98. తొంబది యెనిమిదవ అధ్యాయము

భీష్ముని పుట్టుక.

వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వచో రాజ్ఞః సస్మితం మృదు వల్గు చ ।
(యశస్వినీ చ సాఽఽగచ్ఛత్ శాంతనోర్భూతయే తదా।
సా చ దృష్ట్వా నృపశ్రేష్ఠం చరంతం తీరమాశ్రితమ్ ॥)
వసూనాం సమయం స్మృత్వా అథాభ్యగచ్ఛదనిందితా ॥ 1
(ప్రజార్థినీ రాజపుత్రం శాంతనుం పృథివీపతిమ్ ।
ప్రతీపవచనం చాపి సంస్మృత్యైవ స్వయం నృప ॥
కాలోఽయమితి మత్వా సా వసూనాం శాపచోదితా ।)
ఉవాచ చైవ రాజ్ఞః సా హ్లాదయంతీ మనో గిరా ।
భవిష్యామి మహీపాల మహిషీ తే వశానుగా ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు - రాజా! మందహాసపుర్వకంగా శాంతనుడు పలికిన ఆ మధురవచనాలను విని యశస్విని అయిన ఆ గంగ శాంతనుని అభివృద్ధికై ఆయన దగ్గరకు వచ్చింది. ఒడ్డున సంచరిస్తున్న ఆ రాజశ్రేష్ఠుని చూచి ఆమె వసువుల కిచ్చిన మాటను గుర్తు తెచ్చుకొన్నది. ప్రతీపుని మాటను కూడా తలచుకొన్నది. దానితో తగిన సమయంగా భావించి వసువుల శాపం ప్రేరణ కాగా సంతానార్థినియై శాంతనురాజును సమీపించి తన మాటలతో ఆ నరపాలుని మనస్సును ఆహ్లాదపరుస్తూ ఇలా అన్నది - రాజా! నేను నీకు పట్టమహిషినై నీఅధీనంలో ఉంటాను. (1,2)
యత్తు కుర్యామహం రాజన్ శుభం వా యది వా శుభమ్ ।
న తద్ ఽఆరయితవ్యాస్మి న వక్తవ్యా తథాప్రియమ్ ॥ 3
రాజా! అయితే నేను శుభమైనా, అశుభమైనా సరే ఏ పని చేసినా నన్ను అడ్డగించకూడదు. నాకు కష్టం కలిగేటట్టు మాటాడకూడదు. (3)
ఏవం హి వర్తమానేఽహం త్వయి వత్స్యామి పార్థివ ।
వారితా విప్రియం చోక్తా త్యజేయం త్వామసంశయమ్ ॥ 4
రాజా! ఇలా నడుచుకొన్నప్పుడే నేను నీ దగ్గర ఉంటాను. నన్ను అడ్డగించినా, అప్రియంగా మాట్లాడినా నిస్సందేహంగా నిన్ను విడిచి వెళతాను. (4)
తథేతి సా యదా తూక్తా తదా భరతసత్తమ ।
ప్రహర్షమతులం లేభే ప్రాప్య తం పార్థివోత్తమమ్ ॥ 5
భరతశ్రేష్ఠా! అలాగే అని శాంతనుడు అనగానే ఆమె ఆ రాజును భర్తగా పొమ్ది పరమానందాన్ని పొందింది. (5)
(రథమారోప్య తాం దేవీం జగామ స తయా సహ ।
సా చ శాంతనుమభ్యాగాత్ సాక్షాత్ లక్ష్మీరివాపరా ॥)
ఆ గంగాదేవిని రథంపై ఎక్కించుకొని ఆంఎతో కూడా శాంతనుడు వెళ్లిపోయాడు. ఆమె సాక్షాత్తు మరొక లక్ష్మివలె ఆ శాంతనుమహారాజును అనుసరించింది.
ఆసాద్య శాంతనుస్తాం చ బుభుజే కామతో వశీ ।
న ప్రష్టవ్యేతి మన్వానః న స తాం కించిదూచివాన్ ॥ 6
శాంతనుడు ఆమెను పొంది జితేంద్రియుడై ఆమెతో స్వేచ్ఛగా సుఖించాడు. ఆమెను ప్రశ్నించరాదు కాబట్టి ఎప్పుడూ ఏమీ అనలేదు. (6)
స తస్యాః శీలవృత్తేన రూపౌదార్యగుణేన చ ।
ఉపచారేణ చ రహః తుతోష జగతీపతిః ॥ 7
ఆ గంగ నడవడితోనూ, రూప-ఔదార్య గుణాలతోనూ ఏకాంతంగా ఆమె చేస్తున్న పరిచర్యలతోనూ ఆ శాంతనురాజు సంతోషించాడు. (7)
దివ్యరూపా హి సా దేవీ గంగా త్రిపథగామినీ ।
మానుషం విగ్రహం కృత్వా శ్రీమంతం వరవర్ణినీ ॥ 8
భాగ్యోపనతకామస్య భార్యా చోపనతాభవత్ ।
శాంతనోర్నృపసింహస్య దేవరాజసమద్యుతేః ॥ 9
ముల్లోకాలలోను సంచరించే ఆ గంగ దివ్యసుందర రూపంతో మానవశరీరాన్ని ధరించి దేవేంద్రుని వంటి శోభగలిగి, సౌభాగ్యకారణంగా సకలకామాలను అనుభవిస్తున్న ఆ నరశ్రేష్ఠుడైన శాంతనునకు భార్యగా లభించింది. (8,9)
సంభోగస్నేహచాతుర్యైః హావభావసమన్వితైః ।
రాజానం రమయామాస యథా రేమే తథైవ సః ॥ 10
ఆమె హావభావాలతో కూడియున్న సంభొగచాతుర్య, స్నేహచాతుర్యాలతో ఆ రాజును ఆనందింపజేసింది. ఆ రాజు కూడా దానికి ప్రతిగా ఆమె నలాగే ఆనందింపజేశాడు. (10)
స రాజా రతిసక్తత్వాత్ ఉత్తమస్త్రీగుణైర్హృతః ।
సంవత్సరాన్ ఋతూన్ మాసాన్ బుబుధే న బహూన్ గతాన్ ॥ 11
ఆ రాజు రతి మీద ఆసక్తి గలిగి ఉండటం వలన, ఉత్తమ స్త్రీ - గుణాలకు వశమైపోవటం వలన గడచిపోతున్న సంవత్సరాలనూ, ఋతువులనూ, మాసాలనూగమనించనేలేదు. (11)
రమమాణస్తయా సార్థం యథాకామం నరేశ్వరః ।
అష్టావజనయత్ పుత్రాన్ తస్యామమరసంనిభాన్ ॥ 12
తన ఇచ్చ వచ్చినట్లుగా ఆమెతో సుఖిస్తున్న ఆ రాజు ఆమెయందు దేవతలతో సమానమైన ఎనిమిది మంది కొడుకులను కన్నాడు. (12)
జాతం జాతం చ సా పుత్రం క్షిపత్యంభసి భారత ।
ప్రీణామ్యహం త్వామిత్యుక్త్వా గంగా ప్రోతస్యమజ్జయత్ ॥ 13
భారతా! పుట్టిన ప్రతిబిడ్డను ఆమె నీటిలో పడవేయసాగింది. "నిన్ను నేను ఆనందింప జేస్తున్నాను" అంటూ గంగా ప్రవాహంలో ముంచి వేస్తున్నది. (13)
తస్య తన్న ప్రియం రాజ్ఞః శాంతనోరభవత్ తదా ।
న చ తాం కించ నోవాచ త్యాగాద్ భీతో మహీపతిః ॥ 14
అయితే అది అప్పుడు ఆ శాంతనుమహారాజుకు నచ్చలేదు. కానీ వదలి వెళ్లుతుందన్న భయంతో ఆ రాజు ఆమెను ఏమీ అనలేదు. (14)
అథైనామష్టమే పుత్రే జాతే ప్రహాసతీమివ ।
ఉవాచ రాజా దుఃఖార్తః పరీప్సన్ పుత్రమాత్మనః ॥ 15
తరువాత ఎనిమిదవ కుమారుడు పుట్టినప్పుడు దుఃకార్తుడైన శాంతనుమహారాజు తన కుమారుని బ్రతికించుకోవాలని భావించి నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడు. (15)
మా వధీః కస్య కాసీతి కిం హినత్సి సుతానితి ।
పుత్రఘ్ని సుమహత్ పాపం సంప్రాప్తం తే సుగర్హితమ్ ॥ 16
'చంపవద్దు. నీవు ఎవరి కూతురువు? పిల్లలనెందుకు చంపుతున్నావు? పుత్రఘాతిని! కుంఆరులను చంపి నిందార్హమైన పెద్ద పాపాన్ని పొందుతున్నావు.' (16)
స్త్రీ ఉవాచ
పుత్రకామ న తే హన్మి పుత్రం పుత్రవతాం వర ।
జీర్ణస్తు మమ వాసోఽయం యథా స సమయః కృతః ॥ 17
ఆ స్త్రీ ఇలా అన్నది - పుత్రులను కోరుతున్న రాజా! పుత్రవంతులలో నీవు గొప్పవాడవు. నేను ఈ నీ కొడుకును చంపను. కానీ నేను ముందు చెప్పిన నియమం మేరకు నేనిక్కడ నివసించే సమయం ముగిసిపోయింది. (17)
అహం గంగా జహ్నుసుతా మహర్షిగణసేవితా ।
దేవకార్యార్థసిద్ధ్యర్థమ్ ఉషితాహం త్వయా సహ ॥ 18
నేను జహ్నుమహర్షి కూతురును. గంగను. మహర్షులు నన్ను సేవిస్తూ ఉంటారు. దేవతల కార్యసిద్ధికోసం నేను నీతో కలిసి జీవించాను. (18)
ఇమేఽష్టౌ వసవో దేవాః మహాభాగాః మహౌజసః ।
వసిష్ఠశాపదోషేణ మానుషత్వముపాగతాః ॥ 19
ఈ ఎనిమిదిమమంది దివ్యులయిన వసువులు మహాతేజోమూర్తులూ, మహాత్ములూ. వసిష్ఠుని శాపం వలన మానవరూపాలను పొందారు. (19)
తేషాం జనయితా నాన్యః త్వదృతే భువి విద్యతే ।
మద్విధా మానుషీ ధాత్రీ లోకే నాస్తీహ కాచన ॥ 20
వారికి తండ్రి కాగల అర్హత ఈ లోకంలో నీకు తప్ప మరొకరికి లేదు. వారిని గర్భంలో ధరించటానికి తగిన మానవకాంత నావంటిది ఈ లోకంలో ఎవరూ లేదు. (20)
తస్మాత్ తజ్జననీహేతోః మానుషత్వముపాగతా ।
జనయిత్వా వసూనష్టౌ జితా లోకాస్త్వయాక్షయాః ॥ 21
కాబట్టి వారికి తల్లికావలసినందున నేను మానవత్వాన్ని పొందాను. నీవు ఎనిమిదిమంది వసువులను కని అక్షయపుణ్యలోకాలను పొందగలిగావు. (21)
దేవానాం సమయస్త్వేషః వసూనాం సంశ్రుతో మయా ।
జాతం జాతం మోక్షయిష్యే జన్మతో మానుషాదితి ॥ 22
వసువులు ఒక నియమాన్ని పెట్టారు. దానికి నేను అంగీకరించాను. పుట్టినవాడిని పుట్టినట్టు మానవ జన్మనుండి విముక్తి కలిగించాలన్నది ఆ నియమం. (22)
తత్ తే శాపాద్వినిర్ముక్తా ఆపవస్య మహాత్మనః ।
స్వస్తి తేఽస్తు గమిష్యామి పుత్రం పాహి మహావ్రతమ్ ॥ 23
అందువలన వారు ఆ వసిష్ఠుని శాపం నుండి విముక్తులయ్యారు. నీకు మేలు కలుగుతుంది. నేను వెళ్తున్నాను. మహాదీక్షాదక్షుడైన ఈ కుమారుని పెంచుకో. (23)
(అయం తవ సుతస్తేషాం వీర్యేణ కులనందనః ।
సంభూతోఽతిజనానన్యాన్ భవిష్యతి న సంశయః ॥)
ఈ నీ కుమారుడు ఆ వసువుల పరాక్రమంతో సంపన్నుడై నీ వంశానందం కోసం పుట్టినవాడు. ఈ బాలుడు పరాక్రమంలో ఇతరులనందరినీ మించిపోగలవాడు. సందేహమే లేదు.
ఏష పర్యాయవాసో మే వసూనాం సంనిధౌ కృతః ।
మత్ప్రసూతిం విజానీహి గంగాదత్తమిమం సుతమ్ ॥ 24
ఈ బాలుడు వసువులందరి అంశలతో పుట్టినవాడు. రాజుకొడుకు ఒక్కడైనా మిగలాలని నేను వసువులను ప్రార్థించాను. ఈ బాలుడు నా కుమారుడు. అందుకే గంగాదత్తుడని పేరు పెట్టాలి. (24)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి భీష్మోత్పత్తౌ అష్టనవతితమోఽధ్యాయః ॥ 98 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున భీష్మోత్పత్తి అను తొంబది యెనిమిదవ అధ్యాయము. (98)
(దాక్షిణాత్య అధికపాఠం 4 1/2 శ్లోకాలతో కలిసి మొత్తం 28 1/2 శ్లోకాలు)