107. నూటయేడవ అధ్యాయము
మాండవ్యుడు యమధర్మరాజును శపించుట.
వైశంపాయన ఉవాచ
తతః స మునిశార్దూలః తానువాచ తపోధనాన్ ।
దోషతః కం గమిష్యామి న హి మేఽన్యోఽపరాధ్యతి ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. అపుడు ఆ మునిశ్రేష్ఠుడు "ఎవరిపై దోషాన్ని ఎత్తి చూపగలను. నాకు కీడు చేసిన వాడెవ్వడూ లేడు" అని ఆ తాపసులతో అన్నాడు. (1)
తం దృష్ట్వా రక్షిణస్తత్ర తథా బహుతిథేఽహని ।
న్యవేదయంస్తథా రాజ్ఞే యథావృత్తం నరాధిప ॥ 2
మహారాజా! రక్షకులు అక్కడ ఆ విధంగా శూలంపై చాలాకాలం కూర్చొని ఉన్న ఆ వృత్తాంతాన్ని అంతా యథాతథంగా రాజుకు తెలియజేశారు. (2)
శ్రుత్వా చ వచనం తేషాం నిశ్చిత్య సహ మంత్రిభిః ।
ప్రసాదయామాస తథా శూలస్థమృషిసత్తమమ్ ॥ 3
ఆ రాజు వారి మాటలు విని మంత్రులతో కలిసి నిశ్చయించుకొని ఆ విధంగా శూలంపై ఉన్న ఆ మునిసత్తముని ప్రసన్నుని చేసికొనబోయాడు. (3)
రాజోవాచ
యన్మయాపకృతం మోహాద్ అజ్ఞానాదృషిసత్తమ ।
ప్రసాదయే త్వాం తత్రాహం న మే త్వం క్రోద్ధుమర్హసి ॥ 4
ఋషిశ్రేష్ఠా! మోహంతోనో, అజ్ఞానంతోనో నేను అపకారం చేశాను. నాపై తమరు కోపగించవలదు. అనుగ్రహించవలసినదిగా కోరుతున్నాను. (4)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తతో రాజ్ఞా ప్రసాదమకరోన్మునిః ।
కృతప్రసాదం రాజా తం తతః సమవతారయత్ ॥ 5
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తతో రాజ్ఞా ప్రసాదమకరోన్మునిః ।
కృతప్రసాదం రాజా తం తతః సమవతారయత్ ॥ 5
వైశంపాయనుడిలా అన్నాడు. రాజు ఈ విధంగా పలికిన తర్వాత మహర్షి ప్రసన్నుడైనాడు. అనుగ్రహించిన ఆ మునిని రాజు శూలాన్నుండి దింపించాడు. (5)
అవతార్య చ శూలాగ్రాత్ తచ్ఛూలం నిశ్చకర్ష హ ।
అశక్నువంశ్చ నిష్క్రష్టుం శూలం మూలే స చిచ్ఛిదే ॥ 6
క్రిందకు దించి మొదలంటా శూలాన్ని శరీరం నుండి వేరు చేయాలని ప్రయత్నించాడు. కానీ మొత్తం బయటకు తీయలేక శరీరంలో ఉన్నంత మేర శూలాన్ని నరికించాడు. (6)
స తథాంతర్గతేనైవ శూలేన వ్యచరన్మునిః ।
తేనాతితపసా లోకాన్ విజిగ్యే దుర్లభాన్ పరైః ॥ 7
అప్పటి నుండీ ఆ ముని శూలం ముక్కను శరీరంలోనే నిలుపుకొని జీవించాడు. తన తీవ్రతపః ఫలితంగా ఇతరులకు దుర్లభమయిన పుణ్యలోకాలను పొందాడు. (7)
అణీమాండవ్య ఇతి చ తతో లోకేషు గీయతే ।
స గత్వా సదనం విప్రః ధర్మస్య పరమాత్మవిత్ ॥ 8
ఆసనస్థం తతో ధర్మం దృష్ట్వోపాలభత ప్రభుః ।
కిం ను తద్ దుష్కృతం కర్మ మయాకృతమజానతా ॥ 9
యస్యేయం ఫలనిర్వృత్తేః ఈ దృశ్యాసాదితా మయా ।
శీఘ్రమాచక్ష్వ మే తత్త్వం పశ్య మే తపసో బలమ్ ॥ 10
అణి- (శూలాగ్రభాగం)-శరీరంలోనే నిలిచిపోయింది. కాబట్టి అణీమాండవ్యుడని లోకప్రసిద్ధిని పొందాడు. పరమాత్మజ్ఞాని అయిన ఆ విప్రుడు చనిపోయాక యమధర్మరాజు భవనానికి వెళ్ళి, ఆసనంపై ఉన్న ఆయనను చూచి-నేను ఇంత ఫలితాన్ని ఈ రీతిగా అనుభవించటానికి కారణంగా నేను తెలియక చేసిన పెద్దనేరమేమిటి? వెంటనే నాకు వాస్తవ స్వరూపాన్ని తెలుపు. లేదా నా తపస్సు బలమెంతో చూడు-అంటూ నిందించాడు. (8-10)
ధర్మ ఉవాచ
పతంహికానాం పుచ్ఛేషు త్వయేషీకా ప్రవేశితా ।
కర్మణస్తస్య తే ప్రాప్తం ఫలమేతత్ తపోధన ॥ 11
ధర్మరాజు ఇలా అన్నాడు. తపోధనా! నీవు రెక్కల పురుగుల వెనుక భాగాన గడ్డిపోచలను గ్రుచ్చావు. దాని వలన నీవీ ఫలితాన్ని పొందావు. (11)
స్వల్పమేవ యథా దత్తం దానం బహుగుణం భవేత్ ।
అధర్మ ఏవం విప్రర్షే బహుదుఃఖఫలప్రదః ॥ 12
బ్రహ్మర్షీ! స్వల్పదానమయినా ఎన్నో రెట్లు ఎక్కువగా ఫలిత మిచ్చినట్టు స్వల్పమైన అధర్మం కూడా అనేక దుఃఖఫలాలనిస్తుంది. (12)
అణీమాండవ్య ఉవాచ
కస్మిన్ కాలే మయా తత్ తు కృతం బ్రూహి యథాతథమ్ ।
తేనోక్తో ధర్మరాజేన బాలభావే త్వయా కృతమ్ ॥ 13
అణీమాండవ్యుడిలా అన్నాడు. నేను ఏ వయస్సులో ఆ పని చేశానో నాకు ఉన్నదున్నట్లు చెప్పు. నీవు చిన్నతనంలో ఆ పని చేశావని ధర్మరాజు తెలిపాడు. (13)
అణీమాండవ్య ఉవాచ
బాలో హి ద్వాదశాద్ వర్షాత్ జన్మతో యత్ కరిష్యతి ।
న భవిష్యత్యధర్మోఽత్ర న ప్రజ్ఞాస్యంతి వై దిశః ॥ 14
అణీమాండవ్యుడిలా అన్నాడు. బాళుడు పండ్రెండు సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఏ పని చేసినా అది తప్పు కాదని ధర్మశాస్త్ర నిర్ణయం. ఆ వయస్సులో బాలునకు ధర్మశాస్త్రాలు తెలియవు. గదా! (14)
అల్పేఽపరాధేఽపి మహాన్ మమ దండస్త్వయా కృతః ।
గరీయాన్ బ్రాహ్మాణవధః సర్వభూతవధాదపి ॥ 15
నేను చేసినది చిన్న తప్పే అయినా పెద్ద శిక్ష విధించావు. సర్వప్రాణివధ కన్న బ్రాహ్మణవధ పెద్దది. (15)
శూద్రయోనావతో ధర్మ మాణుషః సంభవిష్యసి ।
మార్యాదాం స్థాపయామ్యద్య లోకే ధర్మఫలోదయామ్ ॥ 16
కాబట్టి ధర్మరాజా! మానవలోకంలో శూద్రుడవై నీవు జన్మిస్తావు. అంతేకాదు. నేటి నుండి లోకంలో ధర్మ ఫలితాన్ని ప్రకటిమ్చే ఒక హద్దును కూడా ఏర్పాటు చేస్తున్నాను. (16)
ఆచతుర్దశకాత్ వర్షాత్ న భవిష్యతి పాతకమ్ ।
పరతః కుర్వతామేవం దోష ఏవ భవిష్యతి ॥ 17
పదునాలుగు సంవత్సరాల వయస్సు వరకు ఎవరికీ పాపమంటదు. ఆ తర్వాత పాపం చేసిన వారికే దాని ఫలితముంటుంది. (17)
వైశంపాయన ఉవాచ
ఏతేన త్వపరాధేన శాపాత్ తస్య మహాత్మనః ।
ధర్మో విదురరూపేణ శూద్రయోనా వజాయత ॥ 18
వైశంపాయనుడిలా అన్నాడు. ఈ తప్పు వలన మహాత్ముడైన అణీమాండ్యవుని శాపం వలన యమధర్మరాజు విదురుడుగా శూద్రుడై జన్మించాడు. (18)
ధర్మే చార్థే చ కుశలః లోభక్రోధవివర్జితః ।
దీర్ఘదర్శీ శమపరః కురూణాం చ హితే రతః ॥ 19
ఆ విదురుడు ధర్మార్థకుశలుడు. లోభం, క్రోధం లేనివాడు. దీర్ఘదర్శి, శాంతి పరాయణుడు కురువంశస్థుల, శ్రేయస్సు మీదనే ఆసక్తిగలవాడు. (19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అణీమాండవ్యోపాఖ్యానే సప్తాధికశతతమోఽధ్యాయః ॥ 107 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున అణీమాండవ్యోపాఖ్యానమను నూట యేడవ అధ్యాయము. (107)