124. నూట ఇరువది నాలుగవ అధ్యాయము

పాండురాజమరణము - మాద్రి సహగమనము.

వైశంపాయన ఉవాచ
దర్శనీయాంస్తతః పుత్రాన్ పాండుః పంచమహావనే ।
తాన్ పశ్యన్ పర్వతే రమ్యే స్వబాహుబలమాశ్రితః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. పాండురాజు చూడముచ్చటయిన అయిదుగురు కుమారులనూ చూస్తూ ఆ మహారణ్యంలో అంధమయిన పర్వతంపై తన బాహుబాలాన్ని ఆసరాగా చేసికొని జీవించ సాగాడు. (1)
(పూర్ణే చతుర్దశే వర్షే ఫాల్గునస్య చ ధీమతః ।
తదా ఉత్తరఫల్గున్యాం ప్రవృత్తే స్వస్తివాచనే ॥
రక్షణే విస్మృతా కుంతీ వ్యగ్రా బ్రాహ్మణభోజనే ।
పురోహితేన సహితా బ్రాహ్మణాన్ పర్యవేషయత్ ॥
తస్మిన్ కాలే సమాహూయ మాద్రీం మదనమోహితః ।)
సుపుష్పితవనే కాలే కదాచిన్మధుమాధవే ।
భూతసమ్మోహనే రాజా సభార్యో వ్యచరద్ వనమ్ ॥ 2
అర్జునునకు పదునాలుగేండ్లు నిండిన తర్వాత ఉత్తరఫల్గుని నక్షత్రదినాన బ్రాహ్మణులు స్వస్తి పలికుతున్న సందర్భంలో బ్రాహ్మణభోజనాల ఏర్పాట్లలో నిమగ్న అయిన కుంతి పాండురాజుసంరక్షణను విస్మరించండి. పురోహితునితో కలిసి బ్రాహ్మణులకు వడ్డన చేయించ సాగింది. ఆ సమయంలో మదనమోహితుడైన పాండురాజు మాద్రిని పిలిచి తోటలన్నీ చక్కగా పూచిన ఆ మధుమాసవేళలో వసంతుడు ప్రాణులను మోహింపజేస్తున్న సమయంలో మాద్రితో కలిసి విహరించసాగాడు. (2)
పలాశై స్తిలకైశ్చూతైః చంపకైః పారిభద్రకైః ।
అన్యైశ్చ బహుభివ్వ్నక్షైః పద్మినీభిశ్చ శోభితమ్ ।
పాండోర్వనం తత్ సాంప్రేక్ష్య ప్రజజ్ఞే హృది మన్మథః ॥ 4
మోదుగులు, తిలకాలు, మామిడి చెట్లు, చంపక వృక్షాలూ, పారిభద్రక తరువులు - మరెన్నో విధాలయిన చెట్లు ఫల పుష్పాలతో సమృద్ధాలై ఉన్నాయి. వివిధజలాశయాలలో పద్మలతలు ప్రకాశిస్తున్నాయి. అది చూచిన పాండురాజు మనస్సులో మన్మథుడు మొదలసాగాడు. (3,4)
ప్రహృష్టమనసం తత్ర విచరంతం యథామరమ్ ।
తం మాద్ర్యనుజగామైకా వసనం బిభ్రతీ శుభమ్ ॥ 5
మనస్సును ఉల్లాసంతో నింపుకొని దేవతల వలె సంచరిస్తున్న ఆ పాండురాజును అందమైన వస్త్రం ధరించి మాద్రి అనుసరించింది. (5)
సమీక్షమాణః స తు తాం వయఃస్థాం తనువాససమ్ ।
తస్య కామః ప్రవవృథే గహనేఽగ్నిరివోద్గతః ॥ 6
వయస్సులో ఉండి, సన్నని వలువలు ధరించి ఉన్న ఆ మాద్రిని చూచిన తర్వాత పాండురాజులోని కోరిక అరణ్యంలో అగ్నిలాగా పైకెగసింది. (6)
రహస్యేకాం తు తాం దృష్ట్వా రాజా రాజీవలోచనామ్ ।
న శశాక నియంతుం తం కామం కామవశీకృతః ॥ 7
ఆ పాండురాజు మన్మథునికి లోబడి ఏకాంతంలో ఆ పద్మనయనను చూచి తన్ను తాను నియంత్రించుకొనలేక పోయాడు. (7)
తత ఏనాం బలాద్ రాజా నిజగ్రాహ రహోగతామ్ ।
వార్యమాణస్తయా దేవ్యా విస్ఫురంత్యా యథాబలమ్ ॥ 8
ఆ పై ఒంటరిగా ఉన్న ఆ మాద్రిని పాండురాజు బలవంతంగా పట్టుకొన్నాడు. తన శక్తినంతా వినియోగించి ఆమె ఆయనను వారించింది. (8)
స తు కామపరీతాత్మా తం శాపం నాన్వబుధ్యత ।
మాద్రీం మైథునధర్మేణ సోఽన్వగచ్ఛద్ బలాదివ ॥ 9
జీవితాంతాయ కౌరవ్య మన్మథస్య వశంగతః ।
శాపజం భయముత్స్నజ్య విధినా సంప్రచోదితః ॥ 10
కామంతో నిండిన మనసుతో గల ఆ పాండురాజు తనకున్న శాపాన్ని గుర్తుంచుకొనలేకపోయాడు. బలవంతంగా మాద్రితో కలిశాడు. జనమేజయా! ఆ పాండురాజు కామునకు లోబడినాడు. విధిప్రేరితుడై శాపభయాన్ని లెక్క చేయకుండా ప్రాణాల మీదకు తెచ్చుకొన్నాడు. (9,10)
తస్య కామాత్మనో బుద్ధిః సాక్షాత్ కాలేన మోహితా ।
సంప్రమథ్యేంద్రియగ్రామం ప్రణష్టా సహ చేతసా ॥ 11
సాక్షాత్తూ కాలమే కామాత్మకమైన పాండురాజు బుద్ధిని మోహింపజేసింది. అది ఇంద్రియసమూహాన్ని అణచి ఆలోచించే శక్తితో పాటు తాను కూడా నశించింది. (11)
స తయా సహ సంగమ్య భార్యయా కురువందనః ।
పాండుః పరమధర్మాత్మా యుయుజే కాలధర్మణా ॥ 12
పరమధర్మాత్ముడైన ఆ పాండురాజు ఆ భార్యతో సంగమించి కాలధర్మం చెందాడు. (12)
తతో మాద్రీ సమాలింగ్య రాజానం గతచేతసమ్ ।
ముమోచ దుఃఖజం శబ్దం పునః పునరతీవ హి ॥ 13
ఆపై మాద్రి ప్రాణాలు కోల్పోయిన ఆ పాండురాజును కౌగిలించుకొని, దుఃఖంతో మాటిమాటికీ పెద్దగా ఏడవసాగింది. (13)
స హ పుత్రై స్తతః కుంతీ మాద్రీపుత్రౌ చ పాండవౌ ।
ఆజగ్ము స్సహితాస్తత్ర యత్ర రాజా తథాగతః ॥ 14
అంతలో పాండురాజు ఆ విధంగా కాలధర్మాన్ని పొందిన ఆ తావునకు కుంతి తన కుమారులతోనూ, మాద్రి పుత్రులతోనూ కలిసి వచ్చింది. (14)
తతో మాద్ర్యబ్రవీద్ రాజన్ ఆర్తా కుంతీమిదం వచః ।
ఏకైవ త్వమిహాగచ్ఛ తిష్ఠంత్వత్రైవ దారకాః ॥ 15
రాజా! అపుడు శోకార్త అయిన మాద్రి కుంతితో "పిల్లలను అక్కడే ఉంచి నీవు ఒక్కదానినే ఇటు రా" అన్నది. (15)
తచ్ఛ్రుత్వా వచనం తస్యాః తత్రైవాధాయ దారకాన్ ।
హతాహమితి విక్రుశ్య సహసైవాజగామ సా ॥ 16
ఆ మాద్రిమాట విని కుంతి పిల్లలను అక్కడే విడిచి "అయ్యో! చచ్చాను" అని అరుస్తూ వెంటనే వచ్చింది. (16)
దృష్ట్వా పాండుం చ మాద్రీం చ శయానౌ ధరణీతలే ।
కుంతీ శోకపరీతాంగీ విలలాప సుదుఃఖితా ॥ 17
భూమిపై శయనించి ఉన్న పాండురాజునూ, మాద్రినీ చూచి కుంతి తనువంతా శోకాన్ని నింపుకొని దుఃఖంతో ఏడవసాగింది. (17)
రక్ష్యమాణో మయా నిత్యం వీరః సతతమాత్మవాన్ ।
కథం త్వామత్యతిక్రాంతః శాపం జానన్ వనౌకసః ॥ 18
నేను నిత్యమూ వీరుడూ, జితేంద్రియుడూ అయిన మహారాజును రక్షిస్తున్నాను. మృగశాపమ్ తెలిసికూడా నీతో బలవత్సమాగమమేలా జరిగింది? (18)
నను నామ త్వయా మాద్రి రక్షితవ్యో నరాధిపః ।
సా కథం లోభితవతీ విజనే త్వం నరాధిపమ్ ॥ 19
మాద్రీ! మహారాజును రక్షించవలసిన కర్తవ్యం నీకు కూడా ఉంది. అటువంటి నీవు ఏకాంతంలో మహారాజును లోభానికెందుకు గురిచేశావు? (19)
కథం దీనస్య సతతం త్వామాసాద్య రహోగతామ్ ।
తం విచింతయతః శాపం ప్రహర్షః సమజాయత ॥ 20
ఎప్పుడూ ఆ శాపాన్నే తలచుకొంటూ దీనంగా ఉండే మహారాజుకు ఏకాంతంలో నీ దగ్గర అంత ఉల్లాసమెలా కలిగింది? (20)
ధన్యా త్వమసి బాహ్లీకి మత్తో భాగ్యతరా తథా ।
దృష్టవత్యసి యద్ వక్త్రం ప్రహృష్టస్య మహీపతేః ॥ 21
బాహ్లీకీ! నీవు ధన్యురాలవు. నాకన్నా అదృష్టవంతురాలవు. అందువలనే సంతోషంతో నిండిన మహారాజు ముఖాన్ని చూడగలిగావు. (21)
మాద్ర్యువాచ
విలపంత్యా మయాదేవి వార్యమాణేన చాసకృత్ ।
ఆత్మా న వారితోఽనేన సత్యం దిష్టం చికీర్షుణా ॥ 22
మాద్రి ఇలా అన్నది. దేవీ! నేను విలపిస్తూ పదేపదే అడ్డగిస్తున్నా శాపాన్ని సత్యం చెయ్యాలన్న సంకల్పంతోనే ఏమో తనను తాను నియంత్రించుకొనలేకపోయాడు. (22)
వైశంపాయన ఉవాచ
(తస్యాస్తద్ వచనం శ్రుత్వా కుంతీ శోకాగ్నితాపితా ।
పపాత సహసా భూమౌ ఛిన్నమూల ఇవ ద్రుముః ॥
నిశ్చేష్టా పతితా భూమౌ మోహాన్నైవ చచాల సా ॥
కుంతీముత్థాప్య మాద్రీ చ మోహేనావిష్టచేతనామ్ ।
ఏహ్యేహీతి చ తాం కుంతీం దర్శయామాస కౌరవమ్ ॥
పాదయోః పతితా కుంతీ పునరుత్థాయ భూమిపమ్ ।
సస్మితేన తు వక్త్రేణ గదంతమివ భారత్ ।
పరిరభ్య తదా మోహాత్ విలలాపాకులేంద్రియా ॥
మాద్రీ చాపి సమాలింగ్య రాజానం విలలాప సా ॥
వైశంపాయనుడిలా అన్నాడు. మాద్రి పలికిన ఆమాటలు విని కుంతి శోకాగ్ని సంతప్తయై మొదలంట నరికిన చెట్టులాగా నేలకూలింది. ఆమె స్మృహ కోల్పోయి కదలలేకపోయింది. మోహంతో చైతన్యాన్ని కోల్పోయిన ఆ కుంతిని మాద్రి లేవదీసి 'రారమ్మ'ని కొనిపోయి పాండురాజును చూపించింది. జనమేజయా! కుంతి పాండురాజు పాదాలపై బడి నవ్వుమొగంతో ఏదో చెపుతున్నట్లు ఉన్న పాండురాజును కౌగిలించుకొని మోహంతో విలపించసాగింది. మాద్రి కూడా పాండురాజును కౌగిలించుకొని విలపించసాగింది.
తం తథాధిగతం పాండుమ్ ఋషయః సహ చారణైః ।
అభ్యేత్య సహితాః సర్వే శోకాదశ్రూణ్యవర్తయన్ ॥
అస్తంగతమివాదిత్యం సుశుష్కమివ సాగరమ్ ।
దృష్ట్వా పాండుం నరవాఘ్రం శోచంతి స్మ మహర్షయః ॥
సమానశోకా ఋషయః పాండవాశ్చ బభూవిరే ।
తే సమాశ్వాసితే విప్రైః విలేపతురరనిందితే ॥
ఆ విధంగా మరణించి ఉన్న పాండురాజు దగ్గరకు చారణులతో సహా మహర్షులందరూ గుమిగూడివచ్చారు. శోకంతో కన్నీరు పెట్టుకొన్నారు. అస్తమించిన ఆదిత్యునివలె, ఎండిపోయిన సముద్రంవలె ఉన్న పాండురాజును చూచి మహర్షులు శోకించారు. పాండవులూ, మహర్షులూ కూడా సమానంగానే శోకాన్ని అనుభవించారు. కళంక రహితులయిన కుంతీమాద్రులు విప్రులు ఎంత ఊరడించినా దుఃఖాన్ని ఆపుకొనలేకపోయారు.
కుంత్యువాచ
హా రాజన్ కస్య నౌ హిత్వా గచ్ఛసి త్రిదశాలయమ్ ॥
హా రాజన్ మమ మందాయాః కథం మాద్రీం సమేత్యవై ।
నిధనం ప్రాప్తవాన్ రాజన్ మద్భాగ్యపరిసంక్షయాత్ ॥
యుధిష్ఠిరం భీమసేనమ్ అర్జునం చ యమావుభౌ ।
కస్య హిత్వా ప్రియాన్ పుత్రాన్ ప్రయాతోఽసి విశాంపతే ।
నూనం త్వాం త్రిదశా దేవాః ప్రతినందంతి భారత ।
యథా హి తప ఉగ్రం తే చరితం విప్రసంసది ॥
ఆవాభ్యాం సహితో రాజన్ గమిష్యసి దివం శుభమ్ ।
ఆజమీఢాజమీఢానాం కర్మణా చరతాం గతిమ్ ॥
కుంతి ఇలా అన్నది. రాజా! మమ్ములను ఎవరికి అప్పగించి స్వర్గానికి వెళ్తున్నావు. రాజా! నేనెంత దురదృష్టవంతురాలను. నా భాగ్యాలు మందగించినందువలన ఒంటరిగా మాద్రితో కలిసి మరణించావు. రాజా! యుధిష్ఠిరుడు, భీమసేనుడు, అర్జునుడు, నకుల సహదేవులు - ఈ ప్రియ పుట్ర్హులనందరినీ ఎవరికి అప్పగించి వెళ్ళావు? భారతా! బ్రాహ్మణుల సమక్షంలో నీవు చేసిన తీవ్రతపస్సును తప్పనిసరిగా త్రిదశులైన దేవతలు అభినందిస్తారు. అజమీఢకులనందనా! నీ పూర్వీకులు తమ పుణ్యకర్మల వలన పొందిన పుణ్యస్వర్గలోకాలను నీవు మా ఇద్దరితో కలిసి పొందుతావు.
వైశంపాయన ఉవాచ
విలపిత్వా భృశమ్ త్వేవం నిస్సంజ్ఞే పతితే భువి ।
యుధిష్ఠిరముఖాః సర్వే పాండవా వేదపారగాః ।
తేఽప్యాగత్య పితుర్మూలే నిఃసంజ్ఞాః పతితా భువి ॥
పాండోః పాదౌ పరిష్వజ్య విలపంతి స్మ పాండవాః ॥)
వైశంపాయనుడిలా అన్నాడు. ఈ విధంగా ఎంతగానో విలపించి కుంతీ మాద్రులు నిశ్చేష్టులై నేలబడినారు. వేదపారగులయిన యుధిష్ఠిరాది పాండవులు కూడా వచ్చి పితృసన్నిధిలో నిశ్చేతనులై పడినారు. తండ్రి పాదాలను కౌగిలించి పాండవులు విలపించసాగారు.
కుంత్యువాచ
అహం జ్యేష్ఠా ధర్మపత్నీ జ్యేష్ఠం ధర్మఫలం మమ ।
అవశ్యంభావినో భావాన్ మా మాం మాద్రి నివర్తయ ॥ 23
అన్విష్యామీహ భర్తారమ్ అహం ప్రేతవశంగతమ్ ।
ఉత్తిష్ఠ త్వం విసృజ్యైనమ్ ఇమాన్ పాలయ దారకాన్ ॥ 24
అవాస్య పుత్రాన్ లబ్ధాత్మా వీరపత్నీత్వమర్థయే ।
కుంతి ఇలా అన్నది మాద్రీ! నేను పెద్ద భార్యను. ధర్మ ఫలితంలో పెద్దభాగం కూడా నాదే. తప్పక జరగవలసిన పనిలో నన్ను ఆపవద్దు. మరణించిన భర్తను అనుసరించి నేను వెళతాను. నీవు ఈయనను వదలివెళ్ళు. ఈ పిల్లలను చూచుకో. పుత్రులను పొందటంతో నా కోరిక తీరింది. ఇప్పుడు భర్తననుసరించి వీరపత్నిని కాగోరుతున్నాను. (23,24 1/2)
మాద్ర్యువాచ
అహమేవానుయాస్వామి భర్తారమపలాయినమ్ ।
న హి తృప్తాస్మి కామానాం జ్యేష్ఠా మామనుమన్యతామ్ ॥ 25
మాద్రి ఇలా అన్నది. రణభూమిలో వెన్నుచూపి ఎరుగని భర్తను నేను అనుసరిస్తాను. నా కోరికలింకా తృప్తి చెందలేదు. నీవు పెద్దదానవు. సహగమనానికి నాకు అనుమతి నివ్వు. (25)
మాం చాభిగమ్య క్షీణోఽయం కామాత్ భరతసత్తమః ।
తముచ్ఛింద్యామస్య కామం కథం ను యమసాదనే ॥ 26
ఈ భరతశ్రేష్ఠుడు కామంతో నాతో సంగమించి మరణించాడు. కాబట్టి నేను యమసదనానికి అయినా వెళ్ళి ఆ కామవాసనను నివర్తింపజేయాలి. (26)
నా చాప్యహం వర్తయంతీ నిర్విశేషం సుతేషు తే ।
వృత్తిమార్యే చరిష్యామి స్పృశేదేనస్తథా చ మామ్ ॥ 27
ఆర్యా! నేను నాకుమారులను చూచినట్టుగా నీకుమారులను చూడలేను. దానివలన నాకు పాపం కూడా చుట్టుకుంటుంది. (27)
తస్మాన్మే సుతయోః కుంతి వర్తితవ్యం స్వపుత్రవత్ ।
మాం చ కామయమానోఽయం రాజా ప్రేతవశం గతః ॥ 28
కుంతీ! అందువలన నీకుమారులను చూచినట్లే నాపిల్లలను కూడా చూడాలి. ఈ పాండురాజు మృత్యువాత పడినది నన్ను కోరియే గదా. (28)
వైశంపాయన ఉవాచ
(ఋషయస్తాన్ సమాశ్వాస్య పాండవాన్ సత్యవిక్రమాన్ ।
ఊచుః కుంతీం చ మాద్రీం చ సమాశ్వాస్య తపస్వినః ॥
సుభగే బాలపుత్రే తు న మర్తవ్యం కథంచన ।
పాండవాంశ్చాపి నేష్యామః కురురాష్ట్రం పరంతపాన్ ॥
అధర్మేష్వర్థజాతేషు ధృతరాష్ట్రశ్చ లోభవాన్ ।
స కదాచిన్నవర్తేత పాండవేషు యథావిధి ॥
కుంత్యాశ్చ వృష్ణయో నాథాః కుంతిభోజస్తథైవ చ ।
మాద్ర్యాశ్చ బలినాం శ్రేష్ఠః శల్యో భ్రాతా మహారథః ॥
భర్త్రా తు మరణం సార్ధం ఫలవన్నాత్ర సంశయః ।
యువాభ్యాం దుష్కరం చైతత్ వదంతి ద్విజపుంగవాః ॥
మృతే భర్తరి యా సాధ్వీ బ్రహ్మచర్యవ్రతే స్థితా ।
యమైశ్చ నియమైః శ్రాంతా మనోవాక్కాయజైః శుభైః ।
వ్రతోపవాసనియమైః కృచ్ఫై శ్చాంద్రాయణాదిభిః ॥
భూశయ్యాం క్షారలవణ వర్జనం చైకభోజనమ్ ॥
యేన కేనాపి విధినా దేహశోషణతత్పరా ।
దేహ పోషణ సంయుక్తా విషయైర్హృతచేతనా ॥
దేహవ్యయేన నరకం మహదప్నోత్యసంశయః ।
తస్మాత్ సంశోషయేద్ దేహం విషయా నాశమాప్నుయుః ॥
భర్తారం చింతయంతీ సా భర్తారం నిస్తరేచ్ఛుభా ।
తారితశ్చాపి భర్తా స్యాత్ ఆత్మా పుత్ర స్తథైవ చ ॥
తస్మాజ్జీవితమేవైతత్ యువయోర్విద్మ శోభనమ్ ॥
మహర్షులు సత్యవిక్రములయిన పాండవులనూ, కుంతీ మాద్రులను ఓదార్చి వారితో ఇలా అన్నారు. సౌభాగ్యవతులారా! పిల్లలందరూ చిన్న వాళ్ళు. వారిని వదలి వెళ్ళరాదు. పరంతపులయిన ఈ పాండవులను కురురాజ్యానికి కొనిపోతాము. ధృతరాష్ట్రుడు అధర్మప్రయోజనాలను పొందటంలో ఆశ గలవాడు. పాండవులతో తగినట్లుగా ఆయన వ్యవహరించలేకపోవచ్చు. వృష్ణివంశస్థులు, కుంతిభోజుడు కుంతికి రక్షణగా నిలుస్తారు. మహారథుడు, బలిష్ఠుడూ అయిన శల్యుడు-మాద్రి సోదరుడు- ఆమెకు అండగా ఉంటాడు. భర్తతో సహగమించుట స్త్రీలకు సత్ఫలదాయకమే. అనుమానం లేదు. కానీ మీ ఇద్దరకూ ఇది దుష్కరమయినదని బ్రాహ్మణులు అంటున్నారు. భర్త మరణించిన తరువాత బ్రహ్మచర్యవ్రతాన్ని పాటిస్తూ, యమనియమాలను అనుసరిస్తూ, త్రికరణాలతోనూ శుభకర్మలను అనుష్ఠిస్తూ, కష్టసాధ్యమైన చాంద్రాయణాది వ్రతాలను, ఉపవాసాదులనూ పాటించే స్త్రీయే పతివ్రత. ఆమె క్ష్రారలవణాలను వీడి, ఏకభుక్తం చేస్తూ నేలపై పరుండాలి. ఏదో ఒకరీతిగా ఆమె శరీరాన్ని శుష్కింపజేసుకోవాలి. విషయవాసనలచేత బుద్ధిని కోల్పోయి దేహపోషణ యందే ఆసక్తిగల స్త్రీ దేహానంతరం తప్పక నరకానికే పోతుంది. కాబట్టి దేహాన్ని శుష్కింపజేయాలి. విషయాసక్తిని విడిచిపెట్టాలి. అటువంటి నిష్ఠగల పతివ్రత భర్తను గూర్చియే ఆలోచిస్తూ ఆయనను తరింపజేయగలదు. కాబట్టి ఆమె ఆవిధంగా తననూ, తనభర్తనూ, తన సంతతిని కూడా ఉద్ధరించగలుగుతుంది. కాబట్టి మీ ఇద్దరూ బ్రతికి ఉండటమే తగినదని అనుకొంటున్నాము.
కుంత్యువాచ
యథా పాండోశ్చ నిర్దేశః తథా విప్రగణస్య చ ।
ఆజ్ఞా శిరసి నిక్షిప్తా కరిష్యామి చ తత్ తథా ॥
యథాఽఽహుర్భగనంతో హి తన్మన్యే శోభనం పరమ్ ।
భర్తుశ్చ మమ పుత్రాణాం మమ చైవ న సంశయః ॥
కుంతి ఇలా అన్నది. పాండురాజు ఆదేశాన్ని పాటించినట్లుగానే బ్రాహ్మణుల ఆదేశాన్ని కూడా శిరసావహించాలి. మీరు చెప్పినట్లే చేస్తాను. పూజ్యులయిన మీరు చెప్పినదే నాకూ, నాభర్తకూ, నాకుమారులకూ శ్రేయోదాయకమని భావిస్తాను. దీనిలో సందేహం లేదు.
మాద్ర్యువాచ
కుంతీ సమర్థా పుత్రాణాం యోగక్షేమస్య ధారణే ।
అస్యా హి న సమా బుద్ధ్యా యద్యపి ప్యాదరుంధతీ ।
కుంత్యాశ్చ వృష్ణయో నాథాః కుంతిభోజస్తథైవ చ ।
నాహం త్వమివ పుత్రాణాం సమర్థా ధారణే తథా ॥
సాహమ్ భర్తార మన్వేష్యే అతృప్తా నన్వహం తథా ।
భర్తృలోకస్య తు జ్యేష్ఠా దేవీ మామనుమన్యతామ్ ॥
ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యధర్మస్య ధీమతః ।
పాదౌ పరిచరిష్యామి తదార్యే హ్యనుమన్యతామ్ ॥
మాద్రి ఇలా అన్నది. పుత్రుల యోగక్షేమాలను గమనించటంలో కుంతి సమర్థురాలు. ఏ స్త్రీ కూడా కడకు అరుంధతి అయినా బుద్ధిలో కుంతికి సాటి రాలేదు. కుంతికి వృష్ణులూ, కుంతిభోజుడూ అండగా ఉంటారు. కుంతీ! పిల్లలను పెంచటంలో నీవలె నేను సమర్థురాలను కాను. భర్తృసమాగమసుఖంతో నాకు తృప్తి కూడా కలగలేదు. కాబట్టి భర్త ననుసరించి పతిలోకానికి వెళ్ళటానికి పెద్దదానవు నీవు నన్ను అనుమతించాలి.
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా మహారాజా మద్రరాజసుతా శుభా ।
దదౌ కుంత్యై యమౌ మాద్రీ శిరసాభిప్రణమ్య చ ॥
అభివాద్య ఋషీన్ సర్వాన్ పరిష్వజ్య చ పాండవాన్ ।
మూర్ధ్న్యుపాఘ్రాయ బహుశః పార్థానాత్మసుతౌ తథా ॥
హస్తే యుధిష్ఠిరం గృహ్య మాద్రీ వాక్యమభాషత ॥
వైశంపాయనుడిలా అన్నాడు జనమేజయా! కళ్యాణి అయిన మాద్రి ఈరీతిగా పలికి కుంతికి తలవాల్చి నమస్కరించి నకులసహదేవుల నప్పగించింది. మహర్షులకందరకు నమస్కరించి, పాండవులనందరనూ కౌగిలించుకొని, కౌంతేయులనూ తనకుమారులనూ మాటిమాటికీ శిరస్సున మూర్కొని యుధిష్ఠిరుని చేయిపట్టుకొని ఇలా అన్నది.
మాద్ర్యువాచ
కుంతీ మాతా అహం ధాత్రీ యుష్మాకం తు పితా మృతః ।
యుధిష్ఠిరః పితా జ్యేష్టః చతుర్ణాం ధర్మతః సదా ॥
వృద్ధానుశాసనే సక్తాః సత్యధర్మపరాయణాః ।
తాదృశా న వినశ్యంతి నైవ యాంతి పరాభవమ్ ॥
తస్మాత్ సర్వే కురుధ్వం వై గురువృత్తిమతంద్రితాః ॥
మాద్రి ఇలా అన్నది. మీకు అసలు తల్లి కుంతియే. నేను దాదిని మాత్రమే. మీ తండ్రి గతించాడు. ఇప్పుడు పెద్దవాడైన యుధిష్ఠిరుడే మీ నలుగురికి తండ్రి వంటివాడు. సత్యధర్మపరాయణులై పెద్దలమాటలను పాటించినవారు నశించరు. పరాభవాలకు కూడా లోనుకారు. కాబట్టి మీరందరూ అలసత్వాన్ని వీడి గురు జనులను సేవించాలి.
వైశంపాయన ఉవాచ
ఋషీణాం చ పృథాయాశ్చ నమస్కృత్య పునఃపునః ।
ఆయాసకృపణా మాద్రీ ప్రత్యువాచ పృథాం తథా ॥
ధన్యా త్వమసి వార్ణ్షేయి నాస్తి స్త్రీ సదృశీ త్వయా ।
వీర్యం తేజశ్చ యోగశ్చ మాహాత్మ్యం చ యశస్వినామ్ ॥
కుంతి ద్రక్ష్యసి పుత్రాణాం పంచానామమితౌతౌజసామ్ ।
ఋషీణాం సంనిధావేషాం మయా వాగభ్యుదీరితా ॥
స్వర్గం దిదృక్షమాణాయాః మమైషా న వృథా భవేత్ ।
ఆర్యా చాప్యభివాద్యా చ మమ పూజ్యా చ సర్వతః ॥
జ్యేష్ఠా వరిష్ఠా త్వందేవి భూషితా స్వగుణైః శుభైః ।
అభ్యనుజ్ఞాతుమిచ్ఛామి త్వయా యాదవనందిని ॥
ధర్మం స్వర్గం చ కీర్తిం చ త్వత్కృతేఽహ మవాప్నుయామ్ ।
యథా తథా విధత్స్వేహ మాచ కార్షీర్విచారణామ్ ॥
వైశంపాయనుడిలా అన్నాడు! మహర్షులకూ, కుంతికీ పదే పదే నమస్కరించి, అలసిపోయిన మాద్రి కుంతితో దీనంగా ఇలా అన్నది. వార్ష్ణేయీ! నీవు ధన్యురాలవు. నీ వంటి స్త్రీ మరొకతె లేదు. యశోవంతులు, కీర్తిమంతులయిన ఈ అయిదుగురు కుమారుల బలాన్ని, తేజస్సునూ, యోగాన్నీ, మాహాత్మ్యాన్నీ నీవుచూస్తావు. మహర్షుల సన్నిధిలో నేనీమాట అంటున్నాను. స్వర్గానికి వెళ్ళగోరుతున్న నా ఈ మాటలు వ్యర్థంకావు. నీవు నా కన్నా పెద్దదానవు. నమస్కరింపదగిన దానవు. పూజింపదగినదానవు. గొప్పదానవు. శుభగుణాలతో వెలుగుతున్నదానవు. యాదవకుమారీ! నీ అనుమతిని కోరుతున్నాను. నేను ధర్మాన్నీ, స్వర్గాన్నీ, కీర్తినీ పొందటానికి తగిన సహకారాన్ని నీవందించు. నీ ప్రయత్నం ద్వారా అది లభిస్తుంది. మనస్సులో మరొక ఆలోచన వద్దు.
బాష్పసందిగ్ధయా వాచా కుంత్యువాచ యశస్వినీ ॥
అనుజ్ఞాతాసి కళ్యాణి త్రిదివే సంగమోఽస్తు తే ।
భర్త్రా సహ విశాలాక్షి క్షిప్రమద్యైవ భామిని ॥
సంగతా స్వర్గలోకే త్వం రమేథాః శాశ్వతీః సమాః ॥)
రాజ్ఞః శరీరేణ సహ మమాపీదం కలేబరమ్ ।
దగ్ధవ్యం సుప్రతిచ్ఛన్నమ్ ఏతదార్యే ప్రియం కురు ॥ 29
అప్పుడు యశస్విని అయిన కుంతి కన్నీటితో గద్గదమయిన గొంతుతో ఇలా అన్నది- కళ్యాణీ! నీకు అనుమతినిస్తున్నాను. విశాలాక్షీ! స్వర్గంలో నేడే నీకు భర్తృ సమాగమం లభిస్తుంది. భామినీ! నీవు స్వర్గంలో భర్తృతో కలిసి అనంతకాలం సుఖంగా క్రీడించు. అప్పుడు మాద్రి ఇలా అన్నది - ఈ శరీరాన్ని కూడా మహారాజు శరీరంతో పాటు చక్కగా పేర్చి దహించాలి. అక్కా! నాకు ప్రియమైన ఈ కార్యాన్నీ జరిపించాలి. (29)
దారకేష్వప్రమత్తా చ భవేథాశ్చ హితా మమ ।
అతోఽన్యన్న ప్రపశ్యామి సందేష్టవ్యం హి కించన ॥ 30
నా పిల్లల హితాన్ని కోరుతూ అప్రమత్తంగా చూచుకోవాలి. ఇంతకన్నా నీకు చెప్పవలసినది నాకేదీ తోచటం లేదు. (30)
వైశంపాయన ఉవాచ
ఇత్యుక్త్వా తం చితాగ్నిస్థం ధర్మపత్నీ నరర్షభమ్ ।
మద్రరాజ సుతా తూర్ణమ్ అన్వారోహద్ యశస్వినీ ॥ 31
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ విధంగా పలికి కీర్తిమతి అయిన మాద్రి - పాండురాజు ధర్మపత్ని - వెంటనే చితాగ్నిపై నున్న పాండురాజుననుగమించింది. (31)
(తతః పురోహితః స్నాత్వా ప్రేతకర్మణి పారగః ।
హిరణ్యశకలాన్యాజ్యం తిలాన్ దధి చ తండులాన్ ॥
ఉదకుంభం సపరశుం సమానీయ తపస్విభిః ।
అశ్వమేధాగ్ని మాహృత్య యథాన్యాయం సమంతతః ॥
కాశ్యపః కారయామాస పాండోః ప్రేతస్య తాం క్రియామ్ ॥
ఆ తర్వాత ప్రేతకర్మలను చేయించటంలో పారంగతుడైన ఆ కాశ్యపపురోహితుడు బంగారు ముక్కలనూ, నేతినీ, నువ్వులనూ, పెరుగును, బియ్యాన్ని, నీటితో నిండిన కుండనూ, గొడ్డలినీ సమకూర్చుకొని మహర్షుల ద్వారా అశ్వమేధాగ్నిని తెప్పించి శాస్త్రోక్తంగా నాల్గువైపులా అంటింపచేసి పాండురాజుదహనసంస్కారాన్ని పూర్తిచేయించాడు.
అహతాంబరసంవీతః భ్రాతృభిః సహితోఽనఘః ।
ఉదకం కృతవాంస్తత్ర పురోహితమతే స్థితః ॥
అర్హతస్తస్య కృత్యాణి శతశృంగ నివాసినః ।
తాపసా విధివచ్చక్రుః చారణా ఋషిభిః సహ ॥)
అనఘుడైన యుధిష్ఠిరుడు సోదర సహితుడై నూత్నవస్త్రాలను ధరించి పురోహితుని ఆదేశాలను అనుసరిస్తూ జలాంజలిని సమర్పించాడు. శతశృంగనివాసులయిన మహర్షులు, చారణులూ, ఇతరమునులూ కలిసి పాండురాజునకు పారలౌకిక క్రియల నన్నింటినీ యథావిధిగా పూర్తిచేశారు.
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి పాండూపరమే చతుర్వింశత్యధిక శతతమోఽధ్యాయః ॥ 124 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున పాండూపరమమను నూట ఇరువది నాలుగవ అధ్యాయము. (124)
(దాక్షిణాత్య ఆధికపాఠం 50 శ్లోకాలతో కలిసి మొత్తం 81 శ్లోకాలు)