40. నలువదవ అధ్యాయము

పరీక్షిదుపాఖ్యానము.

శౌనక ఉవాచ
జరత్కారురితి ఖ్యాతః యస్త్వయా సూతనందన ।
ఇచ్ఛామి తదహం శ్రోతుం ఋషేస్తస్య మహాత్మనః ॥ 1
కిం కారణం జరత్కారోః నామైతత్ ప్రథితం భువి ।
జరత్కారునిరుక్తిం త్వం యథావద్ వక్తుమర్హసి ॥ 2
శౌనకుడు ఉగ్రశ్రవుని అడుగుతున్నాడు. సూతనందనా! మీరు జరుత్కారు మహర్షిని గురించి చెప్పారు గదా! ఆ మహర్షి యొక్క మాహాత్మ్యాన్ని వినాలని కోరుతున్నాను. జరత్కారుడు అనే పేరు ఎందుకు ప్రసిద్ధికి వచ్చింది. ఆ పదానికి అర్థం ఏమిటి? చెప్పండి. (1,2)
సౌతిరువాచ
జరేతి క్షయమాహుర్వై దారుణం కారుసంజ్ఞితమ్ ।
శరీరం కారు తస్యాసీత్ తత్ స ధీమాన్ శనైః శనైః ॥ 3
క్షపయామాస తీవ్రేణ తపసేత్యత ఉచ్యతే ।
జరత్కారురితి బ్రహ్మన్ వాసుకేర్భగినీ తథా ॥ 4
సౌతి చెప్పాడు. జరా శబ్దానికి క్షీణత్వం అని, కారు శబ్దానికి భయంకరం అనీ అర్థం. అతని శరీరం భయంకరంగా, కృశించడం చేత అతనికి జరత్కారుడని పేరు కలిగింది. ఆ మహర్షి తీవ్రమైన తపస్సుచేసి శరీరాన్ని భయంకరంగా కృశింపచేశాడు. అందుచేత అతడు జరత్కారుడు అయ్యాడు. వాసుకి సోదరికూడా అదేవిధంగా ఉండడం చేత ఆమెను కూడా జరత్కారువు అన్నారు. (3,4)
ఏవముక్తస్తు ధర్మాత్మా శౌనకః ప్రాహసత్ తదా ।
ఉగ్రశ్రవసమామంత్ర్య ఉపపన్నమితి బ్రువన్ ॥ 5
ఉగ్రశ్రవుడు ఈ విధంగా చెప్పిన తరువాత శౌనకుడు నవ్వి అతనితో "మీరు చెప్పినది ఉచితంగానే ఉన్నది" అని అన్నాడు. (5)
శౌనక ఉవాచ
ఉక్తం నామ యథాపూర్వం సర్వం తచ్ఛ్రుతవానహమ్ ।
యథా తు జ్ఞాతో హ్యాస్తీకః ఏతదిచ్ఛామి వేదితుమ్ ।
తచ్ఛ్రుత్వా వచనం తస్య సౌతిః ప్రోవాచ శాస్త్రతః ॥ 6
శౌనకుడు అడుగుతున్నాడు. పూర్వం మీరు జరత్కారుని వృత్తాంతం చెప్పారు గదా! ఇపుడు ఆస్తీకుని వృత్తాంతం గురించి వినాలని కోరుతున్నాం. ఆ మాట విని ఉగ్రశ్రవుడు శౌనకునితో పురాణకథనానుసారం ఆస్తీకుని గురించి చెపుతున్నాడు. (6)
సౌతిరువాచ
సందిశ్య పన్నగాన్ సర్వాన్ వాసుకిః సుసమాహితః ।
స్వసారముద్యమ్య తదా జరత్కారుమృషిం ప్రతి ॥ 7
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. ఏకాగ్రచిత్తంతో వాసుకి సర్పాలందరికీ 'జరత్కారు మునికి సోదరి జరత్కారువునిచ్చి వివాహం చేయాలి. వెదుకు'మని చెప్పాడు గదా! (7)
అథ కాలస్య మహతః స మునిః సంశితవ్రతః ।
తపస్యభిరతో ధీమాన్ స దారాన్ నాభ్యకాంక్షత ॥ 8
చాలాకాలం తరువాత కూడ బుద్ధిమంతుడైన జరత్కారుముని కేవలం తపస్సు చేయడంలోనే నిమగ్నమైయున్నాడు. వివాహం చేసుకొనే కోరికే లేదు. (8)
స తూర్ద్వరేతాస్తపసి ప్రసక్తః
స్వాధ్యాయవాన్ వీతభయః కృతాత్మా ।
చచార సర్వాం పృథివీం మహాత్మా
న చాపి దారాన్ మనసాధ్యకాంక్షత ॥ 9
అతడు ఊర్ధ్వరేతస్కుడైన బ్రహ్మచారి. తపస్సులోనే నిరంతరం లగ్నమయ్యాడు. నిత్యమూ వేదాధ్యయనం చేస్తూ నియమ బద్ధంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అతడు దేనిని గురించీ భయపడేవాడు కాదు. అతడు దేశం అంతా సంచారం చేశాడు. అతడు ఎప్పుడూ స్త్రీని అభిలషించలేదు. (9)
తతోఽపరస్మిన్ సంప్రాప్తే కాలే కస్మింశ్చిదేవ తు ।
పరిక్షిన్నామ రాజాసీద్ బ్రహ్మన్ కౌరవవంశజః ॥ 10
బ్రాహ్మణా! ఆ తరువాత కొంతకాలానికి పరీక్షిత్తు అనే కౌరవవంశ మహారాజు రాజ్యానికి వచ్చాడు. (10)
యథా పాండుర్మహాబాహుః ధనుర్ధరవరో యుధి ।
బభూవ మృగయాశీలః పురాస్య ప్రపితామహః ॥ 11
యుద్ధంలో ధనుర్ధారులందరిలో శ్రేష్ఠుడయిన అతని ముత్తాత పాండురాజు వలె పరీక్షిత్తు కూడా వేటమీద ఆసక్తి కలిగి ఉండేవాడు. (11)
మృగాన్ విధ్యన్ వరాహాంశ్చ తరక్షూన్ మహిషాంస్తథా ।
అన్యాంశ్చ వివిధాన్ వన్యాన్ చచార పృథివీపతిః ॥ 12
ఆ రాజు అడవిపందుల్ని, పులుల్ని, మహిషాల్ని ఇంకా ఎన్నో ఇతరజంతువుల్ని వేటాడుతూ అడవి అంతా తిరిగేవాడు. (12)
స కదాచిన్మృగం విద్ద్వా బాణేనావతపర్వణా ।
పృష్ఠతో ధనురాదాయ ససార గహనే వనే ॥ 13
ఒకనాడు ఆ మహారాజు కీకారణ్యంలో ఒక క్రూర మృగాన్ని బాణంతో కొట్టాడు. అది ప్రాణాలతో పారిపోతూండగా దాని వెనుక ధనుస్సుతో ఇతడు అనుసరించాడు. (13)
యథైవ భగవాన్ రుద్రః విద్ద్వా యజ్ఞమృగం దివి ।
అవ్వగచ్ఛద్ ధనుష్పాణిః పర్యన్వేష్టుమితస్తతః ॥ 14
పూర్వం పరమశివుడు యజ్ఞమృగాన్ని కొట్టి వెంటాడినట్లుగా పరీక్షిత్తు ఆ మృగం వెంట ధనుర్ధారియై వెతుకుతూ వెళ్లాడు. (14)
న హి తేన మృగో విద్ధః జీవన్ గచ్ఛతి వై వనే ।
పూర్వరూపం తు తత్తూర్ణం సోఽగాత్ స్వర్గగతిం ప్రతి ॥ 15
పరిక్షితో నరేంద్రస్య విద్ధో యన్నష్టవాన్ మృగః ।
దూరం చాపహృతస్తేన మృగేణ స మహీపతిః ॥ 16
నిజానికి అతనిచే కొట్టబడిన మృగం ఆ అడవిలో ప్రాణాలతో మిగలదు. కాని ఆనాడు పరీక్షిత్తు కొట్టిన మృగం ప్రాణాలతో మిగిలి అతనిని చాలాదూరం కొనిపోయింది. రాజు ఆ మృగం వెంట పరుగెత్తాడు. (15,16)
పరిశ్రాంతః పిపాసార్తః ఆససాద మునిం వనే ।
గవాం ప్రచారేష్వాసీనం వత్సానాం ముఖనిఃసృతామ్ ॥ 17
భూయిష్ఠముపయుంజానం ఫేనమాపిబతాం పయః ।
తమభిద్రుత్య వేగేన స రాజా సంశితవ్రతమ్ ॥ 18
అపృచ్ఛద్ ధనురుద్యమ్య తం మునిం క్షుచ్ఛ్రమాన్వితః ।
భో భో బ్రహ్మన్నహం రాజా పరీక్షిదభిమన్యుజః ॥ 19
మయా విద్ధో మృగో నష్టః కచ్చిత్ తం దృష్టవానసి ।
స మునిస్తం తు నోవాచ కించిన్మౌనవ్రతే స్థితః ॥ 20
వేటాడుతూ ఆ రాజు అలసిపోయాడు. దప్పికతో బాధపడుతున్నాడు. అలా వెళ్తూ ఆ వనంలో ఒక మహర్షిని చూశాడు. ఆవుదూడలు పాలు తాగేటప్పుడు గాలివల్ల వాని నోటినుండి ఎగిరివచ్చే నురగలే ఆ మునికి ఆహారం. ఆవులు సంచరించే ప్రదేశంలోనే తపస్సు చేస్తున్నాడు. వేగంగా అతని దగ్గరకు పరిక్షిత్తు వచ్చాడు. ఆకలి దప్పులతో ఉన్న ఆ రాజు మునిని ప్రశ్నిస్తున్నాడు. "బ్రాహ్మణోత్తమా! నేను అభిమన్యుని కుమారుడిని. నా పేరు పరీక్షిత్తు. ఈ అడవిలో ఒక మృగాన్ని బాణంతో కొట్టాను. అది పారిపోయింది. ఆ మృగాన్ని మీరు చూశారా?" అని ప్రశ్నించాడు. ఆ మహర్షి మౌనవ్రతుడు. కాబట్టి రాజుకు సమాధానం ఏమీ చెప్పలేదు. (17-20)
తస్య స్కంధే మృతం సర్పం క్రుద్ధో రాజా సమాసజత్ ।
సముత్దిప్య ధనుష్కోట్యా స చైవం సముపైక్షత ॥ 21
ముని సమాధానం చెప్పకపోవటంతో పరిక్షిత్తుకు కోపం వచ్చింది. తన వింటికొమ్ముతో అక్కడ ఉన్న మృతసర్పాన్ని ఆ ముని కంఠానికి తగిలించాడు. ముని అతనిని ఉపేక్షించాడు. (21)
న స కించిదువాచైవం శుభం వా యది వాశుభమ్ ।
స రాజా క్రోధముత్సృజ్య వ్యథితస్తం తథాగతమ్ ।
దృష్ట్యా జగామ నగరం ఋషిస్త్యాసీత్ తథైవ సః ॥ 22
ముని రాజుతో మంచికాని, చెడుకాని ఏమీ మాట్లాడలేదు. అలాగే ఉన్న మునిని చూసి రాజు కోపం విడచి చాలా బాధపడ్డాడు. రాజు నగరానికి వెళ్లిపోయాడు. ఋషి మాత్రం అలాగే ఉండిపోయాడు. (22)
న హి తం రాజశార్దూలం క్షమాశీలో మహామునిః ।
స్వధర్మ నిరతం భూపం సమాక్షిప్తోఽప్యధర్షయత్ ॥ 23
రాజధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ, పరిపాలిస్తున్న పరీక్షిత్తు మహారాజు తనకు ఆ విధంగా అవమానం కల్గించినా క్షమాశీలుడైన ఆ ముని సహించాడే కాని ఏమాత్రం నిందించలేదు. (23)
న హి తం రాజశార్దూలః తథా ధర్మపరాయణమ్ ।
జానాతి భరతశ్రేష్ఠః తత ఏనమధర్షయత్ ॥ 24
భరతవంశ శిరోమణి, రాజశ్రేష్ఠుడు అయిన పరీక్షిత్తు ధర్మపరాయణుడైన ఆ మునీంద్రుని గూర్చి తెలియకపోవడం చేత ఆ విధంగా అవమానించాడు. (24)
తరుణస్తస్య పుత్రోఽభూత్ తిగ్మతేజా మహాతపాః ।
శృంగీ నామ మహాక్రోధః దుష్ప్రసాదో మహావ్రతః ॥ 25
ఆ మునీంద్రునికి శృంగి అనే కుమారుడు ఉన్నాడు. అతడు యువకుడు, తపస్వి కూడా. తేజస్సంపన్నుడు అయిన ఆ మునికుమారుడు మహావ్రతుడు, అయినా అతనిది అధికమైన కోపస్వభావం. అతనిని శాంతింపజేయటం కష్టసాధ్యమే. (25)
స దేవం పరమాసీనం సర్వభూతహితే రతమ్ ।
బ్రహ్మాణముపతస్థే వై కాలే కాలే సుసంయతః ॥ 26
అతడు చాలాకాలం తన మనస్సును, ఇంద్రియాలనూ నిగ్రహించుకొంటూ సమస్త ప్రాణికోటికి హితాన్నే ఆచరిస్తున్నాడు. అతడు గురుకులంలో తన ఆచార్యదేవుని సేవిస్తూ ఉన్నాడు. (26)
స తేన సమనుజ్ఞాతః బ్రహ్మణా గృహమేయివాన్ ।
సఖ్యోక్తః క్రీడమానేన స తత్ర హసతా కిల ॥ 27
సంరంభాత్ కోపనోఽతీవ విషకల్పో మువేః సుతః ।
ఉద్దిశ్య పితరం తస్య యచ్ఛ్రుత్వా రోషమాహరత్ ।
ఋషిపుత్రేణ ధర్మార్థే కృశేన ద్విజసత్తమ ॥ 28
ఆ రోజు శృంగి ఆచార్యుని అనుమతితో ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో తన మిత్రుడు అయిన కృశుడు కలిశాడు. అతడు శృంగిని కలిసి నవ్వుతూ అతని తండ్రికి జరిగిన ఆ అవమానాన్ని చెప్పాడు. ఆ సంగతిని విన్న శృంగి కోపోద్రిక్తుడయ్యాడు. (27,28)
కృశ ఉవాచ
తేజస్వినస్తవ పితా తథైవ చ తపస్వినః ।
శవం స్కంధేన వహతి మా శృంగిన్ గర్వితో భవ ॥ 29
కృశుడు శృంగితో అంటున్నాడు. శృంగీ! నీవు మహాతపస్విని, తేజోవంతుడవు. నీ తండ్రి భుజంపై మృతసర్పం వ్రేలాడుతున్నది. ఇంకా నీ తపో గర్వమెందుకు? (29)
వ్యాహరత్సు ఋషిపుత్రేషు మా స్మ కించిద్ వచో వద ।
అస్మద్విధేషు సిద్ధేషు బ్రహ్మవిత్సు తపస్విషు ॥ 30
సిద్ధులు, బ్రహ్మవేత్తలు, తాపసులు అయిన మా వంటి ఋషి కుమారులు ఇదే మాటాడుకొంటుంటే నీవు మౌనంగా ఉండు! (30)
క్వ తే పురుషమానిత్వం క్వ తే వాచస్తథావిధాః ।
దర్పజాః పితరం ద్రష్టా యస్త్వం శవధరం తథా ॥ 31
నీ పౌరుషం, అభిమానం ఎక్కడ? నీ గర్వపూరితమైన మాటలెక్కడ? నీ తండ్రి మెడలో ఉన్న మృతసర్పాన్ని చూసి కూడా మిన్నకున్నావు. (31)
పిత్రా చ తవ తత్ కర్మ నానురూపమివాత్మనః ।
కృతం మునిజనశ్రేష్ఠ యేనాహం భృశదుఃఖితః ॥ 32
మునిజన శిరోమణీ! శృంగీ! నీ తండ్రి ఎటువంటి అకృత్యాన్నీ చేయలేదు. నీవు ఎటువంటి అనుచితమైన పనిని చేయరాదు. నా తండ్రికి అవమానం జరిగితే నేను ఎంత బాధపడతానో అదేవిధంగా నీ తండ్రికి జరిగిన అవమానానికీ నేను చాలా విచారిస్తున్నాను." (32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి పరీక్షిదుపాఖ్యానే చత్వారింశోఽధ్యాయః ॥ 40 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున పరీక్షిదుపాఖ్యానము అను నలువదవ అధ్యాయము. (40)