118. నూట పదునెనిమిదవ అధ్యాయము
పాండురాజు అనుతాపము - వానప్రస్థస్వీకారము.
వైశంపాయన ఉవాచ
తం వ్యతీతమతిక్రమ్య రాజా స్వమివ బాంధవమ్ ।
సభార్యః శోకదుఃఖార్త పర్యదేవయదాతురః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ కిందమముని మరణించిన తర్వాత పాండురాజు ముందుకు సాగుతూ తన బంధువులే దురమైనట్లుగా ఇల్లాండ్రతో కలిసి దుఃఖిస్తూ ఈవిధంగా విలపించసాగాడు. (1)
పాండురువాచ
సతామపి కులే జాతాః కర్మణా బత దుర్గతిమ్ ।
ప్రాప్నువంత్యకృతాత్మానః కామజాలవిమోహితాః ॥ 2
పాండురాజు ఇలా అంటున్నాడు. సజ్జనుల వంశంలో పుట్టినవాడయినా ఆత్మనియంత్రణను కోల్పోయి, కామునివలలో చిక్కి విమోహితుడై దుఃస్థితికి లోనవుతున్నాడు. అయ్యో! (2)
శశ్వద్ధర్మాత్మనా జాతః బాల ఏవ పితా మమ ।
జీవితాంతమనుప్రాప్తః కామాత్మైవేతి నః శ్రుతమ్ ॥ 3
నిత్యమూ ధర్మబద్ధమయిన మనస్సుగల శంతనునకు జన్మించి నాతండ్రి విచిత్రవీర్యుడు కామాసక్తి కారణంగానే చిన్న వయస్సులోనే మరణించాడని అంటుంటారు. (3)
తస్య కామాత్మనః క్షేత్రే రాజ్ఞః సంయతవాగృషిః ।
కృష్ణద్వైపాయనః సాక్షాత్ భగవాన్ మామజీజనత్ ॥ 4
ఆవిధంగా కామాసక్తుడయిన నరపాలుని భార్య యందే వాఙ్నియతిగల వ్Yఆసమహర్షి -భగవత్స్యరూపుడు - నన్ను కన్నాడు. (4)
తస్యాద్య వ్యసనే బుద్ధిః సంజాతేయం మమాధమా ।
త్యక్తస్య దేవైరనయాత్ మృగయాం పరిధావతః ॥ 5
నేను వేట అనే వ్యసనంలో పడ్డాను. ఆకారణంగా దేవతలు నన్ను వదిలి వేశారు. అటువంటి ఉన్నత వంశంలో జన్మించిన నాబుద్ధికూడా మ్ఱ్రుగయాసక్తి వలన అధమస్థాయికి దిగజారింది. (5)
మోక్షమేవ వ్యవస్యామి బంధో హి వ్యసనం మహత్ ।
సువృత్తిమనువర్తిష్యే తామహం పితురవ్యయామ్ ॥ 6
మోక్షమార్గమే నాకిప్పుడు తగినదని భావిస్తున్నాను. బంధాలే మహాధుఃఖాలు. కాబట్టి నేను నాతండ్రివలె అక్షయమై, పుణ్యహేతువయిన వృత్తినే ఆశ్రయిస్తాను (అనుసరిస్తాను). (6)
అతీవ తపసాఽఽత్మానం యోజయిష్యామ్యసంశయమ్ ।
తస్మాదేకోఽహమేకాకీ ఏకైకస్మిన్ వనస్పతౌ ॥ 7
చరన్ భైక్ష్యం మునిర్ముండః చరిష్యామ్యాశ్రమానిమాన్ ।
పాంసునా సమవచ్ఛన్నః శూన్యాగారకృతాలయః ॥ 8
నేను పూర్తిగా తపస్సులోనే లీనమవుతాను. దీనిలో సందేహం లేదు. కాబట్టి నేను ఒంటరినై కుటుంబానికి కూడా దూరమై ఒక్కొక్కచెట్టు నుండి భిక్షనుపొందుతాను.
తలగొరిగించుకొని, మౌనసంవ్యాసినై వానప్రస్థుల ఆశ్రమాలలో సంచరిస్తాను. అప్పుడు నాశరీరం ధూళిధూసరితమవుతుంది. ఏకాంతప్రదేశం నానిపాసస్థానమవుతుంది. (7,8)
వృక్షమూలనికేతో వా త్యక్తసర్వప్రియాప్రియః ।
న శోచన్ న ప్రహృష్యంశ్చ తుల్యనిందాత్మసంస్తుతిః ॥ 9
లేదా చెట్లక్రిందనే నివసిస్తాను. ఇష్టానిష్టాల నన్నింటినీ వదలివెస్తాను. నష్టపడినా దుఃఖించను. లాభపడినా ఆనందించను. నిందాస్తుతులను సమానంగానే స్వీకరిస్తాను. (9)
నిరాశీర్నిర్నమస్కారః నిర్ద్వంద్యో నిష్పరిగ్రహః ।
న చాప్యవహసన్ కచ్చిత్ న కుర్వన్ భ్రుకుటీం క్వచిత్ ॥ 10
నాకు ఆశీస్సులూ అవసరం లేదు. నమస్కారాలూ అవసరం లేదు. సుకదుఃఖాది ద్వంద్వాలతో నిమిత్తంలేదు. దేనినీ యాచించను. ఎవ్వరినీ హేళన చేయను. ఎప్పుడూ కోపంగా బొమముడి వేయను కూడా. (10)
ప్రసన్నవదనో నిత్యం సర్వభూతహితే రతః ।
జంగమాజంగమం సర్వమ్ అవిహింసంశ్చతుర్విధమ్ ॥ 11
నేను ప్రసన్నవదనంతో సర్వప్రాణిహితాన్ని కోరుతూ ప్రవరిస్తాను. స్వేదజాలు, భూజాలు, అండజాలు, జరాయుజాలు అనే నాల్గురకాల చరాచరప్రాణులనూ హింసించకుండా చరిస్తాను. (11)
స్వాసు ప్రజాస్విన సదాం సమః ప్రాణభృతాం ప్రతి ।
ఏకకాలం చరన్ భైక్ష్యం కులాని దశ పంచ వా ॥ 12
తండ్రి తన బిడ్డలను అందరినీ సమభావంతో చూచినట్లు ప్రాణులన్నింటినీ సమాన దృష్టితో చూస్తాను. ఒక్కసారి మాత్రమే భిక్షను చెట్లనుండీ స్వీకరిస్తాను. లేకపోతే అయిదు లేక పది ఇళ్ళ నుండి మాత్రమే భిక్షను స్వీకరిస్తాను. (12)
అసంభవే వా భైక్షస్య చరన్ననశనాన్యపి ।
అల్పమల్పం చ భుంజానః పూర్వాలాభే న జాతుచిత్ ॥ 13
అన్యాన్యపి చరన్ లోభాత్ అలాభే సప్త పూరయన్ ।
అలాభే యది వా లాభే సమదర్శీ మహాతపాః ॥ 14
భిక్ష దొరకకపోతే ఉపవాసముంటాను. భిక్ష దొరికినప్పుడు కూడా చాలా తక్కువగానే భుజిస్తాను. మొదటి పద్ధతిలో భిక్ష దొరకనప్పుడు మాత్రమే మార్గాంతరాన్ని స్వీకరిస్తాను. ఆశకొద్దీ ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తను. ఎప్పుడైనా, ఎక్కడైనా తరువులనుండి భిక్ష దొరకనప్పుడు ఏడు ఇండ్ల దగ్గరకే భిక్షకై వెళతాను. భిక్ష దొరికినా దొరకకపోయినా సమానంగానే భావిస్తూ తీవ్రంగా తపస్సు చేస్తాను. (13,14)
వాస్యైకం తక్షతో బాహుం చందనేనైకముక్తతః ।
నాకళ్యాణం న కళ్యాణం చింతయన్నుభయోస్తయోః ॥ 15
న జిజీవిషువత్ కించిత్ న ముమూర్షువదాచరన్ ।
జీవితం మరణం చైవ నాభినందన్ న చ ద్విషన్ ॥ 16
కత్తితో చేతిని నరికినవానినైనా, చందనంతో చేతిని అలంకరించినవానివైనా సమానంగానే చూస్తాను. చెడ్డవాడు, మంచివాడు అన్న భేదదృష్టితో చూడను. జీవించాలన్న కోరిక గానీ, మరణించాలన్న తపనగానీ లేకుండా జీవిస్తాను. జీవితాన్ని అభినందించను. మరణాన్ని ద్వేషించను. (15,16)
యాః కాశ్చిజ్జీవతా శక్యాః కర్తుమభ్యుదయక్రియాః ।
తాః సర్వాః సమతిక్రమ్య నిమేషాదివ్యవస్థితాః ॥ 17
తాసు చాప్యనవస్థామ త్యక్తసర్వేంద్రియక్రియః ।
సంపరిత్యక్తధర్మార్థః సునిర్ణిక్తాత్మకల్మషః ॥ 18
మనిషి తాను జీవిస్తూ అభ్యుదయప్రాప్తికై కామ్యకర్మల నెన్నింటినో చేస్తుంటాడు. అవి కాలానికి అధీనమైనవి. అటువంటి వాటి నన్నింటినీ విడిచివెస్తాను. అనిత్యఫలాలనిచ్చే ఇంద్రియకర్మల నన్నింటినీ పరిత్యజిస్తాను. ధర్మఫలాన్ని కూడా విడిచిపెడతాను. అంతః కరణమాలిన్యాన్ని తొలగించుకొని జీవిస్తాను. (17,18)
నిర్ముక్తః సర్వపాపేభ్యః వ్యతీతః సర్వవాగురాః ।
న వశే కస్యచిత్ తిష్ఠన్ సధర్మా మాతరిశ్వనః ॥ 19
సర్వపాప విముక్తడనై, సర్వబంధాలను వదలించికొని, ఎవ్వరి అదుపులోనూ నిలువక వాయుదేవునివలె సంచరిస్తాను. (19)
ఏతయా సతతం ధృత్వా చరన్నేవం ప్రకారయా ।
దేహం సంస్థాపయిష్యామి నిర్భయం మార్గమాస్థితః ॥ 20
ఎల్లప్పుడూ సర్వవిధాలా ధైర్యాన్ని వహించి నిర్భయమయిన మోక్షమార్గాన్ని ఆశ్రయించి ఈ శరీరాన్ని పరిత్యజిస్తాను. (20)
నాహం సుకృపణే మార్గే స్వవీర్యక్షయశోచితే ।
స్వధర్మాత్ సతతాపేతే చరేయం వీర్యవర్జితః ॥ 21
నేను బిడ్డలను కనే శక్తిని కోల్పోయాను. నాజీవితం, నాగృహస్థాశ్రమం కూడా దయనీయస్థితికి వచ్చాయి. స్వధర్మానికి దూరమయిన ఈ శోచనీయదశలో నేను నడవలేను. (21)
సత్కృతోఽసత్కృతో వాపి యోఽన్యం కృపణచక్షుషా ।
ఉపైతి వృత్తిం కామాత్మా స శునాం వర్తతే పథి ॥ 22
గొప్పవాడయినా, సామాన్యుడయినా సరే దీనభావంతో జీవికమీది ఆశతో ఇతరులను ఆశ్రయించినవాడు కుక్కవంటివాడు. (22)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా సుదుఃఖార్తః నిఃశ్వాసపరమో నృపః ।
అవేక్షమాణః కుంతీం చ మాద్రీం స సమభాషత ॥ 23
వైశంపాయనుడిలా అన్నాడు. పాండురాజు ఈవిధంగా పలికి దుఃఖిస్తూ, నిట్టూర్చుతూ కుంతిని, మాద్రిని చూపీస్తూ ఇలా అన్నాడు. (23)
కౌసల్యా విదురః క్షత్తా రాజా చ సహ బంధుభిః ।
ఆర్యా సత్యవతీ భీష్మః తే చ రాజపురోహితాః ॥ 24
బ్రాహ్మణాశ్చ మహాత్మానః సోమపాః సంశితవ్రతాః ।
పౌరవృద్ధాశ్చ యే తత్ర నివసంత్యస్మదాశ్రయాః ।
ప్రసాద్య సర్వే వక్తవ్యాః పాండుః ప్రవ్రజితో వనమ్ ॥ 25
(మీరు హస్తినకు పోయి) అంబిక, అంబాలికలను, విదురుని, సంజయుని, సంబాంధవుడైన ధ్ఱ్రుతరాష్ట్రునీ, సత్యవతిని, భీష్మునీ, రాజపురోహితులనూ, దీక్షితులూ, సోమయాజులూ మహాత్ములూ అయిన బ్రాహ్మణులనూ, వృద్ధపౌరులనూ, మనలనాశ్రయించి జీవిస్తున్న అందరినీ ప్రసన్నులను చేసికొని "పాండురాజు సన్యాసియై అడవులకు వెళ్ళాడ'ని చెప్పండి. (24,25)
నిశమ్య వచనం భర్తుః వనవాసే ధృతాత్మనః ।
తత్సమం వచనం కుంతీ మాద్రీ చ సమభాషతామ్ ॥ 26
వానప్రస్థానికై గట్టిగా నిశ్చయించుకొనిన భర్త మాటలను విని కుంతీ, మాద్రి ఆయన మాటలకు తగినట్లుగా ఇలా సమాధానమిచ్చారు. (26)
అన్యేఽపి హ్యాశ్రమాః సంతి యే శక్యా భరతర్షభ ।
ఆవాభ్యాం ధర్మాపత్నీభ్యాం సహ తప్తుం తపో మహత్ ॥ 27
భరతశ్ఱేష్ఠా! సంన్యాసం కాక ఇతరాశ్రమాలు కూడా ఉన్నాయి. వాటి నాశ్రయించి ధర్మపత్నులమయిన మాతో బాటు మీరు తీవ్రతపస్సును చేయవచ్చు. (27)
ఏకాంతశీలీ విమృశన్ పక్వాపక్వేన వర్తయన్ ।
పితౄన్ దేవాంశ్చ వన్యేన వాగ్భిరద్భిశ్చ తర్పయన్ ॥ 35
చలికీ, గాలికీ, ఎండకూ తట్టుకొంటాను. ఆకలిదప్పులను పరిగణించను. దుష్కరతపస్సుతో ఈ శరీరాన్ని కృశింపజేస్తాను. ఒంటరినై పర్యాలోచన చేస్తాను. కందమూలాలతోనూ, పండ్లతోనూ బ్రతుకుతాను. పితరులనూ, దేవతలనూ అడవులలో దొరకే పదార్థాలతోనూ, నీటితోనూ, మంత్రాలతోనూ తృప్తి పరుస్తాను. (34,35)
వానప్రస్థజనస్యాపి దర్శనం కులవాసినామ్ ।
నాప్రియాణ్యాచరిష్యామి కిం పునర్గ్రామవాసినామ్ ॥ 36
వానప్రస్థాశ్రమంలోని వారిని కానీ, గృహస్థులను కానీ చూడను. వారికి అప్రియమయిన పనులు చేయను. ఇక గ్రామవాసుల విషయం చెప్పేదేముంది? (36)
ఏవమారణ్యశాస్త్రాణామ్ ఉగ్రముగ్రతరం విధిమ్ ।
కాంక్షమాణోఽహమాస్థాస్యే దేహస్యాస్యాసమాపనాత్ ॥ 37
ఈరీతిగా నేను వానప్రస్థాశ్రమానికి సంబంధించిన కఠిన నియమాలను అన్నింటినీ పాటిస్తూ, దేహయాత్ర ముగిసేవరకూ వానప్రస్థాశ్రమంలోనే జీవిస్తాను. (37)
వైశంపాయన ఉవాచ
ఇత్యేవముక్త్వా భార్యే తే రాజా కౌరవనందనః ।
తతశ్చూడామణిం నిష్కమ్ అంగదే కుండలాని చ ॥ 38
వాసాంసి చ మహార్హాణి స్త్రీణామాభరణాని చ । వ్
ప్రదాయ సర్వం విప్రేభ్యః పాండుః పునరభాషత ॥ 39
వైశంపాయనుడిలా అన్నాడు. పాండురాజు తన భార్యలతో ఆ విధంగా పలికి తన చూడామణిని, వక్షోలంకారాన్నీ, అంగదాలనూ, కుండలాలనూ, విలువయిన వస్త్రాలనూ, కుంతీమాద్రుల ఆభరణాలనూ బ్రాహ్మణులకు దానంచేసి మరలా ఇలా అన్నాడు. (38,39)
గత్వా నాగపురం వాచ్యం పాండుః ప్రవ్రజితో వనమ్ ।
అర్థం కామం సుఖం చైవ రతిం చ పరమాత్మికామ్ ॥ 40
ప్రతస్థే సర్వముత్సృజ్య సభార్యః కురునందనః ।
మీరు హస్తినాపురానికి వెళ్ళి కురునందనుడైన పాండురాజు అర్థకామాలనూ, విషయసుఖాన్నీ, స్త్రీ సంబంధమయిన రతిసుఖాన్నీ, అన్నీ విడిచి భార్యలతో కలిసి వానప్రస్థుడు అయ్యాడని చెప్పండి. (40 1/2)
తతస్తస్యానుయాతారః తే చైవ పరిచారకాః ॥ 41
శ్రుత్వా భరతసింహస్య వివిధాః కరుణా గిరః ।
భీమమార్తస్వరం కృత్వా హాహేతి పరిచుక్రుశుః ॥ 42
అప్పుడు అతని అనుయాయులు, పరిచారకులూ అందరూ ఆ పాండురాజుయొక్క విషణ్ణవచనాలను విని పెద్దగా ఆర్తనాదం చేస్తూ హాహాకారాలు చేశారు. (41,42)
ఉష్ణమశ్రు విముంచంతః తం విహాయ మహీపతిమ్ ।
యుయుర్నాగపురం తూర్ణం సర్వమాదాయ తద్ ధనమ్ ॥ 43
వారు వేడికన్నీటిని విడుస్తూ, ఆపాండురాజిచ్చిన ధనమంతా తీసికొని ఆయనను వీడి వెంటనే హస్తినాపురానికి బయలుదేరారు. (43)
తే గత్వా నగరం రాజ్ఞః యథావృత్తం మహాత్మనః ।
కథయాంచక్రిరే రాజ్ఞః తద్ ధనం వివిధం దదుః ॥ 44
వారు నగరానికి పోయి, మహాత్ముడైన పాండురాజు వృత్తాంతాన్ని అంతా ధృతరాష్ట్రమహారాజుకు తెలిపి ఆధనమంతా ఇచ్చారు. (44)
శ్రుత్వా తేభ్యః తతః సర్వం యథావృత్తం మహావనే ।
ధృతరాష్ట్రో నరశ్రేష్ఠః పాండుమేవాన్వశోచిత ॥ 45
అరణ్యంలో జరిగిన సమాచారమంతా వారు చెప్పగా విన్న ధృతరాష్ట్రమహారాజు పాండురాజును గూర్చి చాలా దుఃఖించాడు. (45)
న శయ్యాసనభోగేషు రతిం విందతి కర్హిచిత్ ।
భ్రాతృశోకసమావిష్టః తమేవార్థం విచింతయన్ ॥ 46
ఆపాండురాజు సంగతినే ఆలోచిస్తూ, ఆభ్రాతృశోకంతో ధృతరాష్ట్రుడు శయ్యాసౌఖ్యాన్ని కానీ, ఆసనసౌఖ్యాన్నీ కానీ, ఇతరసుఖాలను కానీ బొత్తిగా ఇష్టప్డలేదు. (46)
రాజపుత్రస్తు కౌరవ్య పాండుర్మూలఫలాశనః ।
జగామ సహ పత్నీభ్యాం తతో నాగశతం గిరిమ్ ॥ 47
కౌరవ్యా! రాజకుమారుడయిన పాండురాజు ఫలమూలాలను తింటూ భార్యలతో సహా నాగశతపర్వతానికి వెళ్ళిపోయాడు. (47)
స చైత్రరథమాసాద్య కాలకూటమతీత్య చ ।
హిమవంతమతిక్రమ్య ప్రయయౌ గంధమాదనమ్ ॥ 48
హిమవంతమతిక్రమ్య ప్రయయౌ గంధమాదనమ్ ॥ 48
ఆ తర్వాత చైత్రరథమనే అరణ్యంలో కాలకూట, హిమవత్పర్వతాలను దాటి గంధమాదవ పర్వతాన్ని చేరాడు. (48)
రక్ష్యమాణో మహాభూతైః సిద్ధైశ్చ పరమర్షిభిః ।
ఉవాస స మహారాజ సమేషు విషమేషు చ ॥ 49
ఇంద్రుద్యుమ్నసరః ప్రాప్య హంసకూటమతీత్య చ ।
శతశృంగే మహారాజ తాపసః సమతప్యత ॥ 50
అక్కడ మహాభూతాలు, సిద్ధులూ, మహర్షులూ ఆయనకు రక్షకులయ్యారు. ఆ మహారాజు మిట్టపల్లాలపై నివసించ సాగాడు. మహారాజా! ఆపై ఇంద్రద్యుమ్న సరస్సు చేరి, హంసకూటాన్ని అతిక్రమించి, శతశృంగ పర్వతాన్ని చేరి తాపసియై తపస్సు చేయసాగాడు. (49,50)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పాండుచరితే అష్టాదశాధిక శతతమోఽధ్యాయః ॥ 118 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పాండుచరితమను నూటపదునెనిమిదవ అధ్యాయము. (118)