73. డెబ్బది మూడవ అధ్యాయము
శకుంతలా దుష్యంతుల గాంధర్వ వివాహము.
దుష్యంత ఉవాచ
సువ్యక్తం రాజపుత్రీ త్వం యథా కల్యాణి భాషసే ।
భార్యా మే భవ సుశ్రోణి బ్రూహి కిం కరవాణి తే ॥ 1
దుష్యంతుడిలా అన్నాడు- కల్యాణీ! నీవు రాజపుత్రిక వని నీ మాటల్లో స్పష్టపడింది. నీవు నా భార్యవు కావాలి. నీకోసం నేనేమి చేయాలో చెప్పు. (1)
సువర్ణమాలాం వాశాంసి కుండలే పరిహాటకే ।
నానాపత్తనజే శుభ్రే మణిరత్నే చ శోభనే ॥ 2
ఆహరామి తవాద్యాహం నిష్కాదీన్యజినాని చ ।
సర్వం రాజ్యం తవాద్యాస్తు భార్యా మే భవ శోభనే ॥ 3
బంగారు హారాలు, వస్త్రాలు, బంగారుకుండలాలు, కేయూరాలు పట్టణంలో తయారైన స్వచ్ఛమైన మణిరత్నాలు, నిష్కాలు, మృగాజినాలు ఈరోజునే నీకు తీసికొని వస్తాను. సమస్తరాజ్యమా నీదే. నీవే నా భర్యపు కావాలి. (2,3)
గాంధర్వేణ చ మాం భీరు వివాహేనైహి సుందరి ।
వివాహానాం హి రంభోరు గాంధర్వః శ్రేష్ఠ ఉచ్యతే ॥ 4
సుందరీ! నన్ను గాంధర్వవిధితో వివాహమాడు. వివాహాలలో గాంధర్వం శ్రేష్ఠమైనది. (4)
శకుంతలోవాచ
ఫలాహారో గతో రాజన్ పితా మే ఇత ఆశ్రమాత్ ।
ముహూర్తం సంప్రతీక్షస్వ స మాం తుభ్యం ప్రదాస్యతి ॥ 5
అపుడు శకుంతల ఇలా అంది- రాజా! నాతండ్రి పండ్లు తేవడానికి ఆశ్రమంనుండి బయటకు వెళ్ళాడు. ముహూర్తకాలం వేచి ఉండు. అతడు నన్ను నీకు ఇవ్వగలడు. (5)
(పితా హి మే ప్రభుర్నిత్యమ్ దైవతం పరమం మతమ్ ।
యస్య వా దాస్యతి పితా స మే భర్తా భవిష్యతి ॥
పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే ।
పుత్రస్తు స్థవిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి ॥
అమన్యమానా రాజేంద్ర పితరం మే తపస్వినమ్ ।
అధర్మేణ హి ధర్మిష్ఠ కథం వరముపాస్మహే ॥
(నా తండ్రి నాకు ఎప్పుడూ పరదేవతయే. అతడు ఎవరికి నన్నిస్తే అతడే నాభర్త. కౌమారంలో తండ్రి, యౌవనంలో భర్త, ముసలితనంలో పుత్రుడు స్త్రీని రక్షిస్తూ ఉంటారు. స్త్రీకి స్వాతంత్ర్యం పనికిరాదు, రాజేంద్రా! తపస్వి అయిన తండ్రిని లెక్కచేయకుండా అధర్మంగా పతిని ఎలా వరించగలను?
దుష్యంత ఉవాచ
మా మైవం వద సుశ్రోణి తపోరాశిం దయాత్మకమ్ ।
దుష్యంతుడిలా అన్నాడు-సుందరీ! నీవీ విధంగా అనకు. తపోరాశియైన కణ్వుడు మిక్కిలి దయాళువు.
శకుంతలోవాచ
మన్యుప్రహరణా విప్రాః న విప్రాః శస్త్రపాణయః ॥
అగ్నిర్దహతి తేజోభిః సూర్యో దహతి రశ్మిభిః ।
రాజా దహతి దండేన బ్రాహ్మణో మన్యునా దహేత్ ॥
క్రోధితో మన్యునా హంతి వజ్రపాణి రివాసురాన్ ।)
శకుంతల ఇలా అంది - విప్రులకు కోపమే ఆయుధం. వారి చేతులలో ఆయుధాలుండవు. అగ్ని తేజస్సుతో దహిస్తాడు. సూర్యుడు కిరణాలతో దహిస్తాడు. రాజు
దండంతో దహిస్తాడు. బ్రాహ్మణుడు కోపంతో దహిస్తాడు. ఇంద్రుడు రాక్షసులను చంపినట్లుగా కోపం వచ్చిన విప్రుడు కోపంతో చంపుతాడు.)
దుష్యంత ఉవాచ
ఇచ్ఛామి త్వాం వరారోహే భజమానా మనిందితే ।
త్వదర్థం మాం స్థితం విద్ధి త్వద్గతం హి మనో మమ ॥ 6
అపుడు దుష్యంతుడిలా అన్నాడు - ఉత్తమురాలా! సుగుణవతీ! నీవు స్వేచ్ఛగా నన్ను సేవించాలని కోరుకొంటున్నాను. నీకోసమే నేనిక్కడున్నానని గ్రహించు. నామనస్సు నీమీదే లగ్నమైంది. (6)
ఆత్మనో బంధురాత్మైన గతిరాత్మైన చాత్మనః ।
ఆత్మనో మిత్రమాత్మైన తథాఽత్మాచాత్మనః పితా ।
ఆత్మనైవాత్మనో దానం కర్తుమర్హసి ధర్మతః ॥ 7
తనకు తానే బంధువు. తనకు తానే దిక్కు. తనకు తానే మిత్రం. తనకు తానే తండ్రి. ధర్మం ప్రకారం తన్ను తానే దానం చేసికోవచ్చు. (7)
అష్టావేవ సమాసేన వివాహా ధర్మతః స్మృతాః ।
బ్రాహ్మో దైవ స్తథైవార్షః ప్రాజాపత్య స్తథాసురః ॥ 8
గాంధర్వో రాక్షసశ్పైవ పైశాచశ్చాష్టమః స్మృతః ।
తేషాం ధర్మ్యాన్ యథాపూర్వం మమః స్వాయంభువోఽబ్రవీత్ ॥ 9
ధర్మమ్ ప్రకారం మొత్తం ఎనిమిది రకాల వివాహాలు చెప్పబడ్డాయి. బ్రాహ్మం, దైవతం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని ఎనిమిది రకాలు. వాటిలో ధర్మసమ్మతాలైనవి స్వాయంభువ మనువు చెప్పినట్లుగా చెప్తాను. (8,9)
ప్రశస్తాంశ్చతురః పూర్వాన్ బ్రాహ్మణస్యోపధారయ ।
షడానుపూర్వ్యా క్షత్రస్య విద్ధి ధర్మ్యాననిందితే ॥ 10
అందులో మొదటి నాలుగు బ్రాహ్మణులకు ప్రశస్తాలైనవి. మొదటి ఆరు క్షత్రియులకు ధర్మసమ్మతాలు. (10)
రాజ్ఞాం తు రాక్షసోఽప్యుక్తః విట్ శూద్రేష్వాసురః స్మృతః ।
పంచానాం తు త్రయో ధర్మ్యాః అధర్మ్యౌ ద్వౌ స్మృతావిహ ॥ 11
రాజులకు రాక్షసం కూడా యుక్తమే. వైశ్య, శూద్రులకు ఆసురం చెప్పబడింది. చివరి ఐదింటిలో మూడు ధర్మసమ్మతాలు. రెండు ధర్మసమ్మతాలు కావు. (11)
పైశాచ ఆసురశ్పైవ న కర్తవ్యౌ కదాచన ।
అనేవ విదినా కార్యః ధర్మస్త్యెషా గతిః స్మృతా ॥ 12
పైశాచ, ఆసురాలెప్పుడూ చేయదగినవికావు. ఈ విధానంతో వివాహం చేసికోవాలి. ధర్మంయొక్క మార్గం ఇది. (12)
గాంధర్వ రాక్షసౌ క్షత్రే ధర్మ్యౌ తౌ మా విశంకిథాః ।
పృథగ్వా యది నా మిశ్రౌ కర్తవ్యౌ నాత్ర సంశయః ॥ 13
గాంధర్వరాక్షసాలు క్షత్రియులకు ధర్మసమ్మతాలు. వానిని నీవు శంకింపవద్దు. ఈ రెండూ వేరువేరుగా కాని, కలిపికాని చేయదగినవి. ఇందులో ఎట్టి సందేహమూ లేదు. (13)
సా త్వం మమ సకామస్య సకామా వరవర్ణిని ।
గాంధర్వేణ వివాహేన భార్యా భవితుమర్హసి ॥ 14
సుందరీ! నీపట్ల కోరికతో ఉన్న నాఖు, కోరికతో ఉన్న నీవు గాంధర్వవివాహం ద్వారా భార్య కావటానికి అర్హురాలవు. (14)
శకుంతలోవాచ
యది ధర్మపథస్త్వేషః యది చాత్మా ప్రభుర్మమ ।
ప్రదానే పౌరవశ్రేష్ఠ శృణు మే సమయం ప్రభో ॥ 15
శకుంతల ఇలా అంది - పౌరవ శ్రేష్ఠా! ఇది ధరమార్గమే అయితే, నన్ను నేను దానం చేసుకొనుటకు సమర్థురాలనే అయితే నా నియమం విను. (15)
సత్యం మే ప్రతిజానీహి యథా వక్ష్యామ్యహం రహః ।
మయి జాయేత యః పుత్రః స భవేత్ త్వదనంతరః ॥ 16
యువరాజో మహారాజ సత్యమేతద్ బ్రవీమి తే ।
యద్యేతదేవం దుష్యంత అస్తు మే సంగమస్త్వయా ॥ 17
నాకు నిజంగా మాట ఇయ్యి. నేను నీకు రహస్యంగా (ఏకాంతంగా) చెప్తున్నాను. నాయందు పుట్టిన కుమారుడే నీ తరువాత యువరాజు కావాలి. మహారాజా! నేను నిజం చెపుతున్నాను. ఇది ఇలా జరిగేటట్లయితే నీతో నాకలయిక జరుగుతుంది. (16,17)
వైశంపాయన ఉవాచ
ఏవమస్త్వితి తాం రాజా ప్రత్యువాదావిచారయన్ ।
అపి చ త్వాంహి నేష్యామి నగరం స్వం శుచిస్మితే ॥ 18
వైశంపాయనుడిలా అన్నాడు - అపుడు రాజు ఆలోచించకుండా 'అలాగే కానిమ్ము' అన్నాడు. ఇంతేకాక 'నేను నిన్ను నగరానికి తీసికొని వెళ్తాను' అని కూడా చెప్పాడు. (18)
యథా త్వమర్హా సుశ్రోణి సత్యమేతద్ బ్రవీమి తే ।
ఏవముక్త్వా స రాజర్షిః తామనిందితగామినీమ్ ॥ 19
జగ్రాహ విధివత్ పాణౌ ఉవాస చ తయా సహ ।
విశ్వాస్య చైనాం స ప్రాయాద్ అబ్రవీచ్చ పునః పునః ॥ 20
ప్రేషయిష్యే తవార్థాయ వాహీనీం చతురంగిణీమ్ ।
తయా త్వా నాయయిష్యామి నివాసం స్వం శుచిస్మితే ॥ 21
'సుందరీ! నీవు రాజమందిరంలో ఉండటానికి యోగ్యురాలవు. నేను నిజం చెపుతున్నాను.' అని చెప్పి ఆ రాజర్షి ఉత్తమమైన నడవడిగల ఆమెను యథావిధిగా పాణిగ్రహణం చేసి, ఆమెతో పాటు నివసించాడు. ఆమెకు విశ్వాసం కలిగించి, 'తెలి నవ్వు కలదానా! నీకోసం చతురంగ బలాలను పంపుతాను. దానితో నిన్ను నా నివాసానికి రప్పించుకొంటాను' అని మరల మరల చెప్పి అతడు వెళ్ళాడు. (19-21)
(ఏవముక్త్వా స రాజర్షిః తామనిందితగామినీమ్ ।
సంపరిష్వజ్య బాహుభ్యాం స్మితపుర్వముదైక్షత ॥
ప్రదక్షిణీకృతాం దేవీం రాజా సంపరిషస్వజే ।
శకుంతలా హ్యశ్రుముఖీ పపాత నృపపాదయోః ॥
తాం దేవీం పునరుత్థాప్య మా శుచేతి పునః పునః ।
శపేయం సుకృతేనైవ ప్రాపయిష్యే నృపాత్మజే ॥)
ఈ విధంగా చెప్పి ఆ రాజర్షి ఆమెను కౌగిలించుకొని చిరునవ్వుతో చూశాడు. ఆమె అతనికి ప్రద్క్షిణం చేసింది. ఆమెనాతడు కౌగిలించుకొన్నాడు. శకుంతల కన్నీటితో రాజు పాదాలమీద పడింది. అతడామెను మరల లేవదీసి 'రాజకుమరీ! నిన్ను తప్పక తీసికొని వెళ్తాను విచారించకు. నా పుణ్యంతో ప్రమాణం చేస్తున్నా' అని మళ్ళీమళ్ళీ చెప్పి వెళ్లాడు.
వైశంపాయన ఉవాచ
ఇతి తస్యాః ప్రతిశ్రుత్వ స నృపో జనమేజయ ।
మనసా చింతయన్ ప్రాయాత్ కాశ్యపం ప్రతి పార్థివః ॥ 22
భగవాంస్తపసా యుక్తః శ్రుత్వా కిం ను కరిష్యతి ।
ఏవం స చింతయన్నేవ ప్రవివేశ స్వకం పురమ్ ॥ 23
వైశంపాయనుడిలా అన్నాడు-జనమేజయా! ఇలా ఆమెకు మాట ఇచ్చి ఆ దుష్యంత్డు కాశ్యపుని గురించి మనస్సులో ఆలోచిస్తూ వెళ్ళాడు. పూజ్యుడు, తపోయుక్తుడు అయిన కాశ్యపుడు ఈ వార్త విని ఏం చేస్తాడో! అని ఆలోచిస్తూనే తన నగరాన్ని ప్రవేశించాడు. (22,23)
ముహూర్తయాతే తస్మింస్తు కణ్వోప్యాశ్రమమాగమత్ ।
శకుంతలా చ పితరం హ్రియా నోపజగామ తమ్ ॥ 24
అతడు వెళ్ళాక ముహూర్తకాలం గడిచేసరికి కణ్వుడు ఆశ్రమానికి వచ్చాడు. శకుంతల సిగ్గుతో తండ్రిని సమీపించలేదు. (24)
(శంకితైవ చ విప్రర్షిమ్ ఉపచక్రామ సా శనైః ।
తతోఽస్య రాజఞ్జగ్రాహ ఆసనం చాప్యకల్పయత్ ॥
శకుంతలా చ సవ్రీడా తమృషిం నాభ్యభాషత ।
తస్మాత్ స్వధర్మాత్ స్ఖలితా భీతా సా భరతర్షభ ।
అభవద్ దోషదర్శిత్వాద్ బ్రహచారిణ్యయంత్రితా ।
స తదా వ్రీడితాం దృష్ట్వా ఋషిస్తాం ప్రత్యభాషత ॥)
భయంతో శంకిస్తూ ఆ బ్రహ్మర్షిని మెల్లగా సమీపించింది. అతనికి ఆసనం తీసికొని వచ్చి వేసింది. కాని సిగ్గుతో శకుంతల అతనితో మాట్లాడలేదు. స్వధర్మం నుండి తప్పినందుకామె భయపడింది. స్వేచ్ఛగల బ్రహ్మచారిణి అయిన ఆమె తప్పు వల్ల భయపడింది. అలా సిగ్గుపడుతున్న ఆమెను చూసి మహర్షి ఆమెతో ఇలా అన్నాడు.
కణ్వ ఉవాచ
సవ్రీడైవ చ దీర్ఘాయుః పురేవ భవితా న చ ।
వృత్తం కథయ రంభోరు మా త్రాసం చ ప్రకల్పయ ॥
కణ్వుడిలా అన్నాడు-దీర్ఘాయుష్మంతురాలవయిన నీవు సిగ్గుపడుతున్నావు. మునుపటిలా ఇపుడు లేవు. కళ్యాణీ! జరిగింది చెప్పు. భయపడకు.
వైశంపాయన ఉవాచ
తతః కృచ్ఛ్రాదతిశుభా సవ్రీడా శ్రీమతీ తదా ।
సగద్గదమువాచేదం కాశ్యపం సా శుచిస్మితా ॥
వైశంపాయనుడిలా అన్నాడు- అటుతరువాత అతికష్టం మీద సిగ్గుతో బొంగురుపోయిన కంఠంతో శకుంతల కాశ్యపునితో ఇలా చెప్పింది.
శకుంతలోవాచ
రాజా తాతాజగామేహ దుష్యంత ఇలిలాత్మజః ।
మయా పతిర్వృతో యోఽసౌ దైవయోగాదిహాగతః ॥
తస్య తాత ప్రసీదస్వ భర్తా మే సుమహాయశాః ।
అతః సర్వం తు యద్వృత్తం దివ్యజ్ఞానేన పశ్యసి ॥
అభయం క్షత్రియకులే ప్రసాదం కర్తుమర్హసి ।)
శకుంతల ఇలా అంది - తండ్రీ! ఇలిలాత్మజుడైన దుష్యంతమహారాజు ఇక్కడకు వచ్చాడు. దైవయోగం వల్ల ఈ ఆశ్రమానికి వచ్చిన అతనిని నేను పతిగా వరించాను. తండ్రీ! అతనిపట్ల ప్రసన్నుడవై ఉండు. గొప్పయశస్సుగల అతడు నాభర్త. ఆపై జరిగినదంతా నీవు దివ్యజ్ఞానంతో చూడగలవు. క్షత్రియవంశానికి అభయమిచ్చి అనుగ్రహించు.
విజ్ఞాయాథ చ తాం కణ్వః దివ్యజ్ఞానో మహాతపాః ।
ఉవాచ భగవాన్ ప్రీతః పశ్యన్ దివ్యేన చక్షుషా ॥ 25
మహాతపస్వి అయిన కణ్వుడు దివ్యజ్ఞానంతో వృత్తాంతాన్నంతా తెలిసికొన్నాడు. దివ్య చక్షువుతో చూస్తూ ప్రీతినొంది పూజ్యుడయిన కణ్వుడిలా అన్నాడు. (25)
త్వయాద్య భద్రే రహసి మామనాదృతయ్ యః కృతః ।
పుంసా సహ సమాయోగః న స ధర్మోపఘాతకః ॥ 26
ఆయుష్మతీ! నన్ను లక్ష్యపెట్టక ఈ రోజు నీవాపురుషుని సంగమించడం ధర్మహాని కాదు. (26)
క్షత్రియస్య హి గాంధర్వః వివాహః శ్రేష్ఠ ఉచ్యతే ।
సకామాయాః సకామేన నిర్మంత్రో రహసి స్మృతః ॥ 27
కోరుకున్న ఆమె కోరుకున్న వానితో ఏకాంతంగా మంతర్రహితంగా కలవడమనే గాంధర్వవివాహం క్షత్రియులకు శ్రేష్ఠమైనదిగా చెప్పబడింది. (27)
ధర్మాత్మా చ మహాత్మా చ దుష్యంతః పురుషోత్తమః ।
అభ్యగచ్ఛః పతిం యత్ త్త్వం భజమానం శకుంతలే ॥ 28
మహాత్మా జనితా లోకే పుత్రస్తవ మహాబలః ।
య ఇమాం సాగరాపాంగీం కృత్స్నాం భోక్ష్యతి మేదినీమ్ ॥ 29
దుష్యంతుడు ధర్మాత్ముడు, మహాత్ముడు, పురుషోత్తముడు. శకుంతలా! నీవు యోగ్యుడైన పతిని పొందావు. నీకు మహాత్ముడు, మహాబలుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు. అతడు సాగరపర్యంత భూమినంతా పరిపాలిస్తాడు. (28,29)
పరం చాభిప్రయాతస్య చక్రం తస్య మహత్మనః ।
భవిష్యత్యప్రతిహతం సతతం చక్రవర్తినః ॥ 30
శత్రువులపై దండెత్తితే ఆ చక్రవర్తి రథం అడ్డులేనిదై ముందుకు సాగుతుంది. (30)
తతః ప్రక్షల్య పాదౌ సా విశ్రాంతం మునిమబ్రవీత్ ।
వినిధాయ తతో భారం సంనిధాయ ఫలాని చ ॥ 31
ఇలా అన్న తరువాత తండ్రి తెచ్చిన పండ్లను తీసుకొని భద్రపరిచి శకుంతల కణ్వుని పాదాలు కడిగింది. అపుడు కణ్వుడు విశ్రాంతి తీసుకొంటూ ఉండగా శకుంతల ఇలా అంది. (31)
శకుంతలలోవాచ
మయా పతిర్వృతో రాజా దుష్యంతః పురుషోత్తమః ।
తస్మై ససచివాయ త్వం ప్రసాదం కర్తుమర్హసి ॥ 32
శకుంతల ఇలా అంది - పురుషోత్తముడైన దుష్యంతమహారాజును నేను పతిగా వరించాను. కావున నీవు సచివులతో కూడిన అతనిపట్ల అనుగ్రహాన్ని చూపు. (32)
కణ్వ ఉవాచ
ప్రసన్న ఏవ తస్యాహం త్వత్కృతే వరవర్ణిని ।
(ఋతువో బహవస్తే వై గతా వ్యర్థాః శుచిస్మితే ।
సార్థకం సాంప్రతం హ్యేతన్న చ పాపోఽస్తి తేఽనఘే ॥)
గృహాణ చ వరం మత్తః త్వం శుభే యదభీప్సితమ్ ॥ 33
అపుడు కణ్వుడిలా అన్నాడు - వరవర్ణిని! నీకొరకు అతనిపట్ల నేను ప్రసన్నుడనే. శుచిస్మితా! అనేక ఋతువులు నీకు వ్యర్థంగా గడిచాయి. ఇపుడు ఈ ఋతుకాలం సార్థకమయింది. నీకు పాపంలేదు. నీకు (కావలసిన) ఇష్టమైన వరాన్ని నానుండి గ్రహించు. (33)
వైశంపాయన ఉవాచ
తతో దర్మిష్ఠతాం వవ్రే రాజ్యా చ్చాస్ఖలనం తథా ।
శకుంతలా పౌరవాణాం దుష్యంతహితకామ్యయా ॥ 34
వైశంపాయనుడిలా అన్నాడు - జనమేజయా! అపుడు శకుంతల దుష్యంతుని హితాన్ని కోరి పౌరవుల ధర్మిష్ఠతనూ, రాజ్యంనుండి భ్రష్టతలేకపోవటాన్ని కోరుకొంది. (34)
(ఏవమస్త్వితి తాం ప్రాహ కణ్వో ధర్మభృతాం వరః ।
పస్పర్శ చాపి పాణిభ్యాం సుతాం శ్రీమివ రూపిణీమ్ ॥
అట్లే అగుగాక' అని పలికి ధార్మిక శ్రేష్ఠుడైన కణ్వుడు లక్ష్మిలా ఉన్న కూతురును తన చేతులతో స్పృశించాడు.
కణ్వ ఉవాచ
అద్య ప్రభృతి దేవీ త్వం దుష్యంతస్య మహాత్మనః ।
పతివ్రతానాం యా వృత్తిః తాం వృత్తి మనుపాలయ ॥)
(కణ్వుడిలా అన్నాడు - ఇప్పటినుండి నీవు మహాత్ముడైన దుష్యంతుని దేవేరివి. పతివ్రతల్ నడవడికను నీవు నిరంతరం పాటించు.)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి శకుంతలోపాఖ్యానే ద్విసప్తతితమోఽధ్యాయః ॥ 73 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున శకుంతలోపాఖ్యానమున డెబ్బది మూడవ అధ్యాయము. (73)
(దాక్షిణాత్య అధికపాఠము 19 1/2 శ్లోకములు కలుపుకొని మొత్తం 53 1/2 శ్లోకాలు)