108. నూట ఎనిమిదవ అధ్యాయము
పాండు రాజు రాజ్యాభిషేకము.
వైశంపాయన ఉవాచ
(ధృతరాష్ట్రే చ పాండౌ చ విదురే చ మహాత్మని ।)
తేషు త్రిషు కుమారేషు జాతేషు కురుజాంగలమ్ ।
కురవోఽథ కురుక్షేత్రం త్రయమేతదవర్ధత ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ధృతరాష్ట్రుడూ, పాండురాజు, మహాత్ముడైన విదురుడు జన్మించిన తర్వాత కురువంశమూ, కురురాజ్యమూ, కురుక్షేత్రమూ మూడూ చక్కగా వృద్ధిపొందాయి. (1)
ఊర్ధ్వసస్యాభవద్ భూమిః సస్యాని రసవంతి చ।
యథర్తువర్షీ పర్జన్యః బహుపుష్పఫలా ద్రుమాః ॥ 2
భూమిపై పంటలు ఏపుగా పెరిగేవి. సస్యాలు రసవంతంగా ఉండేవి. సకాలంలో మేఘాలు కురిసేవి. చెట్లు పూలనూ, పండ్లనూ ఎక్కువగా ఇచ్చేవి. (2)
వాహనాని ప్రహృష్టాని ముదితా మృగపక్షిణః ।
గంధవంతి చ మాల్యాని రసవంతి ఫలాని చ ॥ 3
వాహనాలు ప్రహృష్టాని ముదితా మృగపక్షిణః ।
గంధవంతి చ మాల్యాని రసవంతి ఫలాని చ ॥ 3
వాహనాలు (గుఱ్ఱాలు, ఏనుగులు మొదలగునవి) తుష్టిగా పుష్టిగా ఉండేవి. మృగాలూ, పక్షులూ ఆనందంగా జీవించేవి. పూలు పరిమళభరితంగా, పండ్లు రసభరితంగా ఉండేవి. (3)
వణిగ్భిశ్చాన్వకీర్యంత నగరాణ్యథ శిల్పిభిః ।
శూరాశ్చ కృతవిద్యాశ్చ సంతశ్చ సుఖినోఽభవన్ ॥ 4
నగరాలు వ్యాపారులతోనూ, శిల్పులతోనూ వ్యాపించి ఉండేవి. శూరులూ, పండితులూ, మంచివారూ సుఖంగా జీవించేవారు. (4)
నాభవన్ దస్యవః కేచిత్ నా ధర్మరుచయో జనాః ।
ప్రదేశేష్వపి రాష్ట్రాణాం కృతం యుగమవర్తత ॥ 5
దొంగలు అసలు లేరు. అధర్మంపై మక్కువ గల ప్రజలు లేరు. రాజ్యంలోని అన్ని ప్రాంతాలలోనూ కృతయుగ లక్షణాలు ఉండేవి. (5)
ధర్మక్రియా యజ్ఞశీలాః సత్యవ్రతపరాయణాః ।
అన్యోన్యప్రీతిసంయుక్తాః వ్యవర్ధంత ప్రజాస్తథా ॥ 6
అప్పుడు ప్రజలందరూ సత్యవ్రతపరాయణులై యాగాచరణస్వభావం గలిగి ధర్మకర్మలనాచరిస్తూ పరస్పర ప్రీతితో వర్థిల్లుతున్నారు. (6)
మానక్రోధవిహీనాశ్చ నరా లోభవివర్జితాః ।
అన్యొన్యమభ్యనందంత ధర్మోత్తరమవర్తత ॥ 7
మానవులు అహంకారాన్నీ, కోపాన్నీ విడిచి పెట్టి, లోభానికి దూరంగా నిలచి ఒకరొనొకరు అభినందించుకొంటూ గడిపేవారు. వారి ప్రవర్తనలో ధర్మమే ప్రధానమై ఉండేది. (7)
తన్మహోదధివత్ పూర్ణం నగరం వై వ్యరోచత ।
ద్వారతోరణనిర్వ్యూహైః యుక్తమభ్రచయోపమైః ॥ 8
ఆ నగరం మహాసముద్రం వలె నిండుగా ఉండేది. మేఘాల సమూహంతో సమానమైన ద్వారాలూ, తోరణాలూ, గోపురాలతో శోభిల్లేది. (8)
ప్రాసాదశతసంబాధం మహేంద్రపురసంనిభమ్ ।
నదీషు వనఖండేషు వాపీపల్వలసానుషు ।
కాననేషు చ రమ్యేషు విజహ్రుర్ముదితా జనాః ॥ 9
వందల భవనాలతో కూడి ఆ హాస్తినపురం దేవేంద్ర నగరమయిన అమరావతి వలె ప్రకాశించేది. జనులు ఆనందంగా నదులలో, తోటలలో, దిగుడు బావులలో, జలాశయాలలో, కొండ చరియలలో అందమయిన అరణ్య ప్రదేశాలలో విహరించేవారు. (9)
ఉత్తరైః కురుభిః సార్ధం దక్షిణాః కురవస్తథా ।
విస్పర్ధమానా వ్యచరన్ తథా దేవర్షిచారణైః ॥ 10
ఆ విధంగా కురురాజ్యంలోని దక్షిణప్రాంతజనులూ, దేవతలూ, మునులూ, చారణులూ అందరూ ఉత్తర కురుప్రాంతంలోని వారితో పోటీ పడుతూ ప్రవర్తించేవారు. (10)
నాభవత్ కృపణః కశ్చిత్ నాభవన్ విధవాః స్త్రియః ।
తస్మిన్ జనపదే రమ్యే కురుభిర్బహులీకృతే॥ 11
కురువంశస్థులు అభివృద్ధిపరుస్తున్న ఆరమణీయ రాజ్యంలో దీనులెవ్వరూ లేరు. స్త్రీలకు వైధవ్యం లేదు. (11)
కుపారామసభావాప్యః బ్రాహ్మణావసథాస్తథా ।
బభూవుః సర్వర్ధియుతాః తస్మిన్ రాష్ట్రే సదోత్సవాః ॥ 12
ఆ రాజ్యంలో బావులూ, తోటలూ, సభాభవనాలూ, దిగుడుబావులూ, బ్రాహ్మణగృహాలూ సర్వసంపదలతో కూడి నిత్యోత్సవాలతో విలసిల్లేవి. (12)
భీష్మేణ ధర్మతో రాజన్ సర్వతః పరిరక్షితే ।
బభూవ రమణీయశ్చ చైత్యయూపశతాంకితః ॥ 13
జనమేజయా! భీష్ముని చేత అంతటా ధర్మమార్గంలో రక్షింపబడుతున్న ఆ రాజ్యం దేవస్థానాలతో, వందలకొద్దీ యజ్ఞస్తంభాలతో గుర్తింపబడుతూ రమణీయంగ ఉండేది. (13)
స దేశః పరరాష్ట్రాణి విమృజ్యాభిప్రవర్ధితః ।
భీష్మేణ విహితం రాష్ట్రే ధర్మచక్రమవర్తత ॥ 14
ఆ కురురాజ్యం ఇతర రాజ్యాలను కూడా పరిశీలిస్తూ నిరంతరంగా అభివృద్ధి పథంలో నిలువగలిగింది. భీష్ముడు ప్రవర్తింపజేస్తున్న ధర్మశాసనమే రాజ్యమంతా నడిచేది. (14)
క్రియమాణేషు కృతేషు కుమారాణాం మహాత్మనామ్ ।
పౌరజానపదాః సర్వే బభూవుః సతతోత్సవాః ॥ 15
మహాత్ములయిన ఆ కుమారులకు సమయోచిత సంస్కారాలను చేస్తున్నప్పుడు నగరవాసులూ, గ్రామీణులూ అందరూ నిత్యోత్సవాలుగా భావించేవారు. (15)
గృహేషు కురుముఖ్యానాం పౌరాణాం చ నరాధిప ।
దీయతాం భుజ్యతాం చేతి వాచోఽశ్రూయంత సర్వశః ॥ 16
నరశ్రేష్ఠా! కురుముఖ్యుల భవనాలలోనూ, పౌరుల ఇళ్ళలోనూ ఎటుచూచినా "దానాలౌ చేయండి. అతిథులకు అన్నం పెట్టండి" అన్నమాటలే వినిపించేవి. (16)
ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ విదురశ్చ మహామతిః ।
జన్మప్రభృతి భీష్మేణ పుత్రవత్ పరిపాలితాః ॥ 17
ధృతరాష్ట్రునీ, పాండునీ, మహామతి అయిన విదురునీ పుట్టిననాటి నుండి కన్నబిడ్డలవలె భీష్ముడు పెంచాడు. (17)
సంస్కారైః సంస్కృతాస్తేతు వ్రతాధ్యయనసంయుతాః ।
శ్రమవ్యాయామకుశలాః సమపద్యంత యౌవనమ్ ॥ 18
భీష్ముడు వారికి చేయవలసిన సంస్కారాల నన్నింటినీ జరిపించాడు. ఆ ముగ్గురూ బ్రహ్మచర్యవ్రతాన్నీ, వేదాధ్యయనాన్నీ కొనసాగిస్తున్నారు. పనిచేయటంలో, వ్యాయామం చేయటంలో కూడా వాఱు నేఱ్పుగడించారు. క్రమంగా యౌవనంలో ప్రవేశించారు. (18)
ధనుర్వేదేఽశ్వపృష్ఠే చ గదాయుద్ధేఽపిచర్మణి ।
తథైవ గజశిక్షాయాం నీతిశాస్త్రేషు పారగాః ॥ 19
ధనుర్వేదంలో, గుఱ్ఱాల స్వారిలో, గదాయుద్ధంలో, కత్తిడాలు ప్రయోగించటంలో, ఏనుగులను అదుపుచేయటంలో, నీతిశాస్త్రంలో పారంగతులు అయ్యారు. (19)
ఇతిహాసపురాణేషు నానాశిక్షాసు బోధితాః ।
వేదవేదాంగతత్త్వజ్ఞాః సర్వత్ర కృతనిశ్చయాః ॥ 20
ఇతిహాసపురాణాలనూ, వివిధ శిష్టాచారాలను తెలిసికొన్నారు. వేద్ వేదాంగతత్త్వజ్ఞులూ, అన్ని విషయాలలోనూ నిశ్చయజ్ఞానం గలవారూ అయ్యారు. (20)
పాండుర్ధనుషి విక్రాంతః నరేష్వభ్యధికోఽభవత్ ।
అన్యేభ్యో బలవానాసీద్ ఢృతరాష్ట్రో మహీపతిః ॥ 21
పాండుడు విలువిద్యలో ఆనాటి మనుష్యులందరినీ మించి ముందు నిలిచాడు. ధృతరాష్ట్ర మహారాజు శారీరకంగా ఇతరుల కన్న బలంగా ఉండేవాడు. (21)
త్రిషు లోకేషు న త్వాసీత్ కశ్చిద్ విదురసమ్మితః ।
ధర్మనిత్యస్తథా రాజన్ ధర్మే చ పరమం గతః ॥ 22
రాజా! మూడులోకాలోనూ విదురునివలె ధర్మనిత్యుడై, ఆత్మద్రష్ట అయినవాడు ఒక్కడు కూడా లేడు. (22)
ప్రణష్టం శంతనోర్వంశం సమీక్ష్య పునరుద్ధృతమ్ ।
తతో నిర్వచనం లోకే సర్వరాస్త్రేష్వవర్తత ॥ 23
నశించిన శాంతనువంశం మరల ఉద్ధరింపబడటాన్ని చూచి అన్ని రాజ్యాల ప్రజలూ ఇలా చెప్పుకొనేవారు - (23)
వీరసూనాం కాశిసుతే దేశానాం కురుజాంగలమ్ ।
సర్వధర్మవిదాం భీష్మః పురాణాం గజసాహ్వయమ్ ॥ 24
ధృతరాష్ట్రస్త్వచక్షుష్ట్వాద్ రాజ్యం న ప్రత్యపద్యత ।
పారశవత్వాద్ విదురః రాజా పాండుర్బభూవ హ ॥ 25
వీరమాతలలో అంబికా, అంబాలికలు; దేశాలలో కురుదేశమూ, సర్వధర్మవేత్తలతో భీష్ముడూ, నగరాలలో హాస్తినపురమూ గొప్పవి. ధృతరాష్ట్రుడు కళ్ళులేనివాడు కాబట్టి రాజ్యాన్ని పొందలేదు. విదురుడు పారశవుడు కాబట్టి రాజ్యార్హత లేదు. పాండుడు రాజయినాడు. (24,25)
కదాచిదథ గాంగేయః సర్వనీతిమతాం వరః ।
విదురం ధర్మతత్త్వజ్ఞం వాక్యమాహ యథోచితమ్ ॥ 26
ఒకానొక సమయంలో సర్వనీతివేత్తలలో శ్రేష్ఠుడయిన భీష్ముడు ధర్మతత్త్వజ్ఞుడైన విదురునితో న్యాయోచితంగా ఒక మాట అన్నారు. (26)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పాండురాజ్యాభిషేకే అష్టాధికశతతమోఽధ్యాయః ॥ 108 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పాండురాజ్యాభిషేకమను నూట ఎనిమిదవ అధ్యాయము. (108)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి శ్లోకసంఖ్య 26 1/2)