74. డెబ్బది నాల్గవ అధ్యాయము

భరత జననము - రాజసభలో శకుంతల తన నిర్దోషితను సమర్థించుట.

వైశంపాయచ ఉవాచ
ప్రతిజ్ఞాయ చ దుష్యంతే ప్రతియాతే శకుంతలామ్ ।
(గర్భశ్చ వవృథే తస్యాం రాజపుత్ర్యాం మహాత్మనః ।
శకుంతలా మనిద్రైవ స్నానభోజనవర్జితా ।
రాజప్రేషణికా విప్రాః చతురంగబలైః సహ ।
అద్య శ్వో నా పరశ్వో వా సమాయాంతీతి నిశ్చితా ॥
దివసాన్ పక్షాన్ ఋతూన్ మాసాన్ అయనాని చ సర్వశః ।
గణ్యమానెషు సర్వేషు వ్యతీయు స్త్రీణి భారత ॥)
వైశంపాయనుడు ఇలా అన్నాడు. శకుంతలకు మాట ఇచ్చి దుష్యంతుడు వెళ్ళిన తర్వాత ఆ రాజపుత్రిక గర్భం క్రమంగా వృద్ధి చెందింది. కార్యభారంపట్ల దృష్టి ఉంచి, శకుంతల నిరంతరం రాజును గూర్చి ఆలోచిస్తూ ఉంది. రాత్రింబవళ్లు స్నానభోజనాలు విడిచిపెట్టింది. రాజుపంపిన బ్రాహ్మణులు, చతురంగబలసైన్యమూ ఈరోజో, రేపో, ఎల్లుండో వచ్చి తన్ను తిసికొని వెళ్తారని దృఢనిశ్చయంతో ఉంది. ఇలా రోజులు పక్షాలు, మాసాలు ఋతువులు, అయనాలు లెక్కిస్తూండగా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి.
గర్భం సుషావ వామోరూః కుమార మమితౌజసమ్ ॥ 1
త్రిషు వర్షేషు పూర్ణేషు దీప్తానలసమద్యుతిమ్ ।
రూపాదార్యగుణోపేతం దౌష్యంతిం జనమేజయ ॥ 2
జనమేజయా! మూడు సంవత్సరాలు పూర్తికాగానే, సుందరాంగి ఐన శకుంతల మిక్కిలి తేజస్సంపన్నుడై ప్రజ్వరిల్లు తున్న అగ్నివలె ప్రకాశిస్తున్న రూపం, ఔదార్యం మొదలయిన గుణాలతో కూడి ఉన్న పుత్రుని ప్రసవించింది. (1,2)
వి: సం: త్రిషువర్షేషు :- ఉదయతి మృదుతాంశే సప్తమస్థేచ సూర్యే యది భవతి నిషేకః సూతిరబ్దత్రయేణ (దేవ)
తస్మై తదంతరిక్షాత్ తు పుష్పవృష్టిః పపాత హ ।
దేవదుందుభయో నేదుః ననృతు శ్చాప్సరో గణాః ॥
గాయంత్యో మధురం తత్ర దేవైః శక్రోఽభ్యువాచ హ ।
అతనిమీద అంతరిక్షంనుండి పూలవాన పడింది. దేవదుందుభులు మ్రోగాయి. అప్సరసలు నృత్యం చేశారు. తీయగా గానం చేశారు. అపుడు ఇంద్రుడు దేవతలతో ఇలా పలికాదు.
శక్ర ఉవాచ
శకుంతలే తవ సుతః చక్రవర్తీ భవిష్యతి ॥
బలం తేజశ్చ రూపం చ న సమం భువి కేనచిత్ ।
ఆహర్తా వాజిమేధస్య శతసంఖ్యస్య పౌరవః ॥
అనేకాని సహస్రాణి రాజసూయాదిభి ర్మఖైః ।
స్వార్థం బ్రాహ్మణసాత్ కృత్వా దక్షిణామమితాం దదాత్ ॥
ఇంద్రుడిలా అన్నాడు- శకుంతలా! నీకుమారుడు చక్రవర్తి అవుతాడు. అతనితో సమానమైన బలం, పరాక్రమం కలవాడు ఈ భూమిమీద ఉండడు. పూరువంశంలో పుట్టిన ఇతడు నూరు అశ్వమేధాలు చేస్తాడు. రాజసూయాది యాగాలు వేలకొద్దీ చేసి బ్రాహ్మణులకు తన ధనాన్నంతా దక్షిణగా సమర్పిస్తాడు.
వైశంపాయన ఉవాచ
దేవతానాం వచః శ్రుత్వా కణ్వాశ్రమనివాసినః ।
సభాజయంత కణ్వస్య సుతాం సర్వే మహర్షయః ॥
శకుంతలా చ తచ్ఛ్రుత్వా పరం హర్షమవాస సా ।
ద్విజానాహూయ మునిభిః సత్కృత్య చ మహాయశాః ॥)
జాతకర్మాది సంస్కారం కణ్వః పుణ్యకృతాం వరః ।
విధివత్ కారయామాస వర్ధమానస్య ధీమతః ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు- దేవతల మాటలు విని కణ్వాశ్రమ నివాసులంతా, మహర్షులందరూ కణ్వుని కూత్రురు శకుంతలను గౌరవించారు. శకుంతల కూడ వారిమాటలను విని మిక్కిలి ఆనందించింది. గొప్ప యశస్సుగల కణ్వమహర్షి బ్రాహ్మణులను పిలిచి సత్కరించాడు. మునులచేత ఆ బాలునికి జాతకర్మాది సంస్కారం యథావిధిగా చేయించాడు. (3)
దంతైః శుక్లైః శిఖరిభిః సింహసంహననో మహాన్ ।
చక్రాంకితకరః శ్రీమాన్ మహామూర్ధా మహాబలః ॥ 4
అతడు తెల్లనై, మొనదేలిన దంతాలు, సింహంతో సమానమైన శరీరసౌష్ఠవం కలవాడు. చక్రాంకితమైన చేతులు, ఉన్నతమైన ఫాలం, గొప్పబలమూ కలవాడు. (4)
కుమారో దేవగర్భాభః స తత్రాశు వ్యవర్ధత ।
షడ్వర్ష ఏవ బాలః సః కణ్వాశ్రమపదం ప్రతి ॥ 5
సింహవ్యాఘ్రాన్ వరాహాంశ్చ మహిషాంశ్చ గజాం స్తథా ।
బబంధ వృక్షే బలవాన్ ఆశ్రమస్య సమీపతః ॥ 6
ఆ బాలుడు దేవతల బాలుడిలా ఉన్నాడు. అతడా ఆశ్రమంలో తొందరగా పెరగసాగాడు. ఆరుసంవత్సరాల బాలుడే అయినా కణ్వాశ్రమానికి దగ్గర్లో సింహవ్యాఘ్రాలను, అడవిపందులను, అడవి దున్నలను చెట్లకు కట్టివేసేవాడు. (5,6)
ఆరోహన్ దమయంశ్పైవ క్రీడంశ్చ పరిధావతి ।
(తతశ్చ రాక్షసాన్ సర్వాన్ పిశాచాంశ్చ రిపూన్ రణే ।
ముష్టియుద్ధేన తాన్ జిత్వా ఋషీనారాధయత్ తదా ॥
కశ్చిద్ దితిసుతస్తం తు హంతుకామో మహాబలః ।
వధ్యమానాంస్తు దైతేయాన్ అమర్షీ తం సమభ్యయాత్ ॥
తమాగతం ప్రహస్యైవ బాహుభ్యాం పరిగృహ్య చ ।
దృఢం చాబధ్య బాహుభ్యాం పీడయామాస తం తదా ॥
మర్దితో న శసాకాస్య మోచితుం బలవత్తయా ।
ప్రాక్రోశద్ భైరవం తత్ర ద్వారేభ్యో నిఃసృతం త్వసృక్ ॥
తేన శబ్దేన విత్రస్తాః మృగాః సింహాదయో గణాః ।
సుస్రువుశ్చ శకృన్మూత్రమ్ ఆశ్రమస్థాశ్చ సుస్రువుః ॥
నిరసుం జానుభిః కృత్వా విససర్జ చ సోఽపతత్ ।
తం దృష్ట్వా విస్మయం చక్రుః కుమారస్య విచేష్టితమ్ ॥
నిత్యకాలం వధ్యమానాః దైతేయా రాక్షసైః సహ ।
కుమారస్య భయాదేవ నైవ జగ్ముస్తదాశ్రమమ్ ॥)
తతోఽస్య నామ చక్రుస్తే కణ్వాశ్రమనివాసినః ॥ 7
అతడా సింహవ్యాఘ్రాదులపై ఎక్కుతూ, వాటిని లొంగదీస్తూ, వాటితో ఆడుతూ, పరిగెడుతూ ఉన్నారు. అతడు రాక్షసులను, పిశాచాలను, శత్రువులు యుద్ధంలో జయించాడు. ఋషులను ఆరాధించాడు. రాక్షసులను చంపుతున్న అతడిని చంపాలని ఒక బలవంతుడైన దైత్యుడు వచ్చాడు. అతడిని చూసి నవ్వుతూనే బాలుడు తన బాహువులతో బంధించి మర్దింపసాగాడు. అతడు ఆ బంధాన్ని విడిపించుకోలేకపోయాడు. అతడు బాధను తట్టుకోలేక భయంకరంగా ఆరిచాడు. శరీరంలోని రంధ్రాలనుండి రక్తం స్రవించింది. అతడు చేసిన శబ్దానికి భయపడిన మృగాలు, సింహాలు, మలమూత్రాలు విడుస్తూ పరుగెత్తాయి. ఆ కేకకు భయపడి ఆశ్రమంలో జంతువులు కూడా మలమూత్రాలు స్రవించాయి. తన మోకాళ్ళతో అతనిని ప్రాణం లేనివానిగా చేశాడు. అతడు నేలకొరిగాడు. ఆసన్నివేశం చూసిన ఆశ్రమవాసులు ఆ బాలుని పరాక్రమానికి ఆశ్చర్యపోయారు. అప్పటి నుండి ఆతనివల్ల భయంతో రాక్షసులు ఆశ్రమంలోకి వెళ్ళడం మానేశారు. అనంతరం ఆ ఆశ్రమనివాసులంతా అతనికి పేరుపెట్టారు. (7)
అస్త్వయం సర్వదమనః సర్వం హి దమయత్యసౌ ।
స సర్వదమనో నామ కుమారః సమపద్యత ॥ 8
విక్రమేణౌజసా చైవ బలేన చ సమన్వితః ।
అన్నింటిని అణచగలవాడు కావున ఇతడు 'సర్వదమనుడు' అగుగాక. అందువలన ఆ బాలుడు సర్వదమనుడు అయ్యాడు. పరాక్రమంచేత, తేజస్సుచేత, బలంచేత అతడు సర్వదమనుడే అయ్యాడు. (8 1/2)
(అప్రేషయతి దుష్యంతే మహిష్యా స్తనయస్య చ ।
పాండుభావపరీతాంగీం చింతయా సమభిప్లుతామ్ ॥
లంబాలకాం కృశాం దీనాం తథా మలినవాససమ్ ।
శకుంతలాం చ సంప్రేక్ష్య ప్రదధ్యౌ స మునిస్తదా ॥
శాస్త్రాణి సర్వవేదాశ్చ ద్వాదశాబ్దస్య చాభవన్ ॥)
పట్టపురాని శకుంతలకోసం, కుమారునికోసం దుష్యంతుడు మనుషులను పంపలేదు. శకుంతల చింతతో తెల్లగా పాలిపోయింది. వేలాడుతున్న జుట్టు, మలినవస్త్రం కలిగి కృశించి దీనంగా ఉంది శకుంతల. పన్నెండు సంవత్సరాలు నిండేసరికి పుత్రుడు శాస్త్రాలు, సర్వవేదాలు అధ్యయనం చేశాడు.
తం కుమారమృషి ర్దృష్ట్వా కర్మ చాస్యాతిమానుషమ్ ॥ 9
సమయో యౌవరాజ్యాయే త్యబ్రవీచ్చ శకుంతలామ్ ।
కణ్వమహర్షి అతిమానుషమైన అతనిచేష్టలను చూసి యౌవరాజ్యానికి తగినసమయమని శకుంతలతో ఇలా అన్నాడు. (9)
(శృణు భద్రే మమ సుతే మమ వాక్యం శుచిస్మితే ।
పతివ్రతానాం నారీణాం విశిష్టమితి చోచ్యతే ॥
(కల్యాణీ! ఆమ్మాయీ! పతివ్రతలైన స్త్రీలవిషయంలో విశిష్ట విషయాన్ని చెపుతున్నాను. నామాటను విను.
పతిశుశ్రూషణం పూర్వం మనోవాక్కాయచేష్టితైః ।
అనుజ్ఞాతా మయా పూర్వం పూజయైతద్ వ్రతం తవ ॥
ఏతేనైవ చ వృత్తేన విశిష్టాం లప్స్యసే శ్రియమ్ ।
మనస్సు, వాక్కు, శరీరం, కర్మలచే భర్తను ముందుగ సేవించాలి. నాచే అనుమతింపబడి ముందుగ భర్తను పుజించు. ఇది నీకు వ్రతం ఈ విధమైన ప్రవృత్తిచేతనే విశిష్టమైన సంపదను పొందగలవు.
తస్మాత్ భద్రే ప్రయాతవ్యం సమీపం పౌరవస్య హ ॥
స్వయం నాయాతి మత్వా తే గతం కాలం శుచిస్మితే ।
గత్వాఽఽరాధయ రాజానమ్ దుష్యంతం హితకామ్యయా ॥
భద్రా! అందువల్ల నీవు పూరువంశరాజైన దుష్యంతుని దగ్గరకు వెళ్ళు. అతడు స్వయంగా రావడంలేదనే ఆలోచనచేత నీకు కాలం గడిచిపోయింది. రాజు హితాన్ని కోరి నీవు దుష్యంతుని వద్దకు వెళ్ళి అతనిని సేవించు.
దౌష్యంతం యౌవరాజ్యస్థం దృష్ట్వా ప్రీతిమవాప్స్యసి ।
దేవతానాం గురూణాం చ క్షత్రియాణాం చ భామిని ॥
భర్తౄణాం చ విశేషేణ హితం సంగమనం సతామ్ ।
తస్మాత్ పుత్రి కుమారేణ గంతవ్యం మత్ప్రియేప్సయా ।
ప్రతివాక్యం న దద్యాస్త్వం శాపితా మమ పాదయోః ॥
నీకుమారుడగు దౌష్యంతుని యువరాజు పదవిలో చూసి ఆనందాన్ని పొందుతావు. దేవతలు, గురువులు, క్షత్రియులు, భర్త-వీరి యొక్క కలయిక సన్మార్గులకు విశేషమైన హితాన్ని కలిగిస్తుంది. అందువల్ల అమ్మాయీ! నాకిష్టాన్ని కలిగించేందుకైనా నీవు నీ కొడుకుతో భర్త దగ్గరకు వెళ్ళాలి. నాపాదాలపై ఒట్టేసి చెపుతున్నా. నీవు నాకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు.
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా సుతాం తత్ర పౌత్రం కణ్వోఽభ్యభాషత ।
పరిష్వజ్వ చ బాహుభ్యం మూర్ధ్న్యుపాఘ్రాయ పౌరవమ్ ॥
వైశంపాయనుడిలా అన్నాడు - కూతురుతో ఇలా మాట్లాడి కణ్వుడు మనుమని చేతులతో కౌగిలించుకొని, శిరస్సుపై ముద్దిడుకొని, ఇలా అన్నాడు.
కణ్వ ఉవాచ
సోమవంశోద్భవో రాజా దుష్యంతో నామ విశ్రుతః ।
తస్యాగ్రమహిషీ చైషా తవ మాతా శుచివ్రతా ॥
గంతు కామా భర్తృవశం త్వయా సహ సుమధ్యమా ।
గత్వాభివాద్య రాజానం యౌవరాజ్యమవాప్స్యసి ।
స పితా తవ రాజేంద్రః తస్య త్వం వశగోభవ ।
పితృపైతామహం రాజ్యమ్ అనుతిష్ఠస్వ భావతః ॥
కణ్వుడు ఇలా అన్నాడు. చంద్రవంశంలో పుట్టిన దుష్యంతుడు ప్రసిద్ధుడు. పవిత్రురాలయిన నీతల్లి ఆతనికి పట్టపురాణి. నీతోపాటు ఆమె భర్త దగ్గరకు వెళ్ళాలనుకొంటోంది. వెళ్ళి రాజుకు అభివాదం చేసి యౌవరాజ్యం పొందుతావు. ఆ రాజేంద్రుడు నీ తండ్రి, నీవతని అధీనంలో ఉండు. తాతతండ్రుల రాజ్యాన్ని సహజంగా పరిపాలన చెయ్యి.
శకుంతలే శృణుష్వేదం హితం పథ్యం చ భామిని ।
పతివ్రతాభావగుణాన్ హిత్వా సాధ్యం న కించన ॥
పతివ్రతానాం దేవా వై తుష్టాః సర్వవరప్రదాః ।
ప్రసాదం చ కరిష్యంతి హ్యాపదర్థే చ భామిని ॥
పతిప్రసాదాత్ పుణ్యగతిం ప్రాప్నువంతి న చాశుభమ్ ।
తస్మాద్ గత్వా తు రాజానమ్ ఆరాధయ శుచిస్మితే ॥)
శకుంతలా! హితమా, పథ్యమూ అయిన నామాట విను. పతివ్రతా సంబంధమగు గుణాలను విడిచి సాధింపదగింది లేదు. అన్నివరాల నిచ్చే దేవతలు ప్రతివ్రతలపట్ల సంతుష్టులై ఆపత్సమయంలో అనుగ్రహిస్తారు. భర్త అనుగ్రహంవల్ల పతివ్రతలు పుణ్యగతిని పొందుతారు. అమంగళాన్ని పొందరు. అందువల్ల నీవు వెళ్లి రాజును సేవించు.
తస్య తద్ బలమాజ్ఞాయ కణ్వః శిష్యానువాచ హ ॥ 10
శకుంతలామిమాం శీఘ్రం సహపుత్రా మితో గృహాత్ ।
భర్తుః ప్రాపయతాగారం సర్వలక్షణపూజితమ్ ॥ 11
కణ్వుడు బాలుని బలాన్ని గ్రహించిన శిష్యులతో ఇలా అన్నాడు- అన్ని మంచిలక్షణాలతో గౌరవింపదగిన ఈ శకుంతలను కుమారునితో బాటు తొందరగా ఈ ఇంటి నుండి తీసికొనివెళ్ళి భర్తనివాసానికి చేర్చండి. (10,11)
నారీణాం చిరవాసో హి బాంధవేషు న రోచతే ।
కీర్తి చారిత్రధర్మఘ్నః తస్మాన్నయత మాచిరమ్ ॥ 12
బంధువుల దగ్గర స్త్రీలు ఎక్కువకాలం ఉండటం మంచిదికాదు. అలా ఉంటే కీర్తికీ, నడవడికకూ, ధర్మానికీ హానికరం. అందువల్ల తొందరగా తీసికొని వెళ్ళండి. (12)
వి: తె: నన్నయ్య చక్కని నిర్ణయాత్మకమైన పద్యం వ్రాసినాడు.
ఎట్టి సాధ్వులకు బుట్టినయిండ్లను
బెద్దకాల మునికి తద్ద తగదు
పతుల కడన యునికి సతులకు ధర్మువు
సతుల కేడుగడయుఁ బతుల చూవె. (1-4-66)
(వైశంపాయన ఉవాచ
ధర్మాభిపూజితం పుత్రం కాశ్యపేన నిశామ్య తు ।
కాశ్యపాత్ ప్రాప్య చానుజ్ఞాం ముముదే చ శకుంతలా ॥
వైశంపాయనుడిలా అన్నాడు- కాశ్యపుడు ధర్మానుసారంగా తనకుమారుని ఆదరించడం విన్న శకుంతల కాశ్యపుని అనుమతిని పొంది ఆనందించింది.
కణ్వస్య వచనం శ్రుత్వా ప్రతిగచ్ఛేతి చాసకృత్ ।
తథేత్యుక్త్వా తు కణ్వం చ మాతరం పౌరవోఽబ్రవీత్ ।
కిం చిరాయసి మాత స్త్వం గమిష్యామో నృపాలయమ్ ।
కణ్వుడు అనేకపర్యాయాలు 'భర్తవద్దకువెళ్ళు' అని చెప్పడంవిని, పూరువంశసంజాతుడైన ఆ బాలుడు కణ్వునితో అట్లే అని పలికి, తల్లితో 'అమ్మా! నువ్వింకా ఆలస్యం చేస్తున్నావేమిటి? రాజభవనానికి వెళ్దాం' అన్నాడు.
ఏవముక్త్వా తు తాం దేవీం దుష్యంతస్య మహాత్మనః ।
అభివాద్య మునేః పాదౌ గంతుమైచ్ఛత్ స పౌరవః ।
మహాత్ముడైన దుష్యంతుని భార్య శకుంతలతో అలా పలికి, మహర్షి పాదాలకు నమస్కరించి, పూరువంశసంజాతుడైన సర్వదమనుడు బయలుదేరాడు.
శకుంతలా చ పితరమ్ అభివాద్య కృతాంజలిః ।
ప్రదక్షిణీకృత్య తదా పితరం వాక్యమబ్రవీత్ ।
అజ్ఞానాన్మే పితా చేతి దురుక్తం వాపి చానృతమ్ ॥
అకర్యం వాప్యనిష్టం వా క్షంతుమర్హతి కాశ్యప ।
శకుంతల కూడ తండ్రికి నమస్కరించి, చేతులు జోడించి ప్రదక్షిణంచేసి తండ్రితో ఇలా అంది- తండ్రి అనే చనవుతో ఆజ్ఞానంవల్ల పొరపాటు మాట్లాడినా, అసత్యం చెప్పినా, చేయకూడని పనిచేసినా, అనిష్టమైన పని చేసినా నన్ను క్షమించు.
ఏవముక్తో నతశిరాః మునిర్నోవాచ కించన ॥
మనుష్యభావాత్ కణ్వోఽపి మునిరశ్రూణ్యవర్తయత్ ।
ఆమె అలా పలుకగా కణ్వమహర్షి తలదించుకొని ఏమీ మాట్లాడలేదు. మనుష్యస్వభావంవల్ల అతడుకూడా కన్నీరు పెట్టుకొన్నాడు.
అబ్భక్షాన్ వాయుభక్షాంశ్చ శీర్ణపర్ణాశనాన్ మునీన్ ॥
ఫలమూలాశినో దాంతాన్ కృశాన్ ధమనిసంతతాన్ ।
వ్రతినో జటిలాన్ ముండాన్ వల్కలాజినసంవృతాన్ ॥
తన ఆశ్రమంలో జలభక్షకులున్నారు. వాయుభక్షకులు, పర్ణభక్షకులు, ఫలమూలాలు తినేవారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, కృశించి నవనాడులు కనిపిస్తున్నారు, కఠోరనియమం కలవరు, జటలుకలవారు, శిరోముండనం కలవారు, వల్కలాలు, అజినాలు ధరించినవారు ఉన్నారు. ఆ మునులను కణ్వుడు ఆహ్వానించాడు.
సమాహూయ మునీన్ కణ్వః కారుణ్యాదిదమబ్రవీత్ ॥
మయా తు లాలితా నిత్యం మమ పుత్రీ యశస్వినీ ।
వనే జాతా వివృద్ధా చ న చ జానాతి కించన ॥
అశ్రమేణ పథా సర్వైర్నీయతాం క్షత్రియాలయమ్ ।)
కణ్వుడు మునులందర్నీ పిలిచి శకుంతలమీది ప్రేమవల్ల ఇలా అన్నాడు - 'యశస్విని అయిన ఈమెను నిత్యమూ నేను లాలిస్తూ పెంచాను. వనంలో పుట్టింది, వనంలో పెరిగింది. ఏమీ తెలియని పిల్ల. శ్రమలేని మార్గంలో మీరంతా ఈమేను రాజభవనానికి తీసికొని వెళ్ళండి'.
తథేత్యుక్త్వా తు తే సర్వే ప్రాతిష్ఠంత మహౌజసః ।
శకుంతలాం పురస్కృత్య దుష్యంతస్య పురం ప్రతి ॥ 13
మహాతేజస్సుగల వారంతా 'అలాగే' అని శకుంతలను ముందిడుకొని దుష్యంతుని నగరానికి బయలుదేరారు. (13)
గృహీత్వామరగర్భాభం పుత్రం కమలలోచనమ్ ।
ఆజగామ తతః సుభ్రూః దుష్యంతం విదితాద్ వనాత్ ॥ 14
దేవకుమారునిలా ప్రకాశిస్తూ, పద్మంవంటి కన్నులున్న కుమారుని శకుంతల పరిచితమైన ఆ వనంనుండి దుష్యంతుని దగ్గరకు తీసికొని వచ్చింది. (14)
అభిసృత్వ చ రాజానం విదితా చ ప్రవేశితా ।
సహ తేనైవ పుత్రేణ బాలార్కసమతేజసా ॥ 15
రాజును సమీపించి, తనరాకను తెలిపింది- అనుమతింపబడి ఆమె బాలసూర్యునివలె ప్రకాశిస్తున్న కొడుకుతో లోనికి ప్రవేశించింది. (15)
నివేదయిత్వా తే సర్వే ఆశ్రమం పునరాగతాః ।
పూజయిత్వా యథాన్యాయమ్ అబ్రవీచ్చ శకుంతలా ॥ 16
ఆ మునులందరు రాజుకు నివేదించి ఆశ్రమానికి తిరిగి వచ్చారు. శకుంతల న్యాయానుసారంగా రాజును గౌరవించి ఇలా అంది. (16)
(అభివాదయ రాజానం పితరం తే దృఢవ్రతమ్ ।
ఏవముక్త్వా తు పుత్రం సా లజ్జానతముఖీ స్థితా ॥
స్తంభమాలింగ్య రాజానం ప్రసీదస్వేత్యువాచ సా ।
శాకుంతలోఽపి రాజానమ్ అభివాద్య కృతాంజలిః ॥
హర్షేణోత్ఫుల్లనయనః రాజానం చాన్వనైక్షత ।
దుష్యంతో ధర్మబుద్ధ్యా తు చింతయన్నేవ సోఽబ్రవీత్ ॥
'కఠొరనియమంగల్ రాజైన నీతండ్రికి నమస్కరించు' అని కుమారునితో పలికి, శకుంతల సిగ్గుతో తల దించుకొని స్తంభానికి ఆనుకొని రాజుతో 'అనుగ్రహించు' అని అంది. శకుంతల కొడుకు కూడ రాజునకు నమస్కరించి, చేతులు జోడించి ఆనందంతో వికసించిన కన్నులతో రాజును చూశాడు. రాజు కుడ ధర్మబుద్ధితో ఆలోచిస్తూనే ఇలా అన్నాడు.
దుష్యంత ఉవాచ
కిమాగమనకార్యం తే బ్రూహి త్వం వరవర్ణిని ।
కరిష్యామి న సందేహః సపుత్రాయా విశేషతః ॥
దుష్యంతుడిలా అన్నాడు - సుందరి! నీవు వచ్చినపని ఏమిటీ? చెప్పు చేస్తాను. సందేహం వద్దు. అందునా కొడుకుతో కలిసి వచ్చావు. ప్రత్యేకించి చేస్తాను.
శకుంతలలోవాచ
ప్రసీదస్వ మహారాజ వక్ష్యామి పురుషోత్తమ ॥)
శకుంతల ఇలా అంది. మహారాజా! పురుషోత్తమా! అనుగ్రహించు చెప్తాను.
అయం పుత్రస్త్వయా రాజన్ యౌవరాజ్యేఽభిషిచ్యతామ్ ।
త్వయా హ్యయం సుతో రాజన్ మయ్యుత్పన్నః సురోపమః ।
యథాసమయ మేతస్మిన్ వర్తస్వ పురుషోత్తమ ॥ 17
రాజా! ఈ కుమారుని నీవు యౌవరాజ్యాభిషిక్తుని చేయి. దేవతాసమానుడైన ఈ కుమారుడు నీచేత నాయందు జన్మించినవాడు. పురుషోత్తమా! (చేసుకొన్న) సమయానికి తగినట్టు ఈతని విషయంలో ప్రవర్తించు. (17)
యథా మత్సంగమే పూర్వం యః కృతః సమయస్త్వయా ।
తం స్మరస్వ మహాభాగ కణ్వాశ్రమపదం ప్రతి ॥ 18
మహాభాగా! కణ్వాశ్రమానికి నీవు వచ్చి నాతో కలిసినపుడు నీవు చేసిన ప్రతిజ్ఞను స్మరించు. (18)
సోఽథ శ్రుత్వైవ తద్ వాక్యం తస్యా రాజా స్మరన్నపి ।
అబ్రవీ న్న స్మరామీతి కస్య త్వం దుష్టతాపసి ॥ 19
ఆ మాటలువిని రాజు ఆమెను గుర్తించినా ఇలా అన్నాడు. 'దుష్టతాపసీ! నీవెవరికి సంబంధించినదానవో నాకు గుర్తులేదు". (19)
ధర్మకామార్థసంబంధం న స్మరామి త్వయా సహ ।
గచ్ఛ వా తిష్ఠ వా కామం యద్ వాపీచ్ఛసి తత్ కురు ॥ 20
నీతో నాకుగల, ధర్మ, కామ, అర్థ సంబంధం గుర్తురావటంలేదు. ఉండు, లేదా వెళ్ళు. స్వేచ్ఛగా నీవు ఏంచేయాలనుకొంటే అదే చెయ్యి. (20)
సైవముక్తా వరారోహా వ్రీడితేవ తపస్వినీ ।
నిఃసంజ్ఞేవ చ దుఃఖేవ తస్థా స్థూణేవ నిశ్చలా ॥ 21
అతడామెతో అలా అంటే, శకుంతల సిగ్గుపడి దీనురాలిలాగా చేష్టలుడిగి స్తంభంలా దుఃఖంతో నిశ్చలంగా ఉండిపోయింది. (21)
సంరంభామర్షతామ్రాక్షీ స్ఫురమాణౌష్ఠసంపుటా ।
కటాక్షై ర్నిర్దహంతీవ తిర్యగ్ రాజానమైక్షత ॥ 22
కోపంతో, అసహనంతో ఎర్రబడ్డ కన్నులతో, అదిరే పెదవులతో, చూపులతో దహిస్తున్నట్లు శకుంతల రాజును చూసింది. (22)
ఆకారం గూహమానా చ మన్యునా చ సమీరితా ।
తపసా సంభృతం తేజో ధారయామాస వై తదా ॥ 23
క్రోధంతో ఉన్న తన రూపాన్ని కప్పిపుచ్చుకొంటూ తపస్సుతో నింపుకొన్న తేజస్సుతో కోపాన్ని నిగ్రహించుకొంటూ నిలిచింది. (23)
సా ముహూర్తమివ ధ్యాత్వా దుఃఖామర్షసమన్వితా ।
భర్తార మభిసంప్రేక్ష్య క్రుద్ధా వచనమబ్రవీత్ ॥ 24
జానన్నపి మహారాజ కస్మాదేవం ప్రభాషసే ।
న జానామీతి నిఃశంకం యథాన్యః ప్రాకృతో జనః ॥ 25
ఆమె ఒకముహూర్తకాలం ఆలోచించి, దుఃఖంతో, అసహనంతో భర్తను చూసి, కోపించి ఇలా పలికింది- మహారాజా! తెలిసినవాడవై కూడా ప్రాకృతజనుడిలా 'నాకు తెలియదు' అని శంకలేకుండా ఎలా మాట్లాడుతున్నావు?! (24,25)
అత్ర తే హృదయం వేద సత్యస్త్యెవానృతస్య చ ।
కళ్యాణం వద సక్ష్యేణ మాఽఽత్మాన మవమన్యథాః ॥ 26
ఈ విషయంలో ఎది నిజమో ఏది అసత్యమో నీహృదయానికి తెలుసు.అ ది సాక్ష్యంగా శుభప్రదమైన మాట చెప్పు. నీ అంతరాత్మను నీవు అవమానించుకోకు. (26)
యో-న్యథా సంత మాత్మాన మన్యథా ప్రతిపద్యతే ।
కిం తేన న కృతం పాపం చౌరేణాత్మాపహారిణా ॥ 27
ఒకవిధంగా ఉన్న తన్ను గూర్చి వేరొకవిధంగా చెప్పేవాడు తన్ను తాను దొంగిలించుకొనేవాడు. అతడు ఎంతటి పాపాన్నైనా చేస్తాడు. (27)
ఏకోఽహమస్మీతి చ మన్యసే త్వం
న హృచ్ఛయం వేత్సి మునిం పురాణమ్ ।
యో వేదితా కర్మణః పాపకస్య
తస్యాంతికే త్వం వృజినం కరోషి ॥ 28
నీవు నేనొక్కడనే ఉన్నానని అనుకొంటున్నావు. హృదయంలో ఉన్న సనాతనమైన మునిని తెలియలేక పోతున్నావు. పాపాత్ముల పాపకర్మలన్నింటిని ఎరుగున్న ఆ మహర్షి ఎదురుగా నీవు పాపం చేస్తున్నావు. (28)
(ధర్మ ఏవ హి సాధూనాం సర్వేషాం హితకారణమ్ ।
నిత్యం మిథ్యావిహీనానాం న చ దుఃఖావహో భవేత్ ॥)
మన్యతే పాపకం కృత్వా న కశ్చిద్ వేత్తి మామితి ।
విదంతి చైనం దేవశ్చ యశ్పైవాంతరపూరుషః ॥ 29
అసత్యంలేకుండా సత్సురుషులందరికి హితాన్ని కలిగించేది ధర్మమే. అది ఎప్పుడూ దుఃఖాన్ని కలిగించదు. పాపంచేస్తూ నన్ను ఎవడూ ఎరుగడు, (నాగురించి ఎవరూ తేలుసుకోలేరు) అని భావించేవాడిని దేవతలెరుగుదురు. లోపల ఉన్న అంతరాత్మ ఎరుగును. (29)
ఆదిత్య చంద్రావనిలానలౌ చ
ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ ।
అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే
ధర్మశ్చ జానాతి నరస్య వృత్తమ్ ॥ 30
సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, అంతరిక్షం, భూమి, నీరు, హృదయం, యముడు, అహోరాత్రాలు, ప్రాతఃసాయంసంధ్యలు, ధర్మం ఇవి మానవుని నడవడిని తెలుసుకొంటాయి. (30)
యమో వైవస్వతస్తస్య నిర్యాతయతి దుష్కృతమ్ ।
హృది స్థితః కర్మసాక్షీ క్షేత్రజ్ఞో యస్య తుష్యతి ॥ 31
హృదయంలో ఉన్న కర్మసాక్షి, క్షేత్రజ్ఞుడు ఎవని పనికి సంతోషిస్తాడో అతని పాపాల్ని యమధర్మరాజు తొలగిస్తాడు. (31)
న తు తుష్యతి యస్యైష పురుషస్య దురాత్మనః ।
తం యమః పాపకర్మాణం వియాతయతి దుష్కృతమ్ ॥ 32
దుర్మార్గుడైన పురుషుని యొక్క పనులకు కర్మసాక్షి సంతోషింపకపోతే ఆ పాపాత్ముని యముడే తొలగిస్తాడు. (32)
యో ఽ వమన్యాత్మనాత్మానమ్ అన్యథా ప్రతిపద్యతే ।
న తస్య దేవాః శ్రేయాంసః యస్యత్మాపి న కారణమ్ ॥ 33
స్వయం ప్రాప్తేతి మామేవం మావమంస్థాః పతివ్రతామ్ ।
అర్చార్హాం నార్చయసి మాం స్వయం భార్యాముపస్థితామ్ ॥ 34
తన్నుతాను మోసం చేసికొని వేరొకవిధంగా చెప్పుకొనే వానికి, దేవతలుకూడ శ్రేయస్సు కలిగించలేరు. దానికి తాను కూడా కారణం, ప్రమాణం కాదు. నా అంతట నేనుగా వచ్చానని పతివ్రతనైన నన్ను ఈ విధంగా అవమానించవద్దు. స్వయంగా చెంతకువచ్చినా గౌరవార్హ అయిన భార్యనైన నన్ను నీవు గౌరవించటంలేదు. (33,34)
కిమర్థం మాం ప్రాకృతవద్ ఉపప్రేక్షసి సంపది ।
న ఖల్వహమిదం శూన్యే రౌమి కిం న శృణోషి మే ॥ 35
అనగరికునివలె ఈ సభలో ఎందుకు అవమానిస్తున్నావు? జనరహితమైన అరణ్యంలో నేనీమాటలు చెప్పటం లెదుకదా! నామాట నీవెందుకు వినటంలేదు? (35)
యది మే యాచమానాయాః వచనం న కరిష్యసి ।
దుష్యంత శతధా మూర్ధా తతస్తేఽద్య స్ఫుటిష్యతి ॥ 36
దుష్యంతా! ప్రార్థిస్తున్నప్పటికీ నీవు నా మాటలు లక్ష్యపెట్టకపోతే నీ శిరస్సు వంద ముక్కలుగా బ్రద్దలౌతుంది. (36)
భార్యాం పతిః సంప్రవిశ్య స యస్మాజ్ఞాయతే పునః ।
జాయాయాస్తద్ధి జాయాత్వం పౌరాణాః కవయో విదుః ॥ 37
భర్త భార్యలో ప్రవేశించి మరల సంతానంగా జన్మిస్తాడు. అందుకే భార్యను జాయ అని అంటారు. ఈ విషయం ప్రాచీన విద్వాంసులందరికీ తెలుసు. (37)
యదాగమవతః పుంసః తదపత్యం ప్రజాయతే ।
తత్ తారయతి సంతత్యా పూర్వప్రేతాన్ పితామహాన్ ॥ 38
శాస్త్రవిధి తెలిసిన పురుషునికి సంతానం కలిగితే ఆ సంతతి యొక్క పరంపర మునుపు మరణించిన పితామహులను కూడ తరింపజేస్తుంది. (38)
పుంనామ్నో నరకాద్యస్మాత్ పితరం త్రాయతే సుతః ।
తస్మాత్ పుత్ర ప్రోక్తః స్వయమేవ స్వయంభువా ॥ 39
తండ్రిని 'పుత్'నామ నరకం నుండి రక్షిస్తాడు కాబట్టి కొడుకుని 'పుత్రు'డన్నారు. ఈవిషయాన్ని బ్రహ్మయే స్వయంగా చెప్పాడు. (39)
(పుత్రేణ లోకాన్ జయతి పౌత్రేణానంత్యమశ్నుతే ।
అథ పౌత్రస్య పుత్రేన మోదంతే ప్రపితామహాః ॥)
పుత్రునిచే లోకాలను జయిస్తాడు. పౌత్రునిచే అక్షయసుఖాన్ని పొందుతాడు. పౌత్రుని కుమారునిచే ప్రపితామహులు కూడ ఆనందిస్తారు.
సా భార్యా యా గృహే దక్షా సా భార్యా యా ప్రజాపతీ ।
సా భార్యా యా పతిప్రాణా సా భార్యా యా పతివ్రతా ॥ 40
ఇంటి వ్యవహారంలో సమర్థంగా వ్యవహరించేదే భార్య. సంతానవతి అయినదే భార్య. పతికి ప్రాణంలా మసలుకొనేదే భార్య. పతివ్రతగా ఉండేదే భార్య. (40)
అర్ధం భార్యా మనుష్యస్య భార్యా శ్రేష్ఠతమః సఖా ।
భార్యా మూలం త్రివర్గస్య భార్యా మూలం తరిష్యతః ॥ 41
మానవునికి భార్య సగభాగం. భార్య ఉత్తమోత్తమమైన స్నేహితుడు. ధర్మార్థకామాలనే త్రివర్గాన్ని తరించాలనుకొనేవానికి భార్య మూలసాధనం. (41)
భార్యావంతః ప్రమోదంతే భార్యావంతః శ్రియోన్వితాః ॥ 42
భార్యకలవారే యజ్ఞాదిక్రియలు చేస్తారు. భార్య కలవారే ఉత్తములైన గృహస్థులు. భార్య కలవారే ఆనందించగలరు. భార్య కలవారే భాగ్యవంతులు. (42)
సఖాయః ప్రవివిక్తేషు భవంత్యేతాః ప్రియంవదాః ।
పితరో ధర్మకార్యేషు భవంత్యార్తస్య మాతరః ॥ 43
ఏకాంతసమయాలలో భార్యలు ప్రియంగా మాట్లాడుతూ మిత్రులవుతారు. ధర్మకార్యాలలో తండ్రులవుతారు. కష్టసమయంలో ఉన్న భర్తకు తల్లులవుతారు. (43)
కాంతారేష్వపి విశ్రామః జనస్యాధ్వని కస్య వై ।
యః సదారః సవిశ్వాస్యః తస్మాద్ దారాః పరాగతిః ॥ 44
అడవులలో ఉన్నవానికైనా భార్య మార్గంలో విశ్ఱాంతిని కల్గిస్తుంది. భార్యకలవారినే ఈ లోకం విశ్వసిస్తుంది. అందువల్ల పురుషునికి భార్యే ఉత్తమగతి. (44)
సంసరంత మపి ప్రేతం విషమేష్వేకపతినమ్ ।
భార్యైవాన్వేతి భర్తారం సతతం యా పతివ్రతా ॥ 45
ప్రపంచంలో జీవించిఉన్నా, మరణించినా, నరకలోకాల్లో పడినా పతివ్రత ఐన భార్య మాత్రమే ఎప్పుడూ భర్తను అనుసరిస్తుంది. (45)
ప్రథమ్M సంస్థితా భార్యా పతిం ప్రేత్య ప్రతీక్షతే ।
పూర్వం మృతం చ భర్తారం పశ్చాత్ సాధ్వ్యనుగచ్ఛతి ॥ 46
ముందుగా భార్య మరణిస్తే, ఆమె భర్తకోసం నిరీక్షిస్తుంది. భర్త ముందుగా మరణిస్తే, ఆమె భర్తను అనుసరిస్తుంది. (46)
ఏతస్మాన్ కారణాత్ రాజన్ పాణిగ్రహణమిష్యతే ।
యదాప్నోతి పతిర్భార్యామ్ ఇహ లోకే పరత్ర చ ॥ 47
రాజా! అందువల్లనే పాణిగ్రహణం అందరికీ ఇష్టమైంది. ఎందువల్లనంటే, భర్త భార్యను పొందడం వల్ల ఈ లోకంలోను, పరలోకంలోనూ కుడ సుఖాన్ని పొందుతాడు. (47)
ఆత్మా ఽఽత్మనైవ జనితః పుత్ర ఇత్యుచ్యతే బుధైః ।
తస్మాద్ భార్యాం నరః పశ్యేత్ మాతృవత్ పుత్రమాతరమ్ ॥ 48
తనద్వారా తానే భార్యగర్బంలో పుత్రరూపంలో జన్మిస్తాడని పండితులు చెప్తారు. అందువల్ల పుత్రునికి తల్లిఐన భార్యను భర్త తల్లిలా చూడాలి. (48)
(అంతరాత్మైన సర్వస్య పుత్ర నామ్నోచ్యతే సదా ।
గతీ రూపం చ చేష్టా చ ఆవర్తా లక్షణాని చ ॥
పితౄణాం యాని దృశ్యంతే పుత్రాణాం సంతి తాని చ ।
తేషాం శీలాచారగుణాః తత్ సంపర్కాచ్ఛుభాశుభాః ॥)
అందరికీ వారి అంతరాత్మే పుత్రరూపంగా ఎల్లప్పుడూ చెప్పబడుతోంది. తండ్రులయొక్క నడవడి, రూపం, చేష్ట, వ్యవహారం, లక్షణాలు పుత్రులతో కనబడుతూ ఉంటాయి. తండ్రి సంపర్కంవల్లే పుత్రులకు శుభాశుభాలైన శీల, ఆచార, గుణాలు వస్తూ ఉంటాయి.
భార్యాయాం జనితం పుత్రమ్ ఆదర్శేష్వివ చాననమ్ ।
హ్లాదతే జనితా ప్రేక్ష్య స్వర్గం ప్రాప్యేవ పుణ్యకృత్ ॥ 49
అద్దంలో ముఖాన్ని చూసుకొన్నట్లుగా భార్యయందు పుట్టిన కొడుకును చూసి, పుణ్యాత్ముడు స్వర్గంపొంది ఆనందించినట్లుగా భర్త ఆనందిస్తాడు. (49)
దహ్యమానా మనోదుఃఖైః వ్యాధిభి శ్చాతురా నరాః ।
హ్లాదంతే స్వేషు దారేషు ఘర్మార్తాః సలిలేష్వివ ॥ 50
వేసవిఎండకు తపించిపోయిన జనులు నీళ్లతో ఆనందించినట్లుగా, మానసిక వ్యాధితోనూ, శారీరక వ్యాధులతోనూ బాధపడుతున్నవారు తమ భార్యలు దగ్గరుంటే ఆనందాన్ని పొందుతున్నారు. (50)
(విప్రవాసకృశా దీనా నరా మలినవాసనః ।
తేఽపి స్వదారాం స్తుష్యంతి దరిద్ర ధనలాభవత్ ॥)
దరిద్రులు ధనం దొరికితే సంతోషించినట్లుగా ప్రవాసంచేత కృశించి, దైన్యంతో, మాసిన బట్టలతో తిరిగివచ్చిన పురుషులు తమ భార్యలను చేరుకోగానే ఆనందిస్తారు.
సుసంరబ్ధోఽపి రామాణాం న కుర్యాదప్రియం నరః ।
రతిం ప్రీతిం చ ధర్మం చ తాస్వాయత్తమవేక్ష్య హి ॥ 51
రతి, ప్రీతి, ధర్మమూ స్త్రీల అధీనంలో ఉండడాన్ని గమనించి, పురుషుడు కోపంలో ఉన్నాసరే, స్త్రీలకు అప్రియం చేయడు. (51)
(ఆత్మనోఽర్ధమితి శ్రౌతం సా రక్షతి ధనం ప్రజాః ।
శరీరం లోకయాత్రాం వై ధర్మం స్వర్గమృషీన్ పితౄన్ ॥)
భార్య తనలో (భర్తలో)సగభాగమని వేదం చెపుతోంది. ఆమె ధనం, సంతానం, శరీరం, లోకవ్యవహారం, ధర్మం, స్వర్గం, ఋషులు, పితరులు అన్నింటినీ రక్షిస్తుంది.
ఆత్మనో జన్మనః క్షేత్రం పుణ్యం రామాః సనాతనమ్ ।
ఋషీణామపి కా శక్తిః స్రష్టుం రామామృతే ప్రజామ్ ॥ 52
తాను (పురుషుడు) పుట్టడానికి స్త్రీలు సనాతనమైన పవిత్రమైన క్షేత్రాలు అని గ్రహించాలి. స్త్రీ లేకుండా సంతానం కలిగించడానికి ఋషులకు కూడా శక్తి లేదు. (52)
ప్రతిపద్య యదా సూనుః ధరణీరేణుగుంఠితః ।
పితురాశ్లిష్యాఽంగాని కిమస్త్యభ్యధికం తతః ॥ 53
నేలమీది ధూళి అంటిన కొడుకు వచ్చి తండ్రిని కౌగిలించుకుంటే, అంతకంటె తండ్రికి ఇంకేమి కావాలి? (53)
స త్వం స్వయమభిప్రాప్తం సాభిలాషమిమం సుతమ్ ।
ప్రేక్షమాణం కటాక్షేణ కిమర్థమవమన్యసే ॥ 54
అండాని బిభ్రతి స్వాని న భిందంతి పిపీలికాః ।
న భరేథాః కథం ను త్వం ధర్మజ్ఞః సన్ స్వమాత్మజమ్ ॥ 55
అటువంటి తండ్రివైన నీవు స్వయంగా వచ్చి, కోరికతో నిన్నే చూస్తున్న కొడుకును ఎందుకు తిరస్కరిస్తున్నావు? చీమలు కూడా తమ అండాలను రక్షించుకొంటాయి. చిదిపి వెయ్యవు. ధర్మజ్ఞుడవై కూడ నీవు నీకుమారుని ఎందుకు భరించటంలేదు? (54,55)
(మమాండానీతి వర్ధంతే కోకిలానపి వాయసాః ।
కిం పునస్త్వం న మన్యేథాః సర్వజ్ఞః పుత్రమీదృశమ్ ॥
మలయాచ్చందనం జాతమ్ అతిశీతం వదంతి వై ।
శిశోరాలింగ్యమానస్య చందనాదధికం భవేత్ ॥)
తమ అండాలనే భావంతో కాకులు కోకిలలను కూడా పెంచుతున్నాయి. కాని సర్వజ్ఞుడవైన నీవు ఇటువంటి కొడుకును ఆదరించటం లేదేమి? మలయపర్వతం మీదపుట్టిన చందనం మిక్కిలి చల్లనిదని అంటారు. అంతకంటె ఎక్కువ చల్లదనం తండ్రికి కొడుకును (బిడ్డను) కౌగిలించుకోవటం వల్ల కలుగుతుంది.
న వాససాం న రామాణాం నాపాం స్పర్శస్తథావిధః ।
శిశోరాలింగయమానస్య స్పర్శః సూనోర్యథాసుఖఆఝా ॥ 56
కొడుకును కౌగిలించుకొనే తండ్రికి పుత్రస్పర్శ వల్ల కలిగినంత సుకం వస్త్రాలను గాని, స్త్రీలను గాని, నీళ్ళనుగాని స్పృశించడం వల్ల కలుగదు. (56)
బ్రాహ్మణో ద్విపదాం శ్రేష్ఠః గౌర్వరిష్ఠా చతుష్పదామ్ ।
గురుర్గరీయసాం శ్ఱేష్ఠః పుత్రః స్పర్శవతాం వరః ॥ 57
(రెండు కాళ్లున్న) మనుషుల్లో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. (నాలుగు పాదాలున్న) పశువుల్లో గోవు శ్రేష్ఠమైంది. పెద్దవారిలో గురువు శ్రేష్ఠుడు. స్పృశింపదగినవారిలో పుత్రుడు శ్రేష్ఠుడు. (57)
స్పృశతు త్వాం సమాశ్లిష్య పుత్రోఽయం ప్రియదర్శనః ।
పుత్రస్పర్శాత్ సుఖతరః స్పర్శో లోకే న విద్యతే ॥ 58
దర్శనమాత్రంచేతనే ఇష్టుడయ్యే ఈ కుమారుడు నిన్ను కౌగిలించుకొని స్పృశించనియ్యి. ఈలోకంలో పుత్ర స్పర్శకు మించిన సుఖమేదీ లేదు. (58)
వి: సం: అన్ని శ్లోకాలను క్రోడీకరిస్తూ తెలుగులో నన్నయ చక్కని మత్తేభం వ్రాశాడు.
విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ యీ పుత్రగా
త్ర పరిష్వంగ సుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్రపరాగప్రసరంబు చందనము చంద్రజ్యోత్స్నయుం బుత్రగా
త్రపరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున శీతమే!
త్రిషు వర్షేషు పూర్ణేషు ప్రజాతాహమరిందమ ।
ఇమం కుమారం రాజేంద్ర తవ శోకవినాశనమ్ ॥ 59
ఆహర్తా వాజిమేధస్య శతసంఖ్యస్య పౌరవ ।
ఇతి వాగంతరిక్షే మాం సూతకేఽభ్యవదత్ పురా ॥ 60
రాజేంద్రా! నీ దుఃఖాన్ని పోగొట్టే ఈ కుమారుని నేను మూడు సంవత్సరాలు మోసి కన్నాను. పౌరవా! ఇతనిని కన్నపుడు ఇతడు నూరు అశ్వమేధాలను చేస్తాడని అంతరిక్షంనుండి అశరీరవాక్కు నాకు చెప్పింది. (59,60)
నను నామాంకమారోపయ స్నేహాద్ గ్రామాంతరం గతాః ।
మూర్ధ్ని పుత్రానుపాఘ్రాయ ప్రతినందంతి మానవాః ॥ 61
సాధారణంగా మానవులు గ్రామాంతరం వెళ్ళి వచ్చిన పిదప ప్రేమతో పుత్రులను ఒడిలో కూర్చోపెట్టుకొని శిరసుపై ఆఘ్రాణించి ఆనందిస్తారు. (61)
వేదేష్వపి వదంతీమమ్ మంత్రగ్రామం ద్విజాతయః ।
జాతకర్మణి పుత్రాణాం తవాపి విదితం తథా ॥ 62
పుత్రుల జాతకర్మలో బ్రాహ్మణులు వేదాలలోని ఈమంత్రసముదాయాన్ని చెపుతూ ఉంటారు. ఈ విషయం నీకూ తెలుసు. (62)
అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ।
ఆత్మా వై పుత్రనామాసి స జీవ శరదః శతమ్ ॥ 63
(ఇరువురి) శరీరావయవాల నుండి పుడుతున్నావు. హృదయంనుండి జన్మిస్తున్నావు. పుత్రునిగా చెప్పబడుతున్న నీవు నా ఆత్మవే. అట్టి నీవు నూరుసంవత్సరాలు జీవించు. (63)
జీవితం త్వదధీనం మే సంతానమపి చాక్షయమ్ ।
తస్మాత్ త్వం జీవ మే పుత్ర సుసుఖీ శరదాం శతమ్ ॥ 64
నా జీవితం, అక్షయమైన సంతానపరంపర నీ అధీనంలొ ఉన్నాయి. అందువల్ల కుమారా! నీవు సుఖంగా నూరుసంవత్సరాలు జీవించు. (64)
త్వదంగేభ్యః ప్రసూతో ఽయం పురుషాత్ పురుషో ఽపరః ।
సరసీవామలే ఽత్మానం ద్వితీయం పశ్య వై సుతమ్ ॥ 65
ఈ బాలుడు నీ శరీరంనుండి జన్మించాడు. ఒక పురుషుని నుండి వేరొక పురుషుడు జన్మించినట్లుగా, స్వచ్ఛమైన సరస్సులోని ప్రతిబింబంలా ఈ కుమారుని నీ రెండవ రూపంగా, ప్రతిరూపంగా చూడు. (65)
యథా హ్యాహవనీయో ఽగ్నిః గార్హపత్యాత్ ప్రణీయతే ।
తథా త్వత్తః ప్రసూతో ఽయమ్ త్వమేకః సన్ ద్విథా కృతః ॥ 66
మృగావకృష్టేన పురా మృగయాం పరిధావతా ।
అహ మాసాదితా రాజన్ కుమారి పితురాశ్రమే ॥ 67
గార్హపత్యాగ్ని నుండి ఆహవనీయాగ్ని ఏర్పడినట్లుగా నీనుండి ఈ కుమారుడు జన్మించాడు. నీవు ఒక్కడివే రెండుగా చేయబడ్డావు. మునుపు నీవు వేటలో ఒకలేడిచే ఆకర్షింపబడి పరిగెడుతూ నాతండ్రి ఆశ్రమంలో కన్యనైన నన్ను కలుసుకున్నావు. (66,67)
ఊర్వశీ పూర్వచిత్తిశ్చ సహజన్యా చ మేనకా ।
వ్శ్వాచీ చ ఘృతాచీ చ షడేవాప్సరసాం వరాః ॥ 68
ఈర్వశి, పూర్వచిత్తి, సహజన్య, మేనక, విశ్వాచి, ఘృతాచి ఈ ఆరుగురు అప్సరసలలో శ్రేష్ఠులు. (68)
తాసాం సా మేనకా నామ బ్రహ్మయోనిర్వరాప్సరాః ।
దివః సంప్రాప్య జగతీం విశ్వామిత్రాదజీజనత్ ॥ 69
వారిలో బ్రహ్మసంభవ ఐన మేనక శ్రేష్ఠురాలైన అప్సర. ఆమె స్వర్గం నుండి ఈ లోకంలోకి వచ్చి విశ్వామిత్రునివల్ల సంతానాన్ని కన్నది. (69)
(శ్రీమానృషి ర్ధర్మపరః వైశ్వానర ఇవాపరః ।
బ్రహ్మయోనిః కుశో నామ విశ్వామిత్రపితామహః ॥
కుశస్య పుత్రో బలవాన్ కుశనాభశ్చ ధార్మికః ।
గాధిస్తస్య సుతో రాజన్ విశ్వామిత్రస్తు గాధిజః ।
ఏవంవిధః పితా రాజన్ మేనకా జననీ వరా ॥)
అగ్నివంటివాడు, ధర్మపరుడు, బ్రహ్మసంభవుడు, విశ్వామిత్రుని తాత, శ్రీమంతుడు అయిన కుశుడనే ఋషి ఉండేవాడు. ఆ కుశునికి బలవంతుడూ, ధార్మికుడూ అయిన కుశనాభుడనే పుత్రుడున్నాడు. అతని కుమారుడు గాధి. అతనికుమారుడు విశ్వామిత్రుడు. అటువంటి విశ్వామిత్రుడు నా తండ్రి. మేనక నా తల్లి.
సా మాం హిమవతః ప్రస్థే సుషునే మేనకాప్సరాః ।
అవకీర్య చ మామ్ యాతా పరాత్మజమివాసతీ ॥ 70
ఆ అప్సర మేనక నన్ను హిమవత్పర్వత సానువుమీద ప్రసవించింది. ఆ మేనక నన్ను ఇతరుల సంతానంలా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. (70)
(పక్షిణః పుణ్యవంతస్తే సహితా ధర్మతస్తదా ।
పక్షై స్తైరభిగుప్తా చ తస్మాదస్మి శకుంతలా ॥
తతో ఽహమృషిణా దృష్టా కాశ్యపేన మహాత్మనా ।
జలార్థమగ్నిహోత్రస్య గతం దృష్ట్వా తు దక్షిణః ॥
న్యాసభూతామివ మునేః ప్రదదుర్మాం దయావతః ।
స మారణిమివాదాయ స్వమాశ్రమ ముపాగమత్ ॥
సా వై సంభావితా రాజన్ అనుక్రోశాన్మహర్షిణా ।
తేనైవ స్వసుతేవాహం రాజన్ వై పరమర్షిణా ॥
విశ్వామిత్రసుతా చాహం అనే వర్ధితా మునినా నృప ।
యౌవనే వర్తమానాం చ దృష్టవానసి విజనే వనే ।
ధాత్రా ప్రచోదితాం శూన్యే పిత్రా విరహితాం మిథః ॥
వాగ్భిస్త్వం సూనృతాభి ర్మామ్ అపత్యార్థమచూచుదః ।
అకార్షీ స్త్వాశ్రమే వాసం ధర్మకామార్థనిశ్చితమ్ ॥
గాంధర్వేన వివాహేన విధినా పాణిమగ్రహీః ।
సాహం కులం చ శీలం చ సత్యవాదిత్వమాత్మనః ॥
స్వధర్మం చ పురస్కృత్య త్వామద్య శరణం గతా ।
తస్మాన్నార్హసి సంశ్రుత్య తథేతి వితథం వచః ॥
స్వధర్మం పృష్ఠతః కృత్వా పరిత్యక్తుముపస్థితామ్ ।
త్వన్నాథం లోకనాథస్త్వం నార్హసి త్వ మనాగసమ్ ॥)
పుణ్యాత్మములైన పక్షులు కలిసి వాటిధర్మంగా రెక్కలతో నన్ను రక్షించాయి. అందువల్లనే నేను శకుంతలను, అటుపై మహర్షి కాశ్యపుడు అగ్నిహోత్రంకోసం నీటికై నదీతీరానికి వెళ్ళాడు. అపుడతనిని చూసి పక్షులు దయాళువైన అతనికి నన్ను న్యాసంగా ఇచ్చాయి. అతడు నన్ను అరణివలె తన ఆశ్రమానికి తీసికొని వచ్చాడు. రాజా! ఆ మహర్షి నాపట్ల జాలివల్ల నన్ను కూత్రుగా పెంచాడు. విశ్వామిత్రుని కూతుర్ని అవటం వల్ల కూడ ఆ ఋషి నన్ను పెంచాడు. యౌవనంలో ఉన్న నన్ను నీవు చూశావు. ఆశ్రమంలో పర్ణశాలలో తండ్రి దగ్గరలేని సమయంలో ఒంటరిగా ఉన్న నన్ను విధిప్రేరణతో నీవు మంచిమాటలతో సంతానంకోసం ప్రేరేపించావు. ధర్మార్థకామసమ్మతమైన ఆశ్రమంలో నివసించావు. గాంధర్వ విధితో నన్ను వివాహం చేసికొన్నావు. అటువంటి నేను నీవంశాన్ని శీలాన్ని, సత్యవాదిత్వాన్ని, స్వధర్మాన్ని గౌరవించి ఈ రోజు నిన్ను శరణువేడాను. అందువల్ల 'అలాగే' అని మాటిచ్చి ఇపుడు దాన్ని అసత్యంచేయడం నీకు తగదు. నీవు ఈ జగత్తుకు రక్షకుడవు. నాకు ప్రాణనాథుడవు. నిన్ను సమీపించిన నిర్దోషినైన నన్ను స్వధర్మాన్ని వెనక్కిపెట్టి విడిచిపెట్టడం నీకు తగినది కాదు.
కిం ను కర్మాశుభం పూర్వం కృతవత్యన్యజన్మని ।
యదహం బాంధవై స్త్యక్తా బాల్యే సంప్రతి చ త్వయా ॥ 71
పూర్వజన్మలో నేను ఏ పాపకర్మ చేశానో ఈ జన్మలో బాల్యంలో బంధువులచేత, ఇపుడు నీచేత విడువబడ్డను. (71)
కామం త్వయా పరిత్యక్తా గమిష్యామి స్వమాశ్రమమ్ ।
ఇమం తు బాలం సంత్యక్తుం నార్హస్యాత్మజమాత్మనః ॥ 72
నీవు స్వేచ్ఛగా నన్ను విడిచిపెట్టితే నేను తిరిగి మా ఆశ్రమానికి వెళ్తాను. కాని నీకుమారుడైన ఈ బాలుని విడిచిపెట్టడం నీకు తగదు. (72)
దుష్యంత ఉవాచ
న పుత్ర మభిజానామి త్వయి జాతం శకుంతలే ।
అసత్యవచనా నార్యః కస్తే శ్రద్ధాస్యతే వచః ॥ 73
మేనకా నిరనుక్రోశా బంధకీ జననీ తవ ।
యయా హిమవతః పృష్ఠే నిర్మాల్యమివ చోజ్ఘితా ॥ 74
దుష్యంతుడిలా అన్నాడు- శకుంతలా! నీకు పుట్టిన ఈ కుమారుని నేను గుర్తింపలేకున్నాను. సాదారణంగా స్త్రీలు అసత్యమాడతారు. మీమాటనెవరు నమ్ముతారు? వేశ్య అయిన నీతల్లి మేనక జాలి లేనట్టిది. అందుకే హిమవత్పర్వత సానువులపై నిర్మాల్యంలా నిన్ను విడిచిపెట్టింది. (73,74)
వి: నిర్మాల్యం: భగవంతునికి చేసిన పూజాపుష్పాలు వాడిపోతే మరునాడు వాటిని 'నిర్మాల్యం' అంటారు.
స చాపి నిరనుక్రోశః క్షత్రయోనిః పితా తవ ।
విశ్వామిత్రో బ్రాహ్మణత్వే లుబ్ధః కామవశం గతః ॥ 75
క్షత్రజాతిలో పుట్టిన నీతండ్రి విశ్వామిత్రుడు కూడా జాలిలేనివాడే. బ్రాహ్మణత్వం మీది లోభంతో తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు కామానికి వశమయ్యాడు. (75)
మేనకాప్సరసాం శ్రేష్ఠా మహర్షీణాం పితా చ తే ।
తయోరపత్యం కస్మాత్ త్వం పుంశ్చలీవ ప్రభాషసే ॥ 76
అప్సరసలలో శ్రేష్ఠ మేనక్. మహర్షులలో శ్రేష్ఠుడు నీతండ్రి. వారిరువరి సంతానమైన నీవు వేశ్యాస్త్రీ వలె మాట్లాడుతున్నావేమిటి? (76)
అశ్రద్ధేయమిదం వాక్యం కథయంతీ న లజ్జసే ।
విశేషతో మత్సకాశే దుష్టతాపసి గమ్యతామ్ ॥ 77
విశ్వసింపదగని మాటలు చెపుతున్న నీవు సిగ్గుపడటంలేదు. ప్రత్యేకించి నాదగ్గర చెప్పడానికి సంకోచం కలుగలేదా! దుష్టతాపసీ! ఇకవెళ్లు. (77)
క్వ మహర్షిః స చైవాగ్ర్యః సాప్సరాః క్వ చ మేనకా ।
క్వ చ త్వమేవం కృపణా తాపసీవెషధారిణీ ॥ 78
మునిశ్రేష్ఠుడైన ఆ మహర్షి ఎక్కడ? అప్సరస అయిన ఆ మేనక ఎక్కడ? తాపసి వేషం ధరించి దీనురాలుగా ఉన్న నీవెక్కడ? (78)
అతికాయశ్చ తే పుత్రో బాలో ఽతిబలవానయమ్ ।
కథ మల్పేన కాలేన శాలస్తంభ ఇవోద్గతః ॥ 79
అతికాయుడు, మిక్కిలి బలవంతుడూ అయిన ఈ నీ కొడుకు తక్కువకాలంలోనే సాలస్తంభంలా ఎలా పెరిగాడు? (79)
సునికృష్టా చ తే యోనిః పుంశ్చలీవ ప్రభాషసే ।
యదృచ్ఛయా కామరాగాత్ జాతా మేనకయా హ్యసి ॥ 80
నీ జన్మ నీచమైంది. కులటవలె మాట్లాడుతున్నావు. కామవశంవల్ల అనుకోకుండా మేనకకు నీవు జన్మించావు. (80)
సర్వమేతత్ పరోక్షం మే యత్ త్వం వదసి తాపసి ।
నాహం త్వామభిజానామి యథేష్టం గమ్యతాం త్వయా ॥ 81
తాపసీ! నీవు చెపుతున్నదంతా నాపరోక్షంలో జరిగిందే నేను నిన్ను ఎరుగను. నీవు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. (81)
శకుంతలోవాచ
రాజన్ సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యసి ।
ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి న పశ్యసి ॥ 82
శకుంతల ఇలా అంది - రాజా! ఆవగింజంత ఇతరుల దోషాన్ని చూస్తున్నావు. మారేడు కాయంత స్వదోషాన్ని చూస్తున్నా చూడనట్లుగా ఉన్నావు. (82)
మేనకా త్రిదశేష్వేవ త్రిదశా శ్చానుమేనకామ్ ।
మమైవోద్రిచ్యతే జన్మ దుష్యంత తవ జన్మనః ॥ 83
మేనక దేవతలలో ఉంది. దేవతలంతా మేనకను అనుసరిస్తున్నారు. దుష్యంతా! నీజన్మకంటె నాజన్మే గొప్పది. (83)
క్షితావటసి రాజేంద్ర అంతరిక్షే చటామ్యహమ్ ।
ఆవయోరంతరం పశ్య మేరుసర్షపయోరివ ॥ 84
రాజేంద్రా! ణివు భూమిమీద త్రిరుగుతున్నావు. నేను అంతరిక్షంలో సంచరిస్తున్నాను. చూడు. నాకూ, నీకూ మేరుపర్వతానికి, ఆవగింజకు ఉన్నంత తేడా ఉంది. (84)
మహేంద్రస్య కుబేరస్య యమస్య వరుణస్య చ ।
భవనాన్యనుసంయామి ప్రభావం పశ్య మే నృప ॥ 85
రాజా! నేను మహేంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు మున్నగు వారిళ్లకి వెళ్తాను. నాప్రభావం చూడు. (85)
సత్యశ్చాపి ప్రవాదో ఽయం యం ప్రవక్ష్యామి తేఽనఘ ।
నిదర్శనార్థం న ద్వేషా చ్ఛ్రుత్వా తం క్షంతుమర్హసి ॥ 86
లోకంలో ఒక నానుడి ఉంది. అది నిజంకూడ. ద్వేషంవల్ల కాదు, నిదర్శనంకోసం చెప్తాను. దానిని విని క్షమించు. (86)
విరూపో యావదాదర్శే నాత్మనః పశ్యతే ముఖమ్ ।
మన్యతే తావదాత్మానమ్ అన్యేభ్యో రూపవత్తరమ్ ॥ 87
కూరూపి అద్దంలో తన ముఖాన్ని చూడనంతసేపూ తన్ను ఇతరులకంటె అందమైనవాడిగా భావిస్తాడు. (87)
యదా స్వముఖమాదర్శే వికృతం సో ఽభివీక్షతే ।
తదాంతరం విజానీతే ఆత్మానం చేతరం జనమ్ ॥ 88
అద్దంలో తన వికృతమైన ముఖాన్ని చూశాక ఇతరునికీ, తనకూ ఉన్న తేడాను తెలిసికొంటాడు. (88)
అతీవ రూపసంపన్నః న కంచిదవమన్యతే ।
అతీవ జల్పన్ దుర్వాచః భవతీహ విహేఠకః ॥ 89
మిక్కిలి అందమైనవాడు ఎవరినీ అవమానించడు. కాని రూపవంతుడు కాకున్నా తనరూపాన్ని ప్రశంసించుకొనేవాడు తన చెడుమాటలతో ఇతరులను హింసిస్తాడు. (89)
మూర్ఖో హి జల్పతాం పుంసాం శ్రుత్వా వాచః శుభాశుభాః ।
అశుభం వాక్యమాదత్తే పురీషమివ సూకరః ॥ 90
మానవులు మాట్లాడే శుభాశుభాలైన మాటలను విని మూర్ఖుడు పంది 'మలాన్ని' గ్రహించినట్లు అశుభమైన వాక్యాన్నే గ్రహిస్తాడు. (90)
ప్రాజ్ఞస్తు జల్పతాం పుంసాం శ్రుత్వా వాచః శుభాశుభాః ।
గుణవద్ వాక్యమాదత్తే హంసః క్షీరమివాంభసః ॥ 91
మానవులు మాట్లాడే శుభాశుభవచనాలు విని ప్రాజ్ఞుడు నీటినుండి హంస పాలను గ్రహించినట్లుగ గుణవంతమయిన వాక్యాన్నే గ్రహిస్తాడు. (91)
అన్యాన్ పరివదన్ సాధుః యథా హి పరితస్యతే ।
తథా పరివదన్నన్యన్ తుష్టో భవతి దుర్జనః ॥ 92
ఇతరులను నిందిస్తున్నపుడు సత్పురుషుడు పరితాపం చెందుతాడు. దుర్జనుడు ఇతరులను నిందిస్తూ తాను ఆనందిస్తాడు. (92)
అభివాద్య యథా వృద్ధాన్ సంతో గచ్ఛంతి నిర్వృతమ్ ।
ఏవం సజ్జనమాక్రుశ్య మూర్ఖో భవతి నిర్వృతః ॥ 93
సుఖం జీవం త్యదోషజ్ఞాః మూర్ఖా దోషానుదర్శినః ।
యత్ర వాచ్యాః పరైః సంతః పరానాహు స్తథావిధాన్ ॥ 94
సత్పురుషులు వృద్ధులకు నమస్కరించి ఆనందాన్ని పొందుతారు. మూర్ఖుడు సజ్జనుని నిందించి ఆనందాన్ని పొందుతాడు. ఇతరులదోషాలను గుర్తింపని సత్పురుషులు సుఖంగానే జీవిస్తారు. ఇతరుల దోషాలను మాత్రమే చూస్తూంటారు మూర్ఖులు. ఏ దోషాలచేత మూర్ఖులు నిందింపదగిన వారుగా సత్పురుషులు భావిస్తారో, అవే దోషాలను సత్పురుషులపై ఆరోపించి మూర్ఖులు వారిని నిందిస్తారు. (93,94)
అతో హాస్యతరం లోకే కించిదన్యన్న విద్యతే ।
యత్ర దుర్జనమిత్యాహ దుర్జనః సజ్జనం స్వయమ్ ॥ 95
తాను దుర్జనుడై ఉండి సజ్జనుని దుర్జనుడని చెప్పడం కంటె మించిన హాస్యాస్పదమైనది ఈలోకంలో మరొకటి లేదు. (95)
సత్యధర్మచ్యుతాత్ పుంసః క్రుద్ధా దాశీవిషాదివ ।
అనాస్తికో ఽప్యుద్విజతే జనః కిం పునరాస్తికః ॥ 96
కోపించిన సర్పంవల్ల భయపడినట్లుగా సత్యధర్మాల నుండి భ్రష్టుడైన వానివల్ల నాస్తికుడు కూడ భయపడతాడు. ఇక ఆస్తీకుని విషయంలో చెప్పేదేముంది? (96)
స్వయముత్పాద్య వై పుత్రం సదృశం యోమ మన్యతే ।
తస్య దేవాః స్రియం ఘ్నంతి న చ లోకానుపాశ్నుతే ॥ 97
స్వయంగా తాను పుత్రుని కలిగించి అతనిని ఆదరింపని వాని భాగ్యాన్ని దేవతలు నశింపజేస్తారు. అతడు ఉత్తమలోకాలకు కూడ వెళ్ళడు. (97)
కులవంశప్రతిష్ఠాం హి పితరః పుత్రమబ్రువన్ ।
ఉత్తమం సర్వధర్మాణాం తస్మాత్ పుత్రం న సంత్యజేత్ ॥ 98
పుత్రుడిని కులానికీ, వంశానికీ, ప్రతిష్ఠ కలిగించే వాడిగా పితరులు చెప్పారు. పుత్రుని కలిగి ఉండటం అన్నిధర్మాల్లోను ఉత్తమమైంది. అందువల్ల పుత్రుని విడిచిపెట్టరాదు. (98)
స్వపత్నీప్రభవాన్ పంచ లబ్ధాన్ క్రీతాన్ వివర్ధితాన్ ।
కృతా నన్యాసు చోత్పన్నాన్ పుత్రాన్ వై మనురబ్రవీత్ ॥ 99
తన భార్యయందు పుట్టినవారిని, ఇతరస్త్రీలకు జన్మించి తనకు లభించినవారిని, కొనబడినవారిని, పోషింపబడిన వారిని, ఉపనయనాది సంస్కారం చేయబడిన వారిని, ఈ ఐదు విధాల వారిని పుత్రులుగా మనువు చెప్పాడు. (99)
ధర్మకీర్త్యావహా నౄణాం మనసః ప్రీతివర్ధనాః ।
త్రాయంతే నరకాజ్జాతాః పుత్రా ధర్మప్లవాః పితౄన్ ॥ 100
మానవులకు పుత్రులు ధర్మాన్ని, కీర్తినీ తెచ్చిపెట్టేవారు. మనస్సుకు ప్రీతిని ఎక్కువ జేసే పుత్రులు ధర్మరూపమయిన నౌకలుగా పితరులను నరకం నుండి రక్షిస్తారు. (100)
స త్వం నృపతిశార్దూల పుత్రం న త్యక్తుమర్హసి ।
ఆత్మానం సత్యధర్మౌ చ పాలయన్ పృథివీపతే ।
నరేంద్రసింహ కపటం న వోఢుం త్వ మిహార్హసి ॥ 101
రాజసింహా! అందువల్ల అటువంటి నీవు పుత్రుని విడవటం తగదు. తన్ను, సత్యధర్మాలనూ రక్షిస్తూ కపటాన్ని వహించడం యుక్తంకాదు. (101)
వరం కూపశతాద్ వాపీ వరం వాపీశతాత్ క్రతుః ।
వరం క్రతుశతాత్ పుత్రః సత్యం పుత్రశతాద్ వరమ్ ॥ 102
వంద నూతులకంటె ఒకబావి శ్రేష్ఠమైనది. వందబావుల కంటె ఒక క్రతువు శ్రేష్ఠం. వంద క్రతువులకంటె పుత్రుడు శ్రేష్ఠుడు. నూరుగురు పుత్రులకంటె సత్యం శ్రేష్ఠమైనది. (102)
అశ్వమేధసహస్రం చ సత్యం చ తులయా ధృతమ్ ।
అశ్వమేధసహస్రాద్ధి సత్యమేవ విశిష్యతే ॥ 103
వేయి అశ్వమేధయాగాలనూ, సత్యాన్నీ తక్కెడలో తూచినట్లయితే అశ్వమేధసహస్రం కంటె సత్యమే బరువని తెలుస్తుంది. (103)
వి: తె: దీనికి నన్నయ్య తెనిగింపు ప్రసిద్ధమైనది
వెలయంగ నశ్వమేధం
బులు వేయును నొక్క సత్యమును నిరుగడలం
దుల నిడి తూపఁగ సత్యము
వలనన ములుసూపు గౌరవంబున పేర్మిన్. (1-4-95)
సర్వవేదాధిగమనం సర్వతీర్థావగాహనమ్ ।
సత్యం చ వచనం రాజన్ సమం వా స్యాన్న వా సమమ్ ॥ 104
రాజా! వేదాలన్నీ చదవడం, అన్ని తీర్థాల్లో స్నానమాడడమూ కూడ సత్యవచనంతో సమానం అవుతాయో కావో చెప్పలేము. (104)
వి: తె: దీనికి నన్నయ్య ప్రసిద్ధమైన ఆంధ్రీకరణమిది
సర్వతీర్థాభిగమనంబు సర్వవేద
సమధిగమము సత్యంబుతో సరియుఁగావు
ఎఱుఁగు మెల్ల ధర్మంబుల కెందుఁ బెద్ద
యండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు. (1-4-96)
నాస్తి సత్యసమో ధర్మః న సత్యాద్ విద్యతే పరమ్ ।
న హి తీవ్రతరం కించి దనృతా దిహ విద్యతే ॥ 105
సత్యంతో సమానమైన ధర్మంలేదు. సత్యంకంటే గొప్పది లేదు. ఈలోకంలో అసత్యంకంటె మించిన తీవ్రతరమైంది ఏదీ లేదు. (105)
రాజన్ సత్యం పరం బ్రహ్మ సత్యం చ సమయః పరః ।
మా త్యాక్షీః సమయం రాజన్ సత్యం సంగత్తమస్తు తే ॥ 106
రాజా! సత్యమే పరబ్రాహ్మము. (అదిష్ఠానపరమాత్మము). సత్యము అన్నిటికంటె గొప్ప వ్రతం. నీవు నీ సత్యవ్రతాన్ని విడిచిపెట్టకు. సత్యంతో నీవు కలిసి ఉండు. (106)
అనృతే చేత్ ప్రసంగస్తే శ్రద్దధాసి న చేత్ స్వయమ్ ।
ఆత్మనా హంత గచ్ఛామి త్వాదృశే నాస్తి సంగతమ్ ॥ 107
అసత్యమునందే నీకు ఆసక్తి ఉంటే నామాటపట్ల శ్రద్ధలేకపోతే, నేను స్వయంగా వెళ్ళిపోతాను. నీలాంటివాడితో కలిసిఉండడం నాఖు యుక్తం కాదు. (107)
(పుత్రత్వే శంకమానస్య బుద్ధిః జ్ఞాపకదీపనా ।
గతిః స్వరః స్మృతిః సత్త్వం శీలవిజ్ఞానవిక్రమాః ॥
ధృష్టుప్రకృతిభావౌ చ ఆవర్తా రోమరాజయః ।
సమా యస్య యతః స్యుస్తే తస్య పుత్రో న సంశయః ॥
సాదృశ్యేనోద్ధృతం బింబం తవ దేహాద్ విశాంపతే ।
తాతేతి భాషమాణం వై మా స్మ రాజన్ వృథా కృథాః ॥)
ఇతడు నాకొడుకు అవునా కాదా అని సందేహిస్తున్నవానికి బుద్ధే దానిని గుర్తింపచేసే వెలుతురు. గమనం, స్వరం, స్మరణం, బలం శీలం, విజ్ఞానం, పరాక్రమం, సాహసం, స్వభావం, వ్యవహారం, రోమావలి (సుడులు) ఇవి ఎవనితో సమానంగా ఉంటాయో అతడు అతనికి పుత్రుడు. ఇందులో సందేహంలేదు. రాజా! నీ పోలికతో ఈతని రూపమ్ ఏర్పడింది. తండ్రీ! అని పిలుస్తున్న ఈతని ఆశను వమ్ముచేయకు.
త్యామృతేఽపి హి దుష్యంత శైలరాజావతంసకామ్ ।
చతురంతామిమాముర్వీం పుత్రో మే పాలయిష్యతి ॥ 108
దుష్యంతా! నీవు లేకున్నా, నాపుత్రుడు నాలుగు సముద్రాల వరకు వ్యాపించి హిమవత్పర్వతం మకుటంలా భాసించే భూమినంతా పరిపాలిస్తాడు. (108)
(శకుంతలే తవ సుతః చక్రవర్తీ భవిష్యతి ।
ఏవముక్తో మహేంద్రేణ భవిష్యతి న చాన్యథా ॥
సాక్షిత్వే బహవోఽప్యుక్తాః దేవదూతాదయో మతాః ।
వ బ్రువంతి యథా సత్యమ్ ఉతాహో ఽప్యనృతం కిల ॥
అసాక్షిణే మందభాగ్యా గమిష్యామి యథాఽఽగతమ్ ॥)
'శకుంతలా! నీకొడుకు చక్రవర్తి కాగలడు' అని ఇంద్రుడు చెప్పాడు. అది అట్లే జరుగుతుంది. మరొకలా జరుగదు. ఈవిషయంలో సాక్షులుగా దేవదూతాదు లెందరో ఉన్నారు. కాని వారిపుడు సత్యమో అసత్యమో చెప్పరు. అందువల్ల సాక్షిలేని దురద్ఱ్రుష్ట వంతురాలిని వచ్చినదారినే వెళ్తాను.
వైశంపాయన ఉవాచ
ఏతావదుక్త్వా రాజానమ్ ప్రాతిష్ఠత శకుంతలా ।
అథాంతరిక్షాద్ దుష్యంతం వాగువాచాశరీరిణీ ॥ 109
ఋత్విక్పురోహితాచార్యైః మంత్రిభిశ్చ వృతం తదా ।
వైశంపాయనుడిలా అన్నాడు - ఇంతమాత్రం రాజుకు చెప్పి శకుంతల బయలుదేరింది. అపుడు అంతరిక్షంనుండి అశరీరవాణి ఋత్విక్ పురోహితులతో మంత్రులతో కూడి ఉన్న దుష్యంతునికి ఇలా చెప్పింది. (109 1/2)
భస్త్రా మాతా పితుః పుత్రః యేన జాతః స ఏవ సః ॥ 110
భరస్వ పుత్రం దుష్యంత మావమంస్థాః శకుంతలామ్ ।
(సర్వేభ్యో హ్యంగమంగేభ్యః సాక్షాదుత్పద్యతే సుతః ।
ఆత్మాచైష సుతో నామ తథైవ తవ పౌరవ ॥
ఆహితం హ్యాత్మనాత్మానం పరిరక్ష ఇమం సుతమ్ ।
అనన్యాం స్వాం ప్రతీక్షస్వ మావమంస్థాః శకుంతలామ్ ॥
స్త్రియః పవిత్రమతులమ్ ఏతద్ దుష్యంత ధర్మతః ।
మాసి మాసి రజోహ్యాసాం దుష్కృతాన్యపకర్షతి ॥)
రేతోధాః పుత్ర ఉన్నయతి నరదేవ యమక్షయాత్ ॥ 111
త్వం చాస్య ధాతా గర్భస్య సత్యమాహ శకుంతలా ।
జాయా జనయతే పుత్రమ్ ఆత్మనో ఽంగం ద్విధా కృతమ్ ॥ 112
దుష్యంతా! తల్లి గర్భసంచిలో మోసేది మాత్రమే. పుత్రుడు తండ్రికి సంబంధించిన వాడే. ఎవని చేత అతడు జన్మించాడో అతడి స్వరూపమే పుత్రుడు. అందువల్ల పుత్రుని భరించి. శకుంతలను అవమానించకు. (తండ్రి యొక్క శరీరావయవాలన్నింటితో శరీరం ఏర్పడి సాక్షాత్తూ పుత్రరూపంలో జన్మిస్తాడు. పౌరవా! పేరుకి పుత్రుడే కాని వాస్తవానికి తానే. తనచేత ఏర్పడిన కుమారుడి రూపంలో ఉన్న తన్ను తానే రక్షించుకోవాలి. ఈ శకుంతలను అసాధారణమైన నీభార్యగా చూసుకో. ఆమెను అవమానించవద్దు. దుష్యంతా! ధర్మబద్ధంగా స్త్రీలను గ్రహించడం పవిత్రమైన, అసమానమైన కార్యం. నెలనెలా రజస్సు వీరి దోషాలను తొలగిస్తుంది.) నరదేవా! రేతస్సును ధరించే తండ్రే పుత్రుని కలిగించగలడు. ఆ పుత్రుడు యమలోకం నుండి తన పితృగణాలను రక్షిస్తాడు. ఈమె యందు గర్భాన్ని (ఉంచినవాడవు) కలిగించినవాడవు నీవు. శకుంతల నిజం చెప్పింది. తన శరీరాన్ని రెండుగా విభజించుకొని భార్య తనకుమారుని కంటుంది. (110-112)
తస్మాద్ భరస్య దుష్యంత పుత్రం శాకుంతలం నృప ।
అభూతిరేషా యత్ త్యక్త్వా జీవే జ్జీవంత మాత్మజమ్ ॥ 113
దుష్యంతమహరాజా! అందువల్ల శకుంతల కుమారుని నీవు రక్షించు, పోషించు, జీవించి ఉన్న పుత్రుని విడిచిపెట్టి జీవించడం ఒక దౌర్భాగ్యమని గ్రహించు. (113)
వి: సం: అభూతి = వినాశం (దేవ)
శాకుంతలం మహాత్మానం దౌష్యంతిం భర పౌరవ ।
భర్తవ్యోఽయం త్వయా యస్మాత్ అస్మాకం వచనాదపి ॥ 114
తస్మాద్ భవత్వయం నామ్నా భరతో నామ తే సుతః ।
పౌరవా! మహాత్ముడైన శకుంతలకుమారుని భరించు. మామాటవల్ల కూడ నీవు తప్పక భరించాలి. అందువల్ల ఈ నీ కుమారుడు భరతుడనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. (114 1/2)
(ఏవముక్త్వా తతో దేవాః ఋషయశ్చ తపోధనాః ।
పతివ్రతేతి సంహృష్టాః పుష్పవృష్టిం వవర్షిరే ॥)
తచ్ఛ్రుత్వా పౌరవో రాజా వ్యాహృతం త్రిదివౌకసామ్ ॥ 115
పురోహితమమాత్యాంశ్చ సంప్రహృష్టో ఽబ్రవీదిదమ్ ।
శృణ్వంత్వేతద్ భవంతో ఽస్య దేవదూతస్య భాషితమ్ ॥ 116
ఇలా చెప్పిన తర్వాత దేవతలు, ఋషులు, తపోధనులు "శకుంతల పతివ్రత అని సంతసించి పుష్పవృష్టిని కురిపించారు. దేవతలు చెప్పిన ఆమాటలను విని పూరువంశరాజైన దుష్యంతుడు ఆనందించి పురోహితులతోనూ, అమాత్యులతోను ఇలా అన్నాడు - మీరంతా ఈ దేవదూతయొక్క మాటను వినండి. (115,116)
అహం చాప్యేన మేవైనం జానామి స్వయమాత్మజమ్ ।
యద్యహం వచనాదస్యాః గృహ్ణీయామి మమాత్మజమ్ ॥ 117
భవేద్ధి శంక్యో లోకస్య నైవ శుద్ధో భవేదయమ్ ।
నేను కూడా ఈ బాలుని నాకుమారునిగా ఎరుగుదును. కాని ఈమె మాటను బట్టి ఇతనిని కొడుకుగా గ్రహిస్తే లోకానికి శంకింపదగిన వాడవుతాడు. స్వచ్ఛమైన వాడు కాలేడు. (117)
వైశంపాయన ఉవాచ
తం విశోధ్య తదా రాజా దేవదూతేన భారత ।
హృష్టః ప్రముదితశ్చాపి ప్రతిజగ్రాహ తం సుతమ్ ॥ 118
వైశంపాయనుడిలా అంటున్నాడు - భరతవంశశ్రేష్టా! రాజు దేవదూతద్వారా ఆ బాలుని స్వచ్ఛతను నిశ్చయించి మిక్కిలి ఆనందించి కొడుకుగా స్వీకరించాడు. (118)
తతస్తస్య తదా రాజా పితృకర్మాణి సర్వశః ।
కారయామాస ముదితః ప్రీతిమానాత్మజస్య హ ॥ 119
అనంతరం రాజు ప్రేమతో ఆనందంతో తన కుమారునికి తండ్రి చేయదగిన సంస్కారాలను జరిపించాడు. (119)
మూర్ధ్ని చైనముపాఘ్రాయ సస్నేహం పరిషస్వజే ।
సభాజ్యమానో విప్రైశ్చ స్తూయామానశ్చ వందిభిః ।
స ముదం పరమాం లేభే పుత్రసంస్పర్శజాం నృపః ॥ 120
అతనిని శిరసుమీద ప్రేమతో ముద్దిడి కౌగిలించుకొన్నాడు. బ్రాహ్మణులంతా గౌరవించారు, వందిమాగధులు స్తుతించారు. అపుడు ఆ రాజు పుత్రస్పర్శవల్ల కలిగే గొప్ప ఆనందాన్ని అనుభవించాడు. (120)
తాం చైవ భార్యాం దుష్యంతః పూజయామాస ధర్మతః ।
అబ్రవీచ్చైవ తాం రాజా సాంత్వపూర్వమిదం వచః ॥ 121
దుష్యంతుడు ధర్మబద్ధంగా భార్య ఐన శకుంతలను గౌరవించాడు. అనునయపూర్వకంగా ఆమెతో ఇలా అన్నాడు. (121)
కృతో లోకపరోక్షో ఽయం సంబంధో వై త్వయా సహ ।
తస్మాదేతన్మయా దేవి త్వచ్ఛుద్ధ్యర్థం విచారితమ్ ॥ 122
దేవీ! నీతో నాకుగల వివాహబంధం ఈ ప్రజలకు పరోక్షంలో జరిగింది. వారికి నీ స్వచ్ఛత తెలియడం కోసం నేనీ విచారణ అంతా చేశాను. (122)
(బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చైవ పృథగ్విథాః ।
త్వాం దేవి పూజయిష్యంతి నిర్విశంకం పతివ్రతామ్ ॥)
బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు అంతా నిస్సంశయంగా పతివ్రతవైన నిన్ను వేరువేరు విధంగా గౌరవిస్తారు.
మన్యతే చైవ లోకస్తే స్త్రీభావాన్మయి సంగతమ్ ।
పుత్రశ్చాయం వృతో రాజ్యే మయా తస్మాద్ విచారితమ్ ॥ 123
ఈ లోకం నీతో నా కలయికను స్త్రీవ్యామోహంగా భావిస్తుంది. కామవశుడనయి ఈ పుత్రునికి రాజ్యం ఇవ్వడానికి అంగీకరించాననుకొంటుంది. అందువల్లనే నేనీ విచారణ చేశాను. (123)
యచ్చ కోపితయాత్యర్థం త్వయోక్తోఽస్మ్యప్రియం ప్రియే ।
ప్రనయిన్యా విశాలాక్షి తత్ క్షాంతం తే మయా శుభే ॥ 124
ప్రియా! కోపించిన నీవు పలికిన అప్రియవచనాలన్నీ నాపై ప్రేమతో పలికినవే. అందువల్ల వాటన్నింటిని నేను క్షమిస్తున్నాను. (124)
(అనృతం వాప్యనిష్టం నా దురుక్తం వాపి దుష్కృతమ్ ।
త్వయాస్యేవం విశాలాక్షి క్షంతవ్యం మమ దుర్వచః ॥
క్షాంత్యా పతికృతే నార్యః పాతివ్రత్యం వ్రజంతి తాః ।)
నీతో నేను పలికిన అసత్యమైన అప్రియమైన, చెడుమాటలను, చెడుచేష్టను క్షమించు. స్త్రీలు భర్తచేష్టలను సహించడం ద్వారా పాతివ్రత్యాన్ని పొందుతారు.
తామేవముక్త్వా రాజర్షిః దుష్యంతో మహిషీం ప్రియామ్ ।
వాసోభిరన్నపానైశ్చ పూజయామాస భారత ॥ 125
ఆమెతో ఇలా పలికి, రాజర్షి దుష్యంతుడు ప్రియమైన పట్టమహిషిని వస్త్రాలతో, అన్నపానాలతో గౌరవించాడు. (125)
(స మాతరముపస్థాయ రథంతర్యామభాషత ।
మమ పుత్రో వనే జాతః తవ శోకప్రణాశనః ॥
ఋణాదద్య విముక్తోఽహమ్ అస్మి పౌత్రేన తే శుభే ।
విశ్వామిత్ర సుతా చేయం కణ్వేన చ వివర్ధితా ॥
స్నుషా తవ మహాభాగే ప్రసీదస్వ శకుంతలామ్ ।
పుత్రస్య వచనం శ్రుత్వా పౌత్రం సా పరిషస్వజే ॥
పాదయోః పతితాం తత్ర రథంతర్యా శకుంతలామ్ ।
పరిష్వజ్య చ బాహూభ్యాం హర్షాదశ్రూణ్యవర్తయత్ ॥
ఉవాచ వచనం సత్యం లక్షయన్ లక్షణాని చ ।
తవ పుత్రో విశాలాక్షి చక్రవర్తీ భవిష్యతి ॥
తవ భర్తా విశాలాక్షి త్రైలోక్యవిజయీ భవేత్ ।
దివ్యాన్ భోగాననుప్రాప్తా భవత్వం వరవర్ణిని ॥
ఏవముక్తా రథంతర్యా పర్వం హర్షమవాప సా ।
శకుంతలాం తదా రాజా శాత్రోక్తేనైవ కర్మణా ॥
తతోఽగ్రమహిషీం కృత్వా సర్వాభరణభూషితామ్ ।
బ్రాహ్మణేభ్యో ధనం దత్త్వా సైనికానాం చ భూపతిః ॥)
అనంతరం రాజు భార్యాపుత్రులతో తల్లి రథంతరి దగ్గరకు వచ్చి 'అమ్మా! ఇతడు నాకొడుకు. అరణ్యంలో జన్మించాడు. ఇతడు నీదుఃఖాన్ని పోగొట్టుగలవాడు, ఈ నీపౌత్రునిచేత ఇపుడు నేను పితృఋణం నుండి విముక్తుడ నయ్యాను. ఈమె విశ్వామిత్రుని కూతురు. కణ్వమహర్షి ఈమెను పెంచాడు. మహాభాగా! ఈ నీ కోడలు శకుంతలను అనుగ్రహించు.' కొడుకు మాటలు విన్న రాజమాత తనమనుమడిని కౌగిలించుకుంది. తనపాదాలమీద పడ్డ శకుంతలను చేతులతో (ఎత్తి)కౌగిలించుకొని ఆనందంతో బాష్పాలు విడిచింది. మనుమడిలక్షణాలను గుర్తించి సత్యవచనాన్నిలా పలికింది - 'విశాలాక్షీ! నీకొడుకు చక్రవర్తి అవుతాడు. నీభర్త ముల్లోకాలను జయిస్తాడు. సుందరీ! నీవు దివ్యమైన భోగాలను అనుభవించు.' రాజమాత రథంతరి ఇలా పలకడంతో శకుంతల మిక్కిలి ఆనందించింది. అనంతరం సర్వాభరణాలతో అలంకరించి శకుంతలను అగ్రమహిషిగా చేశాడు. బ్రాహ్మణులకు సైనికులకు ధనాన్ని ఇచ్చాడు.
దుష్యంతస్తు తదా రాజా పుత్రం శాకుంతలం తదా ।
భరతం నామతః కృత్వా యౌవరాజ్యే ఽభ్యషేచయత్ ॥ 126
అటుపై దుష్యంతుడు శకుంతలను పుట్టిన తన కుమారుడికి 'భరతుడు' అని పేరుపెట్టి యువరాజుగా అబీషేకించాడు. (126)
(భరతే భారమావేశ్య కృతకృత్యో ఽభవన్నృపః ।
తతో వర్షశతం పూర్ణం రాజ్యం కృత్వా నరాధిపః ॥
కృత్వా దానాని దుష్యంతః స్వర్గలోకముపేయివాన్ ।)
(భరతుడికి భారాన్ని అప్పగించి దుష్యంతుడు కృతకృత్యుడయ్యాడు. అనంతరం నూరుసంవత్సరాలు పూర్తిగా రాజ్యంచేసి, దానాలు చేసి దుష్యంతుడు స్వర్గలోకం చేరాడు.)
తస్య తత్ ప్రథితం చక్రం ప్రావర్తత మహాత్మనః ।
భాస్వరం దివ్యమజితం లోకసంనాదనం మహత్ ॥ 127
దివ్యప్రకాశంతో ఎదురులేకుండా, లోకమంతటా మారుమ్రోగుతూ అతని రాజ్యం ప్రసిద్ధి వహించింది. (127)
స విజిత్య మహీపాలాన్ చకార వశవర్తినః ।
చచార చ సతాం ధర్మం ప్రాప చానుత్తమం యశః ॥ 128
అతడు రాజులందరినీ జయించి తనవశం చేసుకొన్నాడు. సత్పురుషుల ధర్మాన్ని ఆచరించాడు. గొప్ప యశస్సును పొందాడు. (128)
స రాజా చక్రవర్త్యాసీత్ సార్వభౌమః ప్రతాపవాన్ ।
ఈజే చ బహుభిర్యజ్ఞైః యథా శక్రో మరుత్పతిః ॥ 129
ప్రతాపవంతుడైన ఆ భరతుడు సార్వభౌముడు, చక్రవర్తి అయ్యాడు. మరుత్పతి అయిన ఇంద్రునిలా అనేక యజ్ఞాలను చేశాడు. (129)
యాజయామాస తం కణ్వః విధివత్ భూరిదక్షిణమ్ ।
శ్రీమాన్ గోవితతం నామ వాజిమేధ మవాప సః ।
యస్మిన్ సహస్రం పద్మానాం కణ్వాయ భరతో దదౌ ॥ 130
కణ్వమహర్షి అతనిచేత భూరిదక్షిణలతో కూడిన గోవితత మనే పేరుగల అశ్వమేధయాగాన్ని చేయించాడు. ఆ యజ్ఞంలో కణ్వమహర్షికి వేయి పద్మస్వర్ణముద్రలను భరతుడు దానం చేశాడు. (130)
భరతాద్ భారతీ కీర్తి ర్యేనేదం భారతం కులమ్ ।
అపరే యే చ పూర్వే వై భారతా ఇతి విశ్రుతాః ॥ 131
భరతునివల్ల ఈ భూమి భారతిగా ప్రసిద్ధి పొందింది. అతనివల్ల ఈవంశం భారతవంశం అయింది. ఈ వంశంలో ఇంతకుముందున్నవారు, ఇపుడున్న ఇతరులుకూడ భరతవంశంలోని వారుగా ప్రసిద్ధు లౌతారు. (131)
భరతస్యాన్వవాయే హి దేవకల్పా మహౌజసః ।
బభూవు ర్బ్రహ్మకల్పాశ్చ బహవో రాజసత్తమాః ॥ 132
యేషామపరిమేయాని నామధేయాని సర్వశః ।
తేషాం తు తే యథాముఖ్యం కీర్తయిష్యామి భారత ।
మహాభాగాన్ దేవకల్పాన్ సత్యార్జవపరాయణాన్ ॥ 133
భరతునివంశంలో జన్మించిన సమానులు, మహాతేజస్వులు, బ్రహ్మకల్పులు, మహాభాగులు, సత్య, ఋజుత్వాలకు బద్ధులైనవారూ ఎందరో రాజశ్రేష్ఠులున్నారు. అసంఖ్యాకంగా వారిపేర్లున్నాయి. ప్రాధాన్నాన్ని బట్టి వారిని గురించి ప్రస్తావిస్తాను. (132,133)
వి: సం: సత్యమనగా ఇచట బ్రహ్మమని ఆర్జవమనగా ధర్మమని ఇవే పరాయణంగా కలవారు. (నీల)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి శకుంతలోపాఖ్యానే చతుస్సప్తతితమోఽధ్యాయః ॥ 74 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున శకుంతలోపాఖ్యానమున డెబ్బదినాలుగవ అధ్యాయము. (74)
(దాక్షిణాత్య అధికపాఠము 89 1/2 శ్లోకములు కలుపుకొని మొత్తం 222 1/2 శ్లోకాలు)