119. నూట పందొమ్మిదవ అధ్యాయము

పుత్రప్రాప్తికై ప్రయత్నించుమని పాండురాజు కుంతి నాదేశించుట.

వైశంపాయన ఉవాచ
తత్రాసి తపసి శ్రేష్ఠే వర్తమానః స వీర్యమాన్ ।
సిద్ధచారణసంఘానాం బభూవ ప్రియదర్శనః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ శతశృంగ పర్వతంపై కూడా గొప్ప తపస్సు చేస్తున్న ఆవీరుడు - పాండురాజు - సిద్ధచారణ సమూహాలకు కన్నుల పండువు అయ్యాడు. (1)
శుశ్రూషురవహంవాదీ సంయతాత్మా జితేంద్రియః ।
స్వర్గం గంతుం పరాక్రాంతః స్వేన వీర్యేణ భారత ॥ 2
జనమేజయా! ఆపాండురాజు పెద్దలనూ సేవిస్తూ, అహంకారాన్ని వీడి, మనస్సునూ ఇంద్రియాలనూ అదుపులో నిలిపికొని, తన శక్తితోనే స్వర్గలోకాన్ని పొందటానికి ఉద్యుక్తుడయ్యాడు. (2)
కేషాంచిదభవద్ భ్రాతా కెషాంచిదభవత్ సఖా ।
ఋషయస్త్వపరే చైవం పుత్రవత్ పర్యపాలయన్ ॥ 3
కొందరికి తోబుట్టువులా కనిపించాడు. కొందరికి మిత్రుడయ్యాడు. మరికొంతమంది మహర్షులు ఆయనను కన్నబిడ్డగా భావించి కాపాడసాగారు. (3)
స తు కాలేవ మహతా ప్రాప్య నిష్కల్మషం తపః ।
బ్రహ్మర్షిసదృశః పాండుః బభూవ భరతర్షభ ॥ 4
భరతశ్రేష్ఠా! జనమేజయా! ఆ పాండురాజు చాలాకాలం నిష్కల్మషంగా తపస్సు చేసి బ్రహ్మర్షులతో సమానుడయ్యాడు. (4)
అమావాస్యాం తు సహితాః ఋషయః సంశితవ్రతాః ।
బ్రహ్మాణం ద్రష్టుకామాస్తే సంప్రతస్థుర్మహర్షయః ॥ 5
ఒక అమావాస్యనాడు వ్రతదీక్షలు గల మహర్షులు అందరూ కలిసి బ్రహ్మను సందర్శించాలన్న కోరికతో బ్రహ్మలోకానికి బయలుదేరారు. (5)
సంప్రయాతాన్ ఋషీన్ దృష్ట్వా పాండుర్వచనమబ్రవీత్ ।
భవంతః క్వ గమిష్యంతి బ్రూత మే వదతాం వరాః ॥ 6
ప్రయాణమయిన ఋషులను చూసి పాండురాజు "ప్రవక్తలలో శ్రేష్ఠులయిన మీరు ఎక్కడకు వెళ్తున్నారు" అని వారిని అడిగాడు.- (6)
ఋషయ ఊచుః
సమవాయో మహానద్య బ్రహ్మలోకే మహాత్మనామ్ ।
దేవానాం చ ఋషీణాం చ పితౄణాం చ మహాత్మనామ్ ।
వయం తత్ర గమిష్యామః ద్రష్టుకామాః స్వయంభువమ్ ॥ 7
ఋషులు ఇలా అన్నారు. నేడు బ్రహ్మలోకంలో పెద్దసభ జరుగుతోంది. మహాత్ము లయిన దేవతలు, పితరులు అందరూ కలుస్తున్నారు. బ్రహ్మదేవుని చూడాలని మేముకూడా అక్కడకు వెళ్తున్నాము. (7)
వైశంపాయన ఉవాచ
పాండురుత్థాయ సహసా గంతుకామో మహర్షిభిః ।
స్వర్గపారం తితీర్షుః సః శతశృంగాదుదఙ్ ముఖః ॥ 8
ప్రతస్థే సహ పత్నీభ్యామ్ అబ్రువంస్తం చ తాపసాః ।
ఉపర్యుపరి గచ్ఛంతః శైలరాజముదఙ్ ముఖాః ॥ 9
వైశంపాయనుడిలా అన్నాడు. వెంటనే పాండురాజు లేచి మహర్షులతో కూడా వెళ్ళదలచుకొన్నాడు. స్వర్గలోకపు అంచులను దాటి
పోవాలని శతశృంగం నుండి భార్యలతో పాటు ఉత్తరాభిముఖుడై బయలుదేరాడు. అది చూచి ఉత్తరానికి వెళ్తున్న మహర్షులు ఆయనతో ఇలా అన్నారు. (8,9)
దృష్టవంతో గిరౌ రమ్యే దుర్గాన్ దేశాన్ బహూన్ వయమ్ ।
విమానశతసంబాధాం గీతస్వరనినాదితామ్ ॥ 10
ఆక్రీడభూమిం దేవానాం గంధర్వాప్సరసాం తథా ।
ఉద్యానాని కుబేరస్య సమాని విషమాణీ చ ॥ 11
మహారాజా! ఈ రమణీయ పర్వతంపై మేము చొరరాని ప్రదేశాలను ఎన్నింటినో చూశాము. ఇది దేవతలకు, గంధర్వులకు, అప్సరసలకు విహారభూమి. వందలకొలది విమానాలు ఇక్కడ తిరుగుతుంటాయి. మధురగీతాలు నినదిస్తుంటాయి. కుబేరుని ఉద్యానవనాలు ఇక్కడ ఉంటాయి. అవి మిట్టపల్లాలుగా ఉంటాయి. (10,11)
మహానదీనితంబాంశ్చ గహనాన్ గిరిగహ్వరాన్ ।
సంతి నిత్యహిమా దేశాః నిర్వృక్షమృగపక్షిణః ॥ 12
పెద్దపెద్ద నదుల తీరాలూ, గహనమైన కొండగుహలు ఇక్కడుంటాయి. ఎప్పుడూ మంచుతో నిండి చెట్లు, పక్షులూ, జంతువులు కూడా లేని ప్రదేశాలుంటాయి. (12)
సంతి క్వచిన్మహాదర్యః దుర్గాః కాశ్చిద్ దురాపదాః ।
నాతిక్రామేత పక్షీ యాన్ కుత ఏవేతరే మృగాః ॥ 13
కొన్నిచోట్ల పెద్దపెద్ద గుహలు. వాటిని దాటటం కష్టం. కొన్ని గుహల దగ్గరకు వెళ్ళటం కూడా కష్టం. పక్షులు కూడా వాటినతిక్రమించలేవు. ఇక ఇతరజంతువుల గూర్చి చెప్పవలసిన దేముంటుంది? (13)
వాయురేకో హి యాత్యత్ర సిద్ధాశ్చ పరమర్షయః ।
గచ్ఛంత్యౌ శైలరాజేఽస్మిన్ రాజపుత్ర్యౌ కథం త్విమే ॥ 14
న సీదేతామదుఃఖార్హే మా గమో భరతర్షభ ।
గాలి మాత్రమే అక్కడ చొరబడగలదు. సిద్ధులూ, పరమ ఋషులు కూడా ప్రవేశించగలరు. అటువంటి ఈ కొండపై ఈ రాజకుమారికలు - కుంతిమాద్రులు - ప్రయాణిస్తూ తట్టుకోవడం కష్టం. భరతశ్రేష్ఠా! వీరిని కష్టపెట్టవద్దు. ప్రయాణం మానుకో. (14 1/2)
వి: సం: సిద్ధాశ్చ పరమర్షయః = ఋణచతుష్టయం నుండి ముక్తిపొందిన వారు సిద్ధులు, దివ్యజ్ఞానంగల వారు పరమర్షులు, సిద్ధులయిన పరమర్షులు. (నీల)
పాండురువాచ
అప్రజస్య మహాభాగాః న ద్వారం పరిచక్షతే ॥ 15
స్వర్గే తేనాభితప్తోఽహమ్ అప్రజస్తు బ్రవీమి వః ।
పిత్ర్యాదృణాదనిర్ముక్తః తేన తప్యే తపోధనాః ॥ 16
పాండురాజు ఇలా అన్నాడు. మహానుభావులారా! సంతానహీనునకు స్వర్గలోక ద్వారం మూయబడి ఉంటుందని అంటారు. నేను కూడా సంతానం లేనివాడిని. అది నన్ను బాధిస్తోంది. నేనింత వరకు పితౄణం నుండి విముక్తిని పొందలేదు. దానితో కలత పడుతున్నాడు. మీకు నివేదిస్తున్నాను. (15,16)
దేహనాశే ధ్రువో నాశః పితౄణామేష నిశ్చయః ।
ఋణైశ్చతుర్భిః సంయుక్తాః జాయంతే మానవా భువి ॥ 17
నా శరీరం నశించిన తర్వాత నా పితరులు కూడా పతితులు కాగలరు. మనిషి నాల్గు ఋణాలతో కలిసి ఈ లోకంలో జన్మిస్తాడు. (17)
పితృదేవర్షిమనుజైః దేయం తేభ్యశ్చ ధర్మతః ।
ఏతాని తు యథాకాలం యో న బుధ్యతి మానవః ॥ 18
న తస్య లోకాః సంతీతి ధర్మవిద్భిః ప్రతిష్ఠితమ్ ।
యజ్ఞైస్తు దేవాన్ ప్రీణాతి స్వాధ్యాయతపసా మునీన్ ॥ 19
అవి పితృ ఋణం, దేవ ఋణం, ఋషి ఋణం, మనుష్య ఋణం, ధర్మబద్ధంగా వాటినుండి విముక్తిని పొందాలి. తగిన వేళలో వాటి గురించి తెలుసుకొనని మనుష్యునకు పుణ్యలోకాలు లేవని ధర్మవేత్తలు నిర్ణయించారు. యాగాలతో దేవతలను తృప్తి పరచాలి. స్వాధ్యాయ తపస్సులతో మునులకు తృప్తి పరచాలి. (18,19)
పుత్రైః శ్రాద్ధైః పితౄంశ్పాపి ఆవృశంస్యేన మానవాన్ ।
ఋషిదేవమనుష్యాణాం పరిముక్తోఽస్మి ధర్మతః ॥ 20
త్రయాణామితరేషాం తు నాశ ఆత్మని నశ్యతి ।
పిత్ర్యాదృణాదనిర్ముక్తః ఇదానీమస్మి తాపసాః ॥ 21
సంతానంతో, శ్రాద్ధకర్మలతో పితరులను తృప్తిపరచాలి. ఆనృశంస్యంతో (దయతో) ఆమానవులను తృప్తి పరచాలి. ధర్మబద్ధంగా ఋషి, దేవ, మనుష్య ఋణాలనుండి విముక్తిని పొందాను. ఈశరీరం నశించినా పితౄణం మాత్రం మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. మహర్షులారా! పితౄణం తీర్చుకోలేని స్థితిలో ఇప్పుడున్నాను. (20,21)
వి: సం: 'ఈలోకాన్ని పుత్రులతోనే జయించాలి కానీ ఇతరకర్మ చేత కాదు' అను శ్రుతివచనాన్ని బట్టి తన దేహాన్ని కోల్పోయినా సంతానముంటే తానున్నట్టే, సంతానం లేకపోతే తానూ లేనట్టే. (నీల)
ఇహ తస్మాత్ ప్రజాహేతోః ప్రజాయంతే నరోత్తమాః ।
యథైవాహం పితుః క్షేత్రే జాతస్తేన మహర్షిణా ॥ 22
తథైవాస్మిన్ మమ క్షేత్రే కథం వై సంభవేత్ ప్రజా ।
ఈలోకంలో ఉత్తమమానవులందరూ పితృఋణవిముక్తి కొరకే సంతానాన్ని కంటున్నారు. తామే పుత్రరూపంలో తిరిగి జన్మిస్తున్నారు. మాతండ్రి ద్వారా మా అమ్మ మమ్ములను కన్నట్లు నాభార్యకు కూడా సంతానం కలిగే మార్గమేది? (22 1/2)
ఋషయ ఊచుః
అస్తి వై త్వ ధర్మాత్మన్ విద్యో దేవోపమం శుభమ్ ॥ 23
అపత్యమనఘం రాజన్ వయం దివ్యేన చక్షుషా ।
దైవోద్దిష్టం నరవ్యాఘ్ర కర్మణేహోపపాదయ ॥ 24
మునులు ఇలా అన్నారు. ధర్మాత్మా! మేము దివ్యదృష్టితో చూస్తున్నాము. నీకు నిష్కల్మషమై దైవ సమానమైన సంతానం కలిగే అవకాశమున్నది. నరశ్రేష్ఠా! అదృష్టమందజేస్తున్న ఆ శుభఫలితాన్ని పురుషప్రయత్నంతో సాధించు. (23,24)
అక్లిష్టం ఫలమవ్యగ్రః విందతే బుద్ధిమాన్ నరః ।
తస్మిన్ దృష్టే ఫలే రాజన్ ప్రయత్నం కర్తుమర్హసి ॥ 25
అపత్యం గుణసంపన్నం లబ్ధా ప్రీతికరం హ్యసి ।
బుద్ధిమంతుడైన నరుడు సావధానంగా పెద్దకష్టం లేకుండానే ఫలితాన్ని పొందగలడు. రాజా! ఈ దృష్టఫలితం కోసం నీవు ప్రయత్నించాలి. నీవు తప్పక గుణవంతులు, ఆనందదాయకులూ అయినపిల్లలను పొందగలవు. (25 1/2)
వైశంపాయన ఉవాచ
తచ్ఛ్రుత్వా తాపసవచః పాండుశ్చింతాపరోఽభవత్ ॥ 26
వైశంపాయనుడిలా అన్నాడు. తాపసుల ఆ మాటలను విని పాండురాజు ఆలోచనలో పడ్డాడు. (26)
ఆత్మనో మృగశాపేన జానన్నుపహతాం క్రియామ్ ।
సోఽబ్రవీద్ విజనే కుంతీం ధర్మపత్నీం యశస్వినీమ్ ।
అపత్యోత్పాదనే యత్నమ్ ఆపది త్వం సమర్థయ ॥ 27
మృగశాపం వలన తాను తన పుంస్త్వాన్ని కోలుపోవటాన్ను స్మరించి పాండురాజు ఒకనాడు ఏకాంతంలో యశస్విని అయిన ధర్మపత్ని కుంతితో ఇలా అన్నాడు. ఇది మనకు గడ్డుకాలం. సంతానాన్ని పొందటానికి అవసరమయిన ప్రయత్నాన్ని నీవు అంగీకరించి ఆచరించాలి. (27)
అపత్యం నామ లోకేషు ప్రతిష్ఠా ధర్మసంహితా ।
ఇతి కుంతి విదుర్ధీరాః శాశ్వతం ధర్మవాదినః ॥ 28
ఇష్టం దత్తం తపస్తప్తం నియమశ్చ స్వనుష్ఠితః ।
సర్వమేవానపత్యస్య న పావనమిహోచ్యతే ॥ 29
కుంతీ! లోకంలో సంతానమన్నది ధర్మసహితమైన ప్రతిష్ఠ. ధర్మవాదులయిన ధీరులంతా ఆ విధంగానే భావిస్తున్నారు. సంతానంలేనివాడు యాగాలు చేసినా, దానాలుచేసినా, తపస్సు చేసినా చక్కగా విధుల నాచరించినా అవేవీ పవిత్రమైనవి కావు. (28,29)
సోఽహమేవం విదిత్వైతత్ ప్రపశ్యామి శుచిస్మితే ।
అనపత్యః శుభాన్ లోకాన్ న ప్రాప్స్యామీతి చింతయన్ ॥ 30
నిర్మలంగా నవ్వగల కుంతీ! ఆవిషయాన్ని గ్రహించి సంతానహీనుడనైన నేను శుభలోకాలు పొందలేనని భావించి నిరంతరమూ ఆలోచిస్తున్నాను. (30)
మృగాభిశాపాన్నష్టం మే జననం హ్యకృతాత్మనః ।
నృశంసకారిణో భీరు యథైవోపహతం పురా ॥ 31
నేను దురదృష్టవంతుడను. మృగశాపం వలన పిల్లలను కనలేని స్థితికి వచ్చాను. భయశీలా! మైథునంలో ఉన్న మృగాన్ని చంపినందువలన నేను ఆవిధంగానే సంతానోత్పాదన శక్తిని కోలుపోయాను. (31)
ఇమే వై బంధుదాయాదాః షట్ పుత్రా ధర్మదర్శనే ।
షడేవాబంధుదాయాదాః పుత్రాస్తాన్ శృణు మే పృథే ॥ 32
కుంతీ! ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆరుగురు బంధుదాయాదులూ, ఆరుగురు అబంధుదాయాదులూ ఆస్తికి వారసులు కాగలరు. (32)
స్వయంజాతః ప్రణీతశ్చ తత్సమః పుత్రికాసుతః ।
పౌనర్భవశ్చ కానీనః భగిన్యాం యశ్చ జాయతే ॥ 33
సొంతకొడుకూ, తన భార్యకే ఇతరుల వలన పుట్టిన వాడూ, దౌహిత్రుడూ (కూతురుకొడుకు), పౌనర్భవుడూ (మారుమనువు చేసికొన్న స్త్రీకొడుకు), కానీనుడు (తాను వివాహమాడిన స్త్రీకి వివాహానికి ముందే పుట్టినవాడు), సోదరికొడుకు - ఆరుగురూ బంధుదాయాదులు. (33)
వి: సం: ఈశ్లోకం కొంతమార్పుతో నీలకంఠీయ వ్యాఖ్యలో కలిపిస్తుంది
స్వయంజాతః ప్రణీతశ్చ పరిక్రీతశ్చ యః సుతః ।
పౌనర్భవశ్చ కానీనః స్వైరిణ్యాం యశ్చ జాయతే ॥
పరిక్రీతుడు = అన్యులరేతస్సునకు మూల్యాన్ని చెల్లించి స్వీకరించగా తద్ద్వారా భార్యకు పుట్టినకొడుకు.
స్వైరిణికి వివాహమైన తరువాత ఉత్తముని ద్వారా పుట్టినకొడుకు ఆరవవాడు. అతనికే కుండుడని వ్యవహారం (నీల)
దత్తః క్రీతః కృతిమశ్చ ఉపగచ్ఛేత్ స్వయం చ యః ।
సహోఢో జ్ఞాతిరేతాశ్చ హీనయోనిధృతశ్చ యః ॥ 34
దత్తపుత్రుడూ, కొనబడినవాడూ, స్వయంగా నేను నీకుమారుడనంటూ వచ్చినవాడూ, సహోఢుడు (గర్భవతి అయిన స్త్రీని పెండ్లాడగా పుట్టినవాడూ), తన వంశంలో పుట్టినవాడూ, తనకన్న తక్కువ కులం గల స్త్రీకి తనద్వారా పుట్టినవాడు - వీరు అబంధుదాయాదులు. (34)
పూర్వపూర్వతమాభావం మత్వా లిప్సేత వై సుతమ్ ।
ఉత్తమాదవరాః పుంసః కాంక్షంతే పుత్రమాపది ॥ 35
ఈక్రమంలో ముందుముందు వారు లభించకపోతే తర్వాత తర్వాత వారికి ప్రాధాన్యం. అపత్కాలంలో తనకన్న ఉత్తముడయిన పురుషుని ద్వారానే సామాన్యులు సంతానాన్ని కోరుకొంటారు. (35)
అపత్యం ధర్మఫలదం శ్రేష్ఠం విందంతి మానవాః ।
ఆత్మశుక్రాదపి పృథే మమః స్వాయంభువోఽబ్రవీత్ ॥ 36
కుంతీ! మానవుడు తన ద్వారా కాకపోయినా మరొక ఉత్తమనరునిద్వారా పుత్రులను పొందవచ్చు. అది ధర్మఫలితాన్నే ఇస్తుంది. స్వాయంభువమనువు ఈవిషయాన్ని చెప్పారు. (36)
తస్మాత్ ప్రహేష్యామ్యద్య త్వాం హీనః ప్రజననాత్ స్వయమ్ ।
సదృశాచ్ఛ్రేయసో వా త్వం విద్ధ్యపత్యం యశస్విని ॥ 37
కాబట్టి యశస్వినీ! నేను పిల్లలను కనలేను. కాబట్టి నిన్ను మరొకరి దగ్గరకు పంపుతాను. నా అంతటి వాని ద్వారా గానీ నాకన్న శ్రేష్ఠుని ద్వారా గానీ నీవు సంతానాన్ని పొందు. (37)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పాండుపృథా సంవాదే ఊన వింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 119 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పాండు పృథా సంవాదమను నూట పందొమ్మిదవ అధ్యాయము. (119)