97. తొంబది యేడవ అధ్యాయము
శాంతానూపాఖ్యానము.
వైశంపాయన ఉవాచ
తతః ప్రతీపో రాజాఽఽసీత్ సర్వభూతహితః సదా ।
విషసాద సమా బహ్వీః గంగాద్వారగతో జపన్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - ప్రతీపుడనే మహారాజు ఉండేవాడు. ఆయన ఎల్లప్పుడూ సర్వప్రాణుల హితంపై ఆసక్తి గలిగి ఉండేవాడు. ఆయన గంగాద్వారంలో నివసిస్తూ ఎన్నో సంవత్సరాలు జపిస్తూ కూర్చున్నాడు. (1)
తస్య రూపగుణోపేతా గంగా స్త్రీరూపధారిణీ ।
ఉత్తీర్య సలిలాత్ తస్మాత్ లోభనీయతమాకృతిః ॥ 2
అధీయానస్య రాజర్షేః దివ్యరూపా మనస్వినీ ।
దక్షిణం శాలసంకాశమ్ ఊరుం భేజే శుభాననా ॥ 3
అప్పుడు మనస్విని అయిన గంగానది అందమూ, సద్గుణాలూ గల స్త్రీ రూపాన్ని ధరించి ఆ నీటి నుండి వెలువడింది. ఆమె రూపం దివ్యమై, ఆస పడదగినదై ఉంది. ఆ శుభాసన అధ్యయనం చేస్తున్న ఆ రాజర్షిని సమీపించి మద్దిమానువలె కనిపిస్తున్న ఆయన కుడితొడపై కూర్చున్నది. (2,3)
ప్రతీపస్తు మహీపాలః తామువాచ యశస్వినీమ్ ।
కరోమి కిం తే కళ్యాణి ప్రియం యత్తేఽభికాంక్షితమ్ ॥ 4
ప్రతీపమహారాజు "కళ్యాణీ! నీకేమి చేయగలను? నీ కోరిక ఏమి?" అని యశస్విని అయిన ఆ కాంతతో అన్నాడు. (4)
స్త్రీ ఉవాచ
త్వామహం కామయే రాజన్ భజమానాం భజస్వ మామ్ ।
త్యాగః కామవతీనాం హి స్త్రీణాం సద్భిర్విగర్హితః ॥ 5
ఆమె ఇలా అన్నది - రాజా! నిన్ను నేను కోరుతున్నాను. నీపై నాకనురాగమున్నది. నన్ను పరిగ్రహించు. కాముక అయిన స్త్రీని తిరస్కరించడాన్ని సత్పురుషులు గర్హిస్తారు. (5)
ప్రతీప ఉవాచ
నాహం పరస్త్రియం కామాద్ గచ్ఛేయం వరవర్ణిని ।
న చాసవర్ణాం కళ్యాణి ధర్మ్యమేతద్ధి మే వ్రతమ్ ॥ 6
ప్రతీపుడిలా అన్నాడు - సుందరీ! నేను పరకాంతను కామించలేను. సువర్ణురాలు కాని కాంతను కూడా నేను కామించలేను. ఇది ధర్మబద్ధమయిన నా వ్రతం. (6)
స్త్రీ ఉవాచ
నా శ్రేయస్యస్మి నాగమ్యా న వక్తవ్యా చ కర్హిచిత్ ।
భజంతీం భజ మాం రాజన్ దివ్యాం కన్యాం వరస్త్రియమ్ ॥ 7
ఆమె ఇలా అన్నది - నేను అమంగళహేతువును కాను. పొందదగని దానను కాను. ఏరీతిగానూ మాటపడిన దాననుకూడా కాను. నీపై అనురక్తిగల దివ్యసుందర కాంతను నేను. నన్ను పరిగ్రహించు. (7)
ప్రతీప ఉవాచ
త్వయా నివృత్తమేతత్తు యన్మాం చోదయసి ప్రియమ్ ।
అన్యథాప్రతిపన్నం మాం నాశయేద్ ధర్మవిప్లవః ॥ 8
ప్రతీపుడిలా అన్నాడు - ఏ కోరికతో నీవు నన్న్ ఒత్తిడి చేస్తున్నావో ఆ కోరికను నీవే నిరాకరింపజేసికొన్నావు. నీ కోరికను నేను అంగీకరిస్తే ధర్మహాని నన్ను నాశనం చేస్తుంది. (8)
ప్రాప్య దక్షిణమూరుం మే త్వమాశ్లిష్టా వరాంగనే ।
అపత్యానాం స్నుషాణాం చ భీరు విద్ధ్యేతదాసనమ్ ॥ 9
సుందరీ! నీవు నా కుడితొడపై కూర్చొని నన్ను కౌగిలించుకున్నావు. పిరికిదానా! కుడి తొడపై కూర్చునే అవకాశం సంతానానికి, కోడలుకు మాత్రమే ఉంటుందని గ్రహించు. (9)
సవ్యోరుః కామినీభోగ్యః త్వయా స చ వివర్జితః ।
తస్మాదహం నా చరిష్యే త్వయి కామం వరాంగనే ॥ 10
సుందరీ! ఎడమతొడ కామినులు ఆరోహించదగినది. నీవు దానిని ఆశ్రయించలేదు. కాబట్టి నీతో నేను కాముకుడనై ప్రవర్తించలేను. (10)
స్నుషా మే భవ సుశ్రోణి పుత్రార్థం త్వాం వృణోమ్యహమ్ ।
స్నుషా పక్షం హి వామోరు త్వమాగమ్య సమాశ్రితా ॥ 11
సుందరీ! నీవు నాకు కోడలివి కమ్ము. నాకుమారుని కొరకు నిన్ను వరిస్తున్నాను. నీవు నా కుడితొడనే ఆశ్రయించావు కాబట్టి కోడలు కాదగినదానవు. (11)
స్త్రీ ఉవాచ
ఏవమప్యస్తు ధర్మజ్ఞ సంయుజ్యేయం సుతేన తే ।
త్వద్భక్త్వా తు భజిష్యామి ప్రఖ్యాతం భారతం కులమ్ ॥ 12
ఆ కాంత ఇలా అన్నది - ధర్మాత్మా! అలాగే కానీ, నేను నీ కుమారుని కలుస్తాను. నీ మీద గల భక్తిభావం వలన నేను ప్రసిద్ధమయిన భరతవంశాన్ని సేవిస్తాను. (12)
పృథివ్యాం పార్థివా యే చ తేషాం యూయం పరాయణమ్ ।
గుణా న హి మయా శక్యాః వక్తుం వర్షశతైరపి ॥ 13
భూలోకమందలి రాజులందరకు తమరే ఆశ్రయింపదగినవారు. వందల సంవత్సరాలలోనైనా మీ గుణాలను నేను వర్ణించలేను. (13)
కులస్య యే వః ప్రథితాః తత్సాధుత్వమథోత్తమమ్ ।
సమయేనేహ ధర్మజ్ఞ ఆచరేయం చ యద్ విభో ॥ 14
తత్సర్వమేవ పుత్రస్తే న మీమాంసేత కర్హిచిత్ ।
ఏవం వసంతీ పుత్రే తే వర్ధయిష్యామ్యహం రతిమ్ ॥ 15
పుత్రైః పుణ్యైః ప్రియైశ్చైవ స్వర్గం ప్రాప్స్యతి తే సుతః ।
తమ వంశంలోని రాజులందరూ మంచితనంలో పేరుకెక్కిన వారు. ధర్మాత్మా! నేను ఒక నియమానికి లోబడి తమకు కోడలిని కాగలను. ప్రభూ! నా ప్రవర్తనను తమ కుమారుడు అంగీకరించాలి. ఎప్పుడూ కాదనకూడదు. ఈ నియమానికి అంగీకరిస్తే తమ కుమారునిపై అనురాగాన్ని పెంచుకొంటాను. తమ కుమారుడు కూడా పుణ్యాత్ములు, ప్రియులు అయిన పుత్రుల ద్వారా స్వర్గలోకాన్ని పొందగలుగుతాడు. (14-15 1/2)
వైశంపాయన ఉవాచ
తథేత్యుక్తా తు సా రాజన్ తత్రైవాంతరధీయత ॥ 16
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! దానికి రాజు అంగీకరించాడు. ఆమె అక్కడే అదృశ్యమయింది. (16)
పుత్రజన్మ ప్రతీక్షన్ వై స రాజా తదధారయత్ ।
ఏతస్మిన్నేవ కాలే తు ప్రతీపః క్షత్రియర్షభః ॥ 17
తపస్తేపే సుతస్యార్థే సభార్యః కురునందన ।
తరువాత పుత్రుని పుట్టుకకై నిరీక్షిస్తున్న ప్రతీపమహారాజుకు ఆ విషయం గుర్తుకు వచ్చింది. కురునందనా! ఆ రోజుల్లో క్షత్రియశ్రేష్ఠుడైన ప్రతీపుడు తన భార్యను వెంటబెట్టుకొని, పుత్రులకోసం తపస్సు చేయనారంభించాడు. (17 1/2)
(ప్రతీపస్య తు భార్యాయాం గర్భః శ్రీమానవర్ధత ।
శ్రియా పరమయా యుక్తః శరచ్ఛుక్లే యథా శశీ ॥
తతస్తు దశమే మాసి ప్రాజాయత రవిప్రభమ్ ।
కుమారం దేవగర్భాభం ప్రతీపమహిషీ తదా ॥)
తయోః సమభవత్ పుత్రః వృద్ధయోః స మహాభిషః ॥ 18
ప్రతీపుని భార్య గర్భవతి అయినది. శరత్కాల శుక్లపక్ష చంద్రునివలె ఆ గర్భం వృద్ధిచెందింది. ఆపై పదవ నెలలో ప్రతీపుని పట్టమహిషి దేవతలతో సమానుడైన కుమారుని ప్రసవించింది. అతడు సూర్యతేజస్సుగలవాడు. ఆ వృద్ధరాజదంపతులకు ముందు చెప్పిన మహాభిషమహారాజే కుమారుడయ్యాడు. (18)
శంతస్య జజ్ఞే సంతానః తస్మాదాసీత్ స శాంతనుః ।
శాంతుడైన తండ్రికి పుట్టినవాడు కాబట్టి ఆ కొడుకు శంతనుడైనాడు. (18 1/2)
(తస్య జాతస్య కృత్యాని ప్రతీపోఽకారయత్ ప్రభుః ।
జాతకర్మాది విప్రేణ వేదోక్తైః కర్మభిస్తదా ॥
ప్రతీపమహారాజు విప్రుల ద్వారా వేదోక్తపద్ధతిలో కుమారునకు జాతకర్మాది సంస్కారాలు జరిపించాడు.
నామ కర్మ చ విప్రాస్తు చక్రుః పరమసత్కృతమ్ ।
శాంతనోరవనీపాల వేదోక్తైః కర్మభిస్తదా ॥
మహారాజా! ఆ తరువాత విప్రులందరూ కలిసి వేదోక్తరీతిగా శాంతనునికి నామకరణ సంస్కారం కూడా జరిపించారు.
తతః సంవర్ధితో రాజా శాంతనుర్లోకపాలకః ।
స తు లేభే పరాం నిష్ఠాం ప్రాప్య ధర్మవిదాం వరః ॥
ధనుర్వేదే చ వేదే చ గతింస పరమాం గతః ।
యౌవనం చాపి సంప్రాప్తః కుమారో వదతాం వరః ॥)
ఆపై ఎదిగిన ఆ శాంతనుడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడై పరమనిష్ఠతో లోకపాలన చేయసాగాడు. ధనుర్వేదంలో, వేదంలో పరమోన్నత స్థితికి చేరాడు. వాగ్మి అయిన ఆ శాంతనుడు యౌవనదశకు చేరుకొన్నాడు.
సంస్మరన్ చాక్షయాన్ లోకాన్ విజాతాన్ స్వేన కర్మణా ॥ 19
పుణ్యకర్మకృదేవాసీత్ శాంతనుః కురుసత్తమః ।
ప్రతీపః శాంతనుం పుత్రం యౌవనస్థం తతోఽన్వశాత్ ॥ 20
కురుసత్తముడయిన ఆ శాంతనుడు తన సత్కర్మలతో సంపాదించిన అక్షయపుణ్యలోకాలను తలపోస్తూ పుణ్యకర్మలనే చేయసాగాడు. యౌవనంలో ఉన్న శాంతనుని ప్రతీమహారాజు ఇలా ఆదేశించాడు. (19,20)
పురా స్త్రీ మాం సమభ్యాగాత్ శాంతనో భూతయే తవ ।
త్వామావ్రజేద్ యది రహః సా పుత్ర వరవర్ణినీ ॥ 21
కామయానాభిరూపాఢ్యా దివ్యా స్త్రీ పుత్రకామ్యయా ।
సా త్వయా నానుయోక్తవ్యా కాస్ కస్యాసి చాంగనే ॥ 22
"కుమారా! గతంలో ఒక దివ్యకాంత నా దగ్గరకు వచ్చింది. నీ అభివృద్ధి కోసమే ఆమె వచ్చింది. ఆ దివ్యకాంత ఎప్పుడైనా ఏకాంతంగా పుత్రకామనతో నిన్ను సమీపిస్తే "నీవెవరు? ఎవరి కుమార్తెవు" వంటి ప్రశ్నలను నీవు అడగకూడదు. (21,22)
యచ్చ కుర్యాన్న తత్ కర్మ సా ప్రష్టవ్యా త్వయానఘ ।
మన్నియోగాద్ భజంతీం తాం భజేథా ఇత్యువాచ తమ్ ॥ 23
ఆమె ఏ పని చేసినా నీవు దానిని ప్రశించరాదు. ఆమె కోరితే నా ఆదేశంగా భావించి ఆమెనే నీవు భార్యగా స్వీకరించాలి అని ప్రతీపుడు కుమారునితో అన్నాడు. (23)
వైశంపాయన ఉవాచ
ఏవం సందిశ్య తనయం ప్రతీపః శాంతనుం తదా ।
స్వేచ రాజ్యేఽభిషిచ్యైనం వనం రాజా వివేశ హ ॥ 24
వైశంపాయనుడిలా అన్నాడు - ప్రతీపమహారాజు శాంతమని ఈ విధంగా ఆదేశించి తన రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసి తాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. (24)
స రాజా శాంతనుర్ధీమాన్ దేవరాజసమద్యుతిః ।
బభూవ మృగయాశీలః శాంతనుర్వనగోచరః ॥ 25
ధీమంతుడయిన శాంతనుమహారాజు దేవేంద్రుని వంటి శోభ గలవాడు. ఆ శాంతనుడు వేటమీది ఆసక్తితో అరణ్యంలో తిరుగసాగాడు. (25)
స మృగాన్ మహిషాంశ్చైవ వినిఘ్నన్ రాజసత్తమః ।
గంగామనుచచారైకః సిద్ధచారణసేవితామ్ ॥ 26
ఆ రాజశ్రేష్ఠుడు శాంతనుడు క్రూరమృగాలనూ, అడవిదున్నలనూ సంహరిస్తూ సిద్ధచారణులు సేవించే గంగాతీరంలో ఒంటరిగా తిరుగసాగాడు. (26)
స కదాచిన్మహారాజ దదర్శ పరమాం స్త్రియమ్ ।
జాజ్వల్యమానాం వపుషా సాక్షాచ్ఛ్రియమివాపరామ్ ॥ 27
మహరాజా! ఆ శాంతనుడు ఒకనాడు ఉత్తమకాంతను చూచాడు. ఆమె తన శరీరకాంతితో మరొకలక్ష్మివలె వెలిగిపోతూ కనిపిస్తోంది. (27)
సర్వానవద్యాం సుదతీం దివ్యాభరణభూషితామ్ ।
సూక్ష్మాంబరధరామేకాం పద్మోదరసమప్రభామ్ ॥ 28
మచ్చలేని అందం గల స్త్రీ ఆమె. చక్కని పలువరసగలది. దివ్యమైన ఆభరణాలు అలంకరించుకొని ఉన్నది. సన్నని వలువలను ధరించి ఉన్నది. పద్మంలోపలి భాగం వలె చక్కని శోభగలిగి ఉన్నది. (28)
తాం దృష్ట్వా హృష్టరోమాభూద్ విస్మితో రూపసంపదా ।
పిబన్నివ చ నేత్రాభ్యాం నాతృప్యత నరాధిపః ॥ 29
ఆమెను చూచి ఆ రూపసంపదకు ఆశ్చర్యపడి రాజు తన కళ్ళతో ఆమెను త్రాగుతూ కూడా తనివిని పొందలేకపోయాడు. (29)
సా చ దృష్ట్వైవ రాజానం విచరంతం మహాద్యుతిమ్ ।
స్నేహాదాగతసౌహార్దా నాతృప్యత విలాసినీ ॥ 30
ఆమె కూడా గొప్పతేజస్సుతో సంచరిస్తున్న ఆ రాజుమీది మక్కువతో సౌహార్దాన్ని పొంది, ఆయనను ఎంతచూచినా తృప్తి పొందలేకపోయింది. (30)
తామువాచ తతో రాజా సాంత్వయన్ శ్లక్ష్ణయా గిరా ।
దేవీ వా దానవీ వా త్వం గంధర్వీ చాథ వాప్సరాః ॥ 31
యక్షీ వా పన్నగీ వాపి మానుషీ వా సుమధ్యమే ।
యాచే త్వాం సురగర్భాభే భార్యా మే భవ శోభనే ॥ 32
అపుడు శాంతను మహారాజు మధురవచనాలతో ఆంఎను పలుకరించి "సుమధ్యమా! నివు దేవకాంతవా? దానవ కాంతవా? గంధర్వవనితవా? అప్సరసవా? యక్షకాంతవా? నాగకాంతవా? మానవస్త్రీవా? దేవతల సౌందర్యం వంటి శోభగల నిన్ను యాచిస్తున్నాను. నా భార్యవు కావలసినది" అని అన్నాడు. (31,32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి శాంతనూపాఖ్యానే సప్తనవతితమోఽధ్యాయః ॥ 97 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున శాంతనూపాఖ్యానమను తొంబదియేడవ అధ్యాయము. (97)
(దాక్షిణాత్య అధికపాఠం 6 శ్లోకాలతో కలిసి మొత్తం 38 శ్లోకాలు)