106. నూట ఆరవ అధ్యాయము

అణిమాండవ్యోపాఖ్యానము

జనమేజయ ఉవాచ
కిం కృతం కర్మ ధర్మేణ యేన శాపముపేయివాన్ ।
కస్య శాపాచ్చ బ్రహ్మర్షేః శూద్రయోనావజాయత ॥ 1
జనమేజయుడు ఇలా అడిగాడు. ధర్ముడు శాపాన్ని పొందవలసినంత తప్పు ఏం చేశాడు? ఏ బ్రహ్మర్షి శాపం వలన శూద్రజాతియందు జన్మించాడు? (1)
వైశంపాయన ఉవాచ
బభూవ బ్రాహ్మణః కశ్చిత్ మాండవ్య ఇతి విశ్రుతః ।
ధృతిమాన్ సర్వధర్మజ్ఞః సత్యే తపసి చ స్థితః ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. మాండవ్యుడని ప్రసిద్ధికెక్కిన ఒకానొక బ్రాహ్మణుడుండేవాడు. అతడు ధీరుడూ, సర్వధర్మజ్ఞుడూ, సత్యతపోనిష్ఠుడునూ. (2)
స ఆశ్రమపదద్వారి వృక్షమూలే మహాతపాః ।
ఊర్థ్వబాహుర్మహాయోగీ తస్థౌ మౌనవ్రతాన్వితః ॥ 3
మహాతపస్వీ, మహాయోగీ అయిన ఆ మాండవ్యుడు ఆశ్రమద్వారం దగ్గర చెట్టు క్రింద ఊర్ధ్వబాహూడై మౌనవ్రతాన్ని స్వీకరించి ఉండేవాడు. (3)
తస్య కాలేన మహతా తస్మింస్తపసి వర్తతః ।
తమాశ్రమమనుప్రాప్తాః దస్యవో లోప్త్రహారిణః ॥ 4
ఆ రీతిగా ఆ మహర్షి తపస్సులో మునిగి ఉండగా చాలా కాలానికి కొందరు దొంగలు దొంగలించిన సొమ్ముతో ఆ ఆశ్రమానికి వచ్చారు. (4)
అనుసార్యమాణా బహుభిః రక్షిభిర్భరతర్షభ ।
తే తస్యావసథే లోప్త్రం దస్యవః కురుసత్తమ ॥ 5
నిధాయ చ భయాల్లీనాః తత్రైవానాగతే బలే ।
తేషు లీనేష్వథో శీఘ్రం తతస్తద్ రక్షిణాం బలమ్ ॥ 6
ఆజగామ తతోఽపశ్యన్ తమృషిం తస్కరానుగాః ।
తమపృచ్ఛంస్తతోరాజన్ తథావృత్తం తపోధనమ్ ॥ 7
కతమేన పథా యాతాః దస్యవో ద్విజసత్తమ ।
తేన గచ్చామహే బ్రహ్మన్ యథా శీఘ్రతరం వయమ్ ॥ 8
భరతశ్రేష్ఠా! అనేక సైనికులు తరుముతుండగా ఆ దొంగలు భయంతో ఆ ముని కుటీరంలో దొంగిలించిన ఆ సొమ్మును ఉంచి రక్షకులు అక్కడకు వచ్చేలోగా దాగుకొన్నారు. వారు దాగగానే వారిని వెంటపడి తురుముతున్న ఆ రక్షకులు వచ్చి ఆ ఋషిని చూచారు. మహారాజా! అప్పుడా సైనికులు ఆవిధంగా ఉన్న ఆ తపోధనుని "ద్విజోత్తమా? దొంగలు ఎటువెళ్ళారు? అంతకన్న వేగంగా మేము వెళ్ళి వారిని పట్టుకొంటాం" అని అడిగారు. (5-8)
తథా తు రక్షిణాం తేషాం బ్రువతాం స తపోధనః ।
న కించిద్ వచనం రాజన్ అబ్రవీత్ సాధ్వసాధు వా ॥ 9
రాజా! ఆరక్షకులు అలా అడుగుతున్నా ఆ తపోధనుడు మంచికానీ, చెడు కానీ ఒక్కమాట కూడా పలుకలేదు. (9)
తతస్తే రాజపురుషాః విచిన్వానాస్తమాశ్రమమ్ ।
దదృశుస్తత్ర లీనాంస్తాన్ చౌరాంస్తద్ ద్రవ్యమేవచ ॥ 10
అప్పుడు రాజసైనికులు ఆశ్రమమంతా వెదకుహూ దాగి ఉన్న దొంగలనూ, అపహరించిన ద్రవ్యాన్నీ చూచారు. (10)
తతః శంకా సమభవద్ రక్షిణాం తం మునిం ప్రతి ।
సంయమ్యైనం తతో రాజ్ఞే దస్యూంశ్చైవ న్యవేదయన్ ॥ 11
అప్పుడు ఆ రక్షకులకు ముని మీదనే అనుమానం కలిగింది. ఆయననూ, దొంగలనూ కూడా బంధించి రాజుకు నివేదించారు. (11)
తం రాజా సహ తైశ్చోరైః అన్వశాద్ వధ్యతామితి ।
స రక్షిభిస్తైరజ్ఞాతః శూలే ప్రోతో మహాతపాః ॥ 12
ఆ రాజు దొంగలతో పాటు ఆ మునిని కూడా చంపవలసినదిగా ఆదేశించాడు. ఆ మహాతపస్వి ఎవరో తెలియని సైనికులు ఆయనను శూలంలో దించారు. (12)
తతస్తే శూలమారోప్య తం మునిం రక్షిణస్తదా ।
ప్రతిజగ్ముర్మహీపాలం ధనాన్యాదాయ తాన్యథ ॥ 13
మహారాజా! ఆ విధంగా సైనికులు ఆ మునిని శూలమెక్కించి ఆ సొమ్మునంతా కైవసం చేసికొని వెళ్ళిపోయారు. (13)
శూలస్థః స తు ధర్మాత్మా కాలేన మహతా తతః ।
నిరాహారోఽపి విప్రర్షిః మరణం నాభ్యపద్యత ॥ 14
ఆ పై శూలంపై నున్న ఆ ధర్మాత్ముడు - బ్రహ్మర్షి - ఆహారం లేకపోయినా చాలాకాలం మరణించలేదు. (14)
ధారయామాస చ ప్రాణాన్ ఋషీంశ్చ సముపానయత్ ।
శూలాగ్రే తప్యమానేన తపస్తేన మహాత్మనా ॥ 15
సంతాపం పరమం జగ్ముః మునయస్తపసాన్వితాః ।
తే రాత్రౌశకునా భూత్వా సంనిపత్య తు భారత ।
దర్శయంతో యథాశక్తి తమపృచ్ఛన్ ద్విజోత్తమమ్ ॥ 16
ఆ మహర్షి ప్రాణాలను కాపాడుకొంటూ స్మరణమాత్రంతో ఋషులను తన దగ్గరకు పిలిపించుకొన్నాడు. శూలంపై తపిస్తూ తపస్సు చేస్తున్న ఆ మహాత్ముని చూచి తపోధనులయిన మునులు ఎంతో దుఃఖించారు. భారతా! వారంతా రాత్రివేళ పక్షులైవచ్చి తమశక్తి ననుసరించి ఆయనకు కనిపిమ్చి ఆద్విజోత్తముని ఇలా అడిగారు. (15,16)
శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మన్ కిం పాపం కృతవానసి ।
యేనేహ సమనుప్రాప్తం శూలే దుఃఖభయం మహత్ ॥ 17
బ్రాహ్మణా! శూలంపై ఆరోపింపబడి ఇంతగా దుఃఖాన్నీ, భయాన్నీ అనుభవించవలసినంత గొప్ప పాపం మీరేం చేశారో వినాలనుకొంటున్నాం (17)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అణీమాండవ్యోపాఖ్యానే షడధికశతతమోఽధ్యాయః ॥ 106 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున అణీమాండవ్యోపాఖ్యానమను నూట ఆరవ అధ్యాయము. (106)