72. డెబ్బది రెండవ అధ్యాయము

శకుంతలా జననము.

కణ్వ ఉవాచ
ఏవముక్త స్తయా శక్రః సందిదేశ సదాగతిమ్ ।
ప్రాతిష్ఠత తదా కాలే మేనకా వాయునా సహ ॥ 1
కణ్వుడిలా అన్నాడు - మేనక ఆ విధంగా చెప్పగానే ఆమెవెంటె ఇంద్రుడు వెళ్ళుమని వాయువును ఆదేశించాడు. అపుడు మేనక వాయువుతో బాటు బయలుదేరింది. (1)
అథాపశ్యద్ వరారోహా తపసా దగ్ధకిల్బిషమ్ ।
విశ్వామిత్రం తప్యమానం మేనకా భీరురాశ్రమే ॥ 2
వనానికి చేరుకొంది మేనక. తనపాపాల్ని దగ్ధం చేసి ఆశ్రమంలో తపస్సు చేసుకొంటున్నా విశ్వామిత్రుని సుందరి, భీరువు అయిన మేనక చూసింది. (2)
అభివాద్య తతః సా తం ప్రాక్రీడదృషిసంనిధౌ ।
అపోవాహచ వాసోఽస్యాః మరుతః శశిసంనిభమ్ ॥ 3
అనంతరం ఆమె ఋషికి నమస్కరించి ఆతని ఎదుట నాట్యమాడడం ప్రారంభించింది. చంద్రునిలా స్వచ్ఛంగా ప్రకాశించే ఆమెవస్త్రాన్ని (గాలి) వాయువు తొలగించాడు. (3)
సాగచ్ఛత్ త్వరితా భూమిం వాసస్తదభిలిప్సతీ ।
స్మయమానేవ సవ్రీడం మారుతం వరవర్ణినీ ॥ 4
నేలమీదపడిన తన వస్త్రాన్ని తీసికోవడానికి వాయువును చూసి ఆశ్చర్యపడ్డట్టు సిగ్గుపడుతూ మేనక అక్కడకు వచ్చింది. (4)
పశ్యతస్తస్య తత్రర్షేః అప్యగ్నిసమతేజసః ।
విశ్వామిత్రస్తతస్తాం తు విషమస్థామనిందితామ్ ॥ 5
గృద్ధాం వాససి సంభ్రాంతాం మేనకాం మునిసత్తమః ।
అనిర్దేశ్యవయోరూపామ్ అపశ్యద్ వివృతాం తదా ॥ 6
అగ్నితో సమానంగా ప్రకాశించే విశ్వామిత్రుడు చూస్తూండగా మేనక అక్కడకు వచ్చింది. ఆమె సంకటస్థితిలో ఉన్నది. గౌరవింపదగినది. వస్త్రం తీసికోవాలనే కంగారులో ఉన్నది. చెప్పనలవికాని వయోరూపాలతో వివ్స్త్రయై ఉన్నమేనకను ఆ మునిసత్తముడు చూశాడు. (5,6)
తస్యా రూపగుణాన్ దృష్ట్వా స తు విప్రర్షభ స్తదా ।
చకార భావం సంసర్గాత్ తయా కామవశం గతః ॥ 7
ఆమె రూపగుణాలను చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కామవశుడై ఆమె సాంగత్యాన్ని కోరుకొన్నాడు. (7)
న్యమంత్రయత చాప్యేనాం సా చాస్యైచ్ఛదనిందితా ।
తౌ తత్ర సుచిరం కాలమ్ ఉభౌ వ్యహరతాం తదా ॥ 8
రమమాణౌ యథాకామం యథైకదివసం తథా ।
(కామక్రోధావజితవాన్ మునిర్నిత్యం క్షమాన్వితః ।
చిరార్జితస్య తపసః క్షయం స కృతవాన్ ఋషిః ॥
తపసః సంక్షయాదేవ మునిర్మోహం సమావిశత్ ।
కామరాగాభిభూతస్య మునేః పార్శ్వం జగామ సా ॥)
జనయామాస స మునిః మేనకాయాం శకుంతలామ్ ॥ 9
ప్రస్థే హిమవతో రమ్యే మాలినీమభితో నదీమ్ ।
జాత ముత్సృజ్య తం గర్భం మేనకా మాలినీమను ॥ 10
కృతకార్యా తతస్తూర్ణమ్ అగచ్ఛచ్ఛక్రసంసదమ్ ।
తం వనే విజనే గర్భం సింహవ్యాఘ్రసమాకులే ॥ 11
దృష్ట్వా శయానం శకునాః సమంతాత్ పర్యవారయన్ ।
నేమాం హింస్యు ర్వనే బాలాం క్రవ్యాదా మాంసగృద్ధినః ॥ 12
అతడు ఆమెను దగ్గరకు రమ్మని పిలిచాడు. అందమైన ఆమె కూడ అందుకు ఇష్టపడింది. వారుభయులు చాలాకాలం అక్కడ విహరించారు. రోజుకొక్కవిధంగా స్వేచ్ఛగా వారు క్రీడించారు. ఎప్పుడూ సహనంతో ఉండే విశ్వామిత్రుడు కామక్రోధాలను జయింప లేకపోయాడు. చాలాకాలంగా సంపాదించుకొన్న తపస్సును నాశనం చేసికొన్నాడు. తపస్సు క్షీణించడంవల్లనే అతనిని మోహం ఆవరించింది. కామరాగసహితుడయిన అతనిని ఆమె సమీపించింది. మేనక యందు ఆ మునికి శకుంతల జన్మించింది. రమ్యమైన హిమవత్పర్వత సానువులలో మాలినీనదీ తీరంలో పుట్టిన ఆ పసిగుడ్డును వదిలి మేనక తనపని పూర్తయిందని శీఘ్రంగా ఇంద్రసభకు వెళ్ళిపోయింది. సింహవ్యాఘ్ర సమూహాలు సంచరించే ఆ వనంలో (పడి ఉన్న మాంసం తినే) గ్రద్దలు మున్నగునవి హింసించకుండా శకుంతాలు ఆ శిశువును చుట్టూ ఉండి రక్షింపసాగాయి. (8-12)
పర్యరక్షంత తాం తత్ర శకుంతా మేనకాత్మజామ్ ।
ఉపస్ప్రష్టుం గతశ్చాహమ్ అపశ్యం శయితామిమామ్ ॥ 13
నిర్జనే విపినే రమ్యే శకుంతైః పరివారితామ్ ।
(మాం దృష్ట్వై వాన్వపద్యంత పాదయాః పతితా ద్విజాః ।
అబ్రువన్ శకునాః సర్వే కలం మధురభాషిణః ॥
ఆ బాలికను శకుంతాలు రక్షిస్తున్నాయి. అపుడు ఆచమనం చేయడానికి మాలినీనదీ తీరానికి వెళ్ళిన నేను నిర్జనవనంలో శకుంత రక్షిత అయి నిద్రిస్తూన్నా ఆ బాలికను చూశాను. (13 1/2)
నన్ను చూడగానే ఆ పక్షులన్నీ నాపాదాలపై పడి మధురంగా ఇలా అన్నాయి.
ద్విజా ఊచుః
విశ్వామిత్రసుతాం బ్రహ్మన్ న్యాసభూతాం భరస్య వై ।
కామక్రోధావజితవాన్ సఖా తే కౌశికీం గతః ॥
తస్మాత్ పోషయ తత్పుత్రీం దయావానితి తేఽబ్రువన్ ।
పక్షులు ఇలా అన్నాయి - 'విశ్వామిత్రుని కూతురైన ఈ బాలికను నీవు న్యాసంగా పోషించు. కామక్రోధాలకు లోబడిన నీ మిత్రుడు కౌశికీనదికి వెళ్ళాడు. అందువల్ల దయగలనీవు ఆతని పుత్రికను పోషించు' అని అన్నాయి.
వి: న్యాసము అంటే ఉంచడం అని అర్థం - ఒక వస్తువును గాని వ్యక్తిని గాని మరొకరి దగ్గర ఉంచడం న్యాసం మళ్లీ ఆ పెట్టిన వాడు వచ్చేవరకూ ఆ బాధ్యతలన్నీ దగ్గర ఉంఛుకొన్నవాడు భరించి మళ్లీ అప్పగించడం న్యాసం.
కణ్వ ఉవాచ
సర్వభూతరుతజ్ఞోఽహం దయావాన్ సర్వజంతువు ।
నిర్జనేఽపి మహారణ్యే శకుంతైః పరివారితామ్ ॥)
ఆనయిత్వా తత శ్చైనాం దుహితృత్వే న్యవేశయమ్ ॥ 14
కణ్వుడిలా చెప్పాడు - నేను అన్నిప్రాణుల శబ్దాలను తెలిసినవాడిని. అన్ని ప్రాణులయందు దయగలవాడిని. ఈమె ఈ నిర్జనమైన మహారణ్యంలో శకుంతాలచే రక్షింపబడినది. ఈమెను అక్కడ నుండి తీసికొనివచ్చి కూతురుగా పెంచాను. (14)
శరీరకృత్ ప్రాణదాతా యస్య చాన్నాని భుంజతే ।
క్రమేణైతే త్రయోఽప్యుక్తాః పితరో ధర్మశాసనే ॥ 15
శరీరాన్ని ఇచ్చినవాడు, ప్రాణదాత, అన్నంపెట్టినవాడు క్రమంగా ఈ ముగ్గురు తండ్రులని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. (15)
నిర్జనే తు వనే యస్మాత్ శకుంతైః పరివారితా ।
శకుంతలేతి నామాస్యాః కృతం చాపి తతో మయా ॥ 16
నిర్జనవనంలో శకుంతాలచే రక్షింపబడటం వల్ల శకుంతల అని ఈమెకు నామకరణం చేశాను. (16)
ఏవం దుహితరం విద్ధి మమ విప్ర శకుంతలామ్ ।
శకుంతలా చ పితరం మన్యతే మామనిందితా ॥ 17
బ్రాహ్మణా! ఈ విధంగా ఈ శకుంతల నాకు కూతురయింది అని గ్రహించు. దోషరహిత అయిన శకుంతల కూడా నన్ను తండ్రిగా భావిస్తుంది. (17)
శకుంతలోవాచ
ఏతదాచష్ట పృష్టః సన్ మమ జన్మ మహర్షయే ।
సుతాం కణ్వస్య మామేవం విద్ధి త్వం మనుజాధిప ॥ 18
కణ్వం హి పితరం మన్యే పితరం స్వమజానతీ ।
ఇతి తే కథితం రాజన్ యథావృత్తం శ్రుతం మయా ॥ 19
శకుంతల్ ఇలా అంది -రాజా! నాజన్మ వృత్తాంతాన్ని అడిగిన మహర్షికి కణ్వమహర్షి ఈ విధంగా చెప్పాడు. ఈ విధంగా నేను కణ్వమహర్షికి కూతురు నయ్యానని గ్రహించు. తండ్రిని ఎరుగని నేను కణ్వమహర్షినే తండ్రిగా భావిస్తున్నాను. నేను విన్నది విన్నట్లుగా నీకు చెప్పాను. (18,19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి శకుంతలలోపాఖ్యానే ద్విసప్తతితమోఽధ్యాయః ॥ 72 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున శకుంతలోపాఖ్యానమను డెబ్బది రెండవ అధ్యాయము. (72)
(దాక్షిణాత్య అధికపాఠము 5 1/2 శ్లోకము కలుపుకొని మొత్తం 26 1/2 శ్లోకాలు)