93. తొంబది మూడవ అధ్యాయము

ఉత్తరయయాతి చరిత్ర.

వసుమానువాచ
పృచ్ఛామి త్వాం వసుమానౌషదశ్విః
యద్యస్తి లోకో దివి మే నరేంద్ర ।
యద్యంతరిక్షే ప్రథితో మహాత్మన్
క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే ॥ 1
వసుమంతుడిలా అన్నాడు - నరేంద్రా! నేను ఉషదశ్వుని కుమారుడనగు వసుమంతుడను. నేను నిన్ను అడుగుతున్నాను. స్వర్గంలో గాని, అంతరిక్షంలోగాని నా గురించి విఖ్యాతమైనలోకం ఉంటే చెప్పవలసింది. మహాత్మా! నీవు పారలౌకిక ధర్మాన్ని బాగా తెలిసినవాడవని భావిస్తున్నాను. (1)
యయాతి రువాచ
యదంతరిక్షం పృథివీ దిశశ్చ
యత్తేజసా తపతే భానుమాంశ్చ ।
లోకాస్తావంతో దివి సంస్థితా వై
తేజనాంతవంతః ప్రతిపాలయంతి ॥ 2
యయాతి ఇలా చెప్పాడు - రాజా! ఆకాశం, పృథివి, దిక్కులు, సూర్యుడు తన తేజస్సుతో ఎంతమేరకు ప్రకాశింపజేస్తూ ఉంటాడో, అన్నిలోకాలు స్వర్గంలో ఉన్నాయి. వాటికి అంతం లేదు. నీకొరకు అవి నిరీక్షిస్తూ ఉంటాయి. (2)
వసుమానువాచ
తాంస్తే దదాని మా ప్రపత ప్రపాతం
యే మే లోకాస్తవ తే వై భవంతు ।
క్రీణీష్వైతాంస్తృణకేనాపి రాజన్
ప్రతిగ్రహస్తే యది ధీమన్ ప్రదుష్టః ॥ 3
వసుమంతుడు అన్నాడు. రాజా! ఆ లోకాలను నీకు ఇస్తాను. నీవు పడవద్దు. నీవు పడవు. నాకు తగిన లోకాలు నీవి కాగలవు. బుద్ధిమంతుడా! ప్రతిగ్రహం దోషమని నీవు భావిస్తే గడ్డిపోచతో ఆ లోకాలను నీవు కొనుక్కో. (3)
యయాతి రువాచ
న మిథ్యాహం విక్రయం వై స్మరామి
వృథాగృహీతం శిశుకాచ్ఛంకమానః ।
కుర్యాం న చైవాకృతపూర్వమన్యైః
విధిత్సమానః కిము తత్ర సాధు ॥ 4
యయాతి ఇలా అన్నాడు - అసత్యమైన విక్రయాన్ని నేనెప్పుడూ స్మరించను కూడా లేదు. కుర్రవాని నుండి ఏదీ వ్యర్థంగా తీసికోలేదు. కాల చక్రం వల్ల నేను శంకిస్తున్నాను. ఇంతకు మునుపు మహాత్ములు చేయని పనిని నేనూ చెయ్యను. ఎందువలననగా నేను సత్కర్మ చేయాలనుకొంటున్నాను. (4)
వసుమానువాచ
తాంస్త్వం లోకాన్ ప్రతిపద్యస్వ రాజన్
మయా దత్తాన్ యది నేష్టః క్రయస్తే ।
అహం న తాన్ వై ప్రతిగంతా నరేంద్ర
సర్వే లోకాస్తవ తే వై భవంతు ॥ 5
అపుడు వసుమంతుడిలా అన్నాడు - రాజా! కొనడం నీకిష్టం లేకపోతే నేనే స్వయంగా ఇస్తున్న ఆ లోకాలను నీవు స్వీకరించు. నరేంద్రా! నేను ఆ లోకాలకు వెళ్లను. ఆ లోకాలన్నీ నీవే అగుగాక. (5)
శిబి రువాచ
పృచ్ఛామి త్వాం శిబి రౌశీనరో ఽహం
మమాపి లోకా యది సంతీహ తాత ।
యద్యంతరిక్షే యది వా దివి శ్రితాః
క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే ॥ 6
శిబి ఇలా అడిగాడు - ఉశీనరుని కుమారుడనైన శిబిని నేను అడుగుతున్నాను. తాతా! నాకు కూడా లోకాలున్నట్లయితే, అంతరిక్షంలో కాని, స్వర్గంలో కాని ఉంటే చెప్పు. అలౌకిక ధర్మానికి నిన్ను క్షేత్రజ్ఞునిగా భావిస్తున్నాను. (6)
యయాతి రువాచ
యత్ త్వం వాచా హృదయేనాపి సాధూన్
పరీప్సమానాన్ నావమంస్థా నరేంద్ర ।
తేనానంతా దివి లోకాః శ్రితాస్తే
విద్యుద్రూపాః స్వనవంతో మహాంతః ॥ 7
యయాతి ఇలా చెప్పాడు - నరేంద్రా! నీవు వాక్కు చేకాని, హృదయంచే కాని, నిన్ను అడగడానికి వచ్చిన సత్పురుషులను అవమానించవద్దు. అందువలన స్వర్గంలో నీకు అనంతలోకాలు ఉన్నాయి. అవి విద్యుత్ సమానమైన తేజస్సు కలవి. మధురధ్వని కలిగినవి, గొప్పవి. (7)
శిబిరువాచ
తాంస్త్వం లోకాన్ ప్రతిపద్యస్వ రాజన్
మయా దత్తాన్ యది నేష్టః క్రయస్తే ।
న చాహం తాన్ ప్రతిపత్స్యే హ దత్వా
యత్ర గత్వా నానుశోచంతి ధీరాః ॥ 8
శిబి ఇలా అన్నాడు - రాజా! నీకు కొనడం ఇష్టం కాకపోతే నేను స్వయంగా సమర్పిస్తున్న ఆ లోకాలను నీవు స్వీకరించు. నేను ఆ లోకాలకు వెళ్లను. ఎక్కడకు చేరి ధీరులు విచారించరో అట్టి స్థానాళు ఆ లోకాలు. (8)
యయాతి రువాచ
యథా త్వమింద్రప్రతిమప్రభావః
తే చాప్యనంతా నరదేవ లోకాః ।
తథాద్య లోకే న రమేఽన్యదత్తే
తస్మాచ్ఛిబే నాభినందామి దేయమ్ ॥ 9
యయాతి ఇలా అన్నాడు - నరదేవా! నీవు ఇంద్రునితో సమానమైన ప్రాభావం కలవాడివైనట్లే నీలోకాలు కూడా (శాశ్వతాలు) అనంతాలైనవి. ఇతరులు ఇచ్చిన లోకంలో ఉండి నేను ఆనందించలేను. శిబీ! అందువల్ల నీవు ఇచ్చేదాన్ని నేను అంగీకరించలేను. (9)
అష్టక ఉవాచ
న చేదేకైకశో రాజన్ లోకాన్ నః ప్రతినందసి ।
సర్వే ప్రదాయ భవతే గంతారో నరకం వయమ్ ॥ 10
అష్టకుడిలా అన్నాడు - రాజా! నీవు వేర్వేరుగా ఒక్కొక్క లోకం చొప్పున తీసుకోడానికి ఇష్టపడకపోతే మేమంతా అన్నిలోకాలను నీకిచ్చి నరకానికి (భూలోకానికి) వెళతాము. (10)
యయాతి రువాచ
యదర్హోఽహం తద్ యతధ్వం సంతః సత్యాభినందినః ।
అహం తన్నాభిజానామి యత్ కృతం న మయా పురా ॥ 11
అపుడు యయాతి ఇలా అన్నాడు - నేను దేనికి అర్హుడినో దాని కోసం ప్రయత్నించండి. సత్పురుషులు సత్యాన్ని అభినందిస్తారు. పూర్వం నేను చేయని పనిని ఇప్పుడు నేను చేయడం యోగ్యం కాదు. (11)
అష్టక ఉవాచ
కస్యైతే ప్రతిదృశ్యంతే రథాః పంచ హిరణ్మయాః ।
యానారుహ్య నరో లోకాన్ అభివాంఛతి శాశ్వతాన్ ॥ 12
అష్టకుడిలా అన్నాడు - ఆకాశంలో ఐదుబంగారు రథాలు కనబడుతున్నాయి. మానవుడు అటువంటి రథాలనెక్కి శాశ్వత పుణ్యలోకాలను చేరాలనుకొంటాడు. ఆ రథాలు ఎవరివి? (12)
యయాతి రువాచ
యుష్మానేతే వహిష్యంతి రథాః పంచ హిరణ్మయాః ।
ఉచ్చైః సంతః ప్రకాశంతే జ్వలంతోఽగ్నిశిఖా ఇవ ॥ 13
యయాతి ఇలా చెప్పాడు - అగ్నిశిఖలవలె ఉన్నతంగా ప్రకాశిస్తున్న ఈ ఐదు బంగారు రథాలు మిమ్మల్ని తీసికొని వెళతాయి. (13)
(వైశంపాయన ఉవాచ)
(ఏతస్నిన్నంతరే చైవ మాధవీ తు తపోధనా ।
మృగచర్మ పరీతాంగీ పరిణామే మృగవ్రతమ్ ॥
మృగైః సహ చరంతీ సా మృగాహారవిచేష్టితా ।
యజ్ఞవాటం మృగగణైః ప్రవిశ్య భృశవిస్మితా ॥
ఆఘ్రాయంతీ ధూమగంధం మృగైరేవ చచార సా ।
(వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! ఇంతలో తపోధనురాలైన మాధవి అక్కడకు వచ్చింది. ఒంటినిండా మృగచర్మాన్ని కప్పుకొంది. ముసలితనంలో మృగాలతో సంచరిస్తూ, మృగాల ఆహారాన్నే తీసుకొంటూ, మృగవ్రతాన్ని ఆచరిస్తూ మృగసమూహంతో యజ్ఞవాటికను ప్రవేశించి మిక్కిలి అచ్చెరువొందింది. అక్కడి ధూమగంధాన్ని వాసన చూచి, మృగాలతోనే సంచరించింది.
యజ్ఞవాటమటంతీ సా పుత్రాం స్తానపరాజితాన్ ॥
పశ్యంతీ యజ్ఞమాహాత్మ్యం ముదం లేభే చ మాధవీ ।
ఆ మాధవి యజ్ఞవాటికలో తిరుగుతూ ఓటమిలేని తన పుత్రులను చూస్తూ, యజ్ఞమహాత్మ్యాన్ని అనుభవించి ఆనందించింది.
అసంస్పృశంతం వసుధాం యయాతిం నాహుషం తదా ॥
దివిష్టం ప్రాప్తమాజ్ఞాయ వవందే పితరం తదా ।
తతో వసుమామనాః పృచ్ఛన్ మాతరం వై తపస్వినీమ్ ॥
భూమిని తాకకుండా అంతరిక్షంలోనే ఉమ్డి సమీపించిన తన తండ్రి, నహుషుని కుమారుడూ అయిన యయాతికి మాధవి నమస్కరించింది. పిమ్మట వసుమంతుడు తపస్విని అగు తన తల్లిని ఇలా అడిగాడు.
వసుమనా ఉవాచ
భవత్యా యత్ కృతమిదం వందనం వరవర్ణిని ।
కోఽయం దేవోఽథవా రాజా యది జానాసి మే వద ॥
హనుమంతుడిలా అన్నాడు - అమ్మా! శ్రేష్ఠురాలా! నీవు నమస్కరించిన ఈతడు ఎవరు? దేవుడా! లేక రాజా! నీకు తెలిస్తే నాకు చెప్పు.
మాధ్యవ్యువాచ
శృణుధ్వం సహితాః పుత్రాః నాహుషోఽయం పితా మమ ।
యయాతిర్మను పుత్రాణాం మాతామహ ఇతి శ్రుతః ॥
పూరుం మే భ్రాతరం రాజ్యే సమావేశ్య దివంగతః ।
కేన వా కారణనేనైవ ఇహ ప్రాప్తో మహాయశాః ॥
అపుడు మాధవి ఇలా అంది - పుత్రులారా! మీరంతా వినండి. నహుషుని కుమారుడైన ఈ యయాతి నా తండ్రి. నా కుమారులకు మాతామహునిగ ప్రసిద్ధుడు. నా సోదరుడైన పూరుని రాజ్యాధికారంలో పెట్టి స్వర్గస్థుడయ్యాడు. గొప్ప యశస్సు గల ఇతడు ఏదో కారణం చేత ఇక్కడకు వచ్చాడు.
వైశంపాయన ఉవాచ
తస్యా స్తద్వాచనం శ్రుత్వా స్థానభ్రష్టేతి చాబ్రవీత్ ।
సా పుత్రస్య వచః శ్రుత్వా సంభ్రమావిష్టచేతనా ॥
మాధవీ పితరం ప్రాహ దౌహిత్రపరివారితమ్ ।
వైశంపాయనుడిలా అన్నాడు - ఆమె చెప్పిన ఆ మాటలను విని వసుమంతుడు 'ఇతడు స్థానభ్రష్టుడయ్యాడు' అని చెప్పాడు. ఆమె కొడుకుమాటను విని తొట్రుపాటుపడి దౌహిత్రులతో కూడి యున్న తండ్రితో ఇలా చెప్పింది.
మాధవ్యువాచ
తపసా నిర్జితాన్ లోకాన్ ప్రతిగృహ్ణీష్వ మామకాన్ ॥
పుత్రాణామివ పౌత్రాణాం ధర్మాదధిగతం ధనమ్ ।
స్వార్థమేవ వదంతీహ ఋషయో వేదపారగాః ।
తస్మాద్ దానేన తపసా అస్మాకం దివమావ్ర ॥
మాధవి ఇలా చెప్పింది - తపస్సు చేత ఆర్జించిన నాపుణ్యలోకాలను నీవు స్వీకరించు. పుత్రుల ధనం వలె పౌత్రులు సంపాదించిన ధనాన్ని కూడా తన ధనంగానే వేదపారగులైన ఋషులు చెపుతున్నారు. అందువల్ల మా తపస్సు చేత, దానం చేత స్వర్గానికి వెళ్లు.
యయాతిరువాచ
యది ధర్మఫలం హ్యేతద్ శోభనం భవితా తథా ।
దిహ్రితా చైవ దౌహిత్రైః తారితోఽహం మహాత్మభిః ॥
యయాతి ఇలా అన్నాడు - ఇది ధర్మఫలమే అయినట్లయితే నాకు శుభాన్ని కలిగిస్తుంది. కూతురు చేత, మహాత్ములైన దౌహిత్రుల చేత నేను తరింపజేయబడ్డాను.
తస్మాత్ పవిత్రం దౌహిత్రమ్ అద్య ప్రభృతి పైతృకే ।
భవిష్యతి న సందేహః పితౄణాం ప్రీతివర్ధనమ్ ॥
అందువల్ల ఈ నాటినుండి పితృకర్మలయందు దౌహిత్రుడు పరమపవిత్రుడైన వాడుగా తెలియబడతాడు. అతడు పితృదేవతలకు ఆనందాన్ని ఇనుమడింపజేస్తాడు. ఇందులో సందేహంలేదు.
త్రీణి శ్రాద్ధే పవిత్రాణి దౌహిత్రః కుతపస్తిలాః ।
త్రీణి చాత్ర ప్రశంసంతి శౌచమక్రోధమత్వరామ్ ॥
భోక్తారః పరివేష్టారః శ్రావితారః పవిత్రకాః ।
శ్రాద్ధకర్మలో దౌహిత్రుడు, కుతపకాలం, తిలలు ఈ మూడు పవిత్రమైనవి. శౌచం, కోపంలేకపోవడం, తొందరపడకపోవడం అనే మరో మూడింటిని కూడా ఈ విషయంలో చెప్తారు. భోక్తలు, వడ్డించేవారు, మంత్రాన్ని వినిపించేవారు ఈ ముగ్గురూ కూడ పవిత్రులై ఉండాలి.
దివసస్యాష్టమే భాగే మందీభవతి భాస్కరే ॥
స కాలః కుతపో నామ పితౄణాం దత్తమక్షయమ్ ॥
పగటి సమయంలో ఎనిమిదవ భాగం కుతపకాలం. అపుడు సూర్యుని తీక్ష్ణత కొంత మందగిస్తుంది. ఆ సమయంలో పితృదేవతలకు ఈయబడినది శాశ్వత ఫలాన్నిస్తుంది.
తిలాః పిశాచాద్ రక్షంతి దర్భా రక్షంతి రాక్షసాత్ ॥
రక్షంతి శ్రోత్రియాః పంక్తిం యతిభిర్భుక్త మక్షయమ్ ।
నువ్వులు పిశాచాల నుండి రక్షిస్తాయి. దర్భలు రాక్షసుల నుండి రక్షిస్తాయి. శ్రోత్రియులు పంక్తిని రక్షిస్తారు. యతులు భుజించినది అక్షయఫలాన్నిస్తుంది.
ఉబ్ధ్వా పాథ్రం తు విద్వాంసం శ్రోత్రియం సువ్రతం శుచిమ్ ॥
స కాలః కాలతో దత్తం నాన్యథా కాల ఇష్యతే ।
విద్వాంసుడు శ్రోత్రియుడు, పవిత్రుడు అయిన బ్రాహ్మణుడు శ్రాద్ధానికి యోగ్యుడు. అతడు లభించిన సమయమే శ్రాద్ధానికి తగిన కాలం. అతనికప్పుడు చేసిన దానమే సకాలంలో చేసిన దానమవుతుంది. మరొకటేదీ సకాలం కాదు.
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా యయాతిస్తు పునః ప్రోవాచ బుద్ధిమాన్ ।
సర్వే హ్యవభృథస్నాతాః త్వరధ్వం కార్యగౌరవాత్ ॥)
వైశంపాయునుడిలా అన్నాడు - ఇలా చెప్పి, బుద్ధిమంతుడైన యయాతి మళ్లీ ఇలా అన్నాడు - 'అందరూ అవభృథ స్నానం చేసి ఈ గొప్పకార్యం కోసం తొందరగా సిద్ధంకండి'.
అష్టక ఉవాచ
ఆతిష్ఠస్వ రథాన్ రాజన్ విక్రమస్వ విహాయసమ్ ।
వయమప్యనుయాస్యామః యదా కాలో భవిష్యతి ॥ 14
అష్టకుడిలా అన్నాడు - రాజా! ఈ రథాలను అధిరోహించండి. ఆకాశంలో పైకి ప్రయాణించండి. తగిన సమయం కాగానే మేము కూడా మిమ్మల్ని అనుసరిస్తాం. (14)
యయాతి రువాచ
సర్వైరిదానీం గంతవ్యం సహ స్వర్గజితో వయమ్ ।
ఏష నో విరజాః పంథాః దృశ్యతే దేవసద్మనః ॥ 15
యయాతి ఇలా అన్నాడు - స్వర్గాన్ని జయించిన మనమంతా ఇపుడే వెళ్ళాలి. దేవలోకానికి రజోగుణరహితమైన (విరజా) మనమార్గం ఇదిగో కనబడుతోంది. (15)
వైశంపాయన ఉవాచ
తేఽధిరుహ్య రథాన్ సర్వే ప్రయాతా నృపసత్తమాః ।
ఆక్రమంతో దివం భాభిః ధర్మేణావృత్య రోదసీ ॥ 16
వైశంపాయనుడిలా చెప్పాడు - ఆరాజశ్రేష్ఠులంతారథాలనెక్కి, తమ ధర్మం చేత స్వర్గాన్ని చేరడానికి బయలుదేరారు. ఆసమయంలో వారి తేజస్సులు భూమ్యాకాశాలను వ్యాపించాయి. (16)
(అష్టకశ్చ శిబిశ్చైవ కాశిరాజః ప్రతర్దనః ।
ఐక్ష్వాకవో వసుమానాః చత్వారో భూమిపాశ్చ హ ॥
సర్వే హ్యవభృథస్నాతాః స్వర్గతాః సాధవః సహ ।)
(అష్టకుడు, శిబి, కాశిరాజైన ప్రతర్దనుడు, ఇక్వాకు వంశీయుడు వసుమంతుడు ఈ రాజులు నలుగురు అవభృథస్నానం చేసినవారు. సత్పురుషులు. వీరంతా ఒకేసారి స్వర్గంలో ప్రవేశించారు.)
అష్టక ఉవాచ
అహం మన్యే పూర్వమేకోఽస్మి గంతా
సఖా చేంద్రః సర్వథా మే మహాత్మా ।
సస్మాదేవం శిబిరౌశీనరో ఽయమ్
ఏకో ఽత్యగాత్ సర్వవేగేన వాహాన్ ॥ 17
అష్టకుడిలా అన్నాడు - మహాత్ముడైన ఇంద్రుడు నాకు అన్నివిధాలా మిత్రుడు. అందువల్ల ముందు నేనొక్కడనే వెళ్లాలనుకొంటున్నాను. కాని ఉశీనరపుత్రుడైన ఈ శిబి ఒక్కడే మనరథాల్ని దాటి వేగంగా ఎలా వెళ్లాడు? (17)
యయాతిరువాచ
అదదద్ దేవయానాయ యావద్ విత్తమవిందత ।
ఉశీనరస్య పుత్రోఽయం తస్మా చ్ఛ్రేష్ఠో హి వః శిబిః ॥ 18
యయాతి చెప్పాడు - దేవలోకం చేరడం కోసం ఈ ఉశీనరపుత్రుడైన శిబి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అందువల్ల మీలో అతడు శ్రేష్ఠుడు. (18)
దానం తపః సత్యమథాపి ధర్మః
హ్రీః శ్రీః క్షమా సౌమ్యమథో విధిత్సా ।
రాజన్నేతాన్యప్రమేయాని రాజ్ఞః
శిబేః స్థితాన్యప్రతిమస్య బుద్ధ్యా ॥ 19
దానం, తపస్సు, సత్యం, ధర్మం, సిగ్గు, సంపద, ఓర్పు, సౌమ్యం, వ్రతపాలన పట్ల కోరిక అనే ఈ అప్రమేయ గుణాలు శిబిలో ఉన్నాయి. బుద్ధిలో అతనితో పోల్చదగ్గవాడు లేడు. (19)
ఏవం వృత్తో హ్రీనిషేవశ్చ యస్మాత్
తస్మాచ్ఛిబిరత్యగాద్ వై రథేన ।
ఇన్ని ఉన్నప్పటికి (అవన్ని తక్కువన్నట్లుగా) బిడియంతో ఉంటాడు. అందువల్లే అతడు రథంతో ముందుగా వెళ్లాడు.
వైశంపాయన ఉవాచ
అథాష్టకః పునరేవాన్వపృచ్ఛత్
మాతామహం కౌతుకేనేంద్రకల్పమ్ ॥ 20
వైశంపాయనుడు ఇలా చెప్పాడు - తర్వాత అష్టకుడు కుతూహలంతో ఇంద్రసమానుడైన మతామహుని మళ్లీ ఇలా అడిగాడు. (20)
పృచ్ఛామి త్వాం నృపతే బ్రూహి సత్యం
కుతశ్చ కశ్చాసి సుతశ్చ కస్య ।
కృత్వం త్వయా యద్ధి న తస్య కర్తా
లోకే త్వదన్యః క్షత్రియో బ్రాహ్మణో వా ॥ 21
రాజా! నిన్నొక్కమాట అడుగుతున్నాను. నిజం చెప్పు. నీవెక్కడ నుండి వచ్చావు? ఎవరివి? ఎవనికొడుకువి? నీవు చేసిన (పుణ్యాన్ని) దాన్ని ఈ లోకంలో బ్రాహ్మణుడుకాని క్షత్రియుడు కాని మరొకడెవడూ చేయలేడు. (21)
యయాతి రువాచ
యయాతిరస్మి నహుషస్య పుత్రః
పూరోః పితా సార్వభౌమస్త్విహాసమ్ ।
గుహ్యం చార్థం మామకేభ్యో బ్రవీమి
మాతామహొఽహం భవతాం ప్రకాశమ్ ॥ 22
యాయాతి ఇలా చెప్పాడు - నేను నహుషుని కుమారుడనైన యయాతిని. పూరుని తండ్రిని, ఈ భూమిపై సార్వభౌమునిగా ఉన్నాను. నేను మీకు మాతామహుడిని. అందువల్ల మావాళ్ళైన మీకు రహస్యాన్ని పైకి చెపుతున్నాను. (22)
సర్వామిమాం పృథివీం నిర్జిగాయ
ప్రాదామహం ఛాదనం బ్రాహ్మణేభ్యః ।
మేధ్యా నశ్వా నేకశతాన్ సురూపాన్
తదా దేవాః పుణ్యభాజో భవంతి ॥ 23
నేను ఈ భూమండలాన్నంతా జయించి బ్రాహ్మణులకు నివాసానికి ఇచ్చాను. అందమైన పవిత్రమైన నూరు అశ్వాలను దానంచేసినవారు పుణ్యాన్ని పొందినవారై దేవతలౌతారు. (23)
అదామహం పృథివీం బ్రాహ్మణేభ్యః
పూర్ణామిమా మఖిలాం వాహనేన ।
గోభిః సువర్ణేన ధనైశ్చ ముఖైః
తదాదదం గాః శతమర్బుదాని ॥ 24
నేను వాహనాలు, గోవులు, బంగారం, ముఖ్యసంపదలు నిండి ఉన్న ఈ సమస్త భూమండలాన్ని బ్రాహ్మణులకు దానం చేశాను. పదిలక్షల గోవులను దానం చేశాను. (24)
సత్యేన వై ద్యౌశ్చ వసుంధరా చ
తథైవాగ్నిర్జ్వలతే మానుషేషు ।
న మే వృథా వ్యాహృతమేవ వాక్యం
సత్యం హి సంతః ప్రతిపూజయంతి ॥ 25
సత్యంచేతనే భూమి, ఆకాశం ప్రకాశిస్తున్నాయి. సత్యం చేతనే మనుష్యలోకంలో అగ్ని ప్రజ్వలిస్తూంది. నేనెప్పుడూ వ్యర్థమైన వాక్యాన్ని ఒక్కటి కూడా పలుకలేదు. సత్పురుషులు సత్యాన్నే పూజిస్తారు కదా! (25)
యదష్టక ప్రబ్రవీమీహ సత్యం
ప్రతర్దనం చౌషదశ్విం తథైవ ।
సర్వే చ లోకా మునయశ్చ దేవాః
సత్యేన పూజ్యా ఇతి మే మనోగతమ్ ॥ 26
అష్టకా! నీకు, ప్రతర్దనుడికి, ఉషదశ్వుని కొడుకు వసుమంతునికి కూడ నేను నిజమే చెపుతున్నాను. ఈ సమస్త లోకాలు, మునులు, దేవతలు, సత్యంచేతనే పూజింప దగినవారు. ఇది నా అభిప్రాయం. (26)
యో నః స్వర్గజితః సర్వాన్ యథావృత్తం నివేదయత్ ।
అనసూయు ర్ద్విజాగ్య్రేభ్యః స లభేన్నః సలోకతామ్ ॥ 27
అసూయలేకుండా స్వర్గాన్ని జయించిన ఈ మన వృత్తాంతాన్ని యథాతథంగా బ్రాహ్మణశ్రేష్ఠుల నుండి తెలుసుకొన్నవాడు మనలాగే పుణ్యలోకాలను పొందుతాడు. (27)
వైశంపాయన ఉవాచ
ఏవం రాజా స మహాత్మా హ్యతీవ
స్వైర్దౌహిత్రైస్తారితోఽమిత్రసాహః ।
త్యక్త్వా మహీం పరమోదారకర్మా
స్వర్గం గతః కర్మభిర్వ్యాప్య పృథ్వీమ్ ॥ 28
వైశంపాయనుడిలా అన్నాడు - ఈ విధంగా మహాత్ముడైన యయాతి తన దౌహిత్రుల వలన తరించాడు. అతడు శత్రువులకు జయింప శక్యం కానివాడు. ఈ భూమిపై తన మంచి కర్మల ద్వారా ప్రసిద్ధి చెందాడు. గొప్ప ఉదార కర్మలు చేసిన అతడు భూమిని విడిచి స్వర్గాన్ని పొందాడు. (28)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఉత్తరయాయాతే త్రినవతితమోఽధ్యాయః ॥ 93 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఉత్తర యయాతి చరిత్రమను తొంబది మూడవ అధ్యాయము. (93)
(దాక్షిణాత్య అధికపాఠము 20 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 48 1/2 శ్లోకాలు)