89. ఎనుబది తొమ్మిదవ అధ్యాయము
అష్టక యయాతుల సంవాదము.
యయాతి రువాచ
అహం యయాతి ర్నహుషస్య పుత్రః
పూరోః పితా సర్వభూతావమానాత్ ।
ప్రభంశితః సురసిద్ధర్షిలోకాత్
పరిచ్యుతః ప్రపతామ్యల్పపుణ్యః ॥ 1
యయాతి ఇలా అన్నాడు - నేను నహుషుని పుత్రుడగు యయాతిని. పూరుని తండ్రిని. సర్వభూతాలను అవమానించటం వల్ల పుణ్యం క్షీణించి సుర, సిద్ధ, ఋషులుండే లోకం నుండి త్రోయబడి ఇక్కడ పడ్డాను. (1)
అహం హి పూర్వో వయసా భవద్భ్యః
తేనాభివాదం భవతాం న ప్రయుంజే ।
యో విద్యయా తపసా జన్మనా వా
వృద్ధః స పూజ్యో భవతి ద్విజానాం ॥ 2
నేను వయస్సు చేత మీ కంటె పెద్దవాడిని. అందుచేత మీకు నమస్కారం చేయడం లేదు. విద్యచేతగాని, తపస్సుచేతగాని, జన్మచేతగాని వృద్ధుడైన వాడు మాత్రమే ద్విజులకు నమస్కరింపదగినవాడవుతాడు. (2)
అష్టక ఉవాచ
అవాదీస్త్వం వయసా యః ప్రవృద్ధః
స వై రాజన్ నాభ్యధికః కథ్యతే చ ।
యో విద్యయా తపసా సంప్రవృద్ధః
స ఏవ పూజ్యో భవతి ద్విజానామ్ ॥ 3
అష్టకుడిలా అన్నాడు - రాజా! వయస్సు చేత వృద్ధుడైనవాడు నీవు చెప్పినట్లుగ సమ్మానింపదగినవాడు కాదు. విద్యచేత, తపస్సుచేత వృద్ధుడైనవాడే ద్విజులకు పూజింప దగినవాడు. (3)
యయాతి రువాచ
ప్రతికూలం కర్మణాం పాపమాహుః
తద్ వర్తతే ఽప్రవణే పాపలోక్యమ్ ।
సంతో సతాం నానువర్తంతి చైతద్
యథా చైషామనుకూలా స్తథాఽసన్ ॥ 4
యయాతి ఇలా అన్నాడు - పుణ్యకర్మలను నశింపచేసేది పాపమని చెపుతున్నాడు. ఆ పాపం నరకాణ్ని కలుగజేస్తుంది. పాపప్రవణుడు కాని వాడుకూడ పాపలోకనివాసం చేయడం ఉంది. సత్పురుషులు చెడ్డవారి పనులను అనుసరించరు. సత్పురుషులు సత్పురుషుల చేష్టలనే అనుసరిస్తారు. (4)
అభూద్ ధనం మే విపులం గతం తద్
విచేష్టమానో నాధిగంతా తదస్మి ।
ఏవం ప్రధార్యాత్మహితే నివిష్టః
యోవర్తతే స విజానాతి ధీరః ॥ 5
"మునుపు నాకు ఎక్కువ పుణ్యధనం ఉండేది. ఇతరులను నిందించడం వల్ల అదంతా నశించింది. ఇపుడు మంచిపని చేసి కూడ మరల దాన్ని పొందలేను". ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకొని ఆత్మహితమందే లగ్నమై ఉన్నవాడే ధీరుడు. అతడే జ్ఞాని. (5)
మహాధనో యో యజతే సుయజ్ఞైః
యః సర్వవిద్యాసు వినీతబుద్ధిః ।
వేదానధీత్య తపసా ఽఽయోజ్య దేహం
దివం సమాయాత్ పురుషో వీతమోహః ॥ 6
మహాధనవంతుడై మంచి యజ్ఞాలతో దేవతలను ఆరాధించేవాడు, అన్ని విద్యలయందు వినయ బుద్ధికలవాడూ, వేదాలను అధ్యయనం చేసి తనదేహాన్ని తపస్సుకు నియోగించినవాడూ మోహం నశించి స్వర్గానికి వెళతాడు. (6)
న జాతు హృష్యే న్మహతా ధనేన
వేదా నధియీతానహంకృతః స్యాత్ ।
నానాభావా బహనో జీవలోకే
దైవాధీనా నష్టచేష్టాధికారాః ।
తత్ తత్ ప్రాప్య న విహన్యేత్ ధీరః
దిష్టం బలీయ ఇతి మత్వా ఽఽత్మబుద్ధ్యా ॥ 7
చాలా ధనం పొందగానే ఆనందం పొందకూడదు. అహంకారం లేకుండా వేదాధ్యయనం చేయాలి. ఈ ప్రాణిలోకంలోఅనేక స్వభావాలు కలవారున్నారు. వారంతా దైవాధీనులైనవారే. వారి ప్రయత్నాలు. కర్మలు వ్యర్థాలే. సుఖాన్నిగాని. దుఃఖాన్నిగాణి పొంది ధీరుడైనవాడు చలింపకూడదు. ఆత్మబుద్ధితో దైవమే బలీయమైనదని గ్రహించాలి. (7)
సుఖం హి జంతుర్యది వాపి దుఃఖం
దైవాధీనం విందతే నాత్మశక్త్యా ।
తస్మాద్ దిష్టం బలవన్మన్యమానః
న సంజ్వరే న్నాపి హృష్యేత్ కథంచిత్ ॥ 8
ప్రాణి సుఖాన్నికాని దుఃఖాన్నికాని దైవాధీనం వల్ల పొందుతాడేగాని తనశక్తిచేత కాదు. అందువల్ల దైవం బలవంతమైనదని తెలిసి ఏవిధంగాను దుఃఖించుకూడదు. ఆనందించకూడదు. (8)
దుఃఖైర్న తప్యేన్న సుఖైః ప్రహృష్యేత్
సమేన వర్తేత సదైవ ధీరః ।
దిష్టం బలీయ ఇతి మన్యమానః
న సంజ్వరేన్నాపి హృష్యేత్ కథంచిత్ ॥ 9
ధీరుడు దుఃఖాలతో తపించిపోక, సుఖాలతో పొంగిపోక, రెండింటియందు సమంగా ఉండాలి. దైవం బలీయమైనదని గ్రహించి ఎప్పుడూ కుంగిపోకూడదు, పొంగిపోకూడదు. (9)
భయే న ముహ్యామ్యష్టకాహం కదాచిత్
సంతాపో మే మానసో నాస్తి కశ్చిత్ ।
ధాతా యథా మాం విదధీత లోకే
ధ్రువం తథాహం భవితేతి మత్వా ॥ 10
అష్టకా! నేనెప్పుడు భ్రమలో మోహితుడిని కాలేదు. భయపడలేదు. నా మనస్సులో ఎపుడూ సంతాపం లేదు. ఈ లోకంలో బ్రహ్మ నన్ను ఎలా శాసించాడో తప్పక నేను అలాగే ఉంటాను అని భావించాను. (10)
సంస్వేదజా అండజాశ్చోద్భిదశ్చ
సరీసృపాః కృమాయో ఽథాప్సు మత్స్యాః ।
తథాశ్మానస్తృణకాష్టం చ సర్వే
దిష్టక్షయే స్వాం ప్రకృతిం భజంతి ॥ 11
స్వేదజాలు, అండజాలు, ఉద్భిదాలు, సరీసృపాలు, క్రిములు, నీటిలోని చేపలు, రాళ్లు, గడ్డి, కర్రలు ఇవన్నీ కూడ వాటి కర్మం నశించగానే వాటి వాటి స్వభావాన్ని (మూలతత్త్వాన్ని) పొందుతాయి. (11)
అనిత్యతాం సుఖదుఃఖస్య బుద్ధ్వా
కస్మాత్ సంతాపమష్టకాహం భజేయమ్ ।
కిం కుర్యాం వై కిం చ కృత్వా న త్ప్యే
తస్మాత్ సంతానం వర్జయామ్యప్రమత్తః ॥ 12
అష్టకా! సుఖదుఃఖాల అనిత్యతను తెలిసి కూడ నేను సంతాపాన్ని ఎందుకు పొందుతాను? నేనేమి చెయ్యను? ఏమిచేసి నేను తపించకుండ ఉండగలను? అందువల్ల అప్రమత్తుడనై విడిచి పెడుతున్నాను. (12)
(దుఃఖే న ఖిద్యేన్న సుఖేన మాద్యేత్
సమేన వర్తేత స ధీరధర్మా ।
దిష్టం బలీయం సమవేక్ష్య బుద్ధ్యా
న సజ్జతే చాత్ర భృశం మనుష్యః ॥)
దుఃఖం చేత కుంగిపోకూడదు, సుఖం చేత పొంగిపోకూడదు. ధీరుడు రెండింటియందు సమానంగా ఉండాలి. దైవం (కర్మ) బలీయమని బుద్ధిచే గ్రహించి మనుష్యుడు ఈ లోకంలో దేనియందూ చిక్కుకుపోకూడదు.
వైశంపాయన ఉవాచ
ఏవం బ్రువాణం నృపతిం యయాతిమ్
అథాష్టకః పునరేవాన్వపృచ్ఛత్ ।
మాతామహం సర్వగుణోపపన్నమ్
తత్ర స్థితం స్వర్గలోకే యథావత్ ॥ 13
వైశంపాయనుడిలా అన్నాడు - అన్ని సద్గుణాలతో కూడి, మాతామహుడైన యయాతిరాజు అంతరిక్షంలో ఉన్నా స్వర్గలోకంలో ఉన్నట్లు భావించి అష్టకుడు యయాతిని మళ్ళీ ఇలా అడిగాడు. (13)
అష్టక ఉవాచ
యే యే లోకాః పార్థివేంద్ర ప్రధానాః
త్వయా భుక్తా యం చ కాలం యథావత్ ।
తాన్ మే రాజన్ బ్రూహి సర్వాన్ యథావత్
క్షేత్రజ్ఞవద్ భాషసే త్వం హి ధర్మాన్ ॥ 14
అష్టకుడిలా అన్నాడు - రాజేంద్రా! ప్రధానాలైన ఏఏ లోకాలు ఎంతెంతకాలం అనుభవించావో ఉన్నదున్నట్లు వాటన్నింటిని నాకు చెప్పు. నీవు క్షేత్రజ్ఞునివలె ధర్మాలను గురించి చెపుతున్నావు. (14)
యయాతి రువాచ
రాజాహమాసమిహ సార్వభౌమః
తతో లోకాన్ మహతశ్చాజయం వై ।
తత్రావసం వర్షసహస్రమాత్రం
తతో లోకం పరమస్మ్యభ్యుపేతః ॥ 15
యయాతి ఇలా అన్నాడు - నేనీ భూలోకంలో సౌర్వభౌమునిగ ఉన్నాను. అనంతరం సత్కర్మలవల్ల గొప్పగొప్పలోకాలను జయించాను. ఆ లోకాలలో నేను వేయిసంవత్సరాలు నివసించాను. అనంతరం అంతకంటె ఉన్నతమైన లోకాన్ని పొందాను. (15)
తతః పురీం పురుహూతస్య రమ్యాం
సహస్రద్వారాం శతయోజనాయతాం ।
అధ్యావసం వర్షసహస్రమాత్రం
తతో లోకం పరమస్మ్యభ్యుపేతః ॥ 16
అనంతరం వేయి ద్వారాలలో, శతయోజనాలు విస్తరించిన ఇంద్రుని యొక్క అందమైన అమరావతీ నగరానికి వెళ్ళాను. అక్కడ వెయ్యిసంవత్సరాలు నివసించాను. అనంతరం అంతకంటె ఉన్నతమైన లోకానికి వెళ్ళాను. (16)
తతో దివ్యమజరం ప్రాప్య లోకం
ప్రజాపతే ర్లోకపతేర్దురాపమ్ ।
తత్రావసం వర్షసహస్రమాత్రం
తతో లోకం పరమస్మ్యభ్యుపేతః ॥ 17
అనంతరం దివ్యమై, జరారహితమై లోకపతికి దుర్లభమైన ప్రజాపతిలోకాన్ని పొందాను. అక్కడ వేయి సంవత్సరాలు నివసించాను. అనంతరం అంతకంటె ఉన్నతమైన లోకాన్ని పొందాను. (17)
స దేవదేవస్య నివేశనే చ
విహృత్య లోకానవసం యథేష్టమ్ ।
సంపూజ్యమానస్త్రిదశైః సమస్తైః
తుల్యప్రభావద్యుతి రీశ్వరాణామ్ ॥ 18
అక్కడ దేవదేవుడయిన బ్రహ్మయొక్క భవనంలో ఉండి, అచటి లోకాల్లో యథేష్టంగా విహరిస్తూ నివసించాను. అక్కడున్న దేవతలందరిచే పూజింపబడుతూ దేవతలతో సమానమైన ప్రభావాన్ని తేజస్సును పొందాను. (18)
తథావసం నందనే కామరూపీ
సంవత్సరాణాయయుతం శతానాం ।
సహాప్సరోభిర్విహరన్ పుణ్యగంధాన్
పశ్యన్ నాగాన్ పుష్పితాంశ్చారురూపాన్ ॥ 19
ఆవిధంగా నందనవనంలో కామారూపినై పది లక్షల సంవత్సరాలు అప్సరసలతో విహరిస్తూ, పవిత్రమైన పరిమళమూ, అందమైన రూపమూ, వికసించిన పూలూ కల వృక్షాలను చూస్తూ నివసించాను. (19)
తత్ర స్థితం మాం దేవసుఖేషు సక్తం
కాలే ఽతీతే మహతి తతో ఽతిమాత్రమ్ ।
దూతో దేవానామబ్రవీదుగ్రరూపః
ధ్వంసేత్యుచ్చై స్త్రిఃప్లుతేన స్వరేణ ॥ 20
దివ్యమైన సుఖాలలో మునిగి ఉన్న నన్ను చాలాకాలం గడిచాక భయంకరరూపంలో ఉన్న దేవదూత 'జారిపడు' (కిందికిపడు) అని గట్టిగా ప్లుతస్వరంలో మూడుసార్లు పలికాడు. (20)
ఏతావన్మే విదితం రాజసింహ
టహ్తో భ్రష్టోఽహం నందనాత్ క్షీణపుణ్యః ।
వాచోఽశ్రౌషం చాంతరిక్షే సురాణాం
సానుక్రోశాః శోచతాం మాం నరేంద్ర ॥ 21
రాజసింహా! నాఖు ఇంతమాత్రమే తెలుసు. అనంతరం పుణ్యం క్షీణించిన నేను నందవనం నుండి జారిపడ్డాను. నరేంద్రా! అంతరిక్షంలో నాగురించి దుఃఖిస్తున్న దేవతల జాలి మాటలను విన్నాను. (21)
అహో కష్టం క్షీణపుణ్యో యయాతిః
పతత్యసౌ పుణ్యకృత్ పుణ్యకీర్తిః ।
తానబ్రువం పతమాన స్తతోఽహం
సతాం మధ్యే నిపతేయం కథం ను ॥ 22
అయ్యో! ఎంతకష్టం! పుణ్యాత్ముడు, పవిత్రకీర్తి అయిన యయాతి పుణ్యం నశించి క్రిందికి పడుతున్నాడు. ఆ మాటలను విని నేను వారితో 'సత్పురుషుల మధ్యలో నేనేవిధంగా పడగలను? అని పలికాను. (22)
తైరాఖ్యాతా భవతాం యజ్ఞభూమిః
సమీక్ష్య చేమాం త్వరితముపాగతోఽస్మి ।
హవిర్గంధం దేశికం యజ్ఞభూమేః
ధూమాపాంగం ప్రతిగృహ్య ప్రతీతః ॥ 23
మీ యజ్ఞభూమిని గురించి వారు చెప్పారు. ఈ భూమిని చూసి నేను త్వరగా వచ్చాను. ఈ యజ్ఞభూమిని తెలియపరిచే హవిస్సుల పరిమళం, ధూమం వ్యాపించిన ప్రదేశాన్ని గ్రహించి నేను ఊరట పొందాను. (23)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఉత్తరయాయాతే ఏకోననవతితమోఽధ్యాయః ॥ 89 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఉత్తర యయాతి చరిత్రమను ఎనుబది తొమ్మిదవ అధ్యాయము. (89)