41. నలువది ఒకటవ అధ్యాయము

శృంగి పరీక్షిత్తుకు శాపమిచ్చుట.

సౌతిరువాచ
ఏవముక్తః స తేజస్వీ శృంగీ కోపసమన్వితః ।
మృతధారం గురుం శ్రుత్వా పర్యతప్యత మన్యునా ॥ 1
సౌతి చెపుతున్నాడు. శౌనకమహామునీంద్రా! కృశుని మాటలతో మహాతేజస్వి అయిన శృంగికి కోపం అధికమైంది. తన తండ్రి కంఠంలో మృతసర్పాన్ని రాజు వేశాడని విని కోపంతో పరితపించాడు. (1)
స తం కృశమభిప్రేక్ష్య సూనృతాం వాచముత్సృజన్ ।
అపృచ్ఛత్ తం కథం తాతః స మేఽద్య మృతధారకః ॥ 2
శృంగి కృశుని చూసి సూటిగా ఇలా ప్రశ్నించాడు. "నా తండ్రి కంఠంలో మృతసర్పాన్ని ఎందుకు ధరిస్తున్నాడు?" అని అడిగాడు. (2)
కృశ ఉవాచ
రాజ్ఞా పరిక్షితా తాతా మృగయాం పరిధావతా ।
అవసక్తః పితుస్తేఽద్య మృతః స్కంధే భుజంగమః ॥ 3
కృశుడు చెప్పాడు. పరిక్షిత్తుమహారాజు వేటకోసం వచ్చాడు. అతడు నీ తండ్రి కంఠంలో ఆ మృతసర్పాన్ని వేశాడు". (3)
కిం మే పిత్రా కృతం తస్య రాజ్ఞేఽనిష్టం దురాత్మనః ।
బ్రూహి తత్ కృస తత్త్వేవ పశ్య మే తపసో బలమ్ ॥ 4
అపుడు శృంగి కృశునితో "ఆవిషయాన్ని జరిగింది జరిగినట్లుగా చెప్పు. నా తండ్రి ఆ దుర్మార్గుడికి ఏ అపరాధం చేశాడు? చెప్పు - లేదా నా తపోబలం ఎంతటిదో చూడు" అని అన్నాడు. (4)
కృశ ఉవాచ
స రాజా మృగయాం యాతః పరిక్షిదభిమమ్యజః ।
ససార మృగమేకాకీ విద్ధ్వా బాణేన శీఘ్రగమ్ ॥ 5
న చాపశ్యన్మృగం రాజా చరంస్తస్మిన్ మహావనే ।
పితరం తే స దృష్ట్వైవ పప్రచ్ఛానభిభాషిణమ్ ॥ 6
అపుడు కృశుడు శృంగితో ఇలా చెప్పాడు. "అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు మహారాజు ఒంటరిగా వేటనిమిత్తం అడవికి వచ్చాడు. వేగంగా పరుగెడుతున్న ఒక క్రూరమృగాన్ని బాణంతో కొట్టాడు. అయితే ఆ మృగం ఆ విశాలవనంలో ఎటువెళ్లిందీ చూడలేకపోయాడు రాజు. ఇంతలో మౌనవ్రతధారి అయిన మీ తండ్రిని చూసి ఆ మృగం ఎటువెళ్లిందో తెలుసుకోవాలని అతనిని అడిగాడు. (5,6)
తం స్థాణుభూతం తిష్ఠంతం క్షుత్పిపిపాసాశ్రమాతురః ।
పునః పునర్మృగం నష్టం పప్రచ్ఛ పితరం తవ్ ॥ 7
స చ మౌనవ్రతోపేతః నైవ తం ప్రత్యభాషత ।
తస్య రాజా దనుష్కోట్యా సర్పం స్కంధే సమాసజత్ ॥ 8
వేటతో అలసిసొలసి ఆకలి దప్పులతో ఉన్న పరీక్షిత్తు మీ తండ్రిని మృగం గురించి అడిగితే సమాధానం చెప్పకుండా మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడుగదా! తనకు సమాధానం చెప్పకపోవటం వలన ఆ రాజు తన వింటికొనతో అక్కడే చచ్చి పడి ఉన్న సర్పాన్ని మీ తండ్రి మెడలో వేశాడు. (7,8)
శృంగింస్తవ పితా సోఽపి తథైవాస్తే యతవ్రతః ।
సోఽపి రాజా స్వనగరం ప్రస్థితో గజసాహ్వయమ్ ॥ 9
శృంగీ! ఎంతో నియమంగా మౌనవ్రతాన్ని పాటిస్తున్న మీ తండ్రి ఏమీ చలించకుండా ప్రశాంతంగా తన ధ్యానసమాధిలోనే ఉన్నాడు. పరిక్షిత్తు తన హస్తినాపురానికి వెళ్లిపోయాడు." (9)
సౌతిరువాచ
శ్రుత్వైనమృషిపుత్రస్తు శవం కంధే ప్రతిష్ఠితమ్ ।
కోపసంరక్తనయనః ప్రజ్జలన్నివ మన్యునా ॥ 10
ఉగ్రశ్రవుడు చెప్పాడు - తన తండ్రి మెడలో పరిక్షిత్తు సర్పశవాన్ని వేశాడని విన్న శృంగికి మిక్కిలి కోపంతో కళ్లు ఎఱ్ఱబడ్డాయి. (10)
ఆవిష్టః స హి కోపేన శశాప నృపతిం తదా ।
వార్యుపస్పృశ్య తేజస్వీ క్రోధవేగబలాత్కృతః ॥ 11
క్రోధావేశానికి పూర్తిగా లొంగిపోయిన తేజోవంతుడు అయిన ఆ శృంగి నీటిని చేతబట్టి కోపంతో పరీక్షిత్తును శపించాడు. (11)
శృంగ్యువాచ
యోఽసౌ వృద్ధస్య తాతస్య తదా కృచ్ఛ్రగతస్య హ ।
స్కంధే మృతం సమాస్రాక్షీత్ పన్నగం రాజకిల్బిషీ ॥ 12
తం పాపమతిసంక్రుద్ధః తక్షకః పన్నగేశ్వరః ।
ఆశీవిషస్తిగ్మతేజాః మద్వాక్యబలచోదితః ॥ 13
సప్తరాత్రాదితో నేతా యమస్య సదనం ప్రతి ।
ద్విజానామవమంతారం కురూణామయశస్కరమ్ ॥ 14
శృంగి ఇలా అన్నాడు. మౌనవ్రతధారియై, ప్రశాంతంగా తపస్సు చేసుకొంటున్న వృద్ధుడైన నా తండ్రి మెడలో మృతసర్పాన్ని వేసి విప్రులను అవమానపరచినవాడూ, కురువంశానికే మచ్చతెచ్చిన దురాత్ముడూ అయిన ఆ పరీక్షిత్తు నా శాపవచనంతో ప్రేరేపింపబడిన తక్షకునిచేత విషదగ్ధుడై ఏడురోజులలోగా యమపురికి వెళ్లుగాక! (12-14)
సౌతిరువాచ
ఇతి శప్త్వాతిసంక్రుద్ధః శృంగీ పితరమభ్యగాత్ ।
ఆసీనం గోవ్రజే తస్మిన్ వహంతం శవపన్నగమ్ ॥. 15
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. ఆ విధంగా శపించి శృంగి కోపంతో సర్పశవాన్ని మోస్తున్న తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. (15)
స తమాలక్ష్య పితరం శృంగీ స్కంధగతేన వై ।
శవేన భుజగేనాసీద్ భూయః క్రోధసమాకులః ॥ 16
మెడలో పాముతో ఉన్న తండ్రిని చూసి శృంగీ మరల కోపావిష్టుడయ్యాడు. (16)
దుఃఖాచ్చాశ్రూణి ముముచే పితరం చేదమబ్రవీత్ ।
శ్రుత్వేమాం ధర్షణాం తాత తవ తేన దురాత్మనా ॥ 17
రాజ్ఞా పరిక్షితా కోపాద్ ఆశపం తమహం నృపమ్ ।
యథార్హంతి స ఏవోగ్రం శాపం కురుకులాధమః ।
సప్తమేఽహని తం పాపం తక్షకః పన్నగోత్తమః ॥ 18
వైవస్వతస్య సదనం నేతా పరమదారుణమ్ ।
తమబ్రవీత్ పితా బ్రహ్మన్ తథా కోపసమన్వితమ్ ॥ 19
శృంగికి కళ్లవెంట నీళ్లు గిర్రున తిరిగాయి. తండ్రితో ఇలా అన్నాడు. "తండ్రీ! మీకా దురాత్ముడు చేసిన అవమానం చూశారా? ఆ పరీక్షిత్తును నేను శపించాను. కురుకులాధముడయిన ఆ రాజుకు నా శాపం తగినదే. ఏడవరోజున అతనిని తక్షకుడు యమపురికి పంపుతాడు". ఈ మాటలు విని తండ్రి కోపావిష్టుడైన కొడుకుతో ఇలా అన్నాడు. (17-19)
శమీక ఉవాచ
న మే ప్రియం కృతం తాత నైష ధర్మస్తపస్వినామ్ ।
నయం తస్య నరేంద్రస్య విషయే నివసామహే ॥ 20
న్యాయతో రక్షితాస్తేన తస్య శాపం న రోచయే ।
సర్వథా వర్తమానస్య రాజ్ఞొ హ్యస్మద్విధైః సదా ॥ 21
క్షంతవ్యం పుత్ర ధర్మోహి హతో హంతి న సంశయః ।
యది రాజా న సంరక్షేత్ పీడా నః పరమా భవేత్ ॥ 22
శమీకుడు కుమారునితో అన్నాడు. "కుమారా! నీవు పరిక్షిత్తునకు శాపం ఇవ్వడం నాకు ఇష్టం కాదు. ఇది తాపసులకు ధర్మంగాదు. మనమందరం ఆ మహారాజు ఏలుబడిలో ఉంటున్నాం. అతని ద్వారా మనకు రక్షణ కల్గుతున్నది. కాబట్టి అటువంటి ధర్మప్రభువునకు శాపం ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించదు. పుత్రా! ఇది క్షమింపదగినదే - ధర్మాన్ని చంపివేస్తే అది మనలను చంపుతుంది. ఆ రాజు మనలను రక్షించకపోతే మనకు ఎంతో కష్టం కలుగుతుంది. (20-22)
న శక్నుయామ చరితుం ధర్మం పుత్ర యథాసుఖమ్ ।
రక్ష్యమాణా వయం తాత రాజభిర్ధర్మదృష్టిభిః ॥ 23
చరామో విపులం ధర్మే తేషాం భాగోఽస్తి ధర్మతః ।
సర్వథా వర్తమానస్య రాజ్ఞః క్షంతవ్యమేవ హి ॥ 24
కుమారా! రాజు లేకపోతే మనం ధర్మాన్ని చక్కగా ఆచరింపలేం గదా! ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న రాజుద్వారా మనం సురక్షితంగా ఉండటమేకాకుండా ఇంకా ఎక్కువగా ధర్మాన్ని ఆచరిస్తాం. అందుచేత మనంచేసే పుణ్యకర్మలు అన్నింటిలోను రాజుకు కూడా భాగం ఉంది. ఆ కారణంగా పరీక్షిత్తు అపరాధం చేసినా అతనిని క్షమించాల్సిందే. (23,24)
పరిక్షిత్తు విశేషేణ యథాస్య ప్రపితామహః ।
రక్షత్యస్మాంస్తథా రాజా రక్షితవ్యాః ప్రజా విభో ॥ 25
పరిక్షిత్తు అతని ముత్తాతగారైన పాండురాజులాగా మనకు రక్షకుడుగా ఉన్నాడు. నాయనా! ఆ విధంగా ఆ ప్రభువు కూడా రక్షింపబడాలి కదా! (25)
తేనేహ క్షుధితేనాద్య శ్రాంతేన చ తపస్వినా ।
అజానతా కృతం మన్యే వ్రతమేతదిదం మమ ॥ 26
ఆ పరిక్షిత్తు ఆకలి బాధతో దాహంతో అలసిపోయి ఇక్కడికి వచ్చాడు. నేను మౌనవ్రతాన్ని పాటిస్తున్నానని అతనికి తెలియదుగదా! ఆ కారణంగానే నాపై మృతసర్పాన్ని వేసి ఉంటాడు. (26)
అరాజకే జనపదే దోషా జాయంతి వై సదా ।
ఉద్వృత్తం సతతం లోకం రాజా దండేన శాస్తి వై ॥ 27
దేశంలో రాజు లేకపోతే అనేక దోషాలు కలుగుతాయి. చోరభయంలాంటివి ఉండవచ్చు. అధర్మంగా ప్రవర్తిస్తూ హద్దుమీరి ప్రవర్తించే వాళ్లని రాజు దండిస్తాడు. (27)
దండాత్ ప్రతిభయం భూయః శాంతిరుత్పద్యతే తదా ।
నోద్విగ్నశ్చరతే ధర్మం నోద్విగ్నశ్చరతే క్రియామ్ ॥ 28
శిక్షవల్ల భయం కలుగుతుంది. భయంవల్ల తాత్కాలికమైన శాంతి కల్గుతుంది. చోరాదిభయంతో ఉన్నవాడు ధర్మాన్ని ఏమాత్రం ఆచరింపలేడు. ఉద్విగ్నంగా ఉన్న మానవుడు యజ్ఞకర్మలుగాని, శ్రాద్ధాది శాస్త్రీయ కర్మలు గాని చేయలేడు. (28)
రాజ్ఞా ప్రతిష్ఠితో ధర్మః ధర్మాత్ స్వర్గః ప్రతిష్ఠితః ।
రాజ్ఞో యజ్ఞక్రియాః సర్వాః యజ్ఞాద్ దేవాః ప్రతిష్ఠితాః ॥ 29
రాజు ధర్మాన్ని స్థాపిస్తే ధర్మంనుండి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. రాజరక్షణం వల్లే బ్రాహ్మణులు యజ్ఞాల్ని సురక్షితంగా చేస్తారు. యజ్ఞాల వలన దేవతలు సంతోషిస్తారు. (29)
దేవాద్ వృష్టిః ప్రవర్తేత వృష్టేరోషధయః స్మృతాః ।
ఓషధిభ్యో మనుష్యాణాం ధారయన్ సతతం హితమ్ ॥ 30
మనుష్యాణాం చ యో ధాతా రాజా రాజ్యకరః పునః ।
దశశ్రోత్రియసమో రాజా ఇత్యేవం మనురబ్రవీత్ ॥ 31
దేవతలు సంతోషిస్తే సకాలంలో పంటలకు అనుకూలంగా వర్షాలు కురుస్తాయి. వర్షాలవల్ల ఓషధులు లభిస్తాయి. ఓషధులు బాగా పెరిగితే మనుష్యులకు చాలా మేలు కలిగి సుఖంగా ఉంటారు. కాబట్టి రాజు ఈ సమస్తానికి మూలాధారం. వేదాధ్యయనపరులైన పదిమందితో ధర్మపరుడైన ఒక్క రాజు సమానం అని మనువు చెప్పాడు. (30,31)
తేనేహ క్షుధితేనాద్య శ్రాంతేన చ తపస్వినా ।
అజానతా కృతం మన్యే వ్రతమేతదిదం మమ ॥ 32
నియమబద్ధుడైన ఆ పరిక్షిత్తు అలసి ఆకలిదప్పులు సహించలేక నా మౌనవ్రతాన్ని గూర్చి తెలియక ఆ విధంగా ప్రవర్తించి ఉంటాడనుకొంటున్నాను. (32)
కస్మాదిదం త్వయా బాల్యాత్ సహసా దుష్కృతం కృతమ్ ।
న హ్యర్హతి నృపః శాప అస్మత్తః పుత్ర సర్వథా ॥ 33
నీవు చిన్నతనంతో, మూర్ఖంగా శాపం ఇచ్చి సాహసంతో పాపాన్ని చేశావు. కుమారా! రాజుకు ఇలా నా నుండి శాపం కల్గడం ఏ విధంగాను తగదు. (33)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి పరిక్షిత్ శాపే ఏకచత్వారింశోఽధ్యాయః ॥ 41 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమున పరిక్షిత్తుశాపము అను నలువది ఒకటవ అధ్యాయము. (41)