122. నూట ఇరువది రెండవ అధ్యాయము

ధర్మజభీమార్జునుల పుట్టుక.

వైశంపాయన ఉవాచ
సంవత్సరధృతే గర్భే గాంధార్యా జనమేజయ ।
అహ్వయామాస వై కుంతీ గర్భార్థే ధర్మమచ్యుతమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! గాంధారి సంవత్సరకాలం గర్భాన్ని మోసిన తరువాత కుంతి గర్భధారణకై అచ్యుతుడయిన ధర్ముని ఆహ్వానించింది. (1)
సా బలిం త్వరితా దేవీ ధర్మాయోపజహార హ ।
జజాప విధివజ్జప్యం దత్తం దుర్వాససా పురా ॥ 2
ఆ కుంతీదేవి ధర్మదేవతకై పూజాదికాలను అర్పించింది. గతంలో దుర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని యథావిధిగా జపించింది. (2)
ఆజగామ తతో దేవః ధర్మో మంత్రబలాత్ తతః ।
విమానే సూర్యసంకాశే కుంతీ యత్ర జపస్థితా ॥ 3
ఆ తరువాత ఆ మంత్రబలం వలన సూర్యతేజస్సు గల విమానంలో ధర్మదేవత కుంతి జపిస్తున్న ప్రదేశానికి వచ్చాడు. (3)
విహస్య తాం తతో బ్రూయాః కుంతి కిం తే దదామ్యహమ్ ।
సా తం విహస్యమానాపి పుత్రం దేహ్యబ్రవీదిదమ్ ॥ 4
ధర్ముడు చిరునవ్వు నవ్వి ఆపై "కుంతీ! నీకు నేనేమి ఇవ్వాలి" అని అడిగాడు. సరదాకు అడిగినట్లున్నా కుంతి "నాకు కుమారుని ప్రసాదించు" అని ధర్ముని అడిగింది. (4)
సంయుక్తా సా హి ధర్మేణ యోగమూర్తిధరేణ హ ।
లేభే పుత్రం వరారోహా సర్వప్రాణభృతాం హితమ్ ॥ 5
ఆ వరారోహ యోగమూర్తిని ధరించిన ఆ ధర్మునితో కలిసి సమస్తప్రాణులకూ హితకరుడయిన కుమారుని పొందింది. (5)
ఐంద్రే చంద్రసమాయుక్తే ముహూర్తేఽభిజితేఽష్టమే ।
దివామధ్యగతే సూర్యే తిథౌ పూర్ణేఽతిపూజితే ॥ 6
సమృద్ధయశసం కుంతీ సుషావ ప్రవరం సుతమ్ ।
జాతమాత్రే సుతే తస్మిన్ వాగువాచాశరీరిణీ ॥ 7
ఆ తరువాత చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో ఉండగా, సూర్యుడు తులారాశి యందుండగా శుక్లపక్షంలో పంచమి యందు ఎనిమిదవలగ్నమయిన అభిజిల్లగ్నంలో కుంతీదేవి ఉత్తముడైన కుమారుని కన్నది. అతడు యశవి. ఆ కుమారుడు పుట్టగానే అశరీరవాణి ఇలా పలికింది. (6,7)
ఏష ధర్మభృతాం శ్రేష్ఠః భవిష్యతి నరీత్తమః ।
విక్రాంతః సత్యవాక్ త్వేవ రాజా పృథ్వ్యాం భవిష్యతి ॥ 8
యుధిష్ఠిర ఇతి ఖ్యాతః పాండోః ప్రథమజః సుతః ।
భవితా ప్రథితో రాజా త్రిషు లోకేషు విశ్రుతః ॥ 9
యశసా తేజసా చైవ వృత్తేన చ సమన్వితః ।
ఈ కుమారుడు నరోత్తముడై ధర్మాత్ములలో మేటి కాగలడు. పరాక్రమవంతుడు, సత్యవచనుడూ అయిన మహారాజు కాగలడు. పాండురాజు యొక్క ఈ జ్యేష్ఠకుమారుడు యుధిష్ఠిరుడనే పేర ప్రఖ్యాతుడై, మహారాజై మూడు లోకాలలోనూ ప్రసిద్ధిని పొందుతాడు. యశస్సు, తేజస్సు, సత్ప్రవర్తనలతో విరాజిల్లుతాడు. (8,9 1/2)
ధార్మికం తం సుతం లబ్ధ్వా పాండుస్తాం పునరబ్రవీత్ ॥ 10
ధార్మికుడైన ఆ కుమారుని పొంది పాండురాజు కుంతితో మరలా ఇలా అన్నాడు. (10)
ప్రాహుః క్షత్రం బలజ్యేష్ఠం బలజ్యేష్ఠం సుతం వృణు ।
(అశ్వమేధః క్రతుశ్రేష్ఠః జ్యోతిశ్శ్రేష్ఠో దివాకరః ।
బ్రాహ్మణో ద్విపదాం శ్రేష్ఠః బలశ్రేష్ఠస్తు మారుతః ॥
మారుతం మరుతాం శ్రేష్ఠం సర్వప్రాణిభిరీడితమ్ ।
ఆవాహయ త్వం నియమాత్ పుత్రార్థం వరవర్ణిని 7..
స నో యం దాస్యతి సుతం స ప్రాణబలవాన్ నృషు ।)
తతస్తథోక్తా భర్త్రా తు వాయుమేవాజుహావ సా ॥ 11
క్షత్రియులకు బలమే మిన్న కాబట్టి బలిష్ఠుడైన కుమారుని కోరుకో. యాగాలలో అశ్వమేధం, గ్రహాలలో సూర్యుడూ, మనుజులలో బ్రాహ్మణుడూ, గొప్పవారైనట్లు బలిష్ఠులలో వాయుదేవుడు గొప్పవాడు. సమస్తప్రాణులూ దేవతలలో వాయుదేవునే మిన్నగా ప్రతుతిస్తాయి. కాబట్టి పుత్రునికోసం ఆ వాయుదేవుని ఆహ్వానించు. ఆయన మనుజులందరినీ మించిన ప్రాణశక్తి, బలమూ గల కుమారుని మనకు ప్రసాదిస్తాడు. భర్త అలా అనగానే ఆమె వాయుదేవుని ఆహ్వానించింది. (11)
తతస్తామాగతో వాయుః మృగారూఢో మహాబలః ।
కిం తే కుంతి దదామ్యద్య బ్రూహి యత్ తే హృది స్థితమ్ ॥ 12
మృగాన్ని అధిరోహించి మహాబలవంతుడు అయిన వాయుదేవుడు ఆమె దగ్గరకు వచ్చి "కుంతీ! నీ మనస్సులోని కోరికను చెప్పు. నీకేమి ఇవ్వగలను" అని అడిగాడు. (12)
సా సలజ్జా విహస్యాహ పుత్రం దేహి సురోత్తమ ।
బలవంతం మహాకాయం సర్వదర్పప్రభంజనమ్ ॥ 13
ఆమె సిగ్గుపడుతూ, నవ్వుతూ "సురోత్తమా! మహాబలవంతుడూ, మహాకాయుడూ, అందరి దర్పాన్ని అణచగలవాడూ అయిన పుత్రుని ప్రసాదించు" అని వాయుదేవుని అడిగింది. (13)
తస్మాజ్జజ్ఞే మహాబాహుః భీమో భీమపరాక్రమః ।
తమప్యతిబలం జాతం వాగువాచాశరీరిణీ ॥ 14
సర్వేషాం బలినాం శ్రేష్ఠః జాతోఽయమితి భారత ।
ఇదమత్యద్భుతం చాసీత్ జాతమాత్రే వృకోదరే ॥ 15
యదంకాత్ పతితో మాతుః శిలాం గాత్రైర్వ్యచూర్ణయత్ ।
(కుంతీ తు సహ పుత్రేణ యాత్వా సురుచిరం సరః ।
స్నాత్వా తు సుతమాదాయ దశమేఽహని యాదవీ ॥
దైవతాన్యర్చయిష్యంతీ నిర్జగామాశ్రమాత్ పృథా ।
శైలాభ్యాశేన గచ్ఛంత్యాః తదా భరతసత్తమ ॥
నిశ్చక్రామ మహాన్ వ్యాఘ్రః జిఘాంసన్ గిరిగహ్వరాత్ ॥
తమాపతంతం శార్దూలం వికృష్యాథ కురూత్తమః ।
నిర్బిభేద శరైః పాండుః త్రిభిస్త్రిదశవిక్రమః ॥
నాదేన మహాతా తాం తు పూరయంతం గిరేర్గుహామ్ ।)
కుంతీ వ్యాఘ్రభయోద్విగ్నా సహసోత్పతితా కిల ॥ 16
ఆ వాయుదేవుని ద్వారా భయంకరపరాక్రమశాలి, మహాబాహువూ అయిన భీముడు జన్మించాడు. జనమేజయా! ఆ భీముని ఉద్దేశించి అశరీరవాణి 'ఇతడు బలవంతులందరి లోనూ శ్రేష్ఠు'డని పలికింది. అప్పుడే అద్భుతమయిన సంఘటన జరిగింది. భీముడు పుట్టీపుట్టగానే తల్లి ఒడినుండి జారి ఒక బండరాయిపై పడ్డాడు. దానితో అది చూర్ణమై పోయింది. కుంతి ప్రసవించిన పదవనాడు భీమునితో పాటు ఒక అందమైన సరస్సు దగ్గరకు పోయి స్నానం చేసి మరలి వచ్చి దేవతాసమారాధనకై పర్ణశాలనుండి వెలుపలికి వచ్చింది. భరతశ్రేష్ఠా! ఆమె ఒక పర్వతానికి దగ్గరగా నడుస్తుండగా ఒకపులి ఆమెను చంపాలని కొండగుహనుండి వెలుపలికి దూకింది. మీదికి వస్తున్న ఆపులిని చూచి కురూత్తముడూ, దేవతాపరాక్రమవంతుడూ అయిన పాండురాజు మూడు బాణాలను బాగా లాగి దానిపై ప్రయోగించి దానిని ఖండించాడు. అది గుహలు ప్రతిధ్వనించేటట్లు పెద్దగా అరుస్తూ నేలకూలింది. అదివిని భయపడి కుంతి వెంటనే పడిపోయింది. (14-16)
నాన్వబుధ్యత సంసుప్తమ్ ఉత్సంగే స్వే వృకోదరమ్ ।
తతః స వజ్రసంఘాతః కుమారో న్యపతద్ గిరౌ ॥ 17
తన ఒడిలో నిదురిస్తున్న భీమసేనుడు ఆమెకు గుర్తురాలేదు. అప్పుడు ఆ కుమారుడు పిడుగుపాటులా కొండపై పడ్డాడు. (17)
పతతా తేన శతధా శిలా గాత్రైర్విచూర్ణితా ।
తాం శిలాం చూర్ణితాం దృష్ట్వా పాండుర్విస్మయమాగతః ॥ 18
పడుతూనే ఆ కొండను తన శరీరంతో వందముక్కలుగా చేశాడు. ఆశిల చూర్ణమైపోవటాన్ని చూసి పాండురాజు ఆశ్చర్యపడ్డాడు. (18)
(మఘే చంద్రమసా యుక్తే సింహే చాభ్యుదితే గురౌ ।
దివామధ్యగతే సూర్యే తిథౌ పుఞే త్రయోదశే ॥
మైత్రే ముహూర్తే సా కుంతీ సుషువే భీమమచ్యుతమ్ ॥)
యస్మిన్నహని భీమస్తు జజ్ఞే భరతసత్తమ ।
దుర్యోధనోఽపి తత్రైవ ప్రజజ్ఞే వసుధాధిప ॥ 19
చంద్రుడు మఘానక్షత్రంలో ఉండగా, గురువు సింహరాశిలో ఉండగా, సూర్యుడు నడినెత్తిన ఉండగా త్రయోదశ తిథియందు మైత్రముహూర్తంలో ఆకుంతి భీముని ప్రసవించింది. భరతశ్రేష్ఠా! మహారాజా! భీముడు జన్మించిన రోజునే అక్కడ హస్తినాపురంలో దుర్యోధనుడు కూడా జన్మించాడు. (19)
జాతే వృకోదరే పాండుః ఇదం భూయోఽన్వచింతయత్ ।
కథం ను మే వరః పుత్రః లోకశ్రేష్ఠో భవేదితి ॥ 20
భీమసేనుడు పుట్టిన తరువాత మరలా పాండురాజు ఇలా ఆలోచించసాగాడు - సర్వలోకాలలోనూ శ్రేష్ఠుడైన గొప్పకొడుకు ఎలా పుట్టగలడు? (20)
దైవే పురుష్స్కారే చ లోకోఽయం సంప్రతిష్ఠితః ।
తత్ర దైవం తు విధినా కాలయుక్తేన లభ్యతే ॥ 21
ఈలోకం దైవంమీదా, పురుష ప్రయత్నం మీదా ఆధారపడి ఉన్నది. సమయానికి తగినట్లుగా ప్రవర్తించగలిగి నప్పుడు మాత్రమే దైవిక ఫలం లభిస్తుంది. (21)
ఇంద్రో హి రాజా దేవానాం ప్రధాన ఇతి నః శ్రుతమ్ ।
అప్రమేయబలోత్సాహః వీర్యవానమితద్యుతిః ॥ 22
తం తోషయిత్వా తపసా పుత్రం లప్స్యే మహాబలమ్ ।
యం దాస్యతి స మే పుత్రం స వరీయాన్ భవిష్యతి ॥ 23
అమానుషాన్ మాణుషాంశ్చ సంగ్రామే స హనిష్యతి ।
కర్మణా మన్సా వాచా తస్మాత్ తప్స్యే మహత్ తపః ॥ 24
దేవతలందరిలో ప్రధానుడు ఇంద్రుడని వింటున్నాము. లెక్కింపరాని బలోత్సాహాలూ, పరాక్రమమూ, తేజస్సూ గలవాడు ఆ ఇంద్రుడు. తపస్సుతో ఆయనను సంతోషపెట్టి మహాబలవంతుడైన కొడుకును పొందాలి. ఆయన అనుగ్రహించిన కుమారుడు గొప్పవాడు కాగలుగుతాడు. మానవులనూ, మానవేతరులనూ కూడా యుద్ధంలో చంపగలడు. కాబట్టి మనోవాక్కాయాలతో తీవ్రతపస్సు నాచరిస్తాను. (22-24)
తతః పాండుర్మహారాజః మంత్రయిత్వా మహర్షిభిః ।
దిదేశ కుంత్యాః కౌరవ్యః వ్రతం సాంవత్సరం శుభమ్ ॥ 25
ఆతరువాత పాండురాజు మహర్షులతో సంప్రదించి సంవత్సరకాల మాచరింపవలసిన ఒక శుభవ్రతాన్ని కుంతికి ఉపదేశించాడు. (25)
ఆత్మనా చ మహాబాహుః ఏకపాదస్థితోఽభవత్ ।
ఉగ్రం స తప ఆస్థాయ పరమేణ సమాధినా ॥ 26
ఆరిరాధయిషుర్దేవం త్రిదశానాం తమీశ్వరమ్ ।
సూర్యేణ సహ ధర్మాత్మా పర్యతప్యత భారత ॥ 27
తం తు కాలేన మహతా వాసవః ప్రత్యపద్యత ।
జనమేజయా! మహాబాహువూ, ధర్మాత్ముడూ అయిన ఆ పాండురాజు కూడా దేవాధినాథుడయిన ఇంద్రుని ఆరాధింప గోరి మనస్సును ఏకాగ్రతతో ఉంచి, ఒంటికాలిపై నిలిచి, సూర్యుడున్నంతసేపూ అలాగే ఉండి తీవ్రతపస్సు చేయసాగాడు. కొంతకాలం గడచిన తరువాత ఇంద్రుడు సాక్షాత్కరించి ఇలా పలికాడు. (26,27 1/2)
శక్ర ఉవాచ
పుత్రం తవ ప్రదాస్యామి త్రిషు లోకేషు విశ్రుతమ్ ॥ 28
మూడులోకాలలోనూ ప్రసిద్ధికెక్కిన కుమారుని నీకు అనుగ్రహిస్తాను. (28)
బ్రాహ్మణానాం గవాం చైవ సుహృదాం చార్థసాధకమ్ ।
దుర్హృదాం శోకజననం సర్వబాంధవనందనమ్ ॥ 29
సుతం తేఽగ్ర్యం ప్రదాస్యామి సర్వామిత్రవినాశనమ్ ।
బ్రాహ్మణులు, గోవులు, మిత్రులు- వీరి మనోరథాలను సిద్ధింపజేయగలవానిని, దుర్మార్గులకు శోకాన్నీ, సకల బంధువులకూ ఆనందాన్నీ కల్గించి, శత్రువుల నశింపజేసే వానిని నీకు కుమారునిగా అనుగ్రహిస్తాను. అతడు అన్నిటా ముందు నిలువగలవాడు. (29 1/2)
ఇత్యుక్తః కౌరవో రాజా వాసదేవ మహాత్మనా ॥ 30
ఉవాచ కుంతీం ధర్మాత్మా దేవరాజవచః స్మరన్ ।
ఉదర్కస్తవ కళ్యాణి తుష్టో దేవగణేశ్వరః ॥ 31
దాతుమిచ్ఛతి తే పుత్రం యథా సంకల్పితం త్వయా ।
అతిమానుషకర్మాణం యశస్వినమరిందమమ్ ॥ 32
నీతిమంతం మహాత్మానమ్ ఆదిత్యసమ్తేజసమ్ ।
దురాధర్షం క్రియావంతమ్ అతీవాద్భుతదర్శనమ్ ॥ 33
మహాత్ముడైన దేవేంద్రుడు పాండురాజుతో ఆరీతిగా అన్నాడు. ఆ దేవేంద్రుని మాటలను తలచుకొంటూ ధర్మాత్ముడైన పాండురాజు కుంతితో ఇలా అన్నాడు - కళ్యాణీ! నీకు శుభం కలుగబోతున్నది. దేవేంద్రుడు సంతోషించాడు. నీవు సంకల్పించినట్లు మానవాతీతమయిన కర్మలు చేయగలవాడూ, యశస్వి, శత్రుసంహారకుడూ, నీతిమంతుడూ, మహాత్ముడూ, సూర్యతేజస్వి, ఎదిరింపరాని వాడు, క్రియాశీలుడూ,అద్భుతదర్శనుడూ అయిన కుమారుని నీకివ్వగోరుతున్నాడు. (30-33)
పుత్రం జనయ సుశ్రోణి ధామ క్షత్రియతేజసామ్ ।
లబ్ధః ప్రసాదో దేవేంద్రాత్ తమాహ్వయ శుచిస్మితే ॥ 34
సుశ్రోణి! క్షాత్రతేజానికి నిధి అయిన కుమారుని కను. శుచిస్మితా! దేవేంద్రుడు ప్రసన్నుడైనాడు. ఆయనను ఆహ్వానించు. (34)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తా తతః శక్రమ్ ఆజుహావ యశస్వినీ ।
అథాజగామ దేవేంద్రః జనయామాస చార్జునమ్ ॥ 35
వైశంపాయనుడిలా అన్నాడు. పాండురాజు ఆవిధంగా ఆదేశించగానే యశస్విని అయిన కుంతి దేవేంద్రుని ఆహ్వానించింది. దేవేంద్రుడు వచ్చి అర్జునునకు జన్మనిచ్చాడు. (35)
(ఉత్తరాభ్యాం తు పూర్వాభ్యాం ఫల్గునీభ్యాం తతో దివా ।
జాతస్తు ఫాల్గునే మాసి తేనాసౌ ఫల్గునః స్మృతః ॥)
ఫాల్గున మాసంలో పూర్వపల్గునీ, ఉత్తర ఫల్గునీ నక్షత్రాల సంధికాలంలో పగలు అర్జునుడు జన్మించాడు. అందువలన ఆయన ఫాల్గునుడయ్యాడు.
జాతమాత్రే కుమారే తు వాగువాచాశరీరిణీ ।
మహాగంభీరనిర్ఘోషా నభో నాదయతీ తదా ॥ 36
శృణ్వతాం సర్వభూతానాం తేషాం చాశ్రమవాసినామ్ ।
కుంతీమాభాష్య విస్పష్టమ్ ఉవాచేదం శుచిస్మితామ్ ॥ 37
అర్జునుడు జన్మించగానే మిగుల గంభీరమైన నాదంతో ఆకాశాన్ని ప్రతిధ్వనింపజేస్తూ, ఆశ్రమవాసులయిన సమస్తప్రాణులూ వింటుండగా శుచిస్మిత అయిన కుంతితో విస్పష్టంగా అశరీరవాణి ఇలా పలికింది. (36,37)
కార్తవీర్యసమః కుంతి శివతుల్యపరాక్రమః ।
ఏష శక్ర ఇవాజయ్యః యశస్తే ప్రథయిష్యతి ॥ 38
అదిత్యా విష్ణునా ప్రీతిః యథాభూదభివర్ధితా ।
తథా విష్ణుసమః ప్రీతిం వర్ధయిష్యతి తేఽర్జునః ॥ 39
కుంతీ! ఈ కుమారుడు కార్తవీర్య తుల్యుడై, శివపరాక్రమం వంటి పరాక్రమం గలిగి ఇంద్రునివలె జయింపరానివాడై నీకీర్తిని విస్తరింపజేస్తాడు. విష్ణువు అదితి ఆనందాన్ని అభివృద్ధి చేసినట్లు ఈ అర్జునుడు విష్ణుసమానుడై నీ ఆనందాన్ని వర్ధిల్లజేస్తాడు. (38,39)
ఏష మద్రాన్ వశే కృత్వా కురూంశ్చ సహ సోమకైః ।
చేదికాశికరూషాంశ్చ కురులక్ష్మీం వహిష్యతి ॥ 40
ఈ కుమారుడు మద్ర, కురు, సోమక, చేది, కాశి కరూశ దేశాలను లొంగదీసికొని కురువంశలక్ష్మిని పాలించగలడు. (40)
(గత్వోత్తరదిశం వీరః విజిత్య యుధి పార్థివాన్ ।
ధనరత్నౌఘమమితమ్ ఆనయిష్యతి పాండవః ॥)
ఏతస్య భుజవీర్యేణ ఖాండవే హవ్యవాహనః ।
మేదసా సర్వభూతానం తృప్తిం యాస్యతి వై పరామ్ ॥ 41
వీరుడైన ఈ పాండుసుతుడు ఉత్తర దిక్కుపై దండెత్తి యుద్ధంలో రాజులను ఓడించి అనంతధనరత్నరాసులను కొనివస్తాడు. ఈతని భుజపరాక్రమం చేతనే ఖాండవవనంలో అగ్నిహోత్రుడు సమస్తప్రాణుల మేదస్సుతో మిక్కిలిగా తృప్తినొందగలడు. (41)
గ్రామణీశ్చ మహీపాలాన్ ఏష జిత్వా మహాబలః ।
భ్రాతృభిః సహితో వీరః త్రీన్ మేధానాహరిష్యతి ॥ 42
మహాబలుడైన ఈవీరబాలకుడు క్షత్రియులకు నాయకుడై భూపాలురనందరనూ జయించి, సోదరులతో కూడి మూడు అశ్వమేధయాగాలను నిర్వహించగలడు. (42)
జామదగ్న్యసమః కుంతి విష్ణుతుల్యపరాక్రమః ।
ఏష వీర్యవతాం శ్రేష్ఠః భవిష్యతి మహాయశాః ॥ 43
కుంతీ! ఈబాలుడు పరశురామునితో సమానుడై, విష్ణుతుల్యపరాక్రముడై, బలవంతులలో శ్రేష్ఠుడై గొప్పకీర్తిని పొందగలడు. (43)
ఏష యుద్ధే మహాదేవం తోషయిష్యతి శంకరమ్ ।
అష్ట్రం పాశుపతం నామ తస్మాత్ తుష్టాదవాప్స్యతి ॥ 44
నివాతకవచా నామ దైత్యా విబుధవిద్విషః ।
శక్రాజ్ఞయా మహాబాహుః తాన్ వధిష్యతి తే సుతః ॥ 45
ఇతడు యుద్ధంలో మహాదేవుడైన శంకరుని ఆనందింపజేసి, సంతుష్టుడైన అతని నుండి పాశుపతాస్త్రాన్ని పొందగలడు. నివాతకవచులనే రాక్షసులు దేవతలకు శత్రువులు. మహాబాహువయిన ఈ నీకుమారుడు దేవేంద్రుని ఆదేశంతో ఆ నివాతకవచులను సంహరింపగలడు. (44,45)
తథా దివ్యాని చాస్త్రాణి నిఖిలేనాహరిష్యతి ।
విప్రణష్టాం శ్రియం చాయమ్ ఆహ్రతా పురుషర్షభః ॥ 46
పురుషశ్రేష్ఠుడైన ఈ అర్జునుడు దివ్యాస్త్రజ్ఞానాన్ని సంపూర్ణంగా పొందగలడు. కోలుపోయిన సంపదల నన్నింటినీ మరల కొనిరాగలడు. (46)
ఏతామత్యద్భుతాం వాచం కుంతీ శుశ్రావ సూతకే ।
వాచముచ్చారితాముచ్ఛైః తాం నిశమ్య తపస్వినామ్ ॥ 47
బభూవ పరమో హర్షః శతశృంగనివాసినామ్ ।
తథా దేవనికాయానాం సేంద్రాణాం చ దివౌకసామ్ ॥ 48
కుంతి సూతికాగృహం నుండియే ఈ అద్భుత వాక్యాలను విన్నది. పెద్దగా వినిపించిన ఆమాటను విని శతశృంగనివాసు లయిన మహర్షులు పరమానందాన్ని పొందారు. గగనచారు లయిన దేవతాసమూహాలూ, ఇంద్రుడూ కూడా మిక్కిలి ఆనందించారు. (47,48)
ఆకాశే దుందుభీనాం చ బభూవ తుములఃస్వనః ।
ఉదతిష్ఠన్మహాఘోషః పుష్పవృష్టిభిరావృతః ॥ 49
ఆకాశంలో పుష్పవృష్టితో పాటు భీకరమయిన దుందుభిద్వని కూడా పెద్దగా ఘోషించింది. (49)
సమవేత్య చ దేవానాం గణాః పార్థమపూజయన్ ।
కాద్రవేయా వైనతేయాః గంధర్వాప్సరసస్తథా ।
ప్రజానాం పతయః సర్వే సప్త చైవ మహర్షయః ॥ 50
భరద్వాజః కశ్యపో గౌతమశ్చ
విశ్వామిత్రో జమదగ్నిర్వసిష్ఠః ।
యశ్చోదితో భాస్కరేఽభూత్ ప్రణష్టే
సోఽప్యత్రాత్రి ర్భగవానాజగామ ॥ 51
దేవగణాలూ, కాద్రవేయులూ, వైనతేయులూ, గంధర్వులూ, అచ్చరలూ, ప్రజాపతులూ, సప్తర్షులూ అందరూ ఒక్కటిగా కూడివచ్చి పార్థుని ప్రశంసించారు. (50,51)
మరీచిరంగిరాశ్పైవ పులస్త్వ పులహః క్రతుః ।
దక్షః ప్రజాపతిశ్పైవ గంధర్వాప్సరసస్తథా ॥ 52
మరీచి, అంగిరసుడూ, పులస్త్యుడూ, పులహుడూ, క్రతువూ, దక్షప్రజాపతీ, గంధర్వులూ, అచ్చరలూ వచ్చారు. (52)
దివ్యమాల్యాంబరధరాః సర్వాలంకారభూషితాః ।
ఉపగాయంతి బీభత్సుం నృత్యంతఽప్సరసాం గణాః ॥ 53
ఆచ్చరలు దివ్యమాల్యాలనూ, దివ్యవస్త్రాలనూ ధరించి, సర్వాలంకారాలనూ అలంకరించుకొని నాట్యంచేస్తూ అర్జునుని కీర్తించసాగారు. (53)
తథా మహర్షయశ్చాపి జేపుస్తత్ర సమంతతః ।
గంధర్వైః సహితః శ్రీమాన్ ప్రాగాయత చ తుంబురుః ॥ 54
అదేవిధంగా మహర్షులు కూడా అన్నివైపులా నిలిచి శుభమంత్రాలను జపించసాగారు. గంధర్వులతో కలిసి శ్రీమంతుడైన తుంబురుడు గొప్పగా గానం చేశాడు. (54)
భీమసేనోగ్రసేనౌ చ ఊర్ణాయురనఘస్తథా ।
గోపతిర్ధృతరాష్ట్రశ్చ సూర్యవర్చాస్తథాష్టమః ॥ 55
యుగపస్తృణపః కార్ష్ణిః నందిశ్చిత్రరథస్తదా ।
త్రయోదశః శాలిశిరాః పర్జన్యశ్చ చతుర్దశః ॥ 56
కలిః పంచదశశ్చైవ నారదశ్చాత్ర షోడశః ।
ఋత్వా బృహత్త్వా బృహకః కరాలశ్చ మహామనాః ॥ 57
బ్రహ్మచారీ బహుగుణః సువర్ణశ్చేతి విశ్రుతః ।
విశ్వావసుర్భుమన్యుశ్చ సుచంద్రశ్చ శరుస్తథా ॥ 58
గీతమాధుర్యసంపన్నౌ విఖ్యాతౌ చ హహాహుహూ ।
ఇత్యేతే దేవగంధర్వాః జగ్ముస్తత్ర నరాధిప ॥ 59
రాజా! భీమసేనుడు ఉగ్రసేనుడు, ఊర్ణాయువు, అనఘుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చస్కుడు, యుగపుడు, తృణపుడు, కార్ష్ణి, నంది, చిత్రరథుడు, శాలిశిరస్కుడు, పర్జన్యుడు, కలి, నారదుడు, ఋత్వ, బృహత్త్వ, బృహకులు, కరాలుడు, సువర్ణుడు (బ్రహ్మచారి, విఖ్యాత గుణుడు ఇతడు) విశ్వావసువు, భూమన్యువు, సుచంద్రుడు, శరుడు, గీతమాధుర్య సంన్నులయిన హాహా, హూహూలు - వీరంతా అక్కడకు వచ్చారు. (55-59)
తథైవాప్సరసో హృష్టాః సర్వాలంకారభూషితాః ।
ననృతుర్వై మహాభాగాః జగుశ్ఛాయతలోచనాః ॥ 60
విశాలనేత్రలు సౌభాగ్యశాలినులు అయిన అచ్చరలు సర్వాలంకారాలను అలంకరించుకొని ఆనందంగా నాట్యాలు చేసి, పాటలు పాడారు. (60)
అనూచానానవద్యా చ గుణముఖ్యా గుణావరా ।
అద్రికా చ తథా సోమా మిశ్రకేశీ త్వలంబుషా ॥ 61
మరీచిః శుచికా చైవ విద్యుత్పర్ణా తిలోత్తమా ।
అంబికా లక్షణా క్షేమా దేవీ రంభా మనోరమా ॥ 62
అసితా చ సుబాహుశ్చ సుప్రియా చ వపుస్తథా ।
పుండరీకా సుగంధా చ సురసా చ ప్రమాథినీ ॥ 63
కామ్యా శారద్వతీ చైవ ననృతుస్తత్ర సంఘశః ।
మేనకా సహజన్యాచ కర్ణికా పుంజికస్థలా ॥ 64
ఋతుస్థలా ఘృతాచీ చ విశ్వాచీ పూర్వచిత్త్యపి ।
ఉమ్లోచేతి చ విఖ్యాతా ప్రమ్లోచేతి చ తా దశ ॥ 65
అనూచాన్, అనవద్య, గుణముఖ్య, గుణావర, అద్రిక, సోమ, మిశ్రకేశి, అలంబుష, మరీచి, శుచిక, విద్యుత్పర్ణ, తిలోత్తమ, అంబిక, లక్షణ, క్షేమ, దేవి, రంభ, మనోరమ, అసిత, సుబాహువు, సుప్రియ, వపువు, పుండరీక, సుగంధ, సురస, ప్రమాథిని, కామ్య, శారద్వతి - ఈ అప్సరసలు బృందనాట్యాలు చేశారు. ఈ అప్సరసలలో పేరుమోసైన్ మేనక, సహజన్య, కర్ణిక, పుంజికస్థల, ఋతుస్థల, ఘృతాచి, విశ్వాచి, పూర్వచిత్తి, ఉమ్లోచ, ప్రమ్లోచ అను పదిమంది ఉన్నారు. (61-65)
ఉర్వశ్యేకాదశీ తాసాం జగుశ్చాయతలోచనాః ।
ధాతార్యమో చ మిత్రశ్చ వరుణోంశోభగస్తథా ॥ 66
ఇంద్రో వివస్వాన్ పూషా చ త్వ్ష్టా చ సవితా తథా ।
పర్జన్యశ్పైవ విష్ణుశ్చ ఆదిత్యా ద్వాదశ స్మ్ఱ్రుతాః ।
మహిమానం పాండవస్య వర్ధయంతోఽంబరే స్థితాః ॥ 67
వారిలో పదకొండవ అప్సర ఊర్వశి. ఈవిశాలనేత్రలంతా గానం చేశారు. ధాత, అర్యముడు, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భాగుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, పూష, త్వష్ట, సరిత, పర్జన్యుడు, విష్ణువు, ద్వాదశాదిత్యులు - వీరంతా అర్జునుని మహిమను వర్ధిల్లజెస్తూ గగనతలంపై నిలిచారు. (66,67)
మృగవ్యాధశ్చ సర్పశ్చ నిరృతిశ్చ మహాయశాః ।
అజైకపాదహిర్భుధ్న్యః పినాకీ చ పరంతస ॥ 68
దహనో - థేశ్వరశ్పైవ కపాలీ చ విశాంపతే ।
స్థాణుర్భగశ్చ భగవాన్ రుద్రాస్తత్రావతస్థిరే ॥ 69
పరంతపా! మృగవ్యాధుడు, సర్పుడు, మహాయశస్వి అయిన నిరృతి, అజైకపాదుడు, అహిర్భధ్న్యుడు, పూజ్యుడైన బగుడు - ఈ రుద్రులంతా అక్కడ నిలిచారు. (68,69)
అశ్వినౌ వసవశ్చాష్టౌ మరుతశ్చ మహాబలాః ।
విశ్వేదేవాస్తథా సాధ్యాః తత్రాసన్ పరితః స్థితాః ॥ 70
అశ్వినులు, అష్టవసువుల, బలవంతులయిన మరుత్తులు, విశ్వేదేవులు, సాధ్యులు, వీరంతా చుట్టూ చేరారు. (70)
కర్కోటకోఽథ సర్పశ్చ వాసుకిశ్చ భుజంగమః ।
కశ్యపశ్చాథ కుండశ్చ తక్షకశ్చ మహోరగఆఘా ॥ 71
ఆయుయుస్తపసా యుక్తాః మహాక్రోధా మహాబలాః ।
ఏతే చాన్యే చ బహవః తత్ర నాగా వ్యవస్థితాః ॥ 72
నాగులైన కర్కోటక వాసుకులు, కశ్యపుడు కుండుడు, తక్షకుడు - ఈనాగులే కాక తపస్సంపన్నులూ, మహాక్రోధులూ, మహాబలులూ అయిన నాగులెందరో అక్కడకు చేరారు. (71,72)
తార్డ్యశ్చారిష్టనేమిశ్చ గరుడశ్చాసితద్వజః ।
అరుణశ్చారుణిశ్చైవ వైనతేయా వ్యవస్థితాః ॥ 73
తార్డ్యుడు, అరిష్టనేమి, గరుడుడు, అసితధ్వజుడు, అరుణుడు, ఆరుణి, వినతానందనులు కూడా అక్కడకు వచ్చారు. (73)
తాంశ్చ దేవగణాన్ సర్వాన్ తపస్సిద్ధా మహర్షయః ।
విమానగిర్యగ్రగతాన్ దదృశుర్నేతరే జనాః ॥ 74
ఈదేవగణాలన్నీ విమానాలపై, పర్వతశిఖరాలపై నిలిచాయి. తపస్సిద్ధులయిన మహర్షులు మాత్రమే వారిని చూడగలిగారు. ఇతరులు చూడలేకపోయారు. (74)
తద్ దృష్ట్వా మహదాశ్చర్యం విస్మితా మునిసత్తమాః ।
అధికాంస్మ తతో వృత్తిమ్ అవర్తన్ పాండవాన్ ప్రతి ॥ 75
మిగుల ఆశ్చర్యకరమయిన ఆ సన్నివేశాన్ని చూచి ముని సత్తములంతా చకితులయ్యారు. దానితో పాండవులపై అంతకుముందుకన్న ప్రేమాదరాలతో ప్రవర్తించసాగారు. (75)
వి: తె: ఒకనాడు పాండురాజు బ్రహ్మసభకు వెళ్లలేకపోయినాడు. ఇపుడు అర్జునుని పుత్రునిగా పొంది ఆ బ్రహ్మసభనంతను తనకడకే తెచ్చుకొనినట్లు నన్నయ్య వ్యాఖ్యానించినాడు.
శతశృంగ నగేంద్రము శత
ధృతి సర్గ దినంబ పోలెఁ ద్రిభువన భూత
ప్రతతిఁ బరిపూర్ణ శోభా
ధృతి నింద్ర తనూజు జన్మదినమున నొప్పెన్. (1-5-126)
పాండుస్తు పునరేవైనాం పుత్రలోభాన్మహాయశాః ।
వక్తుమైచ్ఛద్ ధర్మపత్నీం కుంతీ త్వేనమథాబ్రవీత్ ॥ 76
మహాయశస్సుగల పాండురాజు పుత్రలోభంతో కుంతితో ఇంకా ఏదో చెప్పబోయాడు. కాని కుంతి అతనిని నిరోధిస్తూ ఇలా అన్నది. (76)
నాతశ్చతుర్థం ప్రసవమ్ ఆపత్స్వపి వదంత్యుత ।
అతః పరం స్వైరిణీ స్యాద్ బంధకీ పంచమే భవేత్ ॥ 77
అపత్కాలంలో కూడా ముగ్గురిని మించి కనటానికి శాస్త్రాలు అంగీకరింపవు. నాలుగవ సంతానాన్ని కోరిన దానిని స్వైరిణి అనీ, అయిదవ సంతానాన్ని కోరిన దానిని బందకి అనీ వ్యవహరిస్తారు. (77)
స త్వం విద్వన్ ధర్మమిమమ్ అధిగమ్య కథం ను మామ్ ।
అపత్యార్థం సముత్క్రమ్య ప్రమాదాదివ భాషసే ॥ 78
విద్వాంసుడా! నీవు ఈవిషయం తెలిసికూడ ఏమరిన వానివలె ధర్మలోపాన్ని అంగీకరిస్తూ మరలా సంతానాం కోసం నన్నెందుకు ప్రోత్సాహించదలచావు? (78)
(పాండు రువాచ
ఏవమేతద్ ధర్మశాస్త్రం యథా వదసి తత్ తథా ।)
పాండురాజిలా అన్నాడు. నిజమే. ధర్మశాస్త్రం అలాగే ఉంది. నీవు చెప్పినది వాస్తవమే.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పాండవోత్పత్తౌ ద్వావింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 122 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పాండవోత్పత్తి అను నూట ఇరువది రెండవ అధ్యాయము. (122)
(దాక్షిణాత్య అధికపాఠం 10 1/2 శ్లోకాలతో కలిపి 88 1/2 శ్లోకాలు)