84. ఎనుబది నాల్గవ అధ్యాయము

యయాతి పూరునికి తన ముసలితనమునిచ్చి, అతని యౌవనమును గ్రహించుట.

వైశంపాయన ఉవాచ
జరాం ప్రాప్య యయాతిస్తు స్వపురం ప్రాప్య చైవ హి ।
పుత్రం జ్యేష్ఠం వరిష్ఠం చ యదుమిత్యబ్రవీద్వచః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - యయాతి ముసలితనాన్ని పొంది తననగరానికి వెళ్ళి జ్యేష్ఠుడు, వరిష్ఠుడు అయిన కుమారుడు యదువుతో ఇలా అన్నాడు. (1)
యయాతిరువాచ
జరా వలీ చ మాం తాత పలితాని చ పర్యగుః ।
కావ్యస్యోశనసః శాపాత్ న చ తృప్తోఽస్మి యౌవనే ॥ 2
యయాతి ఇలా అన్నాడు - నాయనా! కావ్యుడగు శుక్రుని శాపం వల్ల నా శరీరం ముడతలు పడి ముసలితనం వచ్చింది. కేశాలు తెల్లబడ్డాయి. కాని ఇంకా యౌవనంలో తృప్తిని పొందలేదు. (2)
త్వం యదో ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ ।
యౌవనేన త్వదీయేన చరేయం విషయానహమ్ ॥ 3
పూర్ణే వర్షసహస్రేతు పునస్తే యౌవనం త్వహమ్ ।
దత్వా స్వం ప్రతిపత్స్యామి పాప్మానం జరయా సహ ॥ 4
యదూ! నీవు నా ముసలితనంతో పాటు దోషాన్ని కూడా తీసికో. నీ యౌవనంతో నేను విషయసుఖాలను అనుభవిస్తాను. వేయిసంవత్సరాలు గడిచాక మరల నీయౌవనం నీకిస్తాను. నా ముసలితనంతో పాటు నా దోషాన్ని కూడ నేను స్వీకరిస్తాను. (3,4)
యదురువాచ
జరాయాం బహవో దోషాః పానభోజనకారితాః ।
తస్మాజ్జరాం న తే రాజన్ గ్రహీష్య ఇతి మే మతిః ॥ 5
అపుడు యదువిలా అన్నాడు - ముసలితనంలో పానభోజనాల వల్ల ఏర్పడే చాలా దోషాలుంటాయి. రాజా! అందువల్ల నీ ముసలితనాన్ని నేను గ్రహించను. ఇది నా అభిప్రాయం. (5)
సితశ్మశ్రుర్నిరానందః జరయా శిథిలీకృతః ।
వలీసంగతగాత్రస్తు దుర్దర్శో దుర్బలః కృశః ॥ 6
రాజా! ముసలితనంచేత జుట్టు తెల్లబడుతుంది. ఆనందం నశిస్తుంది. అవయవాలు పట్టుతప్పుతాయి. శరీరం ముడతలు పడుతుంది. దుర్బలుడయి, నీరసించి చూడశక్యం గాకుండా ఉంటాడు. (6)
అశక్తః కార్యకరణే పరిభూతః స యౌవతైః ।
సహోపజీవిభిశ్చైవ తాం జరాం నాభికామయే ॥ 7
పనులుచేయడంలో అశక్తుడౌతాడు. స్త్రీలచే తిరస్కరింపబడతాడు. తనపై ఆధారపడి జీవించేవారు కూడా వానిని తిరస్కరిస్తారు. అందువల్ల ముసలితనాన్ని నేను కోరుకోవడం లేదు. (7)
సంతి తే బహవః పుత్రాః మత్తః ప్రియతరా నృప ।
జరాం గ్రహీతుం ధర్మజ్ఞ తస్మాదన్యం వృణీష్వ వై ॥ 8
రాజా! నీకు నా కంటె మిక్కిలి ప్రియమైన పుత్రులు చాలా మంది ఉన్నారు. ధర్మజ్ఞా! నీముసలితనాన్ని తీసికోవడానికి వేరొకరినెవరినైనా అడుగు. (8)
యయాతిరువాచ
యత్ త్వం మే హృదయాజ్జాతః వయః స్వం న ప్రయచ్ఛసి ।
తస్మాదరాజ్యభాక్ తాత ప్రజా తవ భవిష్యతి ॥ 9
అపుడు యయాతి ఇలా అన్నాడు - నాయనా! నా హృదయం నుండి పుట్టికూడా నీ వయస్సును నాకివ్వటం లేదు. అందువల్ల నీ పిల్లలు నారాజ్యం పొందడానికి అర్హులుకారు. (9)
తుర్వసో ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ ।
యౌవనేన చరేయం వై విషయాంస్తవ పుత్రక ॥ 10
కుమారా! తుర్వసూ! నా ముసలితనంతో పాటు నా దోషాన్ని స్వీకరించు. నీ యౌవనంతో నేను విషయసుఖాలను అనుభవిస్తాను. (10)
పూర్ణే వర్షసహస్రే తు పునర్దాస్యామి యౌవనమ్ ।
స్వం చైవ ప్రతిపత్స్యామి పాప్మానం జరయా సహ ॥ 11
వేయి సంవత్సరాలు గడిచాక మరల నీ యౌవనాన్ని నీకిస్తాను. నా ముసలితనాన్ని దోషాన్ని, నేను తీసుకొంటాను. (11)
తుర్వసురువాచ
న కామయే జరాం తాత కామభోగప్రణాశినీమ్ ।
బలరూపాంతకరణీం బుద్ధిప్రాణప్రణాశనీమ్ ॥ 12
అపుడు తుర్వసుడు ఇలా అన్నాడు - నాయనా! కామభోగాలను నాశనం చేసి, బలాన్ని రూపాన్ని పాడుచేసి, బుద్ధిని, ప్రాణాన్ని నాశనం చేసే ముసలితనాన్ని నేనిష్టపడటం లేదు. (12)
యయాతిరువాచ
యత్ త్వం మే హృదయాజ్జాతః వయః స్వం న ప్రయచ్ఛసి ।
తస్మాత్ ప్రజా సముచ్ఛేదం తుర్వసో తవ యాస్యతి ॥ 13
యయాతి ఇలా అన్నాడు - నా ఔరసపుత్రుడవైన నీవు నీ వయస్సును నాకివ్వడం లేదు. కాబట్టి తుర్వసూ! నీ పిల్లలు నాశనం పొందుతారు. (13)
సంకీర్ణాచారధర్మేషు ప్రతిలోమచరేషు చ ।
పిశితాశిషు చాంత్యేషు మూఢ రాజా భవిష్యసి ॥ 14
మూఢా! సంకీర్ణాలైన ఆచారధర్మాలతో వర్ణసాంకర్యం ఏర్పడిన ప్రతిలోమజాతుల వారికి, మాంసభక్షణ చేసే వారికీ, చండాలురకూ నీవు రాజు కాగలవు. (14)
గురుదారప్రసక్తేషు తిర్యగ్యోనిగతేషు చ ।
పశుధర్మేషు పాపేషు మ్లేచ్ఛేషు త్వం భవిష్యసి ॥ 15
గురుభార్యను పొందిన వారియందు, పశుపక్ష్యాదుల యందు, పశుధర్మం ఆచరించే పాపులయందు, మ్లేచ్ఛులయందు నీవు ఉండగలవు. (15)
వైశంపాయన ఉవాచ
ఏవం స తుర్వసుం శప్త్వా యయాతిః సుతమాత్మనః ।
శర్మిష్ఠాయాః సుతం ద్రుహ్యుమ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 16
వైశంపాయనుడిలా అన్నాడు - తుర్వసుని శపించి యయాతి శర్మిష్ఠకు కలిగిన తన కుమారుడు ద్రుహ్యునితో ఇలా అన్నాడు. (16)
యయాతిరువాచ
ద్రుహ్యో త్వం ప్రతిపద్యస్వ వర్ణరూపవినాశినీమ్ ।
జరాం వర్షసహస్రం మే యౌవనం స్వం దదస్వ చ ॥ 17
యయాతి ఇలా అన్నాడు - ద్రుహ్యూ! వర్ణరూపాలను నశింపజేసే నా ముసలితనాన్ని వేయిసంవత్సరాలపాటు నీవు స్వీకరించు. నీ యౌవనాన్ని నాకు ఇయ్యి. (17)
పూర్ణే వర్షసహస్రే తు పునర్దాస్యామి యౌవనమ్ ।
స్వం చాదాస్యామి భూమోఽహం పాప్మానం జరయా సహ ॥ 18
వేయి సంవత్సరాలు గడవగానే నీయౌవనాన్ని నీకు తిరిగి ఇస్తాను. నా ముసలితనంతో పాటు దోషాన్ని కూడా స్వీకరిస్తాను. (18)
ద్రుహ్యురువాచ
న గజం న రథం నాశ్వం జీర్ణో భుంక్తే న చ స్త్రియమ్ ।
వాక్ సంగశ్చాస్య భవతి తాం జరాం నాభికామయే ॥ 19
ద్రుహ్యుడు ఇలా అడిగాడు - ముసలివాడు ఏనుగు, గుఱ్ఱం, రథం అధిరోహించలేడు. స్త్రీని భోగించలేడు. అతని మాటకూడా తడబడుతుంది. అటువంటి ముసలితనాన్ని నేనిష్టపడటం లేదు. (19)
యయాతిరువాచ
యత్ త్వం హృదయాజ్జాతః వయః స్వం న ప్రయచ్ఛసి ।
తస్మాద్ ద్రుహ్యో ప్రియః కామః న తే సంపత్స్యతే క్వచిత్ ॥ 20
యయాతి ఇలా అన్నాడు - నీవు నా ఔరసపుత్రుడవై కూడా నీ యువవయస్సును నాకివ్వడం లేదు. అందువల్ల ద్రుహ్యూ! నీకిష్టమైన కోరిక నీకెక్కడా లభించదు. (20)
యత్రాశ్వరథముఖ్యానాం అశ్వానాం స్యాద్ గతం న చ ।
హస్తినాం పీఠకానాం చ గర్దభానాం తథైవ చ ॥ 21
బస్తానాం చ గవాం చైవ శిబికాయాస్తథైవ చ ।
ఉడుపప్లవసంతారః యత్ర నిత్యం భవిష్యతి ।
అరాజా భోజశబ్దం త్వం తత్ర ప్రాప్స్యసి సాన్వయః ॥ 22
ఉత్తమాలైన అశ్వాలు పూన్చదగిన రథాలు, అశ్వాలు, ఏనుగులు, సింహాసనాలు, లేనిచోట; గాడిదలు, దున్నలు, ఎద్దులు, పల్లకీలు లేని చోట; నిత్యం నావపై తిరుగవలసి ఉన్నచోట నీవు నీ వంశీయులతో పాటు ఉంటావు. నీ వంశంలోనివారు రాజులు కాలేరు. 'భోజ' శబ్దంతో మీరు వ్యవహరింపబడతారు. (21,22)
యయాతి రువాచ
అనో త్వం ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ ।
ఏకం వర్షసహస్రం తు చరేయం యౌవసేన తే ॥ 23
యయాతి ఇలా అన్నాడు. - నాయనా అనూ! నీవు ముసలితనంతో పాటు నా యౌవనాన్ని స్వీకరించు. ఒక వేయి సంవత్సరాలు నీ యౌవనంతో నేను సంచరిస్తాను. (23)
అనురువాచ
జీర్ణః శిశువదాదత్తే ఽకాలే ఽన్నమశుచిర్యథా ।
న జుహోతి చ కాలేఽగ్నిం తాం జరాం నాభికామయే ॥ 24
అపుడు అనువు ఇలా అన్నాడు - ముసలివాడు శిశువులా అకాలంలో అన్నం తింటాడు. (అశుభ్రంగా) అశుచిగా ఉంటాడు. సకాలంలో అగ్నిహోత్రంలో హోమం చేయలేడు. అటువంటి ముసలితనాన్ని నేను ఇష్టపడటం లేదు. (24)
యయాతిరువాచ
యత్ త్వంమే హృదయాజ్జాతః వయః స్వం న ప్రయచ్ఛసి ।
జరాదోషస్త్వయా ప్రోక్తః తస్మాత్ త్వం ప్రతిపత్స్యసే ॥ 25
ప్రజాశ్చ యౌవనప్రాప్తాః వినశిష్యంత్యనో తవ ।
అగ్నిప్రస్కందనపరః త్వం చాప్యేవం భవిష్యసి ॥ 26
యయాతి ఇలా అన్నాడు - నీవు నా ఔరసపుత్రుడవై యుండి కూడ నీయువవయస్సును నాకివ్వటం లేదు. ముసలితనం యొక్క దోషాన్ని నీవు చెప్పావు. అందువల్ల నీవు ముసలితనం లోని దోషాలన్నింటిని పొందుతావు. నీ సంతానం యౌవనం పొందుతూనే నశిస్తుంది. నీవు కూడా ముసలితనంతో అగ్నిహోత్రానికి దూరం అవుతావు. (25,26)
యయాతిరువాచ
పూరో త్వం మే ప్రియః పుత్రః త్వం వరీయాన్ భవిష్యసి ।
జరా వలీ చ మాం తాత పలితాని చ పర్యగుః ॥ 27
యయాతి ఇలా అన్నాడు - పూరూ! నీవు నాకు ప్రియమైన పుత్రుడవు. నివు శ్రేష్ఠుడవు కాగలవు. నాయనా! నాపై ముసలితనం వచ్చిపడింది. నా శరీరం ముడతలు పడింది. జుట్టు తెల్లబడింది. (27)
కావ్యస్యోశనసః శాపాత్ న చ తృప్తోఽస్మి యౌవనే ।
పూరో త్వం ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ ।
కంచిత్కాలం చరేయం వై విషయాన్ వయసా తవ ॥ 28
పూర్ణే వర్షసహస్రే తు పునర్దాస్యామి యౌవనమ్ ।
స్వం చైవ ప్రతిపత్స్యామి పాప్మానం జరయా సహ ॥ 29
కావ్యుడైన శుక్రాచార్యుని శాపం వల్ల యౌవనంలో తృప్తిని పొందలేదు. పూరూ! ముసలితనంతో పాటు దోషాన్ని స్వీకరించు. నీ యౌవనవయస్సుతో కొంతకాలం చరిస్తాను. వేయి సంవత్సరాలు గడిచాక మరల నీ యౌవనం నీకిస్తాను. నా ముసలితనాన్ని దోషంతో పాటుగ స్వీకరిస్తాను. (28,29)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః ప్రత్యువాచ పూరుః పితరమంజసా ।
యథా ఽఽత్థ మాం మహారజ తత్ కరిష్యామి తే వచః ॥ 30
వైశంపాయనుడిలా అన్నాడు - ఇలా అనగానే పూరుడు తండ్రికి ఇలా బదులిచ్చాడు. - నీవు నాకు చెప్పిన విధంగా నీమాటను ఆచరిస్తాను. (30)
(గురోర్వై వచనం పుణ్యం స్వర్గ్యమాయుష్కరం నృణామ్ ।
గురుప్రసాదాత్ త్రైలోక్యం అన్వశాసచ్ఛతక్రతుః ॥
గురోరనుమతిం ప్రాప్య సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ ॥)
మానవులకు పెద్దవారి మాట పవిత్రమైనది, స్వర్గాన్నిస్తుంది, ఆయుష్కరం కూడా. గురువు అనుగ్రహం వల్లనే ఇంద్రుడు ముల్లోకాలను శాసించాడు. పెద్దల అనుమతి పొంది అన్ని కోరికలను పొందాలి.
ప్రతిపత్స్యామి తే రాజన్ పాప్మానం జరయా సహ ।
గృహాణ యౌవనం మత్తః చర కామాన్ యథేప్సితాన్ ॥ 31
రాజా! నీ ముసలితనాన్ని దోషంతోపాటు స్వీకరిస్తాను. నా నుండి యౌవనాన్ని స్వీకరించు. నీవు కోరుకున్న విధంగా కోరికలను అనుభవించు. (31)
జరయాహం ప్రతిచ్ఛన్నః వయోరూపధరస్తవ ।
యౌవనం భవతే దత్వా చరిష్యామి యథాత్థ మామ్ । 32
నేను నీ యొక్క ముసలితనంతో కప్పబడి నీవయోరూపాలను ధరిస్తాను. నా యౌవనాన్ని నీకిచ్చి నీవు నాకు చెప్పినట్లుగా సంచరిస్తాను. (32)
యయాతిరువాచ
పూరో ప్రీతోస్మి తే వత్స ప్రీతశ్చేదం దదామి తే ।
సర్వకామసమృద్ధా తే ప్రజా రాజ్యే భవిష్యతి ॥ 33
యయాతి ఇలా అన్నాడు - వత్సా! పూరూ! నీ మాటలకు నేను తృప్తి చెందాను. ఆనందించి నీకిది ఇస్తున్నాను. సర్వకామ సమృద్ధమైన రాజ్యాధికారంలో నీ పిల్లలు ఉంటారు. (33)
ఏవముక్త్వా యయాతిస్తు స్మృత్వా కావ్యం మహాతపాః ।
సంక్రామయామాస జరాం తదా పూరౌ మహాత్మని ॥ 34
మహాతపస్వి యయాతి ఈ విధంగా పలికి శుక్రాచార్యుని స్మరించి, ముసలితనాన్ని మహాత్ముడైన పూరునిలో సంక్రమింపజేశాడు. (34)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి యయాత్యుపాఖ్యానే చతురశీతితమోఽధ్యాయః ॥ 84 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున యయాత్యుపాఖ్యానమను ఎనుబది నాల్గవ అధ్యాయము. (84)
(దాక్షిణాత్య అధికపాఠము 1 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 35 1/2 శ్లోకాలు)