83. ఎనుబది మూడవ అధ్యాయము

శుక్రాచార్యుడు యయాతిని వృద్ధుడవు కమ్మని శపించుట.

వైశంపాయన ఉవాచ
శ్రుత్వా కుమారం జాతం తు దేవయానీ శుచిస్మితా ।
చింతయామాస దుఃఖార్తా శర్మిష్ఠాం ప్రతి భారత ॥ 1
అభిగమ్య చ శర్మిష్ఠాం దేవయాన్యబ్రవీదిదమ్ ।
వైశంపాయనుడిలా అన్నాడు - భరతశ్రేష్ఠా! స్వచ్ఛమైన చిరునవ్వుగల దేవయాని శర్మిష్ఠకు కొడుకుపుట్టాడని విని దుఃఖంతో విచారించింది. శర్మిష్ఠ దగ్గరకు వెళ్ళి దేవయాని ఇలా అంది. (1 1/2)
దేవయాన్యువాచ
కిమిదం వృజినం సుభ్రు కృతం వై కామలుబ్ధయా ॥ 2
దేవయాని ఇలా అంది - శర్మిష్ఠా! కామవ్యామోహంతో ఎటువంటి పాపం చేశావు? (2)
శర్మిష్ఠోవాచ
ఋషిరభ్యాగతః కశ్చిద్ ధర్మాత్మా వేదపారగః ।
స మయా వరదః కామం యాచితో ధర్మసంహిత్ ॥ 3
శర్మిష్ఠ ఇలా అంది - ధర్మాత్ముడు, వేదపారగుడూ అయిన ఒకానొక ఋషి అభ్యాగతునిగ వచ్చాడు. వరదుడైన అతనిని ధర్మసమ్మతమైన కోరికను కోరాను. (3)
నహ మన్యాయతః కామమ్ ఆచరామి శుచిస్మితే ।
తస్మాదృషేర్మమాపత్యమ్ ఇతి సత్యం బ్రవీమి తే ॥ 4
స్వచ్ఛమైన చిరునవ్వుకలదానా! నేను న్యాయసమ్మతం కాని కామాన్ని ఆచరించను. ఆ ఋషి వల్ల నేను సంతానాన్ని పొందాను. నీకు నిజం చెపుతున్నాను. (4)
దేవయాన్యువాచ
శోభనం భీరు యద్యేవమ్ అథ స జ్ఞాయతే ద్విజః ।
గోత్రనామాభిజనతః వేత్తుమిచ్ఛామి తం ద్విజమ్ ॥ 5
దేవయాని ఇలా అంది - బాగుంది. అలాగయితే ఆద్విజుడెవరో తెలుసునా? ఆ ద్విజుని వంశం, నామం, దేశాలను గురించి తెలుసుకోవాలి. (5)
శర్మిష్ఠోవాచ
తపసా తేజసా చైవ దీప్యమానం యథా రవిమ్ ।
తం దృష్ట్వా మమ సంప్రష్టుం శక్తిర్నాసీచ్ఛుచిస్మితే ॥ 6
శర్మిష్ఠ ఇలా అంది - తపస్సు చేత, తేజస్సు చేత సూర్యునిలా ప్రకాశిస్తున్న అతనిని చూసిన నాకు అడగటానికి శక్తి లేకపోయింది. (6)
దేవయాన్యువాచ
యద్యేతదేవం శర్మిష్ఠే న మన్యుర్విద్యతే మమ ।
అపత్యం యది తే లబ్ధం జ్యేష్ఠాచ్ఛ్రేష్ఠాచ్చ వై ద్విజాత్ ॥ 7
దేవయాని ఇలా అంది - శర్మిష్ఠా! పెద్దవాడు, శ్రేష్ఠుడూ అయిన ద్విజుని వల్ల నీవు సంతానాన్ని పొందినట్లయితే నాకు కోపంలేదు. (7)
వైశంపాయన ఉవాచ
అన్యోన్యమెవముక్త్వా తు సంప్రహస్య చ తే మిథః ।
జగామ భార్గవీ వేశ్మ తథ్యమిత్యవజగ్ముషీ ॥ 8
వైశంపాయనుడిలా అన్నాడు - వారొకరితో ఒకరు ఇలా మాట్లాడుకొని, పరస్పరం నవ్వుకొన్నారు. దేవయాని శర్మిష్ఠ చెప్పింది నిజమని భావించి తన నివాసానికి వెళ్ళింది. (8)
వి: సం: అవజగ్ముషీ = జ్ఞాతవతీ (నీల)
యయాతిర్దేవయాన్యాం తు పుత్రావజనయన్నృపః ।
యదుం చ తుర్వసుం చైవ శక్ర విష్ణూ ఇవాపరౌ ॥ 9
యయాతి దేవయానియందు ఇంద్రవిష్ణువులవంటి యదువు, తుర్వసువు అను ఇద్దరు పుత్రులను కన్నాడు. (9)
తస్మాదేవ తు రాజర్షేః శర్మిష్ఠా వార్షపర్వణీ ।
ద్రుహ్యుం చానుం చ పూరుం చ త్రీన్ కుమారానజీజనత్ ॥ 10
ఆ రాజర్షి యయాతి వల్లనే వృషపర్వుని కూతురు శర్మిష్ఠ ద్రుహ్యుడు, అనుడు, పూరుడు అను ముగ్గురు పుత్రుల్ని కన్నది. (10)
తతః కాలే తు కస్మింశ్చిద్ దేవయానీ శుచిస్మితా ।
యయాతిసహితా రాజన్ జగామ రహితం వనమ్ ॥ 11
రాజా! తరువాత ఒకానొక సమయంలో (స్వచ్ఛమైన చిరునవ్వు గల) దేవయాని యయాతితో పాటుగా ఏకాంతంగా వనానికి వెళ్ళింది. (11)
దదర్శ చ తదా తత్ర కుమారాన్ దేవరూపిణః ।
క్రీడమానాన్ సువిస్రబ్ధాన్ విస్మితా చేదమబ్రవీత్ ॥ 12
అక్కడ దేవరూపంలో ఉన్న కుమారులను చూసింది. వారు స్వేచ్ఛగా ఆడుకొంటున్నారు. దేవయాని ఆశ్చర్యపోయి ఇలా పలికింది. (12)
దేవయాన్యువాచ
కస్యైతే దారకా రాజన్ దేవపుత్రోపమాః శుభాః ।
వర్చసా రూపతశ్చైవ సదృశా మే మతాస్తవ ॥ 13
దేవయాని ఇలా అంది - రాజా! దేవపుత్రులవలె శుభలక్షణాలున్న ఈ పిల్లలు ఎవరు? తేజస్సు చేత, రూపం చేత వీరు నీతో పోలి ఉన్నారు. (13)
వైశంపాయన ఉవాచ
ఏవం పృష్ట్వా తు రాజానం కుమారాన్ పర్యపృచ్ఛత ।
వైశంపాయనుడిలా అన్నాడు - ఈ విధంగా రాజును అడిగిన తర్వాత ఆ బాలురను అడిగింది. (13 1/2)
దేవయాన్యువాచ
కిం నామధేయం వంశో వః పుత్రకాః కశ్చ వః పితా ।
ప్రబ్రూత మే యథాతథ్యం శ్రోతుమిచ్చామి తం హ్యహమ్ ॥ 14
దేవయాని అంది - బాలకులారా! మీ పేరేమిటి? మీవంశమేమిటి? మీ తండ్రి ఎవరు? యథార్థం చెప్పండి. వినాలనుకొంటున్నాను. (14)
(ఏవ ముక్తాః కుమారాస్తే దేవయాన్యా సుమధ్యయా ।)
తే ఽదర్శయన్ ప్రదేశిన్యా తమేవ నృపసత్తమమ్ ।
శర్మిష్ఠాం మాతరం చైవ తథా ఽఽచఖ్యుశ్చ దారకాః ॥ 15
సౌందర్యవతి దేవయాని ఇలా అడిగాక ఆ బాలురు చూపుడు వేలుతో రాజును చూపించారు. తల్లి శర్మిష్ఠ అని ఆ పిల్లలు చెప్పారు. (15)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా సహితాస్తే తు రాజానముపచక్రముః ।
నాభ్యనందత తాన్ రాజా దేవయాన్యాస్తదాంతికే ॥ 16
వైశంపాయనుడిలా అన్నాడు - అలా చెప్పి వారంతా కలిసి రాజు దగ్గరికి వచ్చారు. దేవయాని దగ్గరుండటం చేత రాజు ఆ పిల్లలను చేరదీయలేదు. (16)
రుదంతస్తే ఽథ శర్మిష్ఠామ్ అభ్యయుర్బాలకాస్తతః ।
శ్రుత్వా తు తేషాం బాలానాం స వ్రీడ ఇవ పార్థివః ॥ 17
వారు ఏడుస్తూ తమ తల్లి శర్మిష్ఠదగ్గరకు వెళ్ళారు. ఆ బాలుర మాటలు విని యయాతి సిగ్గుపడ్డాడు. (17)
దృష్ట్వా తు తేషాం బాలానాం ప్రణయం పార్థివం ప్రతి ।
బుద్ధ్వా చ తత్త్వం సా దేవీ శర్మిష్ఠామిదమబ్రవీత్ ॥ 18
ఆ బాలురకు రాజు పట్ల ఉన్న ప్రేమను చూసి, యథార్థాన్ని గ్రహించిన దేవయాని శర్మిష్ఠతో ఇలా అంది. (18)
దేవయాన్యువాచ
(అభ్యాగచ్చతి మాం కశ్చిత్ ఋషిరిత్యేవమబ్రవీః ।
యయాతిమేవ నూనం త్వం ప్రోత్సాహయసి భామిని ॥
పూర్వమేవ మయా ప్రోక్తం త్వయా తు వృజినం కృతమ్ ।)
మదధీనా సతీ కస్మాద్ అకార్షీ ర్విప్రియం మమ ।
తమేవాసురధర్మం త్వమ్ ఆస్థితా న బిభేషి మే ॥ 19
దేవయాని ఇలా అంది - ఒకానొక ఋషి అభ్యాగతునిగా వచ్చాడు అని నాకు చెప్పావు. నీవే యయాతిని ప్రోత్సాహించావు. ఇది తథ్యం. ఇంతకుమునుపే నీతో చెప్పాను, నీవు పాపం చేశావు. నా అధీనంలో ఉండి నాకు అనిష్టమైన పని చేశావు. నీవు అసురధర్మాన్నే ఆచరించావు. నాకు నీవు భయపడటం లేదు. (19)
శర్మిష్ఠోవాచ
యదుక్తమృషిరిత్యేవ తత్ సత్యం చారుహాసిని ।
న్యాయతో ధర్మతశ్చైవ చరంతీ న బిభేమి తే ॥ 20
శర్మిష్ఠ ఇలా అంది - నేను ఋషి అని చెప్పిన మాట నిజం. న్యాయంగా, ధర్మంగా నడచుకొంటున్న నేను నీకు భయపడను. (20)
యదా త్వయా వృతో భర్తా వృత ఏవ తదా మయా ।
సఖీ భర్తా హి ధర్మేణ భర్తా భవతి శోభనే ॥ 21
పూజ్యాసి మమ మాన్యా చ జ్యేష్ఠా చ బ్రాహ్మణీ హ్యసి ।
తత్తోఽపి మే పూజ్యతతః రాజర్షిః కిం న వేత్థ తత్ ॥ 22
(త్వత్పిత్రా గురుణా మే చ సహ దత్తే ఉభే శుభే ।
తవ భర్తా చ పూజ్యశ్చ పోష్యాం పోషయతీహ మామ్ ॥)
నీవెప్పుడైతే భర్తను వరించావో, అపుడు నేనూ వరించినట్లే. కళ్యాణీ! సఖురాలిభర్త ధర్మంగా నాకూ భర్తే. నీవు నాకన్న పెద్దదానవు. గౌరవానికి, పూజకు తగిన బ్రాహ్మణివి నీవు. నీ భర్త రాజర్షి నీకంటె నాకు మిక్కిలి పూజింపదగినవాడు. ఆ విషయం నీవెరుగవా? నీ తండ్రి, నా గురువు అయిన శుక్రాచార్యుడు మనల్ని ఇద్దర్నీ ఇతనికిచ్చాడు. నీ భర్త నాకు పూజ్యుడు. అతడు పోషింపదగిన నన్ను పోషిస్తున్నాడు. (22)
వైశంపాయన ఉవాచ
శ్రుత్వా తస్యాస్తతో వాక్యం దేవయాన్యబ్రవీదిదమ్ ।
రాజన్ నాద్యేహ వత్స్యామి విప్రియం మే కృతం త్వయా ॥ 23
వైశంపాయనుడిలా అన్నాడు - ఆమె మాటలు విన్న తర్వాత దేవయాని రాజుతో ఇలా అంది. రాజా! ఇంక ఇపుడు ఇక్కడ నేనుండలేను. నాకు ఇష్టం లేని పనిచేశావు. (23)
సహసోత్పతితాం శ్యామాం దృష్ట్వా తాం సాశ్రులోచనామ్ ।
తూర్ణం సకాశం కావ్యస్య ప్రస్థితాం వ్యధితస్తదా ॥ 24
అని పలికి దేవయాని వేగంగా లేచి తొందరగా శుక్రాచార్యుని దగ్గరకు బయలుదేరింది. కన్నీరు విడుస్తున్న ఆమెను చూసి రాజు బాధపడ్డాడు. (24)
అనువవ్రాజ సంభ్రాంతః పృష్ఠతః సాంత్వయన్ నృపః ।
న్యవర్తత న చైవ స్మ క్రోధసంరక్తలోచనా ॥ 25
కంగారుపడి రాజు సాంత్వన వచనాలు పలుకుతూ ఆమె వెనకాలే అనుసరించి వెళ్ళాడు. అయినా కోపంతో ఎర్రబడ్డకన్నులతో ఆ దేవయాని వెనకకు రాలేదు. (25)
అవిబ్రువంతీ కించిత్ సా రాజానం సాశ్రులోచనా ।
అచిరాదేవ సంప్రాప్తా కావ్యస్యోశనసో ఽంతికమ్ ॥ 26
నీరు నిండిన కన్నులతో ఆమె రాజుతో ఏమీ మాట్లాడకుండా, తొందరగా శుక్రాచార్యుని దగ్గరకు చేరింది. (26)
సా తు దృష్ట్వైవ పితరమ్ అభివాద్యాగ్రతః స్థితా ।
అనంతరం యయాతిస్తు పూజయామాస భార్గవమ్ ॥ 27
ఆమె తండ్రిని చూస్తూనే అతనికి నమస్కరించి ఎదురుగా నిలచింది. తరువాత యయాతి అక్కడకు చేరి శుక్రాచార్యుని పూజించాడు. (27)
దేవయాన్యువాచ
అధర్మేణ జితో ధర్మః ప్రవృత్తమధరోత్తరమ్ ।
శర్మిష్ఠయాతివృత్తాస్మి దుహిత్రా వృషపర్వణః ॥ 28
దేవయాని ఇలా అంది - అధర్మం ధర్మాన్ని జయించింది. క్రిందుమీదులుగ జరిగింది. నీచమైనది ఉన్నతికి, ఉన్నతమైనది నీచానికి వెళ్ళింది. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ నన్నతిక్రమించి ప్రవర్తించింది. (28)
త్రయోఽస్యాం జనితాః పుత్రా రాజ్ఞానేన యయాతినా ।
దుర్భగా యా మమ ద్వౌ తు పుత్రౌ తాత బ్రవీమి తే ॥ 29
ఈ యయాతి రాజు ఆమె యందు ముగ్గురు పుత్రుల్ని కన్నాడు. తండ్రీ! దౌర్భాగ్యవతినైన నాకు ఇద్దరు పుత్రులు. నేను నీకు నిజం చెపుతున్నాను (29)
ధర్మజ్ఞ ఇతి విఖ్యాతః ఏష రాజా భృగూద్వహ ।
అతిక్రాంతశ్చ మర్యాదాం కావ్యైతత్ కథయామి తే ॥ 30
భృగువంశశ్రేష్ఠా! ఈ రాజు ధర్మజ్ఞుడని ఖ్యాతి పొందాడు. కాని తన మర్యాదను అతిక్రమించాడు. అందువల్ల నీకు చెపుతున్నాను. (30)
శుక్ర ఉవాచ
ధర్మజ్ఞః సన్ మహారాజ యోఽధర్మమకృథాః ప్రియమ్ ।
తస్మాజ్జరా త్వామచిరాద్ ధర్షయిష్యతి దుర్జయా ॥ 31
శుక్రుడిలా అన్నాడు - మహారాజా! ధర్మజ్ఞుడవు అయికూడా అధర్మాన్ని ప్రియంగా భావించి ఆచరించావు. అందువల్ల జయింపశక్యంగాని ముసలితనం శీఘ్రంగా నిన్ను పీడిస్తుంది. (31)
యయాతిరువాచ
ఋతుం వై యాచమానాయాః భగవన్ ః నాన్యచేతసా ।
దుహితుర్దానవేంద్రస్య ధర్మ్యమేతత్ కృతం మయా ॥ 32
ఋతుం వై యాచమానాయా న దదాతి పుమానృతుమ్ ।
భ్రూణహేత్యుచ్యతే బ్రహ్మన్ స ఇహ బ్రహ్మవాదిభిః ॥ 33
అభికామాం స్త్రియం యశ్చ గమ్యాం రహసి యాచితః ।
నోపైతి స చ ధర్మేషు భ్రూణహేత్యుచ్యతే ఋధైః ॥ 34
యయాతి ఇలా అన్నాడు - పూజ్యుడా! దానవరాజు కూతురు ఏకాగ్రమైన మనస్సుతో నన్ను ఋతుదానాన్ని యాచించింది. అది ధర్మసమ్మతమని నేను ఈ పని చేశాను. ఋతువును యాచించిన స్త్రీకి పురుషుడు ఋతుదానం చేయకుంటే భ్రూణహత్య చేసినట్లని వేదవేత్తలు చెపుతున్నారు. బ్రాహ్మణశ్రేష్ఠా! ఏకాంతంలో తన కోరికను యాచించిన, పొందదగిన స్త్రీని ఆ పురుషుడు పొందకపోతే అతడు భ్రూణహత్య చేసినట్లని ధర్మవిషయంలో పండితులు చెపుతున్నారు. (32-34)
(యద్ యద్ యాచతి మాం కశ్చిత్ తద్ తద్ దేయమితి వ్రతమ్ ।
త్వయా చ సాపి దత్తా మే నాన్యం నాథమిహేచ్ఛతి ॥
మత్వైతన్మే ధర్మ ఇతి కృతం బ్రహ్మన్ క్షమస్వ మామ్ ॥)
ఇత్యేతాని సమీక్ష్యాహం కారణాని భృగూద్వహ ।
అధర్మభయసంవిగ్నః శర్మిష్ఠాముపజగ్మివాన్ ॥ 35
ఎవరు ఏది అడిగితే అది ఇవ్వాలని నా వ్రతం. ఆమెను కూడ నీవే ఇచ్చావు. ఆమె వేరొకరిని నాథునిగ ఇష్టపడలేదు. బ్రాహ్మణశ్రేష్ఠా! ఇదంతా ఆలోచించి ఇది ధర్మమని భావించి నేనీపని చేశాను. నన్ను క్షమించు. పైకారణాలను సమీక్షించి, అధర్మం వల్ల భయంతో శర్మిష్ఠను పొందాను. (35)
శుక్ర ఉవాచ
నన్వహం ప్రత్యవేక్ష్యస్తే మదధీనోఽసి పార్థివ ।
మిథ్యాచారస్య ధర్మేషు చౌర్యం భవతి నాహుష ॥ 36
శుక్రుడిలా అన్నాడు - పార్థివా! నీవు నా అధీనంలో ఉన్నావు. నీవు నాఆజ్ఞకోసం ప్రతీక్షించాలి. నహుషా! ధర్మవిషయంలో అసత్యమైన ఆచరణ చేసేవాడు దొంగతనం వల్ల కలిగే ఫలితాన్ని పొందుతాడు. (36)
వైశంపాయన ఉవాచ
క్రుద్ధేనోశనసా శప్తః యయాతిర్నాహుష స్తదా ।
పూర్వం వయః పరిత్యజ్య జరాం సద్యోఽన్వపద్యత ॥ 37
వైశంపాయనుడిలా అన్నాడు - కోపించిన శుక్రుడు అపుడు యయాతిని శపించాడు. అందువల్ల యయాతి తన యౌవనాన్ని విడిచి వెంటనే ముసలితనాన్ని పొందాడు. (37)
యయాతిరువాచ
అతృప్తో యౌవనస్యాహం దేవయాన్యాం భృగూద్వహ ।
ప్రసాదం కురు మే బ్రహ్మన్ జరేయం న విశేచ్చ మామ్ ॥ 38
యయాతి ఇలా అన్నాడు - భృగువంశశ్రేష్ఠా! యౌవనంలో దేవయానియందు నేనింకా తృప్తిని పొందలేదు. బ్రాహ్మణోత్తమా! నన్ను అనుగ్రహించు. ఈ ముసలితనం నాలో ప్రవేశించకుండా చెయ్యి. (38)
శుక్ర ఉవాచ
నాహం మృషా బ్రవీమ్యేతత్ జరాం ప్రాప్తోఽసి భూమిప ।
జరాం త్వేతాం త్వమన్యస్మిన్ సంక్రామయ యదీచ్ఛసి ॥ 39
శుక్రుడిలా అన్నాడు - నామాట అసత్యం కాదు. రాజా! నీవు ముసలితనాన్ని పొందుతున్నావు. కోరుకొన్నట్లయితే ఈ ముసలితనాన్ని నీవు వేరొకరిలో సంక్రమింపచేయవచ్చు. (39)
యయాతిరువాచ
రాజ్యభాక్ స భవేద్ బ్రహ్మన్ పుణ్యభాక్ కీర్తిభాక్ తథా ।
యో మే దద్యాద్ వయః పుత్రః తద్ భవాననుమన్యతామ్ ॥ 40
యయాతి ఇలా అన్నాడు - బ్రాహ్మణోత్తమా! నాకు తనవయస్సు నిచ్చిన పుత్రుడు రాజ్యాన్నీ, పుణ్యాన్నీ, కీర్తినీ పొందేవాడు కావాలి. నీవు అనుమతించ గోరుతున్నాను. (40)
శుక్ర ఉవాచ
సంక్రామయిష్యసి జరాం యథేష్టం నహుషాత్మజ ।
మామనుధ్యాయ భావేన న చ పాపమవాప్స్యసి ॥ 41
వయో దాస్యతి తే పుత్రః యః స రాజా భవిష్యతి ।
ఆయుష్మాన్ కీర్తిమాంశ్చైవ బహ్వపత్యస్తథైవ చ ॥ 42
శుక్రుడిలా అన్నాడు - నహుషాత్మజా! నన్ను ధ్యానించడం ద్వారా నీవు స్వేచ్ఛగా ముసలితనాన్ని ఇతరులకు సంక్రమింపజేయగలవు. పాపం పొందవు. నీకు తన యౌవనం దానం చేసిన పుత్రుడు రాజ్యానికి రాజు అవుతాడు. ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు, బహుసంతానవంతుడు అవుతాడు. (41,42)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి యయాత్యుపాఖ్యానే త్య్రశీతితమోఽధ్యాయః ॥ 83 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున యయాత్యుపాఖ్యానమను ఎనుబది మూడవ అధ్యాయము. (83)
(దాక్షిణాత్య అధికపాఠము 4 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 46 1/2 శ్లోకాలు)