117. నూట పదునేడవ అధ్యాయము

మృగరూపమున నున్న మహర్షి పాండురాజును శపించుట.

జనమేజయ ఉవాచ
కథితో ధార్తరాష్ట్రాణామ్ ఆర్షః సంభవ ఉత్తమః ।
అమనుష్యో మనుష్యాణాం భవతా బ్రహ్మవాదినా ॥ 1
జనమేజయుడిలా అన్నాడు. వ్యాసమహర్షి అనుగ్రహం చేత కలిగిన ధార్తరాష్ట్రుల ఉత్తమజన్మను గురించి తెలిపినారు. తమరు బ్రహ్మవేత్తలు. ఈ ధార్తరాష్ట్ర పుత్రజననం మానవీయమయినా మనుష్యుల విషయంలో కని, విని ఎరుగనిది. (1)
నామధేయాని చాప్యేషాం కథ్యమానాని భాగశః ।
త్వత్తః శ్రుతాని మే బ్రహ్మన్ పాండవానాం చ కీర్తయ ॥ 2
బ్రహ్మస్వరూపా! విడివిడిగా నీవు తెలిపిన ధృతరాష్ట్రుని కుమారుల పేర్లను కూడా విన్నాను. పాండవుల జననాన్ని గురించి కూడా విశదపరచవలసినది. (2)
తే హి సర్వే మహాత్మనః దెవరాజపరాక్రమాః ।
త్వయైవాంశావతరణే దేవభాగాః ప్రకీర్తితాః ॥ 3
వైశంపాయనా! మానవాతీతమయిన కర్మలు చేయగల పాండవుల జననవృత్తాంతాన్ని పూర్తిగా వినగోరుతున్నాను. వివరించవూ! (4)
వైశంపాయన ఉవాచ
రాజా పాండుర్మహారణ్యే మృగవ్యాలనిషేవితే ।
చరన్ మైథునధర్మస్థం దదర్శ మృగయూథపమ్ ॥ 5
వైశంపాయనుడిలా అన్నాడు- పాండురాజు జంతువులు, పాములు సంచరించే మహారణ్యంలో సంచరిస్తూ జతకట్టి ఉన్న ఒక మృగరాజును చూచాడు. (5)
తతస్తాం చ మృగీం తం చ రుక్మపుంఖైః సుపత్రిభిః ।
నిర్బిభేద శరైస్తీ క్ష్ణైః పాండుః పంచభిరాశుగైః ॥ 6
వెంటనే పాండురాజు బంగారు రెక్కలుగల అయిదు తీక్ష్ణమయిన బాణాలతో ఆ ఆడజింకనూ, మగజింకనూ కొట్టాడు. (6)
స చ రాజన్ మహాతేజాః ఋషిపుత్రస్తపోధనః ।
భార్యయా సహ తేజస్వీ మృగరూపేణ సంగతః ॥ 7
రాజా! ఒకానొక మహాతేజస్వి, తపోధనుడూ అయిన ఋషికుమారుడు తాను మృగరూపాన్ని ధరించి, మృగరూపధారిణి అయిన భార్యతో సంగమించాడు. (7)
సంస్తక్తశ్చ తయా మృగ్యా మానుషీమీరయన్ గిరమ్ ।
క్షణేన పతితో భూమౌ విలలాపాకులేంద్రియః ॥ 8
ఆ మృగపతి మృగరూపిణి అయిన భార్యతో సహా క్షణకాలంలోనే మానవులవలె మాటాడుతూ నేలగూలాడు. ఇంద్రియాలు నలిగిపోవటం వల్ల విలపించాడు. (8)
మృగ ఉవాచ
కామమన్యుపరీతా హి బుద్ధ్యా విరహితా అపి ।
వర్జయంతి నృశంసాని పాపేష్వపి రతా నరాః ॥ 9
న విధిం గ్రసతే ప్రజ్ఞా ప్రజ్ఞాం తు గ్రసతే విధిః ।
విధిపర్యాగతానర్థాన్ ప్రాజ్ఞో న ప్రతిపద్యతే ॥ 10
మృగమిలా అన్నది. కామక్రోధాలతో నిండినవాడైనా, బుద్ధిహీనుడైనా, పాపకర్మాసక్తుడైనా కూడా ఏ నరుడూ ఇంత క్రూరకర్మలు చేయడు. విధి ప్రజ్ఞను అతిక్రమించగలదు. విధివశంగా సంభవించే పదార్థాలను ప్రాజ్ఞుడు కూడా గ్రహించలేడు. (9,10)
శశ్వద్ధర్మాత్మనాం ముఖ్యే కులే జాతస్య భారతః ।
కామలోభాభిభూతస్య కథం తే చలితా మతిః ॥ 11
భారతా! నిత్యమూ ధర్మాత్ములైన క్షత్రియుల ప్రధానవంశంలో పుట్టినవాడవు నీవు. కాని కామలోభాలకు అధీనమైన నీ బుద్ధి ధర్మాన్ని తప్పింది. (11)
పాండు రువాచ
శత్రూణాం యా వధే వృత్తిః పా మృగాణాం వధే స్మృతా ।
రాజ్ఞాం మృగ న మాం మోహాత్ త్వం గర్హయితుమర్హసి ॥ 12
పాండురాజు అంటున్నాడు. రాజు తన శత్రువుల పట్ల ప్రవర్తించిన రీతిగానే మృగాల పట్లకూడా ప్రవర్తించవచ్చు. కాబట్టి మృగమా! మోహవశుడవై నన్ను నిందింపదగదు. (12)
అచ్ఛద్మనా మాయయా చ మృగాణాం వధ ఇష్యతే ।
స ఏవ ధర్మో రాజ్ఞాం తు తద్ధి త్వం కిం ను గర్హసే ॥ 13
ప్రత్యక్షంగా కానీ చాటుగా కానీ మృగాలను చంపవచ్చు. అది రాజులకు ధర్మమే. కానీ నీవు దానిని ఎందుకు నిందిస్తున్నావు? (13)
అగస్త్యః సత్రమాసీనః చకార మృగయామృషిః ।
ఆరణ్యాన్ సర్వదేవేభ్యః మృగాన్ ప్రేషన్ మహావనే ॥ 14
ప్రమాణదృష్టధర్మేణ కథమస్మాన్ విగర్హసే ।
అగస్త్వస్యాభిచారేణ యుష్మాకం విహితో వధః ॥ 15
అగస్త్యుడు యాగదీక్షితుడై ఉండికూడా వేటాడాడు. సర్వదేవతాహితాన్ని అభిలాషిస్తూ ఆయన యాగానికి విఘ్నాలు కలిగిస్తున్న పశువులను అరణ్యాలలోనికి తరిమివేశాడు. అగస్త్యుని మార్గాన్ని అనుసరిస్తే నిన్ను సంహరించటం కూడా నాకు ధర్మమే. నేను ధర్మబద్ధంగానే ప్రవర్తిస్తున్నాను అయినా నీవు నన్ను ఎందుకు నిందిస్తున్నావు? (14,15)
మృగ ఉవాచ
న రిపూన్ వై సముద్దిశ్య విముంచంతి నరాః శరాన్ ।
రంధ్ర ఏషాం విశేషేణ వధః కాలే ప్రశస్యతే ॥ 16
మృగమిలా అన్నది. నరులు తమ శత్రువుల మీదనయినా వారు కష్టాలలో ఉన్నప్పుడు బాణాలు ప్రయోగించరు. తగిన కాలంలోనే శత్రుసంహారం అభినందనీయమవుతుంది. (16)
పాండురువాచ
ప్రమత్తమప్రమత్తం నా వివృతం ఘ్నంతి చౌజసా ।
ఉపాయైర్వివిధైస్తీక్ష్ణైః కస్మాన్ మృగ విగర్హసే ॥ 17
పాండురాజిలా అన్నాడు. మృగమా! రాజులు నిశితాలయిన వివిధోపాయాలతో పరాక్రమంతో ఆక్రమించి మృగాలను చంపుతున్నారు. అవి ప్రమత్తంగా ఉన్నా, అప్రమత్తంగా ఉన్న భేదమేమీ లేదు. కానీ నీవు నన్ను నిందిస్తున్నావు. (17)
వి: సం: శత్రువులు మత్తులో ఉన్నప్పుడో, బెదిరినప్పుడో, పారిపోతున్నప్పుడో చంపకూడదు కానీ ఆ నియమం మృగాలకు వర్తించదని పాండురాజు భావం. (నీల)
మృగ ఉవాచ
నాహం ఘ్నంతం మృగాన్ రాజన్ విగర్హే చాత్మకారణాత్ ।
మైథునం తు ప్రతీక్ష్యం మే త్వయేహాద్యానృశంస్యతః ॥ 18
మృగమిలా అన్నది రాజా! నీవు నన్ను కొట్టావు కాబట్టి నీవు మృగాలను హింసిస్తున్నావని నిన్ను నిందించటం లేదు. కానీ నీవు దయామయుడవై మైథున కర్మ విరమించునంతవరకు ఆగి ఉండవలసినది అన్నదే నా భావం. (18)
సర్వభూతహితే కాలే సర్వభూతేప్సితే తథా ।
కో హి విద్వాన్ మృగం హన్యాత్ చరంతం మైథునం వనే ॥ 19
సర్వప్రాణులకూ హితకరమైన, అభీష్టమైన వేళలో వనంలో జతగట్టి ఉన్న మృగాన్ని వివేకవంతుడెవడైనా సంహరిస్తాడా? (19)
అస్యాం మృగ్యాం చ రాజేంద్ర హర్షాత్ మైథునమాచరమ్ ।
పురుషార్థఫలం కర్తుం తత్ త్వయా విఫలీకృతమ్ ॥ 20
రాజేంద్రా! నేను కామరూపమయిన పురుషార్థాన్ని సఫలం చేసికోవాలని ఆనందంతో ఈ ఆడుజింకతో జతగట్టి ఉన్న వేళలో - దాన్ని నిష్ఫలం చేశావు. (20)
పౌరవాణాం మహారాజ తెషామక్లిష్టకర్మణామ్ ।
వంశే జాతస్య కౌరవ్య నానురూపమిదం తవ ॥ 21
కౌరవ్యా! మహారాజా! ఇతరులను ఇబ్బంది పెట్టని పనులనే చేయటంలో ప్రసిద్ధిచెందిన పురువంశంలో పుట్టిన నీకు ఈపని తగినది కాదు. (21)
నృశంసం కర్మ సుమహత్ సర్వలోకవిగర్హితమ్ ।
అస్వర్గ్యమయశస్యం చాప్యధర్మిష్ఠం చ భారత ॥ 22
భారతా! అత్యంతమూ క్రూరమైన పనిని లోకమంతా నిందిస్తుంది. అది స్వర్గాన్నీ, కీర్తినీ కూడా దూరం చేస్తుంది. అది పాపకృత్యం కూడా. (22)
స్త్రీభోగానాం విశేషజ్ఞః శాస్త్రధర్మార్థతత్త్వవిత్ ।
నార్హస్త్వ్యం సురసంకాశ కర్తుమస్వర్గ్యమీదృశమ్ ॥ 23
దేవసమానుడవయిన మహారాజా! నీవు స్త్రీభోగాలను గురించి బాగా తెలిసినవాడవు. శాస్త్రీయమైన ధర్మార్థాల తత్త్వమెరిగినవాడవు. అటువంటినీవు నరకప్రాప్తి హేతువయిన ఇటువంటి పనిని చేయదగదు. (23)
త్వయా నృశంసకర్తారః పాపాచారాశ్చ మానవాః ।
నిగ్రాహ్యాః పార్థివశ్రేష్ఠ త్రివర్గపరివర్జితాః ॥ 24
రాజశ్రేష్ఠా! నీవు ధర్మార్థకామాలను విడనాడి క్రూరకర్మలనాచరించే పాపిష్ఠమానవులను దండించాలి. (24)
కిం కృతం తే నరశ్ఱేష్ట మామిహానాగసం ఘ్నతా ।
మునిం మూలఫలాహారం మృగవేషధరం నృప ॥ 25
వసమానమరణ్యేషు నిత్యం శమపరాయణమ్ ।
త్వయాహం హింసితో యస్మాత్ తస్మాత్ త్వామప్యహం శపే ॥ 26
మానవోత్తమా! రాజా! వేళ్ళనూ, పండ్లనూ తిని జీవించే మునిని నేను. మృగవేషాన్ని ధరించి నిత్యమూ శమపరాయణుడనై అరణ్యాలలో నివసించేవాడిని. ఏ తప్పు చేయనివాడను. నన్ను కొట్టి నీవు ఏమి సాధించావు? నీవు నన్ను హింసించావు. కాబట్టి దానికి ప్రతిగా నిన్ను శపిస్తున్నాను. (25,26)
ద్వయోర్నృశంసకర్తారమ్ అవశం కామమోహితమ్ ।
జీవితాంతకరో భావః ఏవమేవాగమిష్యతి ॥ 27
నీవు జతగూడిన ఒక జంటను హత్యచేశావు. నీవు కూడా అవశుడవై, కామమోహితుడవైన వేళలో ఇదేవిధంగా మైధునాసక్తిని ప్రకటించినప్పుడే జీవితాన్ని ముగింపు జేయగల మృత్యువు నిన్ను ఆక్రమిస్తుంది. (27)
అహం హి కిందమో నామ తపసా భావితో మునిః ।
వ్యపత్రపన్మనుష్యాణాం మృగ్యాం మైథునమాచరమ్ ॥ 28
మృగో భూత్వా మృగైః సార్ధం చరామి గహనే వనే ।
న తు తే బ్రహ్మహత్యేయం భవిష్యత్యవిజావతః ॥ 29
నా పేరు కిందముడు. నేను తపోదీక్షితుడను. కాబట్టి మానవశరీరంతో ఈపని చేయటానికి సిగ్గుపడ్డాను. అందుకనే మృగరూపాన్ని ధరించి నాభార్యతోనే జతకట్టితిని. మృగరూపంతో మృగాలతో కలిసి ఈ కీకారణ్యంలో తిరుగుతున్నాను. ఈవిషయం నీవెరుగవు కాబట్టి నన్ను చంపినందువలన బ్రహ్మహత్యాపాతకం నీకంటదు. (28,29)
మృగరూపధరం హత్వా మామేవం కామమోహితమ్ ।
అస్య తు త్వం ఫలం మూఢ ప్రాప్స్యసీదృశమేవ హి ॥ 30
కానీ మృగరూపాన్ని ధరించి, కామమోహితుడవై ఉన్న నన్ను సంహరించావు. కాబట్టి దాని ఫలితాన్ని మాత్రం తప్పక అనుభవిస్తావు. మూర్ఖుడా! నీవు చేసిన ఈపనికి ఇటువంటి ఫలితాన్నే పొందగలవు. (30)
ప్రియయా సహ సంవాసం ప్రాప్య కామవిమోహితః ।
త్వమప్యస్యామవస్థాయాం ప్రేతలోకం గమిష్యసి ॥ 31
నీవు కూడా కామమోహితుడవై భార్యతో సంగమించబోవు వేళలో - ఇప్పటి నా అచస్థవంటి అవస్థలో యమలోకానికి వెళ్ళుదువు గాక! (31)
అంతకాలే హి సంవాసం యయా గంతాసి కాంతయా ।
ప్రేతరాజపురం ప్రాప్తం సర్వభూతదురత్యయమ్ ।
భక్త్యా మతిమతాం శ్రేష్ఠ సైవ త్వానుగమిష్యతి ॥ 32
బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా! నీవు చరమదశలో ఏభార్యతో సంగమిస్తావో, ఆమెయే సమస్తప్రాణులకు దుర్గమమయిన యమలోకానికి నీవు వెళ్ళినపుడు భక్తితో నిన్ను అనుసరించగలదు. (32)
వర్తమానః సుఖే దుఃఖం యథాహం ప్రాపితస్త్వయా ।
తథా త్వాం చ సుఖం ప్రాప్తం దుఃఖమభ్యాగమిష్యతి ॥ 33
సుఖంగా ఉన్న నన్ను దుఃఖానికి చేరువ చేశావు. ఇదే విధంగా నీవుకూడా సుఖాన్ని అనుభవించబోవు వేళలో దుఃఖం నిన్ను ముంచెత్తుతుంది. (33)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా సుదుఃఖార్తః జీవితాత్ స వ్యముచ్యత ।
మృగః పాండుశ్చ దుఃఖార్త క్షణేన సమపద్యత ॥ 34
వైశంపాయనుడిలా అన్నాడు. ఈమాటలు అని మృగరూపథారి అయిన ఆముని దుఃఖితుడై ప్రాణాలు విడిచాడు. ఆక్షణంలోనే పాండురాజు కూడా దుఃఖార్తుడయ్యాడు. (34)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పాండుమృగశాపే సప్తదశాధిక శతతమోఽధ్యాయః ॥ 117 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పాండు మ్ఱ్రుగశాపమను నూట పదునేడవ అధ్యాయము. (117)