66. అరువది ఆరవ అధ్యాయము

మహర్షుల - కశ్యపపత్నుల సంతానము.

వైశంపాయన ఉవాచ
బ్రహ్మణో మానసాః పుత్రాః విదితాః షణ్మహర్షయః ।
ఏకాదశసుతాః స్థాణోః ఖ్యాతాః పరమతేజసః ॥ 1
వైశంపాయనుడిలా చెప్పాడు - బ్రహ్మమానస పుత్రులైన ఆరుగురు మహర్షులు నీకు తెలుసు కదా! వారిలో పరమ తేజస్వి ఐన స్థాణువులకు పదకొండుగురు కొడుకులు ఉన్నారు. (1)
మృగవ్యాధశ్చ సర్పశ్చ నిరృతిశ్చ మహాయశాః ।
అజైకపాదహిర్బుధ్న్యః పినాకీ చ పరంతపః ॥ 2
దహనోఽథ్యేశ్వరశ్చైవ కపాలీ చ మహాద్యుతిః ।
స్థాణుర్భవశ్చ భగవాన్ రుద్రా ఏకాదశ స్మృతాః ॥ 3
మృగవాధుడు, సర్పుడు, (మహాయశస్వి అయిన) నిరృతి, అజైకపాదుడు, అహిర్బుధ్న్యుడు, (శత్రుసంహారకుడైన) పినాకి, దహనుడు, ఈశ్వరుడు, (గొప్ప తేజస్వి అయిన) కపాలి, స్థాణువు, (భగవానుడగు) భవుడు - ఈ పదకొండుగురు స్థాణుకుమారులు, రుద్రులుగా ప్రసిద్ధులు. (2,3)
మరీచిరంగిరా అత్రిః పులస్త్యః పులహః క్రతుః ।
షడేతే బ్రహ్మణః పుత్రాః వీర్యవంతో మహర్షయః ॥ 4
మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు - ఈ ఆరుగురు తేజస్వులూ, మహర్షులూ అయిన బ్రహ్మ పుత్రులు. (4)
త్రయస్త్వంగిరసః పుత్రాః లోకే సర్వత్ర విశ్రుతాః ।
బృహస్పతిరుతథ్యశ్చ సంవర్తశ్చ ధృతవ్రతాః ॥ 5
అత్రేస్తు బహవః పుత్రాః శ్రూయంతే మనుజాధిప ।
సర్వే వేదవిదః సిద్ధాః శాంతాత్మానో మహర్షయః ॥ 6
రాజా! అంగిరసునకు బృహస్పతి, ఉతథ్యుడు, సంవర్తకుడు అనే ముగ్గురు కొడుకులు. వీరు లోకప్రసిద్ధులు, దృఢవ్రతులు. అత్రికి చాలమంది పుత్రులున్నారని వినికిడి. వారంతా కూడా వేదవేత్తలు, శాంతస్వభావులు, మహర్షులూ కూడ. (5,6)
రాక్షసాశ్చ పులస్త్యస్య వానరాః కింనరాస్తథా ।
యక్షాశ్చ మనుజవ్యాఘ్ర పుత్రా స్తస్య చ ధీమతః ॥ 7
నరశ్రేష్ఠా! బుద్ధిమంతుడైన పులస్త్య మహర్షికి రాక్షసులు, వానరులు, కిన్నరులు, యక్షులు పుత్రులుగా జన్మించారు. (7)
పులహస్య సుతా రాజన్ శరభాశ్చ ప్రకీర్తితాః ।
సింహాః కింపురుషా వ్యాఘ్రాః ఋక్షా ఈహామృగాస్తథా ॥ 8
రాజా! పులహునికి శరభ, సింహ, కింపురుష, వ్యాఘ్ర, ఋక్ష, ఈహామృగాలు పుత్రులుగా జన్మించారు. (8)
క్రతోః క్రతుసమాః పుత్రాః పతంగసహచారిణః ।
విశ్రుతాస్త్రిషు లోకేషు సత్యవ్రతపరాయణాః ॥ 9
క్రతువునకు క్రతుసమాన పవిత్రులూ, సూర్యునితో బాటు సంచరింపగలవారూ వాలఖిల్యులని త్రిలోక ప్రసిద్ధులై సత్యవ్రత పరాయణులైన పుత్రులు జన్మించారు. (9)
దక్షస్త్వజాయతాంగుష్ఠాద్ దక్షిణాద్ భగవానృషిః ।
బ్రహ్మణః పృథివీపాల శాంతాత్మా సుమహాతపాః ॥ 10
రాజా! బ్రహ్మ యొక్క కుడిచేత బొటనవ్రేలి నుండి మహర్షి దక్షుడు జన్మించాడు. అతడు శాంత స్వభావుడు, మహాతపస్వి. (10)
వామాదజాయతాంగుష్ఠాద్ భార్యా తస్య మహాత్మనః ।
తస్యాం పంచాశతం కన్యాః స ఏవాజనయన్మునిః ॥ 11
బ్రహ్మ యొక్క ఎడమచేతి బొటనవ్రేలి నుండి పుట్టిన కన్య దక్షునికి భార్య అయింది. ఆమెకు దక్షునివల్ల ఏభైమంది కన్యలు పుట్టారు. (11)
తాః సర్వాస్త్వనవద్యాంగ్యః కన్యాః కమలలోచనాః ।
పుత్రికాః స్థాపయామాస నష్టపుత్రః ప్రజాపతిః ॥ 12
కొడుకులు లేని దక్షప్రజాపతి ఆ కన్యకలందర్ని తనవద్దనే ఉంచుకొన్నాడు. వారంతా అందమైనవారు, పద్మాలవంటి కన్నులు కలవారు. (12)
దదౌ స దశ ధర్మాయ సప్తవింశతిమిందవే ।
దివ్యేన విధినా రాజన్ కశ్యపాయ త్రయోదశ ॥ 13
రాజా! ఆ దక్షుడు పదిమంది కన్యలను ధర్మునకిచ్చాడు. చంద్రునికి ఇరవై ఏడుగురు కన్యలనిచ్చాడు. కశ్యపునకు పదముగ్గురు కన్యలను దివ్యవిధిప్రకారంగా ఇచ్చాడు. (13)
నామతో ధర్మపత్న్యస్తాః కీర్తమానా నిబోధ మే ।
కీర్తిర్లక్ష్మీర్ధృతిర్మేధా పుష్టిః శ్రద్ధా క్రియా తథా ॥ 14
బుద్ధిర్లజ్జా మతిశ్చైవ పత్న్యో ధర్మస్య తా దశ ।
ద్వారాణ్యేతాని ధర్మస్య విహితాని స్వయంభువా ॥ 15
ధర్మునకు కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మతి అనే పదిమంది ధర్మపత్నులుగా ఉన్నారు. బ్రహ్మ ఈ పదిమందిని ధర్మానికి ద్వారాలుగా నిర్ణయించాడు. (14,15)
సప్తవింశతిః సోమస్య పత్న్యో లోకస్య విశ్రుతాః ।
కాలస్య నయనే యుక్తాః సోమపత్న్యః శుచివ్రతాః ॥ 16
చంద్రుని ఇరువది ఏడుగురు భార్యలు (27 నక్షత్రములుగా) లోక ప్రసిద్ధులు. పవిత్రలైన వారు కాలాన్ని నడపటానికి నియోగింపబడ్డారు. (16)
సర్వానక్షత్రయోగిన్యః లోకయాత్రా విధానతః ।
పైతామహో మునిర్దేవః తస్యపుత్రః ప్రజాపతిః ॥
తస్యాష్టౌ వసవః పుత్రాః తేషాం వక్ష్యామి విస్తరమ్ ॥ 17
ధరోధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవానిలోఽనలః ।
ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోఽష్టౌ ప్రకీర్తితాః ॥ 18
లోకయాత్రా విధానం కోసం వీరంతా నక్షత్ర నామాలతో వ్యవహరింపబడ్డారు. పితామహుడైన బ్రహ్మయొక్క వక్షఃస్థలం నుండి పుట్టడం వల్ల ధర్మదేవుని బ్రహ్మపుత్రునిగా వ్యవహరించారు. అతనికి అష్టవసువులు పుత్రులుగా జన్మించారు. వారి వృత్తాంతం విస్తారంగా చెప్తాను. ధరుడు, ధ్రువుడు, సోముడు, అహస్సు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసులనే పుత్రులు అష్టవసువులుగా చెప్పబడ్డారు. (17,18)
ధూమ్రాయాస్తు ధరః పుత్రో బ్రహ్మవిద్యో ధ్రువస్తథా ।
చంద్రమాస్తు మనస్విన్యాః శ్వాసాయాః శ్వసనస్తథా ॥ 19
రతాయాశ్చాప్యహః పుత్రః శాండిల్యాశ్చ హుతాశనః ।
ప్రత్యూసశ్చ ప్రభాసశ్చ ప్రభాతాయాః సుతౌ స్మృతౌ ॥ 20
ధూమ్రకు ధరుడు, బ్రహ్మవేత్త అయిన ధ్రువుడు అనే ఇద్దరు పుత్రులు. చంద్రుడు మనస్విని కొడుకు. శ్వాసకు శ్వసనుడు జన్మించాడు. రతకు అహుడు, శాండిల్యకు హుతాశనుడు, ప్రభాతకు ప్రత్యూషుడు, ప్రభాసుడు జన్మించారు. (19,20)
ధరస్య పుత్రో ద్రవిణః హుతహవ్యవహస్తథా ।
ధ్రువస్య పుత్రో భగవాన్ కాలో లోకప్రకాలనః ॥ 21
ధరునికి ద్రవిణుడు, హుతహవ్యవహుడు (అగ్ని) అను పుత్రులున్నారు. ధ్రువునికి లోకులందరికి తిండిని కల్పించే పూజ్యుడైన కాలుడనే పుత్రుడు కలిగాడు. (21)
సోమస్య తు సుతో వర్చాః వర్చస్వీ యేన జాయతే ।
మనోహరాయాః శిరః ప్రాణోఽథ రమణస్తథా ॥ 22
సోముని వల్ల మనోహరకు వర్చసుడనే కొడుకు కలిగాడు. అతని వల్ల మానవుడు వర్చస్వి అవుతున్నాడు. ఇంకా మనోహరకు శిరుడు, ప్రాణుడు, రమణుడు అని ముగ్గురు కుమారులు కలిగారు. (22)
అహ్నః సుతస్తథా జ్యోతిః శమః శాంతస్తథా మునిః ।
అగ్నేః పుత్రః కుమారస్తు శ్రీమాన్ శరవణాలయః ॥ 23
అహస్సుకు జ్యోతిస్సు, శముడు, శాంతుడు, ముని అని నలుగురు కుమారులు పుట్టారు. అగ్నికి రెల్లువనం నివాసంగా కల శ్రీమంతుడైన కుమారుడు (స్కందుడు) జన్మించాడు. (23)
తస్య శాఖో విశాఖశ్చ నైగమేయశ్చ పృష్ఠజః ।
కృత్తికాభ్యుపపత్తేశ్చ కార్తికేయ ఇతి స్మృతః ॥ 24
అతనికి శాఖుడు, విశాఖుడు, నైగమేయుడు అనేవారు తమ్ముళ్లు. ఆరుగురు కృత్తికలు ఆదరించటం చేత కుమారుని కార్తికేయుడని కూడా అంటారు. (24)
అనిలస్య శివా భార్యా తస్యాః పుత్రో మనోజవః ।
అవిజ్ఞాతగతిశ్చైవ ద్వౌ పుత్రావనిలస్య తు ॥ 25
అనిలుని భార్య శివ. ఆమెకు మనోజవుడు, అవిజ్ఞాతగతి అని ఇరువురు కుమారులు కలిగారు. (25)
ప్రత్యూషస్య విదుః పుత్రమ్ ఋషిం నామ్నాథ దేవలమ్ ।
ద్వౌ పుత్రౌ దేవలస్యాపి క్షమావంతౌ మనీషిణౌ ।
బృహస్పతేస్తు భగినీ వరస్త్రీ బ్రహ్మవాదినీ ॥ 26
యోగసక్తా జగత్ కృత్స్నమ్ అసక్తా విచచారహ ।
ప్రభాసస్యతు భార్యా సా వసూనామష్టమస్య హ ॥ 27
ప్రత్యూషునికి దేవలుడనే కుమారుడు జన్మించాడు. అతనికి సహనశీలులు, బుద్ధిమంతులూ అయిన ఇద్దరు కొడుకులు కలిగారు. బృహస్పతికి బ్రహ్మవాదిని, స్త్రీ రత్నం అనదగిన సోదరి ఉంది. ఆమె యోగాసక్తురాలు. లోకవ్యవహారమందు అనాసక్తురాలూను. ఆమె అష్టవసువులలో ఎనిమిదివవాడగు ప్రభాసుని భార్య. (26,27)
విశ్వకర్మా మహాభాగః జజ్ఞే శిల్పప్రజాపతిః ।
కర్తా శిల్పసహస్రాణాం త్రిదశానాం చ వర్థకిః ॥ 28
పూజ్యుడైన విశ్వకర్మ శిల్పసృష్టికర్త. వేలకొద్దీ శిల్పాలను నిర్మించాడు. దేవతల శిల్పి అతడు. (28)
భూషణానాం చ సర్వేషాం కర్తా శిల్పవతాం వరః ।
యో దివ్యాని విమానాని త్రిదశానాం చకార హ ॥ 29
అతడు అన్ని భూషణాలను చేసేవాడు. శిల్పులలో శ్రేష్ఠుడు. దేవతలకు దివ్యవిమానాల నతడే నిర్మించాడు. (29)
మనుష్యాశ్చోపజీవంతి యస్య శిల్పం మహాత్మనః ।
పూజయంతి చ యం నిత్యం విశ్వకర్మాణ మవ్యయమ్ ॥ 30
మనుష్యులు ఆ విశ్వకర్మ యొక్క శిల్పాన్ని ఆశ్రయించి జీవనయాత్ర సాగిస్తున్నారు. అవ్యయుడైన ఆ విశ్వకర్మను మనుష్యులు పూజిస్తున్నారు. (30)
స్తనం తు దక్షిణం భిత్వా బ్రహ్మణో నరవిగ్రహః ।
నిఃసృతో భగవాన్ ధర్మః సర్వలోకసుఖావహః ॥ 31
బ్రహ్మయొక్క కుడి ఱొమ్మును చీల్చుకొని ధర్ముడు మానుషరూపంలో బయటకు వచ్చాడు. అతడు మానవులందరికి సుఖాన్ని కలిగిస్తాడు. (31)
త్రయస్తస్య వరాః పుత్రాః సర్వభూతమనోహరాః ।
శమః కామశ్చ హర్షశ్చ తేజసా లోకధారిణః ॥ 32
అతనికి ప్రాణులన్నింటిలో మనోహరులైన శముడు, కాముడు, హర్షుడు అనే ముగ్గురు కుమారులున్నారు. వారు తమ తేజస్సుతో ఈ జగత్తును పొషిస్తున్నారు. (32)
కామస్య తు రతిర్భార్యా శమస్య ప్రాప్తిరంగనా ।
నందా తు భార్యా హర్షస్య యాసు లోకాః ప్రతిష్ఠితాః ॥ 33
కాముని భార్య రతి. శముని భార్య ప్రాప్తి. హర్షుని భార్య నంద. ఈ ముగ్గురు లోకమంతా వ్యాపించి ఉన్నారు. (33)
మరీచేః కశ్యపః పుత్రః కశ్యపస్య సురాసురాః ।
జజ్ఞిరే నృపశార్దూల లోకానాం ప్రభవస్తు సః ॥ 34
మరీచి కుమారుడు కశ్యపుడు. అతని కుమారులు సురాసురులు. అందువల్ల కశ్యపుడు ఈ లోకాలన్నింటికి కారణమైనవాడు. (34)
త్వాష్ట్రీ తు సవితుర్భార్యా వడవారూపధారిణీ ।
అసూయత మహాభాగా సాంతరిక్షేఽశ్వినావుభౌ ॥ 35
ద్వాదశైవాదితేః పుత్రాః శక్రముఖ్యా నరాధిప ।
తేషామవరజో విష్ణుః యత్ర లోకాః ప్రతిష్ఠితాః ॥ 36
త్వష్ట కూతురయిన సంజ్ఞ సూర్య భగవానుని ధర్మపత్ని. ఆమె మిక్కిలి సౌభాగ్యవతి. ఆమె వడవా (ఆడ గుఱ్ఱం) రూపాన్ని ధరించి, అంతరిక్షంలో సంచరిస్తూ ఇద్దరు అశ్వినీ కుమారులను కన్నది. అదితికి ఇంద్రాదులు పన్నెండుగురు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు విష్ణువు. అతని యందే ఈ లోకాలన్నీ ప్రతిష్ఠితాలయి ఉన్నాయి. (35,36)
త్రయస్త్రింశత ఇత్యేతే దేవాస్తేషామహం తవ ।
అన్వయం సంప్రవక్ష్యామి పక్షైశ్చ కులతో గణాన్ ॥ 37
ఈ విధంగా అష్టవసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు, ప్రజాపతి, వషట్ కారుడు మొత్తం ముప్పది ముగ్గురు దేవతలు వారి పక్షాలను, కులాలను, గణాలను గూర్చి వివరిస్తాను. (37)
రుద్రాణామపరః పక్షః సాధ్యానాం మరుతాం తథా ।
వసూనాం భార్గవం విద్యాద్ విశ్వేదేవాంస్తథైవ చ ॥ 38
రుద్రులు, సాధ్యులు, మరుత్తులు, వసువులు, వేరు వేరు గణాలు. ఇదే విధంగా భార్గవుడు, విశ్వేదేవతలు వేరు వేరు గణాలు. (38)
వైనతేయస్తు గరుడః బలవానరుణస్తథా ।
బృహస్పతిశ్చ భగవాన్ ఆదిత్యేష్వేవ గణ్యతే ॥ 39
వినతా కుమారుడు గరుడుడు బలవంతుడు. అరుణుడు, పూజ్యుడు బృహస్పతి ఆదిత్య గణంలోని వారే. (39)
అశ్వినౌ గుహ్యకాన్ విద్ధి సర్వౌషధ్యస్తథా పశూన్ ।
ఏతే దేవగణా రాజన్ కీర్తితాస్తేఽనుపూర్వశః ॥ 40
అశ్వినులు, సర్వౌషధాలు, పశువులు గుహ్యక పక్షంలోని వారు. రాజా! ఈ దేవ గణాలను గూర్చి క్రమంగా నీకు వివరిస్తాను. (40)
యాన్ కీర్తయిత్వా మనుజః సర్వపాపైః ప్రముచ్యతే ।
బ్రహ్మణో హృదయం భిత్వా నిఃసృతో భగవాన్ భృగుః ॥ 41
వారిని కీర్తించడం వల్ల మానవుడు సమస్త పాపాల నుండి విడుదలౌతాడు. పూజ్యుడయిన భృగుమహర్షి బ్రహ్మ హృదయాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడు. (41)
భృగోః పుత్రః కవిర్విద్వాన్ శుక్రః కవిసుతో గ్రహః ।
త్రైలోక్యప్రాణయాత్రార్థం వర్షావర్షే భయాభయే ।
స్వయంభువా నియుక్తః సన్ భువనం పరిధావతి ॥ 42
భృగువు కుమారుడు విద్వాంసుడు కవి. ఆ కవి కుమారుడు శుక్రుడు. ఇతడు గ్రహరూపంలో ఈ ముల్లోకాలలోని జీవుల జీవయాత్రా రక్షణ కొఱకు వృష్టి, అనావృష్టులను, భయాభయాలను కలిగిస్తూ ఉంటాడు. స్వయంభువు అయిన బ్రహ్మ ప్రేరణతో అతడు సమస్త లోకాలలోను సంచరిస్తూ ఉంటాడు. (42)
యోగాచార్యో మహాబుద్ధిః దైత్యానామభవద్ గురుః ।
సురాణాం చాపి మేధావీ బ్రహ్మచారీ యతవ్రతః ॥ 43
మహాబుద్ధిమంతుడు, యోగాచార్యుడూ అయిన శుక్రుడు దైత్యులకు గురువయ్యాడు. యోగబలం కల మేధావి, బ్రహ్మచారి, నియమపరాయణుడూ అయిన బృహస్పతి రూపంలో అతడే దేవతలకు కూడా గురువయ్యాడు. (43)
తస్మిన్ నియుక్తే విధినా యోగక్షేమామ భార్గవే ।
అన్యముత్పాదయామాస పుత్రం భృగురనిందితమ్ ॥ 44
ఆ విధంగా శుక్రుడు, బ్రహ్మచేత లోకరక్షణార్థం నియోగింపబడగా, భృగువు మరో ఉత్తముడైన కొడుకును కన్నాడు. (44)
చ్యవనం దీప్తతపసం ధర్మాత్మానం యశస్వినమ్ ।
యః స రోషాచ్చ్యుతో గర్భాత్ మాతుర్మోక్షాయ భారత ॥ 45
అతని పేరు చ్యవనుడు తపః ప్రకాశం కలవాడు. ధర్మాత్ముడు, యశస్వి. అతడు తల్లిని కష్టాల నుండి విముక్తి చేయడానికి రోషంతో గర్భం నుండి వెలుపలికి వచ్చాడు. (అందుకే అతనిని చ్యవనుడన్నారు). (45)
ఆరుషీ తు మనోః కన్యా తస్య పత్నీ మనీషిణః ।
ఔర్వస్తస్యాం సమభవద్ ఊరుం భిత్వా మహాయశాః ॥ 46
మనువు కూతురైన ఆరుషి బుద్ధిమంతుడైన చ్యవనుడికి భార్య అయింది. ఆమె తొడను చీల్చుకుని మహాయశస్వి అయిన ఔర్వుడు జన్మించాడు. (ఊరువు నుండి పుట్టడం వల్ల అతనిని ఔర్వుడన్నారు). (46)
మహాతేజా మహావీర్యః బాల ఏవ గుణైర్యుతః ।
ఋచీకస్తస్య పుత్రస్తు జమదగ్నిస్తతోఽభవత్ ॥ 47
అతడు గొప్ప తేజస్సంపన్నుడు, మహాబలుడు, బాలుడైనా సద్గుణసంపన్నుడు. అతని కుమారుడు ఋచీకుడు. అతని కుమారుడు జమదగ్ని. (47)
జమదగ్నేస్తు చత్వారః ఆసన్ పుత్రా మహాత్మనః ।
రామస్తేషాం జఘన్యోఽభూద్ అజఘన్యైర్గుణైర్యుతః ॥ 48
జమదగ్ని మహర్షికి నలుగురు కుమారులున్నారు. వారిలో అందరికంటె చిన్నవాడు (పరశు)రాముడు. అతడు చిన్నవాడైనా ఉత్తమ గుణసంపన్నుడు. అన్ని శస్త్రాలయందు నిపుణుడు. క్షత్రియులను అంతమొందించినవాడు. జితేంద్రియుడు కూడాను. (48)
ఔర్వస్యాసీత్ పుత్రశతః జమదగ్నిపురోగమమ్ ।
తేషాం పుత్రసహస్రాణి బభూవుర్భువి విస్తరః ॥ 49
ఔర్వమునికి జమదగ్ని మున్నగు నూరుగురు కుమారులున్నారు. వారికి వేయిమంది పుత్రులు కలిగారు. ఈ విధంగా భూమండలమంతా భృగువంశసంతతి వ్యాపించింది. (49)
ద్వౌ పుత్రౌ బ్రహ్మణస్త్వన్యౌ యయోస్తిష్ఠతి లక్షణమ్ ।
లోకే ధాతా విధాతా చ యౌ స్థితౌ మనునా సహ ॥ 50
బ్రహ్మకు ధాత, విధాత అని మరో ఇద్దరు కొడుకులున్నారు. వారి వల్లనే ఈ లోకంలో నిరంతరాయంగా ప్రాణులపుట్టుక, ధారణ, పోషణ జరుగుతోంది. వారు మనువుతో పాటు ఉండేవారు. (50)
తయోరేవ స్వసా దేవీ లక్ష్మీః పద్మగృహా శుభా ।
తస్యాస్తు మానసాః పుత్రాః తురగా వ్యోమచారిణః ॥ 51
వరుణస్య భార్యా యా జ్యేష్ఠా శుక్రాద్ దేవీ వ్యజాయత ।
తస్యాః పుత్రం బలం విద్ధి సురాం చ సురనందినీమ్ ॥ 52
వారి యొక్క సోదరి లక్ష్మి. శుభలక్షణాలు గల ఆమెకు కమలం నివాసస్థానం. ఆకాశంలో సంచరించే తురగాలు ఆమెకు మానసపుత్రులు. వరుణునికి జ్యేష్ఠ అనే భార్య యందు బలుడనే పుత్రుడూ సురనందిని అయిన 'సుర' అనే పుత్రిక జన్మించారు. (51,52)
ప్రజానామన్నకామానామ్ అన్యోన్యపరిభక్షణాత్ ।
అధర్మస్తత్ర సంజాతః సర్వభూతవినాశకః ॥ 53
అన్నకాముకులైన ప్రజలు అన్నార్తులై ఒకరినొకరు భక్షించే పరిస్థితి వచ్చినపుడు, సర్వప్రాణికోటి వినాశకమైన అధర్ముడు పుట్టాడు. (53)
తస్యాపి నిరృతిర్భార్యా నైర్యతా యేన రాక్షసాః ।
ఘోరాస్తస్యాస్త్రయః పుత్రాః పాపకర్మరతాః సదా ॥ 54
ఆ అధర్మునికి నిరృతి భార్య. ఆమెకు నైరృతులనే భయంకరమైన రాక్షసులు జన్మించారు. వారు నిరంతరం పాపకర్మల పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు. (54)
భయో మహాభయశ్చైవ మృత్యుర్భూతాంతకస్తథా ।
న తస్య భార్యా పుత్రో వా కశ్చిదస్త్యంతకో హి సః ॥ 55
వారి పేర్లు - భయం, మహాభయం, మృత్యువు. మృత్యువు ప్రాణులను అంతమొందిస్తాడు. వానికి భార్యా పుత్రులు లేరు. (55)
కాకీం శ్యేనీం తథా భాసీం ధృతరాష్ట్రీం తథా శుకీం ।
తామ్రా తు సుషువే దేవీ పంచైతా లోకవిశ్రుతాః ॥ 56
తామ్ర కాకి, శ్యేని, భాసి, ధృతరాష్ట్రి, శుకి అనే లోక విఖ్యాతలైన ఐదుగురు కన్యలను కన్నది. (56)
ఉలూకాన్ సుషువే కాకీ శ్యేనీ శ్యేనాన్ వ్యజాయత ।
భాసీ భాసానజనయద్ గృధ్రాంశ్చైవ జనాధిప ॥ 57
కాకి ఉలూకాలను, శ్యేని శ్యేనా (డేగ) లను, భాసి మృగాలను, గ్రద్దలను ప్రసవించింది. (57)
ధృతరాష్ట్రీ తు హంసాశ్చ కలహంసాంశ్చ సర్వశః ।
చక్రవాకాంశ్చ భద్రా తు జనయామాస సైవ తు ॥ 58
శుకీ చ జనయామాస శుకానేవ యశస్వినీ ।
కల్యాణగుణసంపన్నా సర్వలక్షణపూజితా ॥ 59
ధృతరాష్ట్రి హంసలకు, కలహంసలకు, చక్రవాకాలకు జన్మనిచ్చింది. శుకి శుభప్రదగుణాలు కలది. సర్వలక్షణాల చేత పుజింపదగింది. ఆమె యశస్విని. ఆమె శుకాలకే జన్మనిచ్చింది. (58,59)
నవ క్రోధవశా నారీః ప్రజజ్ఞే క్రోధసంభవాః ।
మృగీ చ మృగమందా చ హరీ భద్రమనా అపి ॥ 60
మాతంగీత్వథ శార్దూలీ శ్వేతా సురభిరేవ చ ।
సర్వలక్షణసంపన్నా సురసా చైవ భామినీ ॥ 61
క్రోధవశ క్రోధసంభవలైన మృగి, మృగమంద, హరి, భద్రమనస్విని, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సర్వలక్షణసంపన్నమైన సురస అనే తొమ్మండుగురు కూతుళ్ళకు జన్మనిచ్చింది. (60,61)
అపత్యం తు మృగాస్సర్వే మృగ్యా నరవరోత్తమ ।
ఋక్షాంశ్చ మృగమందయాః సృమరాశ్చ పరంతప ॥ 62
తతస్త్వైరావతం నాగం జజ్ఞే భద్రమనాః సుతమ్ ।
ఐరావతః సుతస్తస్యాః దేవనాగో మహాగజః ॥ 63
రాజా! మృగియొక్క సంతానం మృగాలు; మృగమంద సంతానం ఎలుగుబంట్లు, చమరీమృగాలు; భద్రమనస్విని ఐరావతమనే ఏనుగును కన్నది. అది దేవగజమైన ఐరావతంగా ప్రసిద్ధి పొందింది. (62,63)
హర్యాశ్చ హరయోఽపత్యం వానరాశ్చ తరస్వినః ।
గోలాంగూలాంశ్చ భద్రం తే హర్యాః పుత్రాన్ ప్రచక్షతే ॥ 64
ప్రజజ్ఞే త్వథ శార్దూలీ సింహాన్ వ్యాఘ్రా ననేకశః ।
ద్వీపినశ్చ మహాసత్త్వాన్ సర్వానేవ న సంశయః ॥ 65
రాజా! గుర్రాలు, వానరాలు, పెద్దతోకగల కోతులు, (కొండముచ్చులు), హరి యొక్క సంతానం; సింహాలు, అన్నిరకాల పులులూ మొదలయిన పెద్ద జంతువులన్నీ శార్దూలి యొక్క సంతానం. (64,65)
మాతంగ్యపి చ మాతంగాన్ అపత్యాని నరాధిప ।
దిశాం గజం తు శ్వేతాఖ్యం శ్వేతాజనయదాశుగమ్ ॥ 66
తథా దుహితరౌ రాజన్ సురభిర్వై వ్యజాయత ।
రోహిణీ చైవ భద్రం తే గంధర్వీ తు యశస్వినీ ॥ 67
ఏనుగులన్నీ మాతంగి సంతానం. తెల్లని దిగ్గజాలు శ్వేత యొక్క సంతానం. సురభికి రోహిణి, గంధర్వి అని ఇద్దరు కూతురులు. వారిలో గంధర్వి యశస్విని. (66,67)
విమలామపి భద్రం తే అనలామపి భారత ।
రోహిణ్యాం జజ్ఞిరే గావః గంధర్వ్యాం వాజినః సుతాః ।
సప్త పిండఫలాన్ వృక్షాన్ అనలాపి వ్యజాయత ॥ 68
రోహిణికి విమల, అనల అను ఇద్దరు కూతురులున్నారు. రోహిణి గోవులకు జన్మనిచ్చింది. గంధర్వి గుర్రాలకు జన్మనిచ్చింది. అనల పిండఫలాలు గల ఏడు వృక్షాలకు జన్మనిచ్చింది. (68)
వి: సం: 1) పిండఫలాలు ఏడు.
ఖర్జూర, తాల, హింతాలౌ, తాలీ ఖర్జూరికా తథా ।
గువాకా నారికేళశ్చ, సప్తపిండఫలా ద్రుమాః ॥
ఖర్జూరము, తాడి, హింతాలము, తాలి, ఖర్జూరిక, గువాకము, నారికేళము. ఈ ఏడు పిండ ఫలవృక్షాలు. (నీల)
2) పిండఫలాలు అనగా పనసచెట్లు మొదలగునవి అని (దేవ)
అనలాయాః శుకీ పుత్రీ కంకస్తు సురసాసుతః ।
అరుణస్య భార్యా శ్యేనీ తు వీర్యవంతౌ మహాబలౌ ॥ 69
సంపాతిం జనయామాస వీర్యవంతం జటాయుషమ్ ।
సురసాజనయన్నాగాన్ కద్రూః పుత్రాంస్తు పన్నగాన్ ॥ 70
ద్వౌ పుత్రౌ వినతాయాస్తు విఖ్యాతౌ గరుడారుణౌ ।
అనలకు శుకి అనే కూతురు ఉంది. సురసకు కంకపక్షి జన్మించింది. అరుణుని భార్య శ్యేని పరాక్రమవంతులు, మహాబలులు అయిన ఇద్దరు పుత్రులకు జన్మనిచ్చింది. వారిద్దరూ సంపాతి, జటాయువూను. సురస నాగాలకు, కద్రువ పన్నగాలకు జన్మనిచ్చారు. వితనకు గరుడుడు, అరుణుడు అని ఇద్దరు లోక విఖ్యాతులైన పుత్రులున్నారు. (69,70)
(సురసాజనయత్ సర్పాన్ శతమేకశిరోధరాన్ ।
సురసాకన్యకాజాతాః తిస్రః కమలలోచనాః ॥
వనస్పతీనాం వృక్షాణాం విరుధాం చైవ మాతరః ।
అనలా రుహా చ ద్వే ప్రోక్తే వీరుధాం చైవ మాతరః ।
అనలా రుహా చ ద్వే ప్రోక్తే వీరుధాం చైవ తాః స్మృతాః ॥
గృహ్ణంతి యే వినా పుష్పం ఫలాని తరవః పృథక్ ।
అనలాసుతాస్తే విజ్ఞేయాః తానేవాహుర్వనస్పతీన్ ॥
పుష్పైః ఫలగ్రహాన్ వృక్షాన్ రుహాయాః ప్రసవాన్ విభో ।
లతాగుల్మాని వల్ల్యశ్చ త్వక్సారతృణజాతయః ।
విరుధాయాః ప్రజాస్తాః స్యుః అత్ర వంశః సమాప్యతే ॥)
సురస ఒక శిరస్సు గల సర్పాలను నూరింటిని కన్నది. ముగ్గురు కన్యలకు జన్మనిచ్చింది. వారే వనస్పతులైన వృక్షాలకు, లతాగుల్మాలకు తల్లులు. వారికి అనల, రుహ, విరుధీములని పేర్లు. పువ్వులు లేకుండా పళ్లు కాసే వృక్షాలను వనస్పతులంటారు. అవన్నీ అనలయొక్క సంతానంగా భావించాలి. లతలు, గుల్మాలు, తీగలు, త్వక్సారంగల తృణాలు వీరుధ యొక్క సంతానంగా భావించాలి. ఇంతటితో వంశవర్ణన పూర్తయింది.
ఇత్యేష సర్వభూతానామ్ మహతాం మనుజాధిప ।
ప్రభవః కీర్తితః సమ్యక్ మయా మతిమతాం వర ॥ 71
యం శ్రుత్వా పురుషః సమ్యక్ ముక్తో భవతి పాప్మనః ।
సర్వజ్ఞతాం చ లభతే గతిమగ్య్రాం చ విందతి ॥ 72
నరాధిపా! ఈ విధంగా సర్వభూతాలయొక్క ఉత్పత్తి వివరించాను. దీన్ని విన్నవాడు పాపాల నుండి ముక్తుడౌతాడు. సర్వజ్ఞత్వాన్ని పొందుతాడు. ముందు ముందు ఉన్నత (స్థితిని) గతిని పొందుతాడు. (71,72)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి షట్ షష్టితమోఽధ్యాయః ॥ 66 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవ పర్వమను ఉపపర్వమున అరువది ఆరవ అధ్యాయము. (66)
(దాక్షిణాత్య అధికపాఠము 4 1/2 శ్లోకములు కలుపుకొని మొత్తం 76 1/2 శ్లోకాలు)