115. నూటపదునైదవ అధ్యాయము
దుఃశల పుట్టుక
జనమేజయ ఉవాచ
ధృతరాష్ట్రస్య పుత్రాణామ్ ఆదితః కథితం త్వయా ।
ఋషేః ప్రసాదాత్ తు శతం న చ కన్యా ప్రకీర్తితా ॥ 1
జనమేజయుడిలా అన్నాడు. మహర్షి అనుగ్రహంవలన ధృతరాష్ట్రునకు వందమంది కొడుకులు పుట్టడాన్న్ మొదటినుండీ చెప్పావు. కానీ ఆసమయంలో కూతురు విషయాన్ని ప్రస్తావించలేదు. (1)
వైశ్యాపుత్రో యుయుత్సుశ్చ కన్యా చైకా శతాధికా ।
గాంధారరాజదుహితా శతపుత్రేతి చానఘ ॥ 2
ఉక్తా మహర్షిణా తేన వ్యాసేనామితతేజసా ।
కథం త్విదానీం భగవన్ కన్యాం త్వం తు బ్రవీషి మే ॥ 3
అనఘా! ఇప్పుడు వైశ్యాపుత్రుడు యుయుత్సుని గురించీ ఇంకొక కూతురు గురించీ కూడా చెప్పావు. మహాతేజస్వి అయిన వ్యాసమహర్షి గాంధారికి వందమంది కొడుకులనే వరంగా ఇచ్చాడు. పూజనీయా! ఈ కూతురు ఎలా కలిగింది? నాకు తెలపాలి. (2,3)
యది భాగశతం పేశీ కృతా తేన మహర్షిణా ।
న ప్రజాస్యతి చేద్ భూయః సౌబలేయీ కథంచన ॥ 4
కథం తు సంభవస్తస్యాః దుఃశలాయా వద్స్వ మే ।
యథావదిహ విప్రర్షే పరం మేఽత్ర కుతూహలమ్ ॥ 5
విప్రర్షీ! ఆ మహర్షి మాంసపిండాన్ని నూరుముక్కలే చేసి ఉంటే, గాంధారి, మరలా గర్భవతి కాలేదుగదా! మరి దుఃశల ఎలా పుట్టింది? ఉన్నదున్నట్లుగా చెప్పు. నాకు చాలా కుతూహలంగా ఉంది. (4,5)
వైశంపాయన ఉవాచ
సాధ్వయం ప్రశ్న ఉద్దిష్టః పాండవేయ బ్రవీమి తే ।
తాం మాంసపేశీం భగవాన్ స్వయమేవ మహాతపాః । 6
శీతాభిరద్భిరాసిచ్య భాగం భాగమకల్పయత్ ।
యో యథా కల్పితో భాగః తం తం ధాత్ర్యా తథా నృప ॥ 7
ఘృతపూర్ణేషు కుండేషు ఏకైకం ప్రాక్షిపత్ తదా ।
ఏతస్మిన్నంతరే సాధ్వీ గాంధారీ సుదృఢవ్రతా ॥ 8
దుహితుః స్నేహసంయోగమ్ అనుధ్యాయ వరాంగనా ।
మనసాచింతయద్ దేవీ ఏతత్ పుత్రశతం మమ ॥ 9
భవిష్యతి న సందేహః న బ్రవీత్యన్యథా మునిః ।
మమేయం పరమా తుష్టిః దుహితా మే భవేద్ యది ॥ 10
వైశంపాయనుడిలా అన్నాడు. పాండవేయా! చక్కగా అడిగావు. సమాధానం చెపుతా విను. మహాతపస్వి అయిన వ్యాసుడు ఆ మాంసపు ముద్దను స్వయంగా నీళ్లతో తడిపి ముక్కలు చేశాడు. ఆముక్కలను దాదిచేత నేతితో నిండిన పాత్రలలో పెట్టించాడు. ఆసమయంలో దృఢవ్రతశీల అయిన ఆ సుందరి - గాంధారి కుమార్తెలతోడి అనుబంధాన్ని భావించుకొని ఈవిధంగా ఆలోచించింది. ఈ మాంసపు ముద్దనుండి నాకు నూర్గురు కొడుకులు పుట్టడంలో అనుమానం లేదు. మహర్షి వ్యాసుడు అసత్యమాడడు. ఒక కూతురు కూడా పుడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. (6-10)
ఏకా శతాధికా బాలా భవిష్యతి కనీయపీ ।
తతో దౌహిత్రజాల్లోకాద్ అబాహ్యోఽసౌ పతిర్మమ ॥ 11
ఈవందమంది కొడుకులు కాక మరొక చిన్నకూతురు కూడా పుడితే నా భర్త దౌహిత్రులవలన కలగబోయే పుణ్యలోకాలను కూడా పొందగలుగుతాడు. (11)
అధికా కిల నారీణాం ప్రీతిర్జామాతృజా భవేత్ ।
యది నామ మమాపి స్యాద్ దుహితైకా శతాధికా ॥ 12
కృతకృత్యా భవేయం వై పుత్రదౌహిత్రసంవృతా ।
యది సత్యం తపస్తప్తం దత్తం వాప్యథవా హుతమ్ ॥ 13
గురవస్తోషితా వాపి తథాస్తు దుహితా మమ ।
ఏతస్మిన్నేవ కాలే తు కృష్ణద్వైపాయనః స్వయమ్ ॥ 14
వ్యభజత్ స తదా పేశీం భగవానృషిసత్తమః ।
గణయిత్వా శతం పూర్ణమ్ అంశానామాహ సౌబలీమ్ ॥ 15
స్త్రీలకు అల్లుళ్ళపై ఆదరమెక్కువ. నూరుగురు కొడుకులు కాక మరొక కూతురు కూడా నాకుంటే కొడుకులూ, దౌహిత్రులతో కలిసి ధన్యురాలను కాగలను. నేను యథార్థంగా తపోదానహోమాలను నిర్వర్తించి ఉంటే,గురుజనులను సేవించి ఉంటే నాకు కూతురు కూడా తప్పక పుట్టగలదు. అంతలోనే మునిసత్తముడూ, పూజ్యుడూ అయిన వ్యాసభగవానుడు మాంసపు ముద్దను స్వయంగా విభజించి నూరువరకు ఆ ముద్దలను లెక్కించి గాంధారితో ఇలా అన్నాడు. (12-15)
వ్యాస ఉవాచ
పూర్ణం పుత్రశతం త్వేతత్ న మిథ్యా వాగుదాహృతా ।
దౌహిత్రయోగాయ భాగ ఏకః శిష్టః శతాత్ పరః ।
ఏషా తే సుభగా కన్యా భవిష్యతి యథేప్సితా ॥ 16
వ్యాసుడిలా అన్నాడు. వీరు నూర్గురు కొడుకులు. నేను అసత్యమాడను. అయితే ఇంకొక మాంసపు ముద్ద మిగిలి ఉన్నది. అది దౌహిత్రసంబంధి. దీని నుండి నీవుకోరినట్లుగా సౌభాగ్యవతి అయిన కూతురు నీకు కలుగుతుంది. (16)
తతో-న్యం ఘృతకుంభం చ సమానాయ్య మహాతపాః ।
తం చాపి ప్రాక్షిపత్ తత్ర కన్యాభాగం తపోధనః ॥ 17
ఏతత్ తే కథితం రాజన్ దుఃశలాజన్మ భారత ।
బ్రూహి రాజేంద్ర కిం భూయః వర్తయిష్యామి తేఽనఘ ॥ 18
ఆ తపస్సంపన్నుడు మరొక నేతి కుండను తెప్పించి ఆకన్యాభాగాన్ని దానిలో ఉంచాడు. భారతా! మహారాజా! ఇదిగో ఈరీతిగా దుఃశలా జన్మ వృత్తాంతాన్ని చెప్పాను. అనఘా! చెప్పు నీకు ఇంకా ఏం చెప్పాలి? (17,18)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి దుఃశలోత్పత్తౌ పంచదశాధికశతతమోఽధ్యాయః ॥ 115 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమన ఉపపర్వమున దుఃశలోత్పత్తి అనునూటపదునైదవ అధ్యాయము. (115)