62. అరువది రెండవ అధ్యాయము
మహాభారత మహత్త్వము.
జనమేజయ ఉవాచ
కథితం వై సమాసేన త్వయా సర్వం ద్విజోత్తమ ।
మహాభారతమాఖ్యానం కురూణాం చరితం మహత్ ॥ 1
జనమేజయుడిలా అన్నాడు - బ్రాహ్మణోత్తమా! కురువంశీయుల గొప్పచరితం మహాభారతాఖ్యానం సంగ్రహంగా చెప్పావు. (1)
కథాం త్వనఘ చిత్రార్థాం కథయస్వ తపోధన ।
విస్తరశ్రవణే జాతం కౌతూహలమతీవ మే ॥ 2
తపోధనా! మిక్కిలి విచిత్రవిషయాలతో ఉన్న వారి కథను విస్తరంగా వినాలని నాకు కుతూహలంగా ఉంది. దయతో చెప్పండి. (2)
స భవాన్ విస్తరేణేమాం పునరాఖ్యాతుమర్హతి ।
న హి తృప్యామి పూర్వేషాం శృణ్వానశ్చరితం మహత్ ॥ 3
వారి కథను విస్తరంగా చెప్పడానికి నీవే తగినవాడవు. మా పూర్వికుల ఘనచరిత్రను వింటూంటే ఇంకా నాకు తృప్తి కలగటం లేదు. (3)
న తత్ కారణమల్పం వై ధర్మజ్ఞా యత్ర పాండవాః ।
అవధ్యాన్ సర్వశో జఘ్నః ప్రశస్యంతే చ మానవైః ॥ 4
ధర్మజ్ఞులైన పాండవులు చంపలేని వారినందరినీ చంపారు. దానిని ప్రజలంతా ప్రశంసించారు. అంటే దానికి ఏదో చిన్న కారణం కాదు, పెద్ద కారణమే ఉండి ఉంటుంది. (4)
కిమర్థం తే నరవ్యాఘ్రాః శక్తాః సంతొ హ్యనాగసః ।
ప్రయుజ్యమానాన్ సంక్లేశాన్ క్షాంతవంతో దురాత్మనామ్ ॥ 5
పురుషశ్రేష్ఠులూ, శక్తిమంతులూ, నిరపరాధులూ ఐన పాండవులు దుర్మార్గులైన కౌరవులు పెట్టే కష్టాలను ఎందుకు సహించారు? (5)
కథం నాగాయుతప్రాణః బాహుశాలీ వృకోదరః ।
పరిక్లిశ్యన్నపి క్రోధం ధృతవాన్ వై ద్విజోత్తమ ॥ 6
ద్విజోత్తమా! పదివేల ఏనుగులబలమూ, బాహుబలమూ కల భీముడు కష్టాలను భరిస్తూ కోపాన్ని ఎలా నిగ్రహించాడు? (6)
కథం సా ద్రౌపదీ కృష్ణా క్లిశ్యమానా దురాత్మభిః ।
శక్తా సతీ ధారరాష్ట్రాన్ నాదహత్ క్రోధచక్షుషా ॥ 7
దుర్మార్గులైన కౌరవుల వల్ల బాధలు పడుతూ ద్రుపదపుత్రిక కృష్ణ తన క్రోధనేత్రాలతో ధార్తరాష్ట్రులను దహింపగలిగినా ఎందుకు దహించలేదు? (7)
కథం వ్యసనినం ద్యూతే పార్థౌ మాద్రీసుతౌ తదా ।
అన్వయుస్తే నరవ్యాఘ్రాః బాధ్యమానా దురాత్మభిః ॥ 8
కుంతీపుత్రులైన భీమార్జునులూ, మాద్రీసుతులైన నకులసహదేవులూ ఆ దుర్మార్గులచే బాధింపబడుతున్నా, ద్యూతవ్యసనపరుడైన ధర్మరాజును ఎలా అనుసరించారు? (8)
కథం ధర్మభృతాం శ్రేష్ఠః సుతో ధర్మస్య ధర్మవిత్ ।
అనర్హః పరమం క్లేశం సోఢవాన్ స యుధిష్ఠిరః ॥ 9
ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన, ధర్మదేవుని కుమారుడై, ధర్మం తెలిసిన ధర్మరాజు అన్నికష్టాలు పడటానికి తగిన వాడు కాకున్నా ఆ కష్టాల్ని ఎలా సహించాడు? (9)
కథం చ బహులాః సేనాః పాండవః కృష్ణసారథిః ।
అస్యన్నేకోఽనయత్ సర్వాః పితృలోకం ధనంజయః ॥ 10
కృష్ణుడు సారథిగా ఉండగా పాండవమధ్యముడైన ధనంజయుడు ఒక్కడే బహులసంఖ్యాకమైన శత్రుసేనలను పితృలోకానికి ఎలా పంపగలిగాడు? (10)
ఏతదాచక్ష్వ మే సర్వం యథావృత్తం తపోధన ।
యద్ యచ్చ కృతవంతస్తే తత్ర తత్ర మహారథాః ॥ 11
తపోధనా! ఆయా సమయాల్లో ఆ మహారథులంతా ఏమేమి చేశారో అదంతా జరిగింది జరిగినట్లుగా నాకు చెప్పు. (11)
వైశంపాయన ఉవాచ
క్షణం కురు మహారాజ విపులోఽయమనుక్రమః ।
పుణ్యాఖ్యానస్య వక్తవ్యః కృష్ణద్వైపాయనేరితః ॥ 12
వైశంపాయునుడిలా చెప్పాడు - మహారాజా! సావధానంగా ఉండు. వ్యాసమహర్షి చెప్పిన ఈ పవిత్రమైన ఆఖ్యానం చాలా విపులమైనది. దాన్ని యథాక్రమంగా చెప్పవలసి ఉంది. (12)
మహర్షేః సర్వలోకేషు పూజితస్య మహాత్మనః ।
ప్రవక్ష్యామి మతం కృత్స్నం వ్యాసస్యామితతేజసః ॥ 13
సమస్తలోకాల్లో గౌరవింపబడే గొప్ప తేజస్సంపన్నుడైన మహాత్ముడైన వ్యాసమహర్షి అభిప్రాయాన్ని సమగ్రంగా చెప్తాను. (13)
ఇదం శతసహస్రం హి శ్లోకానాం పుణ్యకర్మణామ్ ।
సత్యవత్యాత్మజేనేహ వ్యాఖ్యాతమమితౌజసా ॥ 14
పుణ్యకర్ములైన పాండవులకథను తేజస్సంపన్నుడైన సత్యవతీ తనయుడు వ్యాసుడు లక్ష శ్లోకాల్లో వివరించాడు. (14)
య ఇదం శ్రావయేద్ విద్వాన్ యే చేదం శృణుయుర్నరాః ।
తే బ్రహ్మణః స్థానమేత్య ప్రాప్నుయుర్దేవతుల్యతామ్ ॥ 15
ఈ కథను వినిపించిన విద్వాంసుడూ, విన్నమానవులూ బ్రహ్మలోకం చేరి దేవసము లవుతారు. (15)
ఇదం హి వేదైః సమితం పవిత్రమపి చోత్తమమ్ ।
శ్రావ్యాణాముత్తమం చేదం పురాణమృషిసంస్తుతమ్ ॥ 16
ఇది వేదాలతో సమానమైనది. పవిత్రమైనది. ఉత్తమమైనది. వినదగినవానిలో ఉత్తమమైన పురాణం. ఋషుల ప్రశంసలు పొందినది. (16)
అస్మిన్నర్థశ్చ ధర్మశ్చ నిఖిలేనోపదిశ్యతే ।
ఇతిహాసే మహాపుణ్యే బుద్ధిశ్చ పరినైష్ఠికీ ॥ 17
అక్షుద్రాన్ దానశీలాంశ్చ సత్యశీలాననాస్తికాన్ ।
కార్ణ్షం వేదమిమం విద్వాన్ శ్రావయిత్వార్థమశ్నుతే ॥ 18
చాలా పవిత్రమైన ఈ మహాభారతం అనే ఇతిహాసంలో ధర్మార్థాలు పూర్తిగా ఉపదేశింపబడింది. కృష్ణద్వైపాయనుడు చెప్పిన ఈ భారతసంహితను మంచి స్వభావం కలవారికి, దానశీలులకు, సత్యశీలులకు, ఆస్తికులకు, వినిపించిన విద్వాంసుడు అభీష్టాన్ని/అర్థాన్ని పొందుతాడు. (17,18)
భ్రూణహత్యాకృతం చాపి పాపం జహ్యాదసంశయమ్ ।
ఇతిహాసమిమం శ్రుత్వా పురుషోఽపి సుదారుణః ॥ 19
ముచ్యతే సర్వపాపేభ్యః రాహుణా చంద్రమా యథా ।
జయో నామేతిహాసోఽయం శ్రోతవ్యో విజిగీషుణా ॥ 20
ఈ ఇతిహాసం వినడం వల్ల భ్రూణహత్యవల్ల కలిగిన పాపం కూడా పోతుంది. ఇందులో సందేహం లేదు. రాహువుచే విడువబడిన చంద్రునిలా అన్ని పాపాల నుండి విముక్తుడౌతాడు. విజయాన్ని కోరుకొనేవాడు తప్పనిసరిగా జయమనే పేరు గల ఈ ఇతిహాసాన్ని వినాలి. (19,20)
మహీం విజయతే రాజా శత్రూంశ్చాపి పరాజయేతే ।
ఇదం పుంసవనం శ్రేష్ఠమ్ ఇదం స్వస్త్యయనం మహత్ ॥ 21
దీన్ని విన్న రాజు భూమిని జయుస్తాడు. శత్రువులను ఓడిస్తాడు. పుత్రుని పొందటానికి ఇది శ్రేష్ఠమైన మంచి గొప్ప సాధనం. ఇది ఎంతో శుభానికి మార్గం. (21)
మహిషీయువరాజాభ్యామ్ శ్రోతవ్యం బహుశస్తథా ।
వీరం జనయతే పుత్రం కన్యాం వా రాజ్యభాగినీమ్ ॥ 22
యువరాజు రాణి అనేక పర్యాయాలు దీన్ని వినాలి. అలా వింటే వీరుడైన పుత్రుడు జన్మిస్తాడు. లేదా రాజ్యాన్ని పొందగల కన్య జన్మిస్తుంది. (22)
ధర్మశాస్త్రమిదం పుణ్యమ్ అర్థశాస్త్రమిదం పరమ్ ।
మోక్షశాస్త్రమిదం ప్రోక్తమ్ వ్యాసేనామితబుద్ధినా ॥ 23
అపారమైన మేధాసంపత్తి గల వ్యాసుడు పవిత్రమైన ధర్మశాస్త్రాన్ని, గొప్ప అర్థశాస్త్రాన్ని, ఉత్తమమైన మోక్షశాస్త్రాన్ని ఈ భారతరూపంలో చెప్పాడు. (23)
సంప్రత్యాచక్షతే చేదమ్ తథా శ్రోష్యంతి చాపరే ।
పుత్రాః శుశ్రూషవః సంతి ప్రేష్యాశ్చ ప్రియకారిణః ॥ 24
ఇపుడు ఈ జయేతిహాసాన్ని చెప్పే వారి, వినేవారి పుత్రులు సేవాపరాయణు లవుతారు. సేవకులు ప్రియంగా పని చేసేవారు అవుతారు. (24)
శరీరేణ కృతం పాపం వాచా చ మనసైవ చ ।
సర్వం సంత్యజతి క్షిప్రం య ఇదం శృణుయాన్నరః ॥ 25
ఈ ఇతిహాసాన్ని విన్న మానవుడు మనోవాక్కాయాలచే చేసిన పాపం నుండి వెంటనే విముక్తుడౌతాడు. (25)
భరతానాం మహజ్జన్మ శృణ్వతామనసూయతామ్ ।
నాస్తి వ్యాధిభయం తేషాం పరలోకభయం కుతః ॥ 26
భరత వంశీయుల జన్మవృత్తాంతం విన్నవారికి అసూయ ఉండదు. వారికి రోగభయమే ఉండదు. ఇక పరలోక భయం ఎక్కడిది? (ఏ మాత్రమూ ఉండదని భావం) (26)
ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వర్గం తథైవ చ ।
కృష్ణద్వైపాయనేనేదమ్ కృతం పుణ్యచికీర్షుణా ॥ 27
కీర్తిం ప్రథయతా లోకే పాండవానాం మహాత్మనామ్ ।
అన్యేషాం క్షత్రియాణాం చ భూరిద్రవిణతేజసామ్ ॥ 28
సర్వవిద్యావదాతానాం లోకే ప్రథితకర్మణామ్ ।
య ఇదం మానవో లోకే పుణ్యార్థే బ్రాహ్మణాన్ శుచీన్ ॥ 29
శ్రావయేత మహాపుణ్యం తస్య ధర్మః సనాతనః ।
కురూణాం ప్రథితం వంశం కీర్తయన్ సతతం శుచిః ॥ 30
పవిత్రమైనపని చేయగోరి కృష్ణద్వైపాయనుడు ధనమూ, యశస్సూ, ఆయువూ, పుణ్యమూ, స్వర్గమూ ఇవ్వ గలిగిన ఈ భారతాన్ని రచించాడు. లోకంలో మహాత్ములైన పాండవుల కీర్తిని వ్యాపింపజేస్తూ వారితో పాటు సంపదా, తేజస్సూ గల ఇతరరాజుల కీర్తిని, అన్ని విద్యలు అభ్యసించి, కర్మనిష్ఠులైన వారి కీర్తిని లోకంలో వ్యాపింపజేశాడు. పుణ్యం కొరకు పవిత్రమైన బ్రాహ్మణులకు దీన్ని వినిపించినవాడు సనాతన ధర్మాన్ని ఆచరించినవాడౌతాడు. (27-30)
వంశమాప్నోతి విపులం లోకే పూజ్యతమో భవేత్ ।
యోఽధీతే భారతం పుణ్యం బ్రాహ్మణో నియతవ్రతః ॥ 31
చతురో వార్షికాన్ మాసాన్ సర్వపాపైః ప్రముచ్యతే ।
విజ్ఞేయః స చ వేదానాం పారగో భారతం పఠన్ ॥ 32
నియమంతో పవిత్రమైన ఈ భారతాన్ని అధ్యయనం చేసిన బ్రాహ్మణుని వంశం వృద్ధి చెందుతుంది. అతడు లోకంలో మిక్కిలి పూజింపదగినవాడౌతాడు. వర్షాకాలం నాలుగు నెలలూ చదివితే అన్ని పాపాలనుండి ముక్తుడౌతాడు. భారతాన్ని పఠించినవాడు వేదపారగుడని గుర్తించాలి. (31,32)
దేవా రాజర్షయో హ్యత్ర పుణ్యా బ్రహ్మర్షయస్తథా ।
కీర్త్యంతే ధూతపాప్మానః కీర్త్యతే కేశవస్తథా ॥ 33
దేవతలూ, రాజర్షులూ, పవిత్రమైన బ్రహ్మర్షులూ, పాపనిర్ముక్తులూ, ఇందులో కీర్తింపబడుతూ ఉన్నారు. శ్రీకృష్ణభగవానుడు కూడా కీర్తింపబడుతున్నాడు. (33)
భగవాంశ్చాపి దేవేశో యత్ర దేవీ చ కీర్తతే ।
అనేకజననో యత్ర కార్తికేయస్య సంభవః ॥ 34
దేవేశుడయిన ఈశ్వరుడు, పార్వతీదేవి, పలువురు తల్లులు గల కార్తికేయుని జననం ఇందులో వర్ణింపబడ్డాయి. (34)
బ్రాహ్మణానాం గవాం చైవ మహాత్మ్యం యత్ర కీర్త్యతే ।
సర్వశ్రుతిసమూహోఽయం శ్రోతవ్యో ధర్మబుద్ధిభిః ॥ 35
బ్రాహ్మణుల యొక్క గోవుల యొక్క మహత్త్వం ఇందులో చెప్పబడింది. సర్వవేద సమూహం అయిన ఈ భారతాన్ని ధర్మబుద్ధితో వినాలి. (35)
య ఇదం శ్రావయేద్ విద్వాన్ బ్రాహ్మణానిహ పర్వసు ।
ధూతపాప్మా జితస్వర్గః బ్రహ్మ గచ్ఛతి శాశ్వతమ్ ॥ 36
పర్వదినాల్లో బ్రాహ్మణులకు వినిపించిన విద్వాంసుడు పాపముక్తుడై స్వర్గాన్ని జయించి శాశ్వతమయిన బ్రహ్మమును చేరుకొంటాడు. (36)
(యస్తు రాజా శృణోతీదమ్ అఖిలామశ్నుతే మహీమ్ ।
ప్రసూతే గర్భిణీ పుత్రమ్ కన్యాచాశు ప్రదీయతే ॥
వణిజః సిద్ధయాత్రాః స్యుః వీరా విజయమాప్నుయుః ।
ఆస్తికా శ్రావయే న్నిత్యం బ్రాహ్మణాననసూయకాన్ ॥
వేదవిద్యావ్రతస్నాతాన్ క్షత్రియాన్ జయమాస్థితాన్ ।
స్వధర్మనిత్యాన్ వైశ్యాంశ్చ శ్రావయేత్ క్షత్రసంశ్రితాన్ ॥)
(ఈ మహాభారతాన్ని విన్న రాజు సమస్త భూమండలాన్నీ పొందుతాడు. గర్భవతి పుత్రుని కంటుంది. కన్యకు శీఘ్రంగా వివాహం అవుతుంది. వర్తకులు తమ వాణిజ్యయాత్రలో సఫలులు అవుతారు. వీరులు విజయాన్ని పొందుతారు. ఆస్తికులకు, అసూయలేనివారికి, వేదాధ్యయనం పూర్తయిన బ్రాహ్మణులకు, జయాన్ని కోరుతున్న క్షత్రియులకు, స్వధర్మాన్ని ఆచరిస్తున్న వైశ్యులకు, రాజాశ్రితులైన శూద్రులకు దీన్ని వినిపించాలి.
(ఏష ధర్మః పురా దృష్టః సర్వధర్మేషు భారత ।
బ్రాహ్మణాచ్ఛ్రవణం రాజన్ విశేషేణ విధీయతే ॥
భూయో వా యః పఠేన్నిత్యం స గచ్ఛేత్ పరమాం గతిమ్ ।
శ్లోకం వా ప్యనుగృహ్ణీత తథార్ధశ్లోకమేవ వా ॥
అపి పాదం పఠేన్నిత్యం న చ నిర్భారతో భవేత్ ।)
(రాజా! బ్రాహ్మణుల నుండి భారతం వినడం ప్రాచీన కాలం నుండి ఉన్న ఒక విశిష్టధర్మం. దాన్ని చదివినట్లయితే ఉత్తమ స్థితిని పొందుతారు. శ్లోకం కాని, అర్ధశ్లోకంకాని చివరకు ఒక్క పాదం కాని నిత్యం చదవాలి. అంతేకాని నిర్భారతుడు (భారతం చదవనివాడు) మాత్రం కాకూడదు.)
(ఇహ నైకాశ్రయం జన్మ రాజర్షీణాం మహాత్మనామ్ ॥
ఇహ మంత్రపదం యుక్తం ధర్మం చానేకదర్శనమ్ ।
ఇహ యుద్ధాని చిత్రాణి రాజ్ఞాం వృద్ధిరిహైవ చ ॥
ఋషీణాం చ కథాస్తాత ఇహ గంధర్వ రక్షసామ్ ।
ఇహ తత తత్ సమాసాద్య విహితో వాక్యవిస్తరః ॥
తీర్థానాం నామ పుణ్యానాం దేశానాం చేహ కీర్తనమ్ ।
వనానాం పర్వతానాం చ నదీనాం సాగరస్య చ ॥)
(ఈ భారతంలో మహాత్ములైన రాజర్షుల జన్మవృత్తాంతాలు ఎన్నో వర్ణింపబడ్డాయి. ఉత్తమమైన మంత్రాంగ విధానం చెప్పబడింది. అనేక దర్శనాలకు లోబడి ధర్మం చెప్పబడింది. విచిత్రాలైన యుద్ధాలు వర్ణింపబడ్డాయి. రాజుల వృద్ధి వర్ణింపబడింది. ఋషులు, గంధర్వులు, రాక్షసులు వీరి యొక్క కథలు ఆయా విషయ ప్రాధాన్యాన్ని బట్టి విస్తరంగా చెప్పబడ్డాయి. పవిత్ర తీర్థాలు, దేశాలు, వనాలు, పర్వతాలు, నదులు, సముద్రం, వీటన్నింటి గురించి దీంట్లో చెప్పబడింది.)
(దేశానాం చైవ పుణ్యానాం పురాణాం చైవ కీర్తనమ్ ।
ఉపచారస్తథైవాగ్య్రః వీర్యమప్యతిమానుషమ్ ॥
ఇహ సత్కారయోగశ్చ భారతే పరమర్షిణా ।
రథాశ్వవారణేంద్రాణాం కల్పనా యుద్ధకౌశలమ్ ॥
వాక్యజాతిరనేకా చ సర్వమస్మిన్ సమర్పితమ్ ।)
(పవిత్రాలైన దేశాలు, పురాలు వర్ణింపబడ్డాయి. శ్రేష్ఠమైన ఉపచారాలు, అలౌకిక పరాక్రమాలు, సత్కారాలు, రథ, అశ్వ గజ బలాలను ఏర్పాటుచేయడం, యుద్ధకౌశలం, ఇందులో వర్ణింపబడ్డాయి. అనేక విన్యాసాల వాక్య సమూహాలు, ఇందులో చూపబడ్డాయి.)
శ్రావయేద్ బ్రాహ్మణాన్ శ్రాద్ధే యశ్చేమం పాదమంతతః ।
అక్షయ్యం తస్య తచ్ఛ్రాద్ధమ్ ఉపావర్తేత్ పితౄనిహ ॥ 37
శ్రాద్ధ సమయంలో బ్రాహ్మణులకు చివరకు ఈ భారతంలోని ఒక్క శ్లోక పాదం వినిపించినా, ఆ శ్రాద్ధం అక్షయ ఫలాన్నిస్తుంది. పితృదేవతలకు తప్పక చేరుతుంది. (37)
అహ్నా యదేనః క్రియతే ఇంద్రియైర్మనసాపి వా ।
జ్ఞానాదజ్ఞానతో వాపి ప్రకరోతి నరశ్చ యత్ ॥ 38
తన్మహాభారతాఖ్యానం శ్రుత్వైవ ప్రవిలీయతే ।
భరతానాం మహజ్జన్మ మహాభారతముచ్యతే ॥ 39
ఇంద్రియాలతోకాని, మనస్సుతోకాని, తెలిసికాని తెలియకకాని ఏరోజు చేసిన పాపం ఆరోజే భారతాఖ్యానం వినడం వల్ల నశిస్తుంది. భరతవంశీయుల ఉత్తమ జన్మవృత్తాంతం చెప్పడం వల్ల ఇది మహాభారతమని చెప్పబడుతోంది. (38,39)
విరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే ।
భరతానాం యతశ్చాయమ్ ఇతిహాసో మహాద్భుతః ॥ 40
మహతో హ్యేనసో మర్త్యాన్ యోచయేదనుకీర్తితః ।
త్రిభిర్వర్షైర్లబ్ధకామః కృష్ణద్వైపాయనో మునిః ॥ 41
నిత్యోత్థితః శుచిః శక్తిః మహాభారతమాదితః ।
తపో నియమమాస్థాయ కృతమేతన్మహర్షిణా ॥ 42
తస్మాన్నియమసంయుక్తైః శ్రోతవ్యం బ్రాహ్మణైరిదమ్ ॥ 43
శ్రావయిష్యంతి యే విప్రాః యే చ శ్రోష్యంతి మానవాః ।
సర్వథా వర్తమాణా వై న తే శోచ్యాః కృతాకృతైః ॥ 44
మహాభారతం యొక్క ఈ నిర్వచనాన్ని తెలిసినవాడు సమస్తపాపాల నుండి విముక్తుడౌతాడు. ఎందువల్లనంటే భరతవంశీయుల ఇతిహాసం చాలా అద్భుతమైంది. నిరంతర పఠనం వల్ల ఇది మానవులను మహా పాపం నుండి విముక్తుని చేస్తుంది. నిత్యం ప్రాతః కాలంలో లేచి తపోనియమాన్ని పాటిస్తూ శక్తిసంపన్నుడైన కృష్ణద్వైపాయనుడు మూడు సంవత్సరాల కాలంలో మహాభారత రచన చేశాడు. అందువల్ల బ్రాహ్మణులు కూడా నియమాన్ని పాటిస్తూ దీన్ని వినాలి. వ్యాస మహర్షి చెప్పిన ఈ మహాభారతమనే ఉత్తమకథను ఇతరులకు వినిపించిన బ్రాహ్మణులు, విన్న మానవులు కృతాకృతముల చింతలేక దుఃఖం లేనివారై ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. (40-44)
నరేణ ధర్మకామేన సర్వః శ్రోతవ్య ఇత్యపి ।
నిఖిలేనేతిహాసోఽయం తతః సిద్ధిమవాప్నుయాత్ ॥ 45
ధర్మాన్ని కోరుకొనే మానవుడు ఈ మహాభారతాన్నంతా వినాలి. అలా విన్నవాడు అన్ని సిద్ధులనూ పొందుతాడు. (45)
న తాం స్వర్గగతిం ప్రాప్య తుష్టిం ప్రాప్నోతి మానవః ।
యాం శ్రుత్వైవ మహాపుణ్యమ్ ఇతిహాసముపాశ్నుతే ॥ 46
మిక్కిలి పవిత్రమైన ఈ ఇతిహాసాన్ని వినడం వల్ల పొందే తృప్తిని, ఆనందాన్ని స్వర్గానికి వెళ్ళినా పొందలేడు. (46)
శృణ్వన్ శ్రాద్ధః పుణ్యశీలః శ్రావయంశ్చేదమద్భుతమ్ ।
నరః ఫలమవాప్నోతి రాజసూయాశ్వమేధయోః ॥ 47
మంచి నడవడిక గల మానవుడు అద్భుతమైన ఈ మహాభారతాన్ని విన్నా, వినిపించినా రాజసూయ అశ్వమేధయాగాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. (47)
యథా సముద్రో భగవాన్ యథా మేరుర్మహాగిరిః ।
ఉభౌ ఖ్యాతౌ రత్ననిధీ తథా భారతముచ్యతే ॥ 48
సముద్రాన్ని మేరుపర్వతాన్ని రత్ననిధి అన్నట్లే ఈ మహాభారతాన్ని కూడ రత్ననిధి అంటారు. (48)
ఇదం హి వేదైః సమితం పవిత్రమపి చోత్తమమ్ ।
శ్రవ్యం శ్రుతిసుఖం చైవ పావనం శీలవర్ధనమ్ ॥ 49
ఇది వేదాలతో సమానమైంది. పవిత్రమైంది. శ్రేష్ఠమైంది. వినదగింది. వినుటకింపైనది. పవిత్రమైనది. శీలాన్ని మెరుగుపరుస్తుంది. (49)
య ఇదం భారతం రాజన్ వాచకాయ ప్రయచ్ఛతి ।
తేన సర్వా మహీ దత్తా భవేత్ సాగరమేఖలా ॥ 50
రాజా! ఈ మహాభారతాన్ని చెప్పేవానికి ఇచ్చినట్లయితే సముద్రమేఖల అయిన భూమండలాన్ని దానంచేసినంత ఫలం లభిస్తుంది. (50)
పారిక్షిత! కథాం దివ్యాం పుణ్యాయ విజయాయ చ ।
కథ్యమానాం మయా కృత్స్నాం శృణు హర్షకరీమిమామ్ ॥ 51
పరీక్షిదాత్మజ! నేను చెప్పే దివ్యమైన ఈ కథను సమగ్రంగా విను. ఇది మిక్కిలి ఆనందాన్ని, విజయాన్ని, పుణ్యాన్ని కలిగిస్తుంది. (51)
త్రిభిర్వర్షైః సదోత్థాయీ కృష్ణద్వైపాయనో మునిః ।
మహాభారతమాఖ్యానం కృతవానిదమద్భుతమ్ ॥ 52
కృష్ణద్వైపాయనుడు మూడుసంవత్సరాలు నిత్యోత్సాహంతో అద్భుతమైన ఈ మహాభారత ఆఖ్యానాన్ని రచించాడు. (52)
ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ ।
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్ ॥ 53
భరత శ్రేష్ఠా! ధర్మ, అర్థ, కామ, మోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే ఎక్కడయినా ఉంటుంది. ఇందులో లేనిది ఇతరత్ర ఉండదు. (53)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి అంశావతార పర్వణి మహాభారత ప్రశంసాయాం ద్విషష్టితమోఽధ్యాయః ॥ 62 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున అంశావతారపర్వమను ఉపపర్వమున మహాభారత ప్రశంస అను అరువది రెండవ అధ్యాయము. (62)
(దాక్షిణాత్య అధికపాఠము 11 1/2 శ్లోకము కలుపుకొని మొత్తం 64 1/2 శ్లోకాలు)