60. అరువదియవ అధ్యాయము

భారత కథానుబంధము.

సౌతిరువాచ
శ్రుత్వా తు సర్పసత్రాయ దీక్షితం జనమేజయమ్ ।
అభ్యాగచ్ఛదృషిర్విద్వాన్ కృష్ణద్వైపాయన స్తదా ॥ 1
సౌతి ఇలా చెప్పాడు - జనమేజయుడు సర్పయాగం చేయడానికి దీక్షితుడైనట్లు విని ఋషి, విద్వాంసుడు అయిన కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. (1)
జనయామాస యం కాలీ శక్తేః పుత్రాత్ పరాశరాత్ ।
కన్యైవ యమునాద్వీప పాండవానాం పితామహమ్ ॥ 2
శక్తికుమారుడైన పరాశరునివల్ల సత్యవతి కన్యావస్థలో యమునాద్వీపంలో పాండవుల పితామహుడైన కృష్ణద్వైపాయనుని కన్నది. (2)
జాతమాత్ర శ్చ యః సద్యః ఇష్ట్యా దేహమవీవృధత్ ।
వేదాంశ్చాధిజగే సాంగాన్ సేతిహాసాన్ మహాయశాః ॥ 3
యన్నైతి తపసా కశ్చిత్ న వేదాధ్యయనేన చ ।
న వ్రతైర్నోపవాసైశ్చ న ప్రశాంత్యా న మన్యునా ॥ 4
అతడు పుట్టిన వెంటనే తన ఇచ్ఛతో శరీరాన్ని పెంచాడు. మహాయశస్వి అయిన వ్యాసుడు సాంగాలైన వేదాలను, ఇతిహాసాలను అధ్యయనం చేశాడు. తపస్సుతోకాని, వేదాధ్యయనంతో కాని, వ్రతాలతో కాని, ఉపవాసాలతో కాని, ఇంద్రియ నిగ్రహంతో కాని, యజ్ఞంతో కాని, పొందలేనట్టి జ్ఞానం అతడు పొందాడు. (3,4)
వివ్యాసైకం చతుర్థా యః వేదం వేదవిదాం వరః ।
పరావరజ్ఞో బ్రహ్మర్షిః కవిః సత్యవ్రతః శుచిః ॥ 5
వేదవేత్తలలో శ్రేష్ఠుడైన అతడు ఏకరాశిగా ఉన్న వేదాన్ని నాలుగుగా విభజించాడు. అతడు పర - అపర బ్రహ్మలను తెలిసినవాడు. బ్రహ్మర్షి, కవి, సత్యవ్రతుడు, పవిత్రుడు. (5)
యః పాండుం ధృతరాష్ట్రం చ విదురం చాప్యజీజనత్ ।
శాంతనోః సంతతిం తన్వన్ పుణ్యకీర్తిర్మహాయశాః ॥ 6
అతడు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులకు జన్మనిచ్చి శంతనుని సంతతిని విస్తరింపచేసిన పవిత్రమయిన కీర్తి, గొప్ప యశస్సు కలవాడు. (6)
జనమేజయస్య రాజర్షేః స మహాత్మా సదస్తదా ।
వివేశ సహితః శిష్యైః వేదవేదాంగపారగైః ॥ 7
వేదవేదాంగ పారంగతులైన శిష్యులతో ఆ మహాత్ముడు రాజర్షి అయిన జనమేజయుని సభలోకి ప్రవేశించాడు. (7)
తత్ర రాజానమాసీనం దదర్శ జనమేజయమ్ ।
వృతం సదస్యైర్బహుభిః దేవైదిర పురందరమ్ ॥ 8
అక్కడ దేవతలతో కొలువుదీరిన ఇంద్రునిలా పెక్కుమంది సభ్యులతో కూర్చున్న జనమేజయుని చూశాడు. (8)
తథా మూర్ధాభిషిక్తైశ్చ నానాజనపదేశ్వరైః ।
ఋత్విగ్భిర్బ్రహ్మకల్పైశ్చ కుశలైర్యజ్ఞసంస్తరే ॥ 9
అతడు ముర్ధాభిషిక్తులైన అనేక జనపదాల రాజులతో యజ్ఞానుష్ఠానంలో నేర్పరులైన ఋత్విజులతో ఆ యజ్ఞవాటికలో పరివేష్టించి ఉన్నాడు. (9)
జనమేజయస్తు రాజర్షిః దృష్ట్వా తమృషిమాగతమ్ ।
సగణీఽభ్యుద్యయౌ తూర్ణం ప్రీత్యా భరతసత్తమః ॥ 10
భరతవంశశ్రేష్ఠుడూ, రాజర్షీ అయిన జనమేజయుడు వెంటనే ఆ ఋషిని ప్రీతితో తన పరివారంతో పాటు ఎదురేగి ఆహ్వానించాడు. (10)
కాంచనం విష్టరం తస్మై సదస్యానుమతః ప్రభుః ।
ఆసనం కల్పయామాస యథా శక్రో బృహస్పతేః ॥ 11
ఇంద్రుడు బృహస్పతికి ఆసనాన్ని కల్పించినట్లుగా జనమేజయుడు సభ్యుల అనుమతితో వ్యాసమహర్షికి బంగారు ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. (11)
తత్రోపవిష్టం వరదం దేవర్షి గణపూజితమ్ ।
పూజయామాస రాజేంద్రః శాస్త్రదృష్టేన కర్మణా ॥ 12
దేవ ఋషి గణాలచే పూజింపబడి ఆసనం మీద కూర్చున్న వరదుడైన వ్యాసమహర్షిని ఆ రాజు శాస్త్రీయ విధానంతో పూజించాడు. (12)
పాద్యమాచమనీయం చ అర్ఘ్యం గాం చ విధానతః ।
పితామహాయ కృష్ణాయ తదర్హాయ న్యవేదయత్ ॥ 13
ఉత్తమమైన ఆతిథ్యానికి అర్హుడూ తన పితామహుడూ అయిన ఆ వ్యాసమహర్షికి మహారాజు అర్ఘ్య పాద్య ఆచమనీయాలను గోవును ఇచ్చి గౌరవించాడు. (13)
ప్రతిగృహ్య తు తాం పూజాం పాండవాజ్జనమేజయాత్ ।
గాం చైవ సమనుజ్ఞాప్య వ్యాసః ప్రీతోఽభవత్ తదా ॥ 14
పాండవ వంశీయుడైన జనమేజయుని నుండి ఆతిథ్యాన్ని పొందిన వ్యాసుడు గోవులపట్ల ఆదరాన్ని చూపి, సంతోషించి ప్రసన్నుడయ్యాడు. (14)
తథా చ పూజయిత్వా తం ప్రణయాత్ ప్రపితామహమ్ ।
ఉపోపవిశ్య ప్రీతాత్మా పర్యపృచ్ఛదనామయమ్ ॥ 15
జనమేజయుడు ప్రేమతో తన ప్రపితామహుని పూజించి సంతుష్టుడై అతని చెంత కూర్చుండి కుశల సమాచారాన్ని అడిగాడు. (15)
భగవానపి తం దృష్ట్వా కుశలం ప్రతివేద్య చ ।
సదస్యైః పూజితః సర్వైః సదస్యాన్ ప్రత్యపూజయత్ ॥ 16
భగవత్స్వరూపుడైన వ్యాసుడు కూడా అతనిని చూసి కుశలాన్ని తెలిసికొన్నాడు. ఆ తరువాత అక్కడున్న సభ్యులందరూ వ్యాసుని పూజించారు. వ్యాసుడు కూడా వాళ్ళను తిరిగి గౌరవించాడు. (16)
తతస్తు సహితైః సర్వైః సదస్యైర్జనమేజయః ।
ఇదం పశ్చాద్ ద్విజశ్రేష్ఠం పర్యపృచ్ఛత్ కృతాంజలిః ॥ 17
తరువాత సభ్యులందరితో పాటు జనమేజయుడు చేతులు జోడించి ద్విజశ్రేష్ఠుడైన వ్యాసమహర్షిని ఈ విధంగా అడిగాడు. (17)
జనమేజయ ఉవాచ
కురూణాం పాండవానాం చ భవాన్ ప్రత్యక్షదర్శివాన్ ।
తేషాం చరితమిచ్ఛామి కథ్యమానం త్వయా ద్విజ ॥ 18
జనమేజయుడిలా అన్నాడు - కౌరవులను పాండవులను ప్రత్యక్షంగా చూసిన వాడవు నీవు. కావున వారి చరిత్రను నీవు చెప్పగా వినాలని ఉంది. (18)
కథం సమభవద్ భేదః తేషామక్లిష్టకర్మణామ్ ।
తచ్చ యుద్ధం కథం వృత్తం భూతాంతకరణం మహత్ ॥ 19
సత్కర్మలనాచరించే వారిమధ్య భేదభావం ఎందుకు కలిగింది? ప్రాణుల వినాశనానికి కారణమైన అంతటి మహాయుద్ధం ఎలా జరిగింది? (19)
పితామహానాం సర్వేషాం దైవేనానిష్టచేతసామ్ ।
కార్త్స్న్యే నైతన్మమాచక్ష్వ యథావృత్తం ద్విజోత్తమ ॥ 20
ద్విజోత్తమా! మన్సులో ఇష్టం లేకున్నా నా పితామహులంతా దైవప్రేరణచే ఇటువంటి పని చేసి ఉంటారు. దానినంతా ఉన్నదున్నట్లుగా నాకు వివరించి చెప్పు. (20)
సౌతిరువాచ
తస్య తద్ వచనం శ్రుత్వా కృష్ణద్వైపాయనస్తదా ।
శశాస శిష్యమాసీనం వైశంపాయనమంతికే ॥ 21
సౌతి ఇలా చెప్పాడు - అతని మాట విని కృష్ణద్వైపాయనుడు తన చెంతనే కూర్చున్న శిష్యుడైన వైశంపాయనుని ఆజ్ఞాపించాడు. (21)
వ్యాస ఉవాచ
కురూణాం పాండవానాం చ యథా భేదోఽభవత్ పురా ।
తదస్మై సర్వమాచక్ష్వ యన్మత్తః శ్రుతవానసి ॥ 22
వ్యాసుడిలా చెప్పాడు - మునుపు కౌరవ పాండవులకు భేదం ఎలా ఏర్పడిందో అదంతా నా దగ్గర నీవు విన్న విధంగా వీనికి చెప్పు. (22)
గురోర్వచన మాజ్ఞాయ స తు విప్రర్షభస్తదా ।
ఆచచక్షే తతః సర్వమ్ ఇతిహాసం పురాతనమ్ ॥ 23
రాజ్ఞే తస్మై సదస్యేభ్యః పార్థివేభ్యశ్చ సర్వశః ।
భేదం సర్వవినాశం చ కురుపాండవయోస్తదా॥ 24
అటుపై విప్రశ్రేష్ఠుడైన ఆ వైశంపాయనుడు గురువు మాటను పాటించి జనమేజయునికీ, తక్కిన సభ్యులందరికీ కురుపాండవుల కలహమూ, వారి సర్వ వినాశనమూ మొదలయిన ప్రాచీనేతిహాసాన్నంతా తెలియచెప్పాడు. (23,24)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి అంశావతార పర్వణి కథానుబంధే షష్టితమోఽధ్యాయః ॥ 60 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అంశావతార పర్వమను ఉపపర్వమున కథానుబంధము అను అరువదియవ అధ్యాయము. (60)