61. అరువది యొకటవ అధ్యాయము
కౌరవపాండవుల మధ్య భేదము - యుద్ధవృత్తాంతము.
వైశంపాయన ఉవాచ
గురవే ప్రాఙ్నమస్కృత్య మనోబుద్ధిసమాధిభిః ।
సంపూజ్య చ ద్విజాన్ సర్వాన్ తథాన్యాన్ విదుషో జనాన్ ॥ 1
మహర్షేర్విశ్రుతస్యేహ సర్వలోకేషు ధీమతః ।
ప్రవక్ష్యామి మతం కృత్స్నం వ్యాసస్యాస్య మహాత్మనః ॥ 2
వైశంపాయనుడిలా చెప్పాడు - మనస్సు బుద్ధి ఏకాగ్రతలతో ముందుగా మా గురువుకు నమస్కరించి, ఇక్కడున్న బ్రాహ్మణులను విద్వాంసులను గౌరవించి, సమస్తలోకాల్లోను ప్రసిద్ధి పొందిన ధీమంతుడూ, మహాత్ముడూ అయిన వ్యాసమహర్షి యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా వివరిస్తాను. (1,2)
శ్రోతుం పాత్రం చ రాజంస్త్వం ప్రాప్యేమాం భారతీం కథామ్ ।
గురోర్వక్త్రపరిస్పందః మనః ప్రోత్సాహతీవ మే ॥ 3
రాజా! నీవు ఈ మహాభారతకథ వినడానికి యోగ్యుడవు. గురుముఖతః వెలువడిన ఈ భారతకథ నా మనస్సును ఉత్సాహపరుస్తున్నట్లు ఉంది. (3)
శృణు రాజన్ యథా భేదః కురుపాండవయోరభూత్ ।
రాజ్యార్థే ద్యూతసంభూతః వనవాసస్తథైవ చ ॥ 4
యథా చ యుద్ధమభవత్ పృథివీక్షయకారకమ్ ।
తత్ తేఽహం కథయిష్యామి పృచ్ఛతే భరతర్షభ ॥ 5
రాజా! కురుపాండవుల మధ్య భేదమూ, రాజ్యంకోసం జూదమాడటమూ, పృథివీ వినాశనానికి కారణమైన యుద్ధమూ అదంతా నీకు చెప్తాను. విను. (4,5)
మృతే పితరి తే వీరాః వనాదేత్య స్వమందిరమ్ ।
న చిరాదేవ విద్వాంసః వేదే ధనుషి చాభవన్ ॥ 6
పాండురాజు మరణించాక పాండవులు అడవి నుండి ఇంటికి వచ్చారు. వారు అచిరకాలంలోనే ధనుర్వేదంలో పండితులయ్యారు. (6)
తాంస్తథా సత్త్వవీర్యౌజః సంపన్నాన్ పౌరసమ్మతాన్ ।
నామృష్యన్ కురవో దృష్ట్వా పాండవాన్ శ్రీయశోభృతః ॥ 7
ఆ విధంగా సత్త్వ పరాక్రమ తేజ స్సంపన్నులైన, పౌరులకు ప్రీతిపాత్రులైన పాండవులు క్రమంగా ధన, కీర్తి, సంపదలతో వృద్ధి చెందారు. కౌరవులు వారి అభివృద్ధి చూసి ఓర్వలేకపోయారు. (7)
తతో దుర్యోధనః క్రూరః కర్ణశ్చ సహసౌబలః ।
తేషాం నిగ్రహనిర్వాసాన్ వివిధాంస్తే సమారభన్ ॥ 8
క్రూరుడైన దుర్యోధనుడు, కర్ణుడు, శకుని కలిసి పాండవుల్ని నిగ్రహించడానికీ, దేశం నుండి బయటకు పంపడానికీ అనేక ప్రయత్నాలు ప్రారంభించారు. (8)
తతో దుర్యోధనః శూరః కలింగస్య మతే స్థితః ।
పాండవాన్ వివిధోపాయైః రాజ్యహేతోరపీడయత్ ॥ 9
అనంతరం శకుని అభిప్రాయం ప్రకారం నడిచే దుర్యోధనుడు రాజ్యంకోసం పాండవులను రకరకాల ఉపాయాలతో బాధించాడు. (9)
దదావథ విషం పాపః భీమాయ ధృతరాష్ట్రజః ।
జరయామాస తద్ వీరః సహన్నేన వృకోదరః ॥ 10
పాపాత్ముడైన దుర్యోధనుడు భీమునికి విషాన్నిచ్చాడు. కాని వీరుడైన భీముడు అన్నంతో పాటుగా ఆ విషాన్ని కూడ (అరిగించుకొన్నాడు) జీర్ణించుకొన్నాడు. (10)
ప్రమాణకోట్యాం సంసుప్తం పునర్బద్ధ్వా వృకోదరమ్ ।
తోయేషు భీమం గంగాయాః ప్రక్షిప్య పురమావ్రజత్ ॥ 11
గంగా తీరంలో ప్రమాణకోటి ఘట్టంలో నిద్రిస్తున్న భీముని బంధించి గంగా ప్రవాహంలోకి త్రోసివేసి దుర్యోధనుడు ఏమీ తెలియనివాడివలె నగరానికి వచ్చాడు. (11)
యదా విబుద్ధః కౌంతేయః తదా సంఛిద్య బంధనమ్ ।
ఉదతిష్ఠన్ మహాబాహుః భీమసేనో గతవ్యథః ॥ 12
భీముడు నిద్ర నుండి లేచి తన బంధాల్ని తెంచుకొని ఎటువంటి బాధాలేకుండా గంగలో నుండి పైకి లేచి వచ్చాడు. (12)
ఆశీవిషైః కృష్ణసర్చైః సుప్తం చైనమదంశయత్ ।
సర్వేష్వేవాంగదేశేషు న మమార చ శత్రుహా ॥ 13
శత్రుసంహారకుడైన భీముడు నిద్రిస్తుండగా దుర్యోధనుడు అతని శరీరంలోని ప్రతి అవయవం మీద కాలసర్పాల చేత కరిపించాడు. కాని భీముడు మరణించలేదు. (13)
తేషాం తు విప్రకారేషు తేషు తేషు మహామతిః ।
మోక్షణే ప్రతికారే చ విదురోఽవహితోఽభవత్ ॥ 14
కౌరవులు పాండవులకు అపకారం చేస్తున్న ప్రతి సమయంలోను మహాబుద్ధిమంతుడైన విదురుడు వారిని విడిపించడంలోను, ప్రతీకారం చేయడంలోను అప్రమత్తంగా ఉండేవాడు. (14)
స్వర్గస్థో జీవలోకస్య యథా శక్రః సుఖావహః ।
పాండవానాం తథా నిత్యం విదురోఽపి సుఖావహః ॥ 15
స్వర్గంలో ఉన్న ఇంద్రుడు జీవలోకానికి ఏవిధంగా సుఖాన్ని కల్గిస్తాడో అదేవిధంగా విదురుడు కూడా నిత్యమూ పాండవులకు సుఖాన్ని కలిగించేవాడు. (15)
యదా తు వివిధోపాయైః సంవృతైర్వివృతైరపి ।
నాశకద్ వినిహంతుం తాన్ దైవభావ్యర్థరక్షితాన్ ॥ 16
తతః సమ్మంత్య్ర సచివైః వృషదుఃశాసనాదిభిః ।
ధృతరాష్ట్రమనుజ్ఞాప్య జాతుషం గృహమాదిశత్ ॥ 17
రహస్యంగాను, బాహ్యంగాను కూడ అనేకోపాయాలతో కౌరవులు పాండవులను చంపలేకపోయారు. భావికాలంలో జరగబోయే సంఘటనలకోసమే దైవం వారిని రక్షించింది. దుర్యోధనుడు కర్ణదుఃశాసనులతో సమాలోచన చేసి ధృతరాష్ట్రుని అనుమతితో వారణావతంలో లక్కయిల్లు నిర్మించడానికి ఆదేశించాడు. (16,17)
సుతప్రియైషీ తాన్ రాజా పాండవానంబికాసుతః ।
తతో వివాసయామాస రాజ్యభోగబుభుక్షయా ॥ 18
పుత్రుల ప్రియం కోరే ధృతరాష్ట్రుడు రాజ్యభోగాలపై కోరికతో పాండవులను రాజ్యం నుండి బయటకు పంపాడు. (18)
తే ప్రాతిష్ఠంత సహితాః నగరాన్నాగసాహ్వయాత్ ।
ప్రస్థానే చాభవన్మంత్రీ క్షత్తా తేషాం మహాత్మనామ్ ॥ 19
తేన ముక్తా జతుగృహాత్ నిశీథే ప్రాద్రవన్ వనమ్ ।
వారు తమ తల్లితోపాటు హస్తినాపురం నుండి బయలుదేరారు. ఆ సమయంలో విదురుడు వారికి మంచి సలహా ఇచ్చాడు. ఆ కారణంగా అర్థరాత్రి సమయంలో వారు లక్కయింటిని వదిలి అడవిలోకి వెళ్ళిపోయారు. (19 1/2)
తతః సంప్రాప్య కౌంతేయాః నగరం వారణావతమ్ ॥ 20
న్యపసంత మహాత్మానః మాత్రా సహ పరంతపాః ।
ధృతరాష్ట్రేణ చాజ్ఞప్తాః ఉషితా జాతుషే గృహే ॥ 21
పురోచనాద్ రక్షమాణాః సంవత్సరమతంద్రితాః ।
సురుంగాం కారయిత్వా తు విదురేణ ప్రచోదితాః ॥ 22
ఆదీప్య జాతుషం వేశ్మ దగ్ధ్వా చైవ పురోచనమ్ ।
ప్రాద్రవన్ భయసంవిగ్నా మాత్రా సహ పరంతపాః ॥ 23
పాండవులు తల్లితో పాటు వారణావత నగరానికి చేరుకొని అక్కడ నివసించసాగారు. ధృతరాష్ట్రుడు ఆదేశించినట్లుగానే వారు లక్కయింటిలో ఒక సంవత్సరకాలం ఉన్నారు, పురోచనుడిచే రక్షింపబడుతూ, విదురునిచే ప్రేరేపింపబడి సురంగమార్గాన్ని త్రవ్వుకొని, లాక్షాగృహాన్ని తగులబెట్టి అక్కడ నుండి తల్లితో బాటుగా బయటపడ్డారు. (20-23)
దదృశుర్దారుణం రక్షః హిడింబం వననిర్ఘరే ।
హత్వా చ తుం రాక్షసేంద్రం భీతాః సమవబోధనాత్ ॥ 24
నిశి సంప్రాద్రవన్ పార్థాః ధార్తరాష్ట్రభయార్దితాః ।
ప్రాప్తా హిడింబా భీమేన యత్ర జాతో ఘటోత్కచః ॥ 25
అడవిలో రాత్రి సమయంలో ఒక సెలయేటి పక్కన క్రూరుడైన హిడింబుడనే రాక్షసుని చూసి వానిని సంహరించారు. హిడింబుని సోదరి హిడింబ భీమునికి భార్యగా లభించింది. వారికి ఘటోత్కచుడనే కొడుకు పుట్టాడు. ధార్త రాష్ట్రుల వల్ల భయంతో వారు అక్కడ నుండి దూరంగా వెళ్లారు (24,25)
ఏకచక్రాం తతో గత్వా పాండవాః సంశితవ్రతాః ।
వేదాధ్యయనసంపన్నాః తేఽభవన్ బ్రహ్మచారిణః ॥ 26
అటుపై పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళి కఠిన నియమాన్ని పాటిస్తూ, వేదాధ్యయన సంపన్నులుగా బ్రహ్మచారులుగా జీవించసాగారు. (26)
తే తత్ర నియతాః కాలం కంచిదూషుర్నరర్షభాః ।
మాత్రా సహైకచక్రాయాం బ్రాహ్మణస్య నివేశనే ॥ 27
వారు తల్లితో పాటుగా ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో కొంతకాలం నివసించారు. (27)
తత్రాససాద క్షుధితం పురుషాదం వృకోదరః ।
భీమసేనో మహాబాహుః బకం నామ మహాబలమ్ ॥ 28
అక్కడ మనుష్యుల్ని తినే మహాబలవంతుడు అయిన బకుడనే రాక్షసుడున్నాడు. మహాబాహువైన భీమసేనుడు ఆకలితో ఉన్న ఆ బకుని దగ్గరికి వెళ్లాడు. (28)
తం చాపి పురుషవ్యాఘ్రః బాహువీర్యేణ పాండవః ।
నిహత్య తరసా వీరః నాగరాన్ పర్యసాంత్వయత్ ॥ 29
పురుషశ్రేష్ఠుడైన భీముడు తన బాహుబలంతో ఆ బకుని వెంటనే చంపి నగరవాసులకు ఊరట కలిగించాడు. (29)
తతస్తే శుశ్రువుః కృష్ణాం పంచాలేషు స్వయంవరామ్ ।
శ్రుత్వా చైవాభ్యగచ్ఛంత గత్వా చైవాలభంత తామ్ ॥ 30
తే తత్ర ద్రౌపదీం లబ్ధ్వా పరిసంవత్సరోషితాః ।
విదితా హాస్తినపురం ప్రత్యాజగ్మురరిందమాః ॥ 31
అనంతరం వారు పాంచాలదేశంలో ద్రౌపదీ స్వయంవరం జరుగుతున్నట్లు విన్నారు. అక్కడకు వెళ్లి పాంచాల రాజకుమారి ద్రౌపదిని భార్యగా పొందారు. అక్కడ ఒక సంవత్సరకాలం నివసించి, శత్రువులను నిగ్రహింప గల పాండవులు హస్తినాపురం చేరుకొన్నారు. (30,31)
తే ఉక్తా ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ ।
భ్రాతృభిర్విగ్రహస్తాత కథం వో న భవేదితి ॥ 32
అస్మాభిః ఖాండవప్రస్థే యుష్మద్వాసోఽనుచింతితః ।
తస్మాజ్జనపదోపేతం సవిభక్తమహాపథమ్ ॥ 33
వాసాయ ఖాండవప్రస్థం వ్రజధ్వం గతమత్సరాః ।
తయోస్తే వచనాజ్జగ్ముః సహ సర్వైః సుహృజ్జనైః ॥ 34
నగరం ఖాండవప్రస్థం రత్నాన్యాదాయ సర్వశః ।
తత్ర తే న్యవసన్ పార్థాః సంవత్సరగణాన్ బహూన్ ॥ 35
వ్రజేశస్త్రప్రతాపేన కుర్వంతోఽన్యాన్ మహీభృతః ।
ఏవం ధర్మప్రధానాస్తే సత్యవ్రతపరాయణాః ॥ 36
అప్రమత్తోత్థితాః క్షాంతాః ప్రతపంతోఽహితాన్ బహూన్ ।
అపుడు ధృతరాష్ట్ర మహారాజు, భీష్ముడూ వారితో ఇలా చెప్పారు - 'నాయనా! మీకు మీ సోదరులతో విరోధం రాకూడదని మీరు ఖాండవప్రస్థంలో ఉండడం మంచిదని మేము భావించాం. అందువల్ల మీరు ఎటువంటి మత్సరం లేకుండా ఖాండవప్రస్థానికి వెళ్లి ఉండండి.' వారి మాటల ప్రకారం పాండవులు ఖాండవప్రస్థానికి తమ స్నేహితులతో బాటు రత్నరాసులతో బాటుగా వెళ్లారు. అక్కడ వారు చాలా సంవత్సరాలు నివసించారు. తమ శస్త్రబలంతో చాలామంది రాజులను తమ వశం చేసికొన్నారు. ఇలా పాండవులు ధర్మప్రధానులై, సత్యపరాయణులై, అప్రమత్తులై, శత్రువులను అదుపు చేస్తూ సహనంతో అక్కడ జీవించారు. (32-36 1/2)
అజయత్ భీమసేనస్తు దిశం ప్రాచీం మహాయశాః ॥ 37
ఉదీచీమర్జునో వీరః ప్రతీచీం నకులస్తథా ।
దక్షిణాం సహదేవస్తు విజిగ్యే పరవీరహా ॥ 38
మహాయశస్వి భీముడు తూర్పుదిక్కును, మహావీరుడు అర్జునుడు ఉత్తరదిక్కును, నకులుడు పడమటిదిక్కును, సహదేవుడు దక్షిణదిక్కును జయించారు. (37,38)
ఏవం చక్రురిమాం సర్వే వశే కృత్స్నాం వసుంధరామ్ ।
పంచభిః సూర్యసంకాశైః సూర్యేణ చ విరాజితా ॥ 39
షట్ సూర్యేవాభవత్ పృథ్వీ పాండవైః సత్యవిక్రమైః ।
తతో నిమిత్తే కస్మింశ్చిద్ ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 40
వనం ప్రస్థాపయామాస తేజస్వీ సత్యవిక్రమః ।
ప్రాణోభ్యోఽపి ప్రియతరం భ్రాతరం సవ్యసాచినమ్ ॥ 44
అర్జునం పురుషవ్యాఘ్రం స్థిరాత్మానం గుణైర్యుతమ్ ।
(ధైర్యాత్ సత్యాచ్చ ధర్మాచ్చ విజయాచ్చాధికప్రియః ।
అర్జునో భ్రాతరం జ్యేష్ఠం నాత్యవర్తత జాతుచిత్ ॥)
స వై సంవత్సరం పూర్ణం మాసం చైకం వనే వసన్ ॥ 42
ఈ విధంగా పాండవులు సమస్తభూమండలాన్ని తమ అధీనంలోకి తెచ్చుకొన్నారు. సూర్యునిలా ప్రకాశించే అయిదుగురు పాండవులతో బాటు సూర్యుడు కలిస్తే ఈ భూమండలం ఆరుగురు సూర్యులు కలదిగా భాసించింది. అనంతరం ఒకానొకనిమిత్తంగా తేజోవంతుడూ, సత్యవిక్రముడూ అయిన ధర్మరాజు తనకు మిక్కిలి ప్రీతిపాత్రుడు, సవ్యసాచి, పురుషశ్రేష్ఠుడు, స్థిరాత్ముడు, గుణసంపన్నుడు అయిన అర్జునుని వనానికి పంపాడు. (ధైర్యం, సత్యం, ధర్మం, విజయం - వీటి వల్ల అర్జునుడంటే ధర్మరాజుకి చాల ఇష్టం. అర్జునుడు కూడ తన అన్నమాటను ఎప్పుడూ అతిక్రమించలేదు) అతడు ఒక సంవత్సరం పై ఒక మాసం రోజులు వనంలో నివసించాడు. (39-42)
(తీర్థయాత్రాం చ కృతవాన్ నాగకన్యామవాప్య చ ।
పాండ్యస్య తనయాం లబ్థ్వా తత్ర తాభ్యాం సహోషితః ॥)
తతోఽగచ్ఛ ద్ధృషీకేశం ద్వారవత్యాం కదాచన ।
లబ్థవాంస్తత్ర బీభత్సుః భార్యాం రాజీవలోచనామ్ ॥ 43
అనుజాం వాసుదేవస్య సుభద్రాం భద్రభాషిణీమ్ ।
సా శచీవ మహేంద్రేణ శ్రీః కృష్ణేనేవ సంగతా ॥ 44
సుభద్రా యుయుజే ప్రీత్యా పాండవేనార్జునేన హ ।
(అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు. నాగకన్య ఉలూపికను పొందాడు. పాండ్యదేశపురాజైన చిత్రవాహనుని కూతురు చిత్రాంగదను కూడా పొందాడు. కొంతకాలం వారితో కలిసి అక్కడ నివసించాడు) అక్కడ నుండి ద్వారకకు వెళ్లి అక్కడ శ్రీకృష్ణుని కలిశాడు. అతని చెల్లెలైన సుభద్రను భార్యగా పొందాడు. ఇంద్రునితో శచీదేవిలా, శ్రీకృష్ణునితో లక్ష్మీదేవిలా, అర్జునునితో సుభద్ర మిక్కిలి ప్రేమతో జీవించింది. (43,44 1/2)
అతర్పయచ్చ కౌంతేయః ఖాండవే హవ్యవాహనమ్ ॥ 45
బీభత్సుర్వాసుదేవేన సహితో నృపసత్తమ ।
నాతిభారో హి పార్థస్య కేశవేన సహాభవత్ ॥ 46
వ్యవసాయసహాయస్య విష్ణోః శత్రువధేష్వివ ।
నృపశ్రేష్ఠా! అనంతరం అర్జునుడు ఖాండవప్రస్థంలో ఉండి శ్రీకృష్ణునితో కలిసి అగ్నిహోత్రుని తృప్తిపరిచాడు. దృఢప్రయత్నం తోడుగా ఉన్న విష్ణువుకు దేవతల శత్రువులను చంపడంలో శ్రమలేనట్లుగా శ్రీకృష్ణుడు తోడుండటం చేత అర్జునునికి ఆ పని మిక్కిలి భారమనిపించలేదు. (45,46 1/2)
పార్థాయాగ్నిర్దదౌ చాపి గాండీవం ధనురుత్తమమ్ ॥ 47
ఇషుధీ చాక్షయైర్బాణైః రథం చ కపిలక్షణమ్ ।
మోక్షయామాస బీభత్సుః మయం యత్ర మహాసురమ్ ॥ 48
అగ్నిదేవుడు సంతోషించి అర్జునుడికి ఉత్తమమైన గాండీవమనే ధనస్సునూ, అక్షయబాణాలు గల అమ్ములపొదినీ, కపిధ్వజంగల రథాన్నీ ఇచ్చాడు. ఆ సమయంలో ఖాండవవనంలో దహించుకుపోతున్న మయుడనే రాక్షసుని అర్జునుడు రక్షించాడు. (47,48)
స చకార సభాం దివ్యాం సర్వరత్నసమాచితామ్ ।
తస్యాం దుర్యోధనో మందః లోభం చక్రే సుదుర్మతిః ॥ 49
దానితో సంతోషించిన మయుడు అర్జునుని కొరకు దివ్యమైన రత్నాలు పొదిగిన సభాభవనాన్ని నిర్మించి ఇచ్చాడు. మూర్ఖుడు, దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు మనస్సులో దానిపై ఆశపడ్డాడు. (49)
తతోఽక్షై ర్వంచయిత్వా చ సౌబలేన యుధిష్ఠిరమ్ ।
వనం ప్రస్థాపయామాస సప్తవర్షాణి పంచ చ ॥ 50
అజ్ఞాతమేకం రాష్ట్రే చ తతో వర్షం త్రయోదశమ్ ।
తత శ్చతుర్దశే వర్షే యాచమానాః స్వకం వసు ॥ 51
ఆ తర్వాత శకుని సాయంతో పాచికలతో ధర్మరాజును మోసగించి, పండ్రెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మొత్తం పదమూడు సంవత్సరాలు బయటకుపంపాడు. అనంతరం పద్నాలుగో సంవత్సరంలో పాండవులు తమ రాజ్యసంపద నిమ్మని అడిగారు. (50,51)
నాలభంత మహారాజ తతో యుద్ధమవర్తత ।
తతస్తే క్షత్రముత్సాద్య హత్వా దుర్యోధనం నృపమ్ ॥ 52
రాజ్యం విహతభూయిష్ఠం ప్రత్యపద్యంత పాండవాః ।
ఏవమేతత్ పురా వృత్తం తేషామక్లిష్టకర్మణామ్ ।
భేదో రాజ్యవినాశాయ జయశ్చ జయతాం వర ॥ 53
కాని దుర్యోధనుడు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వలేదు. వారిరువురి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాండవులు శత్రుపక్షంలోని రాజులను, దుర్యోధనునీ చంపి, తమ నష్టప్రాయమైన రాజ్యాన్ని తిరిగి పొందారు. ఈ విధంగా అనాయాసంగా స్వధర్మాన్ని నిర్వహింపగల పాండవులకూ, కౌరవులకూ మధ్య భేదం వల్ల రాజ్యవినాశం జరిగి పాండవులు విజయాన్ని పొందారు. (52,53)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి అంశావతార పర్వణి భారతసూత్రం నామ ఏకషష్టితమోఽధ్యాయః ॥ 61 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అంశావతారపర్వమను ఉపపర్వమున భారత సూత్రమను అరువది ఒకటవ అధ్యాయము. (61)
(దాక్షిణాత్య అధికపాఠము 2 శ్లోకములు కలుపుకొని మొత్తం 55 శ్లోకాలు)