94. తొంబది నాలుగవ అధ్యాయము
పూరువంశవర్ణనము.
జనమేజయ ఉవాచ
భగవన్ శ్రోతుమిచ్ఛామి పూరోర్వంశకరాన్ నృపాన్ ।
యద్వీర్యాన్ యాదృశాంశ్చాపి యావతో యత్పరాక్రమాన్ ॥ 1
జన్మేజయుడిలా అన్నాడు - పూజ్యుడా! పూరువంశ విస్తారకులైన రాజులను గూర్చి వినాలనుకొంటున్నాను. వారు ఎంత బలం కలవారు? ఎటువంటివారు? ఎంతటి పరాక్రమం కలవారు? (1)
న హ్యస్మిన్ శీలహీనో వా నిర్వీర్యో వా నరాధిపః ।
ప్రజావిరహితో వాపి భూతపూర్వః కథంచన ॥ 2
వారిలో శీలహీనుడు గాని, బలపరాక్రమాలు లేనివాడు గాని, సంతానహీనుడు గాని మునుపు లేడు కదా! (2)
తేషాం ప్రథితవృత్తానాం రాజ్ఞాం విజ్ఞానశాలినామ్ ।
చరితం శ్రోతుమిచ్ఛామి విస్తరేణ తపోధన ॥ 3
తపోధనా! ప్రసిద్ధమైన చరిత్రం, విజ్ఞానమూ కల ఆ వంశ రాజుల చరిత్రను విస్తరంగా వినాలని ఉంది. (3)
వైశంపాయన ఉవాచ
హంత తే కథయిష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి ।
పూరోర్వంశధరాన్ వీరాన్ శక్రప్రతిమతేజసః ।
భూరిద్రవిణవిక్రాంతాన్ సర్వలక్షణపూజితాన్ ॥ 4
అపుడు వైశంపాయనుడిలా అన్నాడు - నాయనా! నీవు అడుగుతున్న పూర్వవంశకర్తలైన వీరులై, ఇంద్రునితో సమానమైన పరాక్రమమూ, సర్వసంపదలూ, అన్ని శుభలక్షణాలూ కల ఆ రాజులను గురించి చెపుతాను. (4)
ప్రవీరేశ్వరరౌద్రాశ్వాఃత్రయః పుత్రా మహారథాః ।
పూరోః పౌష్ట్యామజాయంత ప్రవీరో వంశకృత్ తతః ॥ 5
పూరునకు పౌష్టి అనే భార్యయందు ప్రవీరుడు, ఈశ్వరుడు, రౌద్రాశ్వుడు అనే మహారథులైన ముగ్గురు పుత్రులు కలిగారు. వారిలో ప్రవీరుడు పూరువంశపరంపరను ముందుకు తీసికొనివెళ్లాడు. (5)
మనస్యురభవత్ తస్మాత్ శూరసేనీసుతః ప్రభుః ।
పృథివ్యా శ్చతురంతాయాః గోప్తా రాజీవలోచనః ॥ 6
ఆ ప్రవీరుని వల్ల శూరసేనికి పుత్రుడు పుట్టాడు. అతడి పేరు మనస్యువు. అతడు అందగాడు, సమర్థుడు, చతుస్సముద్రాల వరకూ వ్యాపించిన ఈ భూమిని పాలించినవాడు. (6)
శక్తః సంహననో వాగ్మీ సౌవీరీతనయాస్త్రయః ।
మనస్యోరభవన్ పుత్రాః శూరాః సర్వే మహారథాః ॥ 7
మనస్యునకు సౌవీరియందు ముగ్గురు కొడుకులు జన్మించారు. వారు శక్తుడు, సంహననుడు, వాగ్మి. వారంతా శూరులూ, మహారథులూ కూడ. (7)
అన్వగ్భానుప్రభృతయః మిశ్రకేశ్యాం మనస్వినః ।
రౌద్రాశ్వస్య మహేష్వాసాః దశాప్సరసిసూనవః ॥ 8
యజ్వానో జజ్ఞిరే శూరాః ప్రజావంతో బహుశ్రుతాః ।
సర్వే సర్వాస్త్రవిద్వాంసః సర్వే ధర్మపరాయణాః ॥ 9
పూరుని మూడో కొడుకు, మనస్వి అయిన రౌద్రాశ్వునకు మిశ్రకేశి అను అప్సర యందు అన్వగ్భానుడు మున్నగు పదిమంది కొడుకులు పుట్టారు. వారంతా మహాధనుర్ధరులు, యజ్ఞం చేసిన వారు, శూరులు, సంతానవంతులు, విద్యావంతులు, అస్త్రవిద్యలన్నీ తెలిసినవారు, ధర్మపరాయణులు. (8,9)
ఋచేయురథ కక్షేయుః కృకణేయుశ్చ వీర్యవాన్ ।
స్థండిలేయు ర్వనేయుశ్చ జలేయుశ్చ మహాయశాః ॥ 10
తేజేయు ర్బలవాన్ ధీమాన్ సత్యేయుశ్చేంద్రవిక్రమః ।
ధర్మేయుః సంనతేయుశ్చ దశమో దేవవిక్రమః ॥ 11
ఋచేయువు, కక్షేయువు, కృకణేయువు, స్థండిలేయువు, వనేయువు, మహాయశస్వి జలేయువు, బలవంతుడు, బుద్ధిమంతుడూ అయిన తేజేయువు, ఇంద్రునితో సమానమైన పరాక్రమం గల సత్యేయువు, ధర్మేయువు, సంనతేయువు అను పదుగురు కుమారులు - అందులో పదోవాడు సంనతేయువు దేవతలతో సమానమైన పరాక్రమం గలవాడు. (10,11)
అనాధృష్టి రభూత్ తేషాం విద్వాన్ భువి తథైకరాట్ ।
ఋచేయురథ విక్రాంతః దేవానామివ వాసవః ॥ 12
వారిలో అనాధృష్టి అని పేరుగల ఋచేయువు అందరి కంటె విద్వాంసుడు, దేవతలలో ఇంద్రుడిలా పరాక్రమం కలవాడూ. అతడు ఈ భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. (12)
అనాధృష్టిసుత స్త్వాసీద్ రాజసూయాశ్వమేధకృత్ ।
మతినార ఇతి ఖ్యాతః రాజా పరమధార్మికః ॥ 13
ఆ అనాధృష్టికి మతినారుడనే కొడుకున్నాడు. అతడు రాజసూయ, అశ్వమేధాలను చేసిన ధార్మికుడు. (13)
మతినారసుతా రాజన్ చత్వారోఽమితవిక్రమాః ।
తంసుర్మహానతిరథః ద్రుహ్యుశ్చాప్రతిమద్యుతిః ॥ 14
మతినారునికి అమితవిక్రములైన తంసువు, మహత్తు, అతిరథుడు, అనుపమతేజస్సు గల ద్రుహ్యువు అనే నలుగురు కొడుకులు కలిగారు. (14)
తేషాం తంసుర్మహావీర్యః పౌరవం వంశముద్వహన్ ।
ఆజహార యశోదీప్తం జిగాయ చ వసుంధరామ్ ॥ 15
వారిలో మహాపరాక్రమవంతుడైన తంసువు వంశభారాన్ని వహించి వంశప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు. భూమండలాన్నంతా జయించాడు. (15)
ఈలినం తు సుతం తంసుః జనయామాస వీర్యవాన్ ।
సోఽపి కృత్న్సామిమాం భూమిం విజిగ్యే జయతాం వరః ॥ 16
పరాక్రమవంతుడైన తంసువుకు ఈలి అను కొడుకు పుట్టాడు. జయశీలురలో శ్రేష్ఠుడైన ఆ ఈలి కూడ ఈ సమస్త భూమండలాన్ని జయించాడు. (16)
రథంతర్యాం సుతాన్ పంచ పంచభూతోపమాంస్తతః ।
ఈలినో జనయామాస దుష్యంతప్రభృతీన్ నృపాన్ ॥ 17
ఆ ఈలి రథంతరి యందు పంచభూతాలతో సమానమైన దుష్యంతుడు మొదలయిన ఐదుగురు కొడుకులను కన్నాడు. (17)
దుష్యంతం శూరభీమౌ చ ప్రవసుం వసుమేవ చ ।
తేషాం శ్రేష్ఠోఽభవన్ రాజా దుష్యంతో జనమేజయ ॥ 18
జనమేజయా! దుష్యంతుడు, శూరుడు, భీముడు, ప్రవసువు, వసువు అనే ఐదుగురిలో శ్రేష్ఠుడైన దుష్యంతుడు రాజ్యానికి రాజయ్యాడు. (18)
దుష్యంతాద్ భరతో జజ్ఞే విద్వాంచ్ఛాకుంతలో నృపః ।
తస్మాద్ భరతవంశస్య విప్రతస్థే మహద్ యశః ॥ 19
ఆ దుష్యంతునికి శకుంతల యందు భరతుడు జన్మించాడు. అతని వల్ల భరతవంశానికి గొప్పకీర్తి ఏర్పడింది. (19)
భరతస్తిసృషు స్త్రీషు నవ పుత్రానజీజనత్ ।
నాభ్యనందత తాన్ రాజా నామరూపా మమేత్యుత ॥ 20
భరతుడు ముగ్గురు స్త్రీల యందు తొమ్మండుగురు కొడుకులను కన్నాడు. కాని వారు తనకు తగినట్లులేరని వారిని ఆదరించలేదు. (20)
తతస్తాన్ మాతరః క్రుద్ధాః పుత్రాన్ నిన్యుర్యమక్షయమ్ ।
తతస్తస్య నరేంద్రస్య వితథం పుత్రజన్మ తత్ ॥ 21
అందువల్ల కోపించిన వారి తల్లులు ఆ తొమ్మండుగురు కొడుకుల్ని చంపేశారు. ఆ విధంగా భరతునికి కల్గిన పుత్రజననం వ్యర్థమయింది. (21)
తతో మహద్భిః క్రతుభిః ఈజానో భరతస్తదా ।
లేభే పుత్రం భరద్వాజాద్ భుమన్యుం నామ భారత ॥ 22
అనంతరం భరతుడు గొప్ప గొప్ప క్రతువులను చేశాడు. భరద్వాజుని అనుగ్రహం వల్ల భుమన్యువు అను కుమారుని పొందాడు. (22)
తతః పుత్రిమాత్మానం జ్ఞాత్వా పౌరవనందనః ।
భుమన్యుం భరతశ్రేష్ఠ యౌవరాజ్యే ఽభ్యషేచయత్ ॥ 23
అనంతరం పూరువంశానికి ఆనందం కలిగించిన భరతుడు తాను పుత్రవంతుడ నయ్యానని గ్రహించి, తన కొడుకైన భుమన్యువును యౌవరాజ్యమునందు అభిషేకించాడు. (23)
తతో దివిరథో నామ భుమన్యో రభవత్ సుతః ।
సుహోత్రశ్చ సుహోతా చ సుహవిః సుయజుస్తథా ॥ 24
పుష్కరిణ్యామృచీకశ్చ భుమన్యో రభవన్ సుతాః ।
తేషాం జ్యేష్ఠః సుహోత్రస్తు రాజ్యమాప మహీక్షితామ్ ॥ 25
భుమన్యువుకు దివిరథుడు, సుహోత్రుడు, సుహోత, సుహవి, సుయాజువు, ఋచీకుడు అనే కొడుకులు పుష్కరిణి యందు జన్మించారు. వారిలో జ్యేష్ఠుడైన సుహోత్రుడు రాజ్యాధికారాన్ని పొందాడు. (24,25)
రాజసూయాశ్యమేధాద్యైః సోఽయజద్ బహుభిః సవైః ।
సుహోత్రః పృథివీమ్ కృత్స్నం ఋభుజే సాగరాంబరామ్ ॥ 26
పూర్ణాం హస్తిగజాశ్వైశ్చ బహురత్నసమాకులామ్ ।
మమజ్జేవ మహీ తస్య భూరిభారావపీడితా ॥ 27
హస్తశ్వరథసంపూర్ణాః మనుష్యకలిలా భృశమ్ ।
సుహోత్రే రాజని తదా ధర్మతః శాసతి ప్రజాః ॥ 28
ఆ సుహోత్రుడు రాజసూయం, అశ్వమేధం మున్నగు అనేక యజ్ఞాలు చేశాడు. సాగరపర్యంతమున్న ఈ భూమండలాన్ని అంతా పరిపాలించాడు. ఏనుగులతో, గుర్రాలతో, అనేక రత్నరాశులతో ఉన్న ఈ భూమిని అనుభవించాడు. ధర్మంగా సుహోత్రుడు పరిపాలిస్తుండగా హస్తి, అశ్వ, రథ బలాలతో, మనుష్యసమూహాల భారంతో ఈ భూమి మునిగినట్లుగా క్రుంగింది. (26-28)
చైత్యయూపాంకితా చాసీద్ భూమిః శతసహస్రశః ।
ప్రవృద్ధజనసస్యా చ సర్వదైవ వ్యరోచత ॥ 29
లక్షలకొలదీ మందిరాలతో, యూపస్తంభాలతో ఈ భూమి నిండింది. ఎల్లపుడూ వృద్ధి చెందే జనులతో పంటలతో ప్రకాశించింది. (29)
ఐక్ష్వాకీ జనయామాస సుహోత్రాత్ పృథివీపతేః ।
అజమీఢం సుమీఢం చ పురుమీఢం చ భారత ॥ 30
రాజైన సుహోత్రుని వల్ల ఐక్ష్వాకి (ఇక్షాకువంశానికి చెందిన స్త్రీ) అజమీఢుడు, సుమీఢుడు,పురుమీఢుడు అను పుత్రులను కన్నది. (30)
అజమీఢో వరస్తేషాం తస్మిన్ వంశః ప్రతిష్ఠితః ।
షట్ పుత్రాన్ సోఽప్యజనయత్ తిసృషు స్త్రీషు భారత ॥ 31
భారతా! వారిలో పెద్దవాడైన అజమీఢుని వల్ల వారి వంశం ప్రతిష్ఠితం అయింది. అతడు ముగ్గురు స్త్రీలయందు ఆరుగురు పుత్రుల్ని కన్నాడు. (31)
ఋక్షం ధూమిన్యథో నీలీ దుష్యంతపరమేష్ఠినౌ ।
కేశిన్యజనయజ్జహ్నుం సుతౌ వ్రజనరూపిణౌ ॥ 32
అతని భార్యలలో ధూమిని ఋక్షుని, నీలి దుష్యంత, పరమేష్ఠులను, కేశిని జహ్నువు, వ్రజనుడు, రూపి అనే కుమారులను కన్నారు. (32)
తథేమే సర్వపంచాలాః దుష్యంతపరమేష్ఠినోః ।
అన్వయాః కుశికా రాజన్ జహ్నోరమితతేజసః ॥ 33
రాజా! వారిలో దుష్యంత, పరమేష్ఠుల సంతానాన్ని పంచాలురని, అమితతేజస్వి అయిన జహ్నువు సంతానాన్ని కుశికులని అంటారు. (33)
వ్రజనరూపిణయోర్జ్యేష్ఠమ్ ఋక్షమాహూర్జనాధిపమ్ ।
ఋక్షాత్ సంవరణో జజ్ఞే రాజన్ వంశకరః సుతః ॥ 34
వ్రజన, రూపులకంటె పెద్దవాడైన ఋక్షుడు రాజు అయ్యాడు. రాజా! ఆ ఋక్షునికి సంవరణుడు అనే వంశకర్త అయిన కొడుకు కలిగాడు. (34)
ఆర్షే సంవరణే రాజన్ ప్రశాసతి వసుంధరామ్ ।
సంక్షయః సుమహానాసీత్ ప్రజానామితి నః శ్రుతమ్ ॥ 35
రాజా! ఋక్షుని కుమారుడైన సంవరణుడు ఈ భూమిని పాలిస్తూండగా పెద్ద ప్రజానాశనం జరిగిందని విన్నాం. (35)
వ్యశీర్యత టహ్తో రాష్ట్రం క్షయైర్నానావిధై స్తదా।
క్షున్మృత్యుభ్యామనావృష్ట్యా వ్యాధిభిశ్చ సమాహతం ॥ 36
ఆకలి, మృత్యువు, అనావృష్టి, వ్యాధులు మున్నగు వాటిచే (రాష్ట్ర) దేశమంతా కష్టాల పాలై క్షీణించింది. (36)
అభ్యఘ్నన్ భారతాంశ్చైవ సపత్నానాం బలాని చ ।
చాలయన్ వసుధాం చేమాం బలేన చతురంగిణా ॥ 37
అభ్యయాత్ తం చ పాంచాల్యః విజిత్య తరసా మహీమ్ ।
అక్షౌహిణీభిర్దశభిః స ఏనం సమరేఽజయత్ ॥ 38
అదే సమయంలో పాంచాలరాజు తన చతురంగబలంతో భూమినంతా జయిస్తూ భరతవంశీయుల సేనలను కూడా సంహరించి, పది అక్షౌహిణుల సైన్యంతో యుద్ధంలో సంవరణుని జయించాడు. (37,38)
తతః సదారః సామాత్యః సపుత్రః ససుహృజ్జనః ।
రాజా సంవరణస్తస్మాత్ పలాయత మహాభయాత్ ॥ 39
అనంతరం సంవరణుడు తన భార్యాపుత్రులతో, అమాత్యులతో, మిత్రులతో కలిసి భయంతో అక్కడ నుండి పారిపోయాడు. (39)
సింధో ర్నదస్య మహతః నికుంజే న్యవసత్ తదా ।
నదీవిషయపర్యంతే పర్వతస్య సమీపతః ॥ 40
సింధు మహానదంతీరంలో చుట్టూ నది ప్రవహిస్తున్న ప్రదేశంలో పర్వతానికి దగ్గర్లో ఒక పొదరింట్లో అటహ్డు నివసించాడు. (40)
తత్రావసన్ బహూన్ కాలాన్ భారతా దుర్గమాశ్రితాః ।
తేషాం నివసతాం తత్ర సహస్రం పరివత్సరాన్ ॥ 41
కొండ ప్రదేశాలను ఆశ్రయించి ఆ భరతవంశీయులు చాలా సంవత్సరాలు నివసించారు. అలా నివసిస్తూండగా వేయి సంవత్సరాలు గడిచాయి. (41)
అథాభ్యగచ్ఛద్ భరతాన్ వసిష్ఠో భగవానృషిః ।
తమాగతం ప్రయత్నేన ప్రత్యుద్గమ్యాభివాద్య చ ॥ 42
అర్ఘ్యమభ్యాహరంస్తస్మై తే సర్వే భారతాస్తదా ।
నివేద్య సర్వమృషయే సత్కారేణ సువర్చసే ॥ 43
తమాసనే చోపవిష్టం రాజా వవ్రే స్వయం తదా ।
పురీహితో భవాన్ నోఽస్తు రాజ్యాయ ప్రయతేమహి ॥ 44
తరువాత వారిదగ్గరికి పూజ్యుడైన వసిష్ఠ మహర్షి వచ్చాడు. అభ్యాగతునిగ వచ్చిన అతనిని ప్రయత్న పూర్వకంగా ఎదురేగి, నమస్కరించి భరత వంశీయులు అతనికి అర్ఘ్యం సమ్ర్పించారు. సత్కార పూర్వకంగా అతనిని ఆసనంపై కుర్చోబెట్టి తమ విషయాన్ని నివేదించుకొని, "మేము రాజ్యం కోసం ప్రయత్నిస్తున్నాం. దానికి మీరే పురోహితులుగా ఉండాలి" అని కోరారు. (42-44)
ఓమిత్యేవం వసిష్ఠీఽపి భారతాన్ ప్రత్యపద్యత ।
అథాభ్యషించత్ సామ్రాజ్యే సర్వక్షత్రస్య పౌరవమ్ ॥ 45
విషాణభూతం సర్వస్య పృథివ్యామితి నః శ్రుతమ్ ।
భరతాధ్యుక్షితం పూర్వం సోఽధ్యతిష్ఠత్ పురోత్తమమ్ ॥ 46
వసిష్ఠుడు కూడ భరత వంశీయులకు తన అంగీకారాన్ని తెలిపాడు. సర్వక్షత్రసమూహానికి సామ్రాజ్యంలో పౌరవుని సంవరణుని అభిషేకించాడు. ఈ భూమండలంలోని రాజులలో సంవరణుడు శ్రేష్ఠుడు అని ప్రసిద్ధి. అతడు తన పూర్వికుడైన భరతుడున్న నగరంలోనే నివసించాడు. (45,46)
పునర్బలభృతశ్చైవ చక్రే సర్వమహీక్షితః ।
తతః స పృథివీం ప్రాప్య పునరీజే మహాబలః ॥ 47
ఆజమీఢో మహాయజ్ఞైః బహుభిర్భూరిదక్షిణైః ।
తతః సంవరణాత్ సౌరీ తపతీ సుషువే కురుమ్ ॥ 48
మరల రాజులందరిని జయించి వారి నుండి కప్పాలను (పన్నులను) తీసికొని తనరాజ్యమందు యజ్ఞములను చేశాడు. గొప్ప గొప్ప యాగాలు చేసి భూరి దక్షిణలిచ్చాడు. ఆ తరువాత సూర్యవంశీయులయిన తపతి సంవరణుని వల్ల 'కురు'ని కన్నది. (47,48)
రాజత్వే తం ప్రజాః సర్వా ధర్నజ్ఞ ఇతి వవ్రిరే ।
తస్య నామ్నాభివిఖ్యాతం పృథివ్యాం కురుజాంగలమ్ ॥ 49
ఆ కురుని ప్రజలందరు ధర్మజ్ఞుడని రాజుగా కోరుకొన్నారు. అతని పేరు మీదుగానే ఈ భూమి మీద కురుజాంగల దేశం ప్రసిద్ధి చెందింది. (49)
కురుక్షేత్రం స తపసా పుణ్యం చక్రే మహాతపాః ।
అశ్వవంతమభిష్యంతం తథా చైత్రరథం మునిమ్ ॥ 50
జనమేజయం చ విఖ్యాతం పుత్రాంశ్చాస్యానుశుశ్రుమ ।
పంచైతాన్ వాహినీ పుత్రాన్ వ్యజాయత మనస్వినీ ॥ 51
మహాతపస్వి అయిన ఆ కురురాజు తన తపస్సు చేత కురుక్షేత్రాన్ని పవిత్రంగా చేశాడు. అతనికి అశ్వవంతుడు, అభిష్యంతుడు, చైత్రరథుడు,ముని, విఖ్యాతుడైన జనమేజయుడు అను ఐదుగురు కొడుకులున్నారు. ఈ ఐదుగురిని మనస్విని ఐన వాహిని కన్నది. (50,51)
అవిక్షతః పరిక్షిత్ శబలాశ్వస్తు వీర్యవాన్ ।
ఆదిరాజో విరాజశ్చ శాల్మలిశ్చ మహాబలః ॥ 52
ఉచ్చైఃశ్రవా భంగకారః జితారిశ్చాష్టమః స్మృతః ।
ఏతేషామన్వవాయే తు ఖ్యాతస్తే కర్మజైర్గుణైః ।
జనమేజయాదయః సప్త తథైవాన్యే మహారథాః ॥ 53
అశ్వవమ్తునికి మరొకపేరు అవిక్షితుడు. అతనికి పరిక్షిత్తు, శబలాశ్వుడు, ఆదిరాజు, విరాజుడు, మహాబలుడు, శాల్మలి, ఉచ్చైఃశ్రవసుడు, భంగకారుడు, జితారి అని ఎనమండుగురు కొడుకులున్నారు. వీరివంశంలో మహారథులైన జనమేజయాదులు ఏడుగురు సద్గుణాల వల్ల సత్కర్మల వల్ల ప్రసిద్ధినొందారు. (52,53)
పరిక్షితోఽభవన్ పుత్రాః సర్వే ధర్మార్థకోవిదాః ।
కక్షసేనోగ్రసేనౌ తు చిత్రసేనశ్చ వీర్యవాన్ ॥ 54
ఇంద్రసేనః సుషేణశ్చ భీమసేనశ్చ నామతః ।
జనమేజయస్య తనయాః భువి ఖ్యాతా మహాబలాః ॥ 55
ధృతరాష్ట్రః ప్రథమజః పాండుర్బాహ్లీక ఏవ చ ।
నిషధశ్చ మహాతేజాః తథా జాంబూనదో బలీ ॥ 56
కుండోదరః పదాతిశ్చ వసాతి శ్చాష్టమః స్మృతః ।
సర్వే ధర్మార్థకుశలాః సర్వభూతహితే రతాః ॥ 57
పరిక్షిత్తుకు కక్షసేనుడు, ఉగ్రసేనుడు, పరాక్రమవంతుడైన చిత్రసేనుడు, ఇంద్రసేనుడు, సుషేణుడు, భీమసేనుడు అను కుమారులున్నారు. వారంతా ధర్మార్థాలయందు పండితులు. జనమేజయుని కుమారులంతా మహాబలవంతులు, భూమిపై విఖ్యాతులుకూడ. వారిలో ధృతరాష్ట్రుడు మొదటివాడు. అతని తర్వాత పాండుడు, బాహ్లీకుడు, మహాతేజస్వి నిషధుడు, బలవమ్తుడైన జాంబూనదుడు, కుండోదరుడు, పదాతి, వసాతి ఉన్నారు. వారిలో వసాతి ఎనిమిదవ వాడు. వీరమ్తా ధర్మార్థకుశలులు. ప్రాణులన్నింటి హితాన్ని కోరుకొనేవారు. (54-57)
ధృతరాష్ట్రోఽథ రాజాసీత్ తస్య పుత్రోఽథ కుండికః ।
హస్తీ విత్కరః క్రాథశ్చ కుండినశ్చాపి పంచమః ॥
హవిశ్రవాస్తథేంద్రాభః భుమన్యుశ్చాపరాజితః ।
ధృతరాష్ట్రసుతానాం తు త్రీనేతాన్ ప్రథితాన్ భువి ॥ 59
ప్రతీపం ధర్మనేత్రం చ సునేత్రం చాపి భారత ।
ప్రతీపః ప్రథితస్తేషాం బభూవాప్రతిమో భువి ॥ 60
అనంతరం వీరిలో ధృతరాష్ట్రుడు రాజయ్యాడు. అతని కొడుకులు కుండికుడు, హస్తి, వితర్కుడు, క్రాథుడు, కుండినుడు, హవిఃశ్రవుడు, ఇంద్రాభుడు, భుమన్యువు, అపరాజితుడు అనువారు. వీరితోపాటు ప్రతీపుడు, ధర్మనేత్రుడు, సునేత్రుడు అనే ముగ్గురు కొడుకులు ప్రసిద్ధులైన వారున్నారు. వారిలో ప్రతీపుడు అసమానుడై ప్రసిద్ధి కెక్కాడు. (58-60)
ప్రతీపస్య త్రయః పుత్రాః జజ్ఞిరే భరతర్షభ ।
దేవాపిః శాంతనుశ్చైవ బాహ్లీకశ్చ మహారథః ॥ 61
దేవాపిశ్చ ప్రవవ్రాజ తేషాం ధర్మహితేస్సయా ।
శాంతనుశ్చ మహీం లేభే బాహ్లీకశ్చ మహారథః ॥ 62
భరతశ్రేష్ఠా! ప్రతీపునికి దేవాపి, శాంతనుడు, మహారథుడయిన బాహ్లీకుడు అను ముగ్గురు కుమారులు జన్మించారు. వారిలో దేవాపి ధర్మం ద్వారా హితాన్ని పొందాలనే కోరికతో వనానికి వెళ్లాడు. శాంతనుడు రాజ్యాధికారానికి వచ్చాడు. బాహ్లీకుడు కూడా రాజయ్యాడు. (61,62)
భరతస్యాన్వయే జాతాః సత్త్వవంతో నరాధిపాః ।
దేవర్షికల్పా నృపతే బహవో రాజసత్తమాః ॥ 63
భరత వంశంలో పుట్టిన ఎంతోమంది రాజులు బలవంతులు, దేవర్షిసమానులు, రాజశ్రేష్ఠులూను. (63)
ఏవం విధాశ్చాప్యరే దేవకల్పా మహారథాః ।
జాతా మనోరన్వవాయే ఐలవంశవివర్ధనాః ॥ 64
ఐలవంశాన్ని వృద్ధిచేసిన దేవకల్పులు, మహారథులూ అయిన రాజులు ఇంకా ఇతరులెందరో మనువంశంలో జన్మించారు. (64)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పూరువంశానుకీర్తనే చతుర్నవతితమోఽధ్యాయః ॥ 94 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పూరువంశానుకీర్తనమను తొంబది నాలుగవ అధ్యాయము. (94)