67. అరువది యేడవ అధ్యాయము

దేవతల, దైత్యుల అంశావతారముల వర్ణన.

జనమేజయ ఉవాచ
దేవానాం దానవానాం చ గంధర్వోరగరక్షసామ్ ।
సింహవ్యాఘ్రమృగాణాం చ పన్నగానాం పతత్త్రిణామ్ ॥ 1
సర్వేషాం చైవ భూతానాం సంభవం భగవన్నహమ్ ।
శ్రోతుమిచ్ఛామి తత్త్వేన మానుషీషు మహాత్మనామ్ ।
జన్మ కర్మ చ భూతానాం ఏతేషామనుపూర్వశః ॥ 2
జనమేజయుడిలా అన్నాడు. దేవతలు, దానవులు, గంధర్వులు, ఉరగాలు, రాక్షసులు, సింహవ్యాఘ్రమృగాలు, పన్నగాలు, పక్షులు మొదలయిన అన్ని ప్రాణుల పుట్టుకను, వారి కర్మలను, మనుష్యులలో మహాత్ముల జన్మకర్మలను యథార్థంగా ఆనుపూర్విగా వినాలనుకొంటున్నాను. (1,2)
వైశంపాయన ఉవాచ
మానుషేషు మనుష్యేంద్ర సంభూతా యే దివౌకసః ।
ప్రథమం దానవాంశ్చైవ తాంస్తే వక్ష్యామి సర్వశః ॥ 3
విప్రచిత్తిరితి ఖ్యాతః య ఆసీద్ దానవర్షభః ।
జరాసంధ ఇతి ఖ్యాతః స ఆస్మీన్మనుజర్షభః ॥ 4
దితేః పుత్రస్తు యో రాజన్ హిరణ్యకశిపుః స్మృతః ।
స జజ్ఞే మానుషే లోకే శిశుపాలో నరర్షభః ॥ 5
వైశంపాయనుడిలా చెప్పాడు - రాజా! మానవులలో పుట్టిన దేవతలను గురించి దానవుల గురించి ముందుగా చెప్తాను. విప్రచిత్తి అని ఒకానొక ప్రఖ్యాతమైన దానవరాజుండేవాడు. అతడు మానవులలో జరాసంధునిగ జన్మించి ప్రసిద్ధి పొందాడు. దితికుమారుడైన హిరణ్యకశిపుడు మానవులలో శిశుపాలునిగ జన్మించాడు. (3-5)
సంహాద్ర ఇతి విఖ్యాతః ప్రహ్రాదస్యానుజస్తు యః ।
స శల్య ఇతి విఖ్యాతః జజ్ఞే బాహ్లీకపుంగవః ॥ 6
అనుహ్రాదస్తు తేజస్వీ యోఽభూత్ ఖ్యాతో జఘన్యజః ।
ధృష్టకేతురితి ఖ్యాతః స బభూవ నరేశ్వరః ॥ 7
ప్రహ్రాదుని తమ్ముడు సంహ్రాదుడు బాహ్లికశ్రేష్ఠుడైన శల్యునిగా జన్మించాడు. ప్రహ్రాదుని మరొక తమ్ముడు తేజస్వి ఐన అనుహ్రాదుడు ధృష్టకేతువుగా జన్మించి రాజుగా ప్రసిద్ధి కెక్కాడు. (6,7)
యస్తు రాజన్ శిబిర్నామ దైతేయః పరికీర్తితః ।
ద్రుమ ఇత్యభివిఖ్యాతః స ఆసీద్ భువి పార్థివః ॥ 8
రాజా! దితి కుమారుడై ప్రసిద్ధుడయిన శిబి ఈ భూమిపై ద్రుముడనే రాజుగా విఖ్యాతి చెందాడు. (8)
బాష్కలో నామ యస్తేషామ్ ఆసీదసురసత్తమః ।
భగదత్త ఇతి ఖ్యాతః స జజ్ఞే పురుషర్షభః ॥ 9
అసురశ్రేష్ఠుడైన బాష్కలుడు భగదత్తుడనే రాజుగా జన్మించాడు. (9)
అయఃశిరా అశ్వశిరాః అయఃశంకుశ్చ వీర్యవాన్ ।
తథా గగనమూర్ధా చ వేగవాంశ్చాత్ర పంచమః ॥ 10
పంచైతే జజ్ఞిరే రాజన్ వీర్యవంతో మహాసురాః ।
కేకయేషు మహాత్మానః పార్థివర్షభాసత్తమాః ।
కేతుమానితి విఖ్యాతః యస్తతోఽన్యః ప్రతాపవాన్ ॥ 11
అమితౌజా ఇతి ఖ్యాతః సోగ్రకర్మా నరాధిపః ।
స్వర్భానురితి విఖ్యాతః శ్రీమాన్ యస్తు మహాసురః ॥ 12
ఉగ్రసేన ఇతి ఖ్యాతః ఉగ్రకర్మా నరాధిపః ।
యస్త్వశ్వ ఇతి విఖ్యాతః శ్రీమానాసీన్మహాసురః ॥ 13
అశోకో నామ రాజాభూత్ మహావీర్యో ఽపరాజితః ।
తస్మాదవరజో యస్తు రాజన్నశ్వపతిః స్మృతః ॥ 14
దైతేయః సో ఽభవద్ రాజా హార్దిక్యో మనుజర్షభః ।
వృషపర్వేతి విఖ్యాతః శ్రీమాన్ యస్తు మహాసురః ॥ 15
దీర్ఘప్రజ్ఞ ఇతి ఖ్యాతః పృథివ్యాం సోఽభవన్నృపః ।
అజకస్త్వవరో రాజన్ య ఆసీద్ వృషపర్వణః ॥ 16
స శాల్వ ఇతి విఖ్యాతః పృథివ్యామభవన్నృపః ।
అశ్వగ్రీవ ఇతి ఖ్యాతః సత్త్వవాన్ యో మహాసురః ॥ 17
రోచమాన ఇతి ఖ్యాతః పృథివ్యాం సోఽభవన్నృపః ।
సూక్ష్మస్తు మతిమాన్ రాజన్ కీర్తిమాన్ యః ప్రకీర్తితః ॥ 18
బృహద్రథ ఇతి ఖ్యాతః క్షితావాసీత్ స పార్థివః ।
తుహుండ ఇతి విఖ్యాతః య ఆసీదసురోత్తమః ॥ 19
సేనాబిందురితి ఖ్యాతః స బభూవ నరాధిపః ।
ఇషుపాన్నామ యస్తేషామ్ అసురాణాం బలాధికః ॥ 20
నగ్నజిన్నామ రాజాసీద్ భువి విఖ్యాతవిక్రమః ।
ఏకచక్ర ఇతి ఖ్యాతః ఆసీద్ యస్తు మహాసురః ॥ 21
ప్రతివింధ్య ఇతి ఖ్యాతః బభూవ ప్రథితః క్షితౌ ।
విరూపాక్షస్తు దైతేయః చిత్రయోధీ మహాసురః ॥ 22
చిత్రధర్మేతి విఖ్యాతః క్షితావాసీత్ స పార్థివః ।
హరస్త్వరిహరో వీర ఆసీద్ యో దానవోత్తమః ॥ 23
సుబాహురితి విఖ్యాతః శ్రీమానాసీత్ స పార్థివః ।
అహరస్తు మహాతేజాః శత్రుపక్షక్షయంకరః ॥ 24
బాహ్లీకో నామ రాజా స బభూవ ప్రథితః క్షితౌ ।
నిచంద్రశ్చంద్రవక్త్రస్తు య ఆసీదసురోత్తమః ॥ 25
ముంజకేశ ఇతి ఖ్యాతః శ్రీమానాసీత్ స పార్థివః ।
నికుంభస్త్వజితః సంఖ్యే మహామతిరజాయత ॥ 26
భూమౌ భూమిపతిః శ్రేష్ఠః దేవాధిప ఇతి స్మృతః ।
శరభో నామ యస్తేషాం దైతెయానాం మహాసురః ॥ 27
పౌరవో నామ రాజర్షిః స బభూవ నరోత్తమః ।
కుపటస్తు మహావీర్యః శ్రీమాన్ రాజన్ మహాసురః ॥ 28
సుపార్శ్వ ఇతి విఖ్యాతః క్షితౌ జజ్ఞే మహీపతిః ।
క్రథస్తు రాజన్ రాజర్షిః క్షితౌ జజ్ఞే మహాసురః ॥ 29
పార్వతీయ ఇతి ఖ్యాతః కాంచనాచలసంనిభః ।
ద్వితీయః శలభస్తేషామ్ అసురాణాం బభూవ హ ॥ 30
ప్రహ్రాదో నామ బాహ్లీకః స బభూవ నరాధిపః ।
చంద్రస్తు దితిజశ్రేష్ఠః లోకే తారాధిపోపమః ॥ 31
చంద్రవర్మేతి విఖ్యాతః కాంబోజానాం నరాధిపః ।
అర్క ఇత్యభివిఖ్యాతః యస్తు దానవపుంగవః ॥ 32
ఋషికో నామ రాజర్షిః బభూవ నృపసత్తమ ।
మృతపా ఇతి విఖ్యాతః య ఆసీదసురోత్తమః ॥ 33
పశ్చిమానూపకం విద్ధి తం నృపం నృపసత్తమ ।
గవిష్ఠస్తు మహాతేజాః యః ప్రఖ్యాతో మహాసురః ॥ 34
ద్రుమసేన ఇతి ఖ్యాతః పృథివ్యాం సోఽభవన్నృపః ।
మయూర ఇతి విఖ్యాతః శ్రీమాన్ యస్తు మహాసురః ॥ 35
న విశ్వ ఇతి విఖ్యాతః బభూవ పృధివీపతిః ।
సుపర్ణ ఇతి విఖ్యాతః తస్మాదవరజస్తు యః ॥ 36
కాలకీర్తిరితి ఖ్యాతః పృథివ్యాం సోఽభవన్నృపః ।
చంద్రహంతేతి యస్తేషాం కీర్తితః ప్రవరోఽసురః ॥ 37
శునకో నామ రాజర్షిః స బభూవ నరాధిపః ।
వినాశనస్తు చంద్రస్య య ఆఖ్యాతో మహాసురః ॥ 38
జానకిర్నామ విఖ్యాతః సోఽభవన్మనుజాధిపః ।
దీర్ఘజిహ్వస్తు కౌరవ్య య ఉక్తో దానవర్షభః ॥ 39
కాశిరాజః స విఖ్యాతః పృథివ్యాం పృథివీపతే ।
గ్రహం తు సుషువే యం తు సింహికార్కేందుమర్దనమ్ ।
సక్రాథ ఇతి విఖ్యాతః బభూవ మనుజాధిపః ॥ 40
అయఃశిరుడు, అశ్వశిరుడు, పరాక్రమవంతుడైన అయఃశంకువు, గగనమూర్ధుడు, వేగవంతుడు అనే ఐదుగురు మహాసురులు కేకయదేశంలో మహారాజులుగా జన్మించారు. కేతుమంతుడనే మహాసురుడు అమితౌజసుడనే మహారాజుగా జన్మించి క్రూరకర్మలు చేసేవాడు. స్వర్భానువుగా ప్రసిద్ధినొందిన మహాసురుడు ఉగ్రకర్ముడైన ఉగ్రసేనునిగా జన్మించాడు. అశ్వుడనే పేరు గల మహాసురుడు మహాబలవంతుడు, ఓటమిలేనివాడూ అయిన అశోకునిగా జన్మించాడు. అతని తమ్ముడైన అశ్వపతి హార్దిక్యుడనే రాజుగా జన్మించాడు. వృషపర్వుడనే మహాసురుడు భూమిపై దీర్ఘప్రజ్ఞుడనే రాజుగా జన్మించాడు. వృషపర్వుని తమ్ముడయిన అజకుడు భూమిపై సాల్వునిగా జన్మించాడు. అశ్వగ్రీవుడనే రాక్షసుడు రోచమానుడనే రాజుగా జన్మించాడు. కీర్తిమంతుడైన సూక్ష్ముడు బృహద్రథునిగా జన్మించాడు. తుహుండుడనే రాక్షసుడు సేనాబిందుడనే రాజుగా జన్మించాడు. అసురులలో బలాధికుడైన ఇషుపాదుడు భూమిపై పరాక్రమవంతుడైన నగ్నజిత్తు అనే రాజుగా జన్మించాడు. ఏకచక్రుడనే మహాసురుడు ప్రతివింధ్యుడనే రాజుగా జన్మించాడు. చిత్రయోధుడైన విరూపాక్షుడనే రాక్షసుడు చిత్రధర్ముడనే రాజుగా జన్మించాడు. శత్రుంజయుడైన హరుడనే దానవోత్తముడు సుబాహువనే రాజుగా జన్మించాడు. శత్రువిమర్దనుడు, తేజోవంతుడూ అయిన అహరుడనే రాక్షసుడు బాహ్లీకుడనే రాజుగా జన్మించాడు. చంద్రముఖుడైన నిచంద్రుడనే రాక్షసుడు ముంజకేశుడనే రాజుగా జన్మించాడు. యుద్ధంలో ఓటమి నెరుగని మహాబుద్ధిమంతుడైన నికుంభుడు దేవాధిపునిగ జన్మించాడు. దితికుమారులలో మహాసురుడైన శరభుడు రాజర్షి ఐన పౌరవునిగ జన్మించాడు. రాజా! మహాబలవంతుడు, మహాసురుడు అయిన కుపటుడు సుపార్శ్వుడనే రాజుగా జన్మించాడు. మహాసురుడైన క్రథుడు మేరుపర్వతంలా ప్రకాశించే పార్వతీయుడనే రాజర్షిగా జన్మించాడు. అసురులలో రెండవ శరభుడు బాహ్లీక వంశంలో ప్రహ్లాదుడనే రాజుగా జన్మించాడు. చంద్రుడితో సమానంగా ప్రకాశించే చంద్రుడనే దైత్యుడు కాంబోజదేశాలకు రాజైన చంద్రవర్మగా జన్మించాడు. దానవశ్రేష్ఠుడైన అర్కుడు ఋషికుడనే రాజుగా పుట్టాడు. గవిష్ఠుడనే మహాసురుడు ద్రుమసేనుడనే రాజుగా జన్మించాడు. మయూరుడనే రాక్షసుడు విశ్వుడనే రాజుగా పుట్టాడు. సుపర్ణుడనే రాక్షసుడు కాలకీర్తిగా భూమిపై పుట్టాడు. చంద్రహంత అనే రాక్షసుడు శునకుడనే రాజర్షిగా జన్మించాడు. చంద్ర వినాశకునిగ ప్రసిద్ధి చెందిన దైత్యుడు జానకి అని ప్రసిద్ధి పొందిన రాజుగా జన్మించాడు. దీర్ఘజిహ్వుడనే దానవశ్రేష్ఠుడు కాశిరాజుగా జన్మించాడు. సింహిక అనే రాక్షసి సూర్యచంద్రులను హింసించే గ్రహాన్ని కన్నది. అతడు క్రాథుడనే రాజుగా జన్మించాడు. (10-40)
దనాయుషస్తు పుత్రాణాం చతుర్ణాం ప్రవరోఽసురః ।
విక్షరో నామ తేజస్వీ వసుమిత్రో నృపః స్మృతః ॥ 41
దనాయువు యొక్క నలుగురు పుత్రులలో జ్యేష్ఠుడైన విక్షరుడనే రాక్షసుడు తేజస్వి ఐన వసుమిత్రుడనే రాజుగా జన్మించాడు. (41)
ద్వితీయో విక్షరాద్యస్తు నరాధిప మహాసురః ।
పాండ్యరాష్ట్రాధిప ఇతి విఖ్యాతః సోఽభవన్నృపః ॥ 42
నరాధిపా! విక్షరుని రెండవ తమ్ముడు బలుడనే మహాసురుడు పాండ్యదేశానికి ప్రఖ్యాతి చెందిన రాజుగా జన్మించాడు. (42)
బలీ వీర ఇతి ఖ్యాతః యస్త్వాసీదసురోత్తమః ।
పౌండ్ర మాత్స్యక ఇత్యేవం బభూవ స నరాధిపః ॥ 43
విక్షరుని మూడవ సోదరుడూ బలవంతుడూ అయిన వీరుడనే అసురోత్తముడు పౌండ్రకమాత్స్యకుడనే రాజుగా జన్మించాడు. (43)
వృత ఇత్యభివిఖ్యాతః యస్తు రాజన్ మహాసురః ।
మణిమాన్నామ రాజర్షిః స బభూవ నరాధిపః ॥ 44
వృత్రాసురుడని ప్రసిద్ధి పొందిన దానవ శ్రేష్ఠుడు మణిమంతుడనే రాజర్షిగా జన్మించాడు. (44)
క్రోధహంతేతి యస్తస్య బభూవావరజోఽసురః ।
దండ ఇత్యభివిఖ్యాతః స ఆసీన్నృపతిః క్షితౌ ॥ 45
క్రోధహంత అనే అసురుని చిన్న తమ్ముడు ఈ భూమిపై దండుడనే రాజుగా జన్మించాడు. (45)
క్రోధవర్ధన ఇత్యేవం యస్త్వన్యః పరికీర్తితః ।
దండధార ఇతి ఖ్యాతః సోఽభవన్మనుజర్షభః ॥ 46
క్రోధవర్ధనుడనే మరొక దైత్యుడు దండధారుడనే రాజుగా జన్మించాడు. (46)
కాలేయానాం తు యే పుత్రాః తేషామష్టౌ నరాధిపాః ।
జజ్ఞిరే రాజశార్దూల శార్దూలసమవిక్రమాః ॥ 47
కాలేయుడనే రాక్షసునికి కలిగిన ఎనమండుగురు కొడుకులు ఈ భూమిపై సింహవిక్రములైన రాజులుగా జన్మించారు. (47)
మగదేషు జయత్సేనః తేషామాసీత్ స పార్థివః ।
అష్టానాం ప్రవరస్తేషాం కాలేయానాం మహాసురః ॥ 48
కాలేయుని కొడుకులలో పెద్దవాడు మగధరాజైన జయత్సేనునిగ జన్మించాడు. (48)
ద్వితీయస్తు తతస్తేషాం శ్రీమాన్ హరిహయోపమః ।
అపరాజిత ఇత్యేవం స బభూవ నరాధిపః ॥ 49
వారిలో రెండవాడు ఇంద్రసమానుడు. అతడు అపరాజితుడనే రాజుగా జన్మించాడు. (49)
తృతీయస్తు మహాతేజాః మహామయో మహాసురః ।
నిషాదాధిపతిర్జజ్ఞే భువి భీమపరాక్రమః ॥ 50
మహాతేజస్వి, మహామాయకుడు, మహాసురుడూ అయిన మూడవవాడు భూమిపై భీమపరాక్రముడైన నిషాదరాజుగ జన్మించాడు. (50)
తేషామన్యతమో యస్తు చతుర్థః పరికీర్తితః ।
శ్రేణిమానితి విఖ్యాతః క్షితౌ రాజర్షిసత్తమః ॥ 51
వారిలో నాల్గవవాడు శ్రేణిమంతుడనే రాజుగా జన్మించాడు. (51)
పంచమస్త్యభవత్తేషాం ప్రవరో యో మహాసురః ।
మహౌజా ఇతి విఖ్యాతః బభూవేహ పరంతపః ॥ 52
మహౌజసునిగ ప్రసిద్ధి చెందిన ఐదవకుమారుడు ఈ భూమిపై శత్రువులను పీడించే మహౌజునిగా జన్మించాడు. (52)
షష్ఠస్తు మతిమాన్ యో వై తేషామాసీన్మహాసురః ।
అభీరురితి విఖ్యాతః క్షితౌ రాజర్షిసత్తమః ॥ 53
కాలేయులలో ఆరవవాడు ఈ భూమిపై అభీరుడను రాజర్షిశ్రేష్ఠునిగా విఖ్యాతుడయ్యాడు. (53)
సముద్రసేనస్తు నృపః తేషామేవాభవద్ గణాత్ ।
విశ్రుతః సాగరాంతాయాం క్షితౌ ధర్మార్థతత్త్వవిత్ ॥ 54
కాలేయులలో ఏడవవాడు సముద్రసేనుడనే రాజుగా పుట్టి ధర్మార్థాల తత్త్వాన్ని తెలిసిన వాడుగా ప్రసిద్ధి చెందాడు. (54)
బృహన్నామాష్టమస్తేషాం కాలేయానాం నరాధిప ।
బభూవ రాజా ధర్మాత్మా సర్వభూతహితే రతః ॥ 55
కాలేయులలో ఎనిమిదోవాడైన బృహత్తు అనేవాడు సర్వభూతాల హితాన్ని కోరే ధర్మాత్ముడైన రాజుగా జన్మించాడు. (55)
కుక్షిస్తు రాజన్ విఖ్యాతః దానవానాం మహాబలః ।
పార్వతీయ ఇతి ఖ్యాతః కాంచనాచలసంనిభః ॥ 56
దానవులలో మహాబలుడైన కుక్షి మేరుపర్వతంతో సమానంగా ప్రకాశించే పార్వతీయుడనే రాజుగా ఖ్యాతి చెందాడు. (56)
క్రథనశ్చ మహావీర్యః శ్రీమాన్ రాజా మహాసురః ।
సూర్యాక్ష ఇతి విఖ్యాతః క్షితౌ జజ్ఞే మహీపతిః ॥ 57
క్రథనుడనే మహాసురుడు సూర్యాక్షుడనే మహారాజుగా జన్మించాడు. (57)
అసురాణాం తు యః సూర్యః శ్రీమాంశ్చైవ మహాసురః ।
దరదో నామ బాహ్లీకః వరః సర్వమహీక్షితామ్ ॥ 58
అసురులలో గొప్పవాడైన సూర్యుడనేవాడు రాజులందరిలో శ్రేష్ఠుడైన దరదుడనే బాహ్లీకరాజుగా జన్మించాడు. (58)
గణః క్రోధవశో నామ యస్తే రాజన్ ప్రకీర్తితః ।
తతః సంజజ్ఞిరే విరాః క్షితావిహ నరాధిపాః ॥ 59
రాజా! క్రోధవశులనే రాక్షసగణం ఈ భూమిపై వీరులైన రాజులుగా జన్మించారు. (59)
మద్రకః కర్ణవేష్టశ్చ సిద్ధార్థః కీటకస్తథా ।
సువీరశ్చ సుబాహుశ్చ మహావీరోఽథ బాహ్లికః ॥ 60
క్రథో విచిత్రః సురథః శ్రీమాన్ నీలశ్చ భూమిపః ।
చీరవాసాశ్చ కౌరవ్యః భూమిపాలశ్చ నామతః ॥ 61
దంతవక్త్రశ్చ నామాసీద్ దుర్జయశ్చైవ దానవః ।
రుక్మీ చ నృపశార్దూలః రాజా చ జనమేజయః ॥ 62
ఆషాఢో వాయువేగశ్చ భూరితేజాస్తథైవ చ ।
ఏకలవ్యః సుమిత్రశ్చ వాటధానోఽథ గోముఖః ॥ 63
కారూషకాశ్చ రాజానః క్షేమధూరిస్తథైవ చ ।
శ్రుతాయురుద్వహశ్చైవ బృహత్సేనస్తథైవ చ ॥ 64
క్షేమోగ్రతీర్థః కుహరః కలింగేషు నరాధిపః ।
మతిమాంశ్చ మనుష్యేంద్రః ఈశ్వరశ్చేతి విశ్రుతః ॥ 65
మద్రకుడు, కర్ణవేష్టుడు, సిద్ధార్థుడు, కీటకుడు, సువీరుడు, సుబాహువు, మహావీరుడగు బాహ్లికుడు, క్రథుడు, విచిత్రుడు, సరథుడు, శ్రీమంతుడగు నీలుడు, చీరవాసుడు, కౌరవ్యుడు, భూమిపాలుడు, దంతవక్త్రుడు, దానవుడు, దుర్జయుడు, నృపశ్రేష్ఠుడగు రుక్మి, జనమేజయుడు, ఆషాఢుడు, వాయువేగుడు, భూరితేజుడు, ఏకలవ్యుడు సుమిత్రుడు, వాటధానుడు, గోముఖుడు, కారుషకరాజులు, క్షేమధూర్తి, శ్రుతాయువు, ఉద్వహుడు, బృహత్సేనుడు, క్షేముడు, ఉగ్రతీర్థుడు, కలింగరాజుయిన కుహురుడు, బుద్ధిమంతుడయిన ఈశ్వరుడనే ఈ రాజులందరును క్రోధవశులనే రాక్షసగుణంలోని వారే. (60-65)
గణాత్ క్రోధవశాదేషః రాజపూగోఽభవత్ క్షితౌ ।
జాతః పురా మహాభాగః మహాకీర్తిర్మహాబలః ॥ 66
ఈ రాజులందరు క్రోధవశులనే రాక్షసగణం వల్ల ఈ భూమిపై పుట్టినవారే. వీరందరు కీర్తి, సౌభాగ్యం, బలం కలవారు. (66)
కాలనేమిరితి ఖ్యాతః దానవానాం మహాబలః ।
స కంస ఇతి విఖ్యాతః ఉగ్రసేనసుతో బలీ ॥ 67
దానవులలో మహాబలుడైన కాలనేమి ఉగ్రసేనుని కొడుకు, బలబంతుడూ అయిన కంసునిగా జన్మించాడు. (67)
యస్త్వాసీద్ దేవకో నామ దేవరాజసమద్యుతిః ।
సగంధర్వపతిర్ముఖ్యః క్షితౌ జజ్ఞే నరాధిపః ॥ 68
దేవేంద్రునితో సమానమైన తేజస్సు గల దేవకుడనేవాడు ఈ భూమిపై గంధర్వరాజుగా జన్మించాడు. (68)
బృహస్పతేర్బృహత్కీర్తేః దేవర్షిర్విద్ధి భారత ।
అంశాద్ ద్రోణం సముత్పన్నం భారద్వాజమయోనిజమ్ ॥ 69
భారతా! గొప్పకీర్తి గల దేవర్షి ఐన బృహస్పతి అంశతో అయోనిజుడు, భరద్వాజనందనుడు అయిన ద్రోణుడు జన్మించాడు. (69)
ధన్వినాం నృపశార్దూల! యః సర్వాస్త్రవిదుత్తమః ।
మహాకీర్తిర్మహాతేజాః స జజ్ఞే మనుజేశ్వర ॥ 70
రాజా! ఆ ద్రోణుడు ధనుర్ధారులలో ఉత్తముడు. సర్వశాస్త్రాలూ తెలిసినవాడు. మహాకీర్తిమంతుడు గొప్పతేజస్సు కలవాడు. (70)
ధనుర్వేదే చ వేదే చ యం తం వేదవిదో విదుః ।
వరిష్ఠం చిత్రకర్మాణం ద్రోణం స్వకులవర్ధనమ్ ॥ 71
వేదంలోను, ధనుర్వేదంలోను నిష్ణాతుడు. చిత్రకర్మలు చేసే వరిష్ఠుడు, తన కుల మర్యాదలను పాటిస్తూ వర్ధిల్లిజేసినవాడు. (71)
మహాదేవాంతకాభ్యాం చ కామాత్ క్రోధాచ్చ భారత ।
ఏకత్వముపపన్నానాం జజ్ఞే శూరః పరంతపః ॥ 72
అశ్వత్థామా మహావీర్యః శత్రుపక్షభయావహః ।
వీరః కమలపత్రాక్షః క్షితావాసీన్నరాధిప ॥ 73
మహాదేవుడైన శివుడు, యముడు, కామక్రోధాలు కలగలసి ఒక్కటైన అంశతో అశ్వత్థామ ఈ భూమిపై పుట్టాడు. అతడు మహాబలవంతుడు. శత్రుపక్షాలకు భయంకరుడు, వీరుడు, పద్మపత్రాల వంటి విశాలమైన కన్నులు కలవాడు. (72,73)
జజ్ఞిరే వసవస్త్వష్టౌ గంగాయాం శాంతనోః సుతాః ।
వసిష్ఠస్య చ శాపేన నొయోగాద్ వాసవస్య చ ॥ 74
వసిష్ఠమహర్షి శాపంచేత, ఇంద్రుని ఆదేశం వల్ల అష్టవసువులు గంగాగర్భంలో శాంతనుమహారాజుకు పుత్రులుగా జన్మించారు. (74)
తేషామవరజో భీష్మః కురూణామభయంకరః ।
మతిమాన్ వేదవిద్ వాగ్మీ శత్రుపక్షక్షయంకరః ॥ 75
వారిలో చిన్నవాడు భీష్ముడు. అతడు కురువంశీయులందరికీ అభయమిచ్చినవాడు, బుద్ధిమంతుడు, వేదవేత్త, మాటనేర్పరి, శత్రుపక్షాలను నాశనం చేయగలవాడు. (75)
జామదగ్న్యేన రామేణ సర్వాస్త్రవిదుషాం వరః ।
యోఽయుధ్యత మహాతేజాః భార్గవేణ మహాత్మనా ॥ 76
సర్వాస్త్ర పండితులలో శ్రేష్ఠుడు, తేజస్వి అయిన భీష్ముడు భృగువంశీయుడూ జమదగ్ని కుమారుడూ అయిన పరశురామునితో యుద్ధం చేసిన మహావీరుడు. (76)
యస్తు రాజన్ కృపో నామ బ్రహ్మర్షిరభవత్ క్షితౌ ।
రుద్రాణాం తు గుణాద్ విద్ధి సంభూతమతిపౌరుషమ్ ॥ 77
రాజా! మిక్కిలి పౌరుషం కల బ్రహ్మర్షి అయిన కృపుడు రుద్రగణాల అంశతో జన్మించాడని తెలుసుకో. (77)
శకునిర్నామ యస్త్వాసీద్ రాజా లోకే మహారథః ।
ద్వాపరం విద్ధి తం రాజన్ సంభూతమరిమర్దనమ్ ॥ 78
మహారథుడు, శత్రుమర్దనుడూ అయిన శకుని ద్వాపరాంశతో జన్మించాడని గ్రహించు. (78)
సాత్యకిః సత్యసంధశ్చ యోఽసౌ వృష్ణికులోద్వహః ।
పక్షాత్ స జజ్ఞే మరుతాం దేవానామరిమర్దనః ॥ 79
వాయుదేవతల అంశతో సత్యసంధుడు, శత్రుమర్దనుడూ అయిన సాత్యకి వృష్ణికులంలో జన్మించాడు. (79)
ద్రుపదశ్చైవ రాజర్షిః తత ఏవాభవత్ గణాత్ ।
మానుషే నృప లోకేఽస్మిన్ సర్వశస్త్రభృతాం వరః ॥ 80
రాజా! మరుద్గణాల అంశతోనే శస్త్రధారులలో శ్రేష్ఠుడైన రాజర్షి ద్రుపదుడు జన్మించాడు. (80)
తతశ్చ కృతవర్మాణం విద్ధి రాజన్ జనాధిపమ్ ।
తమప్రతిమకర్మాణం క్షత్రియర్షభసత్తమమ్ ॥ 81
మరుద్గణాలనుండే అసమాన కర్మనిష్ఠుడు, క్షత్రియశ్రేష్ఠుడు అయిన కృతవర్మ జన్మించాడు. (81)
మరుతాం తు గణాద్ విద్ధి సంజాతమరిమర్దనమ్ ।
విరాటం నామ రాజానం పరరాష్ట్రప్రతాపనమ్ ॥ 82
శత్రుమర్దనుడు, శత్రురాజ్యాలకు ఉడుకెక్కించేవాడూ అయిన విరాటరాజు కూడ మరుద్గణాల అంశతో జన్మించినవాడే. (82)
అరిష్టాయాస్తు యః పుత్రః హంస ఇత్యభివిశ్రుతః ।
స గంధర్వపతిర్జజ్ఞే కురువంశవివర్ధనః ॥ 83
ధృతరాష్ట్ర ఇతి ఖ్యాతః కృష్ణద్వైపాయనాత్మజః ।
దీర్ఘబాహుర్మహాతేజాః ప్రజ్ఞాచక్షుర్నరాధిపః ॥ 84
మాతుర్దోషాదృషేః కోపాత్ అంధ ఏవ వ్యజాయత ।
అరిష్ట కుమారుడైన హంసుడు అను గంధర్వరాజు కురువంశ ప్రవర్ధకుడు. కృష్ణద్వైపాయనుని కుమారుడయిన ధృతరాష్ట్రునిగా జన్మించాడు. దీర్ఘబాహువు, మహాతేజస్వి, ప్రజ్ఞాచక్షువు (అంధుడు) అయిన ఆ రాజు మాతృదోషం వల్ల ఋషికోపం వల్ల అంధునిగా జన్మించాడు. (83,84 1/2)
తస్యైవావరజో భ్రాతా మహాసత్త్వో మహాబలః ॥ 85
స పాండురితి విఖ్యాతః సత్యధర్మరతః శుచిః ।
అత్రేస్తు సుమహాభాగం పుత్రం పుత్రవతాం వరమ్ ।
విదురం విద్ధి తం లోకే జాతం బుద్ధిమతామ్ వరమ్ ॥ 86
పాండురాజుగా ఖ్యాతిపొందిన అతని తమ్ముడు మరుద్గణాల అంశతోనే పుట్టాడు. అతడు మహాశక్తిశాలి, మహాబలుడు, సత్యం పట్ల, ధర్మం పట్ల దీక్ష గలవాడు. అత్రిమహర్షి కుమారుడు, పుత్రవంతులలో శ్రేష్ఠుడూ అయిన ధర్ముని యొక్క అంశతో విదురుడు జన్మించాడు. (85,86)
కలేరంశస్తు సంజజ్ఞే భువ్ దుర్యోధనో నృపః ।
దుర్బుద్ధిర్దుర్మతిశ్చైవ కురూణామయశస్కరః ॥ 87
దుర్బుద్ధి, దుర్మతి, కురువంశీయుల అపకీర్తి కారకుడు అయిన దుర్యోధనుడు కలియొక్క అంశతో జన్మించాడు. (87)
జగతో యస్తు సర్వస్య విద్విష్టః కలిపూరుషః ।
యః సర్వాం ఘాతయామాస పృథివీం పృథివీపతే ॥ 88
భూమండలాన్నంతా హింసించిన దుర్యోధనుని వల్ల లోకాని కంతటికి కలిపురుషుడు ద్వేషింపదగిన వాడయ్యాడు. (88)
ఉద్దీపితం యేన వైరం భూతాంతకరణం మహత్ ।
పౌలస్త్యా భ్రాతరశ్చాస్య జజ్ఞిరే మనుజేష్విహ ॥ 89
ఆ దుర్యోధనుడు ప్రాణులవినాశకారకమైన మహావైరాన్ని ప్రేరేపించాడు. పులస్త్యవంశానికి చెందిన రాక్షసులు దుర్యోధనునికి తమ్ముళ్లుగా జన్మించారు. (89)
శతం దుఃశాసనాదీనాం సర్వేషాం క్రూరకర్మణామ్ ।
దుర్ముఖో దుఃసహశ్పైవ యే చాన్యే నానుకీర్తితాః ॥ 90
దుర్యోధనసహాయాస్తే పౌలస్త్యా భరతర్షభ ।
వైశ్యాపుత్రో యుయుత్సుశ్చ ధార్తరాష్ట్రః శతాధికః ॥ 91
క్రూరమైన పనులుచేసే దుఃశాసనుడు, దుర్ముఖుడు, దుఃసహుడు మున్నగు నూరుగురు పులస్త్య వంశీయులైన రాక్షసులే దుర్యోదనునికి తోడుగా ఉన్నారు. ధృతరాష్ట్రునికి వైశ్యస్త్రీయందు పుట్టిన యుయుత్సుడు నూటొకటోవాడు. (90,91)
జనమేజయ ఉవాచ
జ్యేష్ఠాజ్యేష్ఠతామేషాం నామధేయాని వా విభో ।
ధృతరాష్ట్రస్య పుత్రాణామ్ ఆనుపూర్వ్యేణ కీర్తయ ॥ 92
జనమేజయుడిలా అన్నాడు - ప్రభూ! ధృతరాష్ట్రుని నూరుగురు పుత్రులపేళ్ళను జ్యేష్ఠక్రమంలో చెప్పవలసింది. (92)
వైశంపాయన ఉవాచ
దుర్యోధనో యుయుత్సుశ్చ రాజన్ దుఃశాసనస్తథా ।
దుఃసహో దుఃశలశ్పైవ దుర్ముఖశ్చ తథాపరః ॥ 93
వివింశితి ర్వికర్ణశ్చ జలసంధః సులోచనః ।
విందానువిందౌ దుర్ధర్షః సుబాహుర్దుష్ప్రధర్షణః ॥ 94
దుర్మర్షణో దుర్ముఖశ్చ దుష్కర్ణః కర్ణ ఏవ చ ।
చిత్రోపచిత్రౌ చిత్రాక్షః చారుశ్చిత్రాంగదశ్చ హ ॥ 95
దుర్మదో దుష్ప్రధర్షశ్చ వివిత్సుర్వికటః సమః ।
ఊర్ణనాభః పద్మనాభః తథా నందోపనందకౌ ॥ 96
సేనాపతిః సుషేణశ్చ కుండోదరమహోదరౌ ।
చిత్రబాహుశ్చిత్రవర్మా సువర్మా దుర్విరోచనః ॥ 97
అయోబాహుర్మహాబాహుః చిత్రచాపసుకుండలౌ ।
భీమవేగో భీమబలః బలాకీ భీమవిక్రమౌ ॥ 98
ఉగ్రాయుధో భీమశరః కనకాయుర్దృఢాయుధః ।
దృఢవర్మా దృఢక్షత్రః సోమకీర్తిరనూదరః ॥ 99
జరాసంధో దృఢసంధః సత్యసంధః సహస్రవాక్ ।
ఉగ్రశ్రవా ఉగ్రసేనః క్షేమమూర్తిస్తథైవ చ ॥ 100
అపరాజితః పండితకః విశాలాక్షో దురాధనః ॥ 101
దృఢహస్తః సుహస్తశ్చ వాతవేగసువర్చసౌ ।
ఆదిత్యకేతుర్బహ్వాశీ నాగదత్తానుయాయినౌ ॥ 102
కవచీ నిషంగీ దండీ దండధారో ధనుర్గ్రహః ।
ఉగ్రో భీమరథో వీరః వీరబాహురలోలుపః ॥ 103
అభయో రౌద్రకర్మా చ తథా దృఢరథశ్చ యః ।
అనాధృష్యః కుండభేదీ విరావీ దీర్ఘలోచనః ॥ 104
దీర్ఘబాహుర్మహాబాహుః వ్యూఢోరుః కనకాంగదః ।
కుండజశ్చిత్రకశ్పైవ దుఃశలా చ శతాధికా ॥ 105
అపుడు వైశంపాయనుడిలా చెప్పాడు - 1. దుర్యోధనుడు, 2. యుయుత్సుడు, 3. దుఃశాసనుడు, 4. దుఃషుడు, 5. దుఃశలుడు, 6. దుర్ముఖుడు, 7. వివింశతి, 8. వికర్ణుడు, 9. జలసంధుడు, 10. సులోచనుడు, 11. విందుడు, 12. అనువిందుడు, 13. దుర్ధర్షుడు, 14. సుబాహువు, 15. దుష్ప్రధర్షణుడు, 16. దుర్మర్షణుడు, 17. దుర్ముఖుడు, 18. దుష్కర్ణుడు, 19. కర్ణుడు, 20. చిత్రుడు, 21. ఉపచిత్రుడు, 22. చిత్రాక్షుడు, 23. చారుడు, 24. చిత్రాంగదుడు, 25. దుర్మదుడు, 26. దుష్ప్రదర్షుడు, 27. వినిత్సుడు, 28. వికటుడు, 29. సముడు, 30. ఊర్ణనాభుడు, 31. పద్మనాభుడు, 32. నందుడు, 33. ఉపనందుడు, 34. సేనాపతి, 35. సుషేణుడు, 36. కుండోదరుడు, 37. మహోదరుడు, 38. చిత్రబాహువు. 39. చిత్రవర్మ, 40. సువర్మ, 41. దుర్విరోచనుడు, 42. అయోబాహువు, 43. మహాబాహువు, 44. చిత్రచాపుడు, 45. సుకుండలుడు, 46. భీమవేగుడు, 47. భీమబలుడు, 48. బలాకి, 49. భీముడు, 50. విక్రముడు, 51. ఉగ్రాయధుడు, 52. భీమశరుడు, 53. కనకాయువు, 54. దృఢాయుధుడు, 55. దృఢవర్మ, 56. దృఢక్షత్రుడు 57. సోమకీర్తి, 58. అనూదరుడు, 59. జరాసంధుడు, 60. దృఢసంధుడు, 61. సత్యసంధుడు, 62. సహస్రవాక్కు, 63. ఉగ్రశ్రవుడు, 64. ఉగ్రసేనుడు, 65. క్షేమమూర్తి, 66. అపరాజితుడు, 67. పండితకుడు, 68. విశాలాక్షుడు, 69. దురాధనుడు, 70. దృఢహస్తుడు, 71. సుహస్తుడు, 72. వాతవేగుడు, 73. సువర్చసుడు, 74. ఆదిత్యకేతువు, 75. బహ్వాశి, 76. నాగదత్తుడు, 77. అనుయాయి, 78. కవచి, 79. నిషంగి, 80. దండి, 81. దండధారుడు, 82. ధనుర్గ్రహుడు, 83. ఉగ్రుడు, 84. భీమరథుడు, 85. వీరుడు, 86. వీరబాహువు, 87. అలోలుపుడు, 88. అభయుడు, 89. రౌద్రకర్ముడు, 90. దృఢరథుడు, 91. అనాధృష్యుడు, 92. కుండభేది, 93. విరావి, 94. దీర్ఘలోచనుడు, 95. దీర్ఘబాహువు, 96. మహాబాహువు, 97. వ్యూఢోరువు, 98. కనకాంగదుడు, 99. కుండజుడు, 100. చిత్రకుడు అని నూరుగురు కుమారులు. దుశ్శల కూతురు. (93-105)
వైశ్యోపుత్రో యుయుత్సుశ్చ ధార్తరాష్ట్రః శతాధికః ।
ఏతదేకశతం రాజన్ కన్యా చైకా ప్రకీర్తితా ॥ 106
ధృతరాష్ట్రునికి వైశ్యస్త్రీయందు కలిగిన యుయుత్సుడు నూటొకటవ కుమారుడు. వీరుకాక ఒక కూతురు కూడ ఉంది. (106)
నామధేయామపూర్వ్యా చ జ్యేష్ఠానుజ్యేష్ఠతాం విదుః ।
సర్వే త్వతిరథాః శూరాః సర్వే యుద్ధవిశారధాః ॥ 107
జ్యేష్ఠానుపూర్విగా ధార్తరాష్ట్రుల పేర్లు అన్నీ తెలిసినవి కదా! వీరందరూ అతిరథులు, శూరులు, యుద్ధవిశారదులూను. (107)
సర్వే వేదవిదశ్పైవ రాజన్ శాస్త్రే చ పారగాః ।
సర్వే సంగ్రామవిద్యాసు విద్యాభిజనశోభినః ॥ 108
రాజా! వీరందరూ వేదవిదులు, శాస్త్రకోవిదులు, సంగ్రామవిద్యలో ప్రవీణులు. విద్యచేత, వంశంచేత విరాజిల్లుతున్నవారు. (108)
సర్వేషామనురూపాశ్చ కృతా దారా మహీపతే ।
దుఃశలాం సమయే రాజన్ సింధురాజాయ కౌరవః ॥ 109
జయద్రథాయ ప్రదదౌ సౌబలానుమతే తదా ।
ధర్మస్యాంశం తు రాజానం విద్ధి రాజన్ యుధిష్ఠిరమ్ ॥ 110
రాజా! వారందరికి తగిన భార్యలు వచ్చారు. దుఃస్సలను శకుని సలహాపై సింధురాజయిన జయద్రథునికిచ్చి వివాహం చేశారు. ధర్మం యొక్క అంశతో పుట్టినవాడు యుధిష్ఠిరుడు. (109,110)
భీమసేనం తు వాతస్య దేవరాజస్య చార్జునమ్ ।
అశ్వినోస్తు తథైవాంశః రూపేణాప్రతిమౌ భువి ॥ 111
నకులః సహదేవశ్చ సర్వభూతమనోహరౌ ।
యస్తు వర్చా ఇతి ఖ్యాతః సోమపుత్రః ప్రతాపవాన్ ॥ 112
సోఽభిమన్యుర్బృహత్కీర్తేః అర్జునస్య సుతోఽభవత్ ।
యస్యావతరణే రాజన్ సురాన్ సోమోఽబ్రవీదిదమ్ ॥ 113
వాయువు అంశతో భీమసేనుడు, దేవేంద్రుని అంశతో అర్జునుడు, అశ్వినీదేవతల అంశతో సర్వభూతమనోహరులైన నకులసహదేవులు జన్మించారు. చంద్రుని కుమారుడైన వర్చసుడు అర్జునుని పుత్రుడైన అభిమన్యునిగా జన్మించాడు. అతడు అవతరించే సమయంలో చంద్రుడు దేవతలతో ఇలా చెప్పాడు. (111-113)
నాహం దద్యాం ప్రియం పుత్రం మమ ప్రాణైర్గరీయపమ్ ।
సమయః క్రియతామేష న శక్యమతివర్తితుమ్ ॥ 114
నాప్రాణాలకంటె మిక్కిలి ప్రియమైన నాకుమారుని నేనివ్వను. అందువల్ల ఒక ఒప్పందం చేయండి. దాన్ని అతిక్రమించడానికి వీలులేదు. (114)
సురకార్యం హి నః కార్యమ్ అసురాణాం క్షితౌ వధః ।
తత్ర యాస్యత్యయం వర్చాః న చ స్థాస్యతి వై చిరమ్ ॥ 115
భూమిపై రాక్షసులను సంహరించడమనే దేవతల కార్యం మన కార్యమే. అందువల్ల అక్కడికి వర్చసుడు వెళ్తున్నాడు. కాని ఎంతోకాలం ఉండడు. (115)
ఐంద్రిర్నరస్తు భవితా యస్య నారాయణః సఖా ।
సోఽర్జునేత్యభివిఖ్యాతః పాండోః పుత్రః ప్రతాపవాన్ ॥ 116
ఇంద్రునికొడుకు పాండురాజు కుమారులలో ప్రతాపవంతుడైన అర్జునుడిగా విఖ్యాతుడు, నారాయణుని మిత్రుడుగా జన్మించాడు. (116)
తస్యాయం భవితా పుత్రః బాలో భువి మహారథః ।
తతః షోడశ వర్షాణి స్థాప్యత్యమరసత్తమాః ॥ 117
అటువంటి అర్జునుడికి కొడుకుగా ఈ వర్చసుడు జన్మిస్తాడు. బాలుడుగానే మహారథునిగ గుర్తింపబడతాడు. పదహారు సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటాడు. (117)
అస్య షోడశవర్షస్య స సంగ్రామో భవిష్యతి ।
యత్రాంశాః వః కరిష్యంతి కర్మ వీరనిషూదనమ్ ॥ 118
ఇతనికి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్ధంలో వీరులంతా శత్రువీరవినాశనాన్ని చేస్తారు. (118)
నరనారాయణాభ్యాం తు స సంగ్రామో వినా కృతః ।
చక్రవ్యూహం సమాస్థాయ యోధయిష్యంతి వః సురాః ॥ 119
విముఖాన్ శాత్రవాన్ సర్వాన్ కారయిష్యతి మే సుతః ।
బాలః ప్రవిశ్య చ వ్యూహమ్ అభేద్యం విచరిష్యతి ॥ 120
ఒకనాడు నరనారాయణులులేని సమయంలో శత్రువీరులు చక్రవ్యూహం రచించి దేవతలతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో బాలుడైన నా కుమారుడు అభేద్యమైన చక్రవ్యూహంలో ప్రవేశించి నిర్భయంగా విహరించి శత్రుసంహారం చేస్తాడు. (119,120)
మహారథానాం వీరాణాం కదనం చ కరిష్యతి ।
సర్వేషామేవ శత్రూణాం చతుర్థాంశం నయిష్యతి ॥ 121
దినార్ధేన మహాబాహుః ప్రేతరాజపురం ప్రతి ।
తతో మహారథైర్వీరైః సమేత్య బహుశో రణే ॥ 122
దినక్షయే మహాబాహుః మయా భూయః సమేష్యతి ।
ఏకం వంశకరం పుత్రం వీరం వై జనయిష్యతి ॥ 123
ప్రణష్టం భారతం వంశం స భూయో ధారయిష్యతి ।
ఏతత్ సోమవచః శ్రుత్వా తథాస్త్వితి దివౌకసః ॥ 124
ప్రత్యూచుః సహితాః సర్వే తారాధిసమపూజయన్ ।
ఏవం తే కథితం రాజన్ తవ జన్మ పితుః పితుః ॥ 125
మహారథులైన వీరులతో యుద్ధం చేస్తాడు. పగలు సగం గడిచేసరికి నాల్గవవంతు శత్రువీరులను యమపురికి పంపుతాడు. ఆపై యుద్ధంలో మహారథులైన వీరులతో పాటుగా సాయంకాలానికి నన్ను చేరుకొంటాడు. అతనికి వంశకారకుడైన ఒక కుమారుడు కలుగుతాడు. అతడే నశించి నటువంటి భారతవంశాన్ని మళ్లీ ఉద్ధరిస్తాడు. చంద్రుని ఈ మాటలు విని దేవతలు 'తథాస్తు' అని పలికి చంద్రుని పూజించారు. రాజా! ఈ విధంగా నీయొక్క, నీ తండ్రులయొక్క, వారి తండ్రులయొక్క జన్మవృత్తాంతం చెప్పాను. (121-125)
అగ్నీర్భాగం తు విద్ధి త్వం ధృష్టద్యుమ్నం మహారథమ్ ।
శిఖండినమథో రాజన్ స్త్రీపూర్వం విధ్ధి రాక్షసమ్ ॥ 126
మహారథుడైన ధృష్టద్యుమ్నుడు అగ్నియొక్క అంశగా తెలుసుకో. శిఖండి రాక్షసుని అంశతో పుట్టినవాడు. మొదట స్త్రీగా జన్మించి తరువాత పురుషరూపాన్ని పొందినవాడు. (126)
ద్రౌపదేయాశ్చ యే పంచ బభూవుర్బరతర్షభ ।
విశ్వాన్ దేవగణాన్ విద్ధి సంజాతాన్ భరతర్షభ ॥ 127
ద్రౌపదికి కల్గిన అయిదుగురు కుమారులను విశ్వేదేవులుగా గ్రహించు. (127)
ప్రతివింధ్యః సుతసోమః శ్రుతకీర్తి స్తథాపరః ।
నాకులిస్తు శతానీకః శ్రుతసేనశ్చ వీర్యవాన్ ॥ 128
ప్రతివింధ్యుడు, సుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు - అ ఐదుగురు ద్రౌపదికుమారులు. (128)
శూరో నామ యదుశ్రేష్ఠః వసుదేవపితాఽభవత్ ।
తస్య కన్యా పృథా నామ రూపేణాఽసదృశీ భువి ॥ 129
వసుదేవుని తండ్రి శూరసేనుడు యదుకులశ్రేష్ఠుడు. అతనికి అసమాన సౌందర్యవతి ఐన కూతురుంది. ఆమె పేరు పృథ. (129)
పితుః స్వప్రీయపుత్రాయ సోఽనపత్యాయ వీర్యవాన్ ।
అగ్రమగ్రే ప్రతిజ్ఞాయ స్వస్యాపత్యస్య వై తదా ॥ 130
శూరసేనుడు తన తండ్రి ఉగ్రసేనుని సోదరి కుమారుని కుమారుడు. సంతానంలేని వాడగుటవల్ల తన మొదటి సంతానాన్ని అతనికిస్తానని ముందుగా మాటిచ్చాడు. (130)
అగ్రజేతి తాం కన్యాం శూరోఽనుగ్రహకాంక్షయా ।
అదదాత్ కుంతిభోజాయ స తాం దుహితరం తదా ॥ 131
శూరసేనుడు తన పెద్దకూతురయిన పృథను తన మాట ప్రకారం కుంతిభోజునకు అనుగ్రహించే తలంపుతో ఇచ్చాడు. (131)
సా నియుక్తా పితుర్గేహే బ్రాహ్మణాతిథిపూజనే ।
ఉగ్రం పర్యచరద్ ఘోరం బ్రాహ్మణం సంశితవ్రతమ్ ॥ 132
నిగూఢనిశ్చయం ధర్మే యం తం దుర్వాసనం విదుః ।
తముగ్రం శంసితాత్మానం సర్వయత్నైరతోషయత్ ॥ 133
ఆమె తండ్రియింట బ్రాహ్మణులను అతిథులను పూజించటానికి నియోగింపబడింది. ఆమె ఒకసారి దుర్వాసమహర్షిని సేవించింది. అతడు కోపిష్ఠి. కఠోరనియమాలు కలవాడు. ధర్మమందు నిగూఢ నిశ్చయం కలవాడు. కఠినుడు. ఆమె సర్వప్రయత్నాలతోను అతనిని సంతోషపెట్టింది. (132,133)
తుష్టోఽభిచారసంయుక్తమ్ ఆచచక్షే యథావిధి ।
ఉవాచ చైనాం భగవాన్ ప్రీతోఽస్మి సుభగే తవ ॥ 134
ఆమె సేవలచే సంతుష్టుడైన దుర్వాసుడు యథావిధిగ ప్రయోగవిధానంతో పాటు మంత్రోపదేశం చేశాడు. తరువాత ఇలా చెప్పాడు - "సుందరీ! నీపట్ల సంతుష్టుడనయ్యాను. (134)
యం యం దేవం త్వమేతేన మంత్రేణావాహయిష్యతి ।
తస్య తస్య ప్రసాదాత్ త్వం దేవి పుత్రాన్ జనయిష్యసి ॥ 135
ఈ మంత్రంచే నీవు ఏ దేవుని ఆహ్వానిస్తే ఆ దేవుని యొక్క అనుగ్రహం వల్ల నీవు పుత్రులను కంటావు.' (135)
ఏవముక్తా చ సా బాలా తదా కౌతూహలాన్వితా ।
కన్యా సతీ దేవమర్కమ్ ఆజుహావ యశస్వినీ ॥ 136
ఋషి అలా చెప్పగానే, అమాయకురాలైన ఆమె కుతూహలంతో సూర్యభగవానుని ఆహ్వానించింది. (136)
ప్రకాశకర్తా భగవాన్ తస్యాం గర్భం దధౌ తదా ।
అజీజనత్ సుతం చాస్యాం సర్వశస్త్రభృతాం వరమ్ ॥ 137
లోక ప్రకాశకుడైన సూర్యునివల్ల ఆమె గర్భం ధరించింది. ఆమె శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడైన ఒక కుమారుని ప్రసవించింది. (137)
సకుండలం సకవచం దేవగర్భశ్రియాన్వితమ్ ।
దివాకరసమం దీప్త్యా చారుసర్వాంగభూషితమ్ ॥ 138
కవచకుండలాలతో, దివ్యమైన కాంతితో సూర్యునితో సమంగా ప్రకాశిస్తూ అందమైన శరీరసౌష్ఠవంతో ఉన్న కొడుకును కన్నది. (138)
నిగూహమానా జాతం వై బంధుపక్షభయాత్తదా ।
ఉత్ససర్జ జలే కుంతీ తం కుమారం యశస్వినమ్ ॥ 139
అతనిని రహస్యంగా దాచి ఉంచి బంధుజనులకు భయపడి యశస్వి అయిన ఆ కుమారుని కుంతి నీటిలో విడిచిపెట్టింది. (139)
తముత్సృష్టం జలే గర్భం రాధాభర్తా మహాయశాః ।
రాధాయాః కల్పయామాస పుత్రం సోఽతిరథస్తదా ॥ 140
అలా వదిలిన ఆ పసికందును మహాయశస్వి అతిరథుడూ అయిన రాధ భర్త తీసికొని రాధకు కొడుకుగా కల్పించాడు. (140)
చక్రతుర్నామధేయం చ తస్య బాలస్య తావుభౌ ।
దంపతీ వసుషేణేతి దిక్షు సర్వాసు విశ్రుతమ్ ॥ 141
ఆ బాలుడికి ఆ దంపతులు వసుషేణుడు అని పేరు పెట్టారు. ఆ పేరు అంతటా వ్యాపించింది. (141)
సంవర్ధమానో బలవాన్ సర్వాస్త్రేషూత్తమోఽభవత్ ।
వేదాంగాని చ సర్వాణి జజాప జయతాం వరః ॥ 142
వారి పెంపకంలో వసుషేణుడు అన్ని అస్త్రవిద్యల్లోను ఉత్తముడుగా అయ్యాడు. జయశీలులలో శ్రేష్ఠుడైన అతడు వేదాంగాలన్నింటిని అధ్యయనం చేశాడు. (142)
యస్మిన్ కాలే జపన్నాస్తే ధీమాన్ సత్యపరాక్రమః ।
వాదేయం బ్రాహ్మణేష్వాసీత్ తస్మిన్ కాలే మహాత్మనః ॥ 143
అతడు బుద్ధిమంతుడు, సత్యపరాక్రముడు. అతడు జపం చేస్తున్న సమయంలో అతని దగ్గరకు వెళ్లినవాడు పొందలేని దంటూ ఏమీ ఉండదు. (143)
తమింద్రో బ్రాహ్మణో భూత్వా పుత్రార్థే భూతభావనః ।
యయాచే కుండలే వీరం కవచం చ సహాంగజమ్ ॥ 144
అటువంటి వసుషేణుని ఇంద్రుడు తన కుమారుని కోసం బ్రాహ్మణ రూపంలో వచ్చి సహజాలైన కవచకుండలాలను యాచించాడు. (144)
ఉత్కృత్య కర్ణో హ్యదదాత్ కవచం కుండలే తథా ।
శక్తిం శక్రో దదౌ తస్మై విస్మితశ్చేదమబ్రవీత్ ॥ 145
దేవాసురమనుష్యాణాం గంధర్వోరగరక్షసామ్ ।
యస్మిన్ క్షేప్స్యసి దుర్ధర్షః స ఏకో న భవిష్యతి ॥ 146
కర్ణుడు కవచకుండలాలను తన శరీరంనుండి కోసి అతనికిచ్చాడు. ఇంద్రుడు అతనికి శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. దేవ, అసుర, మనుష్యులలో కాని, గంధర్వ, ఉరగ, రాక్షసులలో కాని ఎవనిపై దాన్ని విసిరినా అతడిక మిగిలి ఉండడు. (145,146)
పురా నామ చ తస్యాసీద్ వసుషేణ ఇతి క్షితౌ ।
తతో వైకర్తనః కర్ణః కర్మణా తేన సోఽభవత్ ॥ 147
మొదట కర్ణుని పేరు వసుషేణుడు. అతడు తన కవచకుండలాలను కత్తిరించడం వల్ల 'కర్ణుడు' వైకర్తనుడుగా ప్రసిద్ధి పొందాడు. (147)
ఆముక్తకవచో వీరః యస్తు జజ్ఞే మహాయశాః ।
స కర్ణ ఇతి విఖ్యాతః పృథాయాః ప్రథమః సుతః ॥ 148
పృథకు మొదటి కుమారునిగా సహజకవచ కుండలాలతో జన్మించిన మహావీరుడు 'కర్ణు'డని లోకవిఖ్యాతిని పొందాడు. (148)
స తు సూతకులే వీరః వవృధే రాజసత్తమ ।
కర్ణం నరవరశ్రేష్ఠం సర్వశస్త్రభృతాం వరమ్ ॥ 149
రాజశ్రేష్ఠా! అతడు సూతుని ఇంట పెరిగాడు. శస్త్రధారులందరిలో శ్రేష్ఠుడు. నరవరులలో శ్రేష్ఠుడు. (149)
దుర్యోధనస్య సచివం మిత్రం శత్రువినాశనమ్ ।
దివాకరస్య తం విద్ధి రాజన్నంశమనుత్తమమ్ ॥ 150
అతడు దుర్యోధనుని సచివుడు, మిత్రుడు, శత్రునాశకరుడు, అతడు సూర్యుని అంశవల్ల జన్మించిన ఉత్తముడు. (150)
యస్తు నారాయణో నామ దేవదేవః సనాతనః ।
తస్యాంశో మానుషేష్వాసీద్ వాసుదేవః ప్రతాపవాన్ ॥ 151
దేవదేవుడు, సనాతనుడు అయిన నారాయణుడు తన అంశతో మనుష్యులలో ప్రతాపవంతుడైన వాసుదేవునిగా జన్మించాడు. (151)
శేషస్యాంశశ్చ నాగస్య బలదేవో మహాబలః ।
సనత్కుమారం ప్రద్యుమ్నం విద్ధి రాజన్ మహౌజసమ్ ॥ 152
ఆదిశేషుని అంశతో మహాబలుడైన బలదేవుడు జన్మించాడు. మహాతేజోవంతుడైన ప్రద్యుమ్నుడు సనత్కుమారుని అంశతో జన్మించినవాడు. (152)
ఏవమన్యే మనుష్యేంద్రాః బహునోఽంశా దివౌకసామ్ ।
జజ్ఞిరే వసుదేవస్య కులే కులవివర్ధనః ॥ 153
ఈ విధంగా దేవతల అంశలతో తక్కిన రాజులందరూ వసుదేవుని వంశంలో వంశ ప్రవర్ధకులుగా జన్మించారు. (153)
గణస్త్వప్సరసాం యో వై మయా రాజన్ ప్రకీర్తితః ।
తస్య భాగః క్షితౌ జజ్ఞే నియోగాద్ వాసవస్య హ ॥ 154
రాజా! మునుపు నేను చెప్పిన అప్సరోగణం ఇంద్రుని ఆదేశం మీద వారి వారి అంశలతో భూమిపై జన్మించారు. (154)
తాని షోడశ దేవీనాం సహస్రాణాం నరాధిప ।
బభూవు ర్మానుషే లోకే వాసుదేవ పరిగ్రహః ॥ 155
ఆ అప్సరలు భూలోకంలో పదునారువేలమంది గోపికలుగా జన్మించి భగవంతుడైన శ్రీకృష్ణునికి భార్యలయ్యారు. (155)
శ్రియస్తు భాగః సంజజ్ఞే రత్యర్థం పృథివీతలే ।
భీష్మకస్య కులే సాధ్వీ రుక్మిణీ నామ నామతః ॥ 156
నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుని ఆనందంకోసం లక్ష్మి తన అంశతో భీష్మకుని కులంలో రుక్మిణిగా జన్మించింది. (156)
ద్రౌపదీ త్వథ సంజజ్ఞే శచీభాగాదనిందితా ।
ద్రుపదస్య కులే కన్యా వేదిమధ్యాదనిందితా ॥ 157
శచీదేవి ద్రుపదకులంలో వేది మధ్యనుండి ద్రౌపదిగా అవతరించింది. (157)
నాతిహ్రస్వా న మహతీ నీలోత్పలసుగంధినీ ।
పద్మాయతాక్షీ సుశ్రోణీ స్వసితాంచితమూర్ధజా ॥ 158
ఆమె మిక్కిలి పొట్టిదికాదు. అంత పొడుగుకాదు. నీలోత్పలం వలె మంచి సుగంధం కలది. విశాలమైన కన్నులు కలది. చక్కని నల్లని జుట్టుకలది. (158)
సర్వలక్షణసంపూర్ణా వైదూర్యమణిసంనిభా ।
పంచానాం పురుషేంద్రాణాం చిత్తప్రమథనీ రహః ॥ 159
సర్వశుభలక్షణాలూ కలిగి ఉన్నది. వైడూర్యంలా ప్రకాశిస్తున్నది. పురుషశ్రేష్ఠులైన పాండవులైదుగురికి ఏకాంతంలో మనస్సును హరింపగల్గినది ఆ ద్రౌపది. (159)
సిద్ధిర్థృతిశ్చ యే దేవ్యౌ పంచానాం మాతరౌ తు తే ।
కుంతీ మాద్రీ చ జజ్ఞాతే మతిస్తు సుబలాత్మజా ॥ 160
ఆ పంచ పాండవులకు సిద్ధి, ధృతి అనే దేవతలు కుంతీ, మాద్రీరూపాలలో తల్లులుగా జన్మించారు. (160)
ఇతి దేవాసురాణాం తే గంధర్వాప్సరసాం తథా ।
అంశావతరణం రాజన్ రాక్షసానాం చ కీర్తితమ్ ॥ 161
యే పృథివ్యాం సముద్భూతాః రాజానో యుద్ధదుర్మదాః ।
మహాత్మానో యదూనాం చ యే జాతా విపులే కులే ॥ 162
బ్రాహ్మణా క్షత్రియా వైశ్యాః మయా తే పరికీర్తితాః ।
ధన్యం యశస్యం పుత్రీయమ్ ఆయుష్యం విజయావహమ్ ।
ఇదమంశావతరణం శ్రోతవ్యమనసూయతా ॥ 163
ఈ విధంగా దేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరలు, మున్నగు వారి యొక్క అంశావతరణం చెప్పబడింది. యుద్ధగర్వంతో ఈ భూమిపై పుట్టిన రాజులు, యదువంశంలో పుట్టినరాజులు, బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యులు చెప్పబడ్డారు. ధన్యం, కీర్తికరం, పుత్రప్రదం, విజయదాయకం ఈ అంశావతరణం. దీన్ని అసూయలేకుండా వినాలి. (161-163)
అంశావతరణం శ్రుత్వా దేవగంధర్వరక్షసామ్ ।
ప్రభవాప్యయవిత్ ప్రాజ్ఞః న కృచ్ఛ్రేష్వవసీదతి ॥ 164
దేవగంధర్వ రాక్షసుల అంశావతారవర్ణనం వినడం వల్ల ఉత్పత్తి వినాశనాలు తెలిసిన ప్రాజ్ఞుడు కష్టాలలో పడజాలడు. (164)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అంశావతార సమాప్తౌ సప్తషష్టితమోఽధ్యాయః ॥ 67 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున అంశావతారసమాప్తి అను అరువది ఏడవ అధ్యాయము. (67)