96. తొంబది యారవ అధ్యాయము

మహాభిష, వసుశాప వృత్తాంతము.

వైశంపాయన ఉవాచ
ఇక్ష్వాకువంశప్రభవః రాజాఽసీత్ పృథివీపతిః ।
మహాభిష ఇతి ఖ్యాతః సత్యవాక్ సత్యవిక్రమః ॥ 1
సోఽశ్వమేధసహస్రేణ రాజసూయశతేన చ।
తోషయామాస దేవేశం స్వర్గం లేభే తతః ప్రభుః ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు - ఇక్ష్వాకుల వంశంలో పుట్టి మహాభిషుడని ప్రసిద్ధికెక్కిన రాజు ఒకడు ఉండేవాడు. అతడు సత్యవాది, సత్యపరాక్రముడు కూడా. ఆ రాజు వేయి అశ్వమేధయాగాలను, వంద రాజసూయ యాగాలనూ చేసి దేవేంద్రుని తృప్తిపరచాడు. ఆ పై స్వర్గాన్ని పొందాడు. (1,2)
తతః కదాచిన్ బ్రహ్మాణమ్ ఉపాసాంచక్రిరే సురాః ।
తత్ర రాజర్షయో హ్యాసన్ స చ రాజా మహాభిషః ॥ 3
తరువాత ఒకానొక సమయంలో దేవతలందరూ బ్రహ్మను సేవింపదలచి ఆయనను సమీపించారు. అక్కడ ఎందరో రాజర్షులూ, ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభిషుడు కూడా ఉన్నారు. (3)
అథ గంగా సరిచ్ఛ్రేష్ఠా సముపాయాత్ పితామహమ్ ।
తస్యా వాసః సముద్ధూతం మారుతేన శశిప్రభమ్ ॥ 4
అదే సమయంలో నదీమతల్లి అయిన గంగ బ్రహ్మ సన్నిధికి వచ్చింది. గాలి విసురు వల్ల చంద్రకాంతి గల ఆ గంగాదేవి కట్టుబట్ట పైకి లేచింది. (4)
తతో ఽభవన్ సురగణః సహసావాఙ్ ముఖాస్తదా ।
మహాభిషస్తు రాజర్షిః అశంకో దృష్టవాన్ నదీమ్ ॥ 5
అది గమనించి దేవతలందరూ వెంటనే తలలు వంచుకొన్నారు. రాజర్షి అయిన మహాభిషుడు కొంకు లేకుండా ఆ నదివైపు చూస్తూనే ఉన్నాడు. (5)
సోఽపధ్యాతో భగవతా బ్రహ్మణా తు మహాభిషః ।
ఉక్తశ్చ జాతో మర్త్యేషు పునర్లోకానవాప్స్యసి ॥ 6
యయాఽఽహృతమనాశ్చాపి గంగయా త్వం హి దుర్మతే ।
సా తే వై మానుషే లోకే విప్రియాణ్యాచరిష్యతి ॥ 7
అప్పుడు బ్రహ్మ మహాభిషుని అన్యథా భావించి ఇలా శపించాడు. "దుర్బుద్ధీ! నీవు మానవలోకంలో జన్మించి మరల పుణ్యలోకాలను పొందగలవు. ఇక్కడ నీ మనస్సును కొల్లగొట్టిన గంగానదియే మానవ లోకంలో నీకు ప్రతికూలంగా ప్రవరిస్తుంది. (6,7)
యదా తే భవితా మన్యుః తదా శాపాద్ విమోక్ష్యసే ।
నీకు గంగపై కోపం కలిగినప్పుడే నీకు శాపవిమోచనం కలుగుతుంది." (7 1/2)
వైశంపాయన ఉవాచ
స చింతయిత్వా నృపతిః నృపానన్యాంస్తపోధనాన్ ॥ 8
ప్రతీపం రోచయామాస పితరం భూరితేజసమ్ ।
మహాభిషం తు తం దృష్ట్వా నదీ ధైర్యాచ్చ్యుతం నృపమ్ ॥ 9
తమేవ మనసా ధ్యాయన్త్యుపావర్తత్ సరిద్వరా ।
సా తు విధ్వస్తవపుషః కశ్మలాభిహతాన్ నృప ॥ 10
దదర్శ పథి గచ్ఛంతీ వసూన్ దేవాన్ దివౌకసః ।
తథారూపాంశ్చ తాన్ దృష్ట్వా పప్రచ్ఛ సరితాం వరా ॥ 11
వైశంపాయనుడిలా అన్నాడు. అప్పుడు మహాభిషమహారాజు బాగా ఆలోచించి తపస్సంపన్నులయిన రాజులను పరిశీలించి అధికతేజస్వి అయిన ప్రతీపమహారాజును తనకు తగిన తండ్రిగా ఎన్నుకొన్నాడు. నదీలలామ అయిన గంగ ధైర్యాన్ని కోల్పోయిన మహాభిషుని గమనించి మనస్సులో ఆయన్నే తలపోస్తూ నిష్క్రమించింది. మార్గమధ్యంలో ఆ గంగ వసువులను చూచింది. వారు స్వర్గం నుండి క్రిందకు దిగుతున్నారు. దిగులుపడి ఉన్నారు. అటువంటి వారిని చూచి ఆ గంగ ఇలా అడిగింది. (8-11)
కిమిదం నష్టరూపాః స్థ కచ్చిత్ క్షేమం దివౌకసామ్ ।
తామూచుర్వసవో దేవాః శప్తాః స్మో వై మహానది ॥ 12
అల్పేఽపరాధే సంరంబాద్ వసిష్ఠేన మహాత్మనా ।
విముఢా హి వయం సర్వే ప్రచ్ఛన్నమృషిసత్తమమ్ ॥ 13
సంధ్యాం వసిష్ఠమాసీనం తమత్యభిసృతాః పురా ।
తేన కోపాద్ వయం శప్తాః యోనౌ సంభవతేతి హ ॥ 14
"ఏమిటి? మీ దివ్యరూపాన్ని ఎలా కోల్ఫోయారు? దేవతలంతా క్షేమమే గదా!" అంది. ఆ వసువులు ఆమెతో ఇలా అన్నారు - "మహానదీ! వసిష్ఠమహాముని మేము చేసిన చిన్న తప్పుతో కోపించి మమ్ముల నందరిని శపించాడు. ఒకనాడు వసిష్టుడు చెట్టుచాటున కూర్చుని సంధ్యోపాసన చేస్తుండగా మేమంతా ఆయనను అతిక్రమించి వెళ్ళాము. దానితో కోపించిన ఆయన మానవులుగా పుట్టండని మమ్ము శపించాడు. (12-14)
న నివర్తయితుం శక్యం యదుక్తం బ్రహ్మవాదినా ।
త్వమస్మాన్ మానుషీ భూత్వా సృజ పుత్రాన్ వసూన్ భువి ॥ 15
ఆ బ్రహ్మవేత్త మాటను మరల్చటానికి వీలులేదు. కాబట్టి నీవు మానవస్త్రీగా జన్మించి వసువుల మయిన మాకు జన్మ నివ్వవలసినది. (15)
న మానుషీణాం జఠరం ప్రవిశేమ వయం శుభే ।
ఇత్యుక్తా తైశ్చ వసుభిః తథేత్యుక్త్వాబ్రవీదిదమ్ ॥ 16
కళ్యాణీ! "మేము మానవస్త్రీల కడుపులో ప్రవేశించలేము" - వసువులు అలా అంటే గంగానది 'అలాగే' అని అంగీకరించింది. (16)
గంగోవాచ
మర్త్యేషు పురుష శ్రేష్ఠః కో వః కర్తా భవిష్యతి ।
గంగ ఇలా అడిగింది - మానవులలో మీకు తండ్రి కాదగినంత గొప్పవాడెవడు? (16 1/2)
వసవ ఊచుః
ప్రతీపస్య సుతో రాజా శాంతనుర్లోకవిశ్రుతః ।
భవితా మానుషే లోకే స నః కర్తా భవిష్యతి ॥ 17
వసువులు ఇలా అన్నారు - ప్రతీపమహారాజ కుమారుడు శాంతనుడు లోకప్రసిద్ధుడు అవుతాడు. అతడు మానవలోకంలో మాకు తండ్రి కాదగినవాడు. (17)
గంగోవాచ
మమాప్యేవం మతం దేవాః యథా మాం వదతానఘాః ।
ప్రియం తస్య కరిష్యామి యుష్మాకం చైతదీప్సితమ్ ॥ 18
గంగ ఇలా అన్నది - అనఘులారా! దేవతలారా! మీరు చెప్పిన రీతిగానే నేనూ అభిప్రాయపడుతున్నాను. ఆ మహారాజు మక్కువను తీర్చి మీ కోరికను కూడా నెరవేరుస్తాను. (18)
వసవ ఊచుః
జాతాన్ కుమారాన్ స్వానప్సు ప్రక్షేప్తుం వై త్వమర్హసి ।
యథా న చిరకాలం నః నిష్కృతిః స్యాత్ త్రిలోకగే ॥ 19
వసువు లిలా అన్నారు - త్రిలోకగామినీ! గంగా! మేము నీ కడుపున పడి జన్మించగానే మమ్ములను నీటిలో పడవేయాలి. దానితో మేము స్వల్పవ్యవధిలోనే నిష్కృతి పొందగలుగుతాము. (19)
గంగోవాచ
ఏవమేతత్ కరిష్యామి పుత్రస్తస్య విధీయతామ్
నాస్య మోఘః సంగమః స్యాత్ పుత్రహేతోర్మయా సహ ॥ 20
గంగా ఇలా అన్నది - అలాగే చేస్తాను. కానీ ఆ రాజు సంతానోత్పత్తికై నాతో పెనవేసికొన్న బంధం వ్యర్థం కారాదు. కాబట్టి ఆయనకు ఒక్క కొడుకైనా మిగలాలి. (20)
వసవ ఊచుః
తురీయార్ధం ప్రదాస్యామః వీర్యస్యైకైకశో వయమ్ ।
తేన వీర్యేణ పుత్రస్తే భవితా తస్య చేప్సితః ॥ 21
వసువులిలా అన్నారు - మేమంతా మామా తేజస్సులలోని ఎనిమిదవ భాగాన్ని ధారవోస్తాము. ఆ తేజస్సుతో నీ కొక కొడుకు కలుగుతాడు. అతడు ఆ రాజు కోరిక నెరవేర్చగలడు. (21)
న సంపత్స్యతి మర్తేషు పునస్తస్య తు సంతతిః ।
తస్మాదపుత్రః పుత్రస్తే భవిష్యతి స వీర్యవాన్ ॥ 22
అయితే మానవలోకంలో అతనికి మాత్రం సంతానముండదు. కాబట్టి పరాక్రమవంతుడైన ఆ నీ కుమారుడు మాత్రం సంతానహీనుడవుతాడు. (22)
ఏవం తే సమయం కృత్వా గంగయా వసవః సహ ।
జగ్ముః సంహృష్టమనసః యథాసంకల్పమంజసా ॥ 23
ఈ విధంగా గంగానదితో ఒప్పుదల చేసికొని వసువులంతా ఆనందించి వెంటనే వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. (23)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి మహాభిషోపాఖ్యానే షణ్ణవతితమోఽధ్యాయః ॥ 96 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున మహాభిషోపాఖ్యానమను తొంబదియారవ అధ్యాయము. (96)