడు అందరికీ మేలు కలుగుతుందనీ వాసుకి తన సోదరులకు చెప్పాడు. (14)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి జరత్కార్వన్వేషణే ఏకోనచత్వారింశోఽధ్యాయః ॥ 39 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున జరత్కారుని కొరకు అన్వేషణము అను ముప్పది తొమ్మిదవ అధ్యాయము. (39)