113. నూటపదమూడవ అధ్యాయము

విదుర వివాహము.

వైశంపాయన ఉవాచ
ధృతరాష్ట్రభ్యనుజ్ఞాతః స్వబాహువిజితం ధనమ్ ।
భీష్మాయ సత్యవత్యై చ మాత్రే చోపజహార సః ॥ 1
వైశంపాయనుడిలా చెప్పాడు. ఆ పాండురాజు తాను తన బాహుబలంతో గెలిచి తెచ్చిన ఆ ధనాన్ని ధృతరాష్ట్రుని అనుమతితో తన తల్లి సత్యవతికీ, భీష్ముడికీ కానుక చేశాడు. (1)
విదురాయ చ వై పాండుః ప్రేషయామాస తద్ ధనమ్ ।
సుహృదశ్చాపి ధర్మాత్మా ధనేన సమతర్పయత్ ॥ 2
పాండురాజు విదురునకు కూడా ఆదనాన్ని పంపాడు. ధర్మాత్ముడయిన పాండురాజు ఆధనంతో మిత్రులను కూడా తృప్తిపరచాడు. (2)
తతః సత్వవతీ భీష్మం కౌసల్యాం చ యశస్వినీమ్ ।
శూభైః పాండుజితైరర్థైః తోషయామాస భారత ॥ 3
ననంద మాతా కౌసల్యా తమప్రతిమతేజసమ్ ।
జయంతమివ పౌలోమీ పరిష్వజ్య వరర్షభమ్ ॥ 4
భారతా! ఆ తరువాత సత్యవతి భీష్మునీ, యశస్విని అయిన కోడలిని కూడా పాండురాజు తెచ్చి ఇచ్చిన శుభధనంతో సంతోషింపజేసింది. తల్లి అయిన అంబాలిక అసమానతేజస్కుడూ, నరశ్రేష్ఠుడూ అయిన జయంతుని శచీదేవివలె పాండురాజును కౌగిలించుకొని ఆనందించింది. (3,4)
తస్య వీరస్య విక్రాంతైః సహస్రశతదక్షిణైః ।
అశ్వమెధశతైరీజే ధృతరాష్ ట్రో మహాముఖైః ॥ 5
వీరుడైన ఆ పాండురాజుపరాక్రమంతో ధృతరాష్ట్రుడు వంధ అశ్వమేధయాగాలు చేశాడు. ప్రతియాగంలో లక్షసువర్ణముద్రికలను దానంచేశాడు. (5)
వి: సం: పుట్టుగ్రుడ్డికి శ్రౌతయజ్ఞాధికారం లేదు కాబట్టి అశ్వమేధయాగ సమానాలయిన మహాయాగాలు చేశాడు ధృతరాష్ట్రుడు. (నీల)
సంప్రయుక్తస్తు కుంత్యా చ మాద్ర్యాచ భరతర్షభ ।
జితతంద్రీస్తదా పాండుః బభూవ వనగోచరః ॥ 6
హిత్వా ప్రాసాదనిలయం శుభాని శయనాని చ ।
అరణ్యనిత్యః సతతం బభూవ మృగయాపరః ॥ 7
భరతశ్రేష్ఠా! పాండురాజు, అలసతను జయించాడు. కుంతితోనూ, మాద్రితోనూ కలిసి భవనాలలో నివాసాన్ని సుకశయ్యలను విడిచి ఎప్పుడూ అరణ్యసంచారాన్నే ఇష్టపడుతూ వేటాడనారంభించాడు. (6,7)
స చరన్ దక్షిణం పార్శ్వం రమ్యం హిమవతో గిరేః ।
ఉవాస గిరిపృష్ఠేషు మహాశాలవనేషు చ ॥ 8
ఆయన రమణీయమయిన హిమవత్పర్వత దక్షిణప్రాంతంలో సంచరిస్తూ గిరిశిఖరాలపై వేగిసచెట్లతో శోభలతో ఉన్న వనాలలో నివసించేవాడు. (8)
రరాజ కుంత్యా మాద్ర్యా చ పాండుః సహ వనే చరన్ ।
కరేణ్వోరివ మధ్యస్థః శ్రీమాన్ పౌరందరో గజః ॥ 9
పాండురాజు కుంతీమాద్రులతో కలిసి అరణ్యంలో సంచరిస్తూ రెండు ఆడయేనుగుల మధ్యవిహర్సితున్న శ్రీమంతమైన ఐరావతంవలె ప్రకాశించాడు. (9)
వి: తె: ఇచట నన్నయ "ఇచ్ఛా సదృశంబుగా గజవశాద్వయ మధ్యగజేంద్ర లీలతోన్" అని వర్ణించాడు. (1-5-47)
భారతం సహభార్యాభ్యాం ఖడ్గబాణధనుర్ధరమ్ ।
విచిత్రకవచం వీరం పరమాస్త్రవిదం నృపమ్ ।
దేవోఽయమిత్యమన్యంత చరంతం వనవాసినః ॥ 10
కత్తినీ, బాణాలనూ, వింటినీ, విచిత్రకవచాన్నీ ధరించి సంచరిస్తున్న పరమాస్త్రవేత్త అయిన ఆ వీరపాండురాజును చూచి ఆటవికులు ఆయనను దేవునిగా భావించారు. (10)
తస్య కామాంశ్చ భోగాంశ్చ వరా నిత్యమతంద్రితాః ।
ఉపాజహ్రుర్వనాంతేషు ధృతరాష్ట్రేణ చోదితాః ॥ 11
ధృతరాష్ట్రుడు ఏర్పాటుచెసిన మనుషులు ఏ పాటి ఏమరుపాటూ లేక అడవులలో ఆ పాండురాజుకు అవసరమైన భోగసామగ్రిని సమకూర్చేవారు. (11)
అథ పారశవీం కన్యాం దేవకన్య మహీపతేః ।
రూపయౌవనసంపన్నాం స శుశ్రావాపగాసుతః ॥ 12
తరువాత దేవకమహారాజు దగ్గర రూపయౌవనసంపన్న అయిన ఒక పారశవికన్య ఉన్నట్లు భీష్ముడు విన్నాడు. (12)
తతస్తు వరయిత్వా తామ్ ఆనీయ భరతర్షభః ।
వివాహం కారయామాస విదురస్య మహామతేః ॥ 13
ఆ తరువాత భరతశ్రేష్ఠుడైన భీష్ముడు ఆమెను వరించి మహామతి అయిన విదురునికి ఆమెతో వివాహం జరిపించాడు. (13)
తస్యాం చోత్పాదయామాస విదురః కురునందనః ।
పుత్రాన్ వినయసంపన్నాన్ ఆత్మనః సదృశాన్ గుణైః ॥ 14
కురునందనుడైన విదురుడు ఆమె యందు గుణాలలో తనతో సమానమైన కొడుకులను కన్నాడు. (14)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి విదురపరిణయే త్రయోదశాధిక శతతమోఽధ్యాయః ॥ 113 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున విదురపరిణయమను నూటపదమూడవ అధ్యాయము. (113)