71. డెబ్బదియొకటవ అధ్యాయము
దుష్యంతమహారాజు శకుంతలతో సంభాషించుట.
వైశంపాయన ఉవాచ
తతోఽగచ్ఛన్మహాబాహుః ఏకోఽమాత్యాన్ విసృజ్య తాన్ ।
నాపశ్యచ్చాశ్రమే తస్మిన్ తమృషిం సంశితవ్రతమ్ ॥ 1
వైశంపాయనుడిలా చెప్పాడు - తర్వాత ఆ దుష్యంతుడు అమాత్యులను విడిచి పెట్టి తానొక్కడే ఆశ్రమంలోకి వెళ్లాడు. అక్కడ నియమనిష్ఠుడైన కణ్వమహర్షి అతనికి కనబడలేదు. (1)
సోఽపశ్యమానస్తమృషిం శూన్యం దృష్ట్వా తథాశ్రమమ్ ।
ఉవాచ క ఇహేత్యుచ్చైః వనం సంనాదయన్నివ॥ 2
ఆ ఋషి కనబడకపోవటంతో ఆశ్రమం శూన్యమైందిగా భావించి 'ఇక్కడ ఎవరున్నారు?" అని బిగ్గరగా అడిగాడు. (2)
శ్రుత్వాథ తస్య తం శబ్దం కన్యా శ్రీరివ రూపిణీ ।
నిశ్చక్రామాశ్రమాత్ తస్మాత్ తాపసీ వేషధారిణీ ॥ 3
వెంటనే ఆ ధ్వని విని లక్ష్మీదేవి వంటి రూపంతో తాపసీ వేషంలో ఉన్న ఒక కన్య ఆశ్రమంలో నుండి వెలుపలికి వచ్చింది. (3)
సా తం దృష్ట్వైవ రాజానం దుష్యంతమసితేక్షణా ।
(సువ్రతాభ్యాగతం తం తు పూజ్యం ప్రాప్తమథేశ్వరమ్ ।
రూపయౌవనసంపన్నా శీలాచారవతీ శుభా ।
సా తమాయతపద్మాక్షం వ్యూఢోరస్కం ససంహతమ్ ॥
సింహస్కంధం దీర్ఘబాహుం సర్వలక్షణపూజితమ్ ।
విస్పష్టం మధురాం వాచం సాబ్రవీజ్జనమేజయ ।)
స్వాగతం త ఇతి క్షిస్రమ్ ఉవాచ ప్రతిపూజ్య చ ॥ 4
నల్లని కన్నులతో ఆమె రాజును చుసి (అభ్యాగతుడైన ఆరాజు పూజింపదగిన వాడని గ్రహించింది. ఆమె నియమాన్ని పాలించేది, రూప, యౌవనసంపదగలది. శీల, ఆచారాలు కలది. శుభలక్షణాలు కలది. విశాలనేత్రుడు, ఉన్నతవక్షం, అంగసౌష్ఠవం కలిగి, సింహభుజుడు, దీర్గబాహువు, పూజ్యుడు అయిన రాజుతో ఆమె స్పష్టంగా మధురంగా ఇలా పలికింది.) నీకు స్వాగతం అని పలికి వెంటనే ఆతనిని గౌరవించింది. (4)
ఆసనేనార్చయిత్వా చ పాద్యేనార్ఘ్యేణ చైవ హి ।
పప్రచ్ఛానామయం రాజన్ కుశలం చ నరాధిపమ్ ॥ 5
ఆమె ఆ రాజును అర్ఘ్య పాద్య ఆసనాలతో గౌరవించి, ఆరోగ్యాన్ని కుశలాన్నీ అడిగింది. (5)
యథావదర్చయిత్వాథ పృష్ట్వా చానామయం తదా ।
ఉవాచ స్మయమాణేవ కిం కార్యం క్రియతామితి ॥ 6
యథావిధిగా పూజించి, కుశలప్రశ్నలడిగి, సిగ్గిపడుతున్న దానివలె 'మీకొరకు ఏమిచేయగలను' అనిఅడిగింది. (6)
(ఆశ్రమస్యాభిగమనే కిం త్వం కార్యం చికీర్షసి ।
కస్త్వమద్యేహ సంప్రాప్తః మహర్షేరాశ్రమం శుభమ్ ॥ )
ఆశ్రమానికి వచ్చి నీవేమి చేయగోరుచున్నావు? మంగళప్రదమయిన ఈ మహర్షి ఆశ్రమానికి వచ్చిన నీవెవరవు?' అని అడిగింది.
తామబ్రవీత్తతో రాజా కన్యాం మధురభాషిణీమ్ ।
దృష్ట్వా చైవానవద్యాంగీం యథావత్ ప్రతిపూజితః ॥ 7
పిమ్మట యథావిధిగా గౌరవింపబడిన రాజు తియ్యగా మాట్లాడే, అందమైన ఆ సుందరితో ఇలా పలికాడు. (7)
దుష్యంత ఉవాచ
(రాజర్షేరస్మి పుత్రోఽహమ్ ఇలిలస్య మహాత్మనః ।
దుష్యంత ఇతి మే నామ సత్యం పుష్కరలోచనే ॥ )
ఆగతోఽహం మహాభాగమ్ ఋషిం కణ్వముపాసితమ్ ।
క్వ గతో భగవాన్ భద్రే తన్మమాచక్ష్వ శోభనే ॥ 8
దుష్యంతుడిలా అన్నాడు - కమలలోచనా! నేను ఇలిలుడనే మహాత్ముడయిన రాజర్షి కుమారుడను. నాపేరు దుష్యంతుడు. ఇది సత్యము పూజ్యుడగు కణ్వమహర్షిని ఉపాసించటానికి వచ్చాను. భద్రా! పూజ్యుడగు ఆమహర్షి ఎక్కడకు వెళ్ళాడు? ఆవిషయం నాకు చెప్పు. (8)
శకుంతలోవాచ
గతః పితామే భగవాన్ ఫలాన్యాహర్తుమాశ్రమాత్ ।
ముహూర్తం సంప్రతీక్షస్వ ద్రష్టస్యేనముపాగతమ్ ॥ 9
శకుంతల ఇలా అంది - పూజ్యుడగు నాతండ్రి ఫలాల కోసం ఆశ్రమంనుండి బయటకు వెళ్లాడు. ముహూర్తకాలం నిరీక్షించు. ఆయన వస్తారు. చూడవచ్చు. (9)
వైశంపాయన ఉవాచ
అపశ్యమానస్తమృషిం తథా చోక్తస్తయా చ సః ।
తాం దృష్ట్వా చ వరారోహాం శ్రీమతీం చారుహాసినీమ్ ॥ 10
విభ్రాజమానాం వపుషా తపసా చ దమేన చ ।
రూపయౌవనసంపన్నామ్ ఇత్యువాచ మహీపతిః ॥ 11
వైశంపాయనుడిలా అన్నాడు - ఋషి కనపడక పోవడం, ఆమె ఆవిధంగా చెప్పడంతో చక్కని శరీరసౌష్ఠవం, అందమైన చిరునవ్వు, తపస్సు, ఇంద్రియనిగ్రహం రూపయౌవన సంపదలు గల్గిన ఆమెను చూసి రాజిలా అన్నాడు. (10,11)
కా త్వం కస్యాసి సుశ్రోణి కిమర్థం చాగతా వనమ్ ।
ఏవంరూపగుణోపేతా కుతస్త్వమసి శోభనే ॥ 12
సుందరీ! నీవెవరు? ఎవరికూతురువు? ఈ వనానికి ఎందుకు వచ్చావు? ఇంత చక్కటి రూపంతో ఉన్న నీవు ఇక్కడకు ఎలా వచ్చావు? (12)
దర్శనాదేవ హి శుభే త్వయా మేఽపహృతం మనః ।
ఇచ్ఛామి త్వామహం జ్ఞాతుం తన్మమాచక్ష్వ శోభనే ॥ 13
చూపుతోనే నీవు నామనస్సును హరించావు. 'నీవెవరవో' తెలుసుకోవాలనుకొంటున్నాను - చెప్పు. (13)
(శృణు మే నాగనాసోరు వచనం మత్తకాశిని ।
రాజర్షేరన్వయే జాతః పూరోరస్మి విశేషతః ॥
వౄణే త్వామద్యసుశ్ఱోణి దుష్యంతో వరవర్ణిని ।
న మేఽన్యత్ర క్షత్రియాయాం మనో జాతు ప్రవర్తతే ॥
ఋషిపుత్రీషు చాన్యాసు నావర్ణాసు పరాసు వా ।
తస్మాత్ ప్రాణిహితాత్మానం విధ్ధి మాం కలభాషిణి ।
తస్య మే త్వయి భావోస్తి క్షత్రియా హ్యసి కా వద ।
న హి మే భీరు విప్రాయాం మనః ప్రసహతే గతిమ్ ॥
భజే త్వామాయతాపాంగి భక్తం భజితుమర్హసి ।
భుంక్ష్వ రాజ్యం విశాలాక్షి బుద్ధిం మా త్వన్యథా కృథాః ॥ )
సుందరీ! నామాట విను. నేను 'పూరు' రాజవంశంలో జన్మించాను. ఇప్పుడే నేను నిన్ను వరిస్తున్నాను. క్షత్రియ స్త్రీ కాని వారిపట్ల నామనసెప్పుడూ ప్రవర్తింపదు. ఋషిపుత్రికల విషయంలోకాని, సవర్ణలుకాని స్త్రీల విషయంలోకాని నామనసుపోదు. మధుర భాషిణీ! నీయందే నామనసు లగ్నమైంది. తెలుసుకో. నామనస్సు విప్రస్త్రీ విషయంలో ప్రవర్తింపదు. ! నిన్ను నేను సేవిస్తున్నాను. నీభక్తుడను, నన్ను నీవు సేవింపదగినదానవు. విశాలాక్షీ! నా రాజ్యమనుభవించు. మరో ఆలోచన వద్దు.
ఏవముక్తా తు సా కన్యా తేన రాజ్ఞా తమాశ్రమే ।
ఉవాచ హసతీ వాక్యమ్ ఇదం సుమధురాక్షరమ్ ॥ 14
ఆశ్రమంలో అలా ఆరాజు పలుకగా ఆమె నవ్వుతూ మధురాక్షరాలతో ఇలా పలికింది- (14)
కణ్వస్యాహం భగవతః దుష్యంత దుహితా మతా ।
తపస్వినో ధృతిమతః ధర్మజ్ఞస్య మహాత్మనః ॥ 15
దుష్యంతా! నేను పూజ్యుడు, తపస్వి, ధృతిమంతుడు, ధర్మజ్ఞుడు, మహాత్ముడు ఐన కణ్వుని కూతురిని- (15)
(అస్వతంత్రాస్మి రాజేంద్ర కాశ్యపో మే గురుః పితా ।
తమేవ ప్రార్థయ స్వార్థం నాయుక్తం కర్తుమర్హసి ॥)
రాజా! నేను స్వతంత్రురాలను కాను. కాశ్యపుడు నాతండ్రి, గురువు కూడ. నీవతనినే ప్రార్థించు, స్వేచ్ఛగా అనుచితంగా ప్రవర్తించటం తగదు.
దుష్యంత ఉవాచ
ఊర్థ్వరేతా మహాభాగే భగవాన్ లోకపూజితః ।
చలేద్ధి వృత్తాన్ ధర్మోఽపి న చలేత్ సంశితవ్రతః ॥ 16
అపుడు దుష్యంతుడిలా అన్నాడు - మహాభాగా! ఉర్ధ్వరేతసుడు, లోకపూజితుడు, పూజ్యుడు అయిన కణ్వమహర్షి నియమవ్రతుడు. ధర్మదేవుడయినా నడవడి నుండి చలిస్తాడేమోకాని ఈ మహర్షి మాత్రం చలింపడు. (16)
కథం త్వం తస్య దుహితా సంభూతా వరవర్ణినీ ।
సంశయో మే మహానత్ర తన్మే ఛేత్తుమిహార్హసి ॥ 17
నీవు అతనికి కూతురెట్లా అయ్యావు? నాకు చాలా పెద్ద సందేహం కలుగుతోంది. దాన్ని తీర్చగల దానవు నీవే. (17)
శకుంతలోవాచ
యథాయమాగమో మహ్యం యథా చేదమభూత్ పురా ।
శృణు రాజన్ యథా తత్త్వం యథాస్మి దుహితా మునేః ॥ 18
అపుడు శకుంతల ఇట్లా అంది - రాజా! ఈ ఋషి రాక నాకొఱకు ఎలా జరిగిందో, మునుపు నారాక ఎలా జరిగిందో, ఈ మునికి కూతురను ఎట్లా అయ్యానో యథార్థంగా చెబుతాను. విను. (18)
(అన్యథా సంతమాత్మానమ్ అన్యథా సత్సు భాషతే ।
స పాపేనావృతో మూర్ఖః స్తేన ఆత్మాపహారకః ॥)
వేరొక విధంగా ఉన్న తన్నుగూర్చి మరొకవిధంగా మహాత్ముల దగ్గర చెప్పేవాడు పాపాత్ముడు, మూర్ఖుడు, దొంగ ఆత్మవంచకుడూ అవుతాడు.
ఋషిః కశ్చిదిహాగమ్య మమ జన్మాభ్యచోదయత్ ।
(ఊర్థ్వరేతా యథాసి త్వం కుతస్త్యేయం శకుంతలా ।
పుత్రీ త్వత్తః కథం జాతా సత్యం మే బ్రూహి కాశ్యప ॥ )
తస్మై ప్రోవాచ భగవాన్ యథా తచ్ఛృణు పార్థివ ॥ 19
రాజా! ఒకానొక ఋషి ఇక్కడకు వచ్చి ఒకనాడు నా జన్మ గురించి ప్రశ్నించాడు. నీవు ఊర్థ్వరేతసుడవు ఎలా అయ్యావు? ఈ శకుంతల ఎలా వచ్చినది? నీకు ఈమె కూతురెట్లయింది? కాశ్యపా? నాకు నిజం చెప్పు. అతనికి పూజ్యుడయిన కాశ్యపుడు చెప్పిన ప్రకారం నీకు నేను చెపుతాను. విను. (19)
కణ్వ ఉవాచ
తప్యమానః కిల పురా విశ్వామిత్రో మహత్తపః ।
సుభృశం తాపయామాస శక్రం సురగణేశ్వరమ్ ॥ 20
కణ్వుడిలా అన్నాడు - పూర్వమొకప్పుడు విశ్వామిత్రుడు గొప్పతపస్సు చేయసాగాడు. దానివల్ల దేవగణాధిపుడైన ఇంద్రుడు మిక్కిలి సంతాపం పొందాడు. (20)
తపసా దీప్తవీర్యోఽయం స్థానాన్మాం చ్యావయేదితి ।
భీతః పురందరస్తస్మాత్ మేనకామిదమబ్రవీత్ ॥ 21
'తపస్సుచే అధికమైన శక్తితో ఈ విశ్వామిత్రుడు నన్ను ఈ ఇంద్రస్థానం నుండి పడగొట్టునేమో' అని భయపడిన దేవేంద్రుడు మేనకతో ఇలా అన్నాడు. (21)
గుణైరప్సరసాం దివ్యైః మేనకే త్వం విశిష్యసే ।
శ్రేయో మే కురు కల్యాణి యత త్వాం పక్ష్యామి తచ్ఛృణు ॥ 22
అసావాదిత్యసంకాశః విశ్వామిత్రో మహాతపాః ।
తప్యమానస్తపోఘోరం మమ కంపయతే మనః ॥ 23
మేనకా! అప్సరలలో దివ్యగుణాలతో నీవు గొప్పదానవు. నాకు శ్రేయస్కరమయిన పనిని నీవు చెయ్యి. ఆ పని చెపుతాను విను. సూర్యునితో సమానంగా ప్రకాశించే ఈ విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేస్తూ నా మనస్సును వణికిస్తున్నాడు. (22,23)
మేనకే తవ భారోఽయం విశ్వామిత్రః సుమధ్యమే ।
శంసితాత్మా సుదుర్ధర్షః ఉగ్రే తపసి వర్తతే ॥ 24
సుందరీ! మేనకా! ఈ విశ్వామిత్రుని చలింపచేసే భారం నీది. ఇతడు కఠోరనియమం కలవాడు. జయించడానికి శక్యంకానివాడు. ఉగ్రమైన తపస్సులో ఉన్నవాడు. (24)
స మాం న చ్యావయేత్ స్థానాత్ తం వై గత్వా ప్రలోభయ ।
చర తస్య తపోవిఘ్నం కురు మేఽవిఘ్నముత్తమమ్ ॥ 25
అతడు నన్ను నాస్థానం నుండి పడగొట్టరాదు. నీవు వెళ్ళి అతనిని ప్రలోభపెట్టు. అతనికి తపోభంగం కలిగించి, నాకు ఉత్తమమైన విఘ్ననివారణం చెయ్యి. (25)
రూపయౌవనమాధుర్య చేష్టితస్మితభాషణైః ।
లోభయిత్వా వరారోహే తపసస్తం నివర్తయ ॥ 26
సుందరీ! నీరూపంచేత, యౌవనంచేత, సౌందర్యంచేత, చేష్టలచేత, చిరునవ్వులచేత, తీయనిమాటలచేత అతనిని ప్రలోభపరచి తపస్సు నుండి మరలించు. (26)
మేనకోవాచ
మహాతేజాః స భగవాన్ తథైవ చ మహాతపాః ।
కోపనశ్చ తథాహ్యేనం జానాతి భగవానపి ॥ 27
అపుడు మేనక ఇలా అంది - 'దేవరాజా! పూజ్యుడయిన విశ్వామిత్రుడు మహాతేజస్వి, మహాతపస్వి, కోపిష్ఠి. ఆతని ఈ స్వభావం మీకు తెలుసు. (27)
తేజసస్తపసశ్పైవ కోపస్య చ మహాత్మనః ।
త్వమప్యుద్విజసే యస్య నో ద్విజేయమహం కథమ్ ॥ 28
ఆ మహాత్ముని తేజస్సుకు, తపస్సుకు, క్రోథానికి, మీరుకూడా భయపడుతున్నారు కదా! ఇక నేనెట్లు భయపడకుండా ఉంటాను? (28)
మహాభాగం వసిష్ఠం యః పుత్రైరిష్టైర్వ్యయోజయత్ ।
క్షత్రజాతశ్చ యః పూర్వమ్ అభవద్బ్రాహ్మణోబలాత్ ॥ 29
శౌచార్థం యో నదీం చక్రే దుర్గమాం బహుభిర్జలైః ।
యాం తాం పుణ్యతమాం లోకే కౌశికీతి విదుర్జనాః ॥ 30
అతడు మహాత్ముడైన వసిష్ఠుని తన ప్రియమైన కొడుకుల నుండి విడదీసినవాడు. క్షత్రియ్జాతిలో పుట్టి తపోబలంతో బ్రాహ్మణుడైనట్టివాడు. లోతులేని నదిని స్నానం చేయడం కష్టమయ్యేంత నీటితో నింపిన వాడు. దానినే జనులు 'కౌశిక' అని పిలుస్తారు. (29,30)
బభార యత్రాస్య పురా కాలే దుర్గే మహాత్మనః ।
దారాన్ మతంగో ధర్మాత్మా రాజర్షిర్వ్యాధతాం గతః ॥ 31
పూర్వమొకప్పుడు కష్టకాలంలో విశ్వామిత్రుని భార్యను శాపవశం వల్ల వ్యాధుడై ఉన్న ధర్మాత్ముడైన రాజర్షి మతంగుడు (త్రిశంకుడు) పోషించాడు. (31)
అతీతకాలే దుర్భిక్షే అభ్యేత్య పునరాశ్రమమ్ ।
మునిః పారేతి నద్యా వై నామ చక్రే తదా ప్రభుః ॥ 32
దుర్భీక్షకాలం గడిచాక ఆ మతంగమహర్షి మళ్లీ విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చి 'పారా' అని ఈ కౌశికీనదికి పేరుపెట్టి వెళ్లాడు. (32)
మతంగం యాజయాంచక్రే యత్ర ప్రీతమనాః స్వయమ్ ।
త్వం చ సోమం భయాద్యస్య గతః పాతుం సురేశ్వర ॥ 33
సురేశ్వరా! మతంగుడు చేసిన ఉపకారానికి ప్రీతినొందిన విశ్వామిత్రుడు తాను స్వయంగా అతనిచే యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞంలో అతనికి భయపడి నీవు కూడ సోమపానం చేయడానికి వెళ్ళావు. (33)
చకారాన్యం చ లోకం వై క్రుద్ధో నక్షత్రసంపదా ।
ప్రతిశ్రవణపూర్వాణి నక్షత్రాణి చకార యః ।
గురుశాపహతస్యాపి త్రిశంకోః శరణం దదౌ ॥ 34
క్రుద్ధుడైన విశ్వామిత్రుడు నక్షత్రసంపదతో వేరే లోకాన్ని సృష్టించాడు. ప్రతిశ్రవణం మున్నగు నక్షత్రాలను చేశాడు. గురుశాపం తగిలిన త్రిశంకువుకు శరణమిచ్చాడు. (రక్షణ కల్పించాడు). (34)
(బ్రహ్మర్షిశాపం రాజర్షిః కథం మోక్ష్యతి కౌశికః ।
అవమత్య తదా దేవైః యజ్ఞాంగం తద్ వినాశితమ్ ॥
అన్యాని చ మహాతేజాః యజ్ఞాంగాన్యసృజత్ ప్రభుః ।
వినాయ చ తదా స్వర్గం త్రిశంకుం స మహాతపాః ॥)
'రాజర్షి ఐన కౌశికుడు బ్రహ్మర్షి శాపాన్ని ఎలా విడిపిస్తాడు?" అని దేవతలు యజ్ఞంలోని హవ్యాలను తిరస్కరించి, వాటిని నాశనం చేశారు. అపుడు విశ్వామిత్రుడు మళ్లీ యజ్ఞాంగాలను సృష్టించి త్రిశంకువును స్వర్గానికి పంపాడు.
ఏతాని యస్య కర్మాణి తస్యాహం భృశముద్విజే ।
యథాసా న దహేత్ క్రుద్ధః తథాఽఽజ్ఞాపయ మాం విభో ॥ 35
ఇటువంటి అద్భుతకృత్యాలు చేసిన ఆమహాత్మునికి నేను ఎంతో భయపడుతున్నాను. అతడు క్రుద్ధుడై నన్ను భస్మం చేయకుండా మీరు నన్ను ఆజ్ఞాపించండి. (35)
తేజసా నిర్దహేల్లోకాన్ కంపయేద్ ధరణీం పదా ।
సంక్షిపేచ్చ మహామేరుం తూర్ణమావర్తయేద్ దిశః ॥ 36
అతడు తన తేజస్సుతో లోకాలను దహింపగలడు. భూమిని కంపింపచేయగలడు. మేరుపర్వతాన్ని విసిరి వేయగలడు. దిక్కులను శీఘ్రంగా త్రిప్పగలడు. (36)
తాదృశం తపసా యుక్తం ప్రదీప్తమివ పావకమ్ ।
కథమస్మద్విధా నారీ జితేంద్రియమభిస్పృశేత్ ॥ 37
అగ్నివలె ప్రజ్వలించే అటువంటి తపస్సంపన్నుడు, జితేంద్రియుడూ అయిన విశ్వామిత్రుని నావంటిస్త్రీ ఎలా తాకగలదు? (37)
హుతాశనముఖం దీప్తం సూర్యచంద్రాక్షితారకమ్ ।
కాలజిహ్వం సురశ్రేష్ఠ కథమస్మద్విధా స్పృశేత్ ॥ 38
సురశ్రేష్ఠా! అగ్నివంటి ముఖం, సూర్యచంద్రుల వంటికళ్ళు, కాలసర్పం వంటి నాలుక కల ఆ మహర్షిని నావంటి స్త్రీ ఎలా తాకగలదు? (38)
యమశ్చ సోమశ్చ మహర్షయశ్చ
సాధ్యా విశ్వే వాలఖిల్యాశ్చ సర్వే ।
ఏతేఽపి యస్యోద్విజంతే ప్రభావాత్
తస్మాత్ కస్మాన్మాదృశీ నోద్విజేత ॥ 39
యముడు, చ్Mద్రుడు, మహర్షులు, సాధ్యులు, విశ్వేదేవతలు, వాలఖిల్యమహర్షులు, అందరూ ఆ విశ్వామిత్రుని ప్రభావానికి భయపడతారు కదా! నావంటిది ఎలా భయపడకుండా ఉండగలదు? (39)
త్వయైవముక్తా చ కథం సమీపమ్
ఋషేర్న గచ్ఛేయమహం సురేంద్ర ।
రక్షాం తు మే చింతయ దేవరాజ
యథా త్వదర్థం రక్షితాహం చరేయమ్ ॥ 40
సురేంద్రా! నీవీ విధంగా ఆజ్ఞాపించాక ఆ మహర్షి దగ్గరకు వెళ్ళకుండా ఎలా ఉండగలను? ! నారక్షణ గురించి ఆలోచించు. నీచేత రక్షింపబడి నేను మళ్లీ వచ్చి నీకోసమే పని చేయగలను. (40)
కామం తు మే మారుతస్తత్ర వాసః
ప్రక్రీడితాయా వివృణోతు దేవ ।
భవేచ్చ మే మన్మథస్తత్ర కార్యే
సహాయభూతస్తు తవ ప్రసాదాత్ ॥ 41
దేవేంద్రా! నీ అనుగ్రహంవల్ల అక్కడ నేను స్వేచ్ఛగా ఆడే సమయంలో వాయువు తగిన సమయంలో నావస్త్రాన్ని దూరంగా తొలగించుగాక! నాపనిలో మన్మథుడు తోడుగా ఉండుగాక! (41)
వనాచ్చవాయుః సురభిః ప్రవాయాత్
తస్మిన్ కాలే తమృషిం లోభయన్త్యాః ।
తథేత్యుక్త్వా విహితే చైవ తస్మిన్
తతో యయౌ సాఽఽశ్రమం కౌశికస్య ॥ 42
ఆ ఋషిని నేను ప్రలోభపరిచే సమయంలో వనంలో పరిమళభరితమైన వాయువు వీచుగాక! "అలాగే" అని ఇంద్రుడు చెప్పినతరువాత ఆమె కౌశికును ఆశ్రమానికి వెళ్లింది. (42)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి శకుంతలోపాఖ్యానే ఏకసప్తతితమోఽధ్యాయః ॥ 71 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున శకుంతలోపాఖ్యానము అను డెబ్బది ఒకటవ అధ్యాయము. (71)
(దాక్షిణాత్య అధికపాఠము 14 1/2 శ్లోకము కలుపుకొని మొత్తం 56 1/2 శ్లోకాలు)