42. నలువది రెండవ అధ్యాయము

శమీకుడు గౌరముఖుని ద్వారా పరిక్షిత్తుకు శాపవిషయము తెలుపుట.

శృంగ్యువాచ
యద్యేతత్ సాహసం తాత యది వా దుష్కృతం కృతమ్ ।
ప్రియం వాప్యప్రియం వా తే వాగుక్తా మృషా భవేత్ ॥ 1
శృంగి తండ్రితో ఇలా అన్నాడు. "నాన్నగారూ! ఇది నేను చేసిన సాహసమే కావచ్చు. పాపకర్మమే కావచ్చు. ఇది మీకు ప్రియం కావచ్చు. కాకపోవచ్చు. కాని నేను చెప్పినమాట ఎన్నటికీ అబద్ధం కాదు. (1)
నైవాన్యథేదం భవితా పితరేష బ్రవీమి తే ।
నాహం మృషా బ్రవీమ్యేవం స్వైరేష్వపి కుతః శపన్ ॥ 2
నాన్నగారూ! నేను మీకు యథార్థం చెపుతున్నాను. నేను ఇచ్చిన శాపం వ్యర్థం కాదు. నేను పరిహాసానికి కూడా అబద్ధం చెప్పను. ఇక ఇటువంటి కష్టంలో శాపం విషయంలో ఎందుకు అబద్ధమాడతాను? (2)
శమీక ఉవాచ
జానామ్యుగ్రప్రభావం త్వాం తాత సత్యగిరం తథా ।
నానృతం చోక్తపూర్వం తే నైతన్మిథ్యా భవిష్యతి ॥ 3
అపుడు శమీకుడు ఇలా అన్నాడు. కుమారా! నీ కోపస్వభావం నాకు తెలుసును. నీవు సత్యవాదివి అని కూడా ఎరుగుదును. ఇంతవరకు నీవు ఎప్పుడూ అబద్ధాన్ని చెప్పలేదు కూడా. కాబట్టి నీవు ఇచ్చిన శాపం కూడా అబద్ధం కాదు. (3)
పితా పుత్రో వయఃస్థోఽపి సతతం వాచ్య ఏవ తు ।
యథా స్యాద్ గుణసంయుక్తః ప్రాప్నుయాచ్చ మహద్ యశః ॥ 4
అయినప్పటికి తండ్రి తన కుమారుని వయఃస్థితిని తెలుసుకొన్నప్పటికి అతనికి సత్కర్మలను గురించి తప్పక ఉపదేశించాలి. అపుడే కుమారుడు గుణవంతుడు అవుతాడు. గొప్పకీర్తిని పొందుతాడు. (4)
కిం పునర్బాల ఏవ త్వం తససా భావితః సదా ।
వర్ధతే చ ప్రభవతాం కోపోఽతీవ మహాత్మనామ్ ॥ 5
నీవు ఇంకా చిన్నబాలుడవే సుమా! కాబట్టి నీకు తప్పక నేను ఉపదేశించాలి. నీవు నిత్యం తపస్సు చేయడం ద్వారా దివ్యమైన శక్తిని పొందుతున్నావు. యోగం ద్వారా శక్తిసంపన్నులయిన వారికి కూడా కోపం అధికంగా ఉంటున్నది. నీవు బాలుడవు కావున నీకు కోపం అధికంగా ఉంది. (5)
సోఽహం పశ్యామి వక్తవ్యం త్వయి ధర్మభృతాం వర ।
పుత్రత్వం బాలతాం చైవ తవావేక్ష్య చ సాహసమ్ ॥ 6
నీవు నాకు పుత్రుడవు. కాని బాలత్వమూ ఉంది. (అనగా మూఢత్వం). పైగా నీలో సాహసముంది. అందుచే నీకు కొంత హితబోధ చెయ్యాలనుకొంటున్నాను. (6)
స త్వం శమపరో భూత్వా వన్యమాహారమాచరన్ ।
చర క్రోధమిమం హత్వా నైవ ధర్మం ప్రహాస్యసి ॥ 7
నీవు శమం పొందు. అడవిలోని కందమూల ఫలాలు ఆహారంగా తీసుకొని క్రోధం చంపుకొని సంచరించు. ఎన్నడూ ధర్మాన్ని విడవకు. (7)
క్రోధో హి ధర్మం హరతి యతీనాం దుఃఖసంచితమ్ ।
తతో ధర్మవిహీనానాం గతిరిష్టా న విద్యతే ॥ 8
క్రోధమే ధర్మాన్ని హరిస్తుంది. అది యతీశ్వరులకు కూడా దుఃఖం కలిగిస్తుంది.అందుచేత ధర్మరహితులకు అభీష్టం నెరవేరదు. (8)
వి: తె: దీనికి నన్నయ్య చక్కని తెలుగు చేసినాడు.
క్రోధమ తపముం జెఱచును
గ్రోధమ యణిమాదులైన గుణములఁబాపుం
గ్రోధమ ధర్మక్రియలకు
బాధయగుం గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే. (1-2-173)
శమ ఏవ యతీనాం హి క్షమిణాం సిద్ధికారకః ।
క్షమావతామయం లోకః పరశ్పైవ క్షమావతామ్ ॥ 9
క్షమించే యతీశ్వరులకు శమమే సిద్ధిస్తుంది. ఈ లోకం క్షమాగుణం కలవారిది. ఈ లోకమేకాదు పరలోకం కూడా క్షమాగుణం కల వారికే లభిస్తుంది. (9)
వి: తె: దీనికి నన్నయ్య మృదువైన నిష్కర్ష చేసినాడు.
క్షమలేని తపసితపమును
బ్రమత్తు సంపదయు ధర్మబాహ్య ప్రభు రా
జ్యము భిన్న కుంభమున తో
యములట్టుల యద్రువంబులగు నివి యెల్లన్. (1-2-173)
తస్మాచ్చరేథాః సతతం క్షమాశీలో జితేంద్రియః ।
క్షమయా ప్రాప్స్యసే లోకాన్ బ్రహ్మణః సమనంతరాన్ ॥ 10
కాబట్టి నీవు ఎప్పుడూ ఇంద్రియనిగ్రహాన్ని పాటిస్తూ క్షమాశీలుడవుగా ఉండు. ఓర్పుగలవాడు బ్రహ్మ సామీప్యంకల లోకాలు (క్రమముక్తి) పొందగల్గుతాడు. (10)
మయా తు శమమాస్థాయ యచ్ఛక్యం కర్తుమద్య వై ।
తత్ కరిష్యామ్యహం తాత ప్రేషయిష్యే నృపాయ వై ॥ 11
మమ పుత్రేణ శప్తోఽసి బాలేన కృశబుద్ధినా ।
మమేమాం ఘర్షణాం త్వత్తః ప్రేక్ష్య రాజన్నమర్షిణా ॥ 12
నా మనస్సు ప్రశాంతంగా చేయదగినదిది అనిపిస్తోంది. కుమారా! రాజు దగ్గరకు ఎవరినయినా పంపుతాను - "రాజా! నిన్ను నా తెలివి తక్కువ కొడుకు శపించాడు. నీవు నన్ను అవమానించావని కోపించి నా పుత్రుడిలా చేశాడు. (11,12)
సౌతిరువాచ
ఏవమాదిశ్య శిష్యం స ప్రేషయామాస సువ్రతః ।
పరిక్షితే నృపతయే దయాపన్నో మహాతపాః ॥ 13
సందిశ్య కుశలప్రశ్నం కార్యవృత్తాంతమేవ చ ।
శిష్యం గౌరముఖం నామ శీలవంతం సమాహితమ్ ॥ 14
ఉగ్రశ్రవుడు ఇలా చెపుతున్నాడు. జితేంద్రియుడైన ఆ శమీకమహర్షి దయాళువై సచ్ఛీలుడైన తన శిష్యుడు గౌరముఖుడు అనేవానిని రాజు దగ్గఱకు పంపాడు. పంపుతూ అతనితో "మొదటగా రాజును కుశలప్రశ్నల్ని అడుగు. తరువాత శాపానికి కారణాన్ని చెప్పు. ఆ తరువాత కుమారుడిచ్చిన శాపాన్ని తెలియచెయ్యి. తరువాత తక్షకుని నుండి తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచించుకోమని చెప్పు" అని ఆదేశించి రాజు దగ్గరకు పంపించాడు. (13,14)
సోఽభిగమ్య తతః శీఘ్రం నరేంద్రం కురువర్ధనమ్ ।
వివేశ భవనం రాజ్ఞః పూర్వం ద్వాఃస్థైర్నివేదితః ॥ 15
వెంటనే గౌరముఖుడు అక్కడ నుండి బయలుదేరి కురువంశోద్ధారకుడైన పరిక్షిత్తు దగ్గరకు (వెళ్లి), ద్వారపాలకుడి ద్వారా తన రాకను తెలిపి, రాజానుమతితో భవనంలో ప్రవేశించాడు. (15)
పూజితస్తు నరేంద్రేణ ద్విజో గౌరముఖస్తదా ।
ఆచఖ్యౌ చ పరిశ్రాంతః రాజ్ఞః సర్వమశేషతః ॥ 16
శమీకవచనం ఘోరం యథోక్తం మంత్రిసన్నిధౌ ।
మహారాజు గౌరముఖుని సగౌరవంగా సత్కరించాడు. మంత్రుల సన్నిధానంలో గౌరముఖుడు శ్రమ లేకుండా పరిక్షిత్తుకు శమీకమహర్షి చెప్పిన సందేశాన్ని అంతటినీ పూసగుచ్చినట్లు చెప్పాడు. (16 1/2)
గౌరముఖ ఉవాచ
శమీకో నామ రాజేంద్ర వర్తతే విషయే తవ ॥ 17
ఋషిః పరమధర్మాత్మా దాంతః శాంతో మహాతపాః ।
తస్య త్వయా నరవ్యాఘ్ర సర్పః ప్రాణైర్వియోజితః ॥ 18
అవసక్తో ధనుష్కోట్యా స్కంధే మౌనాన్వితస్య చ ।
క్షాంతవాంస్తవ తత్ కర్మ పుత్రస్తస్య న చక్షమే ॥ 19
గౌరముఖుడు ఇలా అన్నాడు. "రాజేంద్రా! తమ రాజ్యంలో శమీకుడు అనే పరమధర్మాత్ముడైన మహర్షి ఉంటున్నాడు. ఆ మహా తపస్సంపన్నుడు జితేంద్రియుడు. మనోనిగ్రహం కల మహాముని, పరమశాంతచిత్తుడు. మహారాజా! మౌనవ్రతాన్ని ఆచరిస్తూ తపస్సు చేసుకొంటున్న ఆ మహర్షి కంఠాన మీరు వింటికొనతో ఒక మృత సర్పాన్ని పడవేశారు. అయినా ఆ మహర్షి శాంతస్వభావుడు, క్షమాశీలుడు కాబట్టి ఆ తిరస్కారాన్ని సహించాడు, క్షమించాడు. కాని ఆయన కుమారుడు మాత్రం ఈ అవమానాన్ని సహించలేకపోయాడు. (17-19)
తేన శప్తోఽసి రాజేంద్ర పితురజ్ఞాతమద్య వై ।
తక్షకః సప్తరాత్రేణ మృత్యుస్తత్ర భవిష్యతి ॥ 20
ఆ కారణంగా ఋషికుమారుడు తన తండ్రికి తెలియకుండ నీకు "నేటినుండి ఏడు రోజులలోగా తక్షకుని చేతిలో మరణం సంభవించాలి" అని శాపం ఇచ్చాడు. (20)
తత్ర రక్షాం కురుష్వేతి పునః పునరథాబ్రవీత్ ।
తదన్యథా న శక్యం చ కర్తుం కేనచిదప్యుత ॥ 21
ఈ పరిస్థితులలో నీవు తక్షకుని బారినుండి రక్షించుకోవలసినదిగా మా శమీకమహర్షి పదేపదే కోరుతున్నాడు. ఈ శాపాన్ని మరలించడానికి ఏ విధంగాను సాధ్యం కాదు. (21)
న హి శక్నోతి తం యంతుం పుత్రం కోపసమన్వితమ్ ।
తతోఽహం ప్రేషితస్తేన తవ రాజన్ హితార్థినా ॥ 22
కోపావేశపరుడైన తన కుమారుని మహర్షి శాంత పరచలేకపోయాడు. మహారాజా! ఆ కారణంవల్ల శమీకమహర్షి మీ మేలుకోరి నన్ను ఇక్కడికి పంపించారు. (22)
సౌతిరువాచ
ఇతి శ్రుత్వా వచో ఘోరం స రాజా కురునందనః ।
పర్యతప్యత తత్ పాపం కృత్వా రాజా మహాతపాః ॥ 23
ఉగ్రశ్రవుడు శౌనకమహర్షితో ఇలా అంటున్నాడు. భయంకర శాపవిషయాన్ని విన్న పరిక్షిత్తు తాను ఆ మహామునీంద్రుడికి చేసిన అపరాధాన్ని తలచుకొని ఎంతో బాధపడ్డాడు. (23)
తం చ మౌనవ్రతం శ్రుత్వా వనే మునివరం తదా ।
భూయ ఏవాభవద్ రాజా శోకసంతప్తమానసః ॥ 24
ఆ శమీకమహర్షి తన వేటసమయంలో మౌనవ్రతాన్ని అవలంబించాడని తెలుసుకొని దుఃఖంతో ఏడుస్తూ మనస్తాపం చెందాడు. (24)
అనుక్రోశాత్మతాం తస్య శమీకస్యావధార్య చ ।
పర్యతప్యత భూయోఽపి కృత్వా తత్ కిల్బిషం మునేః ॥ 25
మహర్షియొక్క దయాళుత్వానికి, శాపానికి తగిన ప్రతిక్రియ చెప్పి పంపినందుకూ తాను పశ్చాత్తాపాన్ని చెంది మునికి చేసిన అపరాధాన్ని తలచుకొంటూ చాల పరితపించాడు పరీక్షిత్తు. (25)
న హి మృత్యుం తథా రాజా శ్రుత్వా వై సోఽన్వతప్యత ।
అశోచదమరప్రఖ్యః యథా కృత్వేహ కర్మ తత్ ॥ 26
దేవతాసమానుడైన పరిక్షిత్తు తన మరణశాపాన్ని విన్నా తాను విచారపడకూడదని అనుకొన్నాడు. తాను మహానుభావుడైన మునీంద్రుడికి చేసిన అపరాధానికి ఎంతగానో కుమిలిపోయాడు. (26)
తతస్తం ప్రేషయామాస రాజా గౌరముఖం తదా ।
భూయః ప్రసాదం భగవాన్ కరోత్విహ మమేతి వై ॥ 27
అనంతరం మహారాజు గౌరముఖుని ఆశ్రమానికి పంపిస్తూ "భగవంతుడైన శమీకమునీంద్రులు మా యందు దయ చూపి అనుగ్రహించవలెనని ప్రార్థిస్తున్నాను" అని ప్రతిసందేశం ఇచ్చి పంపించాడు. (27)
తస్మింశ్చ గతమాత్రేఽథ రాజా గౌరముఖే తదా ।
మంత్రిభిర్మంత్రయామాస సహ సంవిగ్నమానసః ॥ 28
గౌరముఖుడు మరలిపోయిన తరువాత పరిక్షిత్తు దుఃఖపరవశుడై తన మంత్రులతో సమావేశం జరిపాడు. (28)
సమ్మంత్ర్య మంత్రిభిశ్చైవ స తథా మంత్రతత్త్వవిత్ ।
ప్రాసాదం కారయామాస ఏకస్తంభం సురక్షితమ్ ॥ 29
మంత్రతత్త్వం తెలిసిన మహారాజు తన మంత్రులతో ఆలోచించి సలహా పొందిన తరువాత సురక్షితమయిన ఒంటి స్తంభం మేడను నిర్మించాడు. (29)
రక్షాం చ విదధే తత్ర భిషజశౌషధాని చ ।
బ్రాహ్మణాన్ మంత్రసిద్ధాంశ్చ సర్వతో వై న్యయోజయత్ ॥ 30
భవనం దగ్గర రాజును రక్షించుకోడానికి అవసరమైన ఏర్పాటులన్నీ చేశారు. ఔషధాలనూ, వైద్యులనూ, మంత్రసిద్ధులయిన బ్రాహ్మణులనూ అక్కడ నియమించారు. (30)
రాజకార్యాణి తత్రస్థః సర్వాణ్యేవాకరోచ్చ సః ।
మంత్రిభిః సహధర్మజ్ఞః సమంతాత్ పరిరక్షితః ॥ 31
ధర్మజ్ఞుడయిన మహారాజు మంత్రులతో సంపూర్ణంగా రక్షింపబడుతూ అక్కడనే ఉండి రాజకార్యాలు అన్నీ నిర్వహించాడు. (31)
న చైనం కశ్చిదారూఢం లభతే రాజసత్తమమ్ ।
నాతోఽ సి నిశ్చరంస్తత్ర ప్రవేశే వినివార్యతే ॥ 32
మేడలో ఉన్న మహారాజును ఎవ్వరూ కలుసుకోవడానికి వీలు లేకుండా ఆజ్ఞాపించారు. గాలి కూడా ప్రవేశించడానికి అవకాశం లేదు. (32)
ప్రాప్తే చ దివసే తస్మిన్ సప్తమే ద్విజసత్తమః ।
కాశ్యపోఽ భ్యాగమద్ విద్వాన్ తం రాజానం చికిత్సితుమ్ ॥ 33
శాపప్రకారం ఏడవరోజున మంత్రశాస్త్రాన్ని తెలిసిన కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు పరిక్షిత్తుకు వైద్యం చేయడానికి వస్తున్నాడు. (33)
వి: సం: కాశ్యపుడు: ఇతడు కశ్యపుని వంశంలోవాడు. కశ్యపునికి బ్రహ్మ పామువిషాన్ని హరించే మంత్రం ఉపదేశించాడు. (20-16)
ఆ కశ్యపప్రజాపతి వంశంలోనివాడు ఈ కాశ్యపుడు.
శ్రుతం హి తేవ తదభూద్ యథా తం రాజసత్తమమ్ ।
తక్షకః పన్నగశ్రేష్ఠః నేష్యతే యమసాదనమ్ ॥ 34
రాజోత్తముడయిన పరిక్షిత్తును నాగరాజైన తక్షకుడు నేడు యమలోకానికి పంపిస్తాడని కాశ్యపుడు విన్నాడు. (34)
తం దష్టం పన్నగేంద్రేణ కరిష్యేఽ హమపజ్వరమ్ ।
తత్ర మేఽ ర్థశ్చ ధర్మశ్చ భవితేతి విచింతయన్ ॥ 35
తక్షకుడు రాజును కఱచినట్లయితే నేను అతని విషాన్ని హరింపజేసి జీవింపచేస్తాను. అప్పుడు నాకు ధనలాభం కలుగుతుంది. ధర్మాన్నిగూడా నెరవేర్చినవాడను అవుతానని కశ్యపుడు అనుకొని రాజు దగ్గరకు వస్తున్నాడు. (35)
తం దదర్శ స నాగేంద్రః తక్షకః కాశ్యపం పథి ।
గచ్ఛంతమేకమనసం ద్విజో భూత్వా వయోఽతిగః ॥ 36
తమబ్రవీద్ పన్నగేంద్రః కాశ్యపం మునిపుంగవమ్ ।
క్వ భవాంస్త్వరితో యాతి కించ కార్యం చికీర్షతి ॥ 37
నాగేంద్రుడయిన తక్షకుడు శాపవచన ప్రేరితుడై బయలుదేరి వస్తూ మార్గమధ్యంలో కాశ్యపుని చూశాడు. తక్షకుడు వృద్ధ బ్రాహ్మణవేషాన్ని ధరించి కాశ్యపుని ఈ విధంగా అడిగాడు. "అయ్యా! మీరు అతిత్వరితంగా ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్లుతున్నారు?" (36,37)
కాశ్యప ఉవాచ
నృపం కురుకులోత్పన్నం పరిక్షితమరిందమమ్ ।
తక్షకః పన్నగశ్రేష్ఠః తేజసాద్య ప్రధక్ష్యతి ॥ 38
అపుడు కాశ్యపుడు చెప్పాడు. "కురుకులంలో జన్మించి, శత్రుసంహారకుడైన పరిక్షిత్తుమహారాజును నేడు తక్షకుడు అనే సర్పరాజు తన విషాగ్నితో దగ్ధం చేయబోతున్నాడు. (38)
తం దష్టం పన్నగేంద్ఱేణ తేనాగ్నిసమతేజసా ।
పాండవానాం కులకరం రాజానమమి తౌజసమ్ ।
గచ్ఛామి త్వరితం సౌమ్య పద్యః కర్తుమపజ్వరమ్ ॥ 39
ఆ రాజు పాండవ వంశపరంపరను సురక్షితం చేస్తున్నాడు. అతడు అత్యంత పరాక్రమశాలి. బ్రాహ్మణోత్తమా! అటువంటి మహారాజును నాగేంద్రుడు కరిస్తే విషం బారినుండి తప్పించడానికి వేగంగా వెళ్తున్నాను" అని చెప్పాడు. (39)
తక్షక ఉవాచ
అహం స తక్షకో బ్రహ్మన్ తం ధక్ష్యామి మహీపతిమ్ ।
నివర్తస్య న శక్తస్త్వం మయా దష్టం చికిత్సితుమ్ ॥ 40
అపుడు తక్షకుడు కాశ్యపునితో "బ్రాహ్మణా! నేనే ఆ తక్షకుడిని. ఇవ్వాళ ఆ పరిక్షిత్తును భస్మం చేయడానికి వెళ్తున్నాను. నేను కాటువేసిన వానికి చికిత్స చేయలేరు మీరు." (40)
కాశ్యప ఉవాచ
అహం తం నృపతిం గత్వా త్వయా దష్టమపజ్వరమ్ ।
కరిష్యామీతి మే బుద్ధిః విద్యాబలసమన్వితా ॥ 41
కశ్యపుడన్నాడు. "నీవు రాజును కరిస్తే నేను అతని శరీరంలోంచి విషాన్ని హరిస్తాను. అతనిని జీవింపచేస్తాను. అటువంటి గొప్ప విద్య నా దగ్గర ఉంది. ఇది నా నిశ్చయం" అని చెప్పాడు. (41)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి కాశ్యపాగమనే ద్విచత్వారింశోఽధ్యాయః ॥ 42 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమున కాశ్యపుని రాక అను నలువది రెండవ అధ్యాయము. (42)