112. నూటపండ్రెండవ అధ్యాయము

మాద్రితో పాండురాజు వివాహము: దిగ్విజయము.

వైశంపాయన ఉవాచ
తతః శాంతనవో భీష్మః రాజ్ఞః పాండోర్యశస్వినః ।
వివాహస్యాపరస్యార్థే చకార మతిమాన్ మతిమ్ ॥ 1
వైశమ్పాయనుడిలా అన్నాడు. ఆ తరువాత మతిమంతుడూ, శాంతనపుడూ అయిన భీష్ముడు యశస్వి అయిన పాండురాజుకు మరొక పెండ్లి జరిపించటాన్ని గురించి ఆలోచించాడు. (1)
సోఽమాత్యైః స్థవిరైః సార్ధం బ్రాహ్మణైశ్చ మహర్షిభిః ।
బలేన చతురంగేణ యయౌ మద్రపతేః పురమ్ ॥ 2
ఆ భీష్ముడు వృద్ధామాత్యులతో బ్రాహ్మణులతో మహర్షులతో కలిసి చతురంగ బలాన్ని కూడగట్టి మద్రరాజు నగరానికి వెళ్ళాడు. (2)
ప్రత్యుద్గమ్యార్చయిత్వా చ పురం ప్రావేశయన్నృపః ॥ 3
బాహ్లీకవంశశ్రేష్ఠుడయిన ఆ మద్రరాజు భీష్ముని రాకను విని, ఎదురేగి, అర్చించి నగరానికి తోడుకొనివచ్చాడు. (3)
దత్త్వా తస్యాసనం శుభ్రం పాద్యమర్ఘ్యం తథైవ చ ।
మధుపర్కం చ మద్రేశః పప్రచ్ఛాగమనేఽర్థితామ్ ॥ 4
మద్రరాజు భీష్మునకు మంచి ఆసనాన్ని పాద్యాన్ని, అర్ఘ్యాన్ని, మధుపర్కాన్ని ఇచ్చి రాకకు కారణాన్ని అడిగాడు. (4)
తమ్ భీష్మః ప్రత్యువాచేదం మద్రరాజం కురూద్వహః ।
ఆగతం మాం విజానీహి కన్యార్థిన మరిందమ ॥ 5
అప్పుడు కురూద్వహుడైన భీష్ముడు ఇలా అన్నాడు. అరిందమా! కన్యార్థినై నేను వచ్చాను. తెలిసికో. (5)
శ్రూయతే భవతః సాధ్వీ స్వసా మాద్రీ యశస్వినీ ।
తామహం వరయిష్యామి పాండోరర్థే యశస్వినీమ్ ॥ 6
మాద్రి అనేపేరుతో నీకొక సోదరి ఉన్నదనీ ఆమె మంచితనానికి పేరుపొందినదనీ వింటున్నాం. పాండురాజు కోసం ఆమెను నేను కోరుతున్నాను. (6)
యుక్తరూపో హి సంబంధే థ్వం నో రాజన్ వయం తవ ।
ఏతత్ సంచింత్య మద్రేశ గృహాణాస్మాన్ యథావిధి ॥ 7
రాజా! మాతో వియ్యమందటానికి నీవు తగినవాడవే. నీకు మేము తగిన వారము. మద్రరాజా! దీనిని ఆలోచించి మమ్ములను శాస్త్రోకంగా స్వీకరించు. (7)
తమేవం వాదినం భీష్మం ప్రత్యభాషిత మద్రపః ।
న హి మేఽన్యో వరస్త్వత్తః శ్రేయానితి మతిర్మమ ॥ 8
ఈ విధంగా మాటాడిన భీష్మునకు మద్రరాజు ఇలా సమాధానం చెప్పాడు- తమవంటి వారినుండి ఇంతకన్నా కోరదగినదీ, శ్రేయస్కరమయినదీ లేదని నా భావన. (8)
పూర్వైః ప్రవర్తితం కించిత్ కులఽస్మిన్ నృపసత్తమైః ।
సాధు వా యది వాసాధు తన్నాతిక్రాంతుముత్సహే ॥ 9
అయితే మా పూర్వీకులయిన రాజులు మా వంశంలో ఏర్పాటుచేసిన శుల్కవిధి ఒకటున్నది. మంచో, చెడో ఇప్పుడు దాన్ని నేను అతిక్రమించలేను. (9)
వ్యక్తం తద్ భవతశ్చాపి విదితం నాత్ర సంశయః ।
న చ యుక్తం తథా వక్తుం భవాన్ దేహీతి సత్తమ ॥ 10
ఇది అందరకూ తెలిసినదే. నిస్సంశయంగా నీకు కూడా తెలిసియే ఉంటుంది. సత్పురుషా! అది తెలిసి కూడా కన్య నివ్వమని అడగటం మీకు తగదు. (10)
కులధర్మః స నో వీర ప్రమాణం పరమం చ తత్ ।
తేన త్వాం న బ్రవీమ్యేతద్ అసందిగ్ధం వచోఽరిహన్ ॥ 11
వీరా! అది మా కులధర్మం. మాకు అదే పరమప్రమాణం శత్రుసంహారా! ఆ కారణంగా అసందిగ్ధంగా నీకు నేను చెప్పలేకున్నాను. (11)
తం భీష్మః ప్రత్యువాచేదం మద్రరాజం జనాధిపః ।
ధర్మ ఏష పదో రాజన్ స్వయముక్తః స్వయంభువా ॥ 12
జనపాలకుడైన భీష్ముడు మద్రరాజుకిలా బదులిచ్చాడు- రాజా! ఇది సద్ధర్మమే. సాక్షాత్తు బ్రహ్మదేవుడే దీనిని ధర్మమన్నాడు. (12)
వి: సం: ఆర్షవివాహంలో కూడా కన్యాశుల్కంగా గోవుల్జంటను ఇస్తారు. అది శిష్టాచారంగా ఉంది. కాబట్టి మద్రరాజు ప్రతిపాదన వేదసమ్మతమే. నింద్యమయినా సరే వంశాచారాన్ని విడువరాదు. (నీల)
నాత్ర కశ్చన దోషోఽస్తి పూర్వైర్విధిరయం కృతః ।
విదితేయం చ తే శల్య మర్యాదా సాధుసమ్మతా ॥ 13
దీనిలో తప్పేమీలేదు. ఈఏర్పాటు మీపూర్వీకులు చేసినది. శల్యరాజా! సజ్జసమ్మతమయిన మీ కులమర్యాద మాకు తెలిసినదే. (13)
ఇత్యుక్త్వా స మహాతేజాః శాతకుంభం కృతాకృతమ్ ।
రత్నాని చ విచిత్రాణి శల్యాయాదాత్ సహస్రశః ॥ 14
గజానశ్వాన్ రథాంశ్పైవ వాసాంస్యాభరణాని చ ।
మణిముక్తాప్రవాలం చ గాంగేయో వ్యస్ఱ్రుజచ్ఛుభమ్ ॥ 15
ఆమాటలు పలికి తేజస్సంపన్నుడైన భీష్ముడు శల్యరాజుకు బంగారం, బంగారునగలూ, విచిత్ర రత్నాలూ వేలకొద్దీ ఇచ్చాడు. ఏనుగులనూ, గుఱ్ఱాలనూ, రథాలనూ, వస్త్రాలనూ, ఆభరణాలనూ, మణులనూ, ముత్యాలనూ, పగడాలనూ కానుక చేశాడు. (14,15)
తత్ ప్రగృహ్య ధనం సర్వం శల్యః సంప్రీతమానసః ।
దదౌ తాం సమలంకృత్య స్వసారం కౌరవర్షభే ॥ 16
ఆ ధనాన్నంతా తీసికొని శల్యుడు మనసా ఆనందించి తన చెల్లెలిని అలంకరించి కౌరవరాజుకు సమర్పించాడు. (16)
స తాం మాద్రీముపాదాయః భీష్మః సాగరగాసుతః ।
ఆజగామ పురీం ధీమాన్ ప్రవిష్టో గజసాహ్వయమ్ ॥ 17
ధీమంతుడు, గాంగేయుడైన భీష్ముడు ఆ మాద్రిని తీసికొని హాస్తినపురానికి వచ్చాడు. (17)
తత ఇష్టే-హని ప్రాప్తే ముహూర్తే సాధుసమ్మతే ।
జగ్రాహ విధివత్పాణిం మాద్ర్యాః పాండుర్నరాధిపః ॥ 18
ఆ తరువాత బ్రాహ్మణసమ్మతమై నచ్చిన ముహూర్తంలో పాండురాజు మాద్రిపాణిగ్రహణం చేశాడు. (18)
తతో వివాహే నిర్వృత్తే స రాజా కురునందనః ।
స్థాపయామాస తాం భార్యాం శుభే వేశ్మని భావినీమ్ ॥ 19
వివాహవిధి ముగిసిన పిమ్మట కురునందనుడైన పాండురాజు తన భార్యను శ్రేయస్కరమయిన అంతఃపురంలో ప్రవేశపెట్టాడు. (19)
స తాభ్యాం వ్యచరత్ సార్ధం భార్యాభ్యాం రాజసత్తమః ।
కుంత్యా మాద్ర్యా చ రాజేంద్రః యథాకామం యథాసుఖమ్ ॥ 20
ఆ రాజసత్తముడు పాండురాజు కుంతి - మాద్రి అనే ఆ ఇద్దరు భార్యలతో స్వేచ్ఛగా, సుఖంగా వ్యవహరించాడు. (20)
తతః స కౌరవో రాజా విహృత్య త్రిదాశా నిశాః ।
జిగిషయా మహీం పాండుః నిరక్రామత్ పురాత్ ప్రభో ॥ 21
ఆ తరువాత ఆ పాండురాజు ఒక నెలపాటు విహరించి, సుఖించి భూవిజయం కోసం నగరం నుండి నిష్క్రమించాడు. (21)
స భీష్మప్రముఖాన్ వృద్ధాన్ అభివాద్య ప్రణమ్య చ ।
ధృతరాష్ట్రం చ కౌరవ్యం తథాన్యాన్ కురుసత్తమాన్ ।
ఆమంత్ర్య ప్రయయౌ రాజా తైశ్చైవాస్యనుమోదితః ॥ 22
మంగళాచార యుక్తాభిః ఆశీర్భిరభినందితః ।
గజవాజిరథౌఘేన బలేన మహతాగమత్ ॥ 23
ఆ పాండురాజు భీష్ముడు మొదలుగా గల పెద్దలకు వందనమాచరించి, అన్నయైన ధృతరాష్ట్రునకు నమస్కరించి, ఇతర కురుప్రముఖుల ఆమోదంతో బయలు దేరాడు. మంగళాచారయుక్తమయిన ఆశీస్సులను పొంది ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలతో కూడిన పెద్దసేనతో కుడి నిర్గమించాడు. (22,23)
స రాజా దెవగర్భాభః విజిగీషుర్వసుంధరామ్ ।
హృష్టపుష్టబలైః ప్రాయాత్ పాండుః శత్రూననేకశః ॥ 24
ఆ పాండురాజు దేవకుమారులవలె తేజోమూర్తి. వసుంధరను జయించాలన్న కోరికతో ఆనందంగా బలిష్ఠంగా ఉన్న సేనతో ఎందరో రాజులపై దాడి చేశాడు. (24)
పూర్వమాగస్కృతో గత్వా దశార్ణాః సమరే జితాః ।
పాండునా నరసింహేన కౌరవాణాం యశోభృతా ॥ 25
కౌరవవంశకీర్తిని వృద్ధిపొందించగల నరశ్రేష్ఠుడైన ఆ పాండురాజు ముందుగా అంతకుముందే అపరాధులయిన దశార్ణదేశంపై దాడి చేసి వారిని ఓడించాడు. (25)
తతః సేనాముపాదాయ పాండుర్నానావిధధ్వజామ్ ।
ప్రభూతహస్త్యశ్వయుతాం పదాతిరథసంకులామ్ ॥ 26
ఆగస్కారీ మహీపానాం బహూనాం బలదర్పితః ।
గోప్తా మగధరాష్ట్రస్య దీర్ఘొ రాజగృహే హతః ॥ 27
ఆ తరువాత పాండురాజు వివిధ ధ్వజాలతోనూ, లెక్కలేనన్ని ఏనుగులు, గుఱ్ఱాలతోనూ, పదాతులతోనూ, రథాలతోనూ కోలాహలంగా ఉన్నసేనను మగధదేశం పైకి నడిపించాడు. అక్కడ ఎందరో రాజులకు కీడుచేసి బలగర్వంతో ఉన్న మగధదేశరాజు దీర్ఘుని రాజగృహంలోనే సంహరించాడు. (26,27)
తతః కోశం సమాదాయ వాహనాని చ భూరిశః ।
పాండునా మిథిలాం గత్వా విదేహాః సమరే జితాః ॥ 28
పాండురాజు ఆ తరువాతా భూరిధనాన్ని, వాహనాలనూ తీసికొని మిథిలకు పోయి అక్కడ విదేహరాజును ఓడించాడు. (28)
తథా కాశిషు సుహ్మేషు పుండ్రేషు చ నరర్షభ ।
స్వబాహుబలవీర్యేన కురూణామకరోద్ యశః ॥ 29
నరశ్రేష్ఠా! అదేవిధంగా కాశిరాజ్యంలో, సుహ్మరాజ్యంలో, పుండ్రరాజ్యంలో కూడా పాండురాజు తన బాHఉబల పరాక్రమాలతో కురువంశస్థులకు కీర్తిని కల్గించాడు. (29)
తం శరౌఘమహాజ్వాలం శస్త్రార్చిషమరిందమమ్ ।
పాండుపావకమాసాద్య వ్యదహ్యంత నరాధిపాః ॥ 30
అరిందమమై, బాణసమూహమనే జ్వాలలూ, ఆయుధాలనే కాంతులుగల పాండురాజరూపమయిన అగ్నిని సమీపించి ఎందరో రాజులు దగ్ధమయ్యారు. (30)
తే ససేనాః ససేనేన విద్వంసితబలా నృపాః ।
పాండునా వశగాః కృత్వా కురుకర్మసు యోజితాః ॥ 31
సేనతో కుడివెళ్తున్న పాండురాజు సేనలతో ఎదురువచ్చిన రాజుల సేనల్ను ధ్వంసం చెసి వారిని లోబరచుకొని కౌరవుల అధీనంలో పాలించేటట్లు నియోగించాడు. (31)
తేన తే నిర్జితాః సర్వే పృథివ్యాం సర్వపార్థివాః ।
తమేకం మేనిరే శూరం దేవేష్వివ పురందరమ్ ॥ 32
ఆ పాండురాజు ఓడించిన రాజులందరూ దేవతలలో దేవేంద్రునివలె భూలోకంలో ఒక్కపాండురాజునే శూరునిగా భావించారు. (32)
తం క్ఱ్రుతాంజలయః సర్వే ప్రణతా వసుధాధిపాః ।
ఉపాజగ్ముర్ధనం గృహ్య రత్నాని వివిధాని చ ॥ 33
భూలోకంలోని రాజులందరూ చేతులు జోడించి, తలలు వాల్చి ధనాన్ని, వివిధరత్నాలనూ తీసికొని పాండురాజును సమీపించారు. (33)
మణిముక్తాప్రవాలం చ సువర్ణం రజతం బహు ।
గోరత్నాన్యశ్వరత్నాని రథరత్నాని కుంజరాన్ ॥ 34
ఖరోష్ట్రమహిషీశ్చైవ యచ్చ కించిదజావికమ్ ।
కంబలాజినరత్నాని రాంకవాస్తరణాని చ ।
తత్ సర్వం ప్రతిజగ్రాహ రాజా నాగపురాధిపః ॥ 35
ఆ రాజులిచ్చిన మణులనూ, ముత్యాలనూ, పగడాలనూ, బంగారాన్నీ, వెండినీ, గోరత్నాలనూ, అశ్వరత్నాలనూ, శ్రేష్ఠరథాలనూ, ఏనుగులనూ, గాడిదలనూ, ఒంటెలనూ, దున్నపోతులనూ, మేకలనూ, గొఱ్ఱెలనూ, కంబళ్లనూ, మృగచర్మాలనూ, రత్నాలనూ, జింకచర్మంతో చేసిన పరుపులనూ- హాస్తినపురాధిపతి అయిన పాండురాజు స్వీకరించాడు. (34,35)
తదాదాయ యయౌ పాండుః పునర్ముదితవాహనః ।
హర్షయిష్యన్ స్వరాష్ట్రాణి పురం చ గజసాహ్వయమ్ ॥ 36
అదంతా తీసికొని పాండురాజు స్వరాజ్యప్రజలను ఆనందింపజెస్తూ హాస్తినాపురానికి వెళ్ళాడు. ఆసమయంలో అశ్వాదివాహనాలు కూడా ఆనందించాయి. (36)
శంతనో రాజసింహస్య భరతస్య చ ధీమతః ।
ప్రణష్టః కీర్తిజః శబ్దః పాండునా పునరాహృతః ॥ 37
రాజశ్రేష్ఠుడయిన శంతనుడూ, ధీమంతుడైన భరతుడు-వీరి కీర్తికథలు లోకంలో పరిస్థితిలో పాండురాజు మరల వాటిని ఉజ్జీవింపజేశాడు. (37)
యే పురా కురురాష్ట్రాణి జహ్రుః కురుధనాని చ ।
తే నాగపురసింహేన పాండునా కరదీకృతాః ॥ 38
హస్తినాపురసింహమయిన పాండురాజు అంతకుముందు కురురాజ్యభాగాలనో, కురుధనాన్నో అపహరించిన రాజులందరూ తిరిగి కప్పం చెల్లించేటట్టు చేశాడు. (38)
ఇత్యభాషంత రాజానః రాజామాత్యాశ్చ సంగతాః ।
ప్రతీతమనసో హృష్టాః పౌరజానపదైః సహ ॥ 39
రాజులూ, రాజామాత్యులూ ఒకచోట చేరినపుడు ఇటువంటి మాటలే అనుకొనేవారు. పౌరులూ, జానపదులూ కూడా వారితో జతకలిపేవారు. అందరి మనసుల్లోను పాండురాజుపై నమ్మకం, ఆనందం వెల్లివిరిసేవి. (39)
ప్రత్యుద్యయుశ్చ తం ప్రాప్తం సర్వే భీష్మ పురోగమాః ।
తేన దూరమివాధ్వానం గత్వా నాగపురాలయాత్ ॥ 40
ఆవృతం దదృశుర్ హృష్టాః లోకం బహువిధైర్ధనైః ।
నానాయానసమానీతైః రత్నైరుచ్చావచైస్తదా ॥ 41
హస్త్వశ్వరథరత్నైశ్చ గోభిరుష్ట్రైస్తథాదిభిః ।
నాంతం దదృశురాసాద్య భీష్మేణ సహ కౌరవాః ॥ 42
భీష్ముడు మొదలుగా గల కురుప్రముఖులు పాండురాజును స్వాగతించటానికి ఎదురువెళ్ళారు. పాండురాజు, ఆయనసేనలూ చాలా ఆనందంగా రావటాన్ని గమనించారు. హాస్తినాపురం నుండి ఏ కొద్దిదూరమో వెళ్ళి తిరిగివస్తున్న వారిలా వారు కనిపించారు. వారితోపాటు బహువిధ ధనాలూ, ఎన్నోబండ్లలో వేసికొనివచ్చిన గొప్పగొప్ప రత్నాలూ, ఏనుగులూ, గుఱ్ఱాలూ, రథాలూ, గోవులు, ఒంటెలు గొఱ్ఱెలు కూడా ఉన్నాయి. భీష్ముడూ, కౌరవులూ వాటిని చూస్తుంటే అవి అంతం లేకుండా కనిపించాయి. (40-42)
సోఽభివాద్య పితుః పాదౌ కౌసల్యానందవర్ధనః ।
యథార్హం మానయామాస పౌరజానపదానపి ॥ 43
అంబాలికకు ఆనందవర్ధకుడైన పాండురాజు భీష్ముని పాదాలకు నమస్కరించి పౌరులనూ, జానపదులనూ తగినరీతిగా సత్కరించాడు. (43)
ప్రమృద్య పరరాష్ట్రాణి కృతార్థం పునరాగతమ్ ।
పుత్రమాశ్లిష్య భీష్మస్తు హర్షాదశ్రూణ్యవర్తయత్ ॥ 44
శత్రురాజ్యాలను మట్టిలోకలిపి కృతార్థుడై తిరిగి వచ్చిన కుమారుని కౌగిలించుకొని భీష్ముడు కూడా ఆనందబాష్పాలు రాల్చాడు. (44)
స తూర్యశతశంఖానాం భేరీణాం చ మహాస్వనైః ।
హర్షయన్ సర్వశః పౌరాన్ వివేశ గజసాహ్వయమ్ ॥ 45
ఆ పాండురాజు వందలకొలది తూర్యనాదాలూ, ఆ ప్శంఖనాదాలూ, భేరీధ్వనులతో సహా అంతటా పౌరులను ఆనందింపజెస్తూ హాస్తిన నగరంలోనికి ప్రవేశించాడు. (45)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పాండుదిగ్విజయే ద్వాదశాధిక శతతమోఽధ్యాయ ॥ 112 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పాండురాజు దిగ్విజయమను నూటపండ్రెండవ అధ్యాయము. (112)