114. ణుటపదునాలుగవ అధ్యాయము

ధృతరాష్ట్రసంతానోత్పత్తి.

వైశంపాయన ఉవాచ
తతః పుత్రశతం జజ్ఞే గాంధార్యాం జనమేజయ ।
ధృతరాష్ట్రస్య వైశ్యాయామ్ ఏకశ్చాపి శతాత్ పరః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! ఆతరువాత ధృతరాష్ట్రునకు గాంధారి యందు వందమంది కొడుకులు పుట్టారు. వైశ్యజాతికి చెందిన మరొక భార్యయందు మరొక కొడుకు పుట్టాడు. (1)
పాండోః కుంత్యాం చ మాద్ర్యాం చ పుత్రాః పంచ మహారథాః ।
దేవేభ్యః సమపద్యంత సంతానాయ కులస్య వై ॥ 2
పాండురాజుకు కుంతీమాద్రుల యందు మహారథులయిన అయిదుగురు కొడుకులు పుట్టారు. వారు కురువంశాభివృద్ధికై దేవతలద్వారా పుట్టినవారు. (2)
జనమేజయ ఉవాచ
కథం పుత్రశతం జజ్ఞే గాంధార్యాం ద్విజసత్తమ ।
కియతా చైవ కాలేన తేషాయాయుశ్చ కిం పరమ్ ॥ 3
జనమేజయుడిలా అడిగాడు. బ్రాహ్మణోత్తమా! గాంధారి యందు వందమంది కొడుకులు ఎలా పుట్టారు? ఎంత కాలానికి పుట్టారు? వారి ఆయువు ఎంత? (3)
కథం చైకః స వైశ్యాయాం ధృతరాష్ట్రసుతోఊభవత్ ।
కథం చ సదృశీం భార్యాం గాంధారీం ధర్మచారిణీమ్ ॥ 4
ఆనుకూల్యే వర్తమానాం ధృతరాష్ట్రోఽభ్యవర్తత ।
కథం చ శప్తస్య సతః పాండోస్తేన మహాత్మనా ॥ 5
సముత్పన్నా దైవతేభ్యః పుత్రాః పంచ మహారథాః ।
ఏతద్ విద్వన్ యథాన్యాయం విస్తరేన తపోధన ॥ 6
కథయస్వ స మే తృప్తిః కథ్యమానేషు బంధుషు ।
వైశ్యకాంతయందు ధృతరాష్ట్రునకు కొడుకు ఎలా పుట్టాడు? ధర్మచారిణియై, తనకు తగినదై, అనుకూలంగా ప్రవరిస్తున్న ధర్మపత్ని గాంధారితో ధృతరాష్ట్రుడెలా ప్రవర్తించేవాడు? మహాత్ముడైన కిందమునిచే శపింపబడిన పాండురాజుకు దేవతల ద్వారా మహారథులయిన అయిదుగురు కొడుకులు ఎలా జన్మించారు? తపోధనా! పండితా! ఇదంతా సవిస్తరంగా యథాతథంగా వివరించి చెప్పు. మా బంధువులను గురించి ఇలా వినటం నాకు తృప్తిగా లేదు. (4-6 1/2)
వైశంపాయన ఉవాచ
క్షుచ్ఛ్రమాభిపరిగ్లానం ద్వైపాయనముపస్థితమ్ ॥ 7
తోషయామాస గాంధారీ వ్యాసస్తస్యై వరం దదౌ ।
సా వవ్రే సదృశం భర్తుః పుత్రాణాం శతమాత్మనః ॥ 8
వైశంపాయనుడిలా చెప్పాడు. ఒకప్పుడు కృష్ణద్వైపాయనుడు ఆకలితో, అలసటతో ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చాడు. గాంధారి పరిచర్యలతో ఆయనను సంతోషపెట్టింది. వ్యాసుడు ఆమెకు వరమీయదలచాడు. ఆమె తన భర్తతో సమానమైన కొడుకులు వందమందిని కోరింది. (7,8)
తతః కాలేన సా గర్భం ధృతరాష్ట్రాదథాగ్రహీత్ ।
సంవత్సరద్వయం తం తు గాంధారీ గర్భమాహితమ్ ॥ 9
అప్రజా ధారయామాస తతస్తాం దుఃఖమావిశత్ ।
శ్రుత్వా కుంతీసుతం జాతం బాలార్కసమతేజసమ్ ॥ 10
ఆ తరువాత ధృతరాష్ట్రుని ద్వారా ఆమె గర్భవతి అయినది. రెండుసంవత్సరాల పాటు ఆగర్భాన్ని ఆమె ధరించినా కాన్పు రాలేదు. అంతలో కుంతికి సూర్యతేజస్సుగల కుమారుడు పుట్టాడని విన్నది. దానితో ఆమె దుఃఖించింది. (9,10)
ఉదారస్యాత్మనః స్థైర్యమ్ ఉపలభ్యాన్వచింతయత్ ।
అజ్ఞాతం ధృతరాష్ట్రస్య యత్నేవ మహతా తతః ॥ 11
సోదరం ఘాతయామాస గాంధారీ దుఃఖమూర్ఛితా ।
తతో జజ్ఞే మాంసపేశీ లోహాష్ఠీలేవ సంహతా ॥ 12
తన గర్భం ప్రసవం కానందుకు ఎంతో విచారించింది. ఆతరువాత ధృతరాష్ట్రునకు తెలియకుండా ఎంతో ప్రయత్నించి తన గర్భంపై కొట్టుకున్నది. దుఃఖంతో మూర్ఛిల్లింది. అప్పుడు ఆమె గర్భంనుండి ఒక మాంసపిండం బయటపడింది. అది లోహగోళంలా ఉంది. (11,12)
ద్వివర్షసంభృతా కుక్షౌ తాముత్ర్సష్టుం ప్రచక్రమే ।
అథ ద్వైపాయనో జ్ఞాత్వా త్వరితః సముపాగమత్ ॥ 13
తాం స మాంసమయీం పేశీం దదర్శ జపతాం వరః ।
తతోఽబ్రవీత్ సౌబలేయీం కిమిదం తే చికీర్షితమ్ ॥ 14
తన కడుపులో రెండు సంవత్సరాలు భరించినా ఫలించని ఆ మాంసపిండాన్ని ఆమె పారవేయదలచింది. అంతలో దానిని గ్రహించిన వ్యాసమహర్షి వేగంగా అక్కడకు వచ్చాడు. తాపనశ్రేష్ఠుడయిన వ్యాసుడు మాంసమయమయిన ఆపిండాన్ని చూచి గాంధారితో "ఎందుకిలా చేస్తున్నా" వని అడిగాడు. (13,14)
సా చాత్మనో మతం సత్యం శశంస పరమర్షయే ।
ఆమె తన అభిప్రాయాన్ని ఆ మహర్షికి ఉన్నదున్నట్లు చెప్పింది.
గాంధార్యువాచ
జ్యేష్ఠం కుంతీసుతం జాతం శ్రుత్వా రవిసమప్రభమ్ ॥ 15
దుఃఖేన పరమేణేదమ్ ఉదరం ఘాతితం మయా ।
శతం చ కిల పుత్రాణాం వితీర్ణం మే త్వయం పురా ॥ 16
ఇయం చ మే మాంసపేశీ జాతా పుత్రశతాయ వై ।
గాంధారి ఇలా అన్నది. కుంతికి సూర్యతేజస్సుతో సమానమయిన తేజోమూర్తి మొదటికొడుకు పుట్టాడని విని భరించరాని దుఃఖంతో నేను కడుపుకొట్టుకొన్నాను. నీవు నాకు వందమంది కొడుకులను వరంగా ఇచ్చావు. ఇది చూడు. వందమంది కొడుకుల స్థానంలో మాంసపుముద్ద పుట్టింది. (15,16 1/2)
వ్యాస ఉవాచ
ఏవమేతత్ సౌబలేయి నైతజ్జాత్వన్యథా భవేత్ ॥ 17
వ్యాసుడిలా అన్నాడు. గాంధారి! నేనిచ్చిన వరం మేరకే జరుగుతుంది. మరొకవిధంగా జరగదు. (17)
వితథం నోక్తపూర్వం మే స్వైరేష్వపి కుతోఽన్యథా ।
ఘృతపూర్ణం కుండశతం క్షిప్రమేవ విధీయతామ్ ॥ 18
నేను మాటవరసకు కూడా ఇంతవరకు అసత్యమాడలేదు. ఇక వరదానం చేసేటప్పుడు అసత్యానికి అవకాశమెక్కడిది? వెంటనే నూరు నేతికుంఅలను ఏర్పాటుచేయించు. (17,18)
సుగుప్తేషు చ దేశేషు రక్షా చైవ విధీయతామ్ ।
శీతాభిరద్భీరష్ఠీలామ్ ఇమాం చ పరిషేచయ ॥ 19
బాగా చాటుగా దాచి వాటిని కాపాడే ఏర్పాటు చేయి. ఈ మాంసపిండాన్ని చల్లటి నీటితో తడుపు. (19)
వైశంపాయన ఉవాచ
సా పిచ్యమానా త్వష్ఠీలా బభూవ శతధా తదా ।
అంగుష్ఠపర్వమాత్రాణాం గర్భాణాం పృథగేవ తు ॥ 20
వైశంపాయనుడిలా అన్నాడు. అప్పుడు ఆ మాంసపిండాన్ని తడపగా అది నూరు ముక్కలయింది. బొటనవేలంత పరిమాణంతో నూరు గర్భాలుగా విడివిడిగా ఏర్పడింది. (20)
ఏకాధికశతం పూర్ణం యథాయోగం విశాంపతే ।
మాంసపేశ్Yఆస్తదా రాజన్ క్రమశః కాలపర్యయాత్ ॥ 21
రాజా! కొంతకాలం గడవగా క్రమంగా ఆ మాంసపిండం పరిపూర్ణంగా నూటొక్క భాగాలు అయింది. (21)
తతస్తాంస్తేషు కుండేషు గర్భానవదధే తదా ।
స్వనుగుప్తేషు దేశేషు రక్షాం వై వ్యదధాత్ తతః ॥ 22
ఆతరువాత వాటిని ఆయా కుండలలో పెట్టి, బాగా గోప్యంగా ఉన్న ప్రదేశంలో ఉంచి, వాటిని రక్షించే ఏర్పాటు చేశారు. (22)
శశంస చైవ భగవాన్ కాలేనైతావతా పునః ।
ఉద్ఘాటనీయాన్యేతాని కుండానీతి చ సౌబలీమ్ ॥ 23
తరువాత వ్యాసుడు "మరలా ఇంతకాలం తరువాతనే ఈ కుండలను తెరవా"లని గాంధారికి గట్టిగా చెప్పాడు. (23)
ఇత్యుక్త్వా భగవాన్ వ్యాసః తథా ప్రతినిధాయ చ ।
జగామ తపసే ధీమాన్ హిమవంతం శిలోచ్చయమ్ ॥ 24
ఈవిధంగా పలికి ధీమంతుడైన వ్యాసభగవానుడు తాను ఆదేశించినట్లుగా వాటి ఏర్పాట్లు చేయించి తపస్సుకోసం హిమాలయపర్వతానికి వెళ్ళిపోయాడు. (24)
జజ్ఞే క్రమేణ చైతేబ తేషాం దుర్యోధనో నృపః ।
జన్మతస్తు ప్రమాణేన జ్యేష్ఠో రాజా యుధిష్ఠిరః ॥ 25
తరువాత రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కుండలలో మాంసపిండాల నుంచిన క్రమంలోనే ముందుగా దుర్యోధనుడు పుట్టాడు. జన్మకాలప్రమాణాన్ని అనుసరించి దుర్యోధనుని కన్న ధర్మరాజు పెద్దవాడు. (25)
తదాఖ్యాతం తు భీష్మాయ విదురాయ చ ధీమతే ।
యస్మిన్నహని దుర్ధర్షః జజ్ఞే దుర్యోధనస్తదా ॥ 26
తస్మిన్నేవ మహాబాహుః జజ్న్Yఏ భీమోఽపి వీర్యవాన్ ।
స జాతమాత్ర ఏవాథ ధృతరాష్ట్రసుతో నృప ॥ 27
రాసభారావసదృశం రురావ చ ననాద చ ।
తం ఖరాః ప్రత్యభాషంత గృధ్రగోమాయువాయసాః ॥ 28
దుర్యోధనుడు జన్మించిన విషయాన్ని భీష్మవిదురులకు తెలియజేశారు. ఎదిరించరాని వీరుడు దుర్యోధనుడు పుట్టిన సమయంలోనే మహాబాహువూ, పరాక్రమవంతుడూ అయిన భీముడు కూడా పుట్టాడు. దుర్యోధనుడు పుట్టగానే గాడిదలు అరిచినట్టుగా అరుస్తూ ఏడ్చాడు. గాడిదలూ, గ్రద్దలూ, నక్కలూ, కాకులూ దానికి ప్రతిగా అరిచాయి. (26-28)
వాతాశ్చ ప్రవవ్రుశ్చాపి దిగ్దాహశ్చాభవత్ తదా ।
తతస్తు భీతవద్ రాజా ధృతరాష్ట్రోఽబ్రవీదిదమ్ ॥ 29
సమానీయ బహూన్ విప్రాన్ భీష్మం విదురమేవ చ ।
అన్యాంశ్చ సుహృదో రాజన్ కురూన్ సర్వాంస్తథైవ చ ॥ 30
పెనుగాలులు వీచాయి. దిక్కులు మండిపోయాయి. రాజా! దానికి బెదిరిపోయిన ధృతరాష్ట్రుడు భీష్మునీ, విదురునీ, అనేక బ్రాహ్మణులనూ, మిత్రులనూ, కురువంశ ప్రముఖూలనూ పిలిపించి వారితో ఇలా అన్నాడు. (29-30)
యుధిష్ఠిరో రాజపుత్ర జ్యేష్ఠో నః కులవర్ధనః ।
ప్రాప్తః స్వగుణతో రాజ్యం న తస్మిన్ వాచ్యమస్తి నః ॥ 31
మన వంశాన్ని వృద్ధిచేయగల రాజకుమారుడు యుధిష్ఠిరుడు జ్యేష్ఠుడు. తన గుణాలతో రాజ్యాధికారాన్ని పొందాడు. అతని విషయంలో ఎత్తి చూపవలసినది ఏదీలేదు. (31)
అయం త్వనంతరస్తస్మాద్ అపి రాజా భవిష్యతి ।
ఏతద్ విబ్రూత మే తథ్యం యదత్ర భవితా ధ్రువమ్ ॥ 32
యుధిష్ఠిరుని తర్వాత దుర్యోధనుడు పెద్దవాడు. దుర్యోధనుడు కూడా రాజు కాగలడా? ఈవిషయాన్ని ఆలోచించి నాకు వాస్తవాన్ని వివరించండి. జరుగవలసిన దానిని స్పష్టంగా చెప్పండి. (32)
వాక్యస్యైతస్య నిధనే దిక్షు సర్వాసు భారత ।
క్రవ్యాదాః ప్రాణదన్ ఘోరాః శివాశ్చాశివశంసినః ॥ 33
భారతా! ఆమాటలు ముగియగానే అన్ని దిక్కుల నుండి క్రూరజంతువులన్నీ ఘోరంగా అరవసాగాయి. అమంగళాన్ని సూచిస్తూ నక్కలు కూతపెట్టాయి. (33)
లక్షయిత్వా నిమిత్తాని తాని ఘోరాణి సర్వశః ।
తే-బ్రువన్ బ్రాహ్మణా రాజన్ విదురశ్చ మహామతిః ॥ 34
యథేమాని సుతే జాతే జ్యేష్ఠే తే పురుషర్షభ ॥ 35
వ్యక్తం కులాంతకరణః భవితైష సుతస్తవ ।
తస్య శాంతిః పరిత్యాగే గుప్తావపనయో మహాన్ ॥ 36
రాజా! అంతటా భయంకరమైన ఆ అశుభశకునాలనూ గుర్తించి విదురుడూ, ఆ బ్రాహ్మణులూ ఇలా అన్నారు. మహారాజా! నరోత్తమా! నీపెద్ద కుమారుడు పుట్టగానే భీకరశకునాలు పుట్టాయి. దీనిని బట్టి నీకొడుకు వంశాన్ని మొత్తాన్నీ నాశనం చేయబోతున్నాడనిపిస్తోంది. ఇతనిని పరిత్యజించటమే విఘ్నశాంతి కారణమవుతుంది. ఇలాగే కాపాడితే తీవ్రమయిన ఉపద్రవం కలుగుతుంది. (34-36)
శతమేకోనమప్యస్తు పుత్రాణాం తే మహీపతే ।
త్యజైనమేకం శాంతిం చేత్ కులస్యేచ్ఛసి భారత ॥ 37
భారతా! మహారాజా! నీకు తొంబది తొమ్మిదిమంది కొడుకులనే ఉండనీ, వంశ శాంతిని కోరుకొనేటట్లయితే ఈ ఒక్కడినీ విడిచిపెట్టు. (37)
ఏకేన కురు వై క్షేమం కులస్య జగతస్తథా ।
త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్ ॥ 38
గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్ ।
స తథా విదురేణోక్తః తైశ్చ సర్వైర్ద్విజోత్తమైః ॥ 39
న చకార తథా రాజా పుత్ర్స్నేహసమన్వితః ।
తతః పుత్రశతం పూర్ణం ధృతరాష్ట్రస్య పార్థివ ॥ 40
ఈఒక్కడిని విడిచిపెట్టి నీవంశానికీ, లోకానికీ క్షేమాన్ని కలిగించు. వంశంకోసం వ్యక్తినీ, గ్రామం కోసం వంశాన్నీ, జనపదం కోసం గ్రామాన్నీ, ఆత్మరక్షణకోసం దేశాన్నీ విడిచిపెట్టాలి. విదురుడూ, బ్రాహ్మణులూ ఆరీతిగా చెప్పినా కూడా పుత్రస్నేహబంధంవలన ధృతరాష్ట్రుడు ఆపని చేయలేదు. రాజా! ఆతరువాత ధృతరాష్ట్రునకు నూరుగురు కొడుకులూ పుట్టారు. (38-40)
మాసమాత్రేణ సంజజ్ఞే కన్యా చైకా శతాధికా ।
గాంధార్యాం క్లిశ్యమానాయామ్ ఉదరేణ వివర్ధతా ॥ 41
ధృతరాష్ట్రం మహారాజం వైశ్యా పర్యచరత్ కిల ।
తస్మిన్ సంవత్సరే రాజన్ ధృతరాష్ట్రాన్మహాయశాః ॥ 42
జజ్ఞే ధీమాంస్తతస్తస్యాం యుయుత్సుః కరణో నృప ।
ఏవం పుత్రశతం జజ్ఞే ధృతరాష్ట్రస్య ధీమతః ॥ 43
మహారథానాం వీరాణాం కన్యా చైకా శతాధికా ।
యుయుత్సుశ్చ మహాతేజాః వైశ్యాపుత్రః ప్రతాపవాన్ ॥ 44
ఆ తరువాత ఒకనెలకు నూటఒకటవదిగా ఒక ఆడపిల్ల పుట్టింది. పెరుగుతున్న గర్భంతో గాంధారి లేవలేని సమయంలో ఒక వైశ్యకాంత ధృతరాష్ట్ర మహారాజుకు పరిచర్యలు చేసింది. రాజా! ఆసంవత్సరంలో యశస్వి అయిన ధృతరాష్ట్రుడు ఆ వైశ్యకాంతయందు కొడుకును కన్నాడు. అతనిపేరు యుయుత్సుడు. యుయుత్సుడు కరణుడు. ఈ ప్రకారంగా వందమంది కొడుకులూ, నూటొకటవదిగా ఒక కూతురూ, తేజస్వీ, ప్రతాపవంతుడూ, వైశ్యాపుత్రుడూ అయిన యుయుత్సుడూ పుట్టారు. (41-44)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి గాంధారీపుత్రోత్పత్తౌ చతుర్దశాధికశతతమోఽధ్యాయః ॥ 114 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున గాంధారీపుత్రోత్పత్తి అనునూటపదునాలుగవ అధ్యాయము. (114)