121. నూట ఇరువదియొకటవ అధ్యాయము

కుంతి పుత్రులను పొందుటకు ఉద్యమించుట.

వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తయా రాజా తాం దేవీం పున్రబ్రవీత్ ।
ధర్మ్విద్ ధర్మసంయుక్తమ్ ఇదం వచనముత్తమమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. కుంతి ఆవిధంగా మాటాడగా ధర్మవేత్త అయిన పాండురాజు ఉత్తమమూ, ధర్మసహితమూ అయినట్లు ఆమెతో ఈ మాటలు పలికాడు. (1)
పాండురువాచ
ఏవమేతత్ పురా కుంతి వ్యుషితాశ్వశ్చకార హ ।
యథా త్వయోక్తం కళ్యాణి స హ్యాసీదమరోపమః ॥ 2
పాండురాజు ఇలా అన్నాడు. కుంతీ! గతంలో వ్యుషితాశ్వుడు నీవు చెప్పినట్లుగా ఆవిధంగా చేయగలిగాడు. నిజమే! కళ్యాణీ! ఆయన దేవతల వంటివాడు. (2)
అథత్విదం ప్రవక్ష్యామి ధర్మతత్త్వం నిబోధ మే ।
పురాణమృషిభిర్దృష్టం ధర్మవిద్భిర్మహాత్మభిః ॥ 3
ఇప్పుడు నేను మహాత్ములూ, ధర్మవేత్తలూ అయిన ప్రాచీనమహర్షులు దర్శించిన ధర్మతత్త్వాన్ని నీకు చెప్పబోతున్నాను. నామాట విను. (3)
ధర్మమేవం జనాః సంతః పురాణం పరిచక్షతే ।
భర్తా భార్యాం రాజపుత్రి ధర్మ్యం వాధర్మ్యమేవ వా ॥ 4
యద్ బ్రూయాత్ తత్ తథా కార్యమ్ ఇతి వేదవిదో విదుః ।
విశేషతః పుత్రగృధ్యీ హీనః ప్రజననాత్ స్వయమ్ ॥ 5
యథాహమనవద్యాంగి పుత్రదర్శనలాలసః ।
తథా రక్తాంగుళితలః పద్మపత్రనిభః శుభే ॥ 6
ప్రసాదార్థం మయా తేఽయం శిరస్యభ్యుద్యతోంజలిః ।
మన్నియోగాత్ సుకేశాంతే ద్విజాతెస్తపసాధికాత్ ॥ 7
పుత్రాన్ గుణసమాయుక్తాన్ ఉత్పాదయితుమర్హసి ।
త్వత్కృతేఽహం పృథుశ్రోణి గచ్ఛేయం పుత్రిణాం గతిమ్ ॥ 8
సజ్జనులు దీనిని పురాతనమయిన ధర్మమంటున్నారు. రాజకుమారీ! ధర్మమయినా, అధర్మమయినా భర్త చెప్పినట్లుగా భార్య చేయాలని వేదవేత్తలు తెలిపారు. విశేషించి సంతానాన్ని అపేక్షిస్తూ, స్వయంగా పిల్లలను కనలేని స్థితిలో ఉన్న భర్తమాటను తప్పక మన్నించాలి. దోషరహిత శరీరంగలదానా! నేను పుత్రదర్శనం కోసం ఉవిళ్ళూరుతున్నవాడిని. నీ అనుగ్రహం కోసం ఎఱ్ఱని వ్రేళ్ళు కొనలు గలిగి తామరాకులవలె ప్రకాశిస్తున్న ఈ అంజలిని శిరస్సుపై నుంచి చెప్తున్నాను. నా ఆదేశాన్ని మన్నించి తపోబల సంపన్నుడయిన బ్రాహ్మణుని ద్వారా గుణవంతులయిన కుమారులను కను. సుశ్ఱోణి! నీ కారణంగానే నేను పుత్రవంతులు పొందే సద్గతులను పొందగలను. (4-8)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తా తతః కుంతీ పాండుం పరపురంజయమ్ ।
ప్రత్యువాచ వరారోహా భర్తుః ప్రియహితే రతా ॥ 9
వైశంపాయనుడిలా అన్నాడు. పాండురాజు ఆరీతిగా మాటాడగా భర్తకు ప్రియాన్నీ, హితాన్నీ కల్గించటంలో ఆసక్తి గల కుంతి శత్రువిజేత అయిన పాండురాజుతో ఇలా అన్నది. (9)
(అధర్మః సుమహానేషః స్త్రీణాం భరతసత్తమ ।
యత్ ప్రసాదయతే భర్తా ప్రసాద్యః క్షత్రియర్షభ ॥
శృణు చేదం మహాబాహో మమ ప్రీతికరం వచః ॥)
భరతశ్రేష్ఠా! క్షత్రియోత్తమో! భర్త భార్యను బ్రతిమిలాడవలసి వచ్చుట స్త్రీ పక్షంలో పెద్ద అధర్మం, స్త్రీయే భర్తను అనునయించగలగాలి. మహాబాహూ! నాకు ఇష్టమయిన మాట చెపుతాను విను.
పితృవేశ్మన్యహం బాలా నియుక్తాతిథిపూజనే ।
ఉగ్రం పర్యచరం తత్ర బ్రాహ్మణం సంశితవ్రతమ్ ॥ 10
నిగూఢనిశ్చయం ధర్మే యం తం దుర్వాసనం విదుః ।
తమహం సంశితాత్మానం సర్వయత్నైరతోషయమ్ ॥ 11
మా పుట్టినింట నా చిన్నతనంలో అతిథిపూజకు నన్ను నియోగించారు. సంశితవ్రతుడై, కోపస్వభావం గల బ్రాహ్మణునకు నేను పరిచర్యలు చేశాను. ఆయన పేరు దుర్వాసుడు. ధర్మవిషయంలో ఆయాన జ్ఞానం ఇతరులకెరుగ రానిది. అటువంటి జితేంద్రియుని నేను సర్వప్రయత్నాలతో సంతోషింపజేశాను. (10-11)
స మేఽభీచారసంయుక్తమ్ ఆచష్ట భగవాన్ వరమ్ ।
మంత్రం త్వియం చ మే ప్రాదాత్ అబ్రవీచ్పైవ మామిదమ్ ॥ 12
అప్పుడు ఆ పూజనీయమహర్షి ప్రయోగవిధాన సహితంగా నాకొక మంత్రాన్ని వరరూపంగా ఉపదేశించి నాతో ఇలా అన్నాడు. (12)
వి: సం: అభిచారః = దేవతాకర్షణశక్తి (నీల)
యం యం దేవం త్వమేతేన మంత్రేణావాహయిష్యసి ।
అకామో వా సకామో వా వశం తే సముపైష్యతి ॥ 13
ఇ మంత్రంతో నీవు ఏదేవతల నాహ్వానించినా ఇష్టమున్నా లేకపోయినా ఆ దేవతలు నీకు లొంగుతారు. (13)
తస్య తస్య ప్రసాదాత్ తే రాజ్ఞి పుత్రో భవిష్యతి ।
ఇత్యుక్తాహం తదానేన పితృవేశ్మని భారత ॥ 14
రాజకుమారీ! వారి అనుగ్రహంతో నీకు పుత్రులు జన్మిస్తారు. భారతా! అది మా పుట్టినింట ఆ మహర్షి నాతో అన్నమాట. (14)
బ్రాహ్మణస్య వచస్తథ్యం తస్య కాలోఽయమాగతః ।
అనుజ్ఞాతా త్వయా దేవమ్ ఆహ్వయేయమహం నృప ।
తేన మంత్రేణ రాజర్షే యథా స్యాన్నౌ ప్రజా హితా ॥ 15
బ్రాహ్మణుని మాట యథార్థం. దాని అవసరం ఇప్పుడ్ కలిగింది. రాజా! నీవు అనుమతిస్తే నేను దేవతల నాహ్వానిస్తాను. ఆ మంత్ర ప్రభావంతో మనం పిల్లలను పొందవచ్చు. (15)
ఈ పనిచేయటం వలన మన ధర్మానికి అధర్మంతో కలయిక కలుగదు. లోకం కూడా దీనిని ధర్మమనే భావిస్తుంది. ధర్మునివలన పుట్టబోయే బిడ్డ కురువంశస్థులలో ధార్మికుడు కాగలడు. దర్ముని బిడ్డకు అధర్మంపై మనస్సు పుట్టదు. కాబట్టి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొనియే నిన్ను నియోగిస్తున్నాను. శుచిస్మితా! ఉపచారాలతో, మంత్రప్రయోగంతో ధర్ముని ఆహ్వానించు. (18-20)
వైశంపాయన ఉవాచ
సా తథోక్తా తథేత్యుక్త్వా తేన భర్త్రా వరాంగనా ।
అభివాద్యాభ్యనుజ్ఞాతా ప్రదక్షిణమవర్తత ॥ 21
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ విధంగా పాండురాజు పలుకగా ఆ కుంతి భర్త మాటలనంగీకరించి, ఆయనకు నమస్కరించి, అనుమతి తీసికొని ఆయనకు ప్రదక్షిణం చేసింది. (21)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి కుంతీపుత్రోత్పత్త్వనుజ్ఞానే ఏకవింశత్యధిక శతతమోఽధ్యాయః ॥ 121 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున కుంతీపుత్రోత్పత్త్వనుజ్ఞానమను నూట ఇరువది యొకటవ అధ్యాయము. (121)